ఉద్యోగ పర్వము

1. ప్రథమాధ్యాయము

(సేనోద్యోగ పర్వము)

విరాటరాజు సభలో శ్రీకృష్ణభగవానుని భాషణము.

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్॥
అంతర్యామి, నారాయణస్వరూపుడు అయిన శ్రీకృష్ణునికి; (అత్ని నిత్యసఖుడు) నరస్వరూపుడు, నరశ్రేష్ఠుడు అయిన అర్జునునకు; (పరమాత్ముని లీలలను ప్రకటించే) సరస్వతీ దేవికి; (నరనారాయణ లీలలను సంకలనం చేసిన) మహర్షి వేదవ్యాసునకు నమస్కరించి మహాభారతాన్ని (జయాన్ని) చదవాలి (చెప్పాలి).
వైశంపాయన ఉవాచ
కృత్వా వివాహం తు కురుప్రవీరాః
తదాభిమన్యోర్ముదితాః స్వసక్షాః।
విశ్రమ్య రాత్రావుషసి ప్రతీతాః
సభాం విరాటస్య తతోఽభిజగ్ముః॥ 1
వైశంపాయనుడు ఇలా అన్నాడు. జనమేజయా! అభిమన్యుని వివాహం చేసి కురుప్రవీరులైన పాండవులు, వారి పక్షంలో ఉన్నవారు(యాదవ పాంచాలాదులు) చాలా ఆనందించారు. వారు ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని ఉషః కాలంలో నిద్రలేచి (నిత్యకృత్యాలు ముగించి) విరాటుని సభకు చేరుకొన్నారు. (1)
వి॥తె॥ 'దినచతుష్టయానంతరమున' అని తిక్కన.
వి॥సం॥ చతుర్థీహోమ పర్యంతం విశ్రమించి. (అర్జు)
సభా తు సా మత్స్యపతేః సమృద్ధా
మణిప్రవేకోత్తమరత్నచిత్రా।
న్యస్తాసనా మాల్యవతీ సుగంధా
తామభ్యయుస్తే నరరాజవృద్ధాః॥ 2
మత్స్యదేశాధిపతి అయిన విరాటుని సభ ఎంతో సమృద్ధిగా ఉంది. దానిలో ఉత్తమ మణులు పొదిగి ఉన్నాయి. ఈ అలంకారాలతో ఆ సభ చిత్రంగా శోభిస్తోంది. తగిన ఆసనాలను ఆయా స్థానాలలో వేసి ఉంచారు. సుగంధభరితమైన పూల దండలు కట్టారు. పెద్దపెద్ద రాజులు అందరు అక్కడకు చేరుకొన్నారు. (2)
అథాసనాన్యావిశతాం పురస్తాత్
ఉభౌ విరాటద్రుపదౌ నరేంద్రౌ।
వృద్ధౌ చ మాన్యౌ పృథివీపతీనాం
పిత్రా సమం రామజనార్దనౌ చ॥ 3
ఆ సభలో అందరికి ముందు విరాటరాజు, ద్రుపదుడు ఆసనాలపై కూర్చున్నారు. వారు రాజులందరిలో వృద్ధులు, పూజ్యులు. తమ తండ్రి వసుదేవునితో కలసి బలరామ శ్రీకృష్ణులు కూడా ఆసనాలపై కూర్చున్నారు. (3)
పాంచాలరాజస్య సమీపతస్తు
శినిప్రవీరః సహరౌహిణేయః।
మత్స్యస్య రాజ్ఞస్తు సుసంనికృష్ణః
జనార్దనశ్చైవ యుధిష్ఠిరశ్చ॥ 4
పాంచాలరాజు ద్రుపదుని ప్రక్కన శినివంశశ్రేష్ఠుడు, వీరుడు అయిన సాత్యకి, రోహిణీదేవి కుమారుడైన బలరామునితో కలిసి కూర్చున్నాడు. మత్స్యరాజైన విరాటునికి మరింత దగ్గరగా శ్రీకృష్ణుడు, ధర్మరాజు కూర్చున్నారు. (4)
సుతాశ్చ సర్వే ద్రుపదస్య రాజ్ఞః
భీమార్జునౌ మాద్రవతీసుతౌ చ।
ప్రద్యుమ్నసాంబౌ చ యుధి ప్రవీరౌ
విరాటపుత్రైశ్చ సహాభిమన్యుః॥ 5
సర్వే చ శూరాః పితృభిః సమానాః
వీర్యేణ రూపేణ బలేన చైవ।
ఉపావిశన్ ద్రౌపదేయాః కుమారాః
సువర్ణచిత్రేషు వరాసనేషు॥ 6
ద్రుపదరాజు పుత్రులు, భీమార్జునులు, నకుల సహ దేవులు, యుద్ధవీరులు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, విరాటుని పుత్రులతో కలిసి అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు... అందరు అందమైన బంగారు ఆసనాలపై కూర్చున్నారు. ద్రౌపది పుత్రులు అయిదుగురు సౌందర్య బలపరాక్రమాలలో తమ తండ్రులతో సమానంగా ఉన్నారు. వారు ఎవరికివారే శూరులు, వీరులు. (5,6)
తథోపవిష్టేషు మహారథేషు
విరాజమానాభరణాంబరేషు।
రరాజ సా రాజవతీ సమృద్ధా
గ్రహైరివ ద్యౌర్విమలైరుపేతా॥ 7
ప్రకాశిస్తున్న ఆభరణాలతో, వస్త్రాలతో విభూషితులైన మహారథులు కూర్చుని ఉండగా రాజులతో నిండుగా ఉన్న ఆ సభ కాంతిమంతమైన గ్రహాలు, నక్షత్రాలతో నిండిన ఆకాశంవలె ప్రకాశించింది. (7)
తతః కథాస్తే సమవాయయుక్తాః
కృత్యా విచిత్రాః పురుషప్రవీరాః।
తస్థుర్ముహూర్తం పరిచింతయంతః
కృష్ణం నృపాస్తే సముదీక్షమాణాః॥ 8
ఆ వీరపురుషులందరు సమయోచితమైన చిత్ర సంభాషణలు చేస్తూ కృష్ణుని వైపు చూచి ఆలోచనలో మునిగి ముహూర్తకాలం (రెండు గడియలి. కొద్దిసేపు) మౌనంగా ఉన్నారు. (8)
కథాంతమాసాద్య చ మాధవేన
సంఘట్టితాః పాండవకార్యహేతోః।
తే రాజసింహాః సహితా హ్యశృణ్వన్
వాక్యం మహార్థం సుమహోదయం చ॥ 9
అలా సంభాషణలు ఆపిన తరువాత పాండవుల ప్రయోజనం కోసం ఒక చోటికి చేరిన రాజోత్తము లందరు సారగర్భితమూ, శ్రేష్ఠఫలదాయకమూ అయిన కృష్ణునిమాట విన నారంభించారు. (9)
శ్రీకృష్ణ ఉవాచ
సర్వైర్భవద్భిర్విదితం యథాయం
యుధిష్ఠిరః సౌబలేనాక్షవత్యామ్।
జితో నికృత్యాపహృతం చ రాజ్యం
వనప్రవాసే సమయః కృతశ్చ॥ 10
శ్రీకృష్ణుడు ఇలా ప్రారంభించాడు.... జరిగినది అంతా మీకు తెలుసు. సుబలపుత్రుడైన శకుని జూదంలో మోసం చేసి దురాత్ముడైన యుధిష్ఠిరుని ఓడించి, రాజ్యాన్ని అపహరించి, పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసానికి షరతు విధించాడు. (10)
వి॥తె॥ దీన్ని తిక్కన కపట ద్యూతమునందు అంటూ మొదలు పెట్టి చక్కగా సంగ్రహించాడు.
కపటద్యూతమునందు సౌబలునిచేఁ గౌంతేయు లాత్మీయరా
జ్యపదభ్రంశముఁబొంది సత్యనిరతిన్ శక్తాత్ములైయుండియున్
గుపితస్వాంతులు గాక తత్సమయ సంక్షోభంబు గాకుండఁగా
విపినావాసము గూఢచర్యయును గావింపం దలంపొప్పదే!
ఉద్యో- 1-7
శక్తైర్విజేతుం తరసా మహీం చ
సత్యే స్థితైః సత్యరథైర్యథావత్।
పాండోః సుతైస్తద్ వ్రతముగ్రరూపం
వర్షాణి షట్ సప్త చ చీర్ణమగ్ర్యైః॥ 11
పాండవులు ఎప్పుడూ సత్యంపైనే ఉంటారు. సత్యమే వీరి రథం. చిటికెలో సమస్త భూమండలాన్ని జయించే శక్తి వీరిలో ఉన్నా వీరాగ్రగణ్యులైన పాండుకుమారులు సత్యవ్రతాన్ని పాటించటం కోసం పదమూడేళ్లు అరణ్యవాసం, అజ్ఞాతవాసం కఠోరమైన దీక్షతో పూర్తి చేశారు. (11)
వి॥సం॥ 1) సత్యరథైః = సత్యాశ్చ తే రథాశ్చ - ఇతి - తైః=
సత్యరథైః రథశబ్దం ఇక్కడ రథికులను సూచిస్తుంది. (అర్జు)
2)సత్ అనగా పృథివి, నీరు, అగ్ని, త్యత్ అనగా వాయువు - ఆకాశము - ఈ పంచభూతాల్లో అమోఘమయిన రథం కలవారు అని మధ్యమ పదలోపంతో సమానం - లేదా రథం వలె ఆరోహించటానికి యోగ్యమయిన సత్యం కలవారు.
త్రయోదశశ్చైవ సుదుస్తరోఽయమ్
అజ్ఞాయమానైర్భవతాం సమీపే।
క్లేశానసహ్యాన్ వివిధాన్ సహద్భిః
మ్మహాత్మభిశ్చాపి వనే నివిష్టమ్॥ 12
ఈ పదమూడు సంవత్సరం పూర్తి చేయటం మరీ కష్టం. కాని ఈ మహాత్ములు మీవద్ద అజ్ఞాతరూపంలో ఉంటూ సహింపరాని అనేకశ్లోకాలను సహించారు. పన్నెండేళ్లు అడవులలో బాధలు పడ్డారు. (12)
ఏతైః పరప్రేష్యనియోగయుక్తైః
ఇచ్ఛద్భిరాప్తం స్వకులేన రాజ్యమ్।
ఏవంగతే ధర్మసుతస్య రాజ్ఞః
దుర్యోధనస్యాపి చ యుద్ధితం స్యాత్॥ 13
తచ్చింత్యధ్వం కురుపుంగవానాం
ధర్మ్యం చ యుక్తం చ యశస్కరం చ।
అధర్మయుక్తం న చ కామయేత
రాజ్యం సురాణామపి ధర్మరాజః॥ 14
వంశపారంపర్యంగా రావలసిన రాజ్యం కోసం ఈ వీరులు ఇప్పటివరకు అజ్ఞాతవాసంలో మరొకరిసేవలో నిమగ్నులై పదమూడవ సంవత్సరాన్ని పూర్తి చేశారు. ఈ పరిస్థితిలో ధర్మపుత్రుడైన యుధిష్ఠిరునికీ, రాజైన దుర్యోధనునికీ ఏ ఉపాయంతో మేలు జరుగుతుందో మీరు ఆలోచించండి. మీరు చూపే ఏ మార్గమైనా కురుశ్రేష్ఠులైన ఈ వీరులకు ధర్మానుకూలం, న్యాయోచితం, కీర్తికరం కావాలి. ధర్మరాజు ధర్మ విరుద్ధంగా దేవతల రాజ్యాన్నయినా కోరడు. (13,14)
ధర్మార్థయుక్తం తు మహీపతిత్వం
గ్రామేఽపి కస్మింశ్చిదయం బుభూషేత్।
పిత్ర్యం హి రాజ్యం విదితం నృపాణాం
యథాపకృష్టం ధృతరాష్ట్రపుత్రైః॥ 15
ధర్మానికీ, అర్థానికీ అనుకూలంగా ఉన్న చిన్నగ్రామమైనా రాజ్యంగా స్వీకరించటానికి వీరు సిద్ధంగా ఉన్నారు. ధృతరాష్ట్రపుత్రులు పాండవులకు పైతృకంగా రావలసిన రాజ్యాన్ని ఎలా అపహరించారో రాజులందరికీ తెలుసు. (15)
మిథ్యోపచారేణ యథా హ్యనేన
కృచ్ఛ్రం మహత్ ప్రాప్తమసహ్యరూపమ్।
న చాపి పార్థో విజితో రణే తైః
స్వతేజసా ధృతరాష్ట్రస్య పుత్రైః॥ 16
కౌరవులు చేసిన ఈ కపటవ్యవహారం కారణంగా పాండవులు సహింపరాని ఎంతటి కష్టాన్ని అనుభవించారో మీకు తెలియనిదికాదు. ధృతరాష్ట్రపుత్రులు తమ బలపరాక్రమాలతో కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుణ్ణి ఏ యుద్ధంలోనూ ఓడించలేదు కదా! (మోసంతోనే వీరి రాజ్యాన్ని దొంగిలించారు) (16)
తథాపి రాజా సహితః సుహృద్భిః
అభిప్సతేఽనామయమేవ తేషామ్।
యత్ తు స్వయం పాండుసుతైర్విజిత్య
సమాహృతం భూమిపతీన్ ప్రపీడ్య॥ 17
తత్ ప్రార్థయంతే పురుషప్రవీరాః
కుంతీసుతా మాద్రవతీసుతౌ చ।
బాలాస్త్విమే తైర్వివిధైరుపాయైః
సంప్రార్థితా హంతుమమిత్రసంఘైః॥ 18
రాజ్యం హిజీర్షద్భిరసద్భిరుగ్రైః
సర్వం చ తద్ వో విదితం యథావత్।
అయినా స్నేహితులతో కూడిన ధర్మరాజు వారి క్షేమాన్నే కోరుతున్నాడు. రాజులందరినీ జయించి స్వయంగా సంపాదించిన ధనాన్ని మాత్రమే కుంతీసుతులు, మాద్రీసుతులు అయిన పాండవులు కోరుతున్నారు. వీరు బాల్యంలో అభం శుభం తెలియను వయస్సులో ఉన్నప్పుడే వీరి రాజ్యాన్ని అపహరించడానికి ఉగ్రస్వభావులైన దుష్టులతో కలిసి కుట్రలు పన్ని వీరిని చంపటానికి ఎన్నో ఎత్తులువేసిన సంగతి మీకు అందరకు తెలిసినదే. (17,18 1/2)
తేషాం చ లోభం ప్రసమీక్ష్య వృద్ధం
ధర్మజ్ఞతాం చాపి యుధిష్ఠిరస్య॥ 19
సంబంధితాం చాపి సమీక్ష్య తేషాం
మతిం కురుధ్వం సహితాః పృథక్ చ।
ఇమే చ సత్యేఽభిరతాః సదైవ
తం పాలయిత్వా సమయం యథావత్॥ 20
అందువలన సభాసదులందరు కౌరవుల అతిలోభాన్ని, యుధిష్ఠిరుని ధర్మజ్ఞతను, ఇరుపక్షాలవారి బంధుత్వాన్ని, పరిశీలించి, విడివిడిగాను, అందరు కలిసి, ఆలోచించి ఒక నిర్ణయం చేయండి. ఈ పాండవులు సదా సత్య పరాయణులు కావటం వలన చేసిన ప్రతిజ్ఞను అనుకొన్నట్లు పూర్తిచేశారు. (19,20)
అతోఽన్యథా తైరుపచర్యమాణాః
హన్యుః సమేతాన్ ధృతరాష్ట్రపుత్రాన్।
తైర్విప్రకారం చ నిశమ్య కార్యే
సుహృజ్జనాస్తాన్ పరివారయేయుః॥ 21
ధృతరాష్ట్రపుత్రులు వీరిపట్ల విపరీత వ్యవహారం చేయదలచుకొంటే, (వీరికి రాజ్యం తిరిగి ఈయకపోతే) పాండవులు వారిని చంపేస్తారు. కౌరవులు పాండవుల కార్యానికి విఘ్నాలు కల్పిస్తారు. అపకీర్తిని తేవటానికి సిద్ధపడతారు. ఈ విషయాన్ని నిశ్చయంగా తెలుసుకొన్న మిత్రులు, బంధువులు వారిని (ఈ చెడు పని చేయకుండా) ఆపాలి. (21)
యుద్ధేన బాధేయురిమాంస్తథైవ
తైర్బాధ్యమానా యుధి తాంశ్చ హమ్యః।
తథాపి నేమేఽల్పతయా సమర్థాః
తేషాం జయాయేతి భవేన్మతం వః॥ 22
ధృతరాష్ట్రపుత్రులు ఈ విధంగా పాండవులను బాధిస్తారు. వారిచే బాధింపబడిన వీరు యుద్ధంలో వారిని సంహరిస్తారు. అయినా తక్కువ సంఖ్యలో ఉన్న వీరు వారిని జయించడానికి సమర్థులు కారని మీ అభిప్రాయం అయి ఉండవచ్చు. (22)
సమేత్య సర్వే సహితాః సుహృద్భిః
తేషాం వినాశాయ యతేయురేవ।
దుర్యోధనస్యాపి మతం యథావత్
న జ్ఞాయతే కిం ను కరిష్యతీతి॥ 23
అయినప్పటికీ వీరి శ్రేయోభిలాషులు, మిత్రులు అందరు కలసి వారి వినాశనానికి ప్రయత్నం చేసి తీరుతారు. (కనుక వీరిని బలహీనులని మీరు తలచకండి) దుర్యోధనుని అభిప్రాయం ఏమిటి? అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియక పోవడం వలన వారు ఏం చేయబోతున్నారో తెలియటం లేదు. (23)
అజ్ఞాయమానే చ మతే పరస్య
కిం స్యాత్ సమారభ్యతమం మతం వః।
తస్మాదితో గచ్ఛతు ధర్మశీలః
శుచిః కులీనః పురుషోఽప్రమత్తః॥ 24
శత్రుపక్షం ఆలోచన తెలియకుండ మీరు 'ఇది ఇలా చెయ్యాలి' అని ఎలా నిశ్చయించగలరు. కార్యం ఎలా పరిణమిస్తుందో తెలుసుకోవలసిఅ అవసరం ఉంది. కనుక ధర్మశీలుడు, పవిత్రాత్ముడు, కులీనుడు, సావధానుడు అయిన ఒక వ్యక్తి దూతగా అక్కడకు వెళ్లాలి. (24)
దూతః సమర్థః ప్రశమాయ తేషాం
రాజ్యార్ధదానాయ యుధిష్ఠిరస్య।
దూత కౌరవుల అహంకారాన్ని, ఆవేశాన్ని శాంతింపచేసి, యుధిష్ఠిరునకు అర్ధరాజ్యాన్ని ఇచ్చేటట్లుగా చేయగలవాడై ఉండాలి. (24 1/2)
నిశమ్య వాక్యం తు జనార్దనస్య
ధర్మార్థయుక్తం మధురం సమం చ॥ 25
సమాదదే వాక్యమథాగ్రజోఽస్య
సంపూజ్య వాక్యం తదతీవ రాజన్॥ 26
రాజా! శ్రీకృష్ణుడు ధర్మబద్ధంగా, అర్థయుక్తంగా, మధురంగా, ఇరుపక్షాల వారికీ తగిన విధంగా పలికిన పలుకులను అగ్రజుడైన బలరాముడు విని, బాగా ప్రశంసించి తాను మాట్లాడటం ప్రారంభించాడు. (25,26)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగ పర్వణి పురోహిత యానే ప్రథమోఽధ్యాయః॥ 1 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున పురోహిత యానమను ప్రథమాధ్యాయము. (1)