21. ఇరువదియొకటవ అధ్యాయము

ద్రుపద పురోహితుని మాటను భీష్ముడు సమర్థించుట.

వైశంపాయన ఉవాచ
తస్య తద్వచనం శ్రుత్వా ప్రజ్ఞావృద్ధో మహాద్యుతిః।
సంపూజ్యైనం యథాకాలం భీష్మో వచనమబ్రవీత్॥ 1
వైశంపాయనుడు పలికాడు - ద్రుపద పురోహితుని మాటలను విని ప్రజ్ఞావృద్ధుడు, మహాతేజస్వి అయిన భీష్ముడు సమయోచితంగా అతనిని గౌరవించి ఇలా అన్నాడు. (1)
దిష్ట్వా కుశలినః సర్వే సహ దామోదరేణ తే।
దిష్ట్వా సహాయవంతశ్చ దిష్ట్వా ధర్మే చ తే రతాః॥ 2
అదృష్టవశాత్తు అంతా కుశలంగా ఉన్నారు. అలాగే కృష్ణునితో వారు సహాయవంతులయ్యారు. భాగ్యవశాత్తు వారు ధర్మమునందు ఆసక్తి కలిగి ఉన్నారు. (2)
దిష్ట్వా చ సంధికామాస్తే భ్రాతరః కురునందనాః।
దిష్ట్వా న యుద్ధమనసః పాండవాః సహ బాంధవైః॥ 3
ఆ సోదరులు - పాండవులైదుగురూ - కురువంశానికి ఆనందం కలిగిస్తూ సంధిని కోరుకోవడం అదృష్టం. బంధువులతో కూడిన పాండవులు యుద్ధం చేయకూడదనుకోవడం చాలా అదృష్టం. (3)
భవతా సత్యముక్తం తు సర్వమేతన్న సంశయః।
అతితీక్ష్ణం తు తే వాక్యం బ్రాహ్మణ్యాదితి మే మతిః॥ 4
నీవు చెప్పినదంతా యథార్థమే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాని నీ మాట చాలా కఠినంగా ఉంది. ఇది బ్రాహ్మణ స్వభావం వల్ల నని నేననుకొంటున్నాను. (4)
అసంశయం క్లేశితాస్తే వనే చేహ చ పాండవాః।
ప్రాప్తాశ్చ ధర్మతః సర్వం పితుర్ధనమసంశయమ్॥ 5
రాజ్యంలోను, అరణ్యంలోను కూడ ఆ పాండవులు బాధింపబడ్డారు. అందులో సందేహం లేదు. ధర్మంగా పిత్రార్జితాన్నంతా పొందే అధికారం వాళ్లకు ఉంది. ఇందులో కూడ సందేహం లేదు. (5)
కిరీటీ బలవాన్ పార్థః కృతాస్త్రశ్చ మహారథః।
కో హి పాండుసుతం యుద్ధే విషహేత ధనంజయమ్॥ 6
కుంతీపుత్రుడు, కిరీటధారి, మహారథుడు, అస్త్రవిద్యా నిపుణుడూ ఐన అర్జునుడు గొప్ప బలవంతుడు, పాండు కుమారుడైన అట్టి అర్జునుని యుద్ధంలో ఎవడు సహింపగలడు? (6)
అపి వజ్రధరః సాక్షాత్ కిముతాన్యే ధనుర్భృతః।
త్రయాణామపి లోకానాం సమర్థ ఇతి మే మతిః॥ 7
సాక్షాత్తు వజ్రాయుధం ధరించిన ఇంద్రుడు కూడ అర్జునుని ముందు నిలువలేడు. ఇక తక్కిన ధనుర్ధారుల సంగతి ఏమి చెప్పాలి. ఈ మూడులోకాలకు సర్వ సమర్థుడు అర్జునుడే అని నా అభిప్రాయం. (7)
భీష్మే బ్రువతి తద్వాక్యం ధృష్టమాక్షిప్య మన్యునా।
దుర్యోధనం సమాలోక్య కర్ణో వచనమబ్రవీత్॥ 8
భీష్ముడా విధంగా మాట్లాడుతూ ఉండగా, కర్ణుడు దుర్యోధనుని వైపు చూసి, కోపంతో పొగరుగా ఆక్షేపిస్తూ ఇలా అన్నాడు. (8)
న తత్రావిదితం బ్రహ్మన్ లోకే భూతేన కేనచిత్।
పునరుక్తేన కిం తేన భాషితేన పునః పునః॥ 9
బ్రాహ్మణోత్తమా! గతంలో జరిగినదంతా అందరికీ తెలియనిది కాదు. దాన్నే మళ్లీ మళ్లీ చెప్పడం వల్ల (ఏం ప్రయోజనం?) ఉపయోగం ఏమిటి? (9)
దుర్యోధనార్థే శకునిః ద్యూతే నిర్జితవాన్ పురా।
సమయేన గతోఽరణ్యం పాండుపుత్రో యుధిష్ఠిరః॥ 10
దుర్యోధనుని కోసం శకుని ధర్మరాజును జూదంలో ఎపుడో ఓడించాడు. జూదపు నియమం ప్రకారం యుధిష్ఠిరుడైన ధర్మరాజు అరణ్యానికి వెళ్లాడు. (10)
స తం సమయమాశ్రిత్య రాజ్యం నేచ్ఛతి పైతృకమ్।
బలమాశ్రిత్య మత్స్యానాం పంచాలానాం చ మూర్ఖవత్॥ 11
యుధిష్ఠిరుడు ఆ నియమానుసారంగా తన పిత్రార్జితమైన రాజ్యాన్ని కోరడంలేదు. మత్స్య, పంచాల దేశీయులబలాన్ని చూసికొని మూర్ఖునివలె కోరుతున్నాడు. (11)
సం.వి. 'సమయమాశ్రిత్య' అనుటచే ద్యూతనియమాన్ని నిర్వహించి రాజ్యమడగటం లేదు. సమయాన్ని అతిక్రమించి అడుగుతున్నారని భావం. (నీల).
'న తం సమయమాశ్రిత్య' అనుటచే సమయం మధ్యలోనే మేము వారిని విరాటనగరంలో గుర్తించాం కాబట్టి వారు మళ్ళీ వనవాసం చెయ్యాలి. అందుచేత వారు సమయాన్ని పాటించక, బలాన్ని ఆశ్రయించి రాజ్యాన్ని అడుగుతున్నారని భావం. (సర్వ)
దుర్యోధనో భయాద్విద్వన్ న దద్యాత్ పాదమంతతః।
ధర్మతస్తు మహీం కృత్స్నాం ప్రదద్యాచ్ఛత్రవేఽపి చ॥ 12
విద్వాంసుడా! దుర్యోధనుడు భయం వల్ల అర్ధరాజ్యాన్ని కాదు, చివరికి నాల్గవవంతుకూడా ఇవ్వడు. కాని ధర్మం వల్లనైతే శత్రువుకు ఐనా రాజ్యాన్నంతటినీ ఇవ్వగలడు. (12)
యది కాంక్షంతి తే రాజ్యం పితృపైతామహం పునః।
యథాప్రతిజ్ఞం కాలం తం చరంతు వనమాశ్రితాః॥ 13
తాత తండ్రులనుండి వచ్చే రాజ్యాన్ని వారు కోరుకొంటున్నట్లయితే మళ్లీ ప్రతిజ్ఞానుసారంగా సమయం ముగిసే వరకూ వనవాసం చేయాలి. (13)
తతో దుర్యోధనస్యాంకే వర్తంతామకుతోభయాః।
అధార్మికీం తు మా బుద్ధిం మౌర్ఖ్యాత్ కుర్వంతు కేవలాత్॥ 14
అటు తరువాత దుర్యోధనుడి దగ్గర నిర్భయంగా ఉండెదరుగాక! అంతేకాని కేవలం మూర్ఖంగా తమ బుద్ధిని అధర్మం పాలు చేసికోవద్దు. (14)
అథ తే ధర్మముత్సృజ్య యుద్ధమిచ్ఛంతి పాండవాHఆ।
ఆసద్యేమాన్ కురుశ్రేష్ఠాన్ స్మరిష్యంతి వచో మమ॥ 15
ఇకవారు ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధాన్ని కోరుతున్నట్లయితే పాండవులు ఈ కురుశ్రేష్ఠులను కలిసినపుడు నా మాటను స్మరింపగలరు. (15)
భీష్మ ఉవాచ
కిం ను రాధేయ వాచా తే కర్మ తత్ స్మర్తుమర్హసి।
ఏక ఏవ యదా పార్థః షడ్రథాన్ జితవాన్ యుధి॥ 16
భీష్ముడన్నాడు. రాధేయా! నీ మాటలచే ఏం జరుగుతుంది? పార్థుడు ఒక్కడే యుద్ధంలో ఆరుగురు రథికులను జయించాడు. నీవా విషయాన్ని గుర్తుంచుకో. (16)
వి॥తె॥ ఇక్కడ తిక్కన చక్కని పద్యం వ్రాశాడు.
చిక్కని పోటు మానిసి విసీ! విను వారలు నవ్వ నేమిగా
నెక్కుడు మాటలాడెద వహీన పరాక్రమశాలి యర్జునుం
డొక్కడ యార్వురన్ మనల నుగ్రరణంబున గెల్చె నిన్న; నే
డిక్కడఁబల్కులం గెలిచె దీ వతనిన్ మనరాజు కొల్వునన్.
ఉద్యో-1-253
భా॥ చాలా గొప్ప శూరుడివిలే ఛీ! వినేవారు నవ్వేటట్లు పెద్ద పెద్దమాటలు(అధిక ప్ర్సంగాలు) మాట్లాడుతున్నావు - మహాపరాక్రమశాలి అయిన అర్జునుడు ఒక్కడే నిన్న(ఉత్తరగోగ్రహణంలో) మన ఆరుగురిని (భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, కర్ణుడు) జయించాడు - నీవు మాత్రం మన రాజు కొలువులో కూర్చుని మాటలతో అర్జునుని గెలుస్తున్నావు.
బహుశో జీయమానస్య కర్మ దృష్టం తదైవ తే।
న చేదేవం కరిష్యామః యదయం బ్రాహ్మణోఽబ్రవీత్।
ధ్రువం యది హతాస్తేన భక్షయిష్యామ్ పాంసుకాన్॥ 17
పలుమార్లు అతనితో తలపడి ఓడిపోయిన నీ పరాక్రమం ఏమిటో అప్పుడే చూశాం. ఈ బ్రాహ్మణుడు చెప్పినట్లు చేయకపోతే, మనం యుద్ధంలో ఆ అర్జునుని చేతిలో దెబ్బలు తిని, మట్టి కరుస్తాం. (17)
వైశంపాయన ఉవాచ
ధృతరాష్ట్రస్తతో భీష్మమ్ అనుమాన్య ప్రసాద్య చ।
అవభర్త్స్య చ రాధేయమ్ ఇదం వచనమబ్రవీత్॥ 18
వైశంపాయనుడు పలికాడు. పిమ్మట ధృతరాష్ట్రుడు భీష్ముని భక్తితో గౌరవించి, అనునయించి కర్ణుని నిందించి ఇలా అన్నాడు. (18)
అస్మద్ధితం వాక్యమిదం భీష్మః శాంతనవోఽబ్రవీత్।
పాండవానాం హితం చైవ సర్వస్య జగతస్తథా॥ 19
శంతనునందనుడైన భీష్ముడు మాకు హితమైన వాక్యాన్ని చెప్పాడు. అది పాండవులకూ, సకల జగత్తుకూ కూడ హితమైనదే. (19)
చింతయిత్వా తు పార్థేభ్యః ప్రేషయిష్యామి సంజయమ్।
స భవాన్ ప్రతియాత్వద్య పాండవానేవ మా చిరమ్॥ 20
నేను ఆలోచించి పాండవుల వద్దకు సంజయుని పంపిస్తాను. నీవు ఆలస్యం చేయక పాండవుల వద్దకు తిరిగి వెళ్లు. (20)
స తం సత్కృత్య కౌరవ్యః ప్రేషయామాస పాండవాన్।
సభామధ్యే సమాహూయ సంజయం వాక్యమబ్రవీత్॥ 21
పిమ్మట ధృతరాష్ట్రుడు ఆ ద్రుపదపురోహితుని సత్కరించి పాండవుల దగ్గరకు పంపాడు. సంజయుని సభలోకి పిలిపించి ఇలా పలికాడు. (21)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సంజయయాన పర్వణి పురోహితయానే ఏకవింశోఽధ్యాయః॥ 21 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సంజయ యానపర్వమను ఉపపర్వమున పురోహితయానమను ఇరువది యొకటవ అధ్యాయము. (21)