240. రెండు వందల నలువదియవ అధ్యాయము
గంధర్వ దుర్యోధనసేనా సంవాదము.
వైశంపాయన ఉవాచ
అథ దుర్యోధనో రాజా తత్ర తత్ర వనే వసన్ ।
జగామ ఘోషానభితః తత్ర చక్రే నివేశనమ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
ఆ తరువాత దుర్యోధననరపాలుడు వనంలో అక్కడక్కడ ఆగుతూ గోశాలల దగ్గరకు చేరి, అక్కడ వసతి ఏర్పాటుచేసికొన్నాడు. (1)
రమణీయే సమాజ్ఞాతే సోదకే సమహీరుహే ।
దేశే సర్వగుణోపేతే చక్రురావసథాన్ పరాః ॥ 2
దుర్యోధనుని వెంట వస్తున్నవారు కూడా సర్వగుణసంపన్నమై, రమణీయమై, నీటితో చెట్లతో కూడినదై, తమకు పరిచితమైన ప్రదేశంలో గుడారాలు వేసికొన్నారు. (2)
తథైవ తత్సమీపస్థాన్ పృథగావసథాన్ బహూన్ ।
కర్ణస్య శకునేశ్చైవ భ్రాతౄణాం చైవ సర్వశః ॥ 3
అదేవిధంగా దుర్యోధనుని గుడారం దగ్గరే కర్ణునికీ, శకునికీ, దుర్యోధనుని సోదరులందరికీ కూడా విడివిడిగా చాలా గుడారాలు నిర్మించారు. (3)
దదర్శ స తదా గావః శతశోఽథ సహస్రశః ।
అంకైర్లక్షైశ్చ తాః సర్వాః లక్షయామాస పార్థివః ॥ 4
అప్పుడు వందలు, వేలుగా ఉన్న గోవులను దుర్యోధనుడు చూశాడు. వాటన్నిటిపై ముద్రను, సంఖ్యను వేయించాడు. (4)
అంకయామాస వత్సాంశ్చ జజ్ఞే చోపసృతాంస్త్వపి ।
బాలవత్సాశ్చ యా గావః కాలయామాస తా అపి ॥ 5
దూడలను కూడా లెక్కింపజేశాడు. పొల్లిన వాటిని తెలుసుకొన్నారు. లేగదూడలున్న ఆవులనూ లెక్కించారు. (5)
అథ స స్మారణం కృత్వా లక్షయిత్వా త్రిహాయనాన్ ।
వృతో గోపాలకైః ప్రీతః వ్యహరత్ కురునందనః ॥ 6
ఆ రీతిగా దుర్యోధనుడు గుర్తులు పెట్టించి, పరిగణనను ముగింపజేసి, మూడు సంవత్సరాలు వయసున్న వాటిని ప్రత్యేకంగా గుర్తించి, గోపాలకులతోపాటు ఆనందంగా విహరించసాగాడు. (6)
స చ పౌరజనః సర్వః సైనికాశ్చ సహస్రశః ।
యథోపజోషం చిక్రీడుః వనే తస్మిన్ యథామరాః ॥ 7
వెంటవచ్చిన పురజనులూ, వేలకొలదిగ ఉన్న సైనికులు తమతమ అభిరుచుల ననుసరించి దేవతలవలె ఆ వనంలో క్రీడించసాగారు. (7)
తతో గోపాః ప్రగాతారః కుశలా నృత్యవాదనే ।
ధార్తరాష్ట్రముపాతిష్ఠన్ కన్యాశ్చైవ స్వలంకృతాః ॥ 8
అప్పుడు నృత్య, వాదనలలో నేర్పరులు, గాయకులు అయిన కొందరు గోపాలురు, చక్కగా అలంకరించుకొని ఉన్న కన్యలతోపాటు దుర్యోధనుని దగ్గరకు వచ్చారు. (8)
స స్త్రీగణావృతో రాజా ప్రహృష్టః ప్రదదౌ వసు ।
తేభ్యో యథార్హమన్నాని పానాని వివిధాని చ ॥ 9
తన రాణులతో కలిసి వారిని చూచి దుర్యొధనుడు సంతసించి వారికి డబ్బును, యోగ్యతకు తగినట్లు వివిధాన్నపానాలను సమకూర్చాడు. (9)
తతస్తే సహితాః సర్వే తరక్షూన్ మహిషాన్ మృగాన్ ।
గవయర్ క్షవరాహాంశ్చ సమంతాత్ పర్యకాలయన్ ॥ 10
ఆ తరువాత వారంతా కలిసి సివంగులను, అడవిదున్నలను, గవయమృగాలను, ఎలుగుబంట్లను, అడవిపందులను, ఇతరేతర మృగాలను అన్నిదిక్కుల నుండి వేటాడసాగారు. (10)
స తాన్ శరైర్వినిర్భిద్య గజాంశ్చ సుబహూన్ వనే ।
రమణీయేషు దేశేషు గ్రాహయామాస వై మృగాన్ ॥ 11
అరణ్యంలో అందమయిన తావులలో ఆ దుర్యోధనుడు ఎన్నో ఏనుగులను తన బాణాలతో చీల్చాడు. క్రూరజంతువుల నెన్నింటినో పట్టి బంధించాడు. (11)
గోరసానుపయుంజానః ఉపభోగాంశ్చ భారత ।
పశ్యన్ స రమణీయాని వనాన్యుపవనాని చ ॥ 12
మత్తభ్రమరజుష్టాని బర్హిణాభిరుతాని చ ।
అగచ్ఛదానుపూర్వ్యేణ పుణ్యం ద్వైతవనం సరః ॥ 13
భారతా! దుర్యోధనుడు గోరసాలను ఉపయోగించుకొంటూ, వివిధభోగాలను అనుభవిస్తూ అందమయిన వనాలనూ, ఉపవనాలనూ చూస్తున్నాడు. ఆ తోటలలో, వనాలలో మదించిన తుమ్మెదలు ఝంకారాలు చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ముందుకు నడుస్తూ క్రమంగా పవిత్రమైన ద్వైతవన సరస్సు దగ్గరకు వచ్చాడు. (12,13)
మత్తభ్రమరసంజుష్టం నీలకంఠరవాకులమ్ ।
సప్తచ్ఛదసమాకీర్ణం పున్నాగవకులైర్యుతమ్ ॥ 14
మదించిన తుమ్మెదలు తేనెలు గ్రోలుతున్నాయి. నెమళ్ళ కేకలు అంతటా వ్యాపిస్తున్నాయి. ఏడాకుల అరటిచెట్లు ఆ సరోవరాన్ని కప్పుతున్నాయి. పున్నాగ, వకుల వృక్షాలు శోబిస్తున్నాయి. (14)
ఋద్ధ్యా పరమయా యుక్తః మహేంద్ర ఇవ వజ్రభృత్ ।
యదృచ్ఛయా చ తత్రస్థః ధర్మపుత్రో యుధిష్ఠిరః ॥ 15
ఈజే రాజర్షియజ్ఞేన సాద్యస్కేన విశాంపతే ।
దివ్యేన విధినా చైవ వన్యేన కురుసత్తమ ॥ 16
(విద్వద్భిః సహితీ ధీమాన్ బ్రాహ్మణైర్వనవాసిభిః ।)
కృత్వా నివేశమభితః సరసస్తస్య కౌరవ ।
ద్రౌపద్యా సహితో ధీమాన్ ధర్మపత్న్యా నరాధిపః ॥ 17
ఆ సరస్తీరంలో వజ్రధారి అయిన మహేంద్రునివలె పరమైశ్వర్యసంపన్నుడు, బుద్ధిమంతుడు, ధర్మసుతుడు అయిన యుధిష్ఠిరుడు ధర్మపత్ని అయిన ద్రౌపదితో కలిసి సాద్యస్కమనే (ఒకే రోజులో పూర్తియగునది) రాజర్షియజ్ఞాన్ని చేస్తున్నాడు. పండితులు, ధీమంతులు, వనవాసులయిన బ్రాహ్మణులెందరో ఆయనతో ఉన్నారు. కురుసత్తమా! అరణ్యంలో లభించే సామగ్రితో ధర్మజుడు ఆ దివ్యయజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ సరోవరానికి దగ్గరలోనే కుటీరాన్ని నిర్మించుకొని ఆయన వసిస్తున్నాడు. (15-17)
తతో దుర్యోధనః ప్రేష్యాన్ ఆదిదేశ సహస్రశః ।
ఆక్రీడావసథాః క్షిప్రం క్రియంతామితి భారత ॥ 18
భారతా! అప్పుడు దుర్యోధనుడు వేలకొలదిగ క్రీడామండపాలను నిర్మించమని తన సేవకులను ఆదేశించాడు. (18)
తే తథేత్యేవ కౌరవ్యమ్ ఉక్త్వా వచనకారిణః ।
చికీర్షంతస్తదాఽఽక్రీడాన్ జగ్ముర్ద్వైతవనం సరః ॥ 19
దుర్యోధనుని ఆజ్ఞానువర్తులయిన వారంతా "అలాగే" అని క్రీడామండపాలను నిర్మించడానికి ద్వైతవనసరస్సు దగ్గరకు వెళ్ళారు. (19)
ప్రవిశంతం వనద్వారి గంధర్వాః సమవారయన్ ।
సేనాగ్ర్యం ధార్తరాష్ట్రస్య ప్రాప్తం ద్వైతవనం సరః ॥ 20
దుర్యోధనుని సేనాధిపతి ద్వైతవనసరస్సుకు దగ్గరగా వెళ్ళాడు. ద్వైతవనద్వారం దగ్గరున్న గంధర్వులు అతనిని అడ్డగించారు. (20)
తత్ర గంధర్వరాజో వై పూర్వమేవ విశాంపతే ।
కుబేరభవనాద్ రాజన్ ఆజగామ గణావృతః ॥ 21
రాజా! అప్పటికే కుబేరవనం నుండి గంధర్వరాజు తన సేవకగణాలతో అక్కడకు వచ్చి ఉన్నాడు. (21)
గణైరప్సరసాం చైవ త్రిదశానాం తథాఽఽత్మజైః ।
విహారశీలః క్రీడార్థం తేన తత్ సంవృతం సరః ॥ 22
అప్సరసల సమూహాలతో, దేవకుమారులతో కలిసి ఆయన సంచరిస్తున్నాడు. క్రీడావిహారంకోసం ఆయన ఆ సరస్సును చుట్టుముట్టు ఉన్నాడు. (22)
తేన తత్ సంవృతం దృష్ట్వా తే రాజపరిచారకాః ।
ప్రతిజగ్ముస్తతో రాజన్ యత్ర దుర్యోధనో నృపః ॥ 23
స తు తేషాం వచః శ్రుత్వా సైనికాన్ యుద్ధదుర్మదాన్ ।
ప్రేషయామాస కౌరవ్య ఉత్సారయత తానితి ॥ 24
రాజా! గంధర్వరాజు చుట్టుముట్టి ఉన్న సరస్సును చూచి దుర్యోధనుని సేవకులు వెనుదిరిగి దుర్యోధనుని దగ్గరకు వెళ్ళారు.
కౌరవ్యా(జనమేజయా!) దుర్యోధనుడు తన పరిచారకుల మాటలు విని "గంధర్వులను అక్కడ నుండి తరిమివేయం"డని యుద్ధదుర్మదులయిన సైనికులను పంపించాడు. (23,24)
తస్య తద్ వచనం శ్రుత్వా రాజ్ఞః సేనాగ్రయాయినః ।
సరో ద్వైతవనం గత్వా గంధర్వానిదమబ్రువన్ ॥ 25
దుర్యోధనుని ఆజ్ఞను విని సేనాధిపతులు ద్వైతవనసరస్సు దగ్గరకు పోయి గంధర్వులతో ఇలా అన్నారు. (25)
రాజా దుర్యోధనో నామ ధృతరాష్ట్రసుతో బలీ ।
విజిహీర్షురిహాయాతి తదర్థమపసర్పత ॥ 26
'ధృతరాష్ట్రకుమారుడైన దుర్యోధనమహారాజు బలవంతుడు. విహారార్థం ఇక్కడకు వస్తున్నాడు. కాబట్టి మీరు తొలగిపొండి.' (26)
ఏవముక్తాస్తు గంధర్వాః ప్రహసంతో విశాంపతే ।
ప్రత్యబ్రువంస్తాన్ పురుషాన్ ఇదం హి పరుషం వచః ॥ 27
రాజా! ఆ మాటలు విని గంధర్వులు నవ్వుతూ దుర్యోధనుని సేనాధిపతులకు పరుషవచనాలతో ఇలా బదులిచ్చారు. (27)
న చేతయతి వో రాజా మందబుద్ధిః సుయోధనః ।
యోఽస్మానాజ్ఞాపయత్వేవం వైశ్యానివ దివౌకసః ॥ 28
మీరాజు సుయోధనుడు బుద్ధిహీనుడు. కొంచెం కూడా జ్ఞానం లేదు. కాబట్టియే దేవతలమైన మమ్ము వైశ్యులను శాసించినట్టు శాసిస్తున్నాడు. (28)
యూయం ముమూర్షవశ్చాపి మందప్రజ్ఞా న సంశయః ।
యే తస్య వచనాదేవమ్ అస్మాత్ బ్రూత విచేతసః ॥ 29
మీరు కూడా బుద్ధిహీనులే. అనుమానం లేదు. చావదలచుకొన్నట్టుంది. కాకపోతే ఆయన మాటమేరకు తెలివిలేకుండా మాతో ఇలా అంటారా? (29)
గచ్ఛధ్వం త్వరితాః సర్వే యత్ర రాజా స కౌరవః ।
న చేదద్యైవ గచ్ఛధ్వం ధర్మరాజనివేశనమ్ ॥ 30
మీరంతా వెంటనే దుర్యోధనరాజు దగ్గరకు వెళ్లిపోండి. లేదా నేడే యమధర్మరాజు ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. (30)
ఏవముక్తాస్తు గంధర్వైః రాజ్ఞః సేనాగ్రయాయినః ।
సంప్రాద్రవన్ యతో రాజా ధృతరాష్ట్రసుతోఽభవత్ ॥ 31
గంధర్వులలా అనగానే దుర్యోధనుని సేనాధిపతులు దుర్యోధనుని దగ్గరకు వచ్చి చేరారు. (31)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి గంధర్వదుర్యోధనసేనాసంవాదే చత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 240 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున గంధర్వదుర్యోధనసేనాసంవాదమను రెండు వందల నలువదవ అధ్యాయము. (240)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 31 1/2 శ్లోకాలు.)