268. రెండువందల అరువది ఎనిమిదవ అధ్యాయము

జయద్రథుడు ద్రౌపదిని బలవంతముగా ఎత్తికొనిపోవుట.

వైశంపాయన ఉవాచ
సరోషరాగోపహతేన వల్గునా
సరాగనేత్రేణ నతోన్నతభ్రువా ।
ముఖేన విస్ఫూర్య సువీరరాష్ట్రపం
తతోఽబ్రవీత్ తం ద్రుపదాత్మజా పునః ॥ 1
వైశంపాయనుడు కొనసాగిస్తున్నాడు - జయద్రథుని మాటలు విన్న ద్రౌపది అందమైన ముఖం రోషంతో ఎఱ్ఱబడింది. కన్నులు ఎరుపెక్కాయి. కనుబొమలు పైకిలేచాయి. చీత్కారం చేస్తూ అతనితో ఇలా అన్నది. (1)
యశస్వినస్తీక్ష్ణవిషాన్ మహారథాన్
అభిబ్రువన్ మూఢ న లజ్జసే కథమ్ ।
మహేంద్రకల్పాన్ నిరతాన్ స్వకర్మసు
స్థితాన్ సమూహేష్వపి యక్షరక్షసామ్ ॥ 2
"నా భర్తలైన పాండవులు యశస్వులు, స్వధర్మానురక్తులు. యక్షరాక్షసులతో కూడా యుద్ధం చేయగల సమర్థులు, దేవేంద్రునికి దీటు వచ్చేవారు, కోపంలో తీక్ష్ణమైన విషసర్పాలవంటివారు, మహారథులు, మూర్ఖుడా! వారిని ఇలా తుచ్ఛంగా మాటలాడడానికి నీకు సిగ్గుగా లేదూ? (2)
న కించిదీడ్యం ప్రవదంతి పాపం
వనేచరం వా గృహమేధినం వా ।
తపస్వినం సంపరిపూర్ణవిద్యం
భషంతి హైవం శ్వనరాః సువీర ॥ 3
తపస్వులై పరిపూర్ణవిద్యాధికులైన పూజనీయులు వనంలో నివసిస్తున్నా, గృహస్థులైనా, వారిని గురించి ఎవరూ అనుచితంగా పలకరు. జయద్రథా! నీవంటి కుక్కలు మాత్రమే మొరుగుతాయి. (3)
అహం తు మన్యే తవ నాస్తి కశ్చిత్
ఏతాదృశే క్షత్రియసంనివేశే ।
యస్త్వాద్య పాతాలముఖే పతంతం
పాణౌ గృహీత్వా ప్రతిసంహరేత ॥ 4
నాగం ప్రభిన్నం గిరికూటకల్పమ్
ఉపత్యకాం హైమవతీం చరంతమ్ ।
దండీవ యూథాదపసేధసి త్వం
యో జేతుమాశంససి ధర్మరాజమ్ ॥ 5
పాతాళముఖంగా పతనమవుతున్న నిన్ను చేతులతో పట్టుకొని ఆపగలిగినవాడు ఈ క్షత్రియులలో ఎవడూ లేడని అనుకొంటున్నాను. హిమవత్సర్వతం చరియలలో తిరుగుతున్న గిరిశిఖరం వంటి మదపుటేనుగును అంకుశం ధరించి గుంపు నుండి చెదరగొట్టాలనుకొనేవాడిలా నీవు ధర్మరాజును జయించాలనుకొంటున్నావు. (4,5)
బాల్యాత్ ప్రసుప్తస్య మహాబలస్య
సింహస్య పక్ష్మాణి ముఖాల్లునాసి ।
పదా సమాహత్య పలాయమానః
క్రుద్ధం యదా ద్రక్ష్యసి భీమసేనమ్ ॥ 6
నిద్రిస్తున్న బలిష్ఠమయిన సింహం యొక్క జూలును మూర్ఖుడవై లాగాలనుకొంటున్నావు, క్రుద్ధుడైన భీమసేనుని చూడగానే కాళ్లు కూడదీసుకొని పరుగులు తీస్తావు. (6)
మహాబలం ఘోరతరం ప్రవృద్ధం
జాతం హరిం పర్వతకందరేషు ।
ప్రసుప్తముగ్రం ప్రపదేన హంసి
యః క్రుద్ధమాయోత్స్యసి జిష్ణుముగ్రమ్ ॥ 7
పర్వత గుహలలో పుట్టి అక్కడే ఎదిగిన మహాభయంకరమైన మహాబలిష్ఠమైన సింహాన్ని నిద్రిస్తూండగా కాలితో తన్ని చంపాలనుకొంటున్నావు. రోషంతో కోపావిష్ణుడైన భయంకరుడైన అర్జునునితో, నీవు యుద్ధం చేయదలచుకొన్నావు. (7)
కృష్ణోరగౌ తీక్ష్ణముఖౌ ద్విజిహ్వౌ
మత్తః పదాఽఽక్రామసి పుచ్ఛదేశే ।
యః పాండవాభ్యాం పురుషోత్తమాభ్యాం
జఘన్యజాభ్యాం ప్రయుయుత్ససే త్వమ్ ॥ 8
పురుషోత్తములైన, పాండుపుత్రులలో చిన్నవారైన కవలలతో నీవు యుద్ధం చేయాలనుకోవడం - భయంకరమైన ముఖాలతో రెండు నాల్కలతో ఉన్న రెండు నల్లత్రాచుల తోకలను కాలితో తొక్కివేయడమే. (8)
యథా చ వేణుః కదలీ నలో వా
ఫలంత్యభావాయ న భూతయేఽఽత్మనః ।
తథైవ మాం తైః పరిరక్ష్యమాణ
మాదాస్యసే కర్కటకీవ గర్భమ్ ॥ 9
వెదురు, అరటి, నలము - ఇవి తమ ఉనికి కోల్పోవడానికే ఫలిస్తాయి, తమ అభివృద్ధికి కాదు. ఆడు ఎండ్రకాయ తన చావుకోసమే గర్భం దాల్చినట్లుగా నీవు పాండవుల చేత రక్షింపబడుతున్న నన్ను అపహరించాలనుకొంటున్నావు. (9)
జయద్రథ ఉవాచ
జానామి కృష్ణే విదితం మమైతద్
యథావిధాస్తే నరదేవపుత్రాః ।
న త్వేవమేతేన విభీషణేన
శక్త్యా వయం త్రాసయితుం త్వయాద్య ॥ 10
జయద్రథుడు అంటున్నాడు - "కృష్ణా! నీ భర్తలైన ఆ నరదేవపుత్రులు ఎటువంటివారో నాకంతా తెలుసు. ఇప్పుడు మమ్మల్ని నీవు ఈ బెదిరింపు చేత బెదిరించలేవు. (10)
వయం పునః సప్తదశేషు కృష్ణే
కులేషు సర్వేఽనవమేషు జాతాః ।
షడ్భ్యో గుణేభ్యోఽభ్యధికా విహీనాన్
మన్యామహే ద్రౌపది పాండుపుత్రాన్ ॥ 11
ద్రుపదపుత్రీ! కృష్ణా! మేమయితే శ్రేష్ఠమైన పదిహేడు గుణాలు కల ఉత్తమ వంశాలలో పుట్టాము. ఆరుగుణాలలో పాండవుల కంటె అత్యధికులం. కాబట్టి పాండుపుత్రులను మాకంటె తక్కువవారని భావిస్తాం. (11)
వి॥సం॥ పదిహేడుగుణాలు -
"వ్యవసాయం, వ్యాపారం, దుర్గం, వంతెనలు, కట్టడం, ఏనుగులను బంధించడం, అగడ్తలను రక్షించటం, పన్నులు వసూలు చేయడం, చివరిది నిర్జన ప్రదేశాలను ఏర్పరచటం - ఈ ఎనిమిది సంధానకర్మలు.
ప్రభు మంత్ర ఉత్సాహశక్తులు - మూడు, ప్రభుమంత్రి ఉత్సాహసిద్ధులు - మూడు, ప్రభు మంత్రి ఉత్సాహ ఉదయాలు - మూడు - ఈ తొమ్మిది కలిసి మొత్తం 8+9=17.
ఆరుగుణాలు - శౌర్యం, తేజస్సు, ధృతి, దాక్షిణ్యం, దానం, ఐశ్వర్యం.
వి॥సం॥ సంధానకర్మలు ఎనిమిది.
కృషిః వణికృథః దుర్గః సేతుః కుంజరబంధనమ్ ।
ఖన్యాకర కరాదానం శూన్యానాంచ నివేశనమ్ ॥
శక్తులు మూడు - ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి
సిద్ధులు మూడు - ప్రభుసిద్ధి, మంత్రసిద్ధి, ఉత్సాహసిద్ధి
ఉదయాలు మూడు - ప్రభూదయం, మంత్రోదయం, ఉత్సాహోదయం (నీల)
సా క్షిప్రమాతిష్ఠ గజం రథం వా
న వాక్యమాత్రేణ వయం హి శక్యాః ।
ఆశంస వా త్వం కృపణం వదంతీ
సౌవీరరాజస్య పునః ప్రసాదమ్ ॥ 12
వచ్చి త్వరగా రథంగాని, ఏనుగుగాని ఎక్కు. ఈ మాటలతో మమ్మల్ని మభ్యపెట్టడానికి శక్యం కాదు. తరువాత అయితే దీనురాలివై ఈ సౌవీరరాజుయొక్క అనుగ్రహాన్ని అర్థించవలసి ఉంటుంది. (12)
ద్రౌపద్యువాచ
మహాబలా కింత్విహ దుర్బలేవ
సౌవీరరాజస్య మతాహమస్మి ।
నాహం ప్రమాథాదిహ సంప్రతీతా
సౌవీరరాజం కృపణం వదేయమ్ ॥ 13
ద్రౌపది అంటోంది - "నేను మహాబలవంతురాలిని. అయినా గానీ ఇప్పుడు సౌవీరరాజు దృష్టికి దుర్బలు రాలిలా అనిపిస్తున్నాను. బలాత్కారానికి ఎలాగూ ప్రసిద్ధి వహించాను. ఇక సైంధవుని దీనంగా వేడుకోను. (13)
వి॥(సభలోకే బలవంతాన లాక్కు వచ్చారు కౌరవులు ఆమెను)
యస్యా హి కృష్ణౌ పదవీం చరేతాం
సమాస్థితావేకరథే సమేతౌ ।
ఇంద్రోఽపి తాం వాపహరేత్ కథంచిత్
మనుష్యమాత్రః కృపణః కుతోఽన్యః ॥ 14
కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి ఏకరథస్థులై ఎవరికోసం బయలుదేరుతారో ఆమెను ఇంద్రుడు కూడా అపహరించలేడు. ఇక అల్పుడైన మనుష్యమాత్రుని సంగతి ఎందుకు? (14)
యదా కిరీటీ పరవీరఘాతీ
నిఘ్నన్ రథస్థో ద్విషతాం మనాంసి ।
మదంతరే త్వద్ధ్వజినీం ప్రవేష్టా
కక్షం దహన్నగ్నిరివోష్ణగేషు ॥ 15
శత్రుసంహారకుశలుడైన అర్జునుడు శత్రువుల మనోబలాన్ని అణచివేస్తూ వేసవికాలంలో గడ్డిని దహించే అగ్నిలా నాకోసం నీ సైన్యంలో ప్రవేశిస్తాడు. (15)
జనార్దనః సాంధకవృష్ణివీరో
మహేష్వాసాః కేకయాశ్చాపి సర్వే ।
ఏతే హి సర్వే మమ రాజపుత్రాః
ప్రహృష్టరూపాః పదవీం చరేయుః ॥ 16
అంధకవృష్ణి వీరులతో కూడిన జనార్దనుడు, మహాధనుర్థరులైన కేకయులందరూ నాకు రక్షకులే. ఈ రాజపుత్రులందరూ అతిహర్షంతో నా జాడకోసం వెదకుతారు. (16)
మౌర్వీవిసృష్టాః స్తనయిత్నుఘోషాః
గాండీవముక్తాస్త్వతివేగవంతః ।
హస్తం సమాహత్య ధనంజయస్య
భీమాః శబ్దం ఘోరతరం నదంతి ॥ 17
అర్జునుని గాండీవం యొక్క నారినుండి వెలువడే బాణాలు మేఘంలా గర్జిస్తాయి. వేగవంతాలయిన ఆ బాణాలు అర్జునుని చేతి నుండి వెలువడి భయంకరంగా నినదిస్తాయి. (17)
గాండీవముక్తాంశ్చ మహాశరౌఘాన్
పతంగసంఘానివ శీఘ్రవేగాన్ ।
యదా ద్రష్టాస్యర్జునం వీర్యశాలినం
తదా స్వబుద్ధిం ప్రతినిందితాసి ॥ 18
గాండీవ నిర్ముక్తములైన మిడుతలదండు వంటి అమితవేగం కల మహాశరజాలాన్నీ, పరాక్రమశాలి అయిన అర్జునునీ చూచినప్పుడు నీ బుద్ధిని నీవు నిందించుకొంటావు. (18)
సశంఖఘోషః సతలత్రఘోషః
గాండీవధన్వా ముహురుద్వహంశ్చ ।
యదా శరానర్పయితా తవోరసి
తదా మనస్తే కిమివాభవిష్యత్ ॥ 19
గాండీవం ధరించి, శంఖం పూరిస్తూ, అల్లెతాటిని మీటుతూ, మాటిమాటికి బాణాలను ఎక్కుపెడుతూ అర్జునుడు నీగుండెలపై బాణాలను వేసినపుడు నీమనస్సు ఎలా ఉంటుందో ఆలోచించుకో. (19)
గదాహస్తం భీమమభిద్రవంతం
మాద్రీపుత్రౌ సంపతంతౌ దిశశ్చ ।
అమర్షజం క్రోధవిషం వమంతౌ
దృష్ట్వా చిరం తాపముపైష్యసేఽధమ ॥ 20
నీచుడా! భీముడు గద చేతపట్టి పరుగెత్తుకొని వచ్చినపుడు, మాద్రీపుత్రులు అమర్షజనితమైన క్రోధమనే విషాన్ని కక్కుతూ అన్ని దిక్కుల నుండి విరుచుకుపడినప్పుడు ఎంతో సంతాపం పొందుతావు. (20)
యథా వాహం నాతిచరే కథంచిత్
పతీన్ మహార్హాన్ మనసాపి జాతు ।
తేనాద్య సత్యేన వశీకృతం త్వాం
ద్రష్టాస్మి పార్థైః పరికృష్యమాణమ్ ॥ 21
పరమపూజనీయులైన భర్తలకు నేను మనసులో కూడా ఏ రీతిగానూ జవదాటనట్లయితే, నేడు ఆ సత్యప్రభావం వలన పాండవులు నిన్ను వశపరచుకొని నేలకీడ్వడం చూస్తాను. (21)
న సంభ్రమం గంతుమహం హి శక్ష్యే
త్వయా నృశంసేన వికృష్యమాణా ।
సమాగతాహం హి కురుప్రవీరైః
పునర్వనం కామ్యకమాగతాస్మి ॥ 22
క్రూరుడైన నీవు నన్ను బలవంతంగా లాగుకొని పోయినా నేను సంభ్రమం పొందను. ఆ కురువీరులు నన్ను తీసుకొని వస్తారు. మళ్ళీ ఈ కామ్యకవనానికే తిరిగివస్తాను. (22)
వైశంపాయన ఉవాచ
సా తాననుప్రేక్ష్య విశాలనేత్రా
జిఘృక్షమాణానవభర్త్సయంతీ ।
ప్రోవాచ మా మా స్పృశతేతి భీతా
ధౌమ్యం ప్రచుక్రోశ పురోహితం సా ॥ 23
వైశంపాయనుడు చెపుతున్నాడు - "ఆ విశాలనేత్ర ద్రౌపది తన్ను పట్టుకోదలచిన వారిని చూచి బెదిరిస్తూ "నన్ను తాకకండి" అని అరిచింది. భీతురాలయి తమ పురోహితుడైన ధౌమ్యునికొరకు కేకవేసింది. (23)
జగ్రాహ తాముత్తరవస్త్రదేశే
జయద్రథస్తం సమవాక్షిపత్ సా ।
తయా సమాక్షిప్తతనుః స పాపః
పపాత శాఖీవ నికృత్తమూలః ॥ 24
ఇంతలోనే జయద్రథుడు ఆమె ఉత్తరీయపుకొంగును పట్టుకొన్నాడు. ఆమె అతనిని నెట్టివేసింది. ఆమెచేత త్రోసివేయబడిన ఆ పాపి, మొదలునరికిన చెట్టులా పడిపోయాడు. (24)
ప్రగృహ్యమాణా తు మహాజవేన
ముహుర్వినిఃశ్వస్య చ రాజపుత్రీ ।
సా కృష్యమాణా రథమారురోహ
ధౌమ్యస్య పాదావభివాద్య కృష్ణా ॥ 25
అయినా అతడు మహావేగంగా తిరిగి లేచి ఆమెను పట్టుకొన్నాడు. రాజపుత్రి మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తూ అతడు బలవంతంగా లాగుతూండడంతో ధౌమ్యుని పాదాలకు నమస్కరించి రథం ఎక్కింది. (25)
ధౌమ్య ఉవాచ
నేయం శక్యా త్వయా నేతుమ్ అవిజిత్య మహారథాన్ ।
ధర్మం క్షత్రస్య పౌరాణమ్ అవేక్షస్య జయద్రథ ॥ 26
ధౌమ్యుడు అంటున్నాడు - "జయద్రథా! క్షత్రియుల యొక్క ప్రాచీన ధర్మాన్ని గుర్తించు. మహారథులైన పాండవులను జయించకుండా ఈమెను నీవు తీసుకొనిపోలేవు. (26)
క్షుద్రం కృత్వా ఫలం పాపం త్వం ప్రాస్స్యసి వ సంశయః ।
ఆసాద్య పాండవాన్ వీరాన్ ధర్మరాజపురోగమాన్ ॥ 27
ధర్మరాజు మొదలైన పాండవవీరుల ఎదుటపడి నీవు చేసిన నీచకృత్యానికి తగిన పాపఫలాన్ని పొందుతావు. ఇందులో ఏమీ సందేహం లేదు". (27)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్త్వా హ్రియమాణాం తాం రాజపుత్రీం యశస్వినీమ్ ।
అన్వగచ్ఛత్ తదా ధౌమ్యః పదాతిగణమధ్యగః ॥ 28
వైశంపాయనుడు చెపుతున్నాడు - అని పలికి ధౌమ్యుడు అపహరించిన ఆ ద్రౌపదిని పదాతిదళం మధ్యలో అనుసరించాడు. (28)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ద్రౌపదీహరణపర్వణి అష్టషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 268 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ద్రౌపదీహరణపర్వమను ఉపపర్వమున రెండువందల అరువది ఎనిమిదవ అధ్యాయము. (268)