50. ఏబదియవ అధ్యాయము

అశ్వత్థామ కోపము.

అశ్వత్థామోవాచ
న చ తావజ్జితా గావః న చ సీమాంతరం గతాః।
న హాస్తినపురం ప్రాప్తాః త్వం చ కర్ణ వికత్థసే॥ 1
అశ్వత్థామ ఇలా అన్నాడు. 'కర్ణా! మనమింత వరకు గోవులను గెలుచుకొనలేదు. హస్తినకు చేరలేదు. కనీసం మత్స్యదేశపు సరిహద్దులనుండి బయట పడలేదు. నీవు మాత్రం వ్యర్థప్రలాపాలు పలుకుతూనే ఉన్నావు. (1)
వి॥సం॥ ఉత్తమ - మధ్యమ - అధమ భేదంతో మూడు రకాలుగా మనుషులు ఉంటారు. ప్రస్తుతం గోవులను గెలిచి హస్తినకు కొనిపోయేవారు ఉత్తములు. సరిహద్దు దాటించగలవారు మధ్యములు, హస్తినకు నడిపించగలవారు అధములు. ఈమూడింటిలో ఒక్కటి కూడా చేయని నువ్వు ఆత్మశ్లాఘ చేసికొనటం అవివేకమని కర్ణుని అశ్వత్థామ అంటున్నాడు. (అర్జు)
సంగ్రామాంశ్చ బహూన్ జిత్వా లబ్ధ్వా చ విపులం ధనమ్।
విజిత్య చ పరాం సేనాం నాహుః కించన పౌరుషమ్॥ 2
దహత్యగ్నిరవాక్యస్తు తూష్ణీం భాతి దివాకరః।
తూష్ణీం ధారయతే లోకాన్ వసుధా సచరాచరాన్॥ 3
ఎన్ని యుద్ధాలలో గెలిచినా, ఎంత ధనరాశిని పొందినా, శత్రుసేనలను జయించినా జ్ఞానులు పౌరుషాన్ని గూర్చి ప్రగల్భాలు పలుకరు. అగ్ని మాటాడ కుండానే దహించి వేస్తాడు. సూర్యుడు మౌనంగానే ప్రకాశిస్తున్నాడు. ఈ భూమి మౌనంగానే సమస్తచరాచర లోకాలను భరిస్తూనే ఉంది. (2,3)
చాతుర్వర్ణ్యస్య కర్మాణి విహితాని స్వయంభువా।
ధనం యై రధిగంతవ్యం యచ్చ కుర్వన్ న దుష్యతి॥ 4
ఏపని చేసి జీవితానికి అవసరమైన ధనాన్ని పొందవచ్చునో, ఏపని చేత నిందలకు లోనుకాడో అటువంటి పనులను బ్రహ్మ నాల్గువర్ణాల వారికీ విధించాడు. (4)
అధీత్య బ్రాహ్మణో వేదాన్ యాజయేత యజేత వా।
క్షత్రియో ధనురాశ్రిత్య యజేచ్చైవ న యాజయేత్॥ 5
బ్రాహ్మణుడు వేదాల నధ్యయనంచేసి యాగాలు చేయించవచ్చు లేదా తానే స్వయంగా చేయవచ్చు. క్షత్రియుడు ధనుస్సును చేబూని ధనం సంపాదించి యాగాలు చేయవచ్చును గాని చేయించరాదు. (5)
వైశ్యోఽధిగమ్య విత్తాని బ్రహ్మకర్మాణి కారయేత్।
శూద్రః శుశ్రూషణం కుర్యాత్ త్రిషు వర్ణేషు నిత్యశః।
వందనాయోగవిధిభిః వైతసీం వృత్తిమాశ్రితః॥ 6
వైశ్యుడు కృషివ్యాపారాల ద్వారా ధనాన్ని సంపాదించి బ్రాహ్మణులద్వారా వేదోక్తకర్మలను చేయించాలి. శూద్రుడు వైతసీవృత్తి నాశ్రయించి నమస్కరించటం, ఆజ్ఞాపాలన చేయటం మొదలయిన పనులద్వారా ఎప్పుడూ త్రివర్ణాలవారిని సేవించాలి. (6)
వర్తమానా యథాశాస్త్రం ప్రాప్య చాపి మహీమిమామ్।
సత్కుర్వంతి మహాభాగా గురూన్ సువిగుణానపి॥ 7
మహనీయులెప్పుడూ శాస్త్రవిధుల ననుసరించి ప్రవర్తిస్తూ, ధర్మబద్ధంగా ఈ వసుధనంతటినీ పొందినా గురువులను, వారు గుణహీనులైనా సత్కరిస్తారు. (7)
ప్రాప్య ద్యూతేన కో రాజ్యం క్షత్రియస్తోష్టుమర్హతి।
తథా నృశంసరూపోఽయం ధార్తరాష్ట్రశ్చ నిర్ఘృణః॥ 8
క్షత్రియుడెవడైననూ మాయజూదంలో రాజ్యాన్ని పొంది ఆనందిస్తాడా? కానీ ఈ ధృతరాష్ట్రకుమారుడు ఆ రాజ్యంతోనే ఆనందిస్తున్నాడు. తాను క్రూరుడు దయలేనివాడు కాబట్టి అది చెల్లింది. (8)
తథాధిగమ్య విత్తాని కో వికత్థేద విచక్షణః।
నికృత్యా వంచనాయోగైః చరన్ వైతంసికో యథా॥ 9
బోయవాడు వంచనతో కపటమైన ఉపయాలతో తన జీవనాన్ని నిర్వహించుకొన్నట్లు, కపటంగా డబ్బు సంపాదించిన వాడెవ్వడూ ఏ పాటి బుద్ధిమంతుడైనా తనను తాను గొప్పగా భావించడు. (9)
కతమద్ ద్వైరథం యుద్ధం యత్తా జైషీర్ధనంజయమ్।
నకులం సహదేవం వా ధనం యేషాం త్వయా హృతమ్॥ 10
సుయోధన మహారాజా! నీవు మాయాద్యూతంలో పాండవుల ధనాన్ని అపహరించావు కానీ అర్జునుని అయినా నకులుని అయినా సహదేవుని అయినా యుద్ధంలో జయించావా? నీవు వారిని ఓడించిన ద్వంద్వ యుద్ధమేది? (10)
యుధిష్ఠిరో జితః కస్మిన్ భీమశ్చ బలినాం వరః।
ఇంద్రప్రస్థం త్వయా కస్మిన్ సంగ్రామే నిర్జితం పురా॥ 11
ధర్మరాజునయినా, బలవంతులలో శ్రేష్ఠుడైన భీమసేనుని అయినా నీవు ఏయుద్ధంలో గెలిచావు? ఇప్పుడు నీ ఏలువడిలో నున్న ఇంద్రప్రస్థాన్ని నీవు ఎప్పుడు ఏ యుద్ధంలో గెలుచుకొన్నావు? (11)
తథైవ కతమద్ యుద్ధం యస్మిన్ కృష్ణా జితా త్వయా।
ఏవకస్త్రా సభాం నీతా దుష్టకర్మన్ రజస్వలాః॥ 12
చెడ్డపనులు చేసే సుయోధనా! నీవు ద్రౌపదిని ఏయుద్ధంలో గెలిచావు? రజస్వలయై, ఏకవస్త్ర ధారిణియై ఉన్న ద్రౌపదిని నిండుకొలువులోనికి ఈడ్పించావు గదా! (12)
మూలమేషాం మహత్ కృత్తం సారార్థీ చందనం యథా।
కర్మ కారయిథాః సూత తత్ర కిం విదురోఽబ్రవీత్॥ 13
సూతపుత్రా! డబ్బుకోసం మంచిగంధపు చెట్టును నరికినట్టు నీవూ, దురోధనుడూ కలిసి కపటద్యూతమూ, ద్రౌపదీపరాభవమూ కారణంగా పాండవులను మొదలంటా కూల్పారు. పాండవులను మీరు దాసులను చేసినప్పుడు మహానుభావుడైన విదురుడేమన్నాడు? గుర్తులేదా? (13)
వి॥సం॥ విదురవచనం - 'దుర్యోధనోహ్యనర్థానాం మూలమిత్యవధారయ' అని విదురుడు ద్యూతసమయంలోనే సుయోధనుడే అనర్థాలకు మూలమనలేదా? ఆమాటను తలచుకో అని అశ్వత్థామ హెచ్చరిక. (అర్జు-దుర్ఘ)
యథాశక్తి మనుష్యాణాం శమమాలక్షయామహే।
అన్యేషామపి సత్త్వానామ్ అపి కీటపిపీలికైః।
ద్రౌపద్యాం సంపరిక్లేశం న క్షంతుం పాండవోఽర్హతి॥ 14
మనుష్యులకైనా, జంతువులకైనా, కీటకాలు, చీమలు వంటి వాటికైనా వాటివాటి స్థాయిని బట్టి(శక్తినిబట్టి) సహనానికి హద్దుంటుంది. మీరు ద్రౌపదిని పెట్టిన బాధలకు పాండుపుత్రులెప్పుడూ మిమ్ములను క్షమించరు. (14)
క్షయాయ ధార్తరాష్ట్రాణాం ప్రాదుర్భూతో ధనంజయః।
త్వం పునః పండితో భూత్వా వాచం వక్తుమిహేచ్ఛసి॥ 15
ధార్తరాష్ట్రులను సంహరించటంకోసమే అర్జునుడు పుట్టాడు. నీవు మాత్రం పండితమ్మన్యుడవై పెద్దపెద్ద మాటలు మాటాడుతున్నావు. (15)
వైరాంతకరణో జిష్ణుః న నః శేషం కరిష్యతి॥ 16
పగను అడగించగల అర్జునుడు - జయశీలి - మనలను మిగలనిస్తాడా? (16)
నైష దేవాన్ న గంధర్వాన్ నాసురాన్ న చ రాక్షసాన్।
భయాదిహ న యుధ్యేత కుంతీపుత్రో ధనంజయః॥ 17
కుంతీనందనుడైన అర్జునుడు దేవతలతో అయినా, గంధర్వులతో నయినా, అసురులతో నయినా, రాక్షసులతో అయినా భయపడి యుద్ధం మానటం మాత్రం ఎప్పటికీ జరగదు. (17)
యం యమేషోఽతిసంక్రుద్ధః సంగ్రామే నిపతిష్యతి।
వృక్షం గరుత్మాన్ వేగేన వినిహత్య తమేష్యతి॥ 18
గరుత్మంతుడు ఏచెట్టు మీదనయినా కాలూనితే చాలు. ఆ వేగానికి ఆ చెట్టు కూలిపోతుంది. అట్లే అర్జునుడు రణభూమిలో ఆగ్రహంతో ఏమహారథి నయినా ఆక్రమిస్తే, అతన్ని పడగొట్టి మరీ ముందుకు సాగుతాడు. (18)
త్వత్తో విశిష్టం వీర్యేణ ధనుష్యమరరాట్సమమ్।
వాసుదేవసమం యుద్ధౌ తం పార్థం కో న పూజయేత్॥ 19
కర్ణా! అర్జునుడు పరాక్రమంలో నిన్ను మించినవాడు. ధనుర్విద్యలో దేవేంద్రునితో సమానుడు. రణరంగంలో వాసుదేవునితో సమానుడు. అటువంటి అర్జునుని ఎవరు ప్రశంసించరు? (19)
దేవం దేవేన యుధ్యేత మానుషేణ చ మానుషమ్।
అస్త్రం హ్యస్త్రేణ యో హన్యాత్ కోఽర్జునేన సమఃపుమాన్॥ 20
అర్జునుడు దేవతలతో దివ్యంగా, మనుష్యులతో మానుషంగా యుద్ధం చేయగలడు. ఏ అస్త్రాన్ని అయినా ప్రతిస్పర్ధి అయిన అస్త్రంతో శాంతింపజేయగలడు. అటువంటి అర్జునునితో ఎవడు సరిపోలగలడు? (20)
పుత్రాదనంతరం శిష్యః ఇతి ధర్మవిదో విదుః।
ఏతేనాపి నిమిత్తేన ప్రియో ద్రోణస్య పాండవః॥ 21
గురువులకు తమ పుత్రుల తర్వాత శిష్యులే ప్రియమైన వారని ధర్మవేత్తలు అంటారు. ఆ కారణం చేత కూడా ద్రోణాచార్యునకు అర్జునునిపై మక్కువ. (21)
యథా త్వమకరోర్ద్యూతమ్ ఇంద్రప్రస్థం యథాఽఽహరః।
యథాఽఽనైషీః సభాం కృష్ణాం తథా యుధ్వస్వ పాండవమ్॥ 22
దుర్యోధనా! ఏ రీతిగా నీవు జూదమాడావో, ఏరీతిగా ఇంద్రప్రస్థాన్ని అపహరించావో, ఏ విధంగా ద్రౌపదిని సభలోని కీడ్పించావో ఆ విధంగానే ఇప్పుడు అర్జునునితో యుద్ధం చెయ్యి. (22)
అయం తే మాతులః ప్రాజ్ఞః క్షత్రధర్మస్య కోవిదః।
దుర్ద్యూతదేవీ గాంధారః శకునిర్యుధ్యతామిహ॥ 23
మీ మేనమామ శకుని బలే బుద్ధిమంతుడు. క్షాత్ర ధర్మంలో పండితుడు. మాయాద్యూతాన్ని ఆడగల ఆ గాంధారరాజు శకుని కూడా ఇక్కడ యుద్ధమే చేయాలి. (23)
నాక్షాన్ క్షిపతి గాండివం న కృతం ద్వాపరం న చ।
జ్వలతో నిశితాన్ బాణాన్ తాంస్తాన్ క్షిపతి గాండివమ్॥ 24
గాండీవధనుస్సు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం పేర పాచికలను విసరదు. కానీ వాడియై, మండిపడుతున్న రకరకాల బాణాలను వర్షిస్తుంది. (24)
న హి గాండీవ నిర్ముక్తాః గార్ధ్రపక్షాః సుతేజనాః।
నాంతరేష్వవతిష్ఠంతే గిరీణామపి దారణాః॥ 25
గ్రద్దరెక్కలు పక్షాలుగా కల అర్జునుని వాడి బాణాలు పర్వతాలను కూడా బ్రద్దలు చేస్తాయి. అవి శత్రువుల గుండెల్లో తప్ప మధ్యలో ఆగవు. (25)
అంతకః పవనో మృత్యుః తథాగ్నిర్బడబాముఖః।
కుర్యురేతే క్వచిచ్ఛేషం న తు క్రుద్ధో ధనంజయః॥ 26
యమధర్మరాజు, వాయుదేవుడు, మృత్యువు, బడబాగ్ని సమూలంగా నశింపజేయక కొంత మిగిల్చే అవకాశం ఉంటుందేమో కానీ అర్జునుడు కోపిస్తే దేనినీ వదలడు. (26)
యథా సభాయాం ద్యూతం త్వం మాతులేన సహాకరోః।
తథా యుధ్యస్వ సంగ్రామే సౌబలేన సురక్షితః॥ 27
రాజా! రాజసభలో మేనమామతో కలిసి జూదమాడావు గదా! ఆ విధంగానే ఈ రణరంగంలో కూడా శకుని రక్షణలో నిలిచి యుద్ధం చేయి. (27)
యుధ్యంతాం కామతో యోధాః నాహం యోత్స్యే ధనంజయమ్।
మత్స్యో హ్యస్మాభిరాయోధ్యో యధ్యః గచ్ఛేద్ గవాం పదమ్॥ 28
ఇతరయోధులు ఇష్టమయితే యుద్ధం చేయవచ్చు. కానీ నేను అర్జునునితో పోరాడను. మనం విరాటరాజు తోనే యుద్ధం చేయాలి. ఉత్తర గోస్థానానికి విరాటుడు వస్తే నేను ఆయనతో యుద్ధం చేస్తాను. (28)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణ పర్వణి ఉత్తరగోగ్రహే ద్రౌణివాక్యం నామ పంచాశత్తమోఽధ్యాయః॥ 50 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహణమున అశ్వత్థామ అభిప్రాయము అను ఏబదియవ అధ్యాయము. (50)