83. ఎనుబదిమూడవ అధ్యాయము
శ్రీకృష్ణుడు హస్తినకు బయలు దేరుట - దారిలో మహర్షులను చూచుట.
అర్జున ఉవాచ
కురూణామద్య సర్వేషాం భవాన్ సుహృదనుత్తమః।
సంబంధీ దయితో నిత్యమ్ ఉభయోః పక్షయోరపి॥1
అర్జునుడిలా అన్నాడు - ప్రస్తుతం కురు వంశస్థులకందరకూ అందరికన్నా గొప్ప మిత్రుడవు నీవే. ఉభయపక్షాలకూ ఎప్పుడూ ప్రియబాంధవుడవు నీవే. (1)
పాండవైర్ధార్తరాష్ట్రాణాం ప్రతిపాద్యమనామయమ్।
సమర్థః ప్రశమం చైవ కర్తుమర్హసి కేశవ॥ 2
కేశవా! పాండవులతో సహా ధార్తరాష్ట్రులకు శ్రేయస్సును కల్గించటం నీ కర్తవ్యం. ఉభయపక్షాలకూ సంధి చేయటానికి కూడా నీవే సమర్థుడవు. (2)
త్వమితః పుండరీకాక్ష సుయోధనమమర్షణమ్।
శాంత్వర్థే భ్రాతరం బ్రూయాః యత్తద్ వాచ్యమమిత్రహన్॥ 3
శత్రుసంహారకా! శ్రీకృష్ణా! నీవు ఇక్కడనుండి వెళ్ళి అసహనశీలుడయిన ఆ మా సోదరునితో సంధికి అనువయిన మాటలను చెప్పు. (3)
త్వయా ధర్మార్థయుక్తం చేద్ ఉక్తం శివమనామయమ్।
హితం నాదాస్యతే బాలః దిష్టస్య వశమేష్యతి॥ 4
ఒకవేళ ఆ మూర్ఖుడు - సుయోధనుడు - ధర్మార్థసహితమై, సంతాపనాశకమై, హితకరమై, శుభకరమైన నీ మాటను స్వీకరించకపోతే కాలానికి లొంగిపోతాడు/బలి అవుతాడు. (4)
శ్రీ భగవానువాచ
ధర్మ్యమస్మద్ధితం చైవ కురూణాం యదనామయమ్।
ఏష యాస్యామి రాజానం ధృతరాష్ట్రమభీప్సయా॥ 5
శ్రీకృష్ణుడిలా అన్నాడు. (అర్జునా!) ధర్మబద్ధమై మనకూ, కౌరవులకూ కూడా హితకరమూ, కళ్యాణకరమూ అయిన దానిని సాధించాలన్న్ కోరికతోనే నేను ధృతరాష్ట్రుని దగ్గరకు పోతున్నాను. (5)
వైశంపాయన ఉవాచ
తతో వ్యపేతతమపి సూర్యే విమలవద్గతే।
మైత్రే ముహూర్తే సంప్రాప్తే మృద్వర్చిషి దివాకరే॥ 6
కౌముదే మాసి దేవత్యాం శరదంతే హిమాగమే।
స్ఫీతసస్యముఖే కాలే కల్పః సత్త్వవతాం వరః॥ 7
వైశంపాయనుడిలా అన్నాడు - ఆ తరువాత చీకట్లు తొలగి నిర్మలాకాశంలో సూర్యుడు ఉదయించాడు. లేప్రొద్దుకిరణాలు అంతటా వ్యాపించే వేళలో, కార్తికమాసంలో, రేవతీ నక్షత్రంలో మైత్రముహూర్తంలో శ్రీకృష్ణుడు ప్రయానమయ్యాడు. అది శరత్ - హేమంతాల సంధికాలం. అంతటా పొలాలు విస్తరించిన పైరుతో సుఖకరంగా ఉన్నాయి. (6,7)
మంగల్యాః పుణ్యనిర్ఘోషాః వాచః శృణ్వంశ్చ సూనృతాః।
బ్రాహ్మణానాం ప్రతీతానామ్ ఋషీణామివ వాసవః॥ 8
కృత్వా పౌర్వాహ్ణికం కృత్యం స్నాతః శుచిరలంకృతః।
ఉపతస్థే వివస్వంతం పావకం చ జనార్దనః॥ 9
ఋషభం పృష్ఠ ఆలభ్య బ్రాహ్మణానభివాద్య చ।
అగ్నిం ప్రదక్షిణం కృత్వా పశ్యన్ కల్యాణమగ్రతః॥ 10
తత్ ప్రతిజ్ఞాయ వచనం పాండవస్య జనార్దనః।
శినేర్నప్తారమాసీనమ్ అభ్యభాషత సాత్యకిమ్॥ 11
శ్రీకృష్ణుడు తెలవారగనే మహర్షుల మంగళపాఠాలను వినే ఇంద్రుడిలాగా ఉత్తమబ్రాహ్మణుల ద్వారా మంగళకరాలయిన పుణ్యాహవచనాలను వింటూ స్నానం చేశాడు. పవిత్రుడై వస్త్రాభరణాల నలంకరించుకొని సూర్యోపాసన, అగ్న్యుపాసన ముగించాడు. అక్కడికి ప్రాతః కరణీయం ముగిసింది.
ఆ తర్వాత గోపృష్ఠాన్ని ఉపాసించి బ్రాహ్మణులకు నమస్కరించాడు. అగ్నికి ప్రదక్షిణం చేశాడు. ఎదుట నిలిచిన శుభశకునాలను గమనించాడు. ఆపై యుధిష్ఠిరుని మాటలను మననం చేసికొంటూ తనదగ్గరగా కూర్చొనిఉన్న సాత్యకితో ఇలా అన్నాడు. (8,9,10,11)
రథ ఆరోప్యతాం శంఖః చక్రం చ గదయా సహ।
ఉపాసంగాశ్చ శక్త్యశ్చ సర్వప్రహరణాని చ॥ 12
శంఖాన్ని, చక్రాన్ని, గదను, అమ్ముల పొదులను, శక్తులను మిగిలిన సమస్తాయుధాలను రథంపైకి ఎక్కించు. (12)
దుర్యోధనశ్చ దుష్టాత్మా కర్ణశ్చ సహ సౌబలః।
న చ శత్రురవజ్ఞేయః దుర్బలోఽపి బలీయసా॥ 13
దుర్యోధనుడు, కర్ణుడు, శకుని దుర్మార్గులు. శత్రువు బలహీనుడయినా సరే బలవంతులు వారిని తేలికగా తీసికొనకూడదు. (13)
తతస్తన్మతమాజ్ఞాయ కేశవస్య పురస్సరాః।
ప్రసస్రుర్యోజయిష్యంతః రథం చక్రగదాభృతః॥ 14
అపుడు చక్రగదాధారి అయిన శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని గ్రహించిన అనుచరులు రథాన్ని సన్నద్ధం చేయటానికి బయలుదేరారు. (14)
తం దీప్తమివ కాలాగ్నిమ్ ఆకాశగమివాశుగమ్।
సూర్యచంద్రప్రకాశాభ్యాం చక్రాభ్యాం సమలంకృతమ్॥ 15
ఆ రథం ప్రళయకాలాగ్నిలాగా ప్రకాశిస్తోంది. విమానంలా వేగంగా పయనించగలది. సూర్యచంద్రులవలె ప్రకాశించే చక్రాలతో అలంకరింపబడింది. (15)
అర్ధచంద్రైశ్చ చంద్రైశ్చ మత్స్యైః సమృపపక్షిభిః।
పుష్పైశ్చ వివిధైశ్చిత్రం మణిరత్నైశ్చ సర్వశః॥ 16
అర్ధచంద్రుడు, చంద్రుడు, చేపలు, మృగాలు, పక్షులు, పుష్పాలవంటి ఆకృతులతో అంతటా మణిరత్నాలతో ప్రకాశిస్తున్నది ఆ రథం. (16)
తరుణాదిదిత్యసంకాశం బృహంతం చారుదశనమ్।
మణిహేమవిచిత్రాంగం సుధ్వజం సుపతాకినమ్॥ 17
అది మధ్యాహ్నకాలంలోని సూర్యుడిలా ప్రకాశిస్తోంది. విశాలమైనది, చూడముచ్చటైనది కూడా. రథమంతా మణులు, బంగారంతో విచిత్రంగా ఉంది. మంచి ధ్వజం, మంచి పతాకం రథానికి అమర్చిఉన్నాయి. (17)
సూపస్కరమనాధృష్యం వైయాఘ్రపరివారణమ్।
యశోఘ్నం ప్రత్యమిత్రాణాం యదూనాం నందివర్ధనమ్॥ 18
ఆ రథంలో అవసరమైన సామగ్రి అంతా చక్కగా అమర్చబడింది. పులిచర్మం పరచబడింది. అది శత్రువులకు భరించరానిది. వారి కీర్తికి వినాశాన్ని కల్గించగలది. యదువంశస్థుల ఆనందాన్ని పెంపొందింపజేసేది. (18)
వాజిభిః శైబ్యసుగ్రీవ మేఘపుష్ప వలాహకైః।
స్నాతైః సంపాదయామాసుః సంపన్నైః సర్వసంపదా॥ 19
శ్రీకృష్ణుని అనుచరులు శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వలాహకం అనే పేర్లుగలిగిన గుఱ్ఱాలకు స్నానం చేయించి, సమస్తాభరణాలతో అలంకరించి రథానికి పూన్చారు.(19)
మహిమానం చ కృష్ణస్య భూయ ఏవాభివర్ధయన్।
సుఘోషః పతగేంద్రేణ ధ్వజేన యుయుజే రథః॥ 20
శ్రీకృష్ణుని మహత్త్వాన్ని మరింతగా పెంచే గరుడధ్వజాన్ని కూడా రథంపై అమర్చారు. ప్రయాణ సమయంలో దాని రెపరెపలు వినసొంపుగా ఉంటాయి. (20)
తం మేరుశిఖరప్రఖ్యం మేఘదుందుభీనిస్వనమ్।
ఆరురోహ రథం శౌరిః విమానమివ కామగమ్॥ 21
ఆ రథం మేరుపర్వతశిఖరంలాగా ప్రకాశిస్తున్నది. మేఘాలతో దుందుభులతో సమానమైన ధ్వని గల ఆ రథం కామగమనం గల విమానం వంటిది. శ్రీకృష్ణుడు ఆ రథాన్ని ఎక్కాడు. (21)
తతః సాత్యకిమారోప్య ప్రయయౌ పురుషోత్తమః।
పృథివీం చాంతరిక్షం చ రథఘోషేణ నాదయన్॥ 22
అటు తరువాత సాత్యకిని కూడా ఎక్కించుకొని రథఘోషతో భూమ్యాకాశాలను ధ్వనింపజేస్తూ శ్రీకృష్ణుడు బయలు దేరాడు. (22)
వ్యపోఢాభ్రస్తతః కాలః క్షణేన సమపద్యత।
శివశ్చానువవే వాయుః ప్రశాంతమభవద్ రజః॥ 23
ఆ క్షణంలోనే ఆకాశాన్ని కప్పి ఉన్న మేఘాలు కనుమరుగయ్యాయి. మంగళకరంగా గాలి అనుకూలంగా ప్రసరించింది. దుమ్మురేగటం ఆగిపోయింది. (23)
ప్రదక్షిణానులోమాశ్చ మంగల్యా మృగపక్షిణః।
ప్రయాణే వాసుదేవస్య బభూవురనుయాయినః॥ 24
శుభసూచనగా మృగాలు పక్షులు ప్రదక్షిణంగానూ, అనుకూలంగానూ సంచరిస్తూ ప్రయాణవేళలో శ్రీకృష్ణుని అనుసరించాయి. (24)
మంగల్యార్థప్రదైః శబ్దైః అన్వవర్తంత సర్వశః।
సారసాః శతపత్రాశ్చ హంసాశ్చ మధుసూదనమ్॥ 25
బెగ్గురుపక్షులు, వడ్రంగి పిట్టలు, హంసలు శుభప్రదాలయిన శబ్దాలు చేస్తూ అన్ని వైపులా శ్రీకృష్ణుని వెంట పయనింప్సాగాయి. (25)
మంత్రాహుతిమహాహోమైః హూయమానశ్చ పావకః।
ప్రదక్షిణముఖో భూథ్వా విధూమః సమపద్యత॥ 26
మంత్ర పవిత్రాలయిన ఆహుతులతో హోమం చేయబడుతున్న అగ్ని పొగలేకుండా ప్రదక్షిణముఖంగా ప్రజ్వలింపసాగాడు. (26)
వసిష్ఠో వామదేవశ్చ భూరిద్యుమ్నో గయః క్రథః।
శుక్రనారదవాల్మీకాః మరుత్తః కుశికో భృగుః॥ 27
దేవబ్రహ్మర్షయశ్ఫైవ కృష్ణం యదుసుఖావహమ్।
ప్రదక్షిణమవర్తంత సహితా వాసవానుజమ్॥ 28
వసిష్ఠుడు, వామదేవుడు, భూరిద్యుమ్నుడు, గయుడు, క్రథుడు, శుక్రుడు, నారదుడు, వాల్మీకి, మరుత్తుడు, కుశికుడు, భృగుడు మొదలయిన దేవర్షులు, బ్రహ్మర్షులూ ఒక్కటై యదువంశసుఖ కారకుడు, ఇంద్ర సోదరుడు అయిన శ్రీకృష్ణునకు ప్రదక్షిణంగా నిలిచారు. (27,28)
ఏవమేతైర్మహాభాగైః మహర్షిగణసాధుభిః।
పూజితః ప్రయయౌ కృష్ణః కురూణాం సదనం ప్రతి॥ 29
ఈవిధంగా మహాత్ములయిన మహర్షులచేత, సాధువులచేత అర్చించబడి శ్రీకృష్ణుడు కౌరవుల నివాసమైన హస్తినకు బయలుదేరాడు. (29)
తం ప్రయాంతమనుప్రాయాత్ కుంతీపుత్రో యుధిష్ఠిరః।
భీమసేనార్జునౌ చోభౌ మాద్రీపుత్రౌ చ పాండవౌ॥ 30
చేకితానశ్చ విక్రాంతః ధృష్టకేతుశ్చ చేదిపః।
ద్రుపదః కాశిరాజశ్చ శిఖండీ చ మహారథః॥ 31
ధృష్టద్యుమ్నః సపుత్రశ్చ విరాటః కేకయైస్సహ।
సంసాధనార్థం ప్రయయుః క్షత్రియాః క్షత్రియర్షభ॥ 32
క్షత్రియశ్రేష్ఠా! కుంతీసుతుడైన యుధిష్ఠిరుడు, భీమార్జునులు, మాద్రీసుతులయిన నకులసహదేవులూ చేకితానుడు, విక్రాంతుడు, చేదిభూపాలుడు ధృష్టకేతువూ, ద్రుపదుడు, కాశిరాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, కుమారులతో కేకయులతో సహా విరాటుడు మొదలయిన క్షత్రియులు కార్యసిద్ధికై శ్రీకృష్ణుని వెంట నడిచారు. (30,31,32)
తతోఽనువ్రజ్య గోవిందం ధర్మరాజో యుధిష్ఠిరః।
రాజ్ఞాం సకాశే ద్యుతిమాన్ ఉవాచేదం వచస్తదా॥ 33
ఈ విధంగా శ్రీకృష్ణుని అనుసరించిన తేజోమూర్తి ధర్మరాజు అప్పుడు రాజులందరి సమక్షంలో శ్రీకృష్ణునితో ఇలా పలికాడు. (33)
యో వై న కామాన్న భయాత్ నలోభా న్నార్థకారణాత్।
అన్యాయమనువర్తేత స్థిరబుద్ధిరలోలుపః॥ 34
ధర్మజ్ఞో ధృతిమాన్ ప్రాజ్ఞః సర్వభూతేషు కేశవః।
ఈశ్వరః సర్వభూతానాం దేవదేవః సనాతనః॥ 35
శ్రీకృష్ణుడు సనాతనుడైన పరమేశ్వరుడు, దేవతలకు కూడా దేవత సర్వప్రాణులకూ రక్షకుడు, సర్వప్రాణులయందును ప్రకాశించేవాడు, ధర్మవేత్త, ధీరుడు, ప్రాజ్ఞుడును. లోభరహితుడై, స్థిరబుద్ధికలిగిన ఆయన కామంవలన గానీ, భయంవలన గానీ, లోభం వలనగానీ మరే విధమయిన ప్రయోజనం వలన కానీ అన్యాయమార్గాన్ని అనుసరించడు. (34,35)
తం సర్వగుణసంపన్నం శ్రీవత్సకృతలక్షణమ్।
సంపరిష్వజ్య కౌంతేయః సందేష్టుముపచక్రమే॥ 36
సర్వగుణసంపన్నుడై, శ్రీవత్సలాంఛనుడైన ఆ శ్రీకృష్ణుని కౌగిలించి యుధిష్ఠిరుడు ఈ విధంగా సందేశింపనారంభించాడు. (36)
యుధిష్ఠిర ఉవాచ
యా సా బాల్యాత్ప్రభౄత్యస్మాన్ పర్యవర్దయతాబలా।
ఉపవాసతపశ్శీలా సదా స్వస్త్వయనే రతా॥ 37
దేవతాతిథిపూజాను గురుశుశ్రూషణే రతా।
వత్సలా ప్రియపుత్రా చ ప్రియాస్మాకం జనార్దన॥ 38
సుయోధనభయాద్ యా నోఽత్రాయతామిత్రకర్శన।
మహతో మృత్యుసంబాధాత్ ఉద్దధ్రే నౌరివార్ణవాత్॥ 39
అస్మత్కృతే చ సతతం యయా దుఃఖాని మాధవ।
అనుభూతాన్యదుఃఖార్హాం తాం స్మ పృచ్ఛేరనామయమ్॥ 40
యుధిష్ఠిరుడిలా అన్నాడు - శత్రుసంహారా! శ్రీకృష్ణా! అబలయైకూడా చిన్ననాటి నుండి మిమ్ములను పెంచి పోషించినడి మా తల్లి. ఉపవాసతపస్సులనే స్వభావంగా స్వీకరించి ఎప్పుడూ శుభాన్నే కాంక్షిస్తూ దేవతాతిథిపూజల యందునూ, గురుసేవల యందునూ ఆసక్తితో పుత్రులపై ప్రేమనూ, వాత్సల్యాన్నీ ప్రదర్శించేది మాకిష్టమయిన మాతల్లి కుంతి. ఆమె సుయోధనునకు భాయపడి సముద్రంలో మునిగిపోయే వానిని పడవ రక్షించినట్లు మమ్ములను మృత్యుసంకటం నుండి రక్షించింది. దుఃఖాలను పొందరానిదైననూ మా కొరకు నిరంతరంగా దుఃఖాలను అనుభవించిన మా తల్లిని కలిసి క్షేమసమాచారాన్ని అడుగు. (37-40)
భృశమాశ్వాసయేశ్పైనాం పుత్రశోకపరిప్లుతామ్।
అభివాద్య స్వజేధాస్త్వం పాండవా పరికీర్తయన్॥ 41
నీవు మా సమాచారాన్ని ఆమెకు తెలుపుతీ నమస్కర్రించి పుత్రశోకంతో బాధపడుతున్న ఆమెను మరీ మరీ ఊరడించు. (41)
ఊఢాత్ ప్రభృతి దుఃఖాని శ్వశురాణామరిందమ।
వికారా న తదర్హా చ పశ్యంతీ దుఃఖామశ్నుతే॥ 42
శత్రుదమనా! పెళ్ళి అయిన నాటినుండి మెట్టినింట అడుగుపెట్టి ఎన్నో బాధలను అనుభవించింది. ఇప్పటికీ అక్కడ ఆమె కష్టాలనే అనుభవిస్తోంది. (42)
అపి జాతు స కాలః స్యాత్ కృష్ణ దుఃఖవిపర్యయః।
యదహం మాతరం క్లిష్టాం సుఖం దద్యామరిందమ॥ 43
శత్రుదమనా! శ్రీకృష్ణా! మా కష్టాలు తొలగిపోయి, దుఃఖంతో కుమిలిపోతున్న మాతల్లికి నేను సుఖాన్ని కల్పించగలరోజు ఎప్పుడయినా వస్తుందంటావా? (43)
ప్రవ్రజంతోఽనుధావంతీం కృపణాం పుత్రగృద్ధినీమ్।
రుదతో మపహాయైనామ్ ఆగచ్ఛామ వయం వనమ్॥ 44
మేము వనవాసానికి బయలుదేరినప్పుడు పుత్రప్రేమతో కలతపడుతూ, భయంతో ఏడుస్తూ దీనంగా ఆమె ంఆ వెంట పడింది. అయినా ఆమెను వదలి మేము అరణ్యాలకు వచ్చాం. (44)
న నూనం మ్రియతే దుఃఖైః సా చేజ్జీవతి కేశవ।
తథా పుత్రాదిభిర్గాఢమ్ ఆర్తా హ్యానర్త సత్కృత॥ 45
ఆనర్తదేశాన గౌరవింపబడిన శ్రీకృష్ణా! మనిషి దుఃఖాలకు భయపడి చనిపోతాడనటం నిశ్చితం కాదు. కాబట్టి ఆమె జీవించియే ఉండవచ్చు. పుత్రశోకంతో పీడింపబడుతూనే ఉండవచ్చు. (45)
అభివాద్యాథ సా కృష్ణ త్వయా మద్వచనాద్ విభో।
ధృతరాష్ట్రశ్చ కౌరవ్యః రాజానశ్చ వయోఽధికాః॥ 46
భీష్మం ద్రోణం కృపం చైవ మహారాజం చ బాహ్లికమ్।
ద్రౌణిం చ సోమదత్తం చ సర్వాంశ్చ భరతాన్ ప్రతి॥ 47
విదురం చ మహాప్రాజ్ఞం కురూణాం మంత్రధారిణమ్।
అగాథబుద్ధిం మర్మజ్ఞం స్వజేథా మధుసూదన॥ 48
ప్రభూ! మధుసూదనా! శ్రీకృష్ణా! నీవు మా తల్లికి నమస్కరించి, నా మాటగా ధృతరాష్ట్రునకు, సుయోధనునకు, వయోవృద్ధులయిన రాజులకు, భీష్మునకు, ద్రోణునకు, కృపునకు, బాహ్లికమహారాజుకు, నమస్కారాలు తెలుపుము. అశ్వత్థామకు, సోమదత్తునకు, భరతవంసస్థులందరకూ, కౌరవ మంత్రాంగ రక్షకుడూ, మర్మవేత్త, మహామేధావి, అగాథబుద్ధి అయిన విదురునకు నమస్కారాలు తెలుపు. (46-48)
ఇత్యుక్త్వా కేశవం తత్ర రాజమధ్యే యుధిష్ఠిరః।
అనుజ్ఞాతో వివవృతే కృష్ణం కృత్వా ప్రదక్షిణమ్॥ 49
ఈ విధంగా అక్కడ ఆ రాజుల సమక్షంలో శ్రీకృష్ణునితో పలికి, ఆయనకు నమస్కరించి, అనుమతి తీసికొని యుధిష్ఠిరుడు వెనుదిరిగాడు. (49)
వ్రజన్నేవ తు బీభత్సుః సఖాయం పురుషర్షభమ్।
అబ్రవీత్ పరవీరఘ్నం దాశార్హమపరాజితమ్॥ 50
అయితే అర్జునుడు వెనుకకు మరలుతూనే శత్రు సంహారకుడూ, ఓటమి నెరుగనివాడు, పురుషశ్రేష్ఠుడు మీదు మిక్కిలి తన చెలికాడైన శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. (50)
యదస్మాకం విభో వృత్తం పురా వై మంత్రనిశ్చయే।
అర్ధరాజ్యస్య గోవింద విదితం సర్వరాజసు॥ 51
గోవిందా! ప్రభూ! మేము రహస్య సమాలోచన జరిపినప్పుడు అర్ధరాజ్యాన్ని ఇస్తేనే సంధి చేసికోవాలని నిశ్చయించుకొన్నాము. ఇది రాజులందరకూ తెలుసు. (51)
తచ్చేద్ దద్యాదసంగేన సత్కృత్యా నవమన్య చ।
ప్రియం మే స్యాన్మహాబాహో ముచ్యేరన్ మహతో భయాత్॥ 52
మహాబాహూ! దుర్యోధనుడు లోభాన్ని వీడి, అనాదరభావాన్ని వదలి, సత్కారపూర్వకంగా అర్ధరాజ్యాన్ని ఇస్తే అది నాకు నచ్చుతుంది. కౌరవులు భయపడవలసిన అవసరమూ తప్పుతుంది. (52)
అతశ్చేదన్యథా కర్తా ధార్తరాష్ట్రోఽనుపాయవిత్।
అంతం నూనం కరిష్యామి క్షత్రియాణాం జనార్దన॥ 53
జనార్దనా! ఉపాయప్రయోగం తెలియని దుర్యోధనుడు దీనికి భిన్నంగా వ్యవహరిస్తే క్షత్రియుల నందరనూ అంతం చేస్తాను. ఇది నిశ్చయం. (53)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తే పాండవేన సమహృష్యద్ వృకోదరః।
ముహుర్ముహుః క్రోధవశాత్ ప్రావేపత చ పాండవః॥ 54
వైశంపాయనుడిలా అన్నాడు - అర్జునుడు ఇలా అనగానే భీమసేనుడు పరమానందం పొందాడు. క్రోధావేశంతో మాటిమాటికీ ఊగిపోసాగాడు. (54)
వేపమానశ్చ కౌంతేయః ప్రాక్రోశన్మహతో రవాన్।
ధనంజయవచః శ్రుత్వా హర్షోత్సిక్తమనా భృశమ్॥ 55
భీమసేనుడు కంపించిపోతూ పెద్దగా సింహనాదాలు చేశాడు. అర్జునుని మాటలు విన్న భీముని మనస్సు ఆనందోత్సాహాలతో నిండిపోయింది. (55)
తస్య తం నినదం శ్రుత్వా సంప్రావేపంత ధన్వినః।
వాహనాని చ సర్వాణి శకృన్మూత్రే ప్రసుస్రువుః॥ 56
ఆ భీముని సింహనాదాన్ని విని ధనుర్ధరులందరూ వణికిపోయారు. వారి వాహనాలు మలమూత్రాలను విసర్జించాయి. (56)
ఇత్యుక్త్వా కేశనం తత్ర తథా చోక్త్వా వినిశ్చయమ్।
అనుజ్ఞాతో నివవృతే పరిష్వజ్య జనార్దనమ్॥ 57
కేశవునితో ఇలా మాటాడి, తన నిర్ణయాన్ని కూడా చెప్పి భీమసేనుడు జనార్దనుని కౌగిలించుకుని ఆయన అనుమతి తీసికొని వెనుదిరిగాడు. (57)
తేషు రాజసు సర్వేషు నివృత్తేషు జనార్దనః।
తూర్ణమభ్యాగమద్ధృష్టః శైబ్యసుగ్రీవవాహనః॥ 58
అక్కడున్న రాజులందరూ మరలిపోగానే శైబ్య, సుగ్రీవ వాహనుడయిన శ్రీకృష్ణుడు ఆనందంగా ముందుకు సాగాడు. (58)
తే హయా వాసుదేవస్య దారుకేణ ప్రచోదితాః।
సంథానమాచేమురివ గ్రసమానా ఇవాంబరమ్॥ 59
దారుకుడు నడుపుతున్న ఆ శ్రీకృష్ణుని గుఱ్ఱాలు దారినంతా ఆచమనం చేస్తున్నట్టు. ఆకాశాన్ని మ్రింగుతున్నట్టు కనిపించాయి. (59)
అథాపశ్యన్మహాబాహుః ఋషీనధ్వని కేశవః।
బ్రాహ్మ్యా శ్రియా దీపమానాన్ స్థితానుభయతః పథి॥ 60
అటు తరువాత మహాబాహువైన శ్రీకృష్ణుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తూ బాటకిరువైపులా నిలిచి ఉన్న మునులను గమనించాడు. (60)
సోఽవతీర్య రథాత్ తూర్ణమ్ అభివాద్య జనార్దనః।
యథావృత్తానృషీన్ సర్వాన్ అభ్యభాషత పూజయన్॥ 61
ఆ జనార్దనుడు వెంటనే రథం నుండి దిగి ఇరువైపులా నిలిచి ఉన్న మహర్షులకు నమస్కరించి వారిని గౌరవిస్తూ ఇలా అన్నాడు. (61)
కచ్చిల్లోకేషు కుశలం కచ్చిద్ ధర్మః స్వనుష్ఠితః।
బ్రాహ్మణానాం త్రయో వర్ణాః కచ్చిత్ తిష్ఠంతి శాసనే॥ 62
(పితృదేవాతిథిభ్యశ్చ కచ్చిత్ పూజా స్వనుష్ఠితా।)
సమస్తలోకాలూ క్షేమంగా ఉన్నాయా? ధర్మానుష్ఠానం చక్కగా జరుగుతోందా? క్షత్రియులు మొదలుగా గల మూడు వర్ణాలవారూ బ్రాహ్మణుల అనుశాసనంలో ఉంటున్నారా? పితృ, దేవ, అతిథిపూజలు చక్కగా జరుగుతున్నవా? (62)
తేభ్యః ప్రయుజ్య తాం పూజాం ప్రోవాచ మధుసూదనః।
భగవంతః క్వ సంసిద్ధాః కా వీథీ భవతామిహ॥ 63
కిం వా కార్యం భగవతామ్ అహం కిం కరవాణి వః।
కేనార్థేనోపసంప్రాప్తాః భగవంతో మహీతలమ్॥ 64
ఆ మహర్షులను పూజించి మధుసూదనుడు"ఆర్యులారా! మీరు ఎక్కడనుండి ఇటు వస్తున్నారు? మీ పని ఏది? మీకై నేను చెయగలిగిన దేది? ఏ పని మీద ఈ భూతలానికి ఔదెంచినారు" అని అడిగాడు. (63-64)
(ఏవముక్తాః కేసవేన మునయః సంశితవ్రతాః।
నారదప్రముఖాః సర్వే ప్రత్యనందంత కేశవమ్॥
అధఃశిరాః సర్పమాలీ మహర్షిః స హి దేవలః।
అర్వావసుః సుజానుశ్చ మైత్రేయః శునకో బలీ॥
బకీ దాల్భ్యః స్థూలశిరాః కృష్ణద్వైపాయనస్తథా।
అయోదధౌమ్యో ధౌమ్యశ్చ అణీమాండవ్యకౌశికౌ॥
దామోష్ణీషస్త్రిషవణః పర్ణాదో ఘటజానుకః।
మౌంజాయనో వాయుభక్షః పారాశర్యోఽథ శాలికః॥
శీలవానశనిర్ధాతా శూన్యపాలో ఽకృతవ్రణః।
శ్వేతకేతుః కహాలశ్చ రామశ్పైవ మహాతపాః॥)
శ్రీకృష్ణుడు ఇలా అడుగగానే అక్కడున్న మహర్షులు - నారదుడు, అధశ్శిరుడు, సర్పమాలి, దేవలమహర్షి, అర్వావసువు, సుజానువు, మైత్రేయుడు, శునకుడు, బలి, బకుడు, దాల్భ్యుడు, స్థూలశిరుడు, కృష్ణద్వైపాయనుడు, ఆయోదధౌమ్యుడు, ధౌమ్యుడు, అణీమాండవ్యుడు, కౌశికుడు, దామోష్ణీషుడు, త్రిషవణుడు, పర్ణాదుడు, ఘటజానుకుడు, మౌంజాయనుడు, వాయుభక్షుడు, పారాశర్యుడు, శాలికుడు, శీలవంతుడు, అశని, ధాత శూన్యపాలుడు, అకృతవ్రణుడు, శ్వేతకేతువు, కహాలుడు, తపస్సంపన్నుడైన పరశురాముడు - శ్రీకృష్ణుని అభినందించాడు.
తమబ్రవీజ్జామదగ్న్యః ఉపేత్య మధుసూదనమ్।
పరిష్వజ్య చ గోవిందం సురాసురపతేః సభా॥ 65
అప్పుడు దేవదానవ పతులకు మిత్రుడైన పరశురాముడు శ్రీకృష్ణుని సమీపించి, ఆయనను కౌగిలించి ఇలా అన్నాడు. (65)
దేవర్షయః పుణ్యకృతః బ్రాహ్మణశ్చ బహుశ్రుతాః।
రాజర్షయశ్చ దాశార్హమ్ ఆనయంతస్తపస్వినః।
దేవాసురస్య ద్రష్టారః పురాణస్య మహామతే॥ 66
సమేతం పార్థివం క్షత్రం దిదృక్షంతశ్చ సర్వతః।
సభాసదశ్చ రాజానం త్వాం చ సత్యం జనార్దనమ్॥ 67
ఏతన్మహత్ ప్రేక్షణీయం ద్రష్టుం గచ్ఛామ కేశవ।
ధర్మార్థసహితా వాచః శ్రోతుమిచ్ఛామ మాధవ॥ 68
త్వయోచ్యమానాః కురుషు రాజమధ్యే పరంతప।
మహామతీ! కేశవా! పురాతనమయిన దేవాసుర సంగ్రామాన్ని ప్రత్యక్షంగా చూచిన పుణ్యాత్ములయిన దేవర్షులు, బహుశాస్త్రపండితులయిన బ్రహ్మర్షులు, నిన్ను మిక్కిలిగా మన్నించు రాజర్షులు, అన్నిదిక్కుల నుండి గుముగూడి చేరిన రాజులను, సభాసదులను సత్య స్వరూపుడయిన నిన్ను చూడగోరుతున్నారు. పరమ దర్శనీయమయిన ఈ ఘటనను చూడగోరి మేము హస్తినకు బయలుదేరాము. కౌరవ సభామద్యంలో రాజుల సమక్షంలో నీవు చెప్పబోయే ధర్మార్థసహిత వచనాలను వినగోరుతున్నాము. (66-68 1/2)
భీష్మద్రోణాదయశ్పైవ విదురశ్చ మహామతిః॥ 69
త్వం చ యాదవశార్దూల సభాయాం వై సమేష్యథ।
యాదవశార్దూలా! ఆ కౌరవ సభలో భీష్మద్రోణాదులు, మహామతి అయిన విదురుడు నీవు కూడా కూడి ఉంటారు గదా!. (69 1/2)
తవ వాక్యాని దివ్యాని తథా తేషాం చ మాధవ॥ 70
శ్రోతుమిచ్ఛామ గోవింద సత్యాని చ హితాని చ।
మాధవా! గోవిందా! నీవు, భీష్మాదులు పలుకబోయే సత్య హిత వచనాలను వినగోరుతున్నాము. (70 1/2)
ఆ పృష్టోఽసి మహాబాహో పునర్ద్రక్ష్యామహే వయమ్॥ 71
యాహ్యవిఘ్నేన వై వీర ద్రక్ష్యామస్త్వాం సభాగతమ్।
ఆసీనమాసనే దివ్యే బలతేజస్సమాహితమ్॥ 72
మహాబాహూ! ఇప్పుడు మేము నీ దగ్గరనుండి సెలవు తీసికొంటున్నాము. మరల నిన్ను చూడగలము. నీ ప్రయాణం నిర్విఘ్నంగా సాగనీ! సభలో దివ్యమైన ఆసనంలో బలతేజస్సంపన్నుడవై కూర్చొని ఉన్న నిన్ను చూడగలవారము. (71,72)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి శ్రీకృష్ణప్రస్థానే త్ర్యశీతితమోఽధ్యాయః॥ 83 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున శ్రీకృష్ణప్రస్థానమను ఎనుబది మూడవ అధ్యాయము. (83)
(దాక్షిణాత్య అధికపాఠం 5 1/2 శ్లోకాలు కలుపుకొని మొత్తం 77 1/2 శ్లోకాలు)