291. రెండు వందల తొంబది ఒకటవ అధ్యాయము
శ్రీరామ పట్టాభిషేకము.
మార్కండేయ ఉవాచ
స హత్వా రావణం క్షుద్రం రాక్షసేంద్రం సురద్విషమ్ ।
బభూవ హృష్టః ససుహృద్ రామః సౌమిత్రిణా సహ ॥ 1
మార్కండేయుడు చెపుతున్నాడు - క్షుద్రుడు, సురద్వేషి రాక్షసేంద్రుడు అయిన రావణుని చంపి రాముడు స్నేహితులతో, లక్ష్మణునితో కలిసి మిక్కిలి ఆనందించాడు. (1)
తతో హతే దశగ్రీవే దేవాః సర్షిపురోగమాః ।
ఆశీర్భిర్జయయుక్తాభిః ఆనర్చుస్తం మహాభుజమ్ ॥ 2
దశగ్రీవుడు చనిపోగానే మహర్షి గణాలు ముందునడువగా దేవతలు ఆ మహాభుజుని జయవాచకములతో కూడిన ఆశీస్సులతో ప్రస్తుతించసాగారు. (2)
రామం కమలపత్రాక్షం తుష్టువుః సర్వదేవతాః ।
గంధర్వాః పుష్పవర్షాశ్చ వాగ్భిశ్చ త్రిదశాలయాః ॥ 3
స్వర్గంలో నివసించే సర్వదేవతలూ, గంధర్వులూ పుష్పవర్షం కురిపిస్తూ చక్కని వాక్కులతో కమలనయనుడైన ఆ శ్రీరాముని స్తోత్రం చేశారు. (3)
పూజయిత్వా యథా రామం ప్రతిజగ్ముర్యథాగతమ్ ।
తన్మహోత్సవసంకాశమ్ ఆసీదాకాశమచ్యుత ॥ 4
వారందరూ రాముని పూజించి వచ్చినవారు వచ్చినట్లే మరలిపోయారు. అచ్యుతా! ఆకాశమంతా ఆ మహోత్సవసంరంభంలో నిండిపోయినట్లుంది. (4)
తతో హత్వా దశగ్రీవం లంకాం రామో మహాయశాః ।
విభీషణాయ ప్రదదౌ ప్రభుః పరపురంజయః ॥ 5
శత్రుపురములను జయింపగలిగిన ప్రభువు మహాయశస్వి అయిన శ్రీరాముడు దశగ్రీవుని సంహరించి లంకను విభీషణునకు సమర్పించాడు. (5)
తతః సీతాం పురస్కృత్య విభీషణపురస్కృతామ్ ।
ఆవింధ్యో నామ సుప్రజ్ఞః వృద్ధామాత్యో వినిర్యయౌ ॥ 6
మిక్కిలి బుద్ధిమంతుడయిన వృద్ధామాత్యుడు అవింధ్యుడు సీతను ముందుంచుకొని విభీషణుడు ముందునడువగా లంకనుండి వెలుపలికి వచ్చాడు. (6)
ఉవాచ చ మహాత్మానం కాకుత్ స్థం దైన్యమాస్థితః ।
ప్రతీచ్ఛ దేవీం సద్ వృత్తాం మహాత్మన్ జానకీమితి ॥ 7
కకుత్థ్స వంశతిలకుడు, మహాత్ముడు అయిన రామునితో వారు దీనత్వం ఉట్టిపడేలా - "మహాత్మా! సదాచారవతి జనకసుత అయిన దేవిని పరిగ్రహించండి" అన్నారు. (7)
ఏతచ్ఛ్రుత్వా వచస్తస్మాద్ అవతీర్య రథోత్తమాత్ ।
బాష్పేణాపిహితాం సీతాం దదర్శేక్ష్వాకునందనః ॥ 8
ఆ మాటలు విని ఇక్ష్వాకునందనుడయిన రాముడు ఆ దివ్యరథాన్నుండి దిగి కన్నీరు కారుస్తున్న సీతను చూశాడు. (8)
తాం దృష్ట్వా చారుసర్వాంగీం యానస్థాం శోకకర్శితామ్ ।
మలోపచితసర్వాంగీం జటిలాం కృష్ణవాససమ్ ॥ 9
సీతాదేవి దుఃఖంతో కృశించిపోయి ఉంది. ఒడలంతా ధూళి ధూసరితమై ఉంది. జుట్టు జడలు కట్టి ఉంది. మాసిన వస్త్రాలు ధరించి ఉంది. పల్లకీలో ఉన్న సర్వాంగసుందరి అయిన అటువంటి సీతను చూచి (పైశ్లోకంతో అన్వయం). (9)
ఉవాచ రామో వైదేహీం పరామర్శవిశంకితః ।
గచ్ఛ వైదేహి ముక్తా త్వం యత్ కార్యం తన్మయా కృతమ్ ॥ 10
పరపురుషస్పర్శ కలిగి ఉండవచ్చునని శంకించిన రాముడు ఆ విదేహకుమారితో - "వైదేహీ! నీకు విముక్తి కలిగింది. వెళ్ళు. నా కర్తవ్యం నేను నిర్వహించాను. (10)
మామాసాద్య పతిం భద్రే న త్వం రాక్షసవేశ్మని ।
జరాం వ్రజేథా ఇతి నిహతోఽసౌ నిశాచరః ॥ 11
సుభగురాలా! నావంటి భర్తను పొందిన నీవు ముసలితనం వచ్చేవరకు రాక్షసగృహంలో ఉండకూడదని నేను ఈ రాక్షసుని వధించాను. (11)
కథం హ్యస్మద్విధో జాతు జానన్ ధర్మవినిశ్చయమ్ ।
పరహస్తగతాం నారీం ముహూర్తమపి ధారయేత్ ॥ 12
నిశ్చితమైన ధర్మాన్ని ఎరిగిన నావంటివాడు పరహస్తగతమైన స్త్రీని క్షణకాలం పాటైనా ఎలా స్వీకరించగలుగుతాడు? (12)
సువృత్తామసువృత్తాం వాప్యహం త్వామద్య మైథిలి ।
నోత్సహే పరిభోగాయ శ్వావలీఢం హవిర్యథా ॥ 13
మైథిలీ! నీవు సదాచారిణివి అయినా, దురాచారిణివి అయినా గాని నేను ఇప్పుడు కుక్క నాకిన హవిస్సులాంటి నిన్ను అనుభవించడానికి ఇష్టపడను" అన్నాడు. (13)
తతః సా సహసా బాలా తచ్ఛ్రుత్వా దారుణం వచః ।
పపాత దేవీ వ్యథితా నికృత్తా కదలీ యథా ॥ 14
అప్పుడు దారుణమైన ఆ మాటలను విని సీతాదేవి వ్యధతో వెంటనే నరకబడిన అరటిచెట్టులా కూలిపోయింది. (14)
యోఽప్యస్యా హర్షసంభూతః ముఖరాగస్తదాభవత్ ।
క్షణేన స పునర్నష్టః నిఃశ్వాస ఇవ దర్పణే ॥ 15
నిశ్వాసం వలన అద్దంలోని ప్రతిబింబం మలినమైనట్లుగా హర్షం వలన కలిగిన ఆమె ముఖంలోని కాంతి క్షణకాలంలోనే తిరిగి నశించిపోయింది. (15)
తతస్తే హరయః సర్వే తచ్ఛ్రుత్వా రామభాషితమ్ ।
గతా సుకల్పా నిశ్చేష్టాః బభూవుః సహలక్ష్మణాః ॥ 16
రాముని యొక్క ఆ మాటలను విన్న వానరులందరూ కూడా లక్ష్మణునితో సహితంగా ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిలా నిశ్చేష్టులు అయిపోయారు. (16)
తతో దేవో విశుద్ధాత్మా విమానేన చతుర్ముఖః ।
పద్మయోనిర్జగత్స్రష్టా దర్శయామాస రాఘవమ్ ॥ 17
అప్పుడు విశుద్ధమైన అంతఃకరణం కల పద్మగర్భుడు, సృష్టికర్త అయిన చతుర్ముఖబ్రహ్మ దేవుడు విమానంపై వచ్చి రాఘవునికి దర్శనమిచ్చాడు. (17)
శక్రశ్చాగ్నిశ్చ వాయుశ్చ యమో వరుణ ఏవ చ ।
యక్షాధిపశ్చ భగవాన్ తథా సప్తర్షయోఽమలాః ॥ 18
ఇంద్రుడు, అగ్ని, వాయుదేవుడు, యముడు, వరుణుడు, యక్షులకు అధిపుడయిన కుబేరుడు, నిర్మలచిత్తులైన సప్తర్షులు కూడా (అక్కడికి వచ్చారు.) (18)
రాజా దశరథశ్చైవ దివ్యభాస్వరమూర్తిమాన్ ।
విమానేన మహార్హేణ హంసయుక్తేన భాస్వతా ॥ 19
హంసలతో కూడి ప్రకాశించే బహుమూల్యమైన రథాన్ని ఎక్కి దివ్యతేజోమూర్తి అయిన దశరథ మహారాజు కూడా అక్కడికి విచ్చేశాడు. (19)
తతోఽంతరిక్షం తత్ సర్వం దేవగంధర్వసంకులమ్ ।
శుశుభే తారకాచిత్రం శరదీవ నభస్తలమ్ ॥ 20
దేవగంధర్వులతో నిండిపోయిన అంతరిక్షం అంతా నక్షత్రగణాలతో చిత్రితమైన శరత్కాలపు ఆకాశంలా భాసించింది. (20)
తత ఉత్థాయ వైదేహీ తేషాం మధ్యే యశస్వినీ ।
ఉవాచ వాక్యం కల్యాణీ రామం పృథులవక్షసమ్ ॥ 21
వారందరిమధ్య నిల్చుని శుభకరి, యశస్విని అయిన సీత అప్పుడు విశాలవక్షుడయిన రామునితో ఇలా అంది. (21)
రాజపుత్ర న తే దోషం కరోమి విదితా హి తే ।
గతిః స్త్రీణాం నరాణాం చ శృణు చేదం వచో మమ ॥ 22
"రాజకుమారా! నేను నిన్ను తప్పు పట్టడం లేదు. స్త్రీల యొక్క, పురుషుల యొక్క నడత ఎలాంటిదో నీకు తెలుసు. అయినా నేను చెప్పే ఈ మాటలు విను. (22)
అంతశ్చరతి భూతానాం మాతరిశ్వా సదాగతిః ।
స మే విముంచతు ప్రాణాన్ యది పాపం చరామ్యహమ్ ॥ 23
నిరంతరగమన శీలుడైన వాయుదేవుడు ప్రాణులందరిలోను తిరుగుతూ ఉంటాడు. నేను పాపం చేసినట్లయితే అతడు నా ప్రాణాలను విడిచిపెట్టు గాక! (23)
అగ్నిరాపస్తథాఽకాశం పృథివీ వాయు రేవ చ ।
విముంచంతు మమ ప్రాణాన్ యది పాపం చరామ్యహమ్ ॥ 24
నేను పాపమే చేసినట్లయితే అగ్ని, జలము, ఆకాశము, పృథివి, వాయువు (పంచభూతములు) నా ప్రాణములను వదిలివేయునుగాక! (24)
యథాహం త్వదృతే వీర నాన్యం స్వప్నేఽప్యచింతయమ్ ।
తథా మే దేవనిర్దిష్టః త్వమేవ హి పతిర్భవ ॥ 25
వీరుడా! ఎలాగైతే నేను నిన్ను తప్ప అన్యపురుషుని కలలో కూడా చింతించనో అలాగే దేవతలు నిర్దేశించిన నీవే నాకు పతివి కావాలి". (25)
తతోఽంతరిక్షే వాగాసీత్ సుభగా లోకసాక్షిణీ ।
పుణ్యా సంహర్షణీ తేషాం వానరాణాం మహాత్మనామ్ ॥ 26
అప్పుడు సమస్తలోకాలకు సాక్షి భూతమూ, వానరులందరికీ హర్షం కలిగించేది, పవిత్రమైన ఒక వాణి అంతరిక్షం నుండి వినబడింది. (26)
వాయురువాచ
భో భో రాఘవ సత్యం వై వాయురస్మి సదాగతిః ।
అపాపా మైథిలీ రాజన్ సంగచ్ఛ సహ భార్యయా ॥ 27
వాయుదేవుడు అంటున్నాడు - "రఘునందనా! నేను సదాగతి అయిన వాయువును. సీత చెప్పినది సత్యం. రాజా! మైథిలి పాపం లేనిది. నీవు నీ భార్యను కలుసుకో". (27)
అగ్నిరువాచ
అహమంతః శరీరస్థః భూతానాం రఘునందన ।
సుసూక్ష్మమపి కాకుత్ స్థ మైథిలీ నాపరాధ్యతి ॥ 28
అగ్నిదేవుడు చెపుతున్నాడు - "రఘునందనా! నేను ప్రాణులందరి శరీరాల లోపల ఉండే అగ్నిని. కకుత్థ్స వంశతిలకా! ఈ మైథిలి అణుమాత్రమైనా అపరాధం చేయలేదు". (28)
వరుణ ఉవాచ
రసా వై మత్ప్రసూతా హి భూతదేహేషు రాఘవ ।
అహం వై త్వాం ప్రబ్రవీమి మైథిలీ ప్రతిగృహ్యతామ్ ॥ 29
వరుణదేవుడు చెపుతున్నాడు - "రాఘవా! ప్రాణుల దేహాలలో ఉండే రసాలన్నీ నా నుండి పుడుతున్నవే. నేను నీకు గట్టిగా చెపుతున్నాను - ఈ మైథిలిని స్వీకరించు. (29)
బ్రహ్మోవాచ
పుత్ర నైతదిహాశ్చర్యం త్వయి రాజర్షిధర్మణి ।
సాధో సద్ వృత్త కాకుత్ స్థ శృణు చేదం వచో మమ ॥ 30
అనంతరం బ్రహ్మదేవుడు పలుకసాగాడు - "వత్సా! రాజర్షి ధర్మాలను ఆచరించే నీ పట్ల ఇది ఆశ్చర్యకరమైన విషయం కాదు. సాధుపురుషా! సదాచారీ! కకుత్థ్సా! నా మాట విను. (30)
శత్రురేష త్వయా వీర దేవగంధర్వభోగినామ్ ।
యక్షాణాం దానవానాం చ మహర్షీణాం చ పాతితః ॥ 31
వీరుడా! దేవగంధర్వ పన్నగయక్ష దానవులకు, మహర్షులకు కూడా శత్రువైన ఇతనిని నీవు సంహరించావు. (31)
అవధ్యః సర్వభూతానాం మత్ప్రసాదాత్ పురాభవత్ ।
కస్మాచ్చిత్ కారణాత్ పాపః కంచిత్ కాలముపేక్షితః ॥ 32
పూర్వం నా అనుగ్రహం వల్లనే ఇతడు సర్వప్రాణులకూ అవధ్యుడయ్యాడు. ఏదో కారణంగా కొంతకాలం పాటు ఈ పాపాత్ముడు ఉపేక్షింపబడ్డాడు. (32)
వధార్థమాత్మనస్తేన హృతా సీతా దురాత్మనా ।
నలకూబరశాపేన రక్షా చాస్యాః కృతా మయా ॥ 33
తన చావు కోసమే ఈ దురాత్ముడు సీతను అపహరించాడు. నలకూబర శాపం ద్వారా నేను ఈమెకు రక్షణ కల్పించాను. (33)
యది హ్యకామాం సేవేత స్త్రియమన్యామపి ధ్రువమ్ ।
శతధాస్య ఫలేన్మూర్థా ఇత్యుక్తః సోఽభవత్ పురా ॥ 34
పూర్వం రావణునికి ఈ శాపం కలిగింది. కోరికలేని పరస్త్రీని బలవంతంగా అనుభవించినట్లయితే నిశ్చయంగా అతని శిరసు నూరుముక్కలుగా విచ్చిపోతుంది. (34)
నాత్ర శంకా త్వయా కార్యా ప్రతీచ్ఛేమాం మహాద్యుతే ।
కృతం త్వయా మహత్ కార్యం దేవానామమరప్రభ ॥ 35
మహాద్యుతీ! ఈమె విషయంలో నీవు శంకించనక్కర లేదు. ఈమెను స్వీకరించు. దివ్య ప్రభామయుడా! నీవు దేవతల యొక్క మహాత్మార్యాన్ని సాధించావు". (35)
దశరథ ఉవాచ
ప్రీతోఽస్మి వత్స భద్రం తే పితా దశరథోఽస్మి తే ।
అనుజానామి రాజ్యం చ ప్రశాది పురుషోత్తమ ॥ 36
దశరథుడు అంటున్నాడు - "వత్సా! నేను నీ తండ్రి దశరథుడిని. నీ పట్ల ప్రీతుడనైనాను. నీకు శుభమగు గాక! పురుషోత్తమా! నేను అనుమతిస్తున్నాను. రాజ్యాన్ని ఏలుకో". (36)
రామ ఉవాచ
అభివాదయే త్వాం రాజేంద్ర యది త్వం జనకో మమ ।
గమిష్యామి పురీం రమ్యామ్ అయోధ్యాం శాసనాత్ తవ ॥ 37
రాముడు అంటున్నాడు - "రాజేంద్రా! నీవు నా తండ్రివి అయినట్లయితే నీకు నేను నమస్కరిస్తున్నాను. నీ ఆజ్ఞను పాటించి అందమైన అయోధ్యాపురికి వెడతాను". (37)
మార్కండేయ ఉవాచ
తమువాచ పితా భూయః ప్రహృష్టో భరతర్షభ ।
గచ్ఛాయోధ్యాం ప్రశాధీతి రామం రక్తాంతలోచనమ్ ॥ 38
సంపూర్ణానీహ వర్షాణి చతుర్దశ మహాద్యుతే ।
మార్కండేయుడు ఇలా అన్నాడు - భరతశ్రేష్ఠా! ఎఱ్ఱని జీరలు గల కన్నులతో మనోహరుడైన ఆ రాముని ఉద్దేశించి తండ్రి అత్యంత హర్షంతో తిరిగి "మహాద్యుతీ! ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యాయి వెళ్లు. అయోధ్యను పాలించు" అని అన్నాడు. (38 1/2)
తతో దేవాన్ నమస్కృత్య సుహృద్భిరభినందితః ॥ 39
మహేంద్ర ఇవ పౌలోమ్యా భార్యయా స సమేయివాన్ ।
అనంతరం దేవతలందరికీ నమస్కరించి, సుహృదులు అభినందిస్తూండగా శచీదేవితో ఇంద్రుడు కూడినట్లుగా ఆ రాముడు భార్యను కలుసుకొన్నాడు. (39 1/2)
తతో వరం దదౌ తస్మై హ్యవింధ్యాయ పరంతపః ॥ 40
త్రిజటాం చార్థమానాభ్యాం యోజయామాస రాక్షసీమ్ ।
తరువాత పరంతపుడైన రాముడు ఆ అవింధ్యునికి అభీష్ట వరం ఇచ్చాడు. రాక్షస స్త్రీ అయిన త్రిజటను కూడా ధనసన్మానాలతో సంతుష్టిపరచాడు. (40 1/2)
తమువాచ తతో బ్రహ్మా దేవైః శక్రపురోగమైః ॥ 41
కౌసల్యామాతరిష్టాంస్తే వరానద్య దదాని కాన్ ।
అంతా అయ్యాక ఇంద్రాది దేవతలను పురస్కరించుకొని బ్రహ్మదేవుడు అతనిని "కౌసల్యానందనా! ఇప్పుడు నీకు ఏ అభీష్టవరాలు ఇవ్వను?" అని అడిగాడు. (41 1/2)
వవ్రే రామః స్థితిం ధర్మే శత్రుభిశ్చాపరాజయమ్ ॥ 42
రాక్షసైర్నిహతానాం చ వానరాణాం సముద్భవమ్ ।
తాను ధర్మమునందు నిలకడగా ఉండాలని, శత్రువుల చేతిలో పరాజయం లేకుండా ఉండాలని, రాక్షసుల చేతులలో మరణించిన వానరులు జీవించాలని రాముడు కోరుకొన్నాడు. (42 1/2)
తతస్తే బ్రహ్మణా ప్రోక్తే తథేతి వచనే తదా ॥ 43
సముత్తస్థుర్మహారాజ వానరా లబ్ధచేతసః ।
బ్రహ్మదేవుడు "తథస్తు" అని పలుకగానే మహారాజా! ఆ వానరులందరూ లబ్ధచేతనులై లేచి నిలిచారు. (43 1/2)
సీతా చాపి మహాభాగా వరం హనుమతే దదౌ ॥ 44
రామకీర్త్యా సమం పుత్ర జీవితం తే భవిష్యతి ।
మహాసౌభాగ్యవతి అయిన సీత కూడా హనుమంతునికి "నాయనా! శ్రీరాముని కీర్తితో సమంగా నీవు జీవించి ఉంటావు. (44 1/2)
దివ్యాస్త్వాముపభోగాశ్చ మత్ప్రసాదకృతాః సదా ॥ 45
ఉపస్థాస్యంతి హనుమన్నితి స్మ హరిలోచన ।
పచ్చని కన్నులు కల హనుమంతా! నా అనుగ్రహం వలన నీకు సదా దివ్య భోగాలు లభిస్తాయి". అని వరం ఇచ్చింది. (45 1/2)
తతస్తే ప్రేక్షమాణానాం తేషామక్లిష్టకర్మణామ్ ॥ 46
అంతర్ధానం యయుర్దేవాః సర్వే శక్రపురోగమాః ।
తరువాత అనాయాసకర్మలు చేసే ఆ వానరులు చూస్తు ఉండగానే ఇంద్రాది దేవతలు అందరూ అంతర్ధానమయ్యారు. (46 1/2)
దృష్ట్వా రామం తు జానక్యా సంగతం శక్రసారథిః ॥ 47
ఉవాచ పరమప్రీతః సుహృన్మధ్య ఇదం వచః ।
దేవగంధర్వయక్షాణాం మానుషాసురభోగినామ్ ॥ 48
అపనీతం త్వయా దుఃఖమిదం సత్యపరాక్రమ ।
జానకితో కూడి ఉన్న శ్రీరామచంద్రుని చూచి ఇంద్రసారథి అయిన మాతలి పరమప్రీతుడై స్నేహితులందరి మధ్య ఇలా అన్నాడు - "సత్యపరాక్రముడా! దేవగంధర్వ యక్షమనుష్య అసుర నాగులందరి యొక్క దుఃఖాన్ని నీవు పోగొట్టావు. (47,48 1/2)
సదేవాసురగంధర్వాః యక్షరాక్షసపన్నగాః ॥ 49
కథయిష్యంతి లోకాస్త్వాం యావద్ భూమిర్దరిష్యతి ।
ఈ భూమి నిలిచినంత కాలం దేవాసురగంధర్వ యక్షరాక్షస పన్నగలోకాలన్నీ నీ కీర్తిని గానం చేస్తాయి. (49 1/2)
ఇత్యేవముక్త్వానుజ్ఞాప్య రామం శస్త్రభృతాం వరమ్ ॥ 50
సంపూజ్యాపాక్రమత్ తేన రథేనాదిత్యవర్చసా ।
అని చెప్పి, శస్త్రధారులలో మేటి అయిన రాముని అనుమతి తీసుకొని, అతనిని పూజించి, సూర్యతేజస్సు కల ఆ రథం మీదనే మాతలి స్వర్గానికి వెళ్లిపోయాడు. (50 1/2)
తతః సీతాం పురస్కృత్య రామః సౌమిత్రిణా సహ ॥ 51
సుగ్రీవప్రముఖైశ్చైవ సహితః సర్వవానరైః ।
విధాయ రక్షాం లంకాయాం విభీషణపురస్కృతః ॥ 52
సంతతార పునస్తేన సేతునా మకరాలయమ్ ।
పుష్పకేణ విమానేన ఖేచరేణ విరాజతా ॥ 53
కామగేన యథాముఖ్యైః అమాత్యైః సంవృతో వశీ ।
అనంతరం జితేంద్రియుడైన శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో, సుగ్రీవుడు మొదలైన సమస్త వానరులతో కలిసి లంక రక్షణకు ఏర్పాట్లు చేసి, విభీషణుడు మొదలైన ముఖ్యులైన అమాత్యులతో కూడి, సీతను ముందుంచుకొని, కామగమనం కలిగి, ఆకాశంలో చరించే, ప్రకాశమానమైన పుష్పకవిమానాన్ని ఎక్కి తిరిగి సేతుమార్గం ద్వారానే సముద్రాన్ని దాటాడు. (51-53 1/2)
తతస్తీరే సముద్రస్య యత్ర శిశ్యే స పార్థివః ॥ 54
తత్రైవోవాస ధర్మాత్మా సహితాః సర్వవానరైః ।
ఆ సముద్రతీరంలో ధర్మాత్ముడైన ఆ రాజు పూర్వం తాను ఎక్కడ శయనించాడో అక్కడే వానరులతో కలిసి విశ్రమించాడు. (54 1/2)
అథైనాన్ రాఘవః కాలే సమానీయాభిపూజ్య చ ॥ 55
విసర్జయామాస తదా రత్నైః సంతోష్య సర్వశః ।
అక్కడ రాఘవుడు సమయోచితంగా వారందరినీ పిలిచి, సత్కరించి రత్నాలతో, సర్వవిధాలా సంతృప్తి పరచి వీడుకొలిపాడు. (55 1/2)
గతేషు వానరేంద్రేషు గోపుచ్ఛర్ క్షేషు తేషు చ ॥ 56
సుగ్రీవసహితో రామః కిష్కింధాం పునరాగమత్ ।
వానరేంద్రులు, గోపుచ్చులు, ఋక్షేశ్వరులు అందరూ వెళ్లిపోయాక, సుగ్రీవసహితుడై రాముడు కిష్కింధకు బయలుదేరాడు. (56 1/2)
విభీషణేనానుగతః సుగ్రీవసహితస్తదా ॥ 57
పుష్పకేణ విమానేన వైదేహ్యా దర్శయన్ వనమ్ ।
కిష్కింధాం తు సమాసాద్య రామః ప్రహరతాం వరః ॥ 58
అంగదం కృతకర్మాణం యౌవరాజ్యేఽభ్యషేచయత్ ।
విభీషణుడు అనుసరించిరాగా, సుగ్రీవ సహితుడై యోధ శ్రేష్ఠుడయిన శ్రీరాముడు పుష్పకవిమానం ఎక్కి వైదేహికి అరణ్య శోభను చూపిస్తూ కిష్కింధను చేరుకొన్నాడు. అక్కడకు చేరి పని నెరవేర్చిన అంగదుని యువరాజుగా అభిషేకించాడు. (57,58 1/2)
తతస్తైరేవ సహితః రామః సౌమిత్రిణా సహ ॥ 59
యథాగతేన మార్గేణ ప్రయయౌ స్వపురం ప్రతి ।
అనంతరం వారితో లక్ష్మణునితో కలిసి, వచ్చిన దారినే తన నగరానికి బయలుదేరాడు. (59 1/2)
అయోధ్యాం స సమాసాద్య పురీం రాష్ట్రపతిస్తతః ॥ 60
భరతాయ హనూమంతం దూతం ప్రాస్థాపయత్ తదా ।
రాష్ట్రపాలకుడైన శ్రీరాముడు అయోధ్యానగరాన్ని చేరుకొని భరతుని వద్దకు హనుమంతుని దూతగా పంపాడు. (60 1/2)
లక్షయుత్వేంగితం సర్వం ప్రియం తస్మై నివేద్య వై ॥ 61
వాయుపుత్రే పునః ప్రాప్తే నందిగ్రామముపాగమత్ ।
హనుమంతుడు భరతుని ఇంగితాన్ని గ్రహించి, అతనికి ప్రియవార్తను నివేదించి, తిరిగి వచ్చాక రాముడు నందిగ్రామాన్ని చేరుకొన్నాడు. (61 1/2)
స తత్ర మలదిగ్ధాంగం భరతం చీరవాససమ్ ॥ 62
అగ్రతః పాదుకే కృత్వా దదర్శాసీనమాసనే ।
అక్కడ అతడు - ధూళి ధూసరితమైన శరీరంతో, నార చీరలు ధరించి, ఎదుట పాదుకలు ఉంచుకొని, దర్భాసనం మీద కూర్చుని ఉన్న భరతుని చూశాడు. (62 1/2)
సంగతో భరతేనాథ శత్రుఘ్నేన చ వీర్యవాన్ ॥ 63
రాఘవః సహసౌమిత్రిః ముముదే భరతర్షభ ।
భరతశ్రేష్ఠుడా! భరతుని, శత్రుఘ్నుని కలుసుకొని పరాక్రమశాలి అయిన రాఘవుడు లక్ష్మణునితోపాటు ఆనందించాడు. (63 1/2)
తతో భరతశత్రుఘ్నౌ సమేతౌ గురుణా తదా ॥ 64
వైదేహ్యా దర్శనేనోభౌ ప్రహర్షం సమవాపతుః ।
అన్నగారిని కలుసుకొని భరతశత్రుఘ్నులు కూడా ఆనందించారు. వైదేహిని చూచి ఇద్దరూ మిక్కిలి ఆనందాన్ని పొందారు. (64 1/2)
తస్మై తద్ భరతో రాజ్యమ్ ఆగతాయాతిసత్కృతమ్ ।
న్యాసం నిర్యాతయామాస యుక్తః పరమయా ముదా ॥ 65
తిరిగి వచ్చిన అతనికి భరతుడు తన వద్ద న్యాసంగా ఉంచబడిన రాజ్యాన్ని పరమసంతోషంతో సత్కారపూర్వకంగా అప్పగించాడు. (65)
తతస్తం వైష్ణవే శూరం నక్షత్రేఽభిమతేఽహని ।
వసిష్ఠో వామదేవశ్చ సహితావభ్యషించతామ్ ॥ 66
అనంతరం విష్ణుదేవతాకమైన శ్రవణా నక్షత్రంలో పుణ్యదినాన వసిష్ఠవామదేవులిద్దరూ కలిసి శూరుడైన శ్రీరామునికి రాజ్యాభిషేకం చేశారు. (66)
సోఽభిషిక్తః కపిశ్రేష్ఠం సుగ్రీవం ససుహృజ్జనమ్ ।
విభీషణం చ పౌలస్త్యమ్ అన్వజానాద్ గృహాన్ ప్రతి ॥ 67
రాజ్యాభిషిక్తుడైన శ్రీరామచంద్రుడు సుహృజ్జనాలతో కూడిన వానరశ్రేష్ఠుడు సుగ్రీవుని, పులస్త్యనందనుడైన విభీషణుని ఇళ్లకు వెళ్లడానికి అనుమతించాడు. (67)
అభ్యర్చ్య వివిధైర్భోగైః ప్రీతియుక్తౌ ముదా యుతౌ ।
సమాధాయేతికర్తవ్యం దుఃఖేన విససర్జ హ ॥ 68
వివిధభోగాలతో వారిద్దరినీ సత్కరించాడు. వారు కూడా ప్రీతిచెంది సంతోషించారు. వారికి ఇతికర్తవ్యాన్ని బోధించి అతిదుఃఖంతో వీడ్కోలిచ్చాడు. (68)
పుష్పకం చ విమానం తత్ పూజయిత్వా స రాఘవః ।
ప్రాదాద్ వైశ్రవణాయైవ ప్రీత్యా స రఘునందనః ॥ 69
రఘునందనుడైన శ్రీరాముడు పుష్పకవిమానాన్ని అర్చించి ప్రీతితో కుబేరునికి తిరిగి పంపాడు. (69)
తతో దేవర్షిసహితః సరితం గోమతీమను ।
దశాశ్వమేధానాజహ్రే జారూథ్యాన్ స నిరర్గలాన్ ॥ 70
దేవర్షిసహితుడై గోమతీ నదీ తీరంలో శ్రీరామచంద్రుడు అన్నాన్ని కోరివచ్చిన యాచకులకు ఆటంకం లేని రీతిగా స్తుతియోగ్యమైన, పది అశ్వమేధ యజ్ఞాలను చేశాడు. (70)
వి॥సం॥ 1. జారూధ్యాన్ = త్రిగుణదక్షిణాన్ ఇతి (అర్జున మిశ్ర) జారూథం స్తోత్ర మిత్యుచ్యతే (నీల)
2. జారుధ్యాన్ = స్తుతింపదగిన వారిని. "జరూధోఽసుర విశేషః" అని వేదభాష్యం. "జరూధాంగరూధం గృణాతేః" అని యాస్కవచనం. జరూధమంటే స్తోత్రమని యాస్కవ్యాఖ్య కాబట్టి జరూధమంటే స్తుతి, జారుథ్యులంటే స్తుతింపదగినవారు (నీల)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి శ్రీరామాభిషేకే ఏకనవత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 291 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున శ్రీరామాభిషేకమను రెండు వందల తొంబది ఒకటవ అధ్యాయము. (291)