86. ఎనుబది ఆరవ అధ్యాయము
ధృతరాష్ట్రుడు శ్రీ కృష్ణభగవానుని స్వాగతించుట.
ధృతరాష్ట్ర ఉవాచ
ఉపప్లవ్యా దిహ క్షత్తః ఉపాయాతో జనార్దనః।
వృకస్థలే నివసతి స చ ప్రాత రిహైష్యతి॥ 1
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. విదురా! శ్రీ కృష్ణుడు ఉపప్లవ్యం నుండి ఇక్కడకు బయలు దేరాడు. ఈ రోజు వృక్షస్థలంలో ఉన్నాడు. రేపు ఉదయం ఇక్కడకు రాగలడు. (1)
ఆహుకానామధిపతిః పురోగః సర్వసాత్త్వతామ్।
మహామనా మహావీర్యః మహాసత్త్వో జనార్దనః॥ 2
ఆ జనార్దనుడు ఆహుక వంశక్షత్రియులకు అధిపతి. యాదవులకు నాయకుడు. ఆయన గొప్పమనస్సు గలవాడు, పరాక్రమశాలి, సత్త్వ సంపన్నుడు. (2)
స్ఫీతస్య వృష్ణిరాష్ట్రస్య భర్తా గోప్తా చ మాధవః।
త్రయాణా మపి లోకానాం భగవాన్ ప్రపితామహః॥ 3
సమృద్ధమయిన వృష్ణిరాష్ట్రానికి మాధవుడు పాలకుడూ రక్షకుడూ కూడా, మూడు లోకాలకూ ఆ పూజ్యుడు ప్రపితామహుడు. (3)
వృష్ణ్యంధకా స్సుమనసః యస్య ప్రజ్ఞాముపాసతే।
ఆదిత్యా వసవో రుద్రాః యథాబుద్ధిం బృహస్పతేః॥ 4
ఆదిత్యులు వసువులు, రుద్రులూ బృహస్పతి బుద్ధిని ఆశ్రయించినట్లు వృష్ణి - అంధకవంశస్థులు ప్రసన్నచిత్తులై శ్రీకృష్ణుని బుద్ధిని ఆశ్రయిస్తారు. (4)
తస్మై పూజాం ప్రయోక్ష్యామి దాశార్హాయ మహాత్మనే।
ప్రత్యక్షం తవ ధర్మజ్ఞ తాం మే కథయతః శృణు॥ 5
ధర్మజ్ఞా! విదురా! మహాత్ముడైన ఆ శ్రీకృష్ణుని పూజింపవలసి ఉన్నది. దాన్ని వినిపిస్తున్నాను, విను. (5)
ఏక వర్ణైఃసు కఌప్తాంగైః బాహ్లిజాతైః హయోత్తమైః।
చతుర్యుక్తాన్ రథాంస్తస్మై రౌక్మాన్ దాస్యామి షోడశ॥ 6
ఒకే రంగూ, సుపుష్టమైన శరీరముగల బాహ్లికజాతికి చెందిన నాలుగు గొప్పగుఱ్ఱాలను పూన్చిన స్వర్ణరథాలను పదహారింటీని శ్రీకృష్ణునకు కానుక చేస్తున్నాను. (6)
నిత్యప్రభిన్నాన్ మాతంగాన్ ఈషాదంతాన్ ప్రహారిణః।
అష్టానుచరమేకైకమ్ అష్టౌ దాస్యామి కౌరవ॥ 7
కురునందనా! ఎప్పుడూ మదజలాన్ని స్రవిస్తూ, నిడుపైన దంతాలుగల ఎనిమిది ఏనుగులను కూడా శ్రీకృష్ణునకు కానుక చేస్తాను. ఆ ఏనుగులు శత్రువులపై దాడి చేయగలవి. ఒక్కొక్క దానికి ఎనిమిది మంది సేవకులుంటారు. (7)
దాసీనా మప్రజాతానాం శుభానాం రుక్మవర్చసామ్।
శతమస్మై ప్రదాస్యామి దాసానామపి తావతామ్॥ 8
బంగారువన్నెతో అందంగా శుభంగా కన్పించు దాసీలను వండమందిని ఆయనకిస్తాడు. వారంతా ఇంకా సంతానాన్ని పొందనివారు. వారితో పాటు వందమంది దాసులనుకూడా ఇస్తాను. (8)
ఆవికం చ సుఖస్పర్శం పార్వతీయైరుపాహృతమ్।
తదప్యస్మై ప్రదాస్యామి సహస్రాణి దశాష్ట చ॥ 9
గిరిజనులు నాకు కానుకచేసినవి, సుఖస్పర్శ గలవి అయిన పదునెనిమిది వేల కంబళ్ళను కూడా ఆయనకు బహూకరిస్తాను. (9)
అజినానాం సహస్రాణి చీనదేశోద్భవాని చ।
తాన్యప్యస్మై ప్రదాస్యామి యావదర్హతి కేశవః॥ 10
చీనదేశంలో తయారయిన మృగచర్మాలు నాదగ్గరున్నాయి. వాటిలో కూడా శ్రీకృష్ణుడు కోరుకొన్నన్ని ఆయనకు కానుకచేస్తాను. (10)
దివా రౌత్రౌ చ భాత్యేషః సుతేజా విమలో మణిః।
తమప్యస్మై ప్రదాస్యామి తమర్హతి హి కేశవః॥ 11
ఇదిగో ఈ మణి తేజస్సంపన్నమై నిర్మలమైనది. పగలూ, రేయి కూడా ప్రకాశించేది. దీనిని కూడా శ్రీకృష్ణునకు బహూకరిస్తాను. ఆయన దానికి తగినవాడు. (11)
ఏకేనాభిపతత్యహ్నా యోజనాని చతుర్దశ।
యాన మశ్వతరీయుక్తం దాస్యే తస్మై తదప్యహమ్॥ 12
ఒకే రోజులో పదునాలుగు యోజనాల దూరాన్ని చేరగల కంచరగాడిదల రథం ఒకటుంది. దానిని కూడా నేను శ్రీకృష్ణునకు కానుకగా ఇస్తాను. (12)
యావంతి వాహనాన్యస్య యావంతః పురుషాశ్చ తే।
తతోఽష్టగుణమప్యస్మై భోజ్యం దాస్యామ్యహం సదా॥ 13
శ్రీకృష్ణునకు ఎన్నివాహనాలున్నవో, ఎంతమంది పరిచారకులు గలరో వారికందరకూ/ఎప్పటికప్పుడు అవసరమైన భోజనం కన్న ఎనిమిది రెట్లు ఎక్కువ నేను సమకూర్చిపెడతాను. (13)
మమపుత్రాశ్చ పౌత్రాశ్చ సర్వే దుర్యోధనాదృతే।
ప్రత్యుద్యాస్యంతి దాశార్హం రథైః మృష్టై స్వలంకృతాః॥ 14
దుర్యోధనుడు తప్ప మిగిలిన నా అందరు కుమారులు, మనుమలు వస్త్రభూషణాదుల నలంకరించుకొని అందమైన రథాలతో శ్రీకృష్ణుని స్వాగతించగలరు. (14)
స్వలంకృతాశ్చ కళ్యాణ్యః పాదైరేవ సహస్రశః।
వారముఖ్యా మహాభాగం ప్రత్యుద్యాస్యంతి కేశవమ్॥ 15
చక్కగా అలంకరించుకొనిన వారకాంతలు వేలకొలదిగ మంగళకరంగా మహానుబావుడైన శ్రీకృష్ణుని స్వాగతించటానికి నడచి ఎదురు వెడతారు. (15)
నగరాదపి యాః కాశ్చిద్ గమిష్యంతి జనార్దనమ్।
ద్రష్టుం కన్యాశ్చ కళ్యాణః తాశ్చ యాస్యంత్యనావృతాః॥ 16
నగరంనుండి పరదాచాటు అవసరం లేని స్త్రీలు, కన్యలు, సుమంగళులునూ - శ్రీకృష్ణుని చూడ గోరినవారు ఆయనకు ఎదురేగుతారు. (16)
సస్త్రీపురుషబాలం చ నగరం మధుసూదనమ్।
ఉదీక్షతాం మహాత్మానం భానుమంతమివ ప్రజాః॥ 17
ప్రజలు సూర్యుని దర్శించిన విధంగా స్త్రీ పురుష బాలకులతో కూడిన ఈ సమస్తనగరమూ మహాత్ముడైన మధుసూదనుని దర్శించును గాక! (17)
మహాధ్వకపతాకాశ్చ క్రియంతాం సర్వతో దిశః।
జలావసిక్తో విరజాః పన్థాప్తస్యేతి చాన్వశాత్॥ 18
"నగరంలోని అన్నిదిక్కులలో ధ్వజాలను, పతాకాలనూ అలంకరించాలి. రాచబాటపై నీరు చల్లి బాటలో దుమ్ము లేకుండా చూడాలి" అని ఆదేశించాడు దృతరాష్ట్రుడు. (18)
దుశ్శాసనస్య చ గృహం దుర్యోధనగృహాద్ వరమ్।
తదద్య క్రియతాం క్షిప్రం సుసమ్మృష్టమలంకృతమ్॥ 19
దుశ్శాసనుని ఇల్లు దుర్యోధనుని ఇంటికన్నా గొప్పది. కాబట్టి వెంటనే దానిని చక్కగా అలంకరించండి. (19)
ఏతద్ధి రుచిరాకారైః ప్రాసాదైరుపశోభితమ్।
శివం చ రమణీయం చ సర్వర్తు సుమహాధనమ్॥ 20
ఈ భవనం అందమయిన ఆకృతి కల ప్రాసాదాలతో శోభిల్లుతోంది. శుభకరమై, అన్ని ఋతుశోభలతోనూ మనోహరమై మహాధనరాశితో విలసిల్లుతోంది. (20)
సర్వమస్మిన్ గృహే రత్నం మను దుర్యోధనస్య చ।
యద్యదర్హతి వార్ష్ణేయః తద్ తద్ దేయమసంశయమ్॥ 21
నా దగ్గర, దుర్యోధనుని దగ్గర ఉన్న రత్నాలన్నీ ఇక్కడే ఉన్నాయి. శ్రీకృష్ణుడు అడిగితే వాటిని సంకోచించకుండా ఇచ్చి వేయాలి. (21)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి ధృతరాష్ట్రవాక్యే షడశీతితమోఽధ్యాయః॥ 86 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్ర వాక్యమను ఎనుబది ఆరవ అధ్యాయము. (86)