34. ముప్పది నాలుగవ అధ్యాయము
విదురుడు నీతి నుపదేశించుట.
ధృతరాష్ట్ర ఉవాచ
జాగ్రతో దహ్యమానస్య యత్ కార్యమనుపశ్యసి।
తద్ బ్రూహి త్వం హి నస్తాత ధర్మార్థకుశలో హ్యసి॥ 1
ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. నాయనా! మనలో నీవు ధర్మార్థాల్లో నిపుణుడవు. నిద్రపట్టక తపించిపోతున్న నాకు నీవనుకుంటున్న కర్తవ్యాన్ని చెప్పు. (1)
త్వం మాం యథావద్ విదుర ప్రశాధి
ప్రజ్ఞాపూర్వం సర్వమజాతశత్రోః।
యన్మన్యసే పథ్యమదీనసత్త్వ
శ్రేయస్కరం బ్రూహి తద్ వై కురూణామ్॥ 2
ఉదార బుద్ధిగల విదురా! బుద్ధిపూర్వకంగా నాకు చెప్పాలనుకొన్న దంతా తప్పకుండా ఉపదేశించు. ధర్మరాజుకు ఏది మేలో, కౌరవులకు శుభాన్ని కలిగించే దేదో, నీవనుకొంటున్నది చెప్పు. (2)
పాపాశంకీ పాపమేవానుపశ్యన్
పృచ్ఛామి త్వాం వ్యాకులేనాత్మనాహమ్।
కవే తన్మే బ్రూహి సర్వం యథావత్
మనీషితం సర్వమజాతశత్రోః॥ 3
కీడును శంకిస్తూ కళ్ళకు కట్టినట్లున్న నాతప్పుల్ని గమనిస్తూ కలవరపడుతున్న మనసుతో, నేను నిన్నడుగుతున్నాను. కాబట్టి అన్నీ తెలిసిన విదురా! అజాతశత్రువు కోరుకొంటున్నదంతా ఉన్నది ఉన్నట్లు నాకు చెప్పు. (3)
విదుర ఉవాచ
శుభం వా యది వా పాపం ద్వేష్యం వా యది వా ప్రియమ్।
అపృష్టస్తస్య తద్ బ్రూయాద్ యస్య నేచ్ఛేత్ పరాభవమ్॥ 4
విదురుడిట్లాఅన్నాడు - మంచో, చెడో, కష్టమో, ఇష్టమో అడగకపోయినా ఎవనిని పరాభవం కూడదని తాను అనుకొంటాడో వాడికి చెప్పాలి. (4)
తస్మాద్ వక్ష్యామి తే రాజన్ హితం యత్ స్యాత్ కురూన్ ప్రతి।
వచః శ్రేయస్కరం ధర్మ్యం బ్రువతస్తన్నిబోధ మే॥ 5
కాబట్టి రాజా! కౌరవులకేది మేలో నీకు చెప్తాను. శుభాన్ని కలిగించే, ధర్మబద్ధమైన నా మాటల్ని విను. (5)
మిథ్యోపేతాని కర్మాణి సిద్ధ్యేయుర్యాని భారత।
అనుపాయప్రయుక్తాని మాస్మ తేషు మనః కృథాః॥ 6
భరతవంశీయుడా! కపటోపాయాలు ప్రయోగించి తాత్కాలికంగా సిద్ధిపొందిన పనులపై మనసుపెట్టకు - (కపటోపాయంతో పొందిన ద్యూతజయం మీద దృష్టి పెట్టకు.) (6)
తథైవ యోగవిహితం యత్ తు కర్మ న సిద్ధ్యతి।
ఉపాయయుక్తం మేధావీ న తత్ర గ్లపయేన్మనః॥ 7
అలాగే జాగరూకతతో, ఉపాయంతో చేసిన పని సిద్ధించనపుడు తెలివైనవాడు మనసు పాడు చేసుకోకూడదు. (7)
అనుబంధానపేక్షేత సానుబంధేషు కర్మసు।
సంప్రధార్య చ కుర్వీత న వేగేన సమాచరేత్॥ 8
సానుబంధములయిన పనుల్లో అనుబంధ ప్రయోజనాన్ని ముందు గుర్తించాలి - నిలదొక్కుకొని ఆలోచించి మరీ చెయ్యాలి - తొందర పడి చేయకూడదు. (8)
అనుబంధం చ సంప్రేక్ష్య విపాకం చైవ కర్మణామ్।
ఉత్థానమాత్మనశ్పైవ ధీరః కుర్వీత వా న వా॥ 9
ధీరుడు(ముందు) అనుబంధప్రయోజనాలను, తదనంతర పరిణామాన్ని, తనకు కలిగే ఉన్నతిని బాగా ఆలోచించి ఆ పనిని చెయ్యవచ్చు. చెయ్యకపోనూవచ్చు. (9)
యః ప్రమాణం న జానాతి స్థానే వృద్ధౌ తథా క్షయే।
కోశే జనపదే దండే న స రాజ్యేఽవతిష్ఠతే॥ 10
కోట, లాభనష్టాలు, ధనాగారం, దేశం, దండనల స్థాయి ఎలా ఉందో తెలుసుకోలేని వాడు రాజ్యంలో(అధికారంలో) స్థిరంగా ఉండలేడు. (10)
యస్త్వేతాని ప్రమాణాని యథోక్తాన్యనుపశ్యతి।
యుక్తో ధర్మార్థయోర్ జ్ఞానే స రాజ్యమధిగచ్ఛతి॥ 11
ఇలా వీటి స్థాయిలను చక్కగా గుర్తించినవాడు ధర్మార్థ జ్ఞానంలో మనసు నిలిపి రాజ్యాన్ని పొందుతాడు. (11)
న రాజ్యం ప్రాప్తమిత్యేన వర్తితవ్యమసాంప్రతమ్।
శ్రియం హ్యవినయో హంతి జరా రూపమివోత్తమమ్॥ 12
రాజ్యం దక్కింది గదా అని తగని విధంగా నడుచుకోకూడదు. ముసలితనం రూపాన్ని కమ్మేసినట్లు మిడిసిపాటు సంపదను నశింపచేస్తుంది. (12)
భక్ష్యోత్తమప్రతిచ్ఛన్నం మత్స్యో బడిశమాయసమ్।
లోభాభిపాతో గ్రసతే నానుబంధమవేక్షతే॥ 13
చేప చక్కని తినుబండారంలాగా కనపడే ఇనుపగాలాన్ని దురాశకు లోనై మింగుతుంది. దానివల్ల జరుగబోయే అనుబంధాన్ని/కీడును గమనించదు. (13)
యచ్ఛక్యం గ్రసితుం గ్రస్యం గ్రస్తం పరిణమేచ్చ యత్।
హితం చ పరిణామే యత్ తదాద్యం భూతి మిచ్ఛతా॥ 14
తినటానికి వీలైనదే తినాలి, తింటే జీర్ణమయ్యేదే తినాలి. జీర్ణమైన తర్వాత మేలు చేసే దాన్నే, తినాలి. (14)
వనస్పతేరపక్వాని ఫలాని ప్రచినోతి యః।
స నాప్నోతి రసం తేభ్యః బీజం చాస్య వినశ్యతి॥ 15
చెట్టునుండి పండని పళ్లు కోసుకొనేవాడు వాటి నుండి రసాన్ని పొందలేడు సరిగదా దాని విత్తనమ్ కూడా నశిస్తుంది. (15)
యస్తు పక్వముపాదత్తే కాలే పరిణతం ఫలమ్।
ఫలాద్ రసం స లభతే బీజాచ్పైవ ఫలం పునః॥ 16
చక్కగా కాలపక్వమయిన పండు తిన్నవాడు పండునుండి రసాన్ని పొందుతాడు. దాని విత్తనం నుండి మళ్ళీ పండునూ పొందగలుగుతాడు. (16)
యథా మధు సమాదత్తే రక్షన్ పుష్పాణి షట్పదః।
తద్వదర్థాన్ మనుష్యేభ్యః ఆదద్యాదవిహింసయా॥ 17
పూలు కందకుండా తుమ్మెద తేనెను గ్రహించినట్లు మనుష్యుల్ని బాధించకుండా రాజు సంపదలను గ్రహించాలి. (17)
పుష్పం పుష్పం విచిన్వీత మూలచ్ఛేదం న కారయేత్।
మాలాకార ఇవారామే న యథాంగారకారకః॥ 18
పూలదండలు కట్టేవానిలాగా తోటలో ఒక్కొక్క పువ్వునీ, పువ్వునీ పోగుచేసుకోవాలి. (చెట్లు తగలబెట్టి) బొగ్గు తయారు చేసే వానిలా మొదలంట నరకకూడదు. (18)
కిన్ను మే స్యాదిదం కృత్వా కిన్ను మే స్యాదకుర్వతః।
ఇతి కర్మాణి సంచింత్య కుర్యాద్ వా పురుషో న వా॥ 19
మానవుడు "ఇది చేస్తే నాకేమౌతుంది. చెయ్యకపోతే ఏమౌతుంది?" అని బాగా ఆలోచించి పనులు చెయ్యవచ్చు. మానుకోవచ్చు. (19)
అనారభ్యాః భవంత్యర్థాః కేచిన్నిత్యం తథాగతాః।
కృతః పురుషకారో హి భవేద్ యేషు నిరర్థకః॥ 20
ఎప్పటికీ ఫలించని పనులు మొదలుపెట్టకూడదు. వాటి కోసం చేసిన పురుష(మానవ) ప్రయత్నం వ్యర్థమౌతోంది. కదా! (20)
ప్రసాదో నిష్ఫలో యస్య క్రోధశ్చాపి నిరర్థకః।
న తం భర్తారమిచ్ఛంతి షండం పతిమివ స్త్రియః॥ 21
స్త్రీలు నపుంసకుణ్ణి భర్తగా ఇష్టపడనట్లు ఫలించని అనుగ్రహమూమ్ వ్యర్థమయ్యే కోపమూ కలవాడిని ప్రజలు ప్రభువుగా ఇష్టపడరు. (21)
కాంశ్చిదర్థాన్ నరః ప్రాజ్ఞః లఘుమూలాన్ మహాఫలాన్।
క్షిప్రమారభతే కర్తుం న విఘ్నయతి తాదృశాన్॥ 22
తెలివిగల మానవుడు ప్రయత్నం తక్కువ, ఫలితం ఎక్కువ గల పనుల్ని వెంటనే మొదలుపెడతాడు. అలాంటివాటికి ఆటంకం రానీయడు. (22)
ఋజు పశ్యతి యః సర్వం చక్షుషా ను పిబన్నివ।
ఆసీనమపి తూష్ణీకమ్ అనురజ్యంతి తం ప్రజాః॥ 23
రాజు అందరినీ కంటితో ఆస్వాదిస్తున్నట్లు సమానంగా చూస్తే, ఊరకే కూర్చున్న ప్రజలు అతని పట్ల అనురాగం కలిగి ఉంటారు. (23)
సుపుష్పితః స్యాదఫలః ఫలితః స్యాద్ దురారుహః।
అపక్వః పక్వసంకాశః న తు శీర్యేత కర్హిచిత్॥ 24
బాగాపూచినా పండ్లులేని చెట్టులాంటి వాడవ్వాలి. పండ్లున్నా ఎక్కటానికి వీలుపడని చెట్టులాంటి వాడవ్వాలి. పచ్చిగా ఉన్నా పండిన(చెట్టులాంటి)వాడవ్వాలి. ఇలా చేస్తే రాజు ఎన్నటికీ శిథిలం కాడు. (కృశించిపోడు). (24)
చక్షుషా మనసా వాచా కర్మణా చ చతుర్విధమ్।
ప్రసాదయతి యో లోకం తం లోకోఽనుప్రసీదతి॥ 25
చూపుతో, మనస్సుతో, మాటతో, పనితో నాలుగు విధాలుగాను లోకాన్ని(ప్రజలను) ఆకట్టుకోగలిగే వానిని లోకం అనుగ్రహిస్తుంది. (25)
యస్మాత్ త్రస్యంతి భూతాని మృగవ్యాధాన్మృగా ఇవ।
సాగరాంతామపి మహీం లబ్ధ్వా స పరిహీయతే॥ 26
వేటాడే బోయవాడికి మృగాలు బెదిరినట్లు ప్రాణులన్నీ ఎవడికి భయపడతాయో, అతడు, సముద్రం హద్దుగా గల భూమినంతా చేజిక్కించుకొన్నా(ప్రజలచే) నామ రూపాల్లేని వాడౌతాడు. (26)
పితృపైతామహం రాజ్యం ప్రాప్తవాన్ స్వేన కర్మణా।
వాయురభ్రమివాసాద్య భ్రంశయత్యనయే స్థితః॥ 27
తండ్రితాతల నుండి సంక్రమించిన రాజ్యాన్ని, అవినీతి పరుడు తన చేష్టలవల్ల, గాలి మబ్బును చెదరగొట్టినట్లు, చేజార్చుకుంటాడు. (27)
ధర్మమాచరతో రాజ్ఞః సద్భిశ్చరితమాదితః।
వసుధా వసుసంపూర్ణా వర్ధతే భూతివర్ధినీ॥ 28
సజ్జనులచే మొదటినుండి ఆచరించబడుతున్న ధర్మాన్ని ఆచరించే రాజుకు, సంపదలతో నిండినదై భూమి పెంపొందుతుంది. అతడు ఐశ్వర్యాన్ని పెంచుతుంది. (28)
అథ సంత్యజతో ధర్మమ్ అధర్మం చానుతిష్ఠతః।
ప్రతిసంవేష్టతే భూమిః అగ్నౌ చర్మాహితం యథా॥ 29
ధర్మాన్ని విడనాడి అధర్మాన్ని ఆచరించే రాజు యొక్క భూమి నిప్పులో వెయ్యబడ్డ తోలులా ముడుచుకుపోతుంది. (29)
య ఏవ యత్నః క్రియతే పరరాష్ట్రవిమర్దనే।
స ఏవ యత్నః కర్తవ్యః స్వరాష్ట్రపరిపాలనే॥ 30
శత్రుదేశాల నణచటంలో ప్రయత్నించినట్లే, తన దేశాన్ని పరిపాలించటంలో కూడా ప్రయత్నం చెయ్యాలి. (30)
ధర్మేణ రాజ్యం విందేత ధర్మేణ పరిపాలయేత్।
ధర్మమూలాం శ్రియం ప్రాప్య న జహాతి న హీయతే॥ 31
ధర్మంతో రాజ్యాన్ని పొందాలి. ధర్మంతో పరిపాలించాలి. ధర్మాన్ని ఆధారంగా చేసుకుంటే లభించిన సంపద విడిచిపెట్టదు. తరిగిపోదు. (31)
అప్యున్మత్తాత్ ప్రలపతః బాలాచ్చ పరిజల్పతః।
సర్వతః సారమాదద్యాద్ అశ్మభ్య ఇవ కాంచనమ్॥ 32
నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న పిచ్చివాడి నుండి అయినా, అలాగే పొంతన లేకుండా వాగే బాలుడినుండి అయినా, రాళ్ళనుండి బంగారాన్ని లాగినట్లు(సారాన్ని) గ్రహించాలి. (32)
సువ్యాహృతాని సూక్తాని సుకృతాని తతస్తతః।
సంచిన్వన్ ధీర ఆసీత శిలాహారీ శిలం యథా॥ 33
చక్కగా చెప్పిన సూక్తుల్ని, మంచి పనుల్ని ఆయా వ్యక్తులనుండి సందర్భాలనుండి పరిగ ఏరుకొని తినేవాడిలా సేకరించుకొంటూ ఉండాలి. (33)
శిలాహారీ = కణిశ భోజీ(దేవ)
గంధేన గావః పశ్యంతి వేదైః పశ్యంతి బ్రాహ్మణాః।
చారైః పశ్యంతి రాజానః చక్షుర్భ్యామితరే జనాః॥ 34
పశువులు వాసనతో గ్రహిస్తాయి. బ్రాహ్మణులు వేదాలతో చూస్తారు. రాజులు గూఢచారులతోను, ఇతర జనులు కేవలం కళ్లతోను చూస్తారు. (34)
భూయాంసం లభతే క్లేశం యా గౌర్భవతి దుర్దుహా।
అథ యా సుదుహా రాజన్ నైవ తాం వితుదంత్యపి॥ 35
పాలు పితకనివ్వని ఆవు ఎన్నో యాతనలు పడుతుంది. రాజా! తేలికగా పాలిచ్చే ఆవును ఎంత మాత్రమూ బాధించరు. (35)
యదతప్తం ప్రణమతి న తత్ సంతాపయంత్యపి।
యచ్చ స్వయం నతం దారు న తత్ సంనమయంత్యపి॥ 36
కాల్చకుండా వంగేదాన్ని మంటలో కాల్చరు. తనకు తానుగా వంగిన కొయ్యనూ వంచరు. (36)
ఏతయోపమయా ధీరః సంనమేత బలీయసే।
ఇంద్రాయ స ప్రణమతే నమతే యో బలీయసే॥ 37
ఈ పోలిక ననుసరించి ధీరుడు బలవంతుడి ఎదుట వంగాలి. బలవంతుడికి తలవంచేవాడు ఇంద్రుడికి నమస్కరిస్తున్నట్లే. (37)
పర్జన్యనాథాః పశవః రాజానః మంత్రిబాంధవాః।
పతయో బాంధవాః స్త్రీణాం బ్రాహ్మణాః వేదబాంధవాః॥ 38
పశువులకు మేఘుడు రక్షకుడు. రాజులకు మంత్రులే చుట్టాలు. స్త్రీలకు భర్తలే బంధువులు, బ్రాహ్మణులకు వేదాలే చుట్టాలు. (38)
సత్యేన రక్ష్యతే ధర్మః విద్యా యోగేన రక్ష్యతే।
మృజయా రక్ష్యతే రూపం కులం వృత్తేన రక్ష్యతే॥ 40
సత్యం చేత ధర్మం కాపాడుబడుతుంది. విద్య యోగం (ఏకాగ్రత, అభ్యాసం) చేత కాపాడబడుతుంది. శుభ్రపరచుకోవటం చేత అందమైన రూపం కాపాడబడుతుంది. కులం, (వంశం) మంచి నడవడిచేత కాపాడబడుతుంది. (39)
మానేన రక్ష్యతే ధాన్యం అశ్వాన్ రక్షత్యనుక్రమః।
అభీక్ష్ణదర్శనం గాశ్చ స్త్రియో రక్ష్యాః కుచేలతః॥ 40
కొలతచే ధాన్యం కాపాడబడుతుంది. వెంబడింపు గుర్రాల్ని కాపాడుతుంది. మాటీమాటికి చూచుకోవటం వల్ల ఆవులు, మలినవస్త్రాల వల్ల స్త్రీలు కాపాడబడుతారు. (40)
న కులం వృత్తహీనస్య ప్రమాణమితి మే మతిః।
అంతేష్వసి హి జాతానాం వృత్తమేవ విశిష్యతే॥ 41
సత్ప్రవర్తన లేనివాడికి కులం మాన్యత నియ్యదని నా అభిప్రాయం. తక్కువ కులంలో పుట్టినవాళ్ళకైనా సత్ప్రవర్తనే విలువనిస్తుంది. (41)
య ఈర్షుః పరవిత్తేషు రూపే వీర్యే కులాన్వయే।
సుఖసౌభాగ్య సత్కారే తస్య వ్యాధిరనంతకః॥ 42
ఇతరుల ధనానికీ, అందచందాలకూ, బలానికీ, వంశగౌరవానికీ, సుఖానికీ, అదృష్టానికీ గౌరవానికి ఓర్చుకోలేని వాని రోగానికి అంతులేదు. (42)
అకార్యకరణాద్ భీతః కార్యాణాం చ వివర్జనాత్।
అకాలే మంత్రభేదాచ్చ యేన మాద్యేన్న తత్ పిబేత్॥ 43
మద్యం త్రాగిన వాళ్ళు చెయ్యకూడని పనులు చేస్తారు. చేయవలసిన పనులను విడుస్తారు. పనికాక ముందే ఆలోచనను బయటపెడతారు. అందువలన మత్తెక్కించే వాటిని తాగకూడదు. (43)
విద్యామదో ధనమదః తృతీయోఽభిజనో మదః।
మదా ఏతేఽవలిప్తానాం ఏత ఏవ సతాం దమాః॥ 44
విద్యామదం, ధనమదం, వంశమదం, ఈ మూడూ పొగరుబోతు జనులకు మదములౌతాయి. ఈ మూడే సజ్జనులకు దమము(మనస్సును అదుపు చేయు సాధనములు0 లౌతాయి. (44)
అసంతోఽభ్యర్థితాః సద్భిః క్వచిత్కార్యే కదాచన।
మన్యంతే సంతమాత్మానమ్ అసంతమపి విశ్రుతమ్॥ 45
ఒకప్పుడు ఏదో పనికై మంచివారు దుర్జనులను సాయమడుగుతారు. దానివల్ల ఏమాత్రం సజ్జనులకు ఉపకారం జరగకపోయినా చెడ్డవాళ్ళు, (చెడ్డవారుగా ప్రసిద్ధమైన) తమను మంచివారుగా భావిస్తారు. (45)
గతిరాత్మవతాం సంతః సంత ఏవ సతాం గతిః।
అసతాం చ గతిః సంతః న త్వసంతః సతాం గతిః॥ 46
బుద్ధి(ఆత్మ) మంతులకు మంచివారు దిక్కు. మంచివారే మంచివారికి గతి. చెడ్డవారికీ మంచి వారే దిక్కు. చెడ్డవారు మాత్రం మంచివారికి దిక్కు కానేకారు. (46)
జితా సభా వస్త్రవతా మిష్టాశా గోమతా జితా।
అధ్వా జితో యానవతా సర్వం శీలవతా జితమ్॥ 47
చక్కని దుస్తులు గలవాడు సభలో జయించి రాణిస్తాడు. గోవులు కలవాడు తిండి ఆశను జయిస్తాడు. వాహనం కలవాడు మార్గాన్ని జయిస్తాడు. సత్ప్రవర్తన కలవాడు సర్వమూ గెలుస్తాడు. (47)
శీలం ప్రధానం పురుషే తద్యస్యేహ ప్రణశ్యతి।
న తస్య జీవితేనార్థో న ధనేన న బంధుభిః॥ 48
వ్యక్తికి శీలం (సత్ప్రవర్తన) చాలా ముఖ్యమైంది. ఈ లోకంలో అది లేని వాడికి జీవితంలో, డబ్బుతో, బంధువులతో ప్రయోజనమే లేదు. (48)
ఆఢ్యానాం మాంసపరమం మధ్యానాం గోరసోత్తరమ్।
తైలోత్తరం దరిద్రాణాం భోజనం భరతర్షభ॥ 49
భరతవంశోత్తమా! ధనవంతుల భోజనంలో మాంసం ప్రధానమైంది. మధ్యతరగతి వారి భోజనంలో పాలు, నెయ్యి మొదలైనవి, దరిద్రుల భోజనంలో నూనె ప్రాధాన్యం వహిస్తాయి. (49)
సంపన్నతరమేవాన్నం దరిద్రా భుంజతే సదా।
క్షుత్ స్వాదుతాం జనయతి సా చాఢ్యేషు సుదుర్లభా॥ 50
పేదవాళ్ళెప్పుడూ రుచికరమైన భోజనమే చేస్తూంటారు. ఆకలి రుచిని పుట్టిస్తుంది. అటువంటి ఆకలి ధనవంతులకు లభించటం చాలా కష్టం. (50)
ప్రాయేణ శ్రీమతాం లోక్ఱ్ భోక్తుం శక్తిర్న విద్యతే।
జీర్యంత్యపి హి కాష్ఠాని దరిద్రాణాం మహీపతే॥ 51
రాజా! సాధారణంగా లోకంలో ధనవంతులకు తినే శక్తి ఉండదు. దరిద్రులకు కట్టెలు కూడా జిర్ణమౌతాయి. (51)
అవృత్తిర్భయమంత్యానాం మధ్యానాం మరణాద్ భయమ్।
ఉత్తమానాం తు మర్త్యానాం అవమానాత్ పరం భయమ్॥ 52
మానవులలో అధములకు బ్రతుకు తెరువులేకపోతే భయం కలుగుతుంది. మధ్యములకు చావువల్ల భయం కలుగుతుంది. ఉత్తములకు అవమానం వల్ల ఎంతో భయం కలుగుతుంది. (52)
ఐశ్వర్యమదపాపిష్ఠాః మదాః పానమదాదయః।
ఐశ్వర్యమదమత్తో హి నాపతిత్వా విబుధ్యతే॥ 53
త్రాగుడు వల్ల మదం కలుగుతుంది. మదాలలో చాలా నిందించ తగ్గది ఐశ్వర్యమదం. ఐశ్వర్యమదంతో మత్తెక్కినవాడు పతనమైనాక గాని తెలుసుకోలేడు. (ఐశ్వర్యమదం పాపిష్ఠం అని భావం.) (53)
ఇంద్రియైరింద్రియార్థేషు వర్తమానైరనిగ్రహైః।
తైరయం తాప్యతే లోకః నక్షత్రాణి గ్రహైరివ॥ 54
గ్రహాలచేత నక్షత్రాల్లాగా, అదుపులేక విషయాల్లో తిరిగే ఇంద్రియాలచేత ఈ లోకం కాల్చబడుతుంది. (54)
యో జితః పంచవర్గేణ సహజేనాత్మకర్షిణా।
ఆపదస్తస్య వర్ధంతే శుక్లపక్ష ఇవోడురాట్॥ 55
తనతో పాటు పుట్టి తనను వశపరచుకొనే పంచేంద్రియాలనూ జయించని వానికి శుక్లపక్షంలో చంద్రుని వలె ఆపదలు వృద్ధిచెందుతాయి. (55)
అవిజిత్య య ఆత్మానం అమాత్యాన్ విజిగీషతే।
అమిత్రాన్ వా జితామాత్యః సోఽవశః పరిహీయతే॥ 56
ఇంద్రియాలనూ, మనసునూ గెలవక మంత్రులను జయించాలనుకొనేవాడూ, మంత్రులను జయించకుండా శత్రువులను జయించా లనుకొనేవాడూ అవశుడై భ్రష్టుడవౌతాడు. (56)
ఆత్మానమేవ ప్రథమం ద్వేష్యరూపేణ యోజయేత్।
తతోఽమాత్యానమిత్రాంశ్చ న మోఘం విజిగీషతే॥ 57
మొదట ఇంద్రియాలనూ, మనస్సునూ శత్రువుగా తలచి జయించినవాడు తరువాత మంత్రులను, శత్రువులను జయించాలనుకొంటే, ఆ కోరిక వ్యర్థం కాదు. (57)
వస్యేంద్రియం జితాత్మానం ధృతదండం వికారిషు।
పరీక్ష్యకారిణం ధీరం అత్యంతం శ్రీర్నిషేవతే॥ 58
ఇంద్రియాలను అదుపు చేసుకొన్న వాణ్ణి, మనస్సును గెలిచినవాణ్ణి, విరుద్ధములైన పనులు చేసేవారిని దండించే వాణ్ణి; పరీక్షించి పనులు చేసేవాణ్ణి, పరిస్థితులకు మారని ధీరుని లక్ష్మి(సంపద) వదలకుండా సేవిస్తుంది. (58)
రథం శరీరం పురుషస్య రాజన్
ఆత్మా నియంతేంద్రియాణ్యస్య చాశ్వాః।
తైరప్రమత్తః కుశలీ సదశ్వైః।
దాంతైః సుఖం యాతి రథీవ ధీరః॥ 59
రాజా! మనుష్యుడి శరీరం రథం, ఆత్మ(బుద్ధి) సారథి. ఆ రథానికి గుర్రాలు ఇంద్రియాలు. జాగరూకతతో నిపుణుడైన ధీరుడు తనకు వశమైన ఆ గుర్రాలతో రథికుడి వలె సుఖంగా ప్రయాణిస్తాడు. (59)
ఏతాన్యనిగృహీతాని వ్యాపాదయితుమప్యలమ్।
అవిధేయా ఇవాదాంతాః హయాః పథి కుసారథిమ్॥ 60
శిక్షణపొందని, అదుపులోకిరాని గుర్రాలు మూర్ఖుడైన సారథిని మార్గమధ్యంలో కూలదోసినట్లు అదుపుచేయబడని ఈ ఇంద్రియాలు, మనస్సూ మానవుని చంపివేయగలవు. (60)
అనర్థమర్థతః పశ్యన్ అర్థం చైవాప్యనర్థతః।
ఇంద్రియైరజితైర్బాలః సుదుఃఖం మన్యతే సుఖమ్॥ 61
ఇంద్రియాలపై అదుపులేని మూర్ఖుడు అర్థంనుండి అనర్థాన్ని, అనర్థంనుండి ప్రయోజనాన్ని చూస్తూ ఎంతో దుఃఖాన్ని సుఖంగా తలుస్తాడు. (61)
ధర్మార్థౌ యః పరిత్యజ్య స్యాదింద్రియవశానుగః।
శ్రీ ప్రాణధనదారేభ్యః క్షిప్రం స పరిహీయతే॥ 62
ధర్మాన్ని, అర్థాన్ని విడిచి ఇంద్రియాలకు లొంగిపోయినవాడు త్వరలో సంపద, ప్రాణం, డబ్బు, భార్య వీనిని కోల్పోతాడు. (62)
అర్థానామీశ్వరో యః స్యాద్ ఇంద్రియాణా మనీశ్వరః।
ఇంద్రియాణా మనైశ్వర్యాద్ ఐశ్వర్యాద్ భ్రశ్యతే హి సః॥ 63
ఎంత ధనవంతుడయినా ఇంద్రియాలపై పట్టు లేనివాడు, ఇంద్రిఉయాలపై అదుపులేని కారణంగా ఐశ్వర్యం నుండి భ్రష్టుడౌతాడు. (63)
ఆత్మనాత్మానమన్విచ్ఛేత్ మనో బుద్ధీంద్రియైర్యతైః।
ఆత్మాహ్యేవాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః॥ 64
అదుపుగల మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో, తనకు తానుగా తన ఆత్మను పొందాలి. తనకు తానే చుట్టం. తనకు తానే శత్రువు. (64)
బంధురాత్మాత్మనస్తస్య యేనైవాత్మాత్మనా జితః।
స ఏవ నియతో బంధుః స ఏవానియతో రిపుః॥ 65
బుద్ధి చేత ఆత్మను జయిస్తే, అతడికి ఆత్మయే బంధువు. అదుపు ఉంటే ఆత్మే బంధువు, అదుపు లేకపోతే ఆత్మే శత్రువు. (65)
క్షుద్రాక్షేణేవ జాలేన ఝుషావపిహితావురూ।
కామశ్చ రాజన్ క్రోధశ్చ తౌ ప్రజ్ఞానం విలుంపతః॥ 66
రాజా! రెండు పెద్దచేపలు సన్నని చిల్లులు గల వలచే కప్పబడి దానిని ఎలా కొరుకుతాయో, కామక్రోధాలు రెండూ అలాగే (అదుపు చెయ్యబడక) వివేకాన్ని లోపింప చేస్తాయి. (66)
సమవేక్ష్యేహ ధర్మార్థౌ సంభారాన్ యోఽధిగచ్ఛతి।
స వై సంభృతసంభారః సతతం సుఖమేధతే॥ 67
ఈ లోకంలో ధర్మాన్ని, అర్థాన్ని చక్కగా గుర్తించి విజయానికి కావలసిన సామగ్రిని సేకరించుకున్న వాడెప్పుడూ సుఖంగా అభివృద్ధి చెందుతాడు. (67)
యః పంచాభ్యంతరాన్ శత్రూన్ అవిజిత్య మనోమయాన్।
జిగీషతి రిపూనన్యాన్ రిపవోఽభిభవంతి తమ్॥ 68
మనస్సుకు ప్రతిరూపాలైన ఐదు ఇంద్రియా లనే లోపలి శత్రువులను గెలవకుండా, ఇతర శత్రువుల్ని జయించాలనుకొనేవాడిని శత్రువులు అణగ్రద్రొక్కేస్తారు. (68)
దృశ్యంతే హి మహాత్మానః బధ్యమానాః స్వకర్మభిః।
ఇంద్రియాణామనీశత్వాద్ రాజానో రాజ్యవిభ్రమైః॥ 69
ఇంద్రియాలపై అదుపులేక రాజభోగాలతో రాజులు, తమ కర్మలచేత బంధింపబడి కనిపిస్తున్నారు గదా! (69)
అసంత్యాగాత్ పాపకృతామపాపాం
స్తుల్యో దండః స్పృశతే మిశ్రభావాత్।
శుష్కేణార్ద్రం దహ్యతే మిశ్రభావాత్
తస్మాత్ పాపైః సహ సంధిం న కుర్యాత్॥ 70
పాపపు పనులు చేసే వాళ్ళతో కలియడం వల్ల పాపం చెయ్యనివారికి, చేసిన వారితో సమానమైన శిక్స్జే పడుతోంది. కలయిక చేత ఎండుకట్టెతో తడికట్టె కూడా కాల్చబడుతుంది. అందువల్ల పాపులతో చెలిమి(కలయిక) చెయ్యకూడదు. (70)
నిజానుత్పతతః శత్రూన్ పంచ పంచ ప్రయోజనాన్।
యో మోహాన్న నిగృహ్ణాతి తమాపద్ గ్రసతే నరమ్॥ 71
(శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధములనే) ఐదు విషయాలను ప్రయోజనాలుగా చేసుకొన్న, ఎగిరిపడే, తన ఐదుగురు శత్రువులను (ఇంద్రియములను) మోహంతో అదుపు చేసుకోణి మానవుని ఆపద మింగేస్తుంది. (71)
అనసూయార్జవం శౌచం సంతోషః ప్రియవాదితా।
దమః సత్యమనాయాసః న భవంతి దురాత్మనామ్॥ 72
1) అసూయ లేకపోవడం, 2) సరళ స్వభావం, 3) పవిత్రత, 4) తృప్తి, 5)ప్రియంగా మాట్లాడటం, 6) ఇంద్రియాల నణచుకోవటం, 7) నిజం పలకటం, 8) చంచలత లేకపోవటం అనేవి (ఎనిమిది) దురాత్ములకు కలగవు. (72)
ఆత్మజ్ఞానమసంరంభః తితిక్షా ధర్మనిత్యతా।
వాక్ చైవ గుప్తా దానం చ నైతాన్యంత్యేషు భారత॥ 73
భరతవంశీయుడా! ఆత్మజ్ఞానం, స్థిరత్వం, ఓర్పు, ధర్మ పరాయణత్వం, మాటను రక్షించుకోవటం, దానం చెయ్యటం అధముల్లో ఉండవు. (73)
ఆక్రోశపరివాదాభ్యాం విహింసంత్యబుధా బుధాన్।
వక్తా పాపముపాదత్తే క్షమమాణో విముచ్యతే॥ 74
మూర్ఖులు పండితులను తిట్లతో, నిందలతో హింసిస్తూ ఉంటారు. నిందించే వాడు పాపాన్ని మూటగట్టుకొంటాడు. క్షమించే వాడు పాపంనుండి విముక్తుడౌతాడు. (74)
హింసా బలమసాధూనాం రాజ్ఞాం దండవిధిర్బలమ్।
శుశ్రూషా తు బలం స్త్రీణాం క్షమా గుణవతాం బలమ్॥ 75
చెడ్డవారికి హింసయే బలం. రాజులకు బలం (అపరాధులకు) తగిన శిక్ష విధించటం. స్త్రీలకు బలం సేవ చెయ్యటం. గుణవంతులకు బలం సహనం. (75)
వాక్సంయమో హి నృపతే సుదుష్కరతమో మతః।
అర్థవచ్చ విచిత్రం చ న శక్యం బహు భాషితుమ్॥ 76
రాజా! మాటను అదుపు చేసుకోవటం చాలా కష్టమనిపిస్తోంది. అర్థవంతంగా, చమత్కారంగా ఎక్కువ మాట్లాడటం సాధ్యం కాదు. (76)
అభ్యావహతి కళ్యాణం వివిధం వాక్ సుభాషితా।
సైవ దుర్భాషితా రాజన్ అనర్థాయోపపద్యతే॥ 77
రాజా! చక్కగా మాట్లాడిన మాట అనేక విధాల శుభాన్ని చేకూరుస్తుంది. ఆ మాటే చెడుగా పలికితే అనర్థాలకు దారితీస్తుంది. (77)
రోహతే సాయకైర్విద్ధం వనం పరశునా హతమ్।
వాచా దురుక్తం బీభత్సం న సంరోహతి వాఖ్ క్షతమ్॥ 78
బాణాలతో, గొడ్డలితో నరుకబడ్డ వనం మళ్లీ మొలకెత్తుతుంది కాని పరుషవాక్కుల గాయం మానదు. (78)
కర్ణినాలీకనారాచాన్ నిర్హరంతి శరీరతః।
వాక్శల్యస్తు న నిర్హర్తుం శక్యో హృదిశయో హి సః॥ 79
కర్ణి, నాలీక, నారాచా లను బాణాల్ని శరీరం నుండి బయటకు లాగగలుగుతారు కాని మాట అనే బాణం బయటకు లాగటానికి కుదరదు. అది హృదయంలో ఇరుక్కొంటుంది గదా! (79)
వాక్సాయకా వదనాన్నిష్పతంతి
యైరాహతః శోచతి రాత్ర్యహాని।
పరస్య న మర్మసు తే పతంతి
తాన్ పండితో నావసృజేత్ పరేభ్యః॥ 80
మాటలనే భాణాలు నోటినుండి వెలువడుతాయి. అవి ఇతరుల మర్మస్థానాలలో గుచ్చుకొంటాయి. గుచ్చుకొన్నవాడు రాత్రింబవళ్ళు కుమిలిపోతాడు. అందుచేత వాటిని పండితుడు ఇతరులపై ప్రయోగించరాదు. (80)
యస్మై దేవాః ప్రయచ్ఛంతి పురుషాయ పరాభవమ్।
బుద్ధిం తస్యాపకర్షంతి సోఽవాచీవాని పశ్యతి॥ 81
దేవతలు అవమానం కలిగించాలనుకొన్నవాడి బుద్ధిని క్రిందికి లాగేస్తారు - అపుడు వాడు నీచమైన పనుల మీద దృష్టి నిలుపుతాడు. (81)
బుద్ధౌ కలుషభూతాయాం వినాశే ప్రత్యుపస్థితే।
అనయో నయసంకాశః హృదయాన్నాపసర్పతి॥ 82
వినాశం దాపురించినప్పుడు, బుద్ధి పాడై పోయి. న్యాయంలా అనిపించే అన్యాయం హృదయంలోంచి తొలగిపోదు. (82)
సేయం బుద్ధిః పరీతా తే పుత్రాణాం భరతర్షభ।
పాండవానాం విరోధేన న చైనానవబుధ్యసే॥ 83
భరతవంశోత్తమా! నీకొడుకుల బుద్ధి పాండవుల మీద విరోధంతో నిండి ఉంది. వారిని సరిగా గుర్తించలేకపోతున్నావు. (83)
రాజా లక్షణసంపన్నః త్రైలోక్యస్యాపి యో భవేత్।
శిష్యస్తే శాసితా సోఽస్తు ధృతరాష్ట్ర యుధిష్ఠిరః॥ 84
ధృతరాష్ట్రా! రాజలక్షణాలతో నిండినవాడు, మూడు లోకాలకు రాజు కావలసినవాడు నీ ఆజ్ఞను పాటించే వాడు అగు యుధిష్ఠిరుడు రాజగుగాక! (84)
అతీత్య సర్వాన్ పుత్రాంస్తే భాగధేయపురస్కృతః।
తేజసా ప్రజ్ఞయా చైవ యుక్తో ధర్మార్థతత్త్వవిత్॥ 85
అతడు ధర్మార్థముల యథార్థ స్వరూపం తెలిసినవాడు, తేజస్సుతో, బుద్ధితో కూడినవాడు, అదృష్టవంతుడు, నీకొడుకులందర్నీ మించినవాడు. (85)
అనుక్రోశాదానృశంస్యాద్ యోఽసౌ ధర్మభృతాం వరః।
గౌరవాత్ తవ రాజేంద్ర బహూన్ క్లేశాంస్తితిక్షతి॥ 86
రాజేంద్రా! ధర్మాన్ని ఆచరించేవాళ్లలో శ్రేష్ఠుడైన ఆ ధర్మరాజు దయ, క్రూరస్వభావం లేకపోవటం, నీ పట్ల గౌరవం - వీటి వల్ల ఎన్నో కష్టాల్ని ఓర్చుకొంటున్నాడు. (86)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి ప్రజాగరపర్వణి విదురనీతివాక్యే చతుస్త్రింశోఽధ్యాయః॥ 34 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున ప్రజాగరపర్వమను ఉపపర్వమున
విదురనీతివాక్యమను ముప్పది నాల్గవ అధ్యాయము. (34)