52. ఏబది రెండవ అధ్యాయము
ధృతరాష్ట్రుడు అర్జునుని పరాక్రమమును గురించి విలపించుట.
ధృతరాష్ట్ర ఉవాచ
యస్య వై నానృతా వాచః కదాచిదనుశుశ్రుమ।
త్రైలోక్యమపి తస్య స్యాత్ యోద్ధా యస్య ధనంజయః॥ 1
ధృతరాష్ట్రుడిట్లన్నాడు. అర్జునుడు ఎన్నడూ అబద్ధమాడినట్లు వినలేదు - అతడు యుద్ధం చేస్తే ముల్లోకాలూ వాడివే. (1)
తస్యైవ చ న పశ్యామి యుధి గాండీవధన్వనః।
అనిశం చింతయానోఽపి యః ప్రతీయాద్రథేన తమ్॥ 2
గాండీవం దాల్చిన అర్జునుని యుద్ధంలో ఎదిరించే రథికుడు ఎంత ఆలోచించినా నాకు కనపడటం లేదు. (2)
అస్యతః కర్ణినాళీకాన్ మార్గణాన్ హృదయచ్ఛిదః।
ప్రత్యేతా న సమః కశ్చిత్ యుధి గాండీవధన్వనః॥ 3
యుద్ధంలో గుండెలు బ్రద్దలు చేసే గుఱ్ఱపు చెవుల వాడి బాణాలు వేసే గాండీవికి సమానమైన వీరుడెవడూ లేడు. (3)
ద్రోణకర్ణౌ ప్రతీయాతాం యది వీరౌ నరర్షభౌ।
కృతాస్త్రౌ బలినాం శ్రేష్ఠౌ సమరేష్వపరాజితౌ॥ 4
ఒకవేళ వీరయోధులు, అస్త్ర విద్యావిశారదులు, బలిష్ఠులూ, యుద్ధాలలో ఓటమి నెరుగని ద్రోణ కర్ణులు ఏమయినా ఎదిరించగలరేమో! (4)
మహాన్ స్యాత్ సంశయో లోకే న త్వస్తి విజయో మమ।
ఘృణీ కర్ణః ప్రమాదీ చ ఆచార్యః స్థవిరో గురుః॥ 5
అయినా వారు ఎదిరించినా లోకంలో పెద్ద సంశయం ఒకటి ఉంది. నాకు విజయం రాదు. ఎందుచేతనంటే కర్ణుడు జాలిగుండె కలవాడు. ప్రమాద పడతాడు(మరచిపోతాడు). గురువు ద్రోణుడు ముసలివాడు. (5)
సమర్థో బలవాన్ పార్థః దృఢధన్వా జితక్లమః।
భవేత్ సుతుములం యుద్ధం సర్వశోఽప్యపరాజయః॥ 6
అర్జునుడు బలవంతుడు సమర్థుడు. దృఢమైన ధనుస్సు (గాండీవం) కలవాడు. శ్రమ ఎరుగనివాడు. ఎంతటి దొమ్మి యుద్ధంలో కూడా ఏ ప్రక్కనుండీ పరాజయం ఎరుగడు. (6)
సర్వే హ్యస్త్రవిదః శూరాః సర్వే ప్రాప్తాః మహద్యశః।
అపి సర్వామరైశ్వర్యం త్యజేయుర్న పునర్జయమ్॥ 7
వారంతా అస్త్రవేత్తలు, శూరులు, చాలా కీర్తి గడించినవారు, ఇంద్ర సంపద నయినా వదులుతారు గాని జయం మాత్రం వదలరు. (7)
వధే నూనం భవేచ్ఛాంతిః తయోర్వా ఫల్గునస్య చ।
న తు హంతార్జునస్యాస్తి జేతా చాస్య న విద్యతే॥ 8
ద్రోణ కర్ణులో - ఆ అర్జునుడో చనిపోతేనే శాంతి లభిస్తుంది. కాని అర్జునుని చంపగలవాడు కాని జయింపగలవాడు కాని లేడు. (8)
మన్యు స్తస్య కథం శామ్యేత్ మందాన్ ప్రతి య ఉత్థితః।
అన్యేఽప్యస్త్రాణి జానంతి జీయంతే చ జయంతి చ॥ 9
ఏకాంత విజయ స్త్వేవ శ్రూయతే ఫాల్గునస్య హ।
మందబుద్ధులయిన వారి (నా కొడుకుల) మీదకు విజృంభించిన ఆ అర్జునుని కోపం ఎలా చల్లారుతుంది? ఇతరులకు అస్త్రాలు తెలియవచ్చును వారు గెలువనూ వచ్చు, ఓడిపోనూ వచ్చు. కాని అర్జునునకు సదా విజయమే కలుగుతుందని వింటూ ఉంటాము. (9 1/2)
త్రయస్త్రింశత్సమాహూయ ఖాండవేఽగ్ని మతర్పయత్॥ 10
జిగాయ చ సురాన్ సర్వాన్ నాస్య విద్మః పరాజయమ్।
యస్య యంతా హృషీకేశః శీలవృత్తసమో యుధి॥ 11
ముప్పది మూడు వేలమందిని పిలిచి వారందరితో కూడిన ఇంద్రుని గెల్చి ఖాండవవనంలో అగ్నిహోత్రుని సంతృప్తి పరచాడు. అసలు వానికి పరాజయమే లేదు. పైగా ఇపుడు వానికి కృష్ణుడు సారథి. వారిద్దరూ స్వభావంలోనూ, నడవడిలోనూ అంతటా(ఆత్మనా - శరీరేణ) సమానులు. (10,11)
ధ్రువస్తస్య జయస్తాత యథేంద్రస్య జయ స్తథా।
కృష్ణావేకరథే యత్తౌ అధిజ్యం గాండివం ధనుః॥ 12
ఇంద్రునికి వలె ఆ అర్జునునికీ జయం నిశ్చయం. ఎందుచేత నంటే ఒకే రథం మీద నిలిచిన వారు ఇద్దరు కృష్ణులు. (కృష్ణుడు -అర్జునుడు. అర్జునునికి కూడా కృష్ణుడు అనే పేరు ఉంది) సంధింపబడినది గాండీవ ధనుస్సు. (12)
యుగపత్ త్రీణి తేజాంసి సమేతాన్యను శుశ్రుమ।
నైవాస్తి నో ధను స్తాదృక్ న యోద్ధా న చ సారథిః॥ 13
ఇపుడు మూడు తేజస్సులు ఒక చోట చేరాయని వింటున్నాము. మనకు అటువంటి ధనుస్సూ లేదు. అటువంటి యోధుడూ లేడు. అటువంటి సారథీ లేడు.(మూడు తేజస్సులు = 1. గాండీవం. 2. అర్ర్జునుడు. 3. కృష్ణుడు.) (13)
తచ్చ మందా న జానంతి దుర్యోధనవశానుగాః।
ఆ విషయం దుర్యోధనుని వశమై తిరిగే ఈ మందబుద్ధులకు తెలియటం లేదు. (13 1/2)
శేషయేదశనిర్దీప్తః విపతన్మూర్ధ్ని సంజయ॥ 14
న తు శేషం శరాస్తాత కుర్యురస్తాః కిరీటినా।
మంటలు కక్కుతూ నెత్తిమీద పడిన పిడుగు (వజ్రాయుధం) అయినా ఏమయినా మిగులుస్తుందేమో కాని కిరీటి వేసిన బాణాలు ఏమాత్రం మిగల్చవు. (14 1/2)
అపి చాస్యన్నివాభాతి నిఘ్నన్నివ ధనంజయః॥ 15
ఉద్ధరన్నివ కాయేభ్యః శిరాంసి శరవృష్టిభిః।
ఆ అర్జునుడు బాణాలను విసరుతూ(శత్రువులను) చంపుతున్నట్లే ఉంటుంది. బాణ వర్షంలో(నావారి) తలలను శరీరాలనుండి ఎగరగొడుతున్నట్లే అనిపిస్తూ ఉంటుంది. (15 1/2)
అపి బాణమయం తేజః ప్రదీప్త సర్వతః॥ 16
గాండీవోత్థం దహేతాజౌ పుత్రాణాం మమ వాహినీమ్।
అపి సారథ్యఘోషేణ భయార్తా సవ్యసాచినః॥ 17
విత్రస్తా బహుధా సేనా భారతీ ప్రతిభాతి మే।
యుద్ధంలో గాండీవం నుండి వెలువడిన బాణ తేజస్సు నా కుమారుల సేనను కాల్చివేస్తున్నట్లు తోస్తోంది. సవ్యసాచి యొక్క సారథ్యఘోషకే భారతీయమైన ఈ సేన అంతా భయంతో చెల్లా చెదరయినట్లు నాకు అనిపిస్తోంది. (16, 17 1/2)
యథా కక్షం మహానగ్నిః ప్రదహేత్ సర్వతశ్చరన్।
మహార్చిరనిలోద్ధూతః తద్వద్ధక్ష్యతి మామకాన్॥ 18
గాలితో విజృంభించిన దావాగ్ని పెద్దపెద్ద మంటలతో అన్ని వైపులా కమ్ముకొంటూ అడవి నంతటినీ కాల్చివేసినట్లు ఆ గాండీవం నుండి వెలువడిన బాణాగ్ని నా వారి నందరినీ దహించివేస్తుంది. (18)
యదోద్వమ న్నిశితాన్ బాణసంఘాన్
తా నాతతాయీ సమరే కిరీటీ।
సృష్టోఽంతకః సర్వహరో విధాత్రా
యథా భవే త్తద్వదపారణీయః॥ 19
ఆ అర్జునుడు యుద్ధంలో పదునైన బాణ పరంపరలతో శత్రువులను చంపటానికి మీదకురుకుతూ ఉంటాడు. అపుడు అతడు సర్వమూ హరించటానికి బ్రహ్మ సృష్టించిన యముడే అనిపిస్తుంది. ఆ సమయంలో అతడిని ఎవరూ ఆపలేరు/ అడ్డుకోలేరు. (19)
యదా హ్యభీక్ష్ణం సుబహూన్ ప్రకారాన్
శ్రోతాస్మి తానావసథే కురూణామ్।
తేషాం సమంతాచ్చ తథా రణాగ్రే
క్షయః కిలాయం భరతానుపైతి॥ 20
కౌరవులంతా అనేకవిధాల యుద్ధంలో పడిపోయినట్లు చావు కబురులన్నీ ఇంటిలో కూర్చుని వినాలి కాబోలు. అయ్యో! రణ రంగంలో భరత వంశస్థులందరికీ సర్వనాశనం జరుగుతుంది కాబోలు. (20)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి ధృతరాష్ట్ర వాక్యే ద్విపంచాశత్తమోఽధ్యాయ॥ 52 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్రవాక్యమను ఏబదిరెండవ అధ్యాయము. (52)