313. మూడువందల పదమూడవ అధ్యాయము

యక్షప్రశ్నలుః యుధిష్ఠిర సమాధానాలు.

వైశంపాయన ఉవాచ
స దదర్శ హతాన్ భ్రాతౄన్ లోకపాలానివ చ్యుతాన్ ।
యుగాంతే సమనుప్రాప్తే శక్రప్రతిమగౌరవాన్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
ధర్మరాజు మరణించిన తన సోదరులను చూశాడు. ఇంద్రునితో సాటిగా గౌరవాన్ని పొంది యుగాంతకాలంలో నేలకు జారిన లోకపాలకులవలె వారున్నారు. (1)
వినికీర్ణధనుర్బాణం దృష్ట్వా నిహతమర్జునమ్ ।
భీమసేనం యమౌ చైవ నిర్విచేష్టాన్ గతాయుషః ॥ 2
స దీర్ఘముష్ణం నిఃశ్వస్య శోకబాష్పపరిప్లుతః ।
తాన్ దృష్ట్వా పతితాన్ భ్రాతౄన్ సర్వాంశ్చింతాసమన్వితః ॥ 3
ధర్మపుత్రో మహాబాహుః విలలాప సువిస్తరమ్ ।
అర్జునుడు మరణించాడు. ధనుర్బాణాలు చెల్లాచెదరై ఉన్నాయి. భీమసేనుడు, నకులసహదేవులు ప్రాణాలు పోయి నిశ్చేష్టులై ఉన్నారు. వారినందరినీ చూసి ధర్మరాజు వేడి నిట్టూర్పు విడిచాడు. కన్నీరు పొంగి వచ్చింది. సోదరులందరూ పడి ఉండటాన్ని చూసి మహాబాహువైన ధర్మసుతుడు చింతించి, ఎంతో విలపించాడు. (2, 3 1/2)
నను త్వయా మహాబాహో ప్రతిజ్ఞాతం వృకోదర ॥ 4
సుయోధనస్య భేత్స్యామి గదయా సక్థినీ రణే ।
వ్యర్థం తదద్య మే సర్వం త్వయి వీర విపాతితే ॥ 5
మహాత్మని మహాబాహో కురూణాం కీర్తివర్ధనే ।
మహాబాహూ! వృకోదరా! యుద్ధంలో సుయోధనుడి తొడలను గదతో విరగగొడతానని ప్రతిజ్ఞ చేశావు గదా! వీరా! కురువంశకీర్తివర్ధనుడవు, మహాత్ముడవు, మహాబాహువువు అయిన నీవే పడిపోతే నాకు ఇక ఇదంతా ఎందుకు? (4, 5 1/2)
మనుష్యసంభవా వాచః విధర్మిణ్యః ప్రతిశ్రుతాః ॥ 6
భవతాం దివ్యవాచస్తు తా భవంతు కథం మృషా ।
మనుష్యుల మాటలు తప్పిపోయినట్లు వింటుంటాం. కానీ మీవి దివ్యవాక్కులు. అవి ఎలా వ్యర్థమవుతాయి. (6 1/2)
దేవాశ్చాపి యదావోచన్ సూతకే త్వాం ధనంజయ ॥ 7
సహస్రాక్షా దనవరః కుంతి పుత్రస్తవేతి వై ।
ఉత్తరే పారియాత్రే చ జగుర్భూతాని సర్వశః ॥ 8
విప్రణష్టాం శ్రియం చైషామ్ ఆహర్తా పునరంజసా ।
నాస్య జేతా రణే కశ్చిద్ అజేతా వైష కస్యచిత్ ॥ 9
ధనంజయా! నీవు పుట్టినప్పుడు దేవతలు ఏమన్నారు? 'కుంతీ! ఈ నీ కుమారుడు దేవేంద్రునికన్న తక్కువవాడేమీ కాదు.' ఉత్తరపారియాత్రపర్వతం మీద కూడా ప్రాణులన్నీ నీగురించి ఏమన్నాయి? పాండవులు కోలుపోయిన రాజ్యలక్ష్మిని వేగంగా తిరిగితేగలవాడు. యుద్ధంలో ఇతనిని గెలిచేవాడుండడు. ఇతడు ఓడించలేనివాడు కూడా ఎవడూ ఉండడు'. (7-9)
సోఽయం మృత్యువశం యాతః కథం జిష్ణుర్మహాబలః ।
అయం మమాశాం సంహత్య శేతే భూమౌ ధనంజయః ॥ 10
ఆశ్రిత్య యం వయం నాథం దుఃఖాన్యేతాని సేహిమ ।
అటువంటి జయశీలుడు, మహాబలుడు నేడు మృత్యువుకు చిక్కాడు. ఈ ధనంజయుడు నా ఆశను చంపి నేలపై శయనించాడు. ఎవరిని ఆశ్రయించి ఎవరిరక్షణలో మేమీ దుఃఖాలు పోగొట్టుకోగలం? (10 1/2)
రణే ప్రమత్తౌ వీరౌ చ సదా శత్రునిబర్హణౌ ॥ 11
కథం రిపువశం యాతౌ కుంతీపుత్రౌ మహాబలౌ ।
యౌ సర్వాస్త్రాప్రతిహతౌ భీమసేనధనంజయౌ ॥ 12
కుంతీపుత్రులు, మహాబలులు అయిన ఈ భీమార్జునులు యుద్ధంలో ఏమరుపాటు లేనివీరులు. ఎప్పుడూ శత్రువులను అణచేవారు. ఏ అస్త్రాలకూ లోబడినవారు. శత్రువుల చేతికి ఎలా చిక్కారు? (11,12)
అశ్మసారమయం నూనం హృదయం మమ దుర్హృదః ।
యమౌ యదేతౌ దృష్ట్వాద్య పతితౌ నావదీర్యతే ॥ 13
నా మనస్సు చెడ్డది. అది రాతితోనే, లోహంతోనో తయారయినది. కాకపోతే నేలగూలియున్న ఈ నకులసహదేవులను చూసి ఎందుకు బ్రద్ధలు కాదు. (13)
శాస్త్రజ్ఞా దేశకాలజ్ఞాః తపోయుక్తాః క్రియాన్వితాః ।
అకృత్వా సదృశం కర్మ కిం శేధ్వం పురుషర్షభాః ॥ 14
పురుషోత్తములారా! మీరు శాస్త్రజ్ఞులు, దేశకాలజ్ఞులు, తపోయుక్తులు, ఆచరణశీలురు. అటువంటి మీరు మీకు తగినపని చేయకుండా ఎందుకు నిదురిస్తున్నారు? (14)
అవిక్షతశరీరాశ్చాప్యప్రమృష్టశరాసనాః ।
అసంజ్ఞా భువి సంగమ్య కిం శేధ్వమపరాజితాః ॥ 15
శరీరాలపై గాయాలు లేవు. ధనుర్బాణాలను పట్టినట్లే లేదు. అయినా నేలగూలి నిశ్చేష్టులుగా ఎందుకు పడి ఉన్నారు? (15)
సానూనివాద్రేః సంసుప్తాన్ దృష్ట్వా భ్రాతౄన్ మహామతిః ।
సుఖం ప్రసుప్తాన్ ప్రస్విన్నః ఖిన్నః కష్టాం దశాం గతః ॥ 16
నేలగూలిన పర్వతశిఖరాలవలె తనసోదరులు సుఖంగా నిదురిస్తూన్నట్టుండటం చూచి ధీమంతుడైన ధర్మరాజు ఖిన్నుడై తనువంతా చెమటలు పట్టి దీనదశకు లోనయ్యాడు. (16)
ఏవమేవేదమిత్యుక్త్వా ధర్మాత్మా స నరేశ్వరః ।
శోకసాగరమధ్యస్థః దధ్యౌ కారణమాకులః ॥ 17
"ఇది ఇలా జరగాలి కాబోలు" అనుకొని ధర్మాత్ముడైన ధర్మరాజు శోకసాగరంలో నిలిచి కలతపడుతూ మరణకారణాన్ని ఆలోచించసాగాడు (17)
ఇతికర్తవ్యతాం చేతి దేశకాలవిభాగవిత్ ।
నాభిపేదే మహాబాహుః చింతయానో మహామతిః ॥ 18
మహాబాహువూ, మహామతి అయిన ధర్మజుడు దేశకాలతత్త్వజ్ఞుడు. అయినా ఎంత ఆలోచించినా కర్తవ్యం స్ఫురించలేదు. (18)
అథ సంస్తభ్య ధర్మాత్మా తదాఽఽత్మానం తపోయుతః ।
ఏవం విలప్య బహుధా ధర్మపుత్రో యుధిష్ఠిరః ॥ 19
బుద్ధ్యా విచింతయామాస వీరాః కేన నిపాతితాః ॥ 20
వైషాం శస్త్రప్రహారోఽస్తి పదం నేహాస్తి కస్యచిత్ ।
భూతం మహదిదం మన్యే భ్రాతరో యేన మే హతాః ॥ 21
ధర్మాత్ముడు, ధర్మపుత్రుడు అయిన యుధిష్ఠిరుడు ఆ రీతిగా విలపించి ఆపై మనస్సుని నియంత్రించుకొని బుద్ధితో ఇలా అలోచించసాగాడు.
"ఈ వీరులను చంపినదెవరు? వారి శరీరాలపై ఆయుధాల గాట్లు లేవు. ఇక్కడ ఎవ్వరి అడుగు జాడలూ లేవు. ఏదో పెద్దభూతం నా సోదరులను చంపి ఉండాలి. (19-21)
ఏకాగ్రం చింతయిష్యామి పీత్వా వేత్స్యామి వా జలమ్ ।
స్యాత్ తు దుర్యోధనేనేదమ్ ఉపాంశువిహితం కృతమ్ ॥ 22
ఏకాగ్రతతో ఆలోచించాలి. పోనీ మంచినీళ్ళు త్రాగి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. బహుశ దుర్యోధనుడే చాటుమాటుగా ఏదో చేసి ఉంటాడు. (22)
గాంధారరాజరచితం సతతం జిహ్మబుద్ధినా ।
యస్య కార్యమకార్యం వా సమమేవ భవత్యుత ॥ 23
కస్తస్య విశ్వసేద్ వీరః దుష్కృతేరకృతాత్మనః ।
అథవా పురుషైర్గూఢైః ప్రయోగోఽయం దురాత్మనః ॥ 24
ఎప్పుడూ వక్రబుద్ధిగల గాంధారరాజు శకుని ఏదైనా చేసి ఉండవచ్చు. అతనికి కార్యమయినా అకార్యమయినా సమానమే. తనమీద తనకు అదుపులేని ఆ పాపాత్ముని ఏ వీరుడు నమ్మగలడు? లేదా ఆ దురాత్ముడు దుర్యోధనుడే గూఢచారులద్వారా ఏదైనా ప్రయోగం చేసి ఉండవచ్చు. (23,24)
భవేదితి మహాబుద్ధిః బహుధా తదచింతయత్ ।
తస్యాసీన్న విషేణేదమ్ ఉదకం దూషితం యథా ॥ 25
మహాబుద్ధిగల ధర్మరాజు 'ఇలా జరిగి ఉండవచ్చు'నంటూ రకరకాలుగా ఆలోచించాడు. పరీక్షించి చూసి ఆ నీరు విషదూషితం కాలేదని నిశ్చయించుకొన్నాడు. (25)
మృతానామపి చైతేషాం వికృతం నైవ జాయతే ।
ముఖవర్ణాః ప్రసన్నా మే భ్రాతౄణామిత్యచింతయత్ ॥ 26
నా సోదరులు మరణించినా వారి ముఖాలు వికృతిని పొందలేదు. ప్రసన్నంగానే ఉన్నాయి అని కూడా ఆలోచించాడు. (26)
ఏకైకశశ్చౌఘబలాన్ ఇమాన్ పురుషసత్తమాన్ ।
కోఽన్యః ప్రతిసమాసేత కాలాంతకయమాదృతే ॥ 27
పురుషశ్రేష్ఠులయిన వీరు ఒక్కొక్కరూ ఒక్కొక్క ప్రవాహమంత బలం గలవారు. కాలాంతకుడైన యముడు తప్ప మరెవ్వరు వీరి దగ్గరకు రాగలరు? (27)
ఏతేన వ్యవసాయేన తత్ తోయం వ్యవగాఢవాన్ ।
గాహమానశ్చ తత్ తోయమ్ అంతరిక్షాత్ స శుశ్రువే ॥ 28
అని నిశ్చయించుకొంటూ ధర్మరాజు ఆ సరస్సులోని నీటిలోనికి దిగాడు. దానిలో ప్రవేశించబోతుండగా ఆకాశవాణి వినిపించింది. (28)
యక్ష ఉవాచ
అహం బకః శైవలమత్స్యభక్షో
నీతా మయా ప్రేతవశం తవానుజాః ।
త్వం పంచమో భవితా రాజపుత్ర
న చేత్ ప్రశ్నాన్ పృచ్ఛతో వ్యాకరోషి ॥ 29
యక్షుడిలా అన్నాడు. నేను నాచును, చేపలను తినే కొంగను. నీ తమ్ములను యమలోనికి పంపినది నేనే. రాజకుమారా! నా ప్రశ్నలకు సమాధానమివ్వకపోతే నీవు కూడా అయిదవవాడుగా యమలోకానికి పోతావు. (29)
మా తాత సాహసం కార్షీః మమ పూర్వపరిగ్రహః ।
ప్రశ్నానుక్త్వా తు కౌంతేయ తతః పిబ హరస్వ చ ॥ 30
నాయనా! తొందరపడవద్దు. ఈ సరస్సుపై నాకిప్పటికే అధికారమున్నది. కౌంతేయా! నా ప్రశ్నలకు సమాధానమిచ్చి నీరు త్రాగు. నీరు తీసికొని వెళ్ళు. (30)
యుధిష్ఠిర ఉవాచ
రుద్రాణాం వా వసూనాం వా మరుతాం వా ప్రధానభాక్ ।
పృచ్ఛామి కో భవాన్ దేవః నైతచ్ఛకునినా కృతమ్ ॥ 31
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
నీవెవరో చెప్పు. రుద్రులలో, వసువులలో, దేవతలలో ఎవరో ప్రధాన దేవతవు నీవు. ఒక పక్షి ఇంత పనిచేయలేదు. (31)
హిమవాన్ పారియాత్రశ్చ వింధ్యో మలయ ఏవ చ ।
చత్వారః పర్వతాః కేన పాతితా భూరితేజసః ॥ 32
మహాతేజస్వులయిన నా నలుగురు సోదరులు హిమాలయ పారియాత్ర వింధ్య మలయ పర్వతాల వంటివాళ్ళు. వారిని చంపగలిగినదెవ్వరు? (32)
అతీవ తే మహత్ కర్మ కృతం చ బలినాం వర ।
యాన్ న దేవా న గంధర్వాః వాసురాశ్చ న రాక్షసాః ॥ 33
విషహేరన్ మహాయుద్ధే కృతం తే తన్మహాద్భుతమ్ ।
న తే జానామి యత్ కార్యం నాభిజానామి కాంక్షితమ్ ॥ 34
బలవంతులలో శ్రేష్ఠుడా! నీవు చాలా పెద్దపనిచేశావు. దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు అయినా మహారణంలో నాతమ్ములను సహించలేరు. వారిని పడగొట్టి నీవు మహాద్భుతకర్మ చేశావు. నీవేం చేస్తున్నావో, నీకేం కావాలో నాకు అర్థం కావటం లేదు. (33,34)
కౌతూహలం మహజ్జాతం సాధ్వసం చాగతం మమ ।
యేనాస్మ్యుద్విగ్నహృదయః సముత్పన్నశిరోజ్వరః ॥ 35
పృచ్ఛామి భగవంస్తస్మాత్ కో భవానిహ తిష్ఠతి ।
నాకు చాలా కుతూహలంగా ఉన్నది. కొంచెం భయం కూడా కలుగుతోంది. అందువలన మనస్సు ఉద్వేగానికి లోనవుతోంది. తలవేడెక్కింది. అందుకని అడుగుతున్నావు. స్వామీ! తమరెవరు? (35 1/2)
యక్ష ఉవాచ
యక్షోఽహమస్మి భద్రం తే నాస్మి పక్షీ జలేచరః ॥ 36
మయైతే నిహతాః సర్వే భ్రాతరస్తే మహౌజసః ।
యక్షుడిలా అన్నాడు.
నేను యక్షుడును. జలచరపక్షిని కాను. నీకు మేలు కల్గుగాక! మహాతేజస్వులయిన నీ తమ్ములను నేను చంపాను. (36 1/2)
వైశంపాయన ఉవాచ
తతస్తామశివాం శ్రుత్వా వాచం స పరుషాక్షరామ్ ॥ 37
యక్షస్య బ్రువతో రాజన్ ఉపక్రమ్య తదా స్థితః ।
విరూపాక్షం మహాకాయం యక్షం తాలసముచ్ఛ్రయమ్ ॥ 38
జ్వలనార్కప్రతీకాశమ్ అధృష్యం పర్వతోపమమ్ ।
వృక్షమాశ్రిత్య తిష్ఠంతం దదర్శ భరతర్షభః ॥ 39
మేఘగంభీరనాదేన తర్జయంతం మహాస్వనమ్ ।
వైశంపాయనుడిలా అన్నాడు.
రాజా! ఈ రీతిగా పలుకుతున్న యక్షుని అమంగళకరమైన ఆ పరుషవాక్కును విని, ధర్మరాజు ఆయన దగ్గరకు పోయి నిలిచాడు. అక్కడ ధర్మరాజు చెట్టు నాశ్రయించుకొని ఉన్న యక్షుని చూశాడు. కళ్ళు వికృతంగా ఉన్నాయి. తాటి చెట్టంత ఎత్తు ఉన్నాడు. అగ్నివలె, సూర్యునివలె తేజోవంతుడు. పర్వతమంత ఆకారం. ఎదరించవీలుకానివాడు. మేఘం వంటి గంభీరనాదంతో పెద్దగొంతుతో బెదిరిస్తున్నాడు. (37-39 1/2)
యక్ష ఉవాచ
ఇమే తే భ్రాతరో రాజన్ వార్యమాణా మయాసకృత్ ॥ 40
బలాత్ తోయం జిహీర్షంతః తతో వై మృదితా మయా ।
న పేయముదకం రాజన్ ప్రాణానిహ పరీప్సతా ॥ 41
పార్థ మా సాహసం కార్షీః మమ పూర్వపరిగ్రహః ।
ప్రశ్నానుక్త్వా తు కౌంతేయ తతః పిబ హరస్వ చ ॥ 42
యక్షుడిలా అన్నాడు.
రాజా! ఈ నీ తమ్ములు నేను వారిస్తున్నా వినకుండా మొండిగా నీటిని త్రాగబోయారు. అందుకని నేను వారిని చంపాను. రాజా! ప్రాణాలు కావాలంటే ఈ నీటిని త్రాగరాదు. పార్థా! తొందరపడవద్దు. ఈ సరస్సుపై నాకిప్పటికే అధికారముంది. కౌంతేయా! నా ప్రశ్నలకు సమాధానమిచ్చి ఆపై నీటిని త్రాగవచ్చు. తీసికొనిపోవచ్చుకూడా. (40-42)
యుధిష్ఠిర ఉవాచ
న చాహం కామయే యక్ష తవ పూర్వపరిగ్రహమ్ ।
కామం నైతత్ ప్రశంసంతి సంతో హి పురుషాః సదా ॥ 43
యదాత్మనా స్వమాత్మానం ప్రశంసే పురుషర్షభ ।
యథాప్రజ్ఞం తు తే ప్రశ్నాన్ ప్రతివక్ష్యామి పృచ్ఛ మామ్ ॥ 44
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
యక్షా! నీ అధికారంలోనున్నది, నాకు అవసరం లేదు. తనును తాను ప్రశంససించుకోవడం సత్పురుషులెప్పుడూ అభినందించరు. నా బుద్ధిమేరకు నీ ప్రశ్నలకు సమాధానమిస్తాను. అడుగు. (43,44)
యక్ష ఉవాచ
కిం స్విదాదిత్యమున్నయతి కే చ తస్యాభితశ్చరాః ।
కశ్చైనమస్తం నయతి కస్మింశ్చ ప్రతితిష్ఠతి ॥ 45
యక్షుడిలా అడిగాడు.
సూర్యుని ఉదయింపజేస్తున్న దేది? ఆయన చుట్టూ తిరిగేవారెవరు? ఆయనను అస్తమింపజేసేదెవరు? ఆయన దేనిలో ప్రతిష్ఠింపబడతాడు? (45)
యుధిష్ఠిర ఉవాచ
బ్రహ్మాదిత్యమున్నయతి దేవాస్తస్యాభితశ్చరాః ।
ధర్మశ్చాస్తం నయతి చ సత్యే చ ప్రతితిష్ఠతి ॥ 46
యుధిష్ఠిరుడిలా అడిగాడు.
సూర్యుని ఉదయింపజేసేది బ్రహ్మ. ఆయనచుట్టూ తిరిగేవారు దేవతలు. ఆయనను అస్తమింపజేసేది ధర్మం. ఆయన సత్యమందు ప్రతిష్ఠింపబడతాడు. (46)
యక్ష ఉవాచ
కేనస్విచ్చ్రోత్రియో భవతి కేనస్విద్ విందతే మహత్ ।
కేనస్విద్ ద్వితీయవాన్ భవతి రాజన్ కేన చ బుద్ధిమాన్ ॥ 47
యక్షుడిలా అన్నాడు.
రాజా! మనిషి దేవితో శ్రోత్రియుడు కాగలడు? దేనిద్వారా మహత్పదాన్ని పొందగలడు? దేనితో ససహాయుడు అవుతాడు? దేనితో బుద్ధిమంతుడవుతాడు. (47)
యుధిష్ఠిర ఉవాచ
శ్రుతేన శ్రోత్రియో భవతి తపసా విందతే మహత్ ।
ధృత్వా ద్వితీయవాన్ భవతి బుద్ధిమాన్ వృద్ధసేవయా ॥ 48
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
వేదంతో శ్రోత్రియుడు కాగలడు. తపస్సుతో మహత్పదాన్ని పొందగలడు. దైర్యంతో ససహాయుడు కాగలడు. వృద్ధసేవద్వారా బుద్ధిమంతుడు అవుతాడు. (48)
యక్ష ఉవాచ
కిం బ్రాహ్మణానాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ ।
కశ్చైషాం మానుషో భావః కిమేషామసతామివ ॥ 49
యక్షుడిలా అన్నాడు. బ్రాహ్మణులకు దేవత్వ మేది? వారిలో సత్పురుషులకు ధర్మమేది? వారి మానవత్వమేది? వారిలో అసత్పురుషుల మార్గమేది? (49)
యుధిష్ఠిర ఉవాచ
స్వాధ్యాయ ఏషాం దేవత్వం తప ఏషాం సతామివ ।
మరణం మానుషో భావః పరివాదోఽసతామివ ॥ 50
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
స్వాధ్యాయమే బ్రాహ్మణులకు దేవత్వం. తపశ్చరణమే సద్బ్రాహ్మణ ధర్మం. మరణమే మానుషత్వం. ఇతరులను నిందించటమే అసత్పురుష మార్గం. (50)
యక్ష ఉవాచ
కిం క్ష త్రియాణాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ ।
కశ్చైషాం మానుషో భావః కిమేషామసతామివ ॥ 51
యక్షుడిలా అన్నాడు.
క్షత్రియులకు దేవత్వమేది? వారిలో సత్పురుషులకు ధర్మమేది? వారికి మానుషత్వమేది? వారిలో అసత్పురుషుల మార్గమేది? (51)
యుధిష్ఠిర ఉవాచ
ఇష్వస్త్రమేషాం దేవత్వం యజ్ఞ ఏషాం సతామివ ।
భయం వై మానుషో భావః పరిత్యాగోఽసతామివ ॥ 52
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
అస్త్రవిద్యయే క్షత్రియులకు దేవత్వం. యజ్ఞమే వారిలో సజ్జనుల ధర్మం. భయమే వారికి మానుషత్వం. పీడితులను విడిచిపెట్టటమే వారిలో అసత్పురుషులమార్గం. (52)
యక్ష ఉవాచ
కిమేకం యజ్ఞియం సామ కిమేకం యజ్ఞియం యజుః ।
కా చైషాం వృణుతే యజ్ఞం కాం యజ్ఞో నాతివర్తతే ॥ 53
యక్షుడిలా అన్నాడు.
యజ్ఞసంబంధమైన ఒకే ఒక సామమేది? తత్సంబంధమైన ఒకే ఒక యజుస్సు ఏది? ఏ ఒక్కటి యజ్ఞాన్ని వరిస్తుంది? యజ్ఞం దేని నతిక్రమించదు? (53)
యుధిష్ఠిర ఉవాచ
ప్రాణో వై యజ్ఞియం సామ మనో వై యజ్ఞియం యజుః ।
ఋగేకా వృణుతే యజ్ఞం తాం యజ్ఞో నాతివర్తతే ॥ 54
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ప్రాణమే యజ్ఞసంబందమైన ఒకే ఒక్క సామం. మనస్సే యజ్ఞసంబంధమైన యజుస్సు. ఋక్కు ఒక్కటే యజ్ఞాన్ని వరిస్తుంది. యజ్ఞం ఋక్కు నతిక్రమించదు. (54)
యక్ష ఉవాచ
కింస్విదావపతాం శ్రేష్ఠం కింస్విన్నివపతాం వరమ్ ।
కింస్విత్ ప్రతిష్ఠమానానాం కింస్విత్ ప్రసవతాం వరమ్ ॥ 55
యక్షుడిలా అన్నాడు.
వ్యవసాయదారులకు శ్రేష్ఠమైనదేది? విత్తేవాళ్ళకు శ్రేష్ఠమైనదేది? ప్రతిష్ఠగలవారికి శ్రేష్ఠమైనదేది? సంతానవంతులకు శ్రేష్ఠమైనదేది? (55)
యుధిష్ఠిర ఉవాచ
వర్షమావపతాం శ్రేష్ఠం బీజం నివపతాం వరమ్ ।
గావః ప్రతిష్ఠమానానాం పుత్రః ప్రసవతాం వరః ॥ 56
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
వ్యవసాయదారులకు వర్షం శ్రేష్ఠమైనది. విత్తేవారికి విత్తనమే శ్రేష్ఠం. ప్రతిష్ఠగలవారికి గోవు శ్రేష్ఠం. సంతానవంతులకు పుత్రుడు శ్రేష్ఠం. (56)
యక్ష ఉవాచ
ఇంద్రియార్థాననుభవన్ బుద్ధిమాన్ లోకపూజితః ।
సమ్మతః సర్వభూతానామ్ ఉచ్ఛ్వసన్ కో న జీవతి ॥ 57
యక్షుడిలా అన్నాడు.
బుద్ధిమంతుడై, లోకపూజితుడై, ఇంద్రియార్థాలను అనుభవిస్తూ, సర్వభూతసమ్మతుడై ఊపిరితీస్తూ కూడా జీవించనివాడెవడు? (57)
యుధిష్ఠిర ఉవాచ
దేవతాతిథిభృత్యానాం పితౄణామాత్మనశ్చ యః ।
న నిర్వపతి పంచానామ్ ఉచ్ఛ్వసన్ న స జీవతి ॥ 58
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
దేవతలను, అతిథులను, కుటుంబీకులను, పితరులను, తనను పోషింపలేనివాడు ఊపిరి ఉన్నా జీవించనట్లే లెక్క. (58)
యక్ష ఉవాచ
కిం స్విద్ గురుతరం భూమేః కిం స్విదుచ్చతరం చ ఖాత్ ।
కిం స్విచ్ఛీఘ్రతరం వాయోః కింస్విద్ బహుతరం తృణాత్ ॥ 59
యక్షుడిలా అన్నాడు.
భూమి కన్న బరువైనదేది? ఆకాశం కన్న ఉన్నతమైన దేది? గాలికన్న వేగవంతమయిన దేది? గడ్డి కన్న తఱచుగా ఉన్నదేది? (59)
యుధిష్ఠిర ఉవాచ
మాతా గురుతరా భూమేః ఖాత్ పితోచ్చతరస్తథా ।
మనః శీఘ్రతరం వాతాత్ చింతా బహుతరీ తృణాత్ ॥ 60
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
తల్లి భూమికన్న బరువైనది. తండ్రి ఆకాశం కన్న ఉన్నతమైనవాడు. మనస్సు గాలికన్న వేగంగలది. చింత గడ్డికన్న తఱచైనది. అందుకే విడువదగినది. (60)
యక్ష ఉవాచ
కింస్విత్ సుప్తం న నిమిషతి కింస్విజ్జాతం న చోపతి ।
కస్యస్విద్ధృదయం నాస్తి కింస్విద్ వేగేన వర్ధతే ॥ 61
యక్షుడిలా అన్నాడు. నిదురిస్తూ కూడా కన్ను మూయనిదేది? పుట్టి కూడా కదలనిది ఏది? హృదయం లేనివాడెవడు? వేగంగా పెరిగేది ఏది? (61)
యుధిష్ఠిర ఉవాచ
మత్స్యః సుప్తో న నిమిషత్యండం జాతం న చోపతి ।
అశ్మనో హృదయం నాస్తి నదీ వేగేన వర్ధతే ॥ 62
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
చేప నిదురిస్తూ కూడా కన్ను మూయదు. గ్రుడ్డు పుట్టికూడా కదలదు. రాతికి హృదయం లేదు. నది వేగంతో పెరుగుతుంది. (62)
యక్ష ఉవాచ
కింస్విత్ ప్రవసతో మిత్రం కింస్విన్మిత్రం గృహే సతః ।
ఆతురస్య చ కిం మిత్రం కింస్విన్మిత్రం మరిష్యతః ॥ 63
యక్షుడిలా అన్నాడు.
ప్రవాసంలో మిత్రుడెవరు? గృహస్థునకు మిత్రుడెవరు? రోగికి మిత్రుడెవరు? మరణించేవానికి మిత్రుడెవరు? (63)
యుధిష్ఠిర ఉవాచ
సార్థః వ్రవసతో మిత్రం భార్యా మిత్రం గృహే సతః ।
ఆతురస్య భిష్మఙ్మిత్రం దానం మిత్రం మరిష్యతః ॥ 64
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
కూడా ప్రయాణించేవాడే ప్రవాసికి మిత్రుడు. గృహస్థునకు భార్య మిత్రుడు. రోగికి వైద్యుడే మిత్రుడు. మరణించేవానికి దానమే మిత్రుడు. (64)
యక్ష ఉవాచ
కోఽతిథిః సర్వభూతానాం కింస్విద్ ధర్మం సనాతనమ్ ।
అమృతం కిం స్విత్ రాజేంద్ర కిం స్విత్ సర్వమిదం జగత్ ॥ 65
యక్షుడిలా అన్నాడు.
సర్వప్రాణులకు అతిథి ఎవ్వరు? సనాతన ధర్మమేది? అమృతమేది? ఈ జగత్తంతా ఏది? (65)
యుధిష్ఠిర ఉవాచ
అతిథిః సర్వభూతానామ్ అగ్నిః సోమో గవామృతమ్ ।
సనాతనోఽమృతో ధర్మః వాయుః సర్వమిదం జగత్ ॥ 66
యుధిష్ఠిరుడిలా అన్నాడు. సర్వప్రాణులకు అతిథి అగ్ని. నిత్యధర్మమే సనాతన ధర్మం. ఆవుపాల రూపమున ఉన్న సోమమే అమృతం. ఈ జగత్తంతా గాలియే. (66)
యక్ష ఉవాచ
కింస్విదేకో విచరతే జాతః కో జాయతే పునః ।
కింస్విద్ధిమస్య భైషజ్యం కింస్విదావపనం మహత్ ॥ 67
యక్షుడిలా అన్నాడు.
ఒంటరిగా తిరిగేది ఏది? పుట్టి మరల పుట్టేది ఏది? శైత్యానికి మందు ఏది? మహాపాత్ర ఏది. (67)
యుధిష్ఠిర ఉవాచ
సూర్య ఏకో విచరతే చంద్రమా జాయతే పునః ।
అగ్నిర్హిమస్య భైషజ్యం భూమిరావపనం మహత్ ॥ 68
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ఒంటరిగా తిరిగేవాడు సూర్యుడు. పుట్టి మరల పుట్టేవాడు చంద్రుడు. శైత్యానికి మందు అగ్ని. భూమియే మహాపాత్ర. (68)
యక్ష ఉవాచ
కింస్విదేకపదం ధర్మ్యం కింస్విదేకపదం యశః ।
కింస్విదేకపదం స్వర్గ్యం కింస్విదేకపదం సుఖమ్ ॥ 69
యక్షుడిలా అన్నాడు.
ధర్మానికి ప్రధానస్థాన మేది? కీర్తికి ప్రధానస్థానమేది? స్వర్గానికి ప్రధానస్థానమేది? సుఖానికి ప్రధానస్థానమేది? (69)
యుధిష్ఠిర ఉవాచ
దాక్ష్యమేకపదం ధర్మ్యం దానమేకపదం యశః ।
సత్యమేకపదం స్వర్గ్యం శీలమేకపదం సుఖమ్ ॥ 70
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ధర్మానికి ప్రధానస్థానం దక్షత. కీర్తికి ప్రధానస్థానం దానం. స్వర్గానికి ప్రధాన స్థానం సత్యం. సుఖానికి ప్రధాన స్థానం శీలం. (70)
యక్ష ఉవాచ
కింస్విదాత్మా మనుష్యస్య కింస్విద్ దైవకృతః సఖా ।
ఉపజీవనం కింస్విదస్య కింస్విదస్య పరాయణమ్ ॥ 71
యక్షుడిలా అన్నాడు.
మనుష్యునకు ఆత్మ ఏది? వానికి దేవుడిచ్చిన మిత్రుడెవరు? వానికి జీవనమార్గమేది? వానికి పరమాశ్రయమేది? (71)
యుధిష్ఠిర ఉవాచ
పుత్ర ఆత్మా మనుష్యస్య భార్యా దైవకృతః సఖా ।
ఉపజీవనం చ పర్జన్యః దానమస్య పరాయణమ్ ॥ 72
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
మనుష్యునకు పుత్రుడే ఆత్మ. భార్యయే దేవుడిచ్చిన మిత్రుడు. జీవనమార్గం మేఘుడు. వానికి పరమాశ్రయం దానం. (72)
యక్ష ఉవాచ
ధన్యానాముత్తమం కింస్విద్ ధనానాం స్యాత్ కిముత్తమమ్ ।
లాభానాముత్తమం కిం స్యాత్ సుఖానాం స్యాత్ కిముత్తమమ్ ॥ 73
యక్షుడిలా అన్నాడు.
ధన్యులలోని ఉత్తమగుణమేది? ధనాలలో ఉత్తమధనమేది? లాభాలలో ఉత్తమమైనదేది? సుఖాలలో గొప్పదియేది? (73)
యుధిష్ఠిర ఉవాచ
ధన్యానాముత్తమం దాక్ష్యం ధనానాముత్తమం శ్రుతమ్ ।
లాభానాం శ్రేయ ఆరోగ్యం సుఖానాం తుష్టిరుత్తమా ॥ 74
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ధన్యులలోని ఉత్తమగుణం దక్షత. పాండిత్యం ధనాలలో ఉత్తమ ధనం. ఆరోగ్యం లాభాలలో శ్రేష్ఠం. సంతృప్తియే గొప్ప సుఖం. (74)
యక్ష ఉవాచ
కశ్చ ధర్మః పరో లోకే కశ్చ ధర్మః సదాఫలః ।
కిం నియమ్య న శోచంతి కైశ్చ సంధిర్న జీర్యతే ॥ 75
యక్షుడిలా అన్నాడు.
లోకంలో శ్రేష్ఠధర్మమేది? నిత్యమూ ఫలితాలనిచ్చే ధర్మమేది? దేనిని అదుపుచేస్తే దుఃఖముండదు? ఎవరితో మైత్రి నశించదు?(75)
యుధిష్ఠిర ఉవాచ
ఆనృశంస్యం పరో ధర్మః త్రయీధర్మః సదాఫలః ।
మనో యమ్య న శోచంతి సంధిః సద్భిర్న జీర్యతే ॥ 76
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
లోకంలో దయయే శ్రేష్ఠధర్మం. వేదధర్మమే సదాఫలదాయి. మనస్సును అదుపుచేస్తే దుఃఖమందరు. సజ్జనులతోడి మైత్రి నశించదు. (76)
యక్ష ఉవాచ
కిం ను హిత్వా ప్రియో భవతి కిం ను హిత్వా న శోచతి ।
కిం ను హిత్వార్థవాన్ భవతి కిం ను హిత్వా సుఖీ భవేత్ ॥ 77
యక్షుడిలా అన్నాడు.
దేనిని వదిలితే మనిషి ఇష్టుడవుతాడు? దేనిని విడిస్తే బాధపడడు? దేనిని వీడితే అర్థవంతుడు కాగలడు? దేనిని పరిత్యజిస్తే సుఖవంతుడవుతాడు? (77)
యుధిష్ఠిర ఉవాచ
మానం హిత్వా ప్రియో భవతి క్రోధం హిత్వా న శోచతి ।
కామం హిత్వార్థవాన్ భవతి లోభం హిత్వా సుఖీ భవేత్ ॥ 78
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
అభిమానాన్ని వీడితే ఇష్టుడు కాగలడు. క్రోధాన్ని విడిస్తే బాధపడడు. కామాన్ని వదిలితే అర్థవంతుడు కాగలడు. లోభాన్ని పరిత్యజిస్తే సుఖవంతుడవుతాడు. (78)
యక్ష ఉవాచ
కిమిర్థం బ్రాహ్మణే దానం కిమర్థం నటనర్తకే ।
కిమర్థం చైవ భృత్యేషు కిమర్థం చైవ రాజసు ॥ 79
యక్షుడిలా అన్నాడు.
బ్రాహ్మణులకు దానమెందుకు? నటనర్తకులకు దానమెందుకు? సేవకులకు దానమెందుకు? రాజులకు దానమెందుకు? (79)
యుధిష్ఠిర ఉవాచ
ధర్మార్థం బ్రాహ్మణే దానం యశోఽర్థం నటనర్తకే ।
భృత్యేషు భరణార్థం వై భయార్థం చైవ రాజసు ॥ 80
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ధర్మంకోసమే బ్రాహ్మణునకు దానం. కీర్తికోసమే నటనర్తకులకు దానం. సేవకులకు పోషణకోసమే దానం. భయం వలననే రాజులకు దానం. (80)
యక్ష ఉవాచ
కేనస్విదావృతో లోకః కేనస్విన్న ప్రకాశతే ।
కేన త్యజతి మిత్రాణి కేన స్వర్గం న గచ్ఛతి ॥ 81
యక్షుడిలా అన్నాడు.
లోకాన్నంతా కప్పి ఉన్నదేది? దేనివలన అది ప్రకాశించదు? మిత్రులను ఎందుకు విడిచిపెడతాడు? దేని వలన స్వర్గం పోలేరు. (81)
యుధిష్ఠిర ఉవాచ
అజ్ఞానేనావృతో లోకః తమసా న ప్రకాశతే ।
లోభాత్ మిత్రాణి త్యజతి సంగాత్ స్వర్గం న గచ్ఛతి ॥ 82
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
లోకాన్ని అజ్ఞానం కప్పి ఉంటుంది. అజ్ఞానం వలన అది ప్రకాశించదు. లోభం వలన మిత్రులను విడిచిపెడతాడు. విషయాసక్తి వలన స్వర్గానికి వెళ్ళలేరు. (82)
యక్ష ఉవాచ
మృతః కథం స్యాత్ పురుషః కథం రాష్ట్ర మృతం భవేత్ ।
శ్రాద్ధం మృతం కథం వా స్యాత్ కథం యజ్ఞో మృతో భవేత్ ॥ 83
యక్షుడిలా అన్నాడు.
మనిషి మృతుడెట్లు కాగలడు? రాష్ట్రం ఎలా మృతమవుతుంది? శ్రాద్ధం ఎలా మృత మవుతుంది? యజ్ఞమెలా మృత మవుతుంది? (83)
యుధిష్ఠిర ఉవాచ
మృతో దరిద్రః పురుషః మృతం రాష్ట్రమరాజకమ్ ।
మృతమశ్రోత్రియం శ్రాద్ధం మృతో యజ్ఞస్త్వదక్షిణః ॥ 84
యుధిష్ఠిరుడిలా అన్నాడు. మనిషి దరిద్రుడయితే మృతుడే. రాజులేని రాజ్యం మృతం. శ్రోత్రియుడులేని శ్రాద్ధం మృతం. దక్షిణలు లేని యజ్ఞం మృతం. (84)
యక్ష ఉవాచ
కా దిక్ కిముదకం ప్రోక్తం కిమన్నం కిం చ వై విషమ్ ।
శ్రాద్ధస్య కాలమాఖ్యాహి తతః పిబ హరస్వ చ ॥ 85
యక్షుడిలా అన్నాడు.
దిక్కుఏది? ఉదకమేది? అన్నమేది? విషమేది? శ్రాద్ధయోగ్యమైన కాలమేది? చెప్పు. ఆ తర్వాత నీరు త్రాగవచ్చు. తీసికొనిపోవచ్చు. (85)
యుధిష్ఠిర ఉవాచ
సంతో దిగ్ జలమాకాశం గౌరన్నం ప్రార్థనా విషమ్ ।
శ్రాద్ధస్య బ్రాహ్మణః కాలః కథం వా యక్ష మన్యసే ॥ 86
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
సజ్జనులే దిక్కు. ఆకాశమే జలం. గోవే అన్నం. కోరికయే విషం. బ్రాహ్మణుని రాకయే శ్రాద్ధానికి తగిన కాలం. యక్షా! నీవేమనుకొంటున్నావో! (86)
యక్ష ఉవాచ
తపః కింలక్షణం ప్రోక్తం కో దమశ్చ ప్రకీర్తితః ।
క్షమా చ కా పరా ప్రోక్తా కా చ హ్రీః పరికీర్తితా ॥ 87
యక్షుడిలా అన్నాడు.
తపస్సుకు లక్షణమేది? దమమంటే ఏది? పరాకోటికి చెందిన క్షమ ఏది? సిగ్గంటే ఏది? (87)
యుధిష్ఠిర ఉవాచ
తపః స్వదర్భవర్తిత్వం మనసో దమనం దమః ।
క్షమా ద్వంద్వసహిష్ణుత్వం హ్రీరకార్యనివర్తనమ్ ॥ 88
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
స్వధర్మాచరణమే తపస్సు. మనస్సును అదుపుచేయటమే దమం. ద్వంద్వాలను సహించగలగటమే క్షమ. చెడ్డపనులు చేయకుండుటయే సిగ్గు. (88)
యక్ష ఉవాచ
కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్ కః శమశ్చ ప్రకీర్తితః ।
దయా చ కా పరా ప్రోక్తా కిం చార్జవముదాహృతమ్ ॥ 89
యక్షుడిలా అన్నాడు.
రాజా! జ్ఞానమంటే ఏది? శమమంటే ఏది? పరాకోటికి చెందిన దయ ఏది? ఋజుత్వమంటే ఏది? (89)
యుధిష్ఠిర ఉవాచ
జ్ఞానం తత్త్వార్థసంబోధః శమశ్చిత్తప్రశాంతతా ।
దయా సర్వసుఖైషిత్వమ్ ఆర్జవం సమచిత్తతా ॥ 90
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
పరతత్త్వజ్ణానమే జ్ఞానం. చిత్తప్రశాంతతయే శమం. అందరూ సుఖంగా ఉండాలని కోరటమే దయ. సమచిత్తతయే ఋజుత్వం. (90)
యక్ష ఉవాచ
కః శత్రుర్దుర్జయః పుంసాం కశ్చ వ్యాధిరనంతకః ।
కీదృశశ్చ స్మృతః సాధుః అసాధుః కీదృశః స్మృతః ॥ 91
యక్షుడిలా అన్నాడు.
మనుష్యులు జయించలేని శత్రువు ఎవరు? అనంతమైన వ్యాధి ఏది? ఎటువంటి వానిని సాధువంటారు? ఎటువంటి వానిని అసాధువంటారు? (91)
యుధిష్ఠిర ఉవాచ
క్రోధః సుదుర్జయః శత్రుః లోభో వ్యాధిరనంతకః ।
సర్వభూతహితః సాధుః అసాధుర్నిర్దయః స్మృతః ॥ 92
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
క్రోధం జయింపరాని శత్రువు. లోభం అంతంలేని వ్యాధి. సర్వప్రాణుల హితాన్ని కోరేవాడు సాధువు. దయారహితుడే అసాధువు. (92)
యక్ష ఉవాచ
కో మోహః ప్రోచ్యతే రాజన్ కశ్చ మానః ప్రకీర్తితః ।
కిమాలస్యం చ విజ్ఞేయం కశ్చ శోకః ప్రకీర్తితః ॥ 93
యక్షుడిలా అన్నాడు.
రాజా! మోహమంటే ఏమిటి? దేనిని మానమంటారు? దేనిని ఆలస్యంగా తెలిసికోవాలి? ఏది శోకం? (93)
యుధిష్ఠిర ఉవాచ
మోహో హి ధర్మమూఢత్వం మానస్త్వాత్మాభిమానితా ।
ధర్మనిష్క్రియతాఽఽలస్యం శోకస్త్వజ్ఞానముచ్యతే ॥ 94
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ధర్మమూఢత్వమే మోహం. ఆత్మాభిమానమే మానం. ధర్మాన్ని పాటించకపోవటమే ఆలస్యం. అజ్ఞానమే శోకం. (94)
యక్ష ఉవాచ
కిం స్థైర్యమృషిభిః ప్రోక్తం కిం చ ధైర్యముదాహృతమ్ ।
స్నానం చ కిం పరం ప్రోక్తం దానం చ కిమిహోచ్యతే ॥ 95
యక్షుడిలా అన్నాడు. దేనిని స్థైర్యమని ఋషులన్నారు? ధైర్యమని దేనినన్నారు? ఉత్తమస్నానమేది? ఉత్తమదానమని దేనినంటారు? (95)
యుధిష్ఠిర ఉవాచ
స్వధర్మే స్థిరతా స్థైర్యం ధైర్యమింద్రియనిగ్రహః ।
స్నానం మనోమలత్యాగః దానం వై భూతరక్షణమ్ ॥ 96
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
స్వధర్మంలో నిశ్చలంగా నిలవటమే స్థైర్యం. ఇంద్రియనిగ్రహమే ధైర్యం. మనోనైర్మల్యమే ఉత్తమస్నానం. భూతరక్షణమే ఉత్తమదానం. (96)
యక్ష ఉవాచ
కః పండితః పుమాన్ జ్ఞేయః నాస్తికః కశ్చ ఉచ్యతే ।
కో మూర్ఖః కశ్చ కామః స్యాత్ కో మత్సర ఇతి స్మృతః ॥ 97
యక్షుడిలా అన్నాడు.
ఎవనిని పండితుడని భావించాలి? నాస్తికుడెవడు? కామ మంటే ఏమిటి? మత్సర మంటే ఏమిటి? (97)
యుధిష్ఠిర ఉవాచ
ధర్మజ్ఞః పండితో జ్ఞేయః నాస్తికో మూర్ఖ ఉచ్యతే ।
కామః సంసారహేతుశ్చ హృత్తాపో మత్సరః స్మృతః ॥ 98
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ధర్మజ్ఞుడే పండితుడు. పరలోకం లేదనేవాడు నాస్తికుడు. నాస్తికుడే మూర్ఖుడు. సంసారహేతువయినది కామం. హృదయతాపమే మత్సరం. (98)
యక్ష ఉవాచ
కోఽహంకార ఇతి ప్రోక్తః కశ్చ దంభః ప్రకీర్తితః ।
కిం తద్ దైవం పరం ప్రోక్తం కిం తత్ పైశున్యముచ్యతే ॥ 99
యక్షుడిలా అన్నాడు.
అహంకార మంటే ఏమిటి? దంభ మంటే ఏమిటి? పరదైవమెవరు? పిశునత్వమంటే ఏమిటి? (99)
యుధిష్ఠిర ఉవాచ
మహాజ్ఞానమహంకారః దంభో ధర్మో ధ్వజోచ్ఛ్రయః ।
దైవం దానఫలం ప్రోక్తం పైశున్యం పరదూషణమే ॥ 100
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
తీవ్రమైన అజ్ఞానమే అహంకారం. ధర్మాత్ముడనంటూ ప్రకటించుకొనటమే దంభం. దానఫలమే పరమదైవం. పరధూషణమే పిశునత్వం. (100)
యక్ష ఉవాచ
ధర్మశ్చార్థశ్చ కామశ్చ పరస్పరవిరోధినః ।
ఏషాం నిత్యవిరుద్ధానాం కథమేకత్ర సంగమః ॥ 101
యక్షుడిలా అన్నాడు.
ధర్మం, అర్థం, కామం పరస్పర విరోధం కలవి. నిత్యవిరుద్ధాలయిన ఇవి ఒకేచోట ఎలా కలుస్తాయి. (101)
యుధిష్ఠిర ఉవాచ
యదా ధర్మశ్చ భార్యా చ పరస్పరవశానుగౌ ।
తదా ధర్మార్థకామానాం త్రయాణామపి సంగమః ॥ 102
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ధర్మం, భార్య పరస్పరం విరోధించకుండా మనుష్యునకు వశమైనప్పుడు ధర్మార్థకామాలు మూడూ ఒకేచోట నిలుస్తాయి. (102)
యక్ష ఉవాచ
అక్షయో నరకః కేన ప్రాప్యతే భరతర్షభ ।
ఏతన్మే పృచ్ఛతః ప్రశ్నం తచ్ఛీఘ్రం వక్తుమర్హసి ॥ 103
యక్షుడిలా అన్నాడు.
భరతర్షభా! అక్షయనరకాన్ని ఎవడు పొందుతాడు? నా ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పాలి. (103)
యుధిష్ఠిర ఉవాచ
బ్రాహ్మణం స్వయమాహూయ యాచమానమకించినమ్ ।
పశ్చాన్నాస్తీతి యో బ్రూయాత్ సోఽక్షయం నరకం వ్రజేత్ ॥ 104
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ఏమీలేక యాచనకు వచ్చిన బ్రాహ్మణుని స్వయంగా ఆహ్వానించి, ఆపై లేదు పొమ్మనే వాడు అక్షయనరకాన్ని పొందుతాడు. (104)
వేదేషు ధర్మశాస్త్రేషు మిథ్యా యో వై ద్విజాతిషు ।
దేవేషు పితృధర్మేషు సోఽక్షయం నరకం వ్రజేత్ ॥ 105
వేదాలపై, ధర్మాశాస్త్రాలపై, బ్రాహ్మణూలపై, దేవతలపై, పితృధర్మాలపై మిథ్యాబుద్ధి గలవాడు అక్షయనరకాన్ని పొందుతాడు. (105)
విద్యమానే ధనే లోభాద్ దానభోగవివర్జితః ।
పశ్చాన్నాస్తీతి యో బ్రూయత్ సోఽక్షయం నరకం వ్రజేత్ ॥ 106
ధనమున్నా లోభం వలన దానభోగాలను పరిత్యజించి లేదని పలుకుతుండేవాడు అక్షయనరకాన్ని పొందుతాడు. (106)
యక్ష ఉవాచ
రాజన్ కులేన వృత్తేన స్వాధ్యాయేన శ్రుతేన వా ।
బ్రాహ్మణ్యం కేన భవతి ప్రబ్రూహ్యేతత్ సునిశ్చతమ్ ॥ 107
యక్షుడిలా అన్నాడు.
రాజా! బ్రాహ్మణత్వం కుల, వృత్త, స్వాధ్యాయ, పాండిత్యాలలో దేనివలన సిద్ధిస్తుంది. నిశ్చతంగా చెప్పు. (107)
యుధిష్ఠిర ఉవాచ
శృణు యక్ష కులం తాత న స్వాధ్యాయో న చ శ్రుతమ్ ।
కారణం హి ద్విజత్వే చ వృత్తమేవ న సంశయః ॥ 108
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
నాయనా! యక్షా! విను. కులంగానీ, స్వాధ్యాయం కానీ పాండిత్యం కానీ బ్రాహ్మణత్వానికి కారణాలు కావు. వృత్తమే దానిని కారణం. సందేహం లేదు. (108)
వృత్తం యత్నేన సంరక్ష్యం బ్రాహ్మణేన విశేషతః ।
అక్షీణవృత్తో న క్షీణః వృత్తతస్తు హతో హతః ॥ 109
బ్రాహ్మణుడు ప్రత్యేక ప్రయత్నంతో ఆచారాన్ని కాపాడుకోవాలి. ఆచారం క్షీణించనివాడు క్షీణించడు. ఆచారం నశీస్తే ఆచారి నశించినట్లే. (109)
పఠకాః పాఠకాశ్చైవ యే చాన్యే శాస్త్రచింతకాః ।
సర్వే వ్యసనినో మూర్ఖాః యః క్రియావాన్ స పండితః ॥ 110
చదివేవారు కానీ, చదివించేవారు కానీ శాస్త్రవిచారం చేసేవారు కానీ అంతా వ్యసనపరాయణులూ మూర్ఖులే. ఆచరించేవాడే పండితుడు. (110)
చతుర్వేదోఽపి దుర్వృత్తః స శూద్రాదతిరిచ్యతే ।
యోఽగ్నిహోత్రపరో దాంతః స బ్రాహ్మణ ఇతి స్మృతః ॥ 111
నాల్గువేదాలు చదివిన వాడైనా ఆచరణ సరిగా లేకపోతే శూద్రుని కన్నా హీనుడే. అగ్నిహోత్రతత్పరుడై, జితేంద్రియుడైనవాడే బ్రాహ్మణుడు. (111)
యక్ష ఉవాచ
ప్రియవచనవాదీ కిం లభతే
విమృశితకార్యకరః కిం లభతే ।
బహుమిత్రకరః కిం లభతే
ధర్మరతః కిం లభతే కథయః ॥ 112
యక్షుడిలా అన్నాడు.
ప్రియంగా మాటాడేవాడు ఏం పొందుతాడు? ఆలోచించి పనిచేసేవాడు ఏం పొందుతాడు? చాలామంది మిత్రులున్న వాడు ఏం పొందుతాడు? ధర్మపరుడు ఏం పొందుతాడు? చెప్పు. (112)
ప్రియవచనవాదీ ప్రియో భవతి
విమృశితకార్యకరోఽధికం జయతి ।
బహుమిత్రకరః సుఖం వసతే
యశ్చ ధర్మరతః స గతిం లభతే ॥ 113
ప్రియంగా మాటాడేవాడు అందరికీ ఇష్టుడవుతాడు. ఆలోచించి పనిచేసేవాడు ఎక్కువ విజయాలు పొందుతాడు. బహుమిత్రులు గలవాడు సుఖపడతాడు. ధర్మాసక్తి గలవాడు సద్గతులు పొందుతాడు. (113)
యక్ష ఉవాచ
కో మోదతే కిమాశ్చర్యం కః పంథాః కా చ వార్తికా ।
మమైతాంశ్చతురః ప్రశ్నాన్ కథయిత్వా జలం పిబ ॥ 114
యక్షుడిలా అన్నాడు.
ఎవడు ఆనందిస్తాడు? ఆశ్చర్యకరమైన దేది? ఏది దారి? ఏది వార్త? నాకీ నాలుగు ప్రశ్నలకూ సమాధానమిచ్చి నీళ్ళు త్రాగు. (114)
యుధిష్ఠిర ఉవాచ
పంచమేఽహని షష్ఠే వా శాకం పచతి స్వే గృహే ।
అనృణీ చాప్రవాసీ చ స వారిచర మోదతే ॥ 115
యుధిష్ఠిరుడిలా అన్నాడు. జలచరా! తన ఇంటిలో అయిదారురోజులకొకసారి శాకపాకాలు చేసికొన్నా అప్పులేనివాడు, పరదేశంలో లేనివాడు ఆనందిస్తాడు. (115)
అహన్యహని భూతాని గచ్ఛంతీహ యమాలయమ్ ।
శేషాః స్థావరమిచ్ఛంతి కిమాశ్చర్యమతః పరమ్ ॥ 116
ప్రతిదినమూ ప్రాణులు యమాలయానికి వెళుతూనే ఉంటాయి. అయినా మిగిలినవారు స్థిరంగా ఉండాలనుకొంటారు. అంతకన్న ఆశ్చర్యకరమేముంది? (116)
తర్కోఽప్రతిష్ఠః శ్రుతయో విభిన్నా
నైకో ఋషిర్యస్య మతం ప్రమాణమ్ ।
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం
మహాజనో యేన గతః స పంథాః ॥ 117
తర్కం నిలవదు. శ్రుతులు విభిన్నాలు. ఋషులు చాలామంది. ఎవరిని ప్రమాణంగా భావించాలి? ధర్మతత్త్వం నిగూఢమయినది కాబట్టి మహాపురుషులు చనినమార్గమే మనకూ మార్గం. (117)
అస్మిన్ మహామోహమయే కటాహే
సూర్యాగ్నినా రాత్రిదివేంధనేన ।
మాసర్తుదర్వీపరిఘట్టనేన
భూతాని కాలః పచతీతి వార్తా ॥ 118
మహామోహమయమయిన ఈ బ్రహ్మాండభాండంలో కాలం సూర్యుని అగ్నిగా, రేబవళ్ళు ఇంధనంగా మాసర్తువులను గరిటెలుగా చేసి ప్రాణులను పక్వం చేస్తోంది. ఇలా జనులు అనుకొంటారు. (118)
యక్ష ఉవాచ
వ్యాఖ్యాతా మే త్వయా ప్రశ్నాః యాథాతథ్యం పరంతప ।
పురుషం త్విదానీం వ్యాఖ్యాహి యశ్చ సర్వధనీ నరః ॥ 119
యక్షుడిలా అన్నాడు.
పరంతపా! నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ సరిగ్గా సమాధానాలు ఇచ్చావు. ఇప్పుడు పురుషుడంటే ఎవరో, సర్వధనవంతుడైన నరుడెవడో చెప్పాలి. (119)
యుధిష్ఠిర ఉవాచ
దివం స్పృశతి భూమిం చ శబ్దః పుణ్యేన కర్మణా ।
యావత్ స శబ్దో భవతి తావత్ పురుష ఉచ్యతే ॥ 120
యుధిష్ఠిరుడిలా అన్నాడు. ఎవని పుణ్యకర్మలను కీర్తించే శబ్దం స్వర్గాన్ని భూమినీ స్పృశిస్తుందో ఆ శబ్దం వినిపించినంతకాలం అతడు పురుషుడనబడతాడు. (120)
తుల్యే ప్రియాప్రియే యస్య సుఖదుఃఖే తథైవ చ ।
అతీతానాగతే చోభే స వై సర్వధనీ నరః ॥ 121
ప్రియాప్రియాలను సమంగా స్వీకరించేవాడు, సుఖదుఃఖాలనూ, భూతభవిష్యత్తులనూ సమానంగా భావించేవాడు అందరికంటే ధనికుడు. (121)
(భూత భవ్యభవిష్యేషు నిఃస్పృహః శాంతమానసః ।
సుప్రసన్నః సదా యోగీ స వై సర్వధనీశ్వరః ॥)
భూతవర్తమాన భవిష్యత్కాలాలకు సంబంధించి ఏవిధమైన కోరికలూ లేకుండా శాంతహృదయుడై, ప్రసన్నుడై, నిత్యయోగిగా నున్నవాడు ధనవంతులందరిలో గొప్పవాడు.
యక్ష ఉవాచ
వ్యాఖ్యాతః పురుషో రాజన్ యశ్చ సర్వధనీ నరః ।
తస్మాత్ త్వమేకం భ్రాతృణాం యమిచ్ఛసి స జీవతు ॥ 122
యక్షుడిలా అన్నాడు.
రాజా! పురుషుడంటే ఎవరో, సర్వధనవంతుడెవరో చక్కగా వివరించావు. నీ సోదరులలో ఒక్కడిని బ్రతికిస్తా. ఎవడు కావాలో కోరుకో. (122)
యుధిష్ఠిర ఉవాచ
శ్యామో య ఏష రక్తాక్షః బృహచ్ఛాల ఇవోత్థితః ।
వ్యూఢోరస్కో మహాబాహుః నకులో యక్ష జీవతు ॥ 123
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
యక్షా! శ్యామవర్ణుడు, రక్తనేత్రుడు, మద్దిచెట్టువలె ఉన్నతుడు, విశాలవక్షఃస్థలుడు, మహాబాహువు అయిన నకులుడిని బ్రతికించు. (123)
యక్ష ఉవాచ
ప్రియస్తే భీమసేనోఽయమ్ అర్జునో వః పరాయణమ్ ।
స కస్మాన్నకులం రాజన్ సాపత్నం జీవమిచ్ఛసి ॥ 124
యక్షుడిలా అన్నాడు.
రాజా! నీకు భీముడంటే ఇష్టం. అర్జునుడు మీకు అండ. కానీ నీవు నీ సవతితల్లికి పుట్టిన నకులుని బ్రతికించమని ఎందుకు కోరుతున్నావు? (124)
యస్య నాగసహస్రేణ దశసంఖ్యేన వై బలమ్ ।
తుల్యం తం భీమముత్సృజ్య నకులం జీవమిచ్ఛసి ॥ 125
పదివేల ఏనుగుల బలం గల భీమసేనుని విడిచి నకులుడు బ్రతకాలని ఎందుకు కోరుతున్నావు? (125)
తథైనం మనుజాః ప్రాహుః భీమసేనం ప్రియం తవ ।
అథ కేనానుభావేన సాపత్నం జీవమిచ్ఛసి ॥ 126
ప్రజలందరూ నీకు భీమసేనుడంటే ఇష్టమంటే నీవు ఏ కారణంగా సవతితల్లి కొడుకును - నకులుని - బ్రతికించమంటున్నావు? (126)
యస్య బాహుబలం సర్వే పాండవాః సముపాసతే ।
అర్జునం తమపాహాయ నకులం జీవమిచ్ఛసి ॥ 127
పాండవులందరూ అర్జునుని బాహుబలాన్ని ఆశ్రయించి ఉంటారు గదా! అటువంటి అర్జునుని వదలి నకులుని బ్రతికించమని ఎందుకు కోరుకొంటున్నావు? (127)
యుధిష్ఠిర ఉవాచ
ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః ।
తస్మాద్ ధర్మం న త్యాజామి మా నో ధర్మో హతోఽవధీత్ ॥ 128
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ధర్మాన్ని చంపితే అది చంపుతుంది. ధర్మాన్ని రక్షిస్తే అది రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని వీడను. దెబ్బతిన్న ధర్మం మమ్ము దెబ్బతీయకూడదు. (128)
ఆనృశంస్యం పరో ధర్మః పరమార్థాచ్చ మే మతమ్ ।
ఆనృశంస్యం చికీర్షామి నకులో యక్ష జీవతు ॥ 129
బాగా ఆలోచిస్తే ఆనృశంస్యం(కరుణ) పరమధర్మమని నాకనిపిస్తోంది. ఆ కరుణను(సర్వసమదృష్టిని) ప్రదర్శిస్తున్నాను. యక్షా! నకులుని బ్రతికించు. (129)
ధర్మశీలః సదా రాజా ఇతి మాం మానవా విదుః ।
స్వధర్మాన్న చలిష్యామి నకులో యక్ష జీవతు ॥ 130
ప్రజలంతా 'సదా ధర్మశీలుడైన రాజు' అని నన్ను అంటుంటారు. స్వధర్మాన్ని వీడను. యక్షా! నకులుని బ్రతికించు. (130)
కుంతీ చైవ తు మాద్రీ చ ద్వే భార్యే తు పితుర్మమ ।
ఉభే సపుత్రే స్యాతాం వై ఇతి మే ధీయతే మతిః ॥ 131
నా తండ్రికి కుంతి, మాద్రి ఇద్దరూ భార్యలు. ఇద్దరి బిడ్డలూ బ్రతికి ఉండాలి అని నా ఆలోచన. (131)
యథా కుంతీ తథా మాద్రీ విశేషో నాస్తి మే తయోః ।
మాతృభ్యాం సమమిచ్ఛామి నకులో యక్ష జీవతు ॥ 132
నాకు కుంతి ఎంతో మాద్రి కూడా అంతే. ఏ తేడా లేదు. ఇద్దరు తల్లుల విషయంలో సమానత్వాన్ని కోరుతున్నాను. యక్షా! నకులుని బ్రతికించు. (132)
యక్ష ఉవాచ
తస్య తేఽర్థాచ్చ కామాచ్చ ఆనృశంస్యం పరం మతమ్ ।
తస్మాత్ తే భ్రాతరః సర్వే జీవంతు భరతర్షభ ॥ 133
యక్షుడిలా అన్నాడు.
భరతర్షభా! నీవు అర్థకామాలకన్న ఆనృశంస్యాన్ని గొప్పగా భావించావు. కాబట్టి నీ సోదరులనందరినీ బ్రతికిస్తాను. (133)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఆరణేయపర్వణి యక్షప్రశ్నే త్రయోదశాధికశతతమోఽధ్యాయః ॥ 313 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఆరణేయపర్వమను ఉపపర్వమున యక్షప్రశ్నలు అను మూడువందల పదమూడవ అధ్యాయము. (313)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి మొత్తం 134 శ్లోకాలు.)