294. రెండువందల తొంబది నాలుగవ అధ్యాయము

సత్యవంతుని వివాహమాడవలెనని సావిత్రి నిశ్చయించుట.

మార్కండేయ ఉవాచ
అథ మద్రాధిపో రాజా నారదేవ సమాగతః ।
ఉపవిష్టః సభామధ్యే కథాయోగేన భారత ॥ 1
మార్కండేయుడిలా అన్నాడు.
భారతా! ధర్మరాజా! ఒకసారి మద్రరాజైన అశ్వపతి సభాసీనుడై ఉండగా నారదుడు వచ్చాడు. వారు సంభాషిస్తున్న సమయంలో... (1)
తతోఽభిగమ్య తీర్థాని సర్వాణ్యేవాశ్రమాంస్తథా ।
అజగామ పితుర్వేశ్మ సావిత్రీ సహ మంత్రిభిః ॥ 2
సావిత్రి సర్వతీర్థాలను, సకలాశ్రమాలను తిరిగి మంత్రులతో కలిసి ఇంటికి వచ్చింది. (2)
నారదేన సహాసీనం సా దృష్ట్వా పితరం శుభా ।
ఉభయోరేవ శిరసా చక్రే పాదాభివాదనమ్ ॥ 3
నారదునితో కలిసి ఉపవిష్టుడై ఉన్న తండ్రిని చూసి ఆ శుభాంగి ఇరువురి పాదాలకు శిరసువంచి, నమస్కరించింది. (3)
నారద ఉవాచ
క్వ గతాభూత్ సుతేయం తే కుతశ్చైవాగతా నృప ।
కిమర్థం యువతీం భర్త్రే న చైనాం సంప్రయచ్ఛసి ॥ 4
నారదుడిలా అన్నాడు.
రాజా! నీ కుమార్తె ఎక్కడకు వెళ్ళింది? ఎక్కడ నుండి వస్తోంది. యుక్తవయస్సులో ఉన్న ఈమెకు పెండ్లి ఎందుకు జరిపించటం లేదు? (4)
అశ్వపతిరువాచ
కార్యేణ ఖల్వనేనైవ ప్రేషితాద్యైవ చాగతా ।
ఏతస్యాః శృణు దేవర్షే భర్తారం యోఽనయా వృతః ॥ 5
అశ్వపతి ఇలా అన్నాడు.
దేవర్షీ! ఆ పనిమీదనే వెళ్ళి ఈరోజే వచ్చింది. ఆమె వరించిన భర్తను గురించి వినండి. (5)
మార్కండేయ ఉవాచ
సా బ్రూహి విస్తరేణేతి పిత్రా సంచోదితా శుభా ।
తధైవ తస్య వచనం ప్రతిగృహ్యేదమబ్రవీత్ ॥ 6
మార్కండేయుడిలా అన్నాడు. 'వివరంగా చెప్పమ్మా' అని అశ్వపతి ఆదేశించగా ఆ శుభాంగి అప్పుడే ఆయనమాటను శిరసావహించి ఇలా అన్నది. (6)
సావిత్య్రువాచ
ఆసీచ్ఛాల్వేషు ధర్మాత్మా క్షత్రియః పృథివీపతిః ।
ద్యుమత్సేన ఇతి ఖ్యాతః పశ్చాచ్చాంధో బభూవ హ ॥ 7
సావిత్రి ఇలా అన్నది.
శాల్వదేశంలో ద్యుమత్సేనుడనే ధర్మాత్ముడు, క్షత్రియుడు రాజ్యం చేస్తూండేవాడు. తర్వాత ఆయన అంధుడయ్యాడు. (7)
వినష్టచక్షుషస్తస్య బాలపుత్రస్య ధీమతః ।
సామీప్యేన హృతం రాజ్యం ఛిద్రేఽస్మిన్ పూర్వవైరిణా ॥ 8
ఆయన ధీమంతుడనే కానీ గ్రుడ్డివాడు. కొడుకు బాలుడు. ఈ విపత్సమయంలో గతవైరాన్ని మనస్సులో నుంచుకొని పొరుగురాజు ఆయన రాజ్యాన్ని అపహరించాడు. (8)
స బాలవత్సయా సార్థం భార్యయా ప్రస్థితో వనమ్ ।
మహారణ్యం గతశ్చాపి తపస్తేపే మహావ్రతః ॥ 9
తస్య పుత్రః పురే జాతః సంవృద్ధశ్చ తపోవనే ।
సత్యవాననురూపో మే భర్తేతి మనసా వృతః ॥ 10
ఆ ద్యుమత్సేనుడు చిన్నబిడ్డతో, భార్యతో కలిసి వనవాసానికి వెళ్ళిపోయాడు. తీవ్రవ్రతుడైన ఆయన అరణ్యానికి వెళ్ళి కూడా తపస్సు చేశాడు. ఆయన కొడుకు నగరంలో పుట్టి, తపోవనంలో పెరిగాడు. పేరు సత్యవంతుడు. ఆయన నాకు తగిన భర్త అని మనసా వరించాను. (9,10)
నారద ఉవాచ
అహో బత మహత్ పాపం సావిత్య్రా నృపతే కృతమ్ ।
అజానంత్యా యదనయా గుణవాన్ సత్యవాన్ వృతః ॥ 11
నారదుడిలా అన్నాడు.
అయ్యో! పాపం. రాజా! సావిత్రి ఎంత పని చేసింది. విషయం తెలియక గుణవంతుడని సత్యవంతుని వరించింది. (11)
సత్యం వదత్యస్య పితా సత్యం మాతా ప్రభాషతే ।
తథాస్య బ్రాహ్మణాశ్చక్రుః నా మైతత్ సత్యవానితి ॥ 12
అతని తండ్రి సత్యమే పలుకుతాడు. తల్లి సత్యమే మాటాడుతుంది. ఆ రీతిగా బ్రాహ్మణులు అతనికి సత్యవంతుడని పేరు పెట్టారు (12)
బాలస్యాశ్వాః ప్రియాశ్చాస్య కరోత్యశ్వాంశ్చ మృన్మయాన్ ।
చిత్రేఽపి విలిఖత్యశ్వాన్ చిత్రాశ్వ ఇతి చోచ్యతే ॥ 13
ఆ బాలునకు గుర్రాలంటే ఇష్టం. మట్టితో గుర్రాలబొమ్మలు చేస్తుంటాడు గుర్రాల బొమ్మలు వేస్తుంటాడు. అందుకే అతనిని చిత్రాశ్వుడని కూడా అంటారు. (13)
రాజోవాచ
అపీదానీం స తేజస్వీ బుద్ధిమాన్ వా నృపాత్మజః ।
క్షమావానపి వా శూరః సత్యవాన్ పితృవత్సలః ॥ 14
రాజు ఇలా అన్నాడు.
అయితే రాజుకొడుకు తేజస్వి, బుద్ధిమంతుడు, సహనశీలుడు, శూరుడు, సత్యవంతుడు, పితృవత్సలుడు కాదా? (14)
నారద ఉవాచ
వివస్వానివ తేజస్వీ బృహస్పతిసమో మతౌ ।
మహేంద్ర ఇవ వీరశ్చ వసుధేవ సమన్వితః ॥ 15
నారదుడిలా అన్నాడు.
సూర్యునివలె తేజస్వి, బుద్ధిలో బృహస్పతి. మహేంద్రుని వంటి వీరుడు. భూమివలె సహనశీలి. (15)
అశ్వపతిరువాచ
అపి రాజాత్మజో దాతా బ్రహ్మణ్యశ్చాపి సత్యవాన్ ।
రూపవానప్యుదారో వాప్యథవా ప్రియదర్శనః ॥ 16
అశ్వపతి ఇలా అన్నాడు.
రాజుకొడుకైన ఆ సత్యవంతుడు దాతయేనా? బ్రహ్మణభక్తి గలవాడేనా? రూపవంతుడేనా? ఉదారుడేనా? అందగాడేనా? (16)
నారద ఉవాచ
సాంకృతే రంతిదేవస్య స్వశక్త్యా దానతః సమః ।
బ్రహ్మణ్యః సత్యవాదీ చ శిబిరౌశీనరో యథా ॥ 17
నారదుడిలా అన్నాడు.
శక్తిననుసరించి దానం చేయటంలో సంకృతి కొడుకైన రంతిదేవుడితో సమానం. ఉశీనరసుతుడైన శిబివలె బ్రాహ్మణ భక్తుడు, సత్యవాది కూడా. (17)
యయాతిరివ చోదారః సోమవత్ ప్రియదర్శనః ।
రూపేణాన్యతమోఽశ్విభ్యాం ద్యుమత్సేనసుతో బలీ ॥ 18
యయాతివలె ఉదారుడు, చంద్రునివలె చూడముచ్చటైనవాడు. బలవంతుడైన ఆ సత్యవంతుడు రూపంలో మరొక అశ్వినీ దేవత. (18)
స దాంతః స మృదుః శూరః స సత్యః సంయేతేంద్రియః ।
స మైత్ర సోఽనసూయశ్చ స హ్రీమాన్ ద్యుతిమాంశ్చ సః ॥ 19
అతడు జితేంద్రియుడు. మృదుస్వభావి. శూరుడు. సత్యస్వరూపుడు. నియతేంద్రియుడు. స్నేహశీలి. అసూయలేనివాడు. బిడియపడేవాడు. తేజస్వి. (19)
నిత్యశశ్చార్జవం తస్మిన్ స్థితిస్తస్యైవ చ ధ్రువా ।
సంక్షేపతస్తపోవృద్ధైః శీలవృద్ధైశ్చ కథ్యతే ॥ 20
శీలవృద్ధులు, తపోవృద్ధులు సత్యవంతుని గురించి సంక్షిప్తంగా ఇలా చెపుతారు. సత్యవంతుడు ఎప్పుడూ ఋజువర్తనుడు. ఆ గుణంలో నిశ్చలంగా నిలిచేవాడు. (20)
అశ్వపతిరువాచ
గుణైరుపేతం సర్వైస్తం భగవన్ ప్రబ్రవీషి మే ।
దోషానప్యస్య మే బ్రూహి యది సంతీహ కేచన ॥ 21
అశ్వపతి ఇలా అన్నాడు.
స్వామీ! సత్యవంతుని గుణాలనన్నింటినీ చెప్తున్నారు. దోషాలు కూడా ఏమైనా ఉంటే చెప్పండి. (21)
ఏక ఏవాస్య దోషో హి గుణానాక్రమ్య తిష్ఠతి ।
స చ దోషః ప్రయత్నేన న శక్యమతివర్తితుమ్ ॥ 22
అతనిలో ఒకే దోషముంది. గుణాలనన్నిటినీ కొట్టివేయగలది. ప్రయత్నించినా కూడా ఆ దోషాన్ని తొలగించలేము. (22)
ఏకో దోషోఽస్తి నాన్యోఽస్య సోఽద్యప్రభృతి సత్యవాన్ ।
సంవత్సరేణ క్షీణాయుః దేహన్యాసం కరిష్యతి ॥ 23
అతనిలో ఒకటే దోషం. మరేమీ లేదు. నేటినుండి సంవత్సరం లోపు ఆయువు తీరి అతడు మరణిస్తాడు. (23)
రాజోవాచ
ఏహి సావిత్రి గచ్ఛస్వ అన్యం వరయ శోభనే ।
తస్య దోషో మహానేకః గుణానాక్రమ్య చ స్థితః ॥ 24
రాజు ఇలా అన్నాడు.
కళ్యాణీ! సావిత్రి! రా! వెళ్ళి మరొక వరుణ్ణి వెతుక్కో. అతనిలోని ఆ ఒక్క దోషం పెద్దది. గుణాలనన్నిటినీ మించిపోతోంది. (24)
యథా మే భగవానహ నారదో దేవసత్కృతః ।
సంవత్సరేణ సోఽల్పాయుః దేహన్యాసం కరిష్యతి ॥ 25
దేవ సత్కృతుడు, పూజ్యుడూ అయిన నారదుడు 'ఆ సత్యవంతుడు సంవత్సరంలో మరణిస్తా'డని చెప్తున్నాడు కదా! (25)
సావిత్య్రువాచ
సకృదంశో నిపతతి సకృత్ కన్యా ప్రదీయతే ।
సకృదాహ దదానీతి త్రీణ్యేతాని సకృత్ సకృత్ ॥ 26
దీర్ఘాయురథవాల్పాయుః సగుణో నిర్గుణోఽపి వా ।
సకృద్ వృతో మయా భర్తా న ద్వితీయం వృణోమ్యహమ్ ॥ 27
సావిత్రి ఇలా అన్నది.
ఒక్కసారే పంచుకొంటారు. ఒక్కసారే కన్యాదానం చేస్తారు. 'దానం చేస్తాను' అని దాత ఒక్కసారి చెపితే చాలు. ఈ మూడూ ఒక్కొక్కసారే జరగాలి. సత్యవంతుడు దీర్ఘాయు వయినా, అల్పాయు వయినా, గునవంతు డయినా, గుణహీనుడైనా నేను భర్తగా వరించాను. ఒకసారి వరించిన తర్వాత మరొకరిని నేను వరించను. (26,27)
మనసా నిశ్చయం కృత్వా తతో వాచాభిధీయతే ।
క్రియతే కర్మణా పశ్చాత్ ప్రమాణం మే మనస్తతః ॥ 28
మనస్సులో నిశ్చయించుకొని మాట చెప్పి తర్వాత క్రియారూపంలో పెడతాము. నాకు నా మనస్సే ప్రమాణం. (28)
నారద ఉవాచ
స్థిరా బుద్ధిర్నరశ్రేష్ఠ సావిత్య్రా దుహితుస్తవ ।
నైషా వారయితుం శక్యా ధర్మాదస్మాత్ కథంచన ॥ 29
నారదుడిలా అన్నాడు.
నరోత్తమా! నీ కుమార్తె సావిత్రి నిశ్చలబుద్ధి గలది. ఈ ధర్మమార్గం నుండి ఈమెను ఏరీతిగానూ వారించలేము. (29)
నాన్యస్మిన్ పురుషే సంతి యే సత్యవతి వై గుణాః ।
ప్రదానమేవ తస్మాన్మే రోచతే దుహితుస్తవ ॥ 30
సత్యవంతునిలో ఉన్న గుణాలు మరే పురుషునిలోనూ లేవు. కాబట్టి నీ కుమార్తె నతనికివ్వటమే నాకు మంచిదనిపిస్తోంది. (30)
రాజోవాచ
అవిచాల్యం తదుక్తం యత్ తథ్యం భగవతా వచః ।
కరిష్యామ్యేత దేవం చ గురుర్హి భగవాన్ మమ ॥ 31
రాజు ఇలా అన్నాడు.
స్వామీ! మీ మాట యథార్థం. జవదాటరానిది. ఆ విధంగానే చేస్తాను. నాకు మీరే గురువు కదా! (31)
నారద ఉవాచ
అవిఘ్నమస్తు సావిత్య్రాః ప్రదానే దుహితుస్తవ ।
సాధయిష్యామ్యహం తావత్ సర్వేషాం భద్రమస్తు వః ॥ 32
నారదుడిలా అన్నాడు.
నీ కుమార్తెను సత్యవంతునికిచ్చి వివాహం చేయటం నిర్విఘ్నంగా జరుగును గాక. నేను వెళ్ళివస్తాను. మీకందరికీ మేలు జరుగుతుంది. (32)
మార్కండేయ ఉవాచ
ఏవముక్త్వా సముత్పత్య నారదస్త్రిదివం గతః ।
రాజాపి దుహితుః సజ్జం వైవాహికమకారయత్ ॥ 33
మార్కండేయుడిలా అన్నాడు.
ఆ రీతిగా పలికి, లేచి, నారదుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. రాజు కూడా కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేయసాగాడు. (33)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి పతివ్రతామాహాత్మ్యపర్వణి సావిత్య్రుపాఖ్యానే చతుర్నవత్యధికశద్వితతమోఽధ్యాయః ॥ 294 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున పతివ్రతామాహాత్మ్యపర్వమను ఉపపర్వమున సావిత్య్రుపాఖ్యానమను రెండువందల తొంబది నాల్గవ అధ్యాయము. (294)