10. పదవ అధ్యాయము
సహదేవుడు గోపాలక వేషములో విరాటుని కొలువు చేరుట.
వైశంపాయన ఉవాచ
సహదేవోఽపి గోపానం కృత్వా వేషమనుత్తమమ్।
భాషాం చైషాం సమాస్థాయ విరాటముపయాదథ॥ 1
వైశంపాయనుడు చెప్పాడు. సహదేవుడు కూడా గోపాలకవేషం ధరించి, వారి భాషనే మాట్లాడుతూ, విరటుని సమీపించాడు. (1)
గోష్ఠమాసాద్య తిష్ఠంతం భవనస్య సమీపతః।
రాజాథ దృష్ట్వా పురుషాన్ ప్రాహిణోజ్జాతవిస్మయః॥ 2
రాజభవనానికి దగ్గరలోనున్న గోశాలను సమీపించి నిలుచున్న అతణ్ణి చూసి విరాటరాజు ఆశ్చర్యపడి భటులను పంపాడు. (2)
తమాయాంతమభిప్రేక్ష్య భ్రాజమానం నరర్షభమ్।
సముపాస్థాయ వై రాజా పప్రచ్ఛ కురునందనమ్॥ 3
కస్య వా త్వం కుతో వా త్వం కిం వా త్వం తు చికీర్షసి।
న హి మే దృష్టపూర్వస్త్వం తత్త్వం బ్రూహి నరర్షభ॥ 4
'నరశ్రేష్ఠా! నీవెవ్వరివాడవు? ఎక్కడ నుండి వచ్చావు? నీవేమి చేయాలనుకొంటున్నావు? ఇంతకు మునుపు నిన్ను నేను చూడలేదు. నిజం చెప్పు.' (4)
సంప్రాప్య రాజానమమిత్రతాపనం
తతోఽబ్రవోన్మేఘమహౌఘ నిఃస్వనః।
వైశ్యోఽస్మి నామ్నాహమరిష్టనేమిః
గోసంఖ్య ఆసం కురుపుంగవానామ్॥ 5
వస్తుం త్వయీచ్ఛామి విశాం వరిష్ఠ
తాన్ రాజసింహాన్ న హి వేద్మి పార్థాన్।
న శక్యతే జీవితుమప్యకర్మణా
న చ త్వదన్యో మమ రోచతే నృపః॥ 6
శత్రుసంహారకుడైన రాజును సమీపించి మేఘగర్జనం వంటి గంభీరధ్వనితో సహదేవుడిలా అన్నాడు. 'నేను వైశ్యుణ్ణి. నాపేరు అరిష్టనేమి. కురుశ్రేష్ఠుల గోశాలలో ఉండేవాణ్ని.
నరశ్రేష్ఠా! నీరాజ్యంలో ఉండాలనుకొంటున్నాను. రాజసింహులైన జీవించడం శక్యంకాదు. నీవుకాక వేరొక రాజు నాకిష్టుడు కాదు.' (5,6)
విరాట ఉవాచ
త్వం బ్రాహ్మణో యది వా క్షత్రియోఽసి
సముద్రనేమీశ్వరరూపవానసి।
ఆచక్ష్వ మే త్వమమిత్రకర్శన
న వైశ్యకర్మ త్వయి విద్యతే క్షమమ్॥ 7
విరాటుడు అన్నాడు. 'శత్రుమర్దనా! నీవు బ్రాహ్మణుడవా? లేక క్షత్రియుడవా? భూమిని పాలించేవానిలా ఉన్నావు. నిజం చెప్పు. ఈవైశ్యకర్మ నీకు తగినది కాదు. (7)
కస్యాసి రాజ్ఞో విషయాదిహాగతః
కిం వాపి శిల్పం తవ విద్యతే కృతమ్।
కథం త్వమస్మాసు నివత్స్యసే సదా
వదస్వ కిం చాపి తవేహ వేతనమ్॥ 8
ఏ రాజుయొక్క రాజ్యంనుండి ఇక్కడకు వచ్చావు? నీకు ఏ పనిలో నేర్పు ఉంది? నీవు మాదగ్గర ఎలా ఉంటావు? నీకిక్కడ జీతమెంత కావాలి? చెప్పు.' (8)
సహదేవ ఉవాచ
పంచానాం పాండుపుత్రాణాం జ్యేష్ఠో భ్రాతా యుధిష్ఠిరః।
అస్యాష్టశతసాహస్రా గవాం వర్గాః శతం శతమ్॥ 9
సహదేవుడు చెపుతున్నాడు. 'పాండుకుమారు లైదుగురిలో పెద్దవాడు యుధిష్ఠిరుడు. అతనికి ఎనిమిదిలక్షల గోగణాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క గణంలో వందగోవులున్నాయి. (9)
అపరే శతసాహస్రా ద్విస్తావంతస్తధాపరే।
తేశ్హాం గోసంఖ్య ఆసం వై తంతిపాలేతి మాం విదుః॥ 10
భూతం భవ్యం భవిష్యం చ యచ్చ సంఖ్యాగతం గవామ్।
న ఏఽస్త్వవిదితం కించిత్ సమంతాద్ దశయోజనమ్॥ 11
ఇంకొక రకం గోవులు లక్ష ఉన్నాయి. మరొకరకమైన గోవులు రెండు లక్షలున్నాయి. వారిగోవులన్నీ లెక్కించి సంరక్షించే నన్ను తంతిపాలుడని అంటారు.
గోవులకు సంబంధించిన భూతభవిష్య ద్వర్తమానా లన్నీ నేనెరుగుదును. పదియోజనాల విస్తీర్ణంలో నాకు తెలియని దేమీ లేదు. (10,11)
గుణాః సువిదితా హ్యాసన్ మమ తస్య మహాత్మనః।
అసకృత్ స మయా తుష్టః కురురాజో యుధిష్ఠిరః॥ 12
క్షిప్రం చ గావో బహులా భవంతి
న తాను రోగో భవతీహ కశ్చన।
తైస్తైరుపాయైర్విదితం మమైతద్
ఏతాని శిల్పాని మయి స్థితాని॥ 13
ఋషభాంశ్చాపి జానామి రాజన్ పూజితలక్షణాన్।
యేషాం మూత్రముపాఘ్రాయ అపి వంధ్యా ప్రసూయతే॥ 14
మహాత్ముడయిన ఆ కురురాజు యుధిష్ఠిరును గుణాలు నేను బాగా ఎఱుగుదును. అతడు చాలాసార్లు నానేర్పులు చూసి సంతోషించేవాడు. (12)
గోవులు వేగంగా వృద్ధిచెందే తీరులూ రోగం రాకుండా పెంచే ఉపాయాలూ నేను బాగా ఎరుగుదును. ఆ నేర్పు నాలో ఉంది.
రాజా! వేనిమూత్రం వాసనచూసినంత మాత్రాన వంధ్య(గొడ్డుటావు) కూడ చూడిదవుతుందో, అట్టి మంచి లక్షణాలున్న ఎద్దులనూ నే నెఱుగుదును.' (13,14)
విరాట ఉవాచ
శతం సహస్రాణి సమాహితాని
సవర్ణ వర్ణస్య విమిశ్రితాన్ గుణైః।
పశూన్ సపాలాన్ భవతే దదామ్యహం
త్వదాశ్రయా మే పశవో భవంత్విహ॥ 15
విరాటుడు అన్నాడు. 'సవర్ణాలైన లక్ష పశువులను సంగ్రహించాను. అనేక గుణాలున్న పశువులనూ, వానిపాలకులనూ నీకిస్తున్నాను. ఇక నాపశువులు నీరక్షణలో ఉంటాయి.' (15)
వైశంపాయన ఉవాచ
తథా స రాజోఽవిదితో విశాంపతేః
ఉవాస తత్రైవ సుఖం నరోత్తమః।
న చైనమన్యేఽపి విదుః కథంచన
ప్రాదాచ్చ తస్మై భరణం యథేప్సితమ్॥ 16
వైశంపాయనుడన్నాడు. ఇలా ప్రజాపాలకుడైన ఆ విరాటుడికి నిజం తెలియకుండా అతని గోశాలలో సహదేవుడు సుఖంగా ప్రవేశించాడు. ఇతరులు కూడా ఏ విధంగాను అతణ్ణి తెలుసు కోలేకపోయారు. విరాటుడు అతడు కోరినంత జీతం ఇచ్చాడు. (16)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి పాండవ ప్రవేశపర్వణి సహదేవప్రవేశో నామ దశమోఽధ్యాయః॥ 10 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున పాండవప్రవేశపర్వమను
ఉపపర్వమున సహదేవప్రవేశమను పదవ అధ్యాయము. (10)