8. ఎనిమిదవ అధ్యాయము.
భీమసేనుడు విరాటరాజు సభలో ప్రవేశించుట.
వైశంపాయన ఉవాచ
అథాపరో భీమబలః శ్రియా జ్వలన్
ఉపాయయౌ సింగవిలాసవిక్రమః।
ఖజాం చ దర్వీం చ కరేణ ధారయన్
అసిం చ కాలాంగమకోశమవ్రణమ్॥ 1
వైశంపాయనుడు ఇట్లన్నాడు. తరువాత బలశాలి సింహం ఠీవి-నడక గల పరాక్రమశాలి ఒకడు తెడ్డును, గరిటెను, ఒరలేని మొక్కవోని ఉక్కుకత్తిని చేతిలోదాల్చి విరాటుని సమీపించాడు. (1)
స సూదరూపః పరమేణ వర్చసా
రవిర్యథా లోకమిమం ప్రకాశయన్।
స కృష్ణవాసా గిరిరాజసారవాన్
తం మత్స్యరాజం సముపేత్య తస్థివాన్॥ 2
వంటరానివేషంతోనున్న అతడు తేజస్సుతో సూర్యునిలా ఈలోకాన్ని వెలిగిస్తూ నల్లని వస్త్రంతో, కొండంత ధైర్యంతో ఆ విరాటరాజును సమీపించి నిలుచున్నాడు. (2)
తం ప్రేక్ష్య రాజా రమయన్నుపాగతం
తతోఽబ్రవీజ్ఞానపదాన్ సమాగతాన్।
సింహోన్నతాంసోఽయమతీవ రూపవాన్
ప్రదృశ్యతే కో ను నరర్షభో యువౌ॥ 3
తన్ను సమీపించిన అతణ్ణి చూసి ఆనందిస్తూ రాజు అక్కడున్న జనులతో "సింహంలా ఎగుభుజాలు కల్గి అందమైన, నరశ్రేష్ఠునిలా ఉన్న ఈ యువకుడెవడో! (3)
అదృష్టపూర్వః పురుషో రవిర్యథా
వితర్కయన్ నాస్య లభామి నిశ్చయమ్।
తథాస్య చిత్తం హ్యపి సంవితర్కయన్
నరర్షభస్యాస్య న యామి తత్త్వతః॥ 4
సూర్యునివలెనున్న ఈ పురుషుని మునుపు చూడలేదు. ఎంత ఆలోచించినా గుర్తురావటం లేదు. ఇతని హృదయం తెలియలేకున్నాను. (4)
దృష్ట్వైవ చైనం తు విచారయామ్యహం
గంధర్వరాజో యది వా పురందరః।
జానీత కోఽయం మమ దర్శనే స్థితః
యదీప్సితం తల్లభతాం చ మా చిరమ్॥ 5
చూడగానే ఇతడు గంధర్వరాజా? లేక ఇంద్రుడా? అనిపిస్తోంది. నా ముందున్న ఇతడెవరో తెలుసుకోండి. అతనికోరిక వెంటనే తీరుస్తాను." (5)
విరాటవాక్యేన చ తేన చోదితాః
నరా విరాటస్య సుశీఘ్రగామినః।
ఉపేత్య కౌంతేయమథాబ్రువంస్తదా
యథా స రాజా వదతాచ్యుతానుజమ్॥ 6
విరాటుడు పంపితే వెళ్లి రాజభటులు భీముని సమీపించి రాజు అడిగిన వన్నీ భీముని అడిగారు. (6)
తతో విరాటం సముపేత్య పాండవ
స్త్వదీనరూపం వచనం మహామనాః।
ఉవాచ సూదోఽస్మి నరేంద్ర వల్లవః
భజస్వ మాం వ్యంజనకారముత్తమమ్॥ 7
తరువాత ఉదాత్తమనస్సుగల భీముడు గంభీరుడయిన విరాటుని సమీపించి, దైన్యంలేకుండా ఇలా అన్నాడు. రాజా! నేను వల్లవుడనే వంటవాడను. బాగావంటచేయగల నన్ను ఈ పనిలో నియమించు. (7)
పంచచూలాలు అనగా పంచశిఖలు. (విష)
విరాట ఉవాచ
న సూదతాం వల్లవ శ్రద్దధామి తే
సహస్రనేత్రప్రతిమో విరాజసే।
శ్రియా చ రూపేణ చ విక్రమేణ చ
ప్రభాససే త్వం నృవరో నరేష్వివ॥ 8
విరాటుడు అన్నాడు. వల్లవా! నీవు వంటవాడవనే మాటను, విశ్వసించలేకపోతున్నాను. ఇంద్రునిలా ప్రకాశిస్తున్నావు. కాంతి, రూపం, విక్రమాలతో నీవు నరశ్రేష్ఠుని వలె ప్రకాశిస్తున్నావు. (8)
భీమ ఉవాచ
నరేంద్ర సూదః పరిచారకోఽస్మి తే
జానామి సూపాన్ ప్రథమం చ కేవలాన్।
ఆస్వాదితా యే నృపతే పురాభవన్
యుధిష్ఠిరేణాపి నృపేణ సర్వశః॥ 9
భీముడు అన్నాడు. రాజా! నేను వంటవాడను. సేవకుడను. ప్రత్యేకములైన భక్ష్యాలను బాగా చేయగలను. మునుపు నావంటలు ధర్మరాజు కూడ ఆస్వాదించాడు. (9)
సూపాన్ = దేశాలను (సమ్యక్ ఉప్యతే ఏషు = సూపాః, చక్కని బీజావాసం గల ప్రదేశాలు). రాజసూయంలో పన్ను రూపంలో యుధిష్ఠిరుడు అనుభవించిన దేశాలను. (విష)
బలేన తుల్యశ్చ న విద్యతే మయా
నియుద్ధశీలశ్చ సదైవ పార్థివ।
గజైశ్చ సింహైశ్చ సమేయివానహం
సదా కరిష్యామి తవానఘ ప్రియమ్॥ 10
రాజా! బలంలో నాతో సమానుడు లేడు. నేనెప్పుడూ మల్లయుద్ధం చేస్తుంటాను. ఏనుగులు, సింహాలతో కూడా పట్టుపట్టగలను. పుణ్యాత్ముడా! నీకెప్పుడూ ప్రియం చేకూరుస్తాను. (10)
విరాట ఉవాచ
దదామి తే హంత వరాన్ మహానసే
తథా చ కుర్యాః కుశలం ప్రభాషసే।
న చైవ మన్యే తవ కర్మ యత్ సమం
సముద్రనేమిం పృథివీం త్వమర్హసి॥ 11
విరాటుడు అన్నాడు. నీకు వంటశాలలో తగినవారిని ఇస్తాను. అలాగే చెయ్యి. నేర్పుతో మాట్లాడుతున్నావు. ఈపని నీకు తగినదిగా నేను అనుకోవటంలేదు. నీవు సముద్ర పర్యంతమైన భూమిని పాలింప తగినవాడవు. (11)
తథా హి కామో భవతస్తథా కృతం
మహానసే త్వం భవ మే పురస్కృతః।
నరాశ్చ యే తత్ర సమాహితాః పురా
భవాంశ్చ తేషామధిపో మయా కృతః॥ 12
అయినా నీ కోరికప్రకారం నీవు నా పాకశాలలో మొదటివానిగా ఉండు. మునుపక్కడ ఉన్న వారందరికీ నిన్ను నాయకునిగ చేస్తున్నాను. (12)
వైశంపాయన ఉవాచ
తథా స భీమో విహితో మహానసే
విరాటరాజ్ఞో దయితోఽభవద దృఢమ్।
ఉవాస రాజ్యే న చ తం పృథక్ జనః
బుబోధ తత్రానుచరాశ్చ కేచన॥ 13
వైశంపాయనుడు చెప్పాడు. అలా పాకశాలలో నియమింపబడిన భీముడు విరాటరాజుకు మిక్కిలి ఇష్టుడై, ఆ రాజ్యంలో నివసించాడు. ఇతరులుకాని, అనుచరులుకాని, అతనిని గుర్తించ లేకపోయారు. (13)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి పాండవప్రవేశ పర్వణి భీమప్రవేశోనామ అష్టమీఽధ్యాయః॥ 8 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున పాండవ ప్రవేశమను
ఉపపర్వమున భీమప్రవేశమను ఎనిమిదవ అధ్యాయము. (8)