38. ముప్పదిఎనిమిదవ అధ్యాయము
ఉత్తరుడు భయపడుట, అర్జునుడు ధైర్యము చెప్పుట.
వైశంపాయన ఉవాచ
స రాజధాన్యా నిర్యాయ వైరాటిరకుతోభయః।
ప్రయాహీత్యబ్రవీత్ సూతం యత్ర తే కురవో గతాః॥ 1
వైశంపాయనుడు చెప్తున్నాడు. విరాటరాజు కొడుకు ఉత్తరుడు నిర్భయంగా రాజధాని నుండి బయలుదేరి 'కౌరవులు వెళ్ళినవైపు రథం పోనియ్యి'అని సారథితో అన్నాడు. (1)
సమవేతాన్ కురూన్ సర్వాన్ జిగీషూనవజిత్య వై।
గాస్తేషాం క్షిప్రమాదాయ పునరేష్యామ్యహం పురమ్॥
"విజయం పొందాలనే కోరికతో చేరిన కౌరవులందర్నీ ఓడించి, వారినుండి ఆవులను తిరిగిపొంది నేను వెంటనే నగరానికి తిరిగివస్తాను." (2)
తతస్తాంశ్చోదయామాస సదశ్వాన్ పాండునందనః।
తే హయా నరసింహేన నోదితా వాతరంహసః।
ఆలిఖంత ఇవాకాశమ్ ఊహుః కాంచనమాలినః॥ 3
అప్పుడు పాండురాజుకొడుకు నరులలో సింహం లాంటి అర్జునుడు ఆమేలు జాతి గుర్రాల్ని తోలుతున్నాడు. బంగారు హారాలు కట్టిన ఆ గుర్రాలు వాయువేగంతో ఆకాశాన్ని గిట్టలతో గీస్తున్నట్లు రథాన్ని లాగుతున్నాయి. (3)
నాతిదూరమథో గత్వా మత్స్యపుత్రధనంజయౌ।
అవేక్షేతామమిత్రఘ్నౌ కురూణాం బలినాం బలమ్॥ 4
శత్రువుల్ని అణచే ఉత్తర ధనంజయు(అర్జును)లిద్దరూ కొద్దిదూరం వెళ్ళి బలవంతులైన కౌరవుల సైన్యాన్ని చూశారు. (4)
శ్మశానమభితో గత్వా ఆససాద కురూనథ।
తాం శమీమన్వవీక్షేతాం వ్యూఢానీకాంశ్చ సర్వశః॥ 5
శ్మశానంవైపు వెళ్ళి కౌరవుల్ని చేరారు. వాళ్ళిద్దరు ఆ జమ్మిచెట్టు చుట్టూ అన్నివైపులా వ్యూహాలతో నిలిచిన కౌరవ సైనికుల్ని చూస్తున్నారు. (5)
తదనీకం మహత్ తేషాం విబభౌ సాగరోపమమ్।
సర్పమాణమివకాశే వనం బహులపాదపమ్॥ 6
కౌరవుల సైన్యం సముద్రంలా అనిపిస్తోంది. కదిలే ఆసైన్యం చాలా చెట్లతో నిండిన వనం ఆకాశంలో కదులుతున్నట్లుగా భాసిస్తోంది. (6)
దదృశో పార్థివో రేణుః జనితస్తేన సర్పతా।
దృష్టిప్రణాశో భూతానాం దివస్పృక్ కురుసత్తమ॥ 7
కౌరవశ్రేష్ఠా! జనమేజయా! కదిలే ఆసైన్యం నుండి ఎగసిపడే దుమ్ము ఆకాశాన్నంటుతున్నట్లు కనబడుతోంది. ప్రాణులన్నిటికి దృష్టిలోకం కలుగుతోంది. (7)
తదనీకం మహద్ దృష్ట్వా గజాశ్వరథసంకులమ్।
కర్ణదుర్యోధనకృపైః గుప్తం శాంతనవేన చ॥ 8
ద్రోణేన చ సపుత్రేణ మహేష్వాసేన ధీమతా।
హృష్టరోమా భయోద్విగ్నః పార్థం వైరాటిరబ్రవీత్॥ 9
కర్ణ దుర్యోధన కృప భీష్ములచేతనూ, ధనుర్ధారి, బుద్ధిమంతుడై పుత్రసహితుడైన ద్రోణునిచేతనూ కాపాడబడుతూ, ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండిన కౌరవసైన్యాన్ని చూసి శరీరం భయంతో, అలజడితో గగుర్పొడిచింది ఉత్తరుడికి. వెంటనే అర్జునుడితో ఇలా అంటున్నాడు. (8,9)
ఉత్తర ఉవాచ
నోత్సహే కురుభిర్యోద్ధుం రోమహర్షం హి పశ్య మే।
బహుప్రవీరమత్యుగ్రం దేవైరపి దురాసదమ్॥ 10
"కౌరవులతో తలపడేంత సాహసం నాకు లేదు. భయంతో నాఒళ్ళు గగుర్పొడిచింది చూడు. అమ్మో! ఈ సైన్యం అనేకవీరులతో భయంకరంగా ఉంది. దేవతలుకూడా దీన్ని సమీపించలేరు. (10)
ప్రతియోద్ధుం న శక్ష్యామి కురుసైన్యమనంతకమ్।
నాశంసే భారతీం సేనాం ప్రవేష్టుం భీమకార్ముకామ్॥ 11
అంతులేని ఈకౌరవసైన్యంతో తలపడలేను సరిగదా భయంకర ధనుస్సులు కల భరతవంశీయుల సైన్యంలో ప్రవేశింపలేనుకూడా. (11)
రథనాగాశ్చకలిలాం పత్తిధ్వజసమాకులామ్।
దృష్ట్యైవ హి పరానాజౌ మనః ప్రవ్యథతీవ మే॥ 12
రథాలు, ఏనుగులు, గుర్రాలతో నిండి, సైనికులు, ధ్వజాలతో వ్యాపించిన యుద్ధభూమిలో శత్రువుల్ని చూస్తేనే నామనసు వ్యథచెందుతోంది. (12)
యత్ర ద్రోణశ్చ భీష్మశ్చ కృపః కర్ణో వివింశతిః।
అశ్వత్థామా వికర్ణశ్చ సోమదత్తశ్చ బాహ్లికః॥ 13
దుర్యోధనస్తథా వీరః రాజా చ రథినాం వరః।
ద్యుతిమంతో మహేష్వాసాః సర్వే యుద్ధవిశారదాః॥ 14
ద్రోణ, భీష్మ, కృప, కర్ణ, వివింశతి, అశ్వత్థామ, వికర్ణ, సోమదత్త, బాహ్లికలు; రథిక శ్రేష్ఠుడు, వీరుడూ అయిన దుర్యోధన మహారాజు ఉన్న ఆ యుద్ధభూమిలో అందరూ తేజస్వులు, ధనుర్ధారులు ఆ యుద్ధమందు ఆరితేరినవారు. (13,14)
దృష్ట్యైవ హి కురూనేతాన్ వ్యూఢానీకాన్ ప్రహారిణః।
హృషితాని చ రోమాణి కశ్మలం చాగతం మమ॥ 15
సైన్యాన్ని వ్యూహాలుగా ఏర్పరచి దెబ్బతీయటానికి కాలు దువ్వుతున్న ఈ కౌరవుల్ని చూస్తుంటేనే నా ఒళ్ళు గగుర్పొడిచింది. తెలివి తప్పిపోతోంది.' (15)
వైశంపాయన ఉవాచ
అవిజాతో విజాతస్య మౌర్ఖ్యాద్ ధూర్తస్య పశ్యత।
పరిదేవయతే మందః సకాశే సవ్యసాచినః॥ 16
వైశంపాయనుడు అన్నాడు. మూర్ఖుడైన ఉత్తరుడు సాధారణ మానవుడు కావటంచేత కపటవేషంలో ఉన్న అసాధారణుడైన సవ్యసాచి అర్జునుడి ప్రక్కనే ఉండి చూస్తూ కూడ స్వ-పర బలసామర్థ్యాలను గుర్తించక ఏడుస్తున్నాడు. (16)
త్రిగర్తాన్ మే పితా యాతః శూన్యే సంప్రణిధాయ మామ్।
సర్వాం సేనాముపాదాయ న మే సంతీహ సైనికాః॥ 17
సోఽహమేకో బహూన్ బాలఆః కృతాస్త్రానకృతశ్రమః।
ప్రతియోద్ధుం న శక్ష్యామి నివర్తస్వ బృహన్నలే॥ 18
'రక్షకులంతా ఖాళీ చేసిన నగరంలో రక్షకునిగా నాతండ్రి నన్ను నియమించి సేనంతా వెంటబెట్టుకుని త్రిగర్తులపై యుద్ధానికి వెళ్ళాడు. నాకా సైనికులు లేరు. బృహన్నలా! అస్త్రవిద్యలో ఆరితేరిన చాలామందిని అస్త్రవిద్యను అభ్యసించని అజ్ఞానిని నేనొక్కణ్ణి ఎదుర్కోలేను. రథాన్ని వెనక్కి మళ్లించు.' (17,18)
బృహన్నలోవాచ
భయేన దీనరూపోఽసి ద్విషతాం హర్షవర్ధనః।
న చ తావత్ కృతం కర్మ పరైః కించిద్ రనాజిరే॥ 19
బృహన్నల అన్నాడు. 'భయంవల్లన్ దీనుడివై శత్రువుల సంతోషాన్ని పెంచుతున్నావు. యుద్ధ రంగంలో ఇంతవరకు శత్రువులు కొద్దిపాటి పరాక్రమాన్నీ ప్రదర్శించలేదు. (19)
స్వయమేవ చ మామాత్థ వహ మాం కౌరవాన్ ప్రతి।
సోఽహం త్వాం తత్ర నేష్యామి యత్రైతే బహులా ధ్వజాః॥ 20
'నన్ను కౌరవులదగ్గరికి తీసుకుపో' అని నీవే నన్నడిగావు. కాబట్టి వివిధధ్వజాల వారున్నచోటికి నిన్ను నేను తీసుకు వెళ్తాను. (20)
మధ్యమామిషగృధ్రాణాం కురూణామాతతాయినామ్।
నేష్యామి త్వాం మహాబాహో పృథివ్యామపి యుధ్యతామ్॥ 21
దీర్ఘభుజా! వారు ఆవుల్ని తోలుకెళ్ళటానికి వచ్చినా భూమికోసం వచ్చినా సరే, యుద్ధార్థులై మీదపడుతున్న ఆ ఆతతాయి కౌరవుల దగ్గరికి నిన్ను తీసికొనిపోతాను. (21)
తథా స్త్రీషు ప్రతిశ్రుత్య పౌరుషం పురుషేషు చ।
కత్థమానోఽభినిర్యాయ కిమర్థం న యుయుత్ససే॥ 22
కౌరవులమీద పౌరుషం చూపుతానని స్త్రీ, పురుషుల మధ్య ప్రతిజ్ఞచేసి, నిన్ను నీవే పొగడుకొని, యుద్ధానికి బయలుదేరి, యిపుడు ఎందుకు యుద్ధం చెయ్యాలనుకోవటం లేదు? (22)
న చేద్ విజిత్య గాస్తాస్త్వం గృహాన్ వై ప్రతియాస్యసి।
ప్రహసిష్యంతి విరాస్త్వాం నరా నార్యశ్చ సంగతాః॥ 23
ఆవుల్ని జయించకుండా ఇళ్ళకు తిరిగి వచ్చావో వీరులే కాదు, గుమికూడిన స్త్రీ పురుషులంతా కూడా నిన్ను ఎగతాళి చేస్తారు. (23)
అహమప్యత్ర సైరంధ్ర్యా ఖ్యాతా సారథ్యకర్మణి।
న చ శక్ష్యామ్యనిర్జిత్య గాః ప్రయాతుం పురం ప్రతి॥ 24
సైరంధ్రి సారథ్యం చేయటానికి నన్నే తగినట్లుగా పేర్కొన్నది. ఆవుల్ని గెలుచుకోకుండా నగరానికి తిరిగి రాలేను. (24)
స్తోత్రేణ చైవ సైరంధ్ర్యాః తవ వాక్యేన తేన చ।
కథం ను యుధ్యేయమహం కురూన్ సర్వాన్ స్థిరోభవ॥ 25
సైరంధ్రి ఆవిధంగా పొగడి నీవు అలా మాట్లాడి నపుడు కౌరవులందరి మీద యుద్ధం చెయ్యకుండా ఎలా ఉండగలను? చలించక స్థిరంగా ఉండు.' అన్నాడు. (25)
ఉత్తర ఉవాచ
కామం హరంతు మత్స్యానాం భూయాంసః కురవో ధనమ్।
ప్రహసంతు చ మాం నార్యః నరా వాపి బృహన్నలే॥ 26
సంగ్రామే న చ కార్యం మే గావో గచ్ఛంతు చాపి మే।
శూన్యం మే నగరం చాపి పితుశ్చైవ బిభేమ్యహమ్॥ 27
ఉత్తరుడు అన్నాడు. 'బృహన్నలా! పెద్ద సంఖ్యలో వచ్చిన కౌరవులు తమ ఇష్టానుసారం మత్స్యదేశ సంపదలను
తీసుకొనిపోయినా, స్త్రీ పురుషులు నన్ను చూసి నవ్వినాసరే యుద్ధంలో నాకు చెయ్యదగిన దేమీ లేదు. నా ఆవుల్ని పోనీ, నా నగరానికి రక్షణలేదు. నగరరక్షణకు నన్ను నియమిమ్చి వెళ్ళిన నా తండ్రికి భయపడుతున్నాను.' (26,27)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్త్వా ప్రాద్రవద్ భీతః రథాత్ స్రస్కంద్య కుండలీ।
త్యక్త్వా మానం చ దర్పం చ విసృజ్య సశరం ధనుః॥ 28
వైశంపాయనుడు అన్నాడు. ఇలా అంటూ కుండలాలు ధరించిన ఉత్తరుడు భయంతో అభిమానాన్ని, గర్వాన్ని, ధనుర్బాణాల్ని విడిచిపెట్టి రథంనుండి ఎగిరిదూకి పరిగెత్తాడు. (28)
బృహన్నలోవాచ
నైష శూరైః స్మృతో ధర్మః క్షత్రియస్య పలాయనమ్।
శ్రేయస్తు మరణం యుద్ధే న భీతస్య పలాయనమ్॥ 29
బృహన్నల అన్నాడు. 'శూరులదృష్టిలో పారిపోవటం క్షత్రియధర్మం కాదు. పిరికిగా పారిపోవటం కంటె యుద్ధంలో చావటం మంచిది.' (29)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వాతు కౌంతేయః సోఽవప్లుత్య రథోత్తమాత్।
తమన్వధావద్ ధావంతం రాజపుత్రం ధనంజయః॥ 30
దీర్ఘాం వేణీం విధున్వానః సాధురక్తే చ వాససీ।
విధూయ వేణీం ధావంతమ్ అజానంతోఽర్జునం తదా॥ 31
సైనికాః ప్రాహసన్ కేచిత్ తథారూపమవేక్ష్య తమ్।
తం శీఘ్రమభిధావంతం సంప్రేక్ష్య కురవోఽబ్రువన్॥ 32
వైశంపాయనుడు అన్నాడు. ఇలా అంటూ కుంతికొడుకు అర్జునుడు ఉత్తమమైన ఆ రథం నుండి దిగి పరుగెత్తుతున్న ఆ రాజకుమారుడి వెంట పొడుగైన జుట్టు విదల్చి, ఎర్రవస్త్రాలు బిగించి పరుగెత్తాడు. విడిపోయిన కొప్పుతో పరుగెత్తుతున్న ఆరూపంలో అర్జునుణ్ణి చూసి గుర్తించని సైనికులు కొందరు నవ్వసాగారు. అలా వేగంగా పరిగెత్తే అతణ్ణి చూసి కౌరవు లిలా అనుకొన్నారు. (30-32)
క ఏష వేషసంఛన్నః భస్మన్యేవ హుతాశనః।
కించిదస్య యథా పుంసః కించిదస్య యథా స్త్రియః॥ 33
నిజరూపాన్ని కప్పిపుచ్చుకొని నివురుగప్పిన నిప్పులాంటి ఇతడెవరు? ఇతని వ్యవహారం కొంత స్త్రీలాగా, కొంత పురుషుడిలాగా ఉంది. (33)
సారూప్య మర్జునస్యేవ క్లీబరూపం బిభర్తి చ।
తే హి నః ప్రతిసంయాతుం సంగ్రామే న చ శక్నుయుః।
అన్యో వా క్లీబరూపేణ యద్యాగచ్ఛేద్ గహం పదమ్।
అర్దయిత్వా శరైస్తీక్ష్ణైః పాతయిష్యామి భూతలే॥
కథమేకతరస్తేషాం సమస్తాన్ యోధయేత్ కురూన్।
అర్జునో నేతి చేత్యేనం న వ్యవస్యంతి తే పునః।
ఇతి స్మ కురవః సర్వే మంత్రయంతో మహారథాః॥
దృఢవేధీ మహాసత్త్వః శక్రతుల్యపరాక్రమః।
అద్యాగచ్ఛతి యే యోద్ధుం సర్వం సంశయితం బలమ్॥
న చాప్యన్యం నరం తత్ర వ్యవస్యంతి ధనంజయాత్।)
రథాలమీదున్న సైనికులతో దుర్యోధనుడిలా అన్నాడు. 'అర్జునుడో, కృష్ణుడో, బలరాముడో, ప్రద్యుమ్నుడో కాని మనల్ని యుద్ధంలో ఎదుర్కోలేరు. మరెవడో నపుంసక వేషంలో ఆవుల దగ్గరికొస్తే పదునైన బాణాలతో నేలకొరిగేట్లు చేస్తాను. వాళ్ళలో ఒకడు ఎలా కౌరవులందరితో తలపడతాడు? అతడు అర్జునుడో? కాదో?' అని మహారథులైన కౌరవులంతా మళ్ళీ ఆలోచనలో పడి ఒక నిర్ణయానికి రాలేకపోయారు. శత్రువుల్ని దృఢంగా వేధించగల మహాబలసంపన్నుడు, ఇంద్రునితో సమానమైన పరాక్రమంగల ఆ అర్జునుడే ఇవాళ వస్తే సైనికులందరి బ్రతుకు సందేహమే. (ఇలా) వాళ్ళు అతనిని అర్జునుడు కాక వేరొకడుగా కూడ నిర్ణయించలేక పోయారు.
ఉత్తరంతు ప్రధావంతమ్ అభిద్రుత్య ధనంజయః।
గత్వా పదశతం తూర్ణం కేశపక్షే పరామృశత్॥ 40
పరుగెత్తే ఉత్తరుడి వెంటపడి నూరడుగుల దూరంలోనే అర్జునుడతని జుట్టు పట్టుకొన్నాడు. (40)
సోఽర్జునేన పరామృష్టః పర్యదేవయదార్తవత్।
బహులం కృపణం చైవ విరాటస్య సుతస్తదా॥ 41
అర్జునుడిచేత పట్టుకోబడ్డ ఆ విరాటరాజు కొడుకు అప్పుడు ఎంతో దీనంగా ఏడ్చాడు. (41)
ఉత్తర ఉవాచ
శృణుయాస్త్వం హి కల్యాణి బృహన్నలే సుమధ్యమే।
నివర్తయ రథం క్షిప్రం జీవన్ భద్రాణి పశ్యతి॥ 42
ఉత్తరుడు అన్నాడు. 'చక్కని నడుము శుభమైన ఆకారమూ కల బృహన్నలా! నీవు నామాట విను. వెంటనే రథాన్ని వెనక్కు త్రిప్పు. బ్రతికుంటే మానవుడు శుభాల్ని పొందుతాడు. (42)
శాతకుంభస్య శుద్ధస్య శతం నిష్కాన్ దదామి తే।
మణీనష్టౌ చ వైడూర్యాన్ హేమబద్ధాన్ మహాప్రభాన్॥ 43
కల్తీ లేని నూరుబంగారు నాణాల్ని, బంగారంలో పొదిగిన కాంతిమంతమైన ఎనిమిది వైడూర్యమణుల్ని నీకు ఇస్తున్నాను. (43)
హేమదండప్రతిచ్ఛన్నం రథం యుక్తం చ సువ్రతైః।
మత్తాంశ్చ దశమాతంగాన్ ముంచ మాం త్వం బృహన్నలే॥ 44
బృహన్నలా! నన్ను విడిచిపెట్టు. మేలైన గుర్రాలతో, బంగారు దండం కల రథాన్ని, పది మదపుటేనుగుల్ని ఇస్తున్నాను.' (44)
వైశంపాయన ఉవాచ
ఏవమాదీని వాక్యాని విలపంతమచేతసమ్।
ప్రహస్య పురుషవ్యాఘ్రః రథస్యాంతికమానయత్॥ 45
వైశంపాయనుడు అన్నాడు. ఏడుస్తూ తెలివి తప్పుతున్న ఉత్తరుని పురుషశ్రేష్ఠుడైన అర్జునుడు నవ్వుతూ రథం దగ్గరకు తెచ్చాడు. (45)
అథైవబ్రవీత్ పార్థః భయార్తం నష్టచేతసమ్।
యది నోత్సహసే యోద్ధుం శత్రుభిః శత్రుకర్షణ।
ఏహి మే త్వం హయాన్ యచ్ఛ యుధ్యమానస్య శత్రుభిః॥ 46
తరువాత భయంతో తెలివితప్పుతున్న ఉత్తరుడితో అర్జునుడు 'శత్రునాశకా! శత్రువులతో యుద్ధం చెయ్యాలని లేకపోతే శత్రువులతో తలపడాలనుకొనే నాయొక్క గుర్రాల్ని తోలు' అన్నాడు. (46)
ప్రయాహ్యేతద్ రథానీకం మద్బాహుబలరక్షితః।
అప్రధృష్యతమం ఘోరం గుప్తం వీరైర్మహారథైః॥ 47
నా భుజబలంతో రక్షింపబడుతూ, ఎదుర్కొనలేని, భయంకరమైన మహారథులైన వీరులచే సురక్షితమైన ఈ రథసైన్యం వైపు కదులు. (47)
మా భైస్త్వం రాజపుత్రాగ్ర్య క్షత్రియోఽసి పరంతప।
కథం పురుషశార్దూల శత్రుమధ్యే విషీదసి॥ 48
రాజకుమారోత్తమా! శత్రు సంతాపకా! పురుష సింహమా! నీవు క్షత్రియుడివి. భయపడకు. శత్రువుల మధ్యలో ఉండి కుంగిపోతున్నావా? (48)
అహం వై కురుభి ర్యోత్స్యే విజేష్యామి చ తే పశూన్।
ప్రవిశ్యైతద్ రథానీకమ్ అప్రధృష్యం దురాసదమ్॥ 49
ఎదుర్కోలేని, ప్రవేశించటానికి వీలుపడని ఈ రథ సైన్యంలో నేను ప్రవేశించి కౌరవులతో యుద్ధం చేస్తాను. నీ పశువుల్ని జయిస్తాను.
యంతా భవ నరశ్రేష్ఠ యోత్స్యేఽహం కురుభిః సహ।
నరశ్రేష్ఠా! నేను కౌరవులతో పోరాడతాను. నీవు సారథిగా ఉండు.' (49 1/2)
ఏవం బ్రువాణో బీభత్సుః వైరాటిమపరాజితః।
సమాశ్వాస్య ముహూర్తం తమ ఉత్తరం భరతర్షభ॥ 50
తత ఏనం విచేష్టంతమ్ అకామం భయపీడితమ్।
రథమారోపయామాస పార్థః ప్రహరతాం వరః॥ 51
భరత శ్రేష్ఠుడివైన జనమేజయా! ఓటమి నెరుగని, యోధాగ్రేసరుడైన అర్జునుడు, చేష్టలుడిగి యుద్ధం చేయాలనే కోరికలేక భయంతో బాధపడుతున్న ఉత్తరుని పైమాటలతో కొద్దిసేపు ఓదార్చి రథంమీదకు ఎక్కించాడు. (50,51)
(గాండీవం పునరాదాతుమ్ ఉపాయాత్ తాం శమీం ప్రతి।
ఉత్తరం స సమాశ్వస్య కృత్వా యంతారమర్జునః॥)
ఉత్తరుని ఓదార్చి సారథిగా చేసుకున్న అర్జునుడు మళ్ళీ ఆ జమ్మిచెట్టు వైపు గాండీవాన్ని తీసుకొనటానికి వెళ్ళాడు.
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణ పర్వణి ఉత్తరగోగ్రహే ఉత్తరాశ్వాసనే అష్టాత్రింశోఽధ్యాయః॥ 38 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణ పర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహమున
బృహన్నల ఉత్తరునకు ధైర్యము చెప్పుట అను ముప్పది ఎనిమిదవ అధ్యాయము. (38)
(దాక్షిణాత్య అధికపాఠము 9 1/2 శ్లోకములతో కలిపి మొత్తం 60 1/2 శ్లోకములు.)