విరాట పర్వము
1. ప్రథమాధ్యాయము
(పాండవ ప్రవేశ పర్వము)
పాండవులు అజ్ఞాతవాసమునకు రహస్య సమాలోచనము చేయుట.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్॥ 1
విశ్వరూపుడైన నారాయణునికీ, నరశ్రేష్ఠుడయిన అర్జునునికీ, సరస్వతీదేవికీ, వ్యాసమహర్షికీ నమస్కరించి జయమును (శ్రీమహాభారతమును) పఠించాలి. (1)
జనమేజయ ఉవాచ
కథం విరాటనగరే మమ పూర్వపితామహాః।
అజ్ఞాతవాసముషితాః దుర్యోధనభయార్దితాః॥ 2
పతివ్రతా మహాభాగా సతతం బ్రహ్మవాదినీ।
ద్రౌపదీ చ కథం బ్రహ్మన్ అజ్ఞాతా దుఃఖితావసత్॥ 3
జనమేజయుడు వైశంపాయనుని ఇట్లు ప్రశ్నించాడు. బ్రహ్మజ్ఞానీ! నా ముత్తాత లయిన పాండవులు దుర్యోధనునివల్ల భయంతో అజ్ఞాతవాసం ఎలా గడిపారు? కష్టాలలో ఉన్నా హరిస్మరణం విడువని సౌభాగ్యవతి, పతివ్రత అయిన ద్రౌపది అజ్ఞాతంగా ఎలా ఉండగలిగింది? (2,3)
వైశంపాయన ఉవాచ
యథా విరాటనగరే తవ పూర్వపితామహాః।
అజ్ఞాతవాసముషితాః తత్ శృణుష్వ నరాధిప॥ 4
వైశంపాయను డిలా చెప్పాడు. రాజా! నీ ముత్తాతలు విరాటుని నగరంలో అజ్ఞాతవాసం ఎలా గడిపారో చెపుతా విను. (4)
తథా స తు వరాన్ లబ్ధ్వా ధర్మో ధర్మభృతాం వరః।
గత్వాఽఽశ్రమం బ్రాహ్మణేభ్యః ఆచఖ్యౌ సర్వమేవ తత్॥ 5
ధార్మికులలో శ్రేష్ఠుడయిన ధర్మరాజు ధర్మదేవత నుండి వరాలు పొంది ఆశ్రమానికి వెళ్లి జరిగిన దంతా బ్రాహ్మణులకు చెప్పాడు. (5)
కథయిత్వా తు తత్ సర్వం బ్రాహ్మణేభ్యో యుధిష్ఠిరః।
అరణీసహితం తస్మై బ్రాహ్మణాయ న్యవేదయత్॥ 6
తతో యుధిష్ఠిరో రాజా ధర్మపుత్రో మహామనాః।
సంనివర్త్యానుజాన్ సర్వాన్ ఇతి హోవాచ భారత॥ 7
బ్రాహ్మణులకు జరిగినదంతా చెప్పి ధర్మరాజు అరణులు రెండూ ఆ బ్రాహ్మణునకు ఇచ్చివేశాడు. భరతవంశస్థుడా! (జనమేజయా) తరువాత మహామనస్వి అయిన ధర్మరాజు తన తమ్ముల నందరినీ ఒకచోట చేర్చి ఇలా అన్నాడు.(6,7)
ద్వాదశేమాని వర్షాణి రాజ్యవిప్రోషితా వయమ్।
త్రయోదశోఽయం సంప్రాప్తః కృచ్ఛ్రాత్ పరమదుర్వసః॥ 8
ఈపన్నండు సంవత్సరాలూ మనం రాజ్యంనుండి దూరమైనాము. ఇపుడు పదమూడో వత్సరం వచ్చింది. ఇది కష్టాతికష్టమయినది. (8)
స సాధు కౌంతేయ ఇతః వాసమర్జున రోచయ।
సంవత్సరమిమం యత్ర వసేమావిదితాః పరైః॥ 9
అర్జునా! శత్రువులకు తెలియకుండా ఈ సంవత్సరం మనం ఎక్కడ నివసించాలో ఆలోచించు. (9)
అర్జున ఉవాచ
తస్యైవ వరదానేన ధర్మస్య మనుజాధిప।
అజ్ఞాతా విచరిష్యామః నరాణాం నాత్ర సంశయః॥ 10
తత్ర వాసాయ రాష్ట్రాణి కీర్తయిష్యామి కానిచిత్।
రమణీయాని గుప్తాని తేషాం కించిత్ స్మ రోచయ॥ 11
అర్జునుడిలా అన్నాడు. రాజా! ఆ యమ ధర్మరాజు ఇచ్చిన వరప్రభావంచేతనే నరులకు తెలియ కుండా సంచరించగలం. ఇందులో సందేహం లేదు. మన నివాసానికి కొన్ని ప్రదేశాలు(రాష్ట్రాలు) చెపుతాను. అవి రమణీయాలు. రక్షణ కలవి. వానిలో ఒకటి నిశ్చయించు. (10,11)
సంతి రమ్యాః జనపదాః బహ్వన్నాః పరితః కురూన్।
పాంచాలా శ్చేది మత్స్యాశ్చ శూరసేనాః పటచ్చరాః॥ 12
దశార్ణా నవరాష్ట్రాశ్చ మల్లాః శాల్వా యుగంధరాః।
కుంతిరాష్రం చ విపులం సురాష్ట్రావంతయ స్తథా॥ 13
కురు రాష్ట్రానికి చుట్టూరా రమ్యమైన జనపదాలు ఉన్నాయి - అవి సస్యసంపన్నానులు. సుభిక్షాలు. పాంచాల, చేది, మత్స్య, శూరసేన, పటచ్చర, దశార్ణ, నవరాష్ట్ర, మల్ల, శాల్వ, యుగంధర, విశాల, కుంతిరాష్ట్ర, సౌరాష్ట్ర, అవంతీ రాష్ట్రాలు వాని పేర్లు. (12,13)
ఏతేషాం కతమో రాజన్ నివాసస్తవ రోచతే।
యత్ర వత్స్యామహే రాజన్ సంవత్సరమిమం వయమ్॥ 14
రాజా! వీనిలో మనం ఈ సంవత్సరం ఏ రాష్ట్రంలో నివసించటం నీకి ఇష్టం? (14)
యుధిష్ఠిర ఉవాచ
శ్రుతమేతన్మహాబాహో యథా స భగవాన్ ప్రభుః।
అబ్రవీత్ సర్వభూతేశః తత్ తథా న తదన్యథా॥ 15
ధర్మరాజు చెప్పాడు. ఆజానుబాహూ! అర్జునా! ఇది నేను పూర్వమే విన్నాను. సర్వభూతేశుడూ, భగవంతుడూ అయిన ఆ ధర్మదేవత చెప్పినది చెప్పినట్లే జరుగుతుంది. మరో విధంగా జరగదు. (15)
యద్యపి స్వేన రూపేణ చరిష్యథ మహీమిమామ్।
న వో విజ్ఞాయతే కశ్చి త్త్రిషు లోకేషు కశ్చన॥
అని పాండవులు స్వస్వరూపంతో తిరిగినా హాని లేదని ప్రభువచనం. అయినా అజ్ఞాతంగా ఉండటమే ఉచితమని భావం. (నీల)
అవశ్యం త్వేవ వాసార్థం రమణీయం శివం సుఖమ్।
సంమంత్ర్య సహితైః సర్వైః వస్తవ్యమకుతోభయైః॥ 16
నివసించటానికి రమణీయమూ, శుభకరమూ, సుఖప్రదమూ అయిన ప్రదేశం కావాలి. అందరమూ కలిసి ఆలోచించి, అచట నిర్భయులమై నివసించాలి. (16)
మత్స్యో విరాటో బలవాన్ అభిరక్తోఽథ పాండవాన్।
ధర్మశీలో వదాన్యశ్చ వృద్ధశ్చ సతతం ప్రియః॥ 17
మత్స్యదేశపురాజు విరాటుడు చాలా బలవంతుడు. పాండవుల(మన) మీద అనురాగం కలవాడు. ధార్మికుడు, వితరణశీలి, పెద్దవాడు. సతతం ప్రియమొనరించే వాడు. (17)
విరాటనగరే తాత సంవత్సరమిమం వయమ్।
కుర్వంత స్తస్య కర్మాణి విహరిష్యామ భారత॥ 18
అర్జునా! ఈ సంవత్సరం మనం విరాటనగరంలో నివసిస్తూ అతనికి సేవలు చేసిపెడుతూ ఉందాం. (18)
యాని యాని చ కర్మాణి తస్య వక్ష్యామహే వయమ్।
ఆసాద్య మత్స్యం తత్ కర్మ ప్రబ్రూత కురునందనాః॥ 19
కురుకుమారులారా! మనం మత్స్యరాజు విరాటుని దగ్గర చేరి ఏఏ పనులు చేస్తామని చెపుదామో చెప్పండి. (19)
అర్జున ఉవాచ
నరదేవ కథం తస్య రాష్ట్రే కర్మ కరిష్యసి।
విరాటనగరే సాధో రంస్యసే కేన కర్మణా॥ 20
అర్జునుడు ఇలా అడిగాడు. రాజా! ఆ విరాటుని రాజ్యంలో నీవు ఎట్లా సేవ చేస్తావు? నీకే పని చేయడం యిష్టం? (20)
మృదుర్వదాన్యో హ్రీమాంశ్చ ధార్మికః సత్యవిక్రమః।
రాజంస్త్వమాపదాకృష్టః కిం కరిష్యసి పాండవ॥ 21
రాజా! నీవు మృదుస్వభావుడవు. దానపరుడవు. లజ్జాశీలివి. ధార్మికుడవు. సత్యపరాక్రముడవు. పాండు నందనా! పైగా నీవు ఆపదలలో చిక్కుకొన్నావి. నీవే పని చేస్తావు? (21)
న దుఃఖముచితం కించిత్ రాజన్ వేద యథా జనః।
స ఇమామాపదం ప్రాప్య కథం ఘోరాం తరిష్యసి॥ 22
రాజా! సామాన్యమానవుని వలె నీకు కొద్దిపాటి దుఃఖం కూడ తెలియదు. అట్టి నీవు ఈ ఘోరమైన ఆపదనుండి ఎలా గట్టెక్కుతావు? (22)
యుధిష్ఠిర ఉవాచ
శృణుధ్వం యత్ కరిష్యామి కర్మ వై కురునందనాః।
విరాటమనుసంప్రాప్య రాజానం పురుషర్షభాః॥ 23
ధర్మరాజు ఇలా చెప్పాడు. పురుషపుంగవులైన కురుకుమారులారా! నేను విరాటుని చేరి యే పని చేస్తానో చెపుతాను. వినండి. (23)
సభాస్తారో భవిష్యామి తస్య రాజ్ఞో మహాత్మనః।
కంకో నామ ద్విజో భూత్వా మతాక్షః ప్రియదేవనః॥ 24
వైడూర్యాన్ కాంచనాన్ దాంతాన్ ఫలైర్జ్యోతీరసైః సహ।
కృష్ణాంల్లోహితవర్ణాంశ్చ నిర్వర్త్స్యామి మనోరమాన్॥ 25
నేను పాచికలాట ఎరుగుదును. దాని మీద కాస్త మక్కువ కూడా. కంకుడనే ద్విజుడనై మహాత్ముడయిన ఆ రాజసభలో ఒక గౌరవసభ్యుడ నవుతాను. వైడూర్యాలతోను, బంగారంతోను, దంతంతోనూ చేసిన నలుపు, ఎరుపు రంగులుకల అందమైన పాచికలను, మణులు పొదిగిన ఫలకాలను కొనిపోయి పాచికలాట ఆడగలను. (24,25)
విరాటరాజం రమయన్ సామాత్యం సహబాంధవమ్।
న చ మాం వేత్స్యతే కశ్చిత్ తోషయిష్యేచ తం నృపమ్॥ 26
మంత్రులు, బంధువులతోకూడిన విరాటునితో ఆడుతూ ఆ రాజును సంతోషపెడతాను. అపుడు నన్ను ఎవరూ తెలుసుకోలేరు. (26)
ఆసం యుధిష్ఠిరస్యాహం పురా ప్రాణసమః సఖా।
ఇతివక్ష్యామి రాజానం యదిమాం సోఽనుయోక్ష్యతే॥ 27
ఆ రాజు నన్ను(నీవు పూర్వం ఎక్కడుండే వాడ వని) అడిగితే' నేను పూర్వం ధర్మరాజుకు ప్రాణ స్నేహితుడిగా ఉన్నాను' అని చెపుతాను. (27)
ఇత్యేతద్వో మయాఽఖ్యాతం విహరిష్యామ్యహం యథా।
నేను విరాటనగరంలో ఎట్లా సంచరిస్తానో మీకు చెప్పాను.
(వైశంపాయన ఉవాచ
ఏవం నిర్దిశ్య చాత్మానం భీమసేనమువాచ హ।
వైశంపాయను డిట్లన్నాడు. జనమేజయా! ధర్మరాజు తన ప్రవర్తనను నిర్దేశించి భీమునితో ఇలా అన్నాడు.
యుధిష్ఠిర ఉవాచ
భీమసేన కథం కర్మ మత్స్యరాష్ట్రే కరిష్యసి॥
హత్వా క్రోధవశాంస్తత్ర పర్వతే గంధమాదనే।
యక్షాన్ క్రోధాభితామ్రాక్షాన్ రాక్షసాంశ్చాపి పౌరుషాన్।
ప్రాదాః పాంచాలకన్యాయై పద్మాని సుబహూన్యపి॥
ధర్మరాజు ఇలా అన్నాడు. భీమసేనా! నీవు మత్స్యదేశంలో ఏ పని చేస్తావు? గంధమాదన పర్వతం మీద క్రోధవశులనే యక్షులనూ, మహాపరాక్రమ వంతులై, అరుణ నేత్రులైన రాక్షసులనూ చంపి ఎన్నో పద్మాలను ద్రౌపదికి ఇచ్చావు.
బకం రాక్షసరాజానం భీషణం పురుషాదకమ్।
జఘ్నివానసి కౌంతేయ బ్రాహ్మణార్థమరిందమ॥
క్షేమా చాభయసంవీతా హ్యేకచక్రా త్వయా కృతా॥
శత్రునాశకా! ఏకచక్రపురంలో బ్రాహ్మణుని కోసం నరభక్షకుడూ, భయంకరుడూ అయిన బకు డనేరాక్షస రాజును చంపావు. ఏకచక్రపురాన్ని నీవు క్షేమకరమూ, నిర్భయమూ చేశావు.
హిడింబం చ మహావీర్యం కిర్మీరం చైవ రాక్షసమ్।
త్వయా హత్వా మహాబాహో వనం నిష్కంటకం కృతమ్॥
మహాపరాక్రమవంతుడయిన హిడింబునీ, కిర్మీర రాక్షసునీ చంపి వనం నిష్కంటకం చేశావు.
ఆపదం చాపి సంప్రాప్తా ద్రౌపదీ చారుహానినీ॥
జటాసురవధం కృత్వా త్వయా చ పరిమోక్షితా॥
మత్స్యరాజాంతికే తాత వీర్యపూర్ణోఽత్యమర్షణః।)
వృకోదర విరాటే త్వం రంస్యసే కేన హేతునా॥ 28
చక్కని చిరునవ్వు నవ్వే ద్రౌపది ఆపదలో చిక్కు కొన్నపుడు జటాసురుని సంహరించి ద్రౌపదిని విడిపించావు. అంతటి పరాక్రమశాలివి నీవు. నీకు కోపం ఎక్కువ. భిమా! మత్స్యరాజు దగ్గరకు ఎలా చేరుతావు? ఎలా ఉంటావు? (28)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి పాండవప్రవేశ పర్వణి యుధిష్ఠిరాదిమంత్రణే ప్రథమోఽధ్యాయః॥ 1 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున పాండవ ప్రవేశమను ఉపపర్వమున
ధర్మరాజాదుల సమాలోచనము అను ప్రథమాధ్యాయము. (1)
దాక్షిణాత్య అధిక పాఠములోని 6 1/2 శ్లోకములు కలిపి మొత్తము 34 1/2 శ్లోకములు)