301. మూడు వందల ఒకటవ అధ్యాయము
కుండలముల దానము చేయవలదని సూర్యుడు ప్రబోధించుట.
సూర్య ఉవాచ
మా హితం కర్ణ కార్షీస్త్వమ్ ఆత్మనః సుహృదాం తథా ।
పుత్రాణామథ భార్యాణామ్ అథో మాతురథో పితుః ॥ 1
సూర్యుడిలా అన్నాడు.
కర్ణా! నీకు, నీమిత్రులకు, పుత్రులకు, భార్యలకు, తల్లికి, తండ్రికీ కీడు చేయవద్దు. (1)
శరీరస్యావిరోధేన ప్రాణినాం ప్రాణాభృద్వర ।
ఇష్యతే యశసః ప్రాప్తిః కీరిశ్చ త్రిదివే స్థిరా ॥ 2
నరోత్తమా! ప్రాణులు శరీరాన్ని సంరక్షించుకొంటూనే ఇహలోకంలో యశస్సును, సర్గలోకంలో స్థిరకీర్తిని కోరుకోవాలి. (2)
యస్త్వం ప్రాణవిరోధేన కీర్తిమిచ్ఛసి శాశ్వతీమ్ ।
సా తే ప్రాణాన్ సమాదాయ గమిష్యతి న సంశయః ॥ 3
అయితే నీవు ప్రాణాలను పోగొట్టుకొంటూ శాశ్వతకీర్తిని పొందగోరుతున్నావు. ఆ కీర్తి నీ ప్రాణాలను తీసికోనిపోతుంది. సందేహమే లేదు. (3)
జీవితాం కురుతే కార్యం పితా మాతా సుతాస్తథా ।
యే చాన్యే బాంధవాః కేచిత్ లోకేఽస్మిన్ పురుషర్షభ ॥ 4
పురుషోత్తమా! తల్లి, తండ్రి, బిడ్డలు, ఇతర బంధువులు బ్రతికియున్న వారిద్వారానే ఏదైనా ప్రయోజనాన్ని పొందగలుగుతారు. (4)
రాజానశ్చ నరవ్యాఘ్ర పౌరుషేణ నిబోధ తత్ ।
కీర్తిశ్చ జీవతః సాధ్వీ పురుషస్య మహాద్యుతే ॥ 5
నరశ్రేష్ఠా! రాజులయినా జీవించియుంటేనే పౌరుషంతో కీర్తిని పొందగలిగేది. ఇది గ్రహించు. తేజస్వీ! బ్రతికియున్నవానికే కీర్తి ఉపయోగపడుతుంది. (5)
మృతస్య కీర్త్యా కిం కార్యం భస్మీభూతస్య దేహినః ।
మృతః కీర్తిం న జానీతే జీవన్ కీర్తిం సమశ్నుతే ॥ 6
మరణించి దేహం బూడిద అయిన తరువాత కీర్తి ఎందుకు? చనిపోయిన వానికి కీర్తి తెలియదు. బ్రతికియుంటేనే కీర్తిని అనుభవించగలిగేది. (6)
మృతస్య కీర్తిర్మర్త్యస్య యథా మాలా గతాయుషః ।
అహం తు త్వాం బ్రవీమ్యేతద్ భక్తోఽసీతి హితేప్సయా ॥ 7
మరణించిన మనుష్యునకు కీర్తి శవానికి పూలమాలవంటిది. నీవు నా భక్తుడవని నీ హితాన్ని కోరుతూ నేనిది చెప్తున్నాను. (7)
భక్తిమంతో హి మే రక్ష్యాః ఇత్యేతేనాపి హేతునా ।
భక్తోఽయం పరయా భక్త్యా మామిత్యేవ మహాభుజ ।
మమాపి భక్తిరుత్పన్నా స త్వం కురు వచో మమ ॥ 8
నేను నా భక్తులను రక్షించాలన్న కారణంతో ఇది చెప్తున్నాను. మహాభుజా! ఇతడు నా భక్తుడు. పరమభక్తితో నన్ను సేవిస్తున్నావన్న భావంతో నాలో నీపై ప్రేమ కలిగింది. కాబట్టి నా మాటను పాటించు. (8)
అస్తి చాత్ర పరం కించిద్ అధ్యాత్మం దేవనిర్మితమ్ ।
అతశ్చ త్వాం బ్రవీమ్యేతత్ క్రియతామవిశంకయా ॥ 9
ఇక్కడ దేవవిహితమైన ఆధ్యాత్మిక రహస్యం కూడా ఒకటుంది. అందువలననే నీకు చెప్తున్నాను. సందేహించక చెప్పినట్టు చేయి. (9)
దేవగుహ్యం త్వయా జ్ఞాతుం న శక్యం పురుషర్షభ ।
తస్మాన్నాఖ్యామి తే గుహ్యం కాలే వేత్స్యతి తద్ భవాన్ ॥ 10
పురుషశ్రేష్ఠా ఇది దేవరహస్యం . నీవు తెలియలేవు. కాబట్టి ఆ రహస్యాన్ని చెప్పటం లేదు. తగిన సమయంలో నీవే గ్రహిస్తావు. (10)
పునరుక్తం చ వక్ష్యామి త్వం రాధేయ నిబోధ తత్ ।
మాస్మై తే కుండలే దద్యాః భిక్షితే వజ్రపాణినా ॥ 11
రాధేయా! పునరుక్తమయినా మరల చెప్తున్నా. గ్రహించు. దేవేంద్రుడు అడిగితే నీవు కుండలాలను ఇవ్వకూడదు. (11)
శోభసే కుండలాభ్యాం చ రుచిరాభ్యాం మహాద్యుతే ।
విశాఖయోర్మధ్యగతః శశీవ విమలే దివి ॥ 12
మహాతేజస్వీ! నిర్మలాకాశంలో విశాఖా నక్షత్రాల రెండింటి మధ్య చంద్రుని వలె నీవు అందమైన కుండలాలతో ప్రకాశిస్తున్నావు. (12)
కీర్తిశ్చ జీవతః సాధ్వీ పురుషస్యేతి విద్ధి తత్ ।
ప్రత్యాఖ్యేయస్త్వయా తాత కుండలార్థే సురేశ్వరః ॥ 13
బ్రతికియున్నవానికే కీర్తి గొప్పగా ఉంటుంది. అని తెలిసికో. నాయనా! కుండలాలను యాచించే దేవేంద్రుని నిరాకరించి పంపాలి. (13)
శక్యా బహువిధైర్వాక్యైః కుండలేప్సా త్వయానఘ ।
విహంతుం దేవరాజస్య హేతుయుక్తైః పునః పునః ॥ 14
అనఘా! దేవేంద్రుడు కుండలాలకై చేసే అభ్యర్థనను నీవు హేతుసహితంగా వివిధవాక్యాలతో ఎప్పటికప్పుడు త్రోసివేయాలి. (14)
హేతుమదుపపన్నార్థైః మాధుర్యకృతభూషణైః ।
పురందరస్య కర్ణ త్వం బుద్ధిమేతామపానుద ॥ 15
కర్ణా! హేతుయుతంగా, మధురంగా మాటాడుతూ దేవేంద్రుని కుండలాభ్యర్థన బుద్ధిని నీవు నెట్టివేయాలి. (15)
త్వం హి నిత్యం నరవ్యాఘ్ర స్పర్ధసే సవ్యసాచినా ।
సవ్యసాచీ త్వయా చేహ యుధి శూరః సమేష్యతి ॥ 16
నరశ్రేష్ఠా! నీవు నిత్యమూ సవ్యసాచితో పోటీపడుతుంటావు. కాబట్టి యుద్ధంలో శూరుడైన అర్జునుడు ఎప్పుడైనా తలపడవచ్చు. (16)
న తు త్వామర్జునః శక్తః కుండలాభ్యాం సమన్వితమ్ ।
విజేతుం యుధి యద్యస్య స్వ్యమింద్రః సఖా భవేత్ ॥ 17
అయితే దేవేంద్రుడే సహాయంగా వచ్చినా నీవు కుండలాలు ధరించి యున్నంతకాలం అర్జునుడు యుద్ధంలో నిన్ను జయించలేడు. (17)
తస్మాన్న దేయం శక్రాయ త్వయైతే కుండలే శుభే ।
సంగ్రామే యది నిర్జేతుం కర్ణ కామయసేఽర్జునమ్ ॥18
కాబట్టి కర్ణా! యుద్ధంలో అర్జునుని ఓడించాలని నీవనుకొంటే శుభప్రదాలయిన ఈ కుండలాలను నీవు ఇంద్రునకు ఇవ్వకూడదు. (18)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కుండలాహరణపర్వణి సూర్యకర్ణసంవాదే ఏకాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 301 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున కుండలాహరాణపర్వమను ఉపపర్వమున సూర్యకర్ణసంవాదమను మూడువందల యొకటవ అధ్యాయము. (301)