46. నలువదియారవ అధ్యాయము
అర్జునుడు రథమెక్కి శంఖమునూదుట, ద్రోణాచార్యుడు కౌరవులకు అపశకునముల నెఱిగించుట.
వైశంపాయన ఉవాచ
ఉత్తరం సారథిం కృత్వా శమీం కృత్వా ప్రదక్షిణమ్।
ఆయుధం సర్వమాదాయ ప్రయయౌ పాండవర్షభః॥ 1
వైశంపాయనుడు చెప్పాడు. జనమేజయా! పాండవశ్రేష్ఠుడైన అర్జునుడు ఉత్తరుని సారథిగా చేసికొని, జమ్మిచెట్టుకు ప్రదక్షిణంచేసి ఆయుధాలన్నీ తీసికొని బయలుదేరాడు.
ధ్వజం సింహం రథాత్ తస్మాత్ అపనీయ మహారథః।
ప్రణిధాయ శమీమూలే ప్రాయాదుత్తరసారథిః॥ 2
అర్జునుడు ఆ రథంనుండి సింహధ్వజాన్ని తీసి శమీవృక్షమూల ముందుంచి సారథి అయిన ఉతరునితో బాటు బయలుదేరాడు. (2)
దైవీం మాయాం రథే యుక్తాం విహితాం విశ్వకర్మణా।
కాంచనం సింహలాంగూలం ధ్వజం వానరలక్షణమ్॥ 3
మనసా చింతయామాస ప్రసాదం పావకస్య చ।
స చ తచ్చింతనం జ్ఞాత్వా ధ్వజే భూతాన్యదేశయత్॥ 4
అప్పుడు అర్జునుడు అగ్ని అనుగ్రహం వలన లభించిన తన సువర్ణమయధ్వజాన్ని మనసులో తలచుకొన్నాడు. ఆ ధ్వజం విశ్వకర్మ తయారుచేసిన దైవీమాయ. రథం తోడనే కలిసి ఉండేది. వానర లక్షణం కలిగినది. పొడవైన దానితోక సింహంవలె భాసిస్తోంది. అగ్ని దేవుడు కూడా అర్జునుని మనోభావాన్ని గ్రహించి ధ్వజంపై నిలవవలసినదిగ భూతాలను ఆదేశించాడు. (3,4)
సపతాకం విచిత్రాంగం సోపాసంగం మహాబలమ్।
ఖాత్ సపాత రథే తూర్ణం దివ్యరూపం మనోరమమ్॥ 5
అప్పుడు విచిత్రాలయిన అంగాలు, కలిగి, పతాకతో కూడి, మహాబలసంపన్నమై, మనోహర మైన దివ్యరూపం గల ఆ ధ్వజం అక్షయతూణీరంతో సహా వెంటనే ఆకాశం నుండి అర్జునుని రథంపై పడింది. (5)
రథం తమాగతం దృష్ట్వా దక్షిణం ప్రాకరోత్తదా।
రథమాస్థాయ బీభత్సుః కౌంతేయః శ్వేతవాహనః॥ 6
బద్ధగోధాంగుళిత్రాణః ప్రగృహీతశరాసనః।
తతః ప్రాయాదుదీచీం చ కపిప్రవరకేతనః॥ 7
రథంపైకి వచ్చిన ఆ ధ్వజాన్ని చూసి అర్జునుడు అప్పుడు ఆ రథానికి ప్రదక్షిణం చేశాడు. ఆ రథంపై కూర్చొని శ్వేతవాహనుడైన కౌంతేయుడు ఉడుము చర్మంతో చేసిన హస్తకవచాన్ని (చేతి తొడుగు) తొడుగు కొని, ధనుస్సును చేత బట్టి ఆంజనేయుడు కేతనంగా గల ఆ రథాన్ని ఉత్తరదిక్కుగా నడిపించాడు. (6,7)
స్వనవంతం మహాశంఖం బలవానరిమర్దనః।
ప్రాధమత్ బలమాస్థాయ ద్విషతాం లోమహర్షణమ్॥ 8
అప్పుడు అరిమర్దనుడైన ఆ అర్జునుడు గొప్పగా శబ్దించగల తన మహాశంఖాన్ని బలమంతా వినియోగించి ఊదాడు. ఆ నాదంతో శత్రువుల రోమాలు నిక్క బొడుచుకున్నాయి. (8)
(శశాంకరూపం బీభత్సుః ప్రాధ్మాపయదరిందమః।
శంఖశబ్దోఽస్య సోఽత్యర్థం శ్రూయతే కాలమేఘవత్॥
తస్య శంఖస్య శబ్దేన ధనుషో నిస్వనేన చ॥
వానరస్య చ నాదేన రథనేమిస్వనేన చ।
జంగమస్య భయం ఘోరమ్ అకరోత్ పాకశాసనిః॥)
శత్రుమర్దనుడైన పాకశాసని(అర్జునుడు) చంద్రునివలె ఉజ్జ్వలరూపంగల తన శంఖాన్ని పూరించాడు. తీవ్రమైన ఆ శంఖధ్వని వర్షాకాలపుమేఘనాదం వలె వినిపించింది. శంఖధ్వనితోనూ, ధనుష్టంకారంతోనూ ఆంజనేయుని నాదంతోనూ, రథపు ఇరుసు చప్పుళ్ళతోనూ ప్రాణులలో ఘోర భయాన్ని కల్గించాడు అర్జునుడు.
తతస్తే జవనా ధుర్యాః జానుభ్యాఽమగమన్మహీమ్।
ఉత్తరశ్చాపి సంత్రస్తః రథోపస్థ ఉపావిశత్॥ 9
అప్పుడా శంఖధ్వనిచే భయపడినవై రథానికి పూన్చిన జవనశ్చాలు మోకాళ్ళు నేలకు తాకించి హఠించాయి/నిలిచిపోయాయి. ఉత్తరుడుకూడా భయపడి నొగలిపై చతికిల పడ్డాడు. (9)
సంస్థాప్య చాశ్వాన్ కౌంతేయః సముద్యమ్య చ రశ్మిభిః।
ఉత్తరం చ పరిష్వజ్య సమాశ్వాసయదర్జునః॥ 10
అప్పుడు కౌంతేయుడైన అర్జునుడు గుఱ్ఱాలను లేపి, పగ్గాలతో నియంత్రించి, ఉత్తరుని కౌగిలించుకొని నెమ్మదింపజేశాడు. (10)
అర్జున ఉవాచ
మా భైస్త్వం రాజపుత్రాగ్ర్య క్షత్రియోఽసి పరంతప।
కథం తు పురుషవ్యాఘ్ర శత్రుమధ్యే విషీదసి॥ 11
అర్జునుడన్నాడు. 'పరంతపా! రాజకుమారా! నీవు క్షత్రియుడవు. భయపడవలదు. పురుషవ్యాఘ్రా! శత్రువుల సమక్షంలో (కంగారు) భయపడవచ్చా? (11)
శ్రుతాస్తే శంఖశబ్దాశ్చ భేరీశబ్దాశ్చ పుష్కలాః।
కుంజరాణాం చ నదతాం వ్యూఢానీకేషు తిష్ఠతామ్॥ 12
నీవు శంఖశబ్దాల నెన్నింటినో వినియుంటావు. ఎన్నోమార్లు భేరీశబ్దాలను విని ఉంటావు. శత్రువులు పన్నిన వ్యూహాలమధ్యలో నున్న ఏనుగుల ఘీంకారాలు కూడా విని ఉంటావు. (12)
స త్వం కథమిహానేన శంఖశబ్దేన భీషితః।
వివర్ణరూపో విత్రస్తః పురుషః ప్రాకృతో యథా॥ 13
అటువంటి నీవు ఇక్కడ ఈ శంఖధ్వనితో ఎలా భయపడ్డావు? సాధారణమానవుడిలా భయపడి కళతప్పి పోయావు కూడా.' (13)
ఉత్తర ఉవాచ
శ్రుతా మే శంఖశబ్దాశ్చ భేరీశబ్దాశ్చ పుష్కలాః।
కుంజరాణాం నినదతాం వ్యూఢానీకేషు తిష్ఠతామ్॥ 14
ఉత్తరుడన్నాడు. నేను శంఖశబ్దాలు ఎన్నో విని యున్నాను. ఎన్నోమార్లు భేరీ శబ్దాలను విన్నాను. శత్రువులు వన్నిన వ్యూహాలమధ్యలోని ఏనుగుల ఘింకారాలను సయితం వినియున్నాను. (14)
నైవం విధః శంఖశబ్దః పురా జాతు మయాశ్రుతః।
ధ్వజస్య చాపి రూపం మే దృష్టపూర్వం న హీదృశమ్॥ 15
కానీ ఇటువంటి శంఖధ్వని నే నింతకు మునుపెప్పుడూ వినలేదు. అంతేకాదు. ఇటువంటి ధ్వజరూపాన్ని కూడా ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. (15)
ధనుషశ్చైవ నిర్ఘోషః శ్రుతపూర్వో న మే క్వచిత్।
అస్య శంఖస్య శబ్దేన ధనుషో నిస్వనేన చ॥ 16
అమానుషాణాం శబ్దేన భూతానాం ధ్వజవాసినామ్।
అమానుషాణాం శబ్దేన భూతానాం ధ్వజవాసినామ్।
రథస్య చ నినాదేన మనో ముహ్యతి మే భృశమ్॥ 17
ఇటువంటి ధనుష్టంకారాన్ని కూడా ఇంతకు ముందెప్పుడూ వినలేదు. ఈ శంఖధ్వని చేత, ఈ ధనుష్టంకారంచేత, ధ్వజంపై నున్న అమానుషభూతాల నినాదాలచేత, రథగమనధ్వనిచేత నామనస్సు చాలా కలతపడుతోంది. (16,17)
వ్యాకులాశ్చ దిశస్సర్వాః హృదయం వ్యథతీవ మే।
ధ్వజేన పిహితాః సర్వాః దిశో న ప్రతిభాంతి మే॥ 18
అన్ని దిక్కులూ తిరుగుతున్నట్లున్నాయి. నా హృదయం కలతపడుతోంది. ఈ ధ్వజం దిక్కులన్నీ క్రమ్మేసింది. నాకు దిక్కు తోచటంలేదు. (18)
గాండీవస్య చ శబ్దేన కర్ణౌ మే బధిరీకృతౌ।
స ముహూర్తం ప్రయాతం తు పార్థో వైరాటిమబ్రవీత్॥ 19
ఈ గాండీవధనుష్టంకారం వలన నా రెండు చెవులూ వినిపించటంలేదు.' ఈ విధంగా రెండు క్షణాలు గడిచాక అర్జునుడు ఉత్తరునితో ఇలా అన్నాడు. (19)
అర్జున ఉవాచ
ఏకాంతం రథమాస్థాయ పద్భ్యాం తమవపీడయన్।
దృఢంచ రశ్మీన్ సంయచ్ఛ శంఖం ధ్మాస్యామ్యహం పునః॥ 20
అర్జునుడన్నాడు. 'రథంపై స్థిరంగా కూర్చొని, పాదాలతో రథాన్ని త్రొక్కిపట్టుకొని, పగ్గాలను గట్టిగా పట్టుకో. నేను మరో సారి శంఖాన్ని ఊదుతాను.' (20)
వైశంపాయన ఉవాచ
తతః శంఖముపాధ్మాసీద్ దారయన్నివ పర్వతాన్।
గుహాగిరీణాం చ తదా దిశః శైలాంస్తథైవ చ।
ఉత్తరశ్చాపి సంలీనః రథోపస్థ ఉపావిశత్॥ 21
వైశంపాయను డన్నాడు. అప్పుడు పర్వతాలను, పర్వతగుహలను, దిక్కులను, చట్టుబండలను బ్రద్దలు చేస్తూ అర్జునుడు మరల శంఖాన్ని పూరించాడు. ఉత్తరుడు మరలా నొగలిపై ముడుచుకొని కూర్చున్నాడు. (21)
తస్య శంఖస్య శబ్దేన రథనేమిస్వనేన చ।
గాండీవస్య చ ఘోషేణ పృథివీ సమకంపత॥ 22
ఆ శంఖధ్వనితో, ఆ రథపుటిరుసుల చప్పుళ్ళతో గాండీవఘోషతో భూమి కంపించింది. (22)
తం సమాశ్వాసయామాస పునరేవ ధనంజయః॥ 23
అర్జునుడు మరలా ఉత్తరుని కుదుటపరచాడు. (23)
ద్రోణ ఉవాచ
యథా రథస్య నిర్ఘోషః యథా మేఘ ఉదీర్యతే।
కంపతే చ యథా భూమిః నైషోఽన్యః సవ్యసాచినః॥ 24
(ఈ శంఖాదిధ్వనులను విని కౌరవసేనలో నున్న) ద్రోణాచార్యుడన్నాడు. 'ఈరథ నిర్ఘోషం మేఘగర్జనతో సమానంగా ఉంది. ఈ శబ్దానికి భూమి అదురుతోంది. కాబట్టి ఈ వస్తున్న వ్యక్తి సవ్యసాచికన్న ఇతరుడు కాడు. (24)
శస్త్రాణి న ప్రకాశంతే న ప్రహృష్యంతి వాజినః।
అగ్నయశ్చ న భాసంతే సమిద్ధాస్తన్న శోభనమ్॥ 25
మన శస్త్రాలు వెలుగులు చిమ్మటం లేదు. మన గుఱ్ఱాలు ప్రసన్నంగా కనిపించటం లేదు. అగ్ని హోత్రమందలి అగ్నులు సయితం ప్రకాశించటం లేదు. ఇది శుభసూచన కాదు. (25)
ప్రత్యాదిత్యం చ నః సర్వే మృగా ఘోరప్రవాదినః।
ధ్వజేషు చ నిలీయంతే వాయసాస్తన్న శోభనమ్॥ 26
మన పశువులన్నీ సూర్యునకభిముఖమ్గా నిలిచి భీకరంగా అరుస్తున్నాయి. మన రథధ్వజాలపై కాకులు ఎగురుతున్నాయి. ఇది శుభసూచన కాదు. (26)
శకునాశ్చాపసవ్యా నః వేదయంతి మహద్ భయమ్॥ 27
గోమాయురేషసేనాయాం రుదన్ మధ్యేన ధావతి।
అనాహతశ్చ నిష్క్రాంతః మహద్ వేదయతే భయమ్॥ 28
పక్షులు మనకెడమవైపుగా ఎగురుతూ చాలా భయాన్ని కలిగిస్తున్నాయి. (సూచిస్తున్నాయి.) ఈ నక్క ఎవ్వరూ తరుమకున్నా (కొట్టకున్నా) ఏడుస్తూ మన సేనమధ్యగా పరువులెత్తిపోవడం తీవ్రభయాన్ని సూచిస్తోంది. (27,28)
భవతాం రోమకూపాణి ప్రహృష్టాన్యుపలక్షయే।
ధ్రువం వినాశో యుద్ధేన క్షత్రియాణాం భవిష్యతి॥ 29
మీ రోమకూపాలు నిక్కపొడుచుకొనటం నాకు స్పష్టంగా తెలుస్తోంది. తప్పని సరిగ యుద్ధకారణంగా క్షత్రియనాశం జరుగుతుంది. (29)
జ్యోతీంషి న ప్రకాశంతే దారుణా మృగపక్షిణః।
ఉత్పాతా వివిధా ఘోరాః దృశ్యంతే క్షత్రనాశనాః॥ 30
సూర్యుడు మొదలయిన జ్యోతుల వెలుగు మందగిస్తోంది. భీకరమైన మృగాలూ, పక్షులూ ఎదుట పడుతున్నాయి. క్షత్రియనాశనాన్ని సూచించే రకరకాల ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. (30)
విశేషత ఇహాస్మాకం నిమిత్తాని వినాశనే।
ఉల్కాభిశ్చ ప్రదీప్తాభిః బాధ్యతే పృతనా తవ।
వాహనాన్యప్రహృష్టాని రుదంతీవ విశాంపతే॥ 31
మహారాజా! ప్రత్యేకించి ఈ అపశకునాలు మన వినాశనాన్నే ఎక్కువగా సూచిస్తున్నాయి. నీసేనపై మండుతున్న ఉల్కలు పడి సేనను బాధిస్తున్నాయి. నీవాహనాలైన అశ్వగజాదులు అప్రసన్నంగా రోదిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. (31)
ఉపాసతే చ సైన్యాని గృధ్రాస్తే చ సమంతతః।
తప్స్యతే వాహినీం దృష్ట్వా పార్థబాణప్రపీడితామ్।
పరాభూతా చ వః సేనా న కశ్చిద్ యోద్ధుమిచ్ఛతి॥ 32
నీసేనకు నలుదిక్కులా గ్రద్దలు చుట్టుముట్టి కూర్చొని ఉన్నాయి. అర్జునుని బాణాలచే పీడింపబడిన నీ సేనను చూచి నీవు బాధపడవలసి వస్తుంది. నీసేన ఇప్పటికే ఓడిపోయినట్లు ఉంది. ఎందుకంటే యుద్ధం చెయ్యాలన్న దృష్టి ఒకరిలోనూ కానరావటంలేదు. (32)
వివర్ణముఖభూయిష్ఠాః సర్వే యోధా విచేతసః।
గాః ప్రస్థాప్య తిష్ఠామః వ్యూఢానీకాః ప్రహారిణః॥ 33
మన యోధులంతా వివర్ణవదనాలతో నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. గోవులను హస్తినకు పంపి మనం వ్యూహాన్ని పన్ని శత్రువుల నెదిరించుదాం.' (33)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే ఔత్పాతికోనామ షట్చత్వారింశోఽధ్యాయః॥ 46 ॥
ఇది శ్రీమహాభారతమున విరాట పర్వమున గోహరనపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహమున
ద్రోణుడు అపశకునములను తెలుపుట అను నలువది ఆరవ అధ్యాయము. (46)
(దాక్షిణాత్యప్రతి అధికపాఠము 2 1/2 శ్లోకాలతో కలిపి మొత్తం 35 1/2 శ్లోకములు.)