7. ఏడవ అధ్యాయము
శ్రీకృష్ణుడు దుర్యోధనునకు, అర్జునునకు సహాయము చేయుట.
పురోహితం తే ప్రస్థాప్య నగరం నాగసాహ్వయమ్।
దూతాన్ ప్రస్థాపయామాసుః పార్థివేభ్యస్తతస్తతః॥ 1
వైశంపాయనుడు ఇలా అన్నాడు. జనమేజయా! ద్రుపదపురోహితుని హస్తినాపురానికి పంపిన తరువాత పాండవులు (సాయంకోసం) రాజుల వద్దకు దూతలను పంపారు. (1)
ప్రస్థాప్య దూతానన్యత్ర ద్వారకం పురుషర్షభః।
స్వయం జగామ కౌరవ్యం కుంతీపుత్రో ధనంజ్యః॥ 2
ఇతర రాజుల వద్దకు దూతలను పంపి నరోత్తముడైన అర్జునుడు ద్వారకకు తానే స్వయంగా వెళ్లాడు. (2)
గతే ద్వారపతీం కృష్ణే బలదేవే చ మాధవే।
సహ వృష్ణ్యంధకైః సర్వైః భోజైశ్చ శతశస్తదా॥ 3
సర్వమాగమయామాస పాండవానాం విచేష్టితమ్।
ధృతరాష్ట్రాత్మజో రాజా గూఢైః ప్రాణహితైశ్చరైః॥ 4
కృష్ణుడూ, బలరాముడూ, ఇంకా వృష్టి అంధక, భోజ వంశాల వారంతా ద్వారకకు వెళ్లాక పాండవుల కదలిక లన్నింటిని దుర్యోధనుడు నమ్మకమైన గూఢచారుల ద్వారా తెలుసుకొన్నాడు. (3,4)
స శ్రుత్వా మాధవం యాంతం సదశ్వైరనిలోపమైః।
బలేన నాతిమహతా ద్వారకామభ్యయాత్ పురీమ్॥ 5
శ్రీకృష్ణుడు విరాటనగరం నుండి ద్వారకకు వెళ్లాడని తెలుసుకొన్న దుర్యోధనుడు వాయువేగం గల గుఱ్ఱాలపై కొద్దిసైన్యాన్ని వెంటబెట్టుకొని ద్వారకాపురానికి బయలు దేరాడు. (5)
తమేవ దివసం చాపి కౌంతేయః పాండునందనః।
ఆనర్తనగరీం రమ్యాం జగామాశు ధనంజయః॥ 6
దుర్యోధనుడు బయలు దేరిన నాడే అర్జునుడు కూడా వేగంగా ద్వారకకు బయలు దేరాడు. (6)
తౌ యాత్వా పురుషవ్యాఘ్రౌ ద్వారకాం కురునందనౌ।
సుప్తం దదృశతుః కృష్ణం శయానం చాభిజగ్మతుః॥ 7
ద్వారకకు బయలుదేరిన దుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణుడు నిద్రిస్తున్న సమయంలో అక్కడకు చేరుకొన్నారు. (7)
తతః శయానే గోవిందే ప్రవివేశ సుయోధనః।
ఉచ్ఛీర్షతశ్చ కృష్ణస్య నిషసాద వరాసనే॥ 8
శ్రీకృష్ణుడు నిద్రిస్తూ ఉండగా ప్రవేశించిన సుయోధనుడు గోవిందుని తలవైపున ఉన్న ఉన్నతాసనంపై కూర్చున్నాడు. (8)
తతః కిరీటి తస్యానుప్రవివేశ మహామనాః।
పశ్చాచ్చైవ స కృష్ణస్య ప్రహ్వో ఽతిష్ఠత్ కృతాంజలిః॥ 9
తరువాత మనస్వి అయిన అర్జునుడు శ్రీకృష్ణుని శయనాగారంలోనికి ప్రవేశించి, వినయంగా చేతులు కట్టుకొని ఆయన పాదాల వద్ద నిలబడ్డాడు. (9)
ప్రతిబుద్ధః స వార్ష్ణేయో దదర్శాగ్రే కిరీటినమ్।
స తయోః స్వాగతం కృత్వా యథావత్ ప్రతిపూజ్య తౌ॥ 10
తదాగమనజం హేతుం పప్రచ్ఛ మధుసూదనః।
తతో దుర్యోధనః కృష్ణమ్ ఉవాచ ప్రహసన్నివ॥ 11
నిద్రమేల్కొన్న శ్రీకృష్ణుడు మొదట అర్జునుని చూశాడు. అర్జున దుర్యోధనులకు యథావిధిగా అతిథి మర్యాదలు చేశాడు. వారి రాకకు కారణం అడిగాడు. అపుడు దుర్యోధనుడు నవ్వుతూ కృష్ణునితో ఇలా అన్నాడు. (10,11)
విగ్రహేఽస్మిన్ భవాన్ సాహ్యం మమ దాతుమిహార్హతి।
సమం హి భవతః సఖ్యం మమ చైవార్జునేఽపి చ॥ 12
తథా సంబంధకం తుల్యమ్ అస్మాకం త్వయొ మాధవ।
అహం చాభిగతం పూర్వం త్వామద్య మధుసూదన॥ 13
పూర్వం చాభిగతం సంతః భజంతే పూర్వసారిణః।
త్వం చ శ్రేష్ఠతమో లోకే సతామద్య జనార్దన।
సతతం సమ్మతశ్చైవ సద్వృత్తమనుపాలయ॥ 14
మాధవా! ఈ యుద్ధంలో నీవు నాకు సాయం చెయ్యాలి. నీకు నేనూ, అర్జునుడూ సమాన స్నేహితులమే కదా! అలాగే బంధుత్వం కూడా సమానమే. నీ దగ్గరకు ముందుగా నేను వచ్చాను. సజ్జనులు ముందు వచ్చినవారికి తోడ్పడతారు. జనార్దనా! నీవు సజ్జనోత్తముడివి. ఎప్పుడూ సంప్రదాయాన్నే పాటిస్తావు. ఇప్పుడు కూడ సత్పురుషుల మార్గాన్నే అనుసరించు. (12,13,14)
కృష్ణ ఉవాచ
భవానభిగతః పూర్వమ్ అత్ర మే నాస్తి సంశయః।
దృష్టస్తు ప్రథమం రాజన్ మయా పార్థో ధనంజయః॥ 15
కృష్ణుడు ఇలా అన్నాడు. మహారాజా! ముందుగా నీవే వచ్చావు. సందేహం లేదు. కానీ మొదట నేను అర్జునుని చూశాను. (15)
తవ పూర్వాభిగమనాత్ పూర్వం చాప్యస్య దర్సనాత్।
సాహాయ్యముభయోరేవ కరిష్యామి సుయోధన॥ 16
సుయోధనా! నీవు ముందుగా రావడం వలన, నేను మొదట అర్జునుని చూడడం వలన ఇద్దరికీ సాహాయ్యం చేస్తాను. (16)
ప్రవారణం తు బాలానాం పూర్వం కార్యమితి శ్రుతిః।
తస్మాత్ ప్రవారణం పూర్వమ్ అర్హః పార్థో ధనంజయః॥ 17
ముందు చిన్నవారి కోరిక తీర్చాలి అని శ్రుతి చెపుతోంది. అందువలన మొదట కోరుకోవడానికి అర్జునుడే అర్హుడు. (17)
మత్సంహననతుల్యానాం గోపానామర్బుదం మహత్।
నారాయణ ఇతి ఖ్యాతాః సర్వే సంగ్రామయోధినః॥ 18
నాతో సమానమైన బలిష్ఠులు, మహాయోధులు, నారాయణులుగా పిలువబడే గోపాలకులు లక్షల మంది సైన్యం ఉన్నారు. (18)
తే వా యుధి దురాధర్షా భవంత్వేకస్య సైనికాః।
అయుధ్యమానః సంగ్రామే న్యస్తశస్త్రో ఽహమేకతః॥ 19
యుద్ధంలో తిరుగులేని వీరులైన ఆ సైన్యం అంతా ఒకవైపు, ఆయుధం విడిచి యుద్ధం చేయని నియమంతో నేను ఒకవైపు ఉంటాం. (19)
ఆభ్యామన్యతరం పార్థ యత్ తే హృద్యతరం మతమ్।
తద్ వృణీతాం భవానగ్రే ప్రవార్యస్త్వం హి ధర్మతః॥ 20
పార్థా! ఈ రెండింటిలో నీకు ఏది ఇష్టమో దానిని కోరుకో. ధర్మం ప్రకారం నీవే ముందుగా కోరుకోవాలి. (20)
వైశంపాయన ఉవాచ
ఏకముక్తస్తు కృష్ణేన కుంతీపుత్రో ధనంజయః।
అయుధ్యమానం సంగ్రామే వరయామాస కేశవమ్॥ 21
నారాయణమమిత్రఘ్నం కామాజ్జాతమజం నృషు।
సర్వక్షత్రస్య పురతః దేవదానవయోరపి॥ 22
వైశంపాయనుడు ఇలా అన్నాడు. జనమేజయా! కృష్ణుడు ఇలా అనగానే యుద్ధంలో ఆయుధం ధరించనన్నప్పటికీ శ్రీమన్నారాయణుడు, దుష్టసంహారుడు, దేవతలను రాక్షసులను, క్షత్రియజాతిని మించిన మానవజన్మను పొమ్దిన భగవంతుడైన శ్రీకృష్ణునే అర్జునుడు కోరుకున్నాడు. (22)
దుర్యోధనస్తు తత్ సైన్యం సర్వమావరయత్ తదా।
సహస్రాణాం సహస్రం తు యోధానాం ప్రాప్య భారత॥ 23
కృష్ణం చాపహృతం జ్ఞాత్వా సంప్రాప్య పరమాం ముదమ్।
దుర్యోధనస్తు తత్ సైన్యం సర్వమాదాయ పార్థివః॥ 24
తతోఽభ్యయాద్ భీమబలః రౌహిణేయం మహాబల।
సర్వం చాగమనే హేతుం స తస్మై సంన్యవేదయత్।
ప్రత్యువాచ తతః శౌరిః ధార్తరాష్ట్రమిదం వచః॥ 25
జనమేజయా! దుర్యోధనుడు పదిలక్షల సైన్యాన్ని కోరి తీసుకొన్నాడు. కృష్ణుని పాండవులు కోరుకొన్నందుకు సంతోషించాడు. తరువాత మహావీరుడైన బలరాముని వద్దకు వెళ్లి తనరాకకు కారణాన్ని ఆయనకు నివేదించాడు. అపుడు బలరాముడు ఇలా బదులిచ్చాడు. (23,24,25)
బలదేవ ఉవాచ
విదితం తే నరవ్యాఘ్ర సర్వం భవితుమర్హతి।
యన్మయోక్తం విరాటస్య పురా వైవాహికే తదా॥ 26
బలదేవుడు ఇలా అన్నాడు: దుర్యోధనా! ఇంతకు మునుపు నేను విరాటుని యింటిలో వివాహమహోత్సవంలో విరాటరాజుతో పలికిన పలుకులు నీకు తెలిసే ఉంటాయి. (26)
నిగృహ్యోక్తో హృషీకేశ త్వదర్థం కురునందన।
మయా సంబంధకం తుల్యమ్ ఇతి రాజన్ పునఃపునః॥ 27
న చ తద్ వాక్యముక్తం వై కేశవం ప్రత్యపద్యత।
న చాహముత్సహే కృష్ణం వినా స్థాతుమపి క్షణమ్॥ 28
కురునందనా! ఇరు పక్షాలతోనూ మనకు బంధుత్వం ఉన్నదని నేను శ్రీ కృష్ణునితో నీ శ్రేయస్సు కోసం పదే పదే చెప్పి బాధ్యత్ గుర్తు చేశాను. ఆ మాటను శ్రీకృష్ణుడు స్వీకరించిన లేదు. అతనిని విడిచి నేను ఒక్కక్షణం కూడా ఉండలేను. (27,28)
నాహం సహాయః పార్థస్య నాపి దుర్యోధనస్య వై।
ఇతి మే నిశ్చితా బుద్ధిః వాసుదేవమవేక్ష్య హ॥ 29
వాసుదేవుని మనస్సును గమనించిన నేను నీకు కాని, అర్జునునకు కాని సహాయపడకూడదని నిశ్చయించుకొన్నాను. (29)
జాతోఽసి భారతే వంశే సర్వపార్థివపూజితే।
గచ్ఛ యుద్ధ్యస్వ ధర్మేణ క్షాత్రేణ పురుషర్షభ॥ 30
పురుషపుంగనా! రాజులందరిచే పూజింపబడే భరత వంశంలో పుట్టావు. వెళ్లు, క్షత్రియ ధర్మంతో యుద్ధం చెయ్యి. (30)
వైశంపాయన ఉవాచ
ఇత్యేవముక్తస్తు తదా పరిష్వజ్య హలాయుధమ్।
కృష్ణం చాపహృతం జ్ఞాత్వా యుద్ధాన్మేనే జితం జయమ్॥ 31
వైశంపాయనుడు ఇలా అన్నాడు. బలరాముడు తన నిర్ణయాన్ని ఇలా చెప్పగానే దుర్యోధనుడు అతనిని కౌగిలించుకొన్నాడు. కృష్ణుడు ఒక్కడే పాండవపక్షానికి వెళ్లటంతో తనకు జయం లభించినట్లేనని భావించాడు దుర్యోధనుడు. (31)
సోఽభ్యయాత్ కృతవర్మాణం ధృతరాష్ట్రసుతో నృపః।
కృతవర్మా దదౌ తస్య సేనామక్షౌహిణీం తదా॥ 32
దుర్యోధనుడు కృతవర్మ వద్దకు వెళ్లాడు. అతడు ధృతరాష్ట్రపుత్రునికి ఒక అక్షౌహిణి సైన్యాన్ని ఇచ్చాడు. (32)
స తేన సర్వసైన్యేన భీమేన కురునందనః।
వృతః పరియయౌ హృష్టః సుహృదః సంప్రహర్షయన్॥ 33
భయంకరమయిన ఆ సైన్యాన్ని తీసుకొని, సంతోషించి దుర్యోధనుడు స్నేహితులకు సంతోషం పంచుతూ బయలు దేరివెళ్లాడు. (33)
తతః పీతాంబరధరః జగత్ర్సష్టా జనార్దనః।
గతే దుర్యోధనే కృష్ణః కిరీటినమథాబ్రవీత్।
అయుధ్యమానః కాం బుద్ధిమ్ ఆస్థాయాహం వృతస్త్వయా॥ 34
దుర్యోధనుడు వెళ్లిన తరువాత పీతాంబరుడు, జగన్నాథుడు, జనార్దనుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునునితో 'అర్జునా! యుద్ధం చెయ్యనని చెప్పిన నన్ను ఏ ఆలోచనతో కోరుకొన్నావు'? అన్నాడు. (34)
అర్జున ఉవాచ
భవాన్ సమర్థస్తాన్ సర్వాన్ నిహంతుం నాత్ర సంశయః।
నిహంతుమహమప్యేకః సమర్థః పురుషర్షభ॥ 35
అర్జునుడు ఇలా అన్నాడు. పురుషోత్తమా! వారందరనీ సంహరించటానికి నీవు సమర్థుడి వనటంలో సందేహం లేదు. నేను ఒక్కడినైనా సరిపోతాను. (35)
భవాంస్తు కీర్తిమాన లోకే తద్ యశస్త్వాం గమిష్యతి।
యశసాం చాహమప్యర్థీ తస్మాదపి మయ వృతః॥ 36
లోకంలో నీవు కీర్తిమంతుడివి. వారిని చంపితే కీర్తి నీకు చెందుతుంది. నేను కూడా కీర్తిని పొందాలనుకొంటున్నాను. నిన్ను ఎంచుకోవటానికి అదొక కారణం. (36)
సారథ్యం తు త్వయా కార్యమితి మే మానసం సదా।
చిరరాత్రేప్సితం కామం తద్ భవాన్ కర్తుమర్హతి॥ 37
నాకు సారథ్యం నీవే చేయాలని చిరకాలంగా నా మనసులో ఉన్న కోరిక. ఆకోరికను నీవు తీర్చాలి. (37)
వాసుదేవ ఉవాచ
ఉపపన్నమిదం పార్థ యత్ స్పర్ధసి మయా సహ।
సారథ్యం తే కరిష్యామి కామః సంపద్యతాం తవ॥ 38
పార్థా! నాతో పోటీపడటం సబబుగానే ఉంది. నీకు సారథ్యం చేస్తాను. నీ కోరిక తీరుస్తాను. (38)
వైశంపాయన ఉవాచ
ఏవం ప్రముదితః పార్థః కృష్ణేన సహితస్తదా।
వృతో దశార్హప్రవరైః పునరాయాద్ యుధిష్ఠిరమ్॥ 39
వైశంపాయనుడు ఇలా అన్నాడు. జనమేజయా! ఇలా అర్జునుడు శ్రీకృష్ణునితో, ఇతర దశార్హవంశ ప్రముఖులయిన యాదవులతో కలిసి సంతోషంగా ధర్మరాజు వద్దకు తిరిగి వచ్చాడు. (39)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగ పర్వణి కృష్ణ సారథ్య స్వీకారే సప్తమోఽధ్యాయః॥ 7 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున శ్రీకృష్ణ సారథ్య స్వీకారము అను ఏడవ అధ్యాయము. (7)