77. డెబ్బది ఏడవ అధ్యాయము

శ్రీకృష్ణుడు భీముని ఓదార్చుట.

శ్రీ భగవానువాచ
భావం జిజ్ఞాసమానోఽహం ప్రణయాదిదమబ్రువమ్।
న చాక్షేపాన్న పాండిత్యాత్ న క్రోధాన్న వివక్షయా॥ 1
శ్రీకృష్ణుడిలా అంటున్నాడు. నేను నీ ఆలోచనలను తెలిసికోవాలని చనువుతో ఇలా అన్నాను కాని నిన్ను ఆక్షేపించాలనీ కాదు, నా పాండిత్యాన్ని ప్రదర్శించాలనీ కాదు, కోపంతోనూ కాదు. వ్యాఖ్యానం చెయ్యాలనీ కాదు. (1)
వేదాహం తవ మాహాత్మ్యమ్ ఉత తే వేద యద్ బలమ్।
ఉత తే వేద కర్మాణి న త్వాం పరిభవామ్యహమ్॥ 2
నీ గొప్పదనం నేనెరుగుదును. నీ బలం నాకు తెలుసు. నీవు చేసిన ఘనకార్యాలూ నేనెరుగుదును. కాబట్టి నేను నిన్ను కించపరచటం లేదు. (2)
యథా చాత్మని కల్యాణం సంభావయసి పాండవ।
సహస్రగుణ మప్యేతత్ త్వయి సంభావయామ్యహమ్॥ 3
పాండునందనా! నీవు నీలోని మంచితనాన్ని ఎంతగా భావిస్తున్నావో దానికన్న వేయిరెట్లు ఎక్కువగా నేను నీలోని మంచితనాన్ని భావిస్తున్నాను. (3)
యాదృశే చ కులే జన్మ సర్వరాజాభిపూజితే।
బంధుభిశ్చ సుహృద్భిశ్చ భీమ త్వమపి తాదృశః॥ 4
భీమసేనా! సకల రాజన్యులు మన్నన చేసే ఉన్నతవంశంలో పుట్టినవాడవు. నీ బంధువులను, మిత్రులను బట్టి కూడా అంతటి ప్రతిష్ఠకు నీవు తగినవాడవు. (4)
జిజ్ఞాసంతో హి ధర్మస్య సందిగ్ధస్య వృకోదర।
పర్యాయం నాధ్యవస్యంతి దేవమానుషయోర్జనాః॥ 5
వృకోదరా! దైనిక, మానుష ధర్మ స్వరూపం అనిశ్చితం. ప్రజలు దైవ పురుషార్థాల పరిణామాలను తెలిసికోవాలనుకొంటారు. కానీ సరియైన నిర్ణయానికి రాలేరు. (5)
వి॥సం॥ దైవ మానుషధర్మాల బలాబలాలను నిశ్చయించుకోలేరు. ఒక్కొక్కప్పుడు దైవజ్ఞులు మొదలయిన వారు చెప్పినా మానవులు నిశ్చయించుకోలేరు. (నీల)
దైవధర్మం అంటే పూర్వ జన్మఫలం, అని మానుషధర్మం అంటే ఇహజన్మఫలం.(అర్జు)
దైవ మానుషాల్లో ఏది ముందు, ఏది తరువాత అని నిశ్చయించుకోలేరు. లేదా ఏది ప్రధానం అనేది నిశ్చయించుకోలేరు. (సర్వ)
ఇపుడు యుద్ధమా? సంధియా? అని నిశ్చయించుకోలేక పోతున్నారు.(లక్షా)
స ఏవ హేతుర్భూత్వా హి పురుషస్యార్థసిద్ధిషు।
వినాశేఽపి స ఏవాస్య సందిగ్ధం కర్మ పౌరుషమ్॥ 6
పురుషకారం సంశయాస్పదం. పురుషుని కార్యసిద్ధికి అది కారణమవుతుంది. అయితే వినాశనానికి కూడా అదే కారణమవుతుంది. కాబట్టి దైవిక ఫలం అనిశ్చితమయినట్లు పౌరుష ఫలం కూడా అనిశ్చితమే. (6)
అన్యథా పరిదృష్టాని కవిభిర్దోషదర్శిభిః।
అన్యథా పరివర్తంతే వేగా ఇవ నభస్వతః॥ 7
దోషజ్ఞులయిన దార్శనికులు ఒకవిధంగా భావిస్తే అవి గాలివిసురులాగా మరొకవిధంగా మారిపోతుంటాయి. (7)
సుమంత్రితం సునీతం చ న్యాయతశ్చోపపాదితమ్।
కృతం మానుష్యకం కర్మ దైవేనాపి విరుధ్యతే॥ 8
మానవుడు చక్కగా ఆలోచించి, సరిగా ఆచరించి, న్యాయబద్ధంగా చేసిన పౌరుషకర్మకూడా దైవం చేత వ్యతిరేకం చేయబడుతుంది./నిష్ఫలం చేయబడుతుంది. (8)
దైవమప్యకృతం కర్మ పౌరుషేణ విహన్యతే।
శీతముష్ణం తథా వర్షం క్షుత్పిపాసే చ భారత॥ 9
భారతా! దైవికమైన కర్మ కూడా ఆసాంతం సిద్ధించేలోగా పౌరుషకారణంగా నాశనమవుతుంది. చల్లదనం, వెచ్చదనం, వాన, ఆకలిదప్పులు క్రమంగా వస్త్రాలు, వీవనలు, గొడుగు, అన్నం, నీరు - వీటిచే నివారింపబడుతూనే ఉన్నాయి గదా! (9)
యదన్యద్ దిష్టభావస్య పురుషస్య స్వయంకృతమ్।
తస్మాదనుపరోధశ్చ విద్యతే తత్ర లక్షణమ్॥ 10
ప్రారబ్ధంకాక పురుషుడు తాను స్వయంగా చేసిన సంచిత కర్మ కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. దానికి ఎన్నో ఉదాహరణాలు కనిపిస్తాయి. (10)
లోకస్య నాన్యతో వృత్తిః పాండవాన్యత్ర కర్మణః।
ఏవం బుద్ధిః ప్రవర్తేత ఫలం స్యాదుభయాన్వయే॥ 11
పాండుకుమారా! పౌరుషం విడిచి సాధనాంతరంతో - కేవలం దైవికశక్తితో - ప్రజాజీవనం జరగదు. ఈ ఆలోచనతో కర్మ చేసి తీరవలసినదే. దైవ పురుషకాలం సమన్వయంతోనే ఫలసిద్ధి కలుగుతుంది. (11)
య ఏవం కృతబుద్ధిః స కర్మస్వేన ప్రవర్తతే।
నాసిద్ధౌ వ్యధతే తస్య న సిద్ధౌ హర్షమశ్నుతే॥ 12
ఈ విధంగా ఆలోచించి కర్మలు చేసిన వ్యక్తి కార్యం విఫలమై ఫలం సిద్ధించకపోయినా బాధపడడు. అలాగే ఫలం సిద్ధించినా పొంగిపోడు. (12)
తత్రేయ మనుమాత్రా మే భీమసేన వివక్షితా।
నైకాంత సిద్ధిర్వక్తవ్యా శత్రుభిః సహ సంయుగే॥ 13
భీమసేనా! ఈ విషయంలో నేను నా నిశ్చితాభిప్రాయాన్ని చెప్పదలచుకొన్నాను. శత్రువులతో యుద్ధానికి సిద్ధపడినపుడు గెలిచి తీరుతామని చెప్పటం తగదు, కుదరదు. (13)
నాతిప్రహీణరశ్మిః స్యాత్ తథా భావవిపర్యయే।
విషాదమర్చ్ఛేద్ గ్లానిం వాఽప్యేతమర్థం బ్రవీమి తే॥ 14
నేను మరొకవిషయాన్ని కూడా నీకు చెప్తున్నాను. ఆలోచనలు మారినా, ప్రారబ్ధాన్ని అనుసరించి విపరీత సంఘటనలు జరిగినా తేజస్సును కొలుపోకూడదు. నిరుత్సాహపడి దుఃఖానికి లోనుకాకూడదు. (14)
శ్వో భూతే ధృతరాష్ట్రస్య సమీపం ప్రాప్య పాండవ।
యతిష్యే ప్రశమం కర్తుం యుష్మదర్థమహాపయన్॥ 15
పాండుకుమారా! రేపు ఉదయం ధృతరాష్ట్రుని దగ్గరకు పోయి మీ అర్థసిద్ధికి భంగం కలగని రీతిగా మీ ఉభయులకూ సంధి చేయటానికి ప్రయత్నిస్తాను. (15)
శమం చేత్ తే కరిష్యంతి తతోఽనంతం యశో మమ।
భవతాం చ కృతః కామః తేషాం చ శ్రేయ ఉత్తమమ్॥ 16
వారు సంధి చేసుకొంటే నాకు అఖండకీర్తి లభిస్తుంది. మీ కోరిక నెరవేరుతుంది. వారికి కూడా అది శ్రేయస్కర మవుతుంది. (16)
తే చేదభినివేక్ష్యంతే నాభ్యుపైష్యంతి మే వచః।
కురవో యుద్ధమేవాత్ర ఘోరం కర్మ భవిష్యతి॥ 17
ఒకవేళ కౌరవులు యుద్ధం జరగాలనే పట్టుబట్టి నా మాటలు లెక్కచేయకపోతే యుద్ధమే జరుగుతుంది. అది చాలా ఘోరమైన కృత్యం. (17)
అస్మిన్ యుద్ధే భీమసేన త్వయి భారః సమాహితః।
ధూరర్జునేన ధార్యా స్యాద్ వోఢవ్య ఇతరో జనః॥ 18
భీమసేనా! ఈ యుద్ధభారమంతా నీమీదే మోపబడి ఉంది. అర్జునుడు కూడా ఈ భారాన్ని భరిస్తాడు. ఇతరుల భారమంతా మీ ఇద్దరే మోయవలసి ఉంటుంది. (18)
అహం హి యంతా బీభత్సోః భవితా సంయుగే సతి।
ధంజయస్యైష కామః న హి యుద్ధం న కామయే॥ 19
యుద్ధమే జరిగితే నేను అర్జునునకు రథ సారథి నవుతాను. అది అర్జునుని కోరిక, కానీ నేను యుద్ధాన్ని కోరుకోవటం లేదని కాదు. (19)
తస్మాదాశంకమానోఽహం వృకోదర మతిం తవ।
గదతః క్లీబయా వాచా తేజస్తే సమ్దీదిపమ్॥ 20
కాబట్టి భీమసేనా! నీవు నిరుత్సాహంగా మాట్లాడినందువలన యుద్ధాన్ని గురించి నీ అభిప్రాయాన్ని మార్చుకొంటున్నావేమో అని సందేహించి నేను నీలోని తేజస్సును ప్రజ్వలింపజేశాను. (20)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి కృష్ణవాక్యే సప్త సప్తతిసప్తతితమోఽధ్యాయః॥ 77 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున కృష్ణవాక్యమను డెబ్బది ఏడవ అధ్యాయము. (77)