50. ఏబదియవ అధ్యాయము

సంజయుడు ధర్మరాజు సహాయులను వర్ణించుట.

ధృతరాష్ట్ర ఉవాచ
కిమసౌ పాండవో రాజా ధర్మపుత్రోఽభ్యభాషత।
శ్రుత్వేహ బహులాః సేవాః ప్రీత్యర్థం నః సమాగతాః॥ 1
ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. మా ప్రీతి కోసం వచ్చిన వివిధ సేనలను గూర్చి విన్నాక ధర్మరాజు ఏమన్నాడు? (1)
కి మసౌ చేష్టతే సూత యోత్స్యమానో యుధిష్ఠిరః।
కే వాస్య భ్రాతృ పుత్రాణాం పశ్యంత్యాజ్ఞేప్సవో ముఖమ్॥ 2
సూతా! యుద్ధం చేయదలచిన యుధిష్ఠిరుడు (ముందుగా) ఏం చేద్దామనుకొంటున్నాడు? వాని సోదరుల యొక్క, పుత్రుల యొక్క ఆజ్ఞకోసం ఎఎదురు చూస్తున్న వారెవరు? (2)
కిం స్విదేనం వారయంతి యుద్ధాత్ శామ్యేతి వా పునః।
నికృత్యా కోపితం మందైః ధర్మజ్ఞం ధర్మచారిణమ్॥ 3
మందబుద్ధుల చేత కోపం ఎక్కింపబడిన ధర్మజ్ఞుడయిన ధర్మరాజును యుద్ధం నుండి ఉపశమించు మని మాటి మాటికి నివారించే వారెవరు? (3)
వి॥తె॥ ఈ ప్రశ్నను చక్కగా తిక్కన ఇలా మలిచాడు.
ధర్మపుత్రునకిక్కడి తలఁపు భంగి,
యెట్టులుండు? నీ సైన్యంబు లెల్లఁగూడి
యునికి వినియెనే? యెవ్వరిగొని యతండు,
కౌరవుల మీద నెత్తి రాగలుగువాఁడు?
ఉద్యో. 2-168
"అసలా ధర్మరాజు" కౌరవుల మీద ఎవరిని చూసుకొని దండెత్తి వస్తున్నాడు?
సంజయ ఉవాచ
రాజ్ఞో ముఖముదీక్షంతే పాంచాలాః పాండవైస్సహ।
యుధిష్ఠిరస్య భద్రం తే స సర్వాననుశాస్తి చ॥ 4
సంజయుడు సమాధానం చెపుతున్నాడు. రాజా! నీకు శుభమగుగాక - పాండవులతో పాటు పాంచాలురు రాజయిన ధర్మరాజు ఆజ్ఞకోసం అతని ముఖం చూస్తున్నారు. అతడే అందరినీ శాసిస్తున్నాడు. (4)
పృథగ్భూతాః పాండవానాం పంచాలానాం రథవ్రజాః।
ఆయాంతమభినందంతి కుంతీపుత్రం యుధిష్ఠిరమ్॥ 5
యుద్ధానికి వచ్చే యుధిష్ఠిరుని వేర్వేరుగా పాండవుల యొక్కయు, పాంచాలుర యొక్కయు రథాలు అభినందిస్తున్నాయి. (5)
నభః సూర్యమివోద్యంతం కౌంతేయం దీప్తతేజసమ్।
పంచాలాః ప్రతినందంతి తేజోరాశిమివోదితమ్॥ 6
కుంతీపుత్రుడు ఒక పెద్ద తేజోరాశిలా వెలిగిపోతున్నాడు. అతనిని చూసి పాంచాలురు ఆకాశంలో ఉదయించిన సూర్యుడని ప్రశంసిస్తున్నారు. (6)
ఆగోపాలావిపాలాశ్చ నందమానా యుధిష్ఠిరమ్।
పంచాలాః కేకయా మత్స్యాః ప్రతినందంతి పాండవమ్॥ 7
గోపాలురు, గొఱ్ఱెల కాపరులు కూడా ధర్మరాజును అభినందిస్తున్నారు. పాంచాలురు, కేకయులు, మత్స్య దేశస్థులు ధర్మరాజును మెచ్చుకొంటున్నారు. (7)
బ్రాహ్మణ్యో రాజపుత్రశ్చ విశాం దుహితరశ్చ యాః।
క్రీడంతోభిసమాయాంతి పార్థం సన్నద్ధమీక్షితుమ్॥ 8
బ్రాహ్మణ స్త్రీలు, రాజపుత్రికలు, వైశ్యపుత్రికలు యుద్ధానికి సిద్ధమయిన ధర్మరాజును చూడటానికి ఆడుతూ వస్తున్నారు. (8)
ధృతరాష్ట్ర ఉవాచ
సంజయాచక్ష్వ యేనాస్మాన్ పాండవా అభ్యయుంజత।
ధృష్టద్యుమ్నస్య సైన్యేన సోమకానాం బలేన చ॥ 9
అపుడు ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. సంజయా! ఏ సహాయంతో పాండవులు మాతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు? ధృష్టద్యుమ్నుని సైన్యం, పాంచాలుర బలం - ఇంతే కదా! (9)
వైశంపాయన ఉవాచ
గావల్గణిస్తు తత్పృష్టః సభాయాం కురుసంసది।
నిఃశ్వస్య సుభృశం దీర్ఘం ముహుః సంచింతయన్నివ॥ 10
తత్రానిమిత్తతో దైవాత్ సూతం కశ్మలమావిశత్।
తదాచచక్షే విదురః సభాయాం రాజసంసది॥ 11
సంజయోఽయం మహారాజ మూర్ఛితః పతితో భువి।
వాచం న సృజతే కాంచిత్ హీనప్రజ్ఞోఽల్పచేతనః॥ 12
వైశంపాయనుడు చెపుతున్నాడు - కౌరవ సభలో ఇలా అడిగేసరికి సంజయుడు, దీర్ఘంగా నిట్టూర్చి, మళ్లీ ఏదో ఆలోచిస్తున్నట్లు నిష్కారణంగా దైవవశాత్తు మూర్ఛపోయాడు. అపుడు ఆ రాజసభలో విదురుడిట్లా చెప్పసాగాడు. "మహారాజా! ఈ సంజయుడు మూర్ఛపోయి క్రిందపడ్డాడు. అతని నోటివెంట మాట రావటం లేదు స్పృహలేదు. కదలు మొదలు లేదు." (10-12)
ధృతరాష్ట్ర ఉవాచ
అపశ్యత్ సంజయో నూనం కుంతీపుత్రాన్ మహారథాన్।
తైరస్య పురుషవ్యాఘ్రైః భృశముద్వేజితం మనః॥ 13
వెంటనే ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. సంజయుడు కుంతీపుత్రులను నిజంగా మహారథులనుకొన్నాడు. ఆ పురుష సింహులవల్ల వీని మనసు కలత చెందింది. (13)
వైశంపాయన ఉవాచ
సంజయ శ్చేతనాం లబ్ధ్వా ప్రత్యాశ్వస్యేదమబ్రవీత్।
ధృతరాష్ట్రం మహారాజ సభాయాం కురుసంసది॥ 14
వైశంపాయనుడు ఇలా అన్నాడు. ఇంతలో సంజయునికి స్పృహవచ్చింది. అతడు మనసు చిక్కబట్టుకొని కౌరవసభలో ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. (14)
సంజయ ఉవాచ
దృష్టవానస్మి రాజేంద్ర కుంతీపుత్రాన్ మహారథాన్।
మత్స్యరాజ గృహావాస నిరోధేనావకర్శితాన్॥ 15
సంజయుడు ఇలా అన్నాడు. మహారాజా! విరాటుని యింట్లో అజ్ఞాతవాసంతో కృశించి పోయి ఉన్న మహారథులు - కుంతీపుత్రులను చూశాను. (15)
శృణు యైర్హి మహారాజ పాండవా అభ్యయుంజత।
ధృష్టద్యుమ్నేన వీరేణ యుద్ధే వస్తేఽభ్యయుంజత॥ 16
రాజా! విను. పాండవులు ఎవరితో కలిసి యుద్ధానికి వస్తున్నారో చెపుతున్నాను. వీరుడయిన ధృష్టద్యుమ్నునితో కలిసి వారు యుద్ధానికి సిద్ధమయ్యారు. (16)
యో నైవ రోషాన్న భయా న్నలోభాన్నార్థకారణాత్।
న హేతువాదాత్ ధర్మాత్మా సత్యం జహ్యాత్ కదాచన॥ 17
యః ప్రమాణం మహారాజ ధర్మే ధర్మభృతాం వరః।
అజాతశత్రుణా తేన పాండవా అభ్యయుంజత॥ 18
రోషంచేతకాని, భయంచేత కాని, లోభం చేతకాని, ధనంవల్ల కాని, హేతువాదంతో కాని ఆ ధర్మరాజు ఏ సందర్భంలోనూ సత్యం విడిచిపెట్టడు. ధర్మ విషయంలో అతడే ప్రమాణం. ధార్మికులలో అతడు ఉత్తముడు. అటువంటి ధర్మరాజుతో పాండవులు సంసిద్ధులయ్యారు. (17,18)
యస్య బాహుబలే తుల్యః పృథివ్యాం నాస్తి కశ్చన।
యో వై సర్వాన్ మహీపాలాన్ వశే చక్రే ధనుర్ధరః।
యః కాశీ సంగమగధాన్ కలింగాంశ్చ యుధాజయత్॥ 19
తేన వో భీమసేనేన పాండవా అభ్యయుంజత।
బాహుబలంలో ఈ భూమిమీద అతనితో ఎవరూ సాటిరారు. ధనుర్ధారియై రాజులందరినీ తన వశం చేసుకొన్నాడు. యుద్ధంలో కాశీరాజును, అంగరాజును, మగధ, కళింగరాజులను జయించాడు. ఆ భీమునితో కలిసి పాండవులు యుద్ధసన్నద్ధులయ్యారు. (19)
యస్య వీర్యేణ సహసా చత్వారో భువి పాండవాః।
నిః సృత్య జతుగేహాద్ వై హిడింబాత్ పురుషాదకాత్॥ 20
య శ్పైషామభవద్ ద్వీపః కుంతీపుత్రో వృకోదరః।
యాజ్ఞసేనీమథో యత్ర సింధురాజోఽపకృష్ణవాన్॥ 21
తత్రైషామభవద్ ద్వీపః కుంతీపుత్రో వృకోదరః।
యశ్చ తాన్ సంగతాన్ సర్వాన్ పాండవాన్ వారణావతే॥ 22
దహ్యతో మోచయామాస తేన హస్తేఽభ్యయుంజత॥ 23
అతని భుజబలంతోనే పాండవులు నలుగురూ లక్క యింట్లోంచి బయటపడ్డారు. మనుష్య భక్షకుడయిన హిడింబాసురుని బారినుండి పాండవులను అతడే రక్షించాడు. తరువాత సైంధవుడు ద్రౌపదిని అపహరించినపుడు ఈ వృకోదరుడే వారిని రక్షించాడు. వారణావతంలో కాలిపోవలసిన పాండవులను అందరినీ విడిపించాడు. ఆ భీమునితో కలిసి పాండవులు మీ మీదకి వస్తున్నారు. (20-23)
కృష్ణాయాం చరతా ప్రీతిం యేన క్రోధవశా హతాః।
ప్రవిశ్య విషమం ఘోరం పర్వతం గంధమాదనమ్॥ 24
యస్య నాగాయుతై ర్వీర్యం భుజయోః సారమర్పితమ్।
తేన వో భిమసేనేన పాండవా అభ్యయుంజత॥ 25
ద్రౌపదితో కలిసి ప్రియంగా విహరిస్తూ విషమమయిన గంధమాదన పర్వతం మీద క్రోధవశులనే రాక్షసులను చంపాడు. అతని భుజాలకు వేయి ఏనుగుల బలం ఉంది. ఆ భీమసేనునిత్ఫ్ కలిసి పాండవులు మీ మీదకు వస్తున్నారు. (24,25)
కృష్ణద్వితీయో విక్రమ్య తుష్ట్యర్థం జాతవేదసః।
అజయద్ యః పురా వీరః యుధ్యమానం పురందరమ్॥ 26
యః స సాక్షాన్మహాదేవం గిరిశం శూలపాణినమ్।
తోషయామాస యుద్ధేన దేవదేవముమాపతిమ్।
యశ్చ సర్వాన్ వశే చక్రే లోకపాలాన్ ధనుర్ధరః।
తేన వో విజయేనాజౌ పాండవా అభ్యయుంజత॥ 28
అగ్నిహోత్రుని సంతృప్తి పరిచేందుకు కృష్ణుతో కలిసి దేవేంద్రుని కూడ గెలిచిన వీరుడు అర్జునుడు. ఇంద్రునే కాదు సాక్షాత్తు శూలం పట్టిన పరమేశ్వరునే జయించాడు. లోకపాలురందరినీ జయించాడు. అట్టి అర్జునునితో కలిసి పాండవులు మీ మీదికి రానైయున్నారు. (26,27, 28)
యః ప్రతీచీం దిశం చక్రే వశే మ్లేచ్ఛగణాయుతామ్।
స తత్ర నకులో యోద్ధా చిత్రయోధీ వ్యవస్థితః॥ 29
తేన వో దర్శనీయేన వీరేణాతొ ధనుర్భ్యతా।
మాద్రీపుత్రేన కౌరవ్య అభ్యయుంజత॥ 30
మ్లేచ్ఛగణాలతో నిండిన పడమర దిక్కును వశపరచుకొన్నాడు నకులుడు. చిత్రంగా నిలదొక్కుకుని యుద్ధం చేస్తాడు. చూడముచ్చటైనవాడు. విల్లుపట్టిన వీరుడు. అటువంటి నకులునితో కలిసి మీమీదకు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. (29,30)
యః కాశీనంగమగధాన్ కళింగాంశ్చ యుధాజయత్।
తేన వః సహదేవేన పాండవాన్ అభ్యయుంజత॥ 31
కాశీరాజును, అంగరాజును, మగధ కళింగరాజులనూ యుద్ధంలో జయించిన సహదేవునితో కలిసి పాండవులు మీ మీదకు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. (31)
యస్య వీర్యేణ సదృశో చత్వారో భువి మానవాః।
అశ్వత్థామా ధృష్టకేతుః రుక్మీ ప్రద్యుమ్న ఏవ చ॥ 32
తేన వః సహదేవేన యుద్ధం రాజన్ మహాత్యయమ్।
యవీయసా నృవీరేణ మాద్రీనందికరేణ చ॥ 33
అశ్వత్థామ, ధృష్టకేతుడు, రుక్మి, ప్రద్యుమ్నుడు - వీరు నలుగురే ఈ భూమిపైన సహదేవునితో సమాన పరాక్రమం కలవారు. పాండవులలో చిన్నవాడూ, మాద్రి పిన్న కొడుకు అయిన సహదేవునితో మీకు మహావినాశకరమయిన యుద్ధం మహారాజా! (32,33)
తపశ్చచార యా ఘోరం కాశికన్యా పురా సతీ।
భీష్మస్య వధమిచ్ఛంతీ ప్రేత్యాపి భరతర్షభ॥ 34
పాంచాలస్య సుతా జజ్ఞే దైవాచ్చ స పునః పుమాన్।
స్త్రీ పుంసోః పురుషవ్యాఘ్ర యః స వేద గుణాగుణాన్॥ 35
పూర్వం కాశిరాజు పుత్రిక అంబ భీష్ముని వధను కోరి ఘోరమయిన తపస్సు చేసింది. చచ్చి ఆమె ద్రుపదునికి కూతురై పుట్టి దైవవశాత్తు మళ్లీ పురుషుడయింది. అతనికి స్త్రీ పురుషుల గుణదోషాలు తెలుసును. (34,35)
యః కలింగాన్ సమాపేదే పాంచాల్యో యుద్ధదుర్మదః।
శిఖండినా వః కురవః కృతాస్త్రేణాభ్యయుంజత॥ 36
ఆ శిఖండి యుద్ధంలో విజృంభించి కళింగులను జయించాడు కూడ. అదిగో అస్త్ర విద్యానిపుణుడయిన ఆ శిఖండితో పాండవులు మీ మీదికి వస్తున్నారు. (36)
యం యక్షః పురుషం చక్రే భీష్మస్య నిధనేచ్ఛయా।
మహేష్వాసేన రౌద్రేణ పాండవా అభ్యయుంజత॥ 37
భీష్ముని చంపాలని యక్షుడు ఆమెను పురుషునిగా చేశాడు గదా! రౌద్రమయిన ఆ మహాధనుస్సు కల ఆ శిఖండితో కలిసి పాండవులు సంసిద్ధమై ఉన్నారు. (37)
మహేష్వాసా రాజపుత్రా భ్రాతరః పంచ కేకయాః।
ఆముక్తకవచాః శూరాః తైశ్చ వస్తేఽభ్యయుంజత॥ 38
పెద్ద పెద్ద ధనుస్సులూ, కవచాలూ ధరించిన కేకయ రాజకుమారులు అయిదుగురితో పాండవులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. (38)
యో దీర్ఘబాహుః క్షిప్రాస్త్రః ధృతిమాన్ సత్యవిక్రమః।
తేన వో వృష్ణివీరేణ యుయుధానేన సంగరః॥ 39
పొడవైన చేతులతో త్వరత్వరగా బాణాలు వేసే సత్యపరాక్రముడు, ధైర్యశాలి, అయిన వృష్ణివీరుడు సాత్యకితో మీకు యుద్ధం వచ్చింది. (39)
య ఆసీచ్ఛరణం కాలే పాండవానాం మహాత్మనామ్।
రణే తేన విరాటేన భవితా వః సమాగమః॥ 40
మహాత్ములయిన పాండవులకు ఆపత్కాలంలో ఆశ్రయమిచ్చిన విరాట మహారాజుతో మీకు సమాగమం కలుగుతోంది. (40)
యః స కాశిపతీ రాజా వారాణస్యాం మహారథః।
స తేషా మభవద్ యోద్ధా తేన వస్తేఽభ్యయుంజత॥ 41
వారణాసిలో మహారథుడు కాశీరాజు వారి పక్షాన్ యోధుడైనాడు. వానితో కలిసి పాండవులు ఎత్తివస్తున్నారు. (41)
శిశుభి ర్దుర్జయైః సంఖ్యే ద్రౌపదేయైర్మహాత్మభిః।
ఆశీవిష సమస్పర్శైః పాండవా అభ్యయుంజత॥ 42
ద్రౌపది పుత్రులు పసివాళ్లు - అయినా వారినెవరూ జయింపలేరు. పైగా మహాత్ములు. వారి స్పర్శ త్రాచు పాముతో చెలగాటం. అటువంటి ఉపపాండవులతో పాండవులు ఎత్తి వస్తున్నారు. (42)
యః కృష్ణసదృశో వీర్యే యుధిష్ఠిర సమో దమే।
తేనాభిమన్యునా సంఖ్యే పాండవా అభ్యయుంజత॥ 43
పరాక్రమంలో కృష్ణునితోనూ, నిగ్రహంలో ధర్మరాజుతోనూ సమానుడైన అభిమన్యునితో కలిసి పాండవులు ఎత్తి వస్తున్నారు. (43)
యశ్పైవాప్రతిమో వీర్యే ధృష్టకేతు ర్మహాయశాః।
దుస్సహః సమరే క్రుద్ధః శైశుపాలి ర్మహారథః॥ 44
తేన వశ్చేదిరాజేన పాండవా అభ్యయుంజత।
అక్షౌహిణ్యా పరివృతః పాడవాన్ యోఽభిసంశ్రితః॥ 45
పరాక్రమంలో సాటిలేనివాడు, కీర్తిశాలి, యుద్ధంలో కోపిస్తే ఎదురింపరానివాడు, శిశుపాలుని కొడుకు అయిన ధృష్టకేతువు మహారథుడు. అతడు అక్షౌహిణి సేనతో పాండవులను కలిశాడు. వానితో పాండవులు దండెత్తి వస్తున్నారు. (44,45)
యః సంశ్రయః పాండవానాం దేవానామివ వాసవః।
తేన వో వాసుదేవేన పాండవా అభ్యయుంజత॥ 46
దేవతలకు ఇంద్రుని లగా పాండవులకు కృష్ణుడు రక్షకుడు - ఆ వాసుదేవునితో పాండవులు ఎత్తి వస్తున్నారు.(46)
తథా చేదిపతేర్భ్రాతా శరభో భరతర్షభ।
కరకర్షేణ సహితస్తాభ్యాం వస్తేఽభ్యయుంజత॥ 47
భరతవంశోత్తమా! అలాగే చేదిరాజు యొక్క తమ్ముడు శరభుడు తన తమ్ముడు కరకర్షునితో కలిసి ధర్మరాజు పక్షాన చేరాడు. వారిద్దరితో పాండవులు వస్తున్నారు. (47)
జారాసంధిః సహదేవో జయత్సేనశ్చ తావుభౌ।
యుద్ధేఽ ప్రతిరథౌ వీరౌ పాండవార్థే వ్యవస్థితౌ॥ 48
జరాసంధుని కొడుకులు సహదేవుడూ, జయత్సేనుడూ ఇద్దరూ సాటిలేని యుద్ధవీరులు. వీరు పాండవుల కోసం సిద్ధంగా ఉన్నారు. (48)
ద్రుపదశ్చ మహాతేజా బలేన మహాతా వృతః।
త్యక్తాత్మా పాండవార్థాయ యోత్స్యమానో వ్యవస్థితః॥ 49
మహాతేజస్వి ద్రుపదుడు పెద్దసేనతో కలిసి పాండవుల కోసం ప్రాణాలర్పించి అయినా యుద్ధం చేయటానికి సిద్ధమై ఉన్నాడు. (49)
ఏతే చాన్యేచ బహవః ప్రాచ్యోదీచ్యా మహీక్షితః।
శతశో యానుప్రాశిత్య ధర్మరాజో వ్యవస్థితః॥ 50
వీరే కాదు. ఇంకా చాలామంది, తూర్పు, ఉత్తరదేశ మహారాజులు వందల కొద్దీ ధర్మరాజు పక్షాన చేరారు. వారి సహాయంతో ధర్మరాజు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. (50)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి సంజయ వాక్యే పంచాశత్తమోఽధ్యాయ॥ 50 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున సంజయ వాక్యమను ఏబదియవ అధ్యాయము. (50)