58. ఏబది ఎనిమిదవ అధ్యాయము
దుర్యోధనుని అభిప్రాయము - ధృతరాష్ట్రుని భయము.
ధృతరాష్ట్ర ఉవాచ
క్షత్రతేజా బ్రహ్మచారీ కౌమారాదపి పాండవః।
తేన సంయుగమేష్యంతి మందా విలపతో మమ॥ 1
ధృతరాష్ట్రుడిట్లన్నాడు. ఆ అర్జునుడు చిన్నప్పటి నుండీ క్షత్రియతేజస్సు కల బ్రహ్మచారి. నేనెంత కాదంటున్నా వినిపించుకోక మందబుద్ధులైన నాకొడుకులు వానితో యుద్ధానికి సిద్ధపడుతున్నారు. (1)
దుర్యోధన నివర్తస్వ యుద్ధాద్భరతసత్తమ।
న హి యుద్ధం ప్రశంసంతి సర్వావస్థమరిందమ॥ 2
దుర్యోధనా! యుద్ధం నుండి వెనుదిరుగు - ఎట్టి పరిస్థితుల్లోను యుద్ధాన్ని మంచిదిగా చెప్పరు. (2)
అలమర్ధం పృథివ్యాస్తే సహామాత్యస్య జీవితుమ్।
ప్రయచ్ఛ పాండుపుత్రాణాం యథోచితమరిందమ॥ 3
నీవూ, నీ సోదర మంత్రులూ బ్రతకటానికి ఈ రాజ్యంలో సగం చాలును. శత్రుమర్దనా! పాండవులకు తగినంత భూమి నియ్యి! (3)
ఏతద్ధి కురవః సర్వే మన్యంతే ధర్మసంహితమ్।
యత్త్వం ప్రశాంతిం మన్యేథాః పాండుపుత్రైర్మహాత్మభిః॥ 4
కురువంశంలోని వారంతా ఇదే ధర్మ సమ్మతమయిన పద్ధతి అనుకుంటున్నారు. మహాత్ములయిన పాండు పుత్రులతో నీవు ప్రశాంతినే కోరుకోవాలి. ఇదే ధర్మం. (4)
అంగేమాం సమవేక్షస్వ పుత్ర స్వామేవ వాహినీమ్।
జాత ఏష తవాభావః త్వం తు మోహాన్నబుధ్యసే॥ 5
అయ్యో! పుత్రా! నీ సేననే చూడు. నీ అభావమే కలిగింది. (నీవు లేవు) అజ్ఞానంతో నీవు దాన్ని తెలుసుకోలేక పోతున్నావు. (5)
నత్వహం యుద్ధమిచ్ఛామి నైతదిచ్ఛతి బాహ్లికః।
న చ భీష్మో న చ ద్రోణః నాశ్వత్థామా న సంజయః॥ 6
న సోమదత్తో న శల్యః న కృపో యుద్ధమిచ్ఛతి।
సత్యవ్రతః పురుమిత్రః జయో భూరిశ్రవస్తథా॥ 7
నేనయితే యుద్ధం కోరటం లేదు. అలాగే బాహ్లికుడూ, భీష్ముడూ, ద్రోణుడూ, అశ్వత్థామ, సంజయుడు, సోమదత్తుడు, శల్యుడు, కృపుడు, సత్యవ్రతుడయిన పురుమిత్రుడు, జయుడు, భూరిశ్రవుడూ కూడా యుద్ధం కోరుకోవటం లేదు. (6,7)
యేషు సంప్రతితిష్ఠేయుః కురవః పీడితాః పరైః।
తే యుద్ధం నాభినందంతి తత్ తుభ్యం తాత రోచతామ్॥ 8
శత్రు పీడితులయినపుడు కురువంశీయులను ఆదుకొనే వారు కూడా యుద్ధం కోరుకోవటం లేదు. నాయనా! అదే నీవూ ఇష్టపడాలి. (8)
న త్వం కరోషి కామేన కర్ణః కారయితా తవ।
దుశ్శాసనశ్చ పాపాత్మా శకునిశ్చాపి సౌబలః॥ 9
నీవు ఇష్టపడి ఈ పని చేయటం లేదు. నీచేత చేయిస్తున్నవాడు కర్ణుడు. ఇంకా దుశ్శాసనుడు, పాపాత్ముడయిన శకుని నిన్ను ప్రేరేపిస్తున్నారు. (9)
దుర్యోధన ఉవాచ
నాహం భవతి న ద్రోణే నాశ్వత్థామ్ని న సంజయే।
న భీష్మే న చ కాంభోజే న కృపే న చ బాహ్లికే॥ 10
సత్యవ్రతే పురుమిత్రే భూరిశ్రవసి వా పునః।
అన్యేషు వా తావకేషు భారం కృత్వా సమాహ్వయమ్॥ 11
అపుడు దుర్యోధనుడు ఇట్లు అన్నాడు. నేను నీమీద కాని, ద్రోణుడు, అశ్వత్థామ, సంజయుడు, భీష్ముడు, కాంభీజరాజు(సుదక్షిణుడు) కృపుడూ, బాహ్లికుడు, సత్యవ్రతుడయిన పురుమిత్రుడు, భూరిశ్రవుడు - వీరిమీదకాని భారం పెట్టి పిలవలేదు. (10,11)
అహం చ తాత కర్ణశ్చ రణయజ్ఞం వితత్య వై।
యుధిష్ఠిరం పశుం కృత్వా దీక్షితౌ భరతర్షభ॥ 12
తండ్రీ! నేనూ, కర్ణుడు(ఇద్దరమూ) యుద్ధం అనే యజ్ఞం ప్రారంభించాము. ధర్మరాజును యజ్ఞపశువుగా చేసి దీక్ష వహించాము. (12)
రథో వేదీ, స్రువః ఖడ్గః గదా స్రుక్, కవచం సదః।
చాతుర్హోత్రం చ ధుర్యా మే శూరా దర్భామ్ హవిర్యశః॥ 13
ఈ రణ యజ్ఞంలో వేదిక రథం ; స్రువం కత్తి, స్రుక్కు గద; యాగశాల కవచం, చాథుర్హోత్రం నాగుర్రాలు నిర్వహిస్తాయి.(నలుగురు హోతలు - ఋత్విక్కులు చేసే పని చాతుర్హోత్రం) దర్భలు శూరులు, హోమద్రవ్యం కీర్తియే. (13)
ఆత్మయజ్ఞేన నృపతే ఇష్ట్వా వైవస్వతం రణే।
విజిత్య చ సమేష్యావో హతమిత్రౌ శ్రియావృతౌ॥ 14
రాజా! ఆత్మయజ్ఞంతో యుద్ధరంగంలో యముని అర్చింది, శత్రుసంహారం చేసి, జయలక్ష్మితో కూడి వస్తాము. (14)
అహం చ తాత కర్ణశ్చ భ్రాతా దుశ్శాసనశ్చ మే।
ఏతే వయం హనిష్యామః పాండవాన్ సమరే త్రయః॥ 15
తండ్రీ! నేనూ, కర్ణుడూ, దుశ్శాసనుడూ ముగ్గురమూ యుద్ధంలో పాండవులను చంపగలం. (15)
అహం హి పాండవాన్ హత్వా ప్రశాస్తా పృథివీ మిమామ్।
మాం వా హత్వా పాండుపుత్రాః భోక్తారః పృథివీమిమామ్॥ 16
పాండవులను చంపి నేనే ఈ భూమిని పాలిస్తాను. లేదా పాండవులు నన్ను చంపి ఈ భూమిని అనుభవిస్తారు. (16)
త్యక్తం మే జీవితం రాజ్యం ధనం సర్వం చ పార్థివ।
న జాతు పాండవైః సార్ధం వసేయమహమచ్యుత॥ 17
రాజ్యచ్యుతి ఎరుగని మహారాజా! నా జీవితాన్ని, రాజ్యాన్ని, ధనాన్ని, సర్వమూ విడుస్తాను కాని పాండవులతో కలిసి మాత్రం ఎన్నడూ జీవించను. (17)
యావద్ధి సూచ్యాస్తీక్ష్ణాయాః విధ్యేదగ్రేణ మారిష।
తావదప్యపరిత్యాజ్యం భూమే ర్నః పాండవాన్ ప్రతి॥ 18
ఆర్యా! వాడి సూదిమొన మోపినంత భూముకూడా పాండవులకు విడిచిపెట్టను. (18)
ధృతరాష్ట్ర ఉవాచ
సర్వాన్ వస్తాత శోచామి త్యక్తో దుర్యోధనో మయా।
యే మంద మనుయాస్యధ్వం యాంతం వైవస్వతక్షయమ్॥ 19
వెంటనే ధృతరాష్ట్రుడు ఇలా మొదలుపెట్టాడు. నేను ఈ దుర్యోధనుని వదిలేశాను. కాని యముని ఇంట్లోకి వెళ్లే యీ మందబుద్ధి వెనుక పడిపోతున్న మీకోసం ఏడుస్తున్నాను. (19)
రురూణా మివ యూథేషు వ్యాఘ్రాః ప్రహరతాం వరాః।
వరాన్ వరాన్ హనిష్యంతి సమేతా యుధి పాండవాః॥ 20
యోధశ్రేష్ఠులైన పాండవులు కౌరవసేనలో ప్రవేశించి పులుల లాగా బలిష్ఠులను ఏరి చంపుతారు. (20)
ప్రతీపమివ మే భాతి యుయుధానేన భారతీ।
వ్యస్తా సీమంతినీ గ్రస్తా ప్రమృష్టా దీర్ఘబాహునా॥ 21
దీర్ఘభుజుడైన సాత్యకికి చిక్కి భరతసేన నీచుడి వశమయిన సాధ్విలాగా చెదిరిపోయినట్లు నాకు వ్యతిరేకంగా భాసిస్తోంది. (21)
సంపూర్ణం పూరయన్ భూయో ధనం పార్థస్య మాధవః।
శైనేయః సమరే స్థాతా బీజవత్ ప్రవపన్ శరాన్॥ 22
సాత్యకి అర్జునుని బలాన్ని పూరిస్తూ విత్తనాలు చల్లినట్లు యుద్ధంలో నిలిచి బాణాలు చల్లుతాడు. (22)
సేనాముఖే ప్రయుద్ధానాం భీమసేనో భవిష్యతి।
తం సర్వే సంశ్రయిష్యంతి ప్రాకారమకుతోభయమ్॥ 23
సేనకు అగ్రభాగాన యుద్ధం చేసే వీరులకు భీముడు నిర్భయంగా ప్రాకారంలా నిలుస్తాడు. అందరూ వానిని ఆశ్రయిస్తారు. (23)
యదా ద్రక్ష్యసి భీమేన కుంజరాన్ వినిపాతితాన్।
విశీర్ణదంతాన్ గిర్యాభాన్ భిన్నకుంభాన్ సశోణితాన్॥ 24
తానభిప్రేక్ష్య సంగ్రామే విశీర్ణానివ పర్వతాన్।
భీతో భీమస్య సంస్పర్శాత్ స్మర్తాసి వచనస్య మే॥ 25
భీముని గదాప్రహారాలకు దంతాలు విరిగి, కుంభస్థలాలు పగిలి, నెత్తురు కారుతూ నేలగూలిన ఏనుగులు పగిలి పడ్డ కొండలవలె కనపడితే అపుడు భీమునికి భయపడి నా మాట తలచుకొంటావు. (24,25)
నిర్దగ్ధం భీమసేనేన సైన్యం రథహయద్విపమ్।
గతి మగ్నేరివ ప్రేక్ష్య స్మర్తాసి వచనస్య మే॥ 26
భీముడు అగ్నిహోత్రుడిలా ప్రజ్వలించి సైన్యాన్ని, రథాలను, గుర్రాలను, ఏనుగులను దహించి ఉంటే ఆ దృశ్యం చూసి నా మాట తలచుకొంటావు. (26)
మహద్వో భయమాగామి నచేచ్ఛామ్యథ పాండవైః।
గదయా భీమసేనేన హతాః శమముపైష్యథ॥ 27
పాండవులతో శాంతి కోరకపోతే మీకు మహా భయం కలుగుతుంది. చివరకు భీముని గదతో చచ్చి శాంతిస్తారు. (27)
మహావన మివచ్ఛిన్నం యదా ద్రక్ష్యసి పాతితమ్।
బలం కురూణాం భీమేన తదా స్మర్తాసి మే వచః॥ 28
పెద్ద అడవి విరిగి పడినట్లు భీముని చేత నేలగూలిన కౌరవసేనను చూసి... అపుడు నామాట గుర్తు తెచ్చుకుంటావు. (28)
వైశంపాయన ఉవాచ
ఏతావదుక్త్వా రాజా తు సర్వాంస్తాన్ పృథివీపతీన్।
అనుభాష్య మహారాజ పునః పప్రచ్ఛ సంజయమ్॥ 29
వైశంపాయనుడు ఇట్లా చెప్పాడు. ఆ రాజులందరి గురించి చెప్పి ధృతరాష్ట్రుడు మళ్లీ సంజయుని ఇలా అడిగాడు. (29)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి ధృతరాష్ట్ర వాక్యే అష్ట పంచాశత్తమోఽధ్యాయ॥ 58 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్ర వాక్యమను ఏబది ఎనిమిదవ అధ్యాయము. (58)