48. నలువదియెనిమిదవ అధ్యాయము
కర్ణుని అహంకారపుమాటలు.
కర్ణ ఉవాచ
సర్వానాయుష్మతో భీతాన్ సంత్రస్తానివ లక్షయే।
అయుద్ధమనసశ్చైవ సర్వాంశ్చైవానవస్థితాన్॥ 1
కర్ణుడు అన్నాడు. ఈ దీర్ఘాయువులందరూ భయపడిన వారిలా, యుద్ధంమీద ఆసక్తి లేనివారిలా, నిలకడ కోల్పోయిన వారిలా కనిపిస్తున్నారు. (1)
యద్యేష రాజా మత్స్యానాం యది బీభత్సురాగతః।
అహమావారయిష్యామి వేలేన మకరాలయమ్॥ 2
ఈ వచ్చినవాడు విరాటరాజే అయినా, అర్జునుడే అయినా సముద్రాన్ని చెలియలికట్ట నిలువరించినట్లు నేను నిలువరిస్తాను. (2)
మమ చాపప్రయుక్తానాం శరాణాం నతపర్వణామ్।
నావృత్తిర్గచ్ఛతాం తేషాం సర్పాణామివ సర్పతామ్॥ 3
నావింటినుండి ప్రయోగింపబడిన బాణాలు వంగిన కణుపులు గలవై చరచరా ప్రాకే పాములవంటివి. గురి తప్పుట అసంభవం. (3)
రుక్మపుంఖాః సుతీక్ష్ణాగ్రాః ముక్తా హస్తవతా మయా।
ఛాదయంతు శరాః పార్థం శలభా ఇవ పాదపమ్॥ 4
నా బాణాలు స్వర్ణపుంఖాలు, వాడియైన అగ్రభాగాలు గలవి. అటువంటి వాటిని చేయి తిరిగిన నేను ప్రయోగిస్తే చెట్టును క్రమ్ముకొన్న మిడతలవలె అర్జునుని క్రమ్మివేస్తాయి. (4)
శరణాం పుంఖసక్తానాం మౌర్వ్యాభిహతయా దృఢమ్।
శ్రూయతాం తలయోః శబ్దః భేర్యోరాహతయోరివ॥ 5
దృఢంగా నా నారినుండి శరపరంపరలు విడుస్తున్నపుడు నా చేతితొడుగుల శబ్దం భెరీలి మ్రోగిస్తున్నట్లు ఉంటుంది. వినండి. (5)
సమాహితో హి బీభత్సుః వర్షాణ్యష్టౌ చ పంచ చ।
జాతస్నేహశ్చ యుద్ధేఽస్మిన మయి సంప్రహరిష్యతి॥ 6
ఈ అర్జునుడు పదమూడు సంవత్సరాలు నిశ్చల భావనతో నిలిచియున్నాడు. ఇప్పుడు యుద్ధంపై మక్కువతో వచ్చి నాపై బాణప్రహారం చేస్తాడట. (6)
పాత్రీభూతశ్చ కౌంతేయః బ్రాహ్మణో గుణవానివ।
శరౌఘాన్ ప్రతిగృహ్ణాతు మయా ముక్తాన్ సహస్రశః॥ 7
కుంతీకుమారుడైన ఆ అర్జునుడు గుణవంతుడైన బ్రాహ్మణునివలె నేను వేలకొలదిగ గుప్పించే బాణాల ప్రవాహాన్ని ప్రతిగ్రహిస్తాడు. (7)
ఏషచైవ మహేష్వాసః త్రిషు లోకేషు విశ్రుతః।
అహం చాపి నరశ్రేష్ఠాత్ అర్జునాన్నావరః క్వచిత్॥ 8
ఈ అర్జునుడు గొప్ప విలుకాడుగా మూడు లోకాలలో ప్రసిద్ధికెక్కినవాడు. నరశ్రేష్ఠుడైన ఆ అర్జునుని కంటె నేనే విషయంలోనూ తీసిపోను. (8)
ఇతశ్చేతశ్చ నిర్ముక్తైః కాంచనై ర్గార్ధ్రవాజితైః।
దృశ్యతామద్య వై వ్యోమ ఖద్యోతైరివ సంవృతమ్॥ 9
ఇప్పుడు గ్రద్దయీకలతో వేగవంతాలైన నా బంగారు బాణాలు వింటినుండి విడువబడినవై ఎడాపెడా మింటికెగిరితే ఆకసం మిణుగురులతో నిండినట్లు కనిపిస్తుంది. (9)
అద్యాహ మృణమక్షయ్యం పురా వాచా ప్రతిశ్రుతమ్।
ధార్తరాష్ట్రాయ దాస్యామి నిహత్య సమరేఽర్జునమ్॥ 10
ఇంతకుముందు నేను మాట ఇచ్చిన ప్రకారం ఈనాటి యుద్ధంలో అర్జునుని సంహరించి మరోవిధంగా తీర్చలేని సుయోధనుని అప్పు తీర్చి వేస్తాను. (10)
అన్తరాచ్ఛిద్యమానానాం పుంఖానాం వ్యతిశీర్యతామ్।
శలభానామివాకాశే ప్రచారః సంప్రదృశ్యతామ్॥ 11
మధ్యలోనే విరిగి జారిపడుతున్న రెక్కలుగల బాణాల గమనం ఆకాశంలో సంచరించే మిడతల గమనంవలె స్పష్టంగా కనిపిస్తుంది. (11)
ఇంద్రాశనిసమస్పర్శైః మహేంద్రసమతేజసమ్।
అర్దయిష్యామ్యహం పార్థమ్ ఉల్కాభిరివ కుంజరమ్॥ 12
అర్జునుడు దేవేంద్రునితో సమానమైన తేజస్సు గలవాడు. అయినా వజ్రాయుధంతో సమానమైన తాకిడి గల నా బాణాలతో ఉల్కలు ఏనుగును పీడించినట్లు పీడిస్తాను. (12)
రథాదతిరథం శూరం సర్వశస్త్రభృతాం వరమ్।
వివశం పార్థమాదాస్యే గరుత్మానివ పన్నగమ్॥ 13
అర్జునుడు అతిరథుడు. విలుకాండ్రతో మేటి, వీరుడును. అటువంటి పార్థుని నేడు యుద్ధంలో మూర్ఛిల్లజేసి గరుత్మంతుడు పామును పట్టుకొని వచ్చినట్లు రథం నుండి పట్టి తెస్తాను. (13)
తమగ్నిమివ దుర్ధర్షమ్ అసిశక్తి శరేంధనమ్।
పాండవాగ్నిమహం దీనం ప్రదహంతమివాహితమ్॥ 14
అశ్వవేగపురోవాతః రథౌఘస్తనయిత్నుమాన్।
శరధారో మహామేఘః శమయిష్యామి పాండవమ్॥ 15
అర్జునుడు అగ్నివంటివాడు. కత్తులు, శక్తులు, బాణాలు ఆ అగ్నికి ఇంధనాలు. శత్రువులను బూడిద చేసేటట్లు అది మండుతూ ఉంటుంది. కానీ నేను ఒక కాలమేఘాన్ని, నా అశ్వాల వేగమే అనుకూల మారుతం. రథసమూహమే ఉరుములు. శరధారలే వర్షం. ఆ అర్జునాగ్నిని నేనే ఆర్పివేస్తాను. (14,15)
మత్కార్ముకవినిర్ముక్తాః పార్థమాశీవిషోపమాః।
శరాః సమభిసర్పంతు వల్మీకమివ పన్నగాః॥ 16
నా ధనుస్సు నుండి వెలువడిన బాణాలు త్రాచుపాములవంటివి. త్రాచుపాములు అన్ని వైపుల నుండి పుట్టలో దూరినట్టు అవి అర్జునునిలోనికి చొచ్చుకొనిపోతాయి. (16)
సుతేజనై రుక్మపుంఖైః సుధౌతైర్నతపర్వభిః।
ఆచితం పశ్య కౌంతేయం కర్ణికారైరివాచలమ్॥ 17
గొప్పతేజస్సు, సువర్ణపక్షాలు, చక్కగా చెక్కబడిన కణుపులు
గలిగి ప్రకాశిస్తున్న నా బాణాలు కొండగోగులు పర్వతాన్ని కప్పివేసినట్టు అర్జునుని ముంచెత్తటం నీవు చూస్తావు. (17)
జామదగ్న్యాన్మయా హ్యస్త్రం యత్ ప్రాప్తమృషిసత్తమాత్।
తదుపాశ్రిత్య వీర్యం చ యుధ్యేయమపి వాసవమ్॥ 18
మునిసత్తముడైన పరశురాముని నుండి పొందిన అస్త్రాలను నా పరాక్రమాన్ని మేళవించి నేను ఇంద్రునితో నయినా యుద్ధం చేయగలను. (18)
ధ్వజాగ్రే వానరస్తిష్ఠన్ భల్లేన నిహతో మయా।
అద్యైవ పతతాం భూమౌ వినదన్ భైరవాన్ రవాన్॥ 19
అర్జునుని ధ్వజాగ్రంపై నిలిచిఉన్న కోతి నేడు నా బల్లెపుడ్ దెబ్బ తగిలి పెడబొబ్బలు పెడుతూ భూమి కొరిగిపోవును గాక! (19)
శత్రోర్మయా విపన్నానాం భూతానాం ధ్వజవాసినామ్।
దిశః ప్రతిష్ఠమానానామ్ అస్తు శబ్దో దివమ్గమః॥ 20
మన శత్రువైన అర్జునుని ధ్వజాన్ని ఆశ్రయించి యున్న భూతాలు నాదెబ్బ తగిలి అన్ని దిక్కులకూ పారిపోతూ చేస్తున్న ఆక్రోశధ్వని స్వర్గలోకం వరకు వినిపించును గాక! (20)
అద్య దుర్యోధనస్యాహం శల్యం హృది చిరస్థితమ్।
సమూలముద్ధరిష్యామి బీభత్సుం పాతయన్ రథాత్॥ 21
అర్జునుని రథంమీదనుండి పడద్రోసి ఎప్పటి నుండియో సుయోధనుని గుండెలో గ్రుచ్చు కొనియున్న శల్యాన్ని (ముల్లు) ఈనాడు సమూలంగా పెకలించి వేస్తాను. (21)
హతాశ్వం విరథం పార్థం పౌరుషే పర్యవస్థితమ్।
నిఃశ్వసంతం యథా నాగమ్ అద్య పశ్యంతు కౌరవాః॥ 22
పౌరుషంతో పోరాడుతున్న అర్జునుని గుఱ్ఱాలు చచ్చి, రథం విరిగిపోగా పాములవలె కేవలం బుసలు కొడుతున్న అర్జునుని కౌరవు లీనాడు చూస్తారు. (22)
కామం గచ్ఛంతు కురవః ధనమాదాయ కేవలమ్।
రథేషు వాపి తిష్ఠంతః యుద్ధం పశ్యంతు మామకమ్॥ 23
కౌరవులకు గోధనమే ముఖ్యమయితే దానినే తీసికొని స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. కాదంటే రథాలపై నిలిచి నా యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు.' (23)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే కర్ణవికత్థనే అష్టచత్వారింశోఽధ్యాయః॥ 48 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహణమున
కర్ణుని అహంకారోక్తులు అను నలువదియెనిమిదవ అధ్యాయము. (48)