303. మూడువందల మూడవ అధ్యాయము
కుంతిభోజుని ఇంటికి దుర్వాసుడు వచ్చుట. తత్సేవకై పృథను నియోగించుట.
జనమేజయ ఉవాచ
కిం తద్ గుహ్యం న చాఖ్యాతం కర్ణాయేహోష్ణరశ్మినా ।
కీదృశే కుండలే తే చ కవచం చైవ కీదృశమ్ ॥ 1
కుతశ్చ కవచం తస్య కుండలే చైవ సత్తమ ।
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం తన్మే బ్రూహి తపోధన ॥ 2
జనమేజయుడిలా అన్నాడు.
సజ్జనశ్రేష్ఠా! సూర్యుడు కర్ణునకు చెప్పని ఆ రహస్యమేమిటి? కర్ణుని కవచకుండలాలు ఎటువంటివి? తపోధనా! కవచకుండలాలు కర్ణునకు ఎక్కడ నుండి లభించాయి? ఇది వినాలని ఉంది. నాకు చెప్పవలసినది. (1,2)
వైశంపాయన ఉవాచ
అయం రాజన్ బ్రవీమ్యేతత్ తస్య గుహ్యం విభావసోః ।
యాదృశే కుండలే తే చ కవచం చైవ యాదృశమ్ ॥ 3
రాజా! ఇదిగో సూర్యుడు రహస్యమని దాచిన విషయాన్నే చెప్పబోతున్నాను. కవచకుండలాలు ఎటువంటివో కూడా వివరించబోతున్నాను. (3)
కుంతిభోజం పురా రాజన్ బ్రాహ్మణః పర్యుపస్థితః ।
తిగ్మతేజా మహాప్రాంశుః శ్మశ్రుదండజటాధరః ॥ 4
రాజా! ఒకప్పుడు కుంతిభోజుని కొలువులోనికి తీక్ష్ణ తేజస్సు గల్గి, దీర్ఘబాహువై, గడ్డం, మీసం, జటలు, దండం ధరించిన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. (4)
దర్శనీయోఽనవద్యాంగః తేజసా ప్రజ్వలన్నివ ।
మధుపింగో మధురవాక్ తపఃస్వాధ్యాయభూషణః ॥ 5
ఆ బ్రాహ్మణుడు రూపవంతుడు, నిర్దోషశరీరుడు. జ్వలిస్తున్న తేజస్సు గలవాడు. తేనె రంగువాడు. మధుర వచనుడు. తపస్సు, స్వాధ్యాయం ఆభరణాలుగా గలవాడు. (5)
స రాజానం కుంతిభోజమ్ అబ్రవీత్ సుమహాతపాః ।
భిక్షామిచ్ఛామి వై భోక్తుం తవ గేహే విమత్సర ॥ 6
మహాతపస్వి అయిన ఆ బ్రాహ్మణుడు కుంతిభోజునితో ఇలా అన్నాడు.
మాత్సర్యరహితా! నీ ఇంట భిక్షను స్వీకరింపగోరుతున్నాను. (6)
న మే వ్యలీకం కర్తవ్యం త్వయా వా తవ చానుగైః ।
ఏవం వత్స్యామి తే గేహే యది తే రోచతేఽనఘ ॥ 7
అనఘా! నీవు కానీ, నీ అనుచరులు కానీ నాకు అప్రియమైన దేదీ చేయరాదు. అలా ఇష్టమయితేనే నేను నీ ఇంట ఉంటాను. (7)
యథాకామం చ గచ్ఛేయమ్ ఆగచ్ఛేయం తథైవ చ ।
శయ్యాసనే చ మే రాజన్ నాపరాధ్యేత కశ్చన ॥ 8
రాజా! నా ఇష్టం వచ్చినప్పుడు వెళతాను. ఇష్టం వచ్చినపుడు వస్తాను. నా శయ్యపై లేదా ఆసనంపై కూర్చోవటం తప్పు. అలా ఎవ్వరూ చేయకూడదు. (8)
తమబ్రవీత్ కుంతిభోజః ప్రీతియుక్తమిదం వచః ।
ఏవమస్తు పరం చేతి పునశ్చైనమథాబ్రవీత్ ॥ 9
కుంతి భోజుడు "అలాగే" అని ప్రీతిపూర్వకంగా ఆ బ్రాహ్మణునితో చెప్పి మరలా ఇలా అన్నాడు. (9)
మమ కన్యా మహాప్రాజ్ఞ పృథా నామ యశస్వినీ ।
శీలవృత్తాన్వితా సాధ్వీ నియతా చైవ భావినీ ॥ 10
మహాప్రాజ్ఞా! నా కుమార్తె పృథ, మంచిశీలం, మంచి నడవడి కలది. సాధ్వి. నియమబద్ధంగా వ్యవహరిస్తుంది. ఆలోచన కలది. ఆమేరకు ప్రసిద్ధికెక్కినది కూడా. (10)
ఉపస్థాస్యతి సా త్వాం వై పూజయానవమన్య చ ।
తస్యాశ్చ శీలవృత్తేన తుష్టిం సముపయాస్యసి ॥ 11
ఆమె నీ సేవకై ఉంటుంది. ఎప్పుడూ మిమ్ము అవమానించదు. ఆమె తన శీలంతో, సదాచారంతో మీకు సంతోషం కలుగుతుంది. (11)
ఏవముక్త్వా తు తం విప్రమ్ అభిపూజ్య యథావిధి ।
ఉవాచ కన్యామభ్యేత్య పృథాం పృథులలోచనామ్ ॥ 12
ఆ రీతిగా పలికి ఆ విప్రుని యథావిధిగా పూజించి, విశాలాక్షి అయిన కుమార్తెను పృథను పిలిపించి ఇలా అన్నాడు. (12)
అయం వత్సే మహాభాగః బ్రాహ్మణో వస్తుమిచ్ఛతి ।
మమ గేహే మయా చాస్య తథేత్యేవం ప్రతిశ్రుతమ్ ॥ 13
అమ్మా! మహాభాగుడైన ఈ బ్రాహ్మణుడు మన ఇంట ఉండగోరుతున్నాడు. నేను అలాగే అని అంగీకరించాను. (13)
త్వయి వత్సే పరాశ్వస్య బ్రాహ్మణస్యాభిరాధనమ్ ।
తన్మే వాక్యమమిథ్యా త్వాం కర్తుమర్హసి కర్హిచిత్ ॥ 14
అమ్మా! నీమీది విశ్వాసంతో ఈ బ్రాహ్మణారాధనను నేను అంగీకరించాను. నా మాట వమ్ము కాకుండా ఎలాగైనా నీవే చూడాలి (14)
అయం తపస్వీ భగవాన్ స్వాధ్యాయనియతో ద్విజః ।
యద్ యద్ బ్రూయాన్మహాతేజాః తత్తద్ దేయమమత్సరాత్ ॥ 15
తపస్వి, మహాతేజస్వి, తపస్సంపన్నుడు, స్వాధ్యాయ నిరతుడు అయిన ఈ విప్రుడు ఏది అడిగితే అది శ్రద్ధగా ఇవ్వాలి. (15)
బ్రాహ్మణో హి పరం తేజః బ్రాహ్మణో హి పరం తపః ।
బ్రాహ్మణానాం నమస్కారైః సూర్యో దివి విరాజతే ॥ 16
బ్రాహ్మణుడే పరమ తేజస్సు, బ్రాహ్మణుడే పరమ తపస్సు. బ్రాహ్మణులనమస్కారాల చేతనే సూర్యుడు గగనతలంపై ప్రకాశిస్తాడు. (16)
అమానయన్ హి మానార్హాన్ వాతాపిశ్చ మహాసురః ।
నిహతో బ్రహ్మదండేన తాలజంఘస్తథైవ చ ॥ 17
పూజింపదగిన బ్రాహ్మణులను పూజించనందువలననే మహాసురుడైన వాతాపి, తాలజంఘుడు బ్రహ్మదండంతో మరణించారు. (17)
సోఽయం వత్సే మహాభార ఆహితస్త్వయి సాంప్రతమ్ ।
త్వం సదా నియతా కుర్యాః బ్రాహ్మణస్యాభిరాధనమ్ ॥ 18
అందువలన అమ్మా! నీ పయి ఇప్పుడు పెద్దబరువు ఉంచాను. నీవు ఎప్పుడూ నియమబద్ధంగా ఈ బ్రాహ్మణుని ఆరాధించాలి. (18)
జానామి ప్రణిధానం తే బాల్యాత్ ప్రభృతి నందిని ।
బ్రాహ్మణేష్విహ సర్వేషు గురుబంధుషు చైవ హ ॥ 19
తథా ప్రేష్యేషు సర్వేషు మిత్రసంబంధిమాతృషు ।
మయి చైవ యథావత్ త్వం సర్వమావృత్య వర్తసే ॥ 20
నందినీ! చిన్ననాటి నుండి నీ ఏకాగ్రత నాకు తెలుసు. సర్వబ్రాహ్మణుల యందు, గురుబంధుజనులయందు, సేవకులపై, మిత్రులపై, సంబంధుల విషయంలో, తల్లిపై, నాయందు కూడా తగిన రీతిగా ప్రవర్తించి అందరినీ ఆకట్టుకొనగలిగావు. (19,20)
న హ్యతుష్టో జనోఽస్తీహ పురే చాంతఃపురే చ తే ।
సమ్యగ్వృత్త్యానవద్యాంగి తవ భృత్యజనేష్వపి ॥ 21
అనవద్యాంగీ! ఈ నగరంలో గానీ, అంతఃపురంలో కానీ, నీ సేవకులలో కానీ నీ ప్రవర్తనతో ఆనందించని వాడు ఎవ్వడూ లేడు. (21)
సందేష్టవ్యాం తు మన్యే త్వాం ద్విజాతిం కోపనం ప్రతి ।
పృథే బాలేతి కృత్వా వై సుతా చాసి మమేతి చ ॥ 22
ఈ బ్రాహ్మణుడు కోపిష్ఠి కాబట్టి, నీవు ఇంకా చిన్నపిల్లవే కాబట్టి, నా కుమార్తెవు కాబట్టి నీకు కొన్ని విషయాలు చెప్పాలి. (22)
వృష్ణీనాం చ కులే జాతా శూరస్య దయితా సుతా ।
దత్తా ప్రీతిమతా మహ్యం పిత్రా బాలా పురా స్వయమ్ ॥ 23
నీవు వృష్ణివంశంలో పుట్టిన దానవు. శూరసేనుని ప్రియపుత్రికవు. నీ చిన్నతనంలోనే నీ తండ్రి స్వయంగా ఆనందంగా నిన్ను నా చేతిలోపెట్టాడు. (23)
వసుదేవస్య భగినీ సుతానాం ప్రవరా మమ ।
అగ్య్రమగ్రే ప్రతిజ్ఞాయ తేనాసి దుహితా మమ ॥ 24
వసుదేవుని సోదరివి. 'నా పిల్లల్లో పెద్దదానవు, 'నా తొలిబిడ్డను నీకిస్తాను' అని ముందు నాకు మాట ఇచ్చాడు కాబట్టి నీ తండ్రి నిన్ను నా దత్తపుత్రికను చేశాడు. (24)
తాదృశే హి కులే జాతా కులే చైవ వివర్ధితా ।
సుఖాత్ సుఖమనుప్రాప్తా హ్రదాద్ధ్రదమివాగతా ॥ 25
అటువంటి వంశంలో పుట్టి, ఇటువంటి వంశంలో పెరిగావు. ఒక సరస్సు నుండి మరొక సరస్సులోనికి ప్రవహించిన నీటివలె ఒక సుఖస్థానం నుండి మరొక సుఖస్థానానికి నీవు చేరావు. (25)
దౌష్కులేయా విశేషేణ కథంచిత్ ప్రగ్రహం గతాః ।
బాలభావాద్ వికుర్వంతి ప్రాయశః ప్రమదాః శుభే ॥ 26
దుర్వంశంలో పుట్టి ఏదో రీతిగా అదుపులో నున్న స్త్రీలు సాధారణంగా అవివేకంతో తప్పులు చేస్తారు. (26)
పృథే రాజకులే జన్మ రూపం చాపి తవాద్భుతమ్ ।
తేన తేనాసి సంపన్నా సముపేతా చ భావినీ ॥ 27
పృథా! నీవు రాజవంశంలో జన్మించిన దానవు. నీరూపం అద్భుతమైనది. శీలసదాచారాలతో సంపన్నురాలవు. ఆలోచనగల దానవు. (27)
సా త్వం దర్పం పరిత్యజ్య దంభం మానం చ భావిని ।
ఆరాధ్య వరదం విప్రం శ్రేయసా యోక్ష్యసే పృథే ॥ 28
భావిని! పృథా! అటువంటి నీవు దర్పాన్ని, దంభాన్ని, అభిమానాన్ని వీడి వరదుడైన విప్రుని ఆరాధించి మేలు పొందగలవు. (28)
ఏవం ప్రాప్స్యసి కల్యాణి కల్యాణమనఘే ధ్రువమ్ ।
కోపితే చ ద్విజశ్రేష్ఠే కృత్స్నం దహ్యేత మే కులమ్ ॥ 29
కళ్యాణీ! పాపరహితా! ఈ రీతిగా నీవు తప్పక శుభాలు పొందగలవు. ఈ బ్రాహ్మణోత్తముడు కోపిస్తే మన వంశమే తగులబడుతుంది. (29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కుండలాహరణపర్వణి ఫృథోపదేశే ద్వ్యధికత్రిశతతమోఽధ్యాయః ॥ 303 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున కుండలాహరణపర్వమను ఉపపర్వమున పృథోపదేశమను మూడువందల మూడవ అధ్యాయము. (303)