258. రెండు వందల ఏబది ఎనిమిదవ అధ్యాయము

(మృగ స్వప్నోద్భవ పర్వము)

పాండవులు కామ్యకవనమునకు వెడలుట.

జనమేజయ ఉవాచ
దుర్యోధనం మోక్షయిత్వా పాండుపుత్రా మహాబలాః ।
కిమకార్షుర్వనే తస్మిన్ తన్మమాఖ్యాతుమర్హసి ॥ 1
జనమేజయుడు అడుగుతున్నాడు - గంధర్వుల బారి నుండి దుర్యోధనుని విడిపించిన తరువాత మహాబలులయిన పాండుపుత్రులు ఆ వనంలో ఏమిచేశారో నాకు చెప్పవలసినదిగా వేడుకొంటున్నాను". (1)
వైశంపాయన ఉవాచ
తతః శయానం కౌంతేయం రాత్రౌ ద్వైతవనే మృగాః ।
స్నప్నాంతే దర్శయామాసుః బాష్పకంఠా యుధిష్ఠిరమ్ ॥ 2
వైశంపాయనుడు చెప్పసాగాడు - "అనంతరం ద్వైతవనంలో ఒక రోజు రాత్రివేళ నిద్రపోతున్న కుంతీసుతుడు యుధిష్ఠిరునికి కన్నీటితో మృగాలు కలలో దర్శనమిచ్చాయి. (2)
తానబ్రవీత్ స రాజేంద్రో వేపమానాన్ కృతాంజలీన్ ।
బ్రూత యద్ వక్తుకామాః స్థ కే భవంతః కిమిష్యతే ॥ 3
చేతులు జోడించి భయంతో వణుకుతున్న జంతువులను చూచి ఆ రాజేంద్రుడు "మీరెవరు? మీకు ఏమి కావాలి? మీరు చెప్పదలచుకున్నది ఏదో చెప్పండి" అని అడిగాడు. (3)
ఏవముక్తాః పాండవేన కౌంతేయేన యశస్వినా ।
ప్రత్యబ్రువన్ మృగాస్తత్ర హతశేషా యుధిష్ఠిరమ్ ॥ 4
కుంతీపుత్రుడు, యశస్వి అయిన పాండుపుత్రుడు ఇలా అడగగానే చావగా మిగిలిన ఆ మృగాలు యుధిష్ఠిరునితో ఇలా అన్నాయి. (4)
వయం మృగా ద్వైతవనే హతశిష్టాస్తు భారత ।
నోత్సీదేమ మహారాజ క్రియతాం వాసపర్యయః ॥ 5
"భారతా! ద్వైతవనంలో చావగా మిగిలిన మృగాలము మేము. మేము ఇక చావలేము. మీరు మీ నివాసస్థానాన్ని మార్చుకోండి. (5)
భవతో భ్రాతరః శూరాః సర్వ ఏవాస్త్రకోవిదాః ।
కులాన్యల్పావశిష్టాని కృతవంతో వనౌకసామ్ ॥ 6
నీ సోదరులు అందరూ శూరులూ అస్త్రవిద్యావిశారదులూ. ఈ అడవిలో నివసించే మా జంతుజాతులను కొద్దిగా మిగిల్చారు. (6)
బీజభూతా వయం కేచిద్ అవశిష్టా మహామతే ।
వినర్ధేమహి రాజేంద్ర ప్రసాదాత్ తే యుధిష్ఠిర ॥ 7
మహామతీ! బీజప్రాయంగా కొద్దిమందిమి మాత్రమే మేము మిగిలి ఉన్నాం. మహారాజా! నీ అనుగ్రహంతో వృద్ధి పొందగలుగుతాం. (7)
తాన్ వేపమానాన్ విత్రస్తాన్ బీజమాత్రావశేషితాన్ ।
మృగాన్ దృష్ట్వా సుదుఃఖార్తో ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 8
భయంతో వణికిపోతూ బీజమాత్రంగా మిగిలిన ఆ మృగాలను చూచి ధర్మరాజు యుధిష్ఠిరుడు ఎంతో చింతించాడు. (8)
తాంస్తథేత్యబ్రవీద్ రాజా సర్వభూతహితే రతః ।
యథా భవంతో బ్రువతే కరిష్యామి చ తత్ తథా ॥ 9
ఇత్యేవం ప్రతిబుద్ధః సః రాత్ర్యంతే రాజసత్తమః ।
అబ్రవీత్ సహితాన్ భ్రాతౄన్ దయాపన్నో మృగాన్ ప్రతి ॥ 10
ఉక్తో రాత్రౌ మృగైరస్మి స్వప్నాంతే హతశేషితైః ।
తంతుభూతాః స్మ భద్రం తే దయా నః క్రియతామితి ॥ 11
ఈ రీతిగా రాత్రి గడిచింది. ఆ రాజోత్తముడు మేలుకొని మృగాల పట్ల జాలితో సోదరులతో ఇలా అన్నాడు - "చావగా మిగిలిన మృగాలు రాత్రి నా కలలో కనపడి - "మేము మా మా జాతులలో దారపు పోగులవలె మిగిలాము. మీకు శుభమగుగాక! మా మీద దయ చూపండి" అన్నాయి. (10, 11)
తే సత్యమాహుః కర్తవ్యా దయాస్మాభిర్వనౌకసామ్ ।
సాష్టమాసం హి నో వర్షం యదేతదుపయుంక్ష్మ హే ॥ 12
అవి కూడా నిజమే చెప్పాయి. అడవిలో నివసించే ఆ జంతువుల పట్ల కూడా మనం దయ చూపాలి. ఏడాదిపై ఎనిమిది నెలలుగా మనం వీనిని ఉపయోగిస్తున్నాం. (12)
పునర్బహుమృగం రమ్యం కామ్యకం కాననోత్తమమ్ ।
మరుభూయేః శిరస్థానం తృణబిందుసరః ప్రతి ॥ 13
తత్రేమాం వసతిం శిష్టాం విహరంతో రమేమహి ।
కనుక మనం మళ్లీ తృణబిందు సరోవర సమీపంలో అనేక మృగాలతో అందంగా ఉండే, ఉత్తమమైన, కామ్యకవనానికి వెళ్లుదాం. అది మరుభూమికి శిరఃస్థానంలో ఉంది. అక్కడే మనం మిగిలిన వనవాస దినాలను సుఖంగా విహరిస్తూ గడుపుదామ్. (13 1/2)
తతస్తే పాండవాః శీఘ్రం ప్రయయుర్ధర్మకోవిదాః ॥ 14
బ్రాహ్మణైః సహితా రాజన్ యే చ తత్ర సహోషితాః ।
ఇంద్రసేనాదిభిశ్చైవ ప్రేష్యైరనుగతాస్తదా ॥ 15
రాజా! ఆపై ధర్మజ్ఞులైన, పాండవులు అక్కడ తమతో కలిసి నివసించే బ్రాహ్మణులతో, ఇంద్రసేనాదులైన పరిచారకులు అందరితో కలిసి బయలుదేరారు. (14,15)
తే యాత్వానుసృతైర్మార్గైః స్వన్నైః శుచిజలాన్వితైః ।
దదృశుః కామ్యకం పుణ్యమ్ ఆశ్రమం తాపసాయుతమ్ ॥ 16
బాటసారులు సదా తిరుగుతూ ఉండే మార్గంలో వారు ప్రయాణించి అనేకులైన తాపసులతో కూడి చక్కని ఆహారం, స్వచ్ఛమైన జలంతో నిండిన పవిత్రాశ్రమాలు కల కామ్యకవనాన్ని దర్శించారు. (16)
వివిశుస్తే స్మ కౌరవ్యా వృతా విప్రర్షభైస్తదా ।
తద్ వనం భరతశ్రేష్ఠాః స్వర్గం సుకృతినో యథా ॥ 17
భరతవంశశ్రేష్ఠులైన ఆ కౌరవులు విప్రపుంగవులు కూడిరాగా పుణ్యాత్ములు స్వర్గాన్ని ప్రవేశించినట్లుగా ఆ వనాన్ని ప్రవేశించారు. (17)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మృగస్వప్నోద్భవపర్వణి కామ్యకప్రవేశే అష్టపంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 258 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మృగస్వప్నోద్భవ పర్వమను ఉపర్వమున కామ్యకప్రవేశమను రెండువందల ఏబది ఎనిమిదవ అధ్యాయము. (258)