209. రెండు వందల తొమ్మిదవ అధ్యాయము

ధర్మసూక్ష్మత, పరబ్రహ్మప్రాప్త్యుపాయము.

మార్కండేయ ఉవాచ
ధర్మవ్యాధస్తు నిపుణం పునరేవ యుధిష్ఠిర ।
విప్రర్షభమువాచేదం సర్వధర్మభృతాం వర ॥ 1
మార్కండేయుడు ఇలా అన్నాడు.
ధర్మాత్ములలో శ్రేష్ఠుడా! యుధిష్ఠిరా! ధర్మవ్యాధుడు కౌశికునికి నేర్పుతో చెప్పసాగాడు. (1)
వ్యాధ ఉవాచ
శ్రుతిప్రమాణో ధర్మోఽయమితి వృద్ధానుశాసనమ్ ।
సూక్ష్మా గతిర్హి ధర్మస్య బహుశాఖా హ్యనంతికా ॥ 2
వ్యాధుడు అన్నాడు.
ధర్మనిర్ణయంలో వేదమే ప్రమాణం అని పెద్దల ఉపదేశం. ఇది నిజం. అయినా ధర్మస్వరూపం చాలా సూక్ష్మమైనది. దానిలో అనేకభేదాలు, శాఖలు ఉన్నాయి. (2)
ప్రాణాంతికే వివాహే చ వక్తవ్యమనృతం భవేత్ ।
అనృతేన భవేత్ సత్యం సత్యేనైవానృతం భవేత్ ॥ 3
ప్రాణాపాయం కలిగినప్పుడు, కన్యావివాహంలో అవసరం ఐతే అసత్యం చెప్పవచ్చు. నిజం చెప్పటం వల్ల ప్రాణాపాయాదులు కలిగేటట్లయితే అబద్ధం చెప్పవచ్చు. అసత్యం వల్ల ఒక్కొక్కప్పుడు సత్యఫలం కలగవచ్చు. అలాగే ప్రాణాపాయ సమయంలో సత్యం చెప్పడం వల్ల (ఒకని ప్రాణాలు పోయి) అసత్యానికి వచ్చే ఫలితం కలగవచ్చు. (3)
యద్ భూతహితమత్యంతం తత్ సత్యమితిధారణా ।
విపర్యకృతోఽధర్మః పశ్య ధర్మస్య సూక్ష్మతామ్ ॥ 4
ప్రాణులకు చాలా మేలు కలిగించేది నిజానికి సత్యం. ఎవరికైనా కీడు కలిగించేది చూడటానికి నిజమైనా అసత్యం, అధర్మం అవుతుంది. ఇలా పరిశీలిస్తే ధర్మగతి ఎంత సూక్ష్మమో తెలుస్తుంది. (4)
వి॥తె॥ భూతహితంబుగా పలుకుబొంకును
సత్యఫలంబునిచ్చు; త
ద్భూత భయాస్పదంబగు ప్రభూతపు
సత్యము బొంకునట్ల.... ఇట్టివి ధర్మసూక్ష్మముల్.
అని ధర్మసూక్ష్మం ఎలా ఉంటుందో చెప్పాడు ఎఱ్ఱన.
(భార-3-5-62)
యత్ కరోత్యశుభం కర్మ శుభం వా యది సత్తమ ।
అవశ్యం తత్ సమాప్నోతి పురుషో వాత్ర సంశయః ॥ 5
మనుష్యుడు తాను చేసే మంచి చెడు పనులఫలం తప్పక పొందుతాడు. ఇందులో సందేహం లేదు. (5)
విషమాం చ దశాం ప్రాప్తః దేవాన్ గర్హతి వై భృశమ్ ।
ఆత్మనః కర్మదోషాణి న విజానాత్యపండితః ॥ 6
తనకు భరింపరాని బాధ కలిగితే మూర్ఖుడు దేవతలను తీవ్రపదాలతో నిందిస్తాడు. కాని ఇది తాను చేసిన దుష్కర్మల ఫలితం అని తెలుసుకోలేడు. (6)
మూఢో నైకృతికశ్చాపి చపలశ్చ ద్విజోత్తమ ।
సుఖదుఃఖవిపర్యాసాన్ సదా సముపపద్యతే ॥ 7
నైనం ప్రజ్ఞా సునీతం వా త్రాయతే నైవ పౌరుషమ్ ।
మూర్ఖుడు స్వార్థంతో ఇతరులకు అపకారం చేసేవాడు, చపలచిత్తుడు, భ్రాంతివల్ల సుఖంలో దుఃఖాన్ని, దుఃఖంలో సుఖాన్ని చూస్తాడు. ఆ సమయంలో తనతెలివితేటలు గాని, ఉత్తమనీతి గాని, పురుషార్థం గాని అతనిని రక్షించలేదు. (7 1/2)
యోఽయమిచ్ఛేద్ యథా కామం తం తం కామం స ఆప్నుయాత్ ॥ 8
యది స్యాదపరాధీనం పౌరుషస్య క్రియాఫలమ్ ।
పురుషప్రయత్నం వలన కలిగే కర్మఫలం పరాధీనం కాకపోతే ఎవడు ఏది కోరుకుంటే వాడికి అది లభిస్తుంది. (8 1/2)
సంయతాశ్చాపి దక్షాశ్చ మతిమంతశ్చ మానవాః ॥ 9
దృశ్యంతే నిష్ఫలాః సంతః ప్రహీణాః సర్వకర్మభిః ।
ఇంద్రియ నిగ్రహం కలవారు, సమర్థులు, మేధావులు అయిన మానవులు గూడా తమపనులు చేసి చేసి అలసిపోయినా తాము కోరుకొన్న ఫలితాన్ని పొందలేకపోవటం లోకంలో మనం చూస్తుంటాము. (9 1/2)
భూతనామపరః కశ్చిద్ హింసాయాం సతతోత్థితః ॥ 10
వంచనాయాం చ లోకస్య స సుఖీ జీవతే సదా ।
ఇంకొకరకం మనుష్యుడు నిత్యమూ జీవహిమ్సాపరుడై ఉంటాడు; జనాన్ని మోసం చేస్తుంటాడు. అయినా సుఖంగా జీవిస్తుంటాడు. (10 1/2)
అచేష్టమపి చాసీనం శ్రీః కంచిదుపతిష్ఠతి ॥ 11
కశ్చిత్ కర్మాణి కుర్వన్ హి న ప్రాప్యమధిగచ్ఛతి ।
మరోరకం వాడు ఏ పనీ చేయకుండా ఊరకనే కూర్చుంటాడు. అయినా వానిని లక్ష్మి సేవించటానికి వస్తుంది. ఇంకొకడు ఎప్పుడూ ఏదో ఒకపని చేస్తూకూడా తగినఫలితాన్ని పొందలేడు. (11 1/2)
దేవానిష్ట్వా తపస్తస్త్వా కృపణైః పుత్రగృద్ధిభిః ॥ 12
దశమాసధృతా గర్భే జాయంతే కులపాంసనాః ।
కొంతమంది దురదృష్టవంతులు సంతానకాంక్షతో దేవతలను పూజిస్తారు. తపస్సు చేస్తారు. ఆ తల్లిగర్భంలో పదినెలలూ మోసి కన్న పిల్లలు వంశనాశకులుగా తయారవుతారు. (12 1/2)
అపరే ధనధాన్యైశ్చ భోగైశ్చ పితృసంచితైః ॥ 13
విపులైరభిజాయంతే లబ్ధాస్తైరేవ మంగలైః ।
మరికొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చేసిన ఆయాపుణ్యకర్మలవల్లనే తాతతండ్రులు సంపాదించిన ధనధాన్యాలు, భోగభాగ్యాలు గలిగ్ జన్మిస్తారు. (13 1/2)
కర్మజా హి మనుష్యాణాం రోగా నాస్త్యత్ర సంశయః ॥ 14
ఆధిభిశ్చైవ బాధ్యంతే వ్యాధైః క్షుద్రమృగా ఇవ ।
మానవులకు రోగాలు (పూర్వజన్మ) తాము చేసుకొన్న కర్మలవల్ల కలుగుతాయి అనటంలో సందేహం లేదు. వేటగాళ్ళు చిన్నజంతువులను బాధించినట్లు ఆధివ్యాధులు మానవులను బాధిస్తాయి. (14 1/2)
తే చాపి కుశలైర్వైద్యైః నిపుణైః సంభృతౌషధైః ॥ 15
వ్యాధయో వినివార్యంతే మృగా వ్యాధైరివ ద్విజ ।
ఆ రోగాలను (అనుభవించవలసిన సమయం పూర్తి అయితే) మంచి మందులను సమకూర్చుకొనే నేర్పరులైన వైద్యులు ఆటవికులు అడవిలోని జంతువులను పారద్రోలినట్లు పోగొడతారి. (15 1/2)
యేషామస్తి చ భోక్తవ్యం గ్రహణీదోషపీడితాః ॥ 16
న శక్నువంతి తే భోక్తుం పశ్య ధర్మభృతాం వర ।
ధర్మాత్ములలో శ్రేష్ఠుడా! కౌశికా! ఈ విచిత్రం చూడు - కొంతమందికి కావలసిన సంపదలు, ఆహారం ఉన్నా అతిసార రోగంతో వాటిని అనుభవించలేరు. (16 1/2)
అపరే బాహుబలినః క్లిశ్యంతే బహవో జనాః ॥ 17
దుఃఖేన చాధిగచ్ఛంతి భోజనం ద్విజసత్తమ ।
మరికొంతమంది బాహుబలం ఆరోగ్యం, జీర్ణశక్తి ఉండి కూడా చాలా కష్టపడి పట్టెడన్నం తింటారు. వాళ్ళు ఎప్పుడూ ఆకలితో బాధపడుతుంటారు. (17 1/2)
ఇతి లోకమనాక్రందం మోహశోకపరిప్లుతమ్ ॥ 18
స్రోతసా సకృదాక్షిప్తం హ్రియమాణం బలీయసా ।
ఈవిధంగా అసహాయమూ, మోహశోకమగ్నమూ అయి ఉంటుంది. ఈ లోకం. బలీయమైన ప్రవాహంలో చాలాసార్లు ఆదివ్యాధులు అనే తరంగాల తాకిడితో అటూ ఇటూ కొట్టుకొంటూ సాగుతుంటుంది. (18 1/2)
న మ్రిమేయుర్న జీర్యేయుః సర్వే స్యుః సార్వకామికాః ॥ 19
నాప్రియం ప్రతిపశ్యేయుః వశిత్వం యది వై భవేత్ ।
ప్రాణులు తమవశంలో తాము ఉంటే ముసలివారు కారు. మరణించరు. అందరూ తాము కోరుకున్న సర్వసుఖాలను అనుభవిస్తారు. అనిష్టాన్ని చూడరు. (19 1/2)
ఉపర్యుపరి లోకస్య సర్వో గంతుం సమీహతే ।
యతతే చ యథాశక్తి న చ తద్వర్తతే తథా ॥ 20
లోకంలో జనులందరూ ఒకరికంటే ఒకరు పైకి పైకి - ఉన్నతస్థితికి వెళ్ళటానికి యథాశక్తిగా ప్రయత్నిస్తారు. కాని ఎల్లప్పుడూ అన్ని చోట్లా అలా జరగదు. (20)
బహవః సంప్రదృశ్యంతే తుల్యనక్షత్రమంగలాః ।
మహచ్చ ఫలవైషమ్యం ద్రుశ్యతే కర్మసంధిషు ॥ 21
లోకంలో చాలామంది జనులు ఒకే నక్షత్రంలో పుట్టి ఉంటారు. వారికి జాతకర్మాది సంస్కారాలు సమానంగానే జరుగుతాయి. కాని వారు పూర్వజన్మలో చేసిన పుణ్య పాపకర్మల ననుసరించి ఫలప్రాప్తి కన్పిస్తుంది. (21)
న కేచిదీశతే బ్రహ్మన్ స్వయంగ్రాహస్య సత్తమ ।
కర్మణాం ప్రాక్ కృతానాం వై ఇహ సిద్ధిః ప్రదృశ్యతే ॥ 22
ఉత్తమ బ్రాహ్మణా! కొంతమంది తమచేతిలో ఉన్న వస్తువును కూడా ఉపయోగించుకోవటంలో సమర్థులు కాలేరు. పూర్వజన్మలో చేసిన కర్మఫలాన్నే ఈ లోకంలో జనులు పొందటం కన్పిస్తుంది. (22)
యథాశ్రుతిరియం బ్రహ్మన్ జీవః కిల సనాతనః ।
శరీరమధ్రువం లోకే సర్వేషాం ప్రాణినామిహ ॥ 23
వేదానుసారం ఈ జీవాత్మ నిశ్చయంగా సనాతనుడే - నిత్యుడే. వ్యావహారికంగా ఉన్న సమస్తప్రాణుల శరీరాలు లోకంలో అశాశ్వతాలు. (23)
వధ్యమానే శరీరే తు దేహనాశో భవత్యుత ।
జీవః సంక్రమతేఽన్యత్ర కర్మబంధనిబంధనః ॥ 24
శరీరానికి తీవ్రమైన దెబ్బలు తగిలితే ఆ దేహం నాశనం అవుతుంది. జీవుడు కర్మబంధానికి అధీనుడై మరొక శరీరంలో ప్రవేశిస్తాడు. (24)
బ్రాహ్మణ ఉవాచ
కథం ధర్మవిదాం శ్రేష్ఠ జీవో భవతి శాశ్వతః ।
ఏతదిచ్ఛామ్యహం జ్ఞాతుం తత్త్వేన వదతాం వర ॥ 25
బ్రాహ్మణుడు అన్నాడు - ధర్మం తెలిసిన వక్తలలో ఉత్తముడవు నీవు. ధర్మవ్యాధా! జీవుడు ఎలా శాశ్వతుడు అవుతాడు? ఈ విషయం ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవాలనుకొంటున్నాను. (25)
వ్యాధ ఉవాచ
న జీవనాశోఽస్తి హి దేహభేదే
మిథ్యైతదాహుర్ర్మియతే కిలేతి ।
జీవస్తు దేహాంతరితః ప్రయాతి
దశార్ధతైవాస్య శరీరభేదః ॥ 26
వ్యాధుడు అన్నాడు - శరీరం నశిస్తే జీవుడు నశించడు. జీవుడు మరనిస్తాడు అనటం మిథ్య - అసత్యం. కాని జీవుడు ఈ శరీరం వదిలిపెట్టి ఇంకొక శరీరంలోకి వెళ్ళుతాడు. శరీరంలో ఉండే ఐదు తత్త్వాలు పంచభూతాలలో కలవటమే దాని నాశం అని చెప్పాలి. (అందుకే చనిపోయాడనటానికి పూర్వం పంచత్వం పొందడనేవరు). (26)
అన్యో హి నాశ్నాతి కృతం హి కర్మ
మనుష్యలోకే మనుజస్య కశ్చిత్ ।
యత్ తేన కించిద్ధి కృతం హి కర్మ
తదశ్నుతే నాస్తి కృతస్య నాశః ॥ 27
మానవలోకంలో మనుష్యుడు చేసిన కర్మను ఆ కర్త కంటే ఇతరుడు అనుభవించడు. తాను చేసిన ఏ కొంచెం కర్మఫలాన్ని అయినా తానే అనుభవిస్తాడు. చేసిన కర్మలు అనుభవానికి రావలసినవే కానీ నశించవు. (27)
సుపుణ్యశీలా హి భవంతి పుణ్యాః
నరాధమాః పాపకృతో భవంతి ।
నరోఽనుయాతస్త్విహ కర్మభిః స్వైః
తతః సముత్పద్యతి భావితస్తైః ॥ 28
పుణ్యాత్ములైన మానవులు పుణ్యశీలులు - పుణ్యకర్మలు చేసేవారు అవుతారు. అధములు పాపపుపనులు చేసేవారు అవుతారు. మానవుడు ఈ లోకంలో చేసిన కర్మలు అతనిని వెంబడిస్తాయి. వాటి ప్రభావం వల్ల అతడు ఇంకొక జన్మను పొందుతాడు. (28)
బ్రాహ్మణ ఉవాచ
కథం సంభవతే యోనౌ కథం వా పుణ్యపాపయోః ।
జాతీః పుణ్యాస్త్వపుణ్యాశ్చ కథం గచ్ఛతి సత్తమ ॥ 29
కౌశికుడు అన్నాడు - సజ్జనశ్రేష్ఠా! జీవుడు ఇంకొక గర్భంలో ఎలా జన్మిస్తాడు? పుణ్యపాపాలతో వానికి సంబంధం ఎలా ఏర్పడుతుంది/ పుణ్యపాప జన్మలు ఎలా కలుగుతాయి? (29)
వ్యాధ ఉవాచ
గర్భాధానసమాయుక్తం కర్మేదం సంప్రదృశ్యతే ।
సమాసేన తు తే క్షిప్రం ప్రవక్ష్యామి ద్విజోత్తమ ॥ 30
వ్యాధుడు అన్నాడు - ద్విజోత్తమా! ఈ కనిపించేది అంతా కర్మపరిణామమే అని పిండోత్పత్తిని గూర్చి చెప్పే ధర్మశాస్త్రాలలో ఉంది. ఆ విషయం అంతా నీకు సంక్షిప్తంగా చెపుతా. (30)
యథా సంభృతసంభారః పునరేవ ప్రజాయతే ।
శుభకృచ్ఛుభయోనీషు పాపకృత్ పాపయోనిషు ॥ 31
జీవుడు కర్మబీజాలను కూడబెట్టుకొని మళ్ళీ జన్మించే రీతిని చెపుతాను. పుణ్యకర్మలు చేసేవాడు పుణ్యాత్ముల గర్భం నుంచి, పాపాత్ముడు పాపగర్భం నుంచి జన్మిస్తాడు. (31)
శుభైః ప్రయోగైర్దేవత్వం వ్యామిశ్రైర్మానుషో భవేత్ ।
మోహనీయైర్వియోనీషు త్వధోగామీ చ కిల్బిషీ ॥ 32
పుణ్యకర్మానుష్ఠానం వల్ల జీవునికి దేవత్వమూ, పుణ్యపాపకర్మలు కలవటం వల్ల మానవత్వమూ, తామసకర్మల వల్ల పశుపక్ష్యాది జన్మలూ కలుగుతాయి. కేవలం పాపకర్మలు చేయటం వల్ల నరకం కల్గుతుంది. (32)
జాతిమృత్యుజరాదుఃఖైః సతతం సమభిద్రుతః ।
సంసారే పచ్యమానశ్చ దోషైరాత్మకృతైర్నరః ॥ 33
మానవుడు తాను చేసిన తప్పుల వల్ల పుట్టుక, మరణం, ముసలితనం మొదలగు బాధలతో ఎప్పుడూ పీడింపబడుతూ ఎల్లప్పుడూ సంసారంలో వేగుతూ ఉంటాడు. (33)
తిర్యగ్యోనిహస్రాణి గత్వా నరకమేవ చ ।
జీవాః సంపరివర్తంతే కర్మబంధనిబంధనాః ॥ 34
పాపజీవులు కర్మబద్ధులై అనేకవేల పశుపక్ష్యాది జన్మలను పొంది, చివరకు నరకానికి వెళ్ళుతూ వాటిల్లోనే తిరుగుతుంటారు. (34)
జంతుస్తు కర్మభిస్తైస్తైః స్వకృతైః ప్రేత్య దుఃఖితః ।
తద్దుఃఖప్రతిఘాతార్థమ్ అపుణ్యాం యోనిమాప్నుతే ॥ 35
జీవుడు తాను చేసిన ఆ యా పాపకర్మల వల్ల మరణానంతరం దుఃఖాలను అనుభవిస్తాడు. ఆ దుఃఖానుభవం కోసమే పాపపుజన్మ ఎత్తుతాడు. (35)
తతః కర్మ సమాదత్తే పునరన్యం నవం బహు ।
పచ్యతే తు పునస్తేన భుక్త్వాపథ్యమివాతురః ॥ 36
ఆ జన్మలలో కొత్త కొత్త పాపకర్మలు చేస్తాడు. వాటి వల్ల కీడు కలిగించే పదార్థం తిన్న రోగిలాగా నానాబాధలూ పడతాడు. (36)
అజస్రమేవ దుఃఖార్తః అదుఃఖితః సుఖసంజ్ఞితః ।
తతోఽనివృత్తబంధత్వాత్ కర్మణాముదయాదపి ॥ 37
పరిక్రామతి సంసారే చక్రవద్ బహువేదనః ।
ఎల్లప్పుడూ దుఃఖాలతో కష్టపడుతూ కూడా ఆ దుఃఖం పోతే సుఖం అని పేరు పెట్టుకొంటాడు. అప్పటికీ సంసారబంధం తొలగకపోవటం వల్లనూ, నూతన కర్మలు కలగటం వల్లనూ అనేకమైన కష్టాలు, బాధలు పడుతూ జనన మరణ రూప సంసారంలో చక్రం వలె పరిభ్రమిస్తూ ఉంటాడు. (37 1/2)
వి॥సం॥ దుఃఖరాహిత్యానికే సుఖమని పేరు అంతేకానీ ప్రపంచంలో సుఖమనేది ప్రత్యేకంగా లేదు. అందుకే భారం తొలగిపోగానే సుఖంగా ఉంది అంటుంటాం. (నీల)
స చేన్నివృత్తబంధస్తు విశుద్ధశ్చాపి కర్మభిః ॥ 38
తపోయోగసమారంభం కురుతే ద్విజసత్తమ ।
కర్మభిర్బహుభిశ్చాపి లోకానశ్నాతి మానవః ॥ 39
ద్విజశ్రేష్ఠా! బంధన హేతువులైన కర్మల అనుభవం పూర్తి అయి సత్కర్మఫలంగా పవిత్రుడు అయిన తరువాత తపస్సును, యోగాభ్యాసాన్ని ఆరంభిస్తాడు. అనేక పుణ్యకర్మల ఫలంగా ఉత్తమలోకసుఖాలను అనుభవిస్తాడు. (38-39)
స చేన్నివృత్తబంధస్తు విశుద్ధశ్చాపి కర్మభిః ।
ప్రాప్నోతి సుకృతాన్ లోకాన్ యత్ర గత్వా న శోచతి ॥ 40
ఇలా బంధాలు తొలగగా సత్కర్మలవల్ల పవిత్రుడై, పుణ్యలోకాలకు చేరుతాడు. అక్కడికి వెళి పరితాపం చెందడు. (40)
పాపం కుర్వన్ పాపవృత్తః పాపస్యాంతం న గచ్ఛతి ।
తస్మాత్ పుణ్యం యతేత్ కర్తుం వర్జయూత చ పాపకమ్ ॥ 41
పాపాలు చేసేవాడికి పాపకర్మలు చేయటమే అలవాటు అవుతుంది. దానికి అంతు ఉండదు. కాబట్టి పుణ్యకర్మలు చేయటానికి ప్రయత్నించాలి. పాపపు పనులు వదలిపెట్టాలి. (41)
అనసూయుః కృతజ్ఞశ్చ కల్యాణాని చ సేవతే ।
సుఖాని ధర్మమర్థం చ స్వర్గం చ లభతే నరః ॥ 42
మానవుడు అసూయ లేకుండా కృతజ్ఞుడై మంచిపనులు చేస్తుంటే సుఖాలను, ధర్మార్థాలను, స్వర్గాన్ని పొందుతాడు. (42)
సంస్కృతస్య చ దాంతస్య నియతస్య యతాత్మనః ।
ప్రజ్ఞస్యానంతరా వృత్తిః ఇహ లోకే పరత్ర చ ॥ 43
సంస్కార సంపన్నుడు, ఇంద్రియాలను జయించిన వాడు, పవిత్రాచారపరాయణుడు, మనస్సును వశం చేసుకొన్నవాడు, బుద్ధిమంతుడు అయినవాడికి ఇహలోక పరలోక సుఖాలు కలుగుతాయి. (43)
సతాం ధర్మేన వర్తేత క్రియాం శిష్టవదాచరేత్ ।
అసంక్లేశేన లోకస్య వృత్తిం లిప్సేత వై ద్విజ ॥ 44
కాబట్టి మానవుడు సత్పురుష ధర్మాన్ని ఆచరించాలి. శిష్టులు చేసే ఉత్తమ కార్యాలను చేయాలి. లోకంలో ఏప్రాణికీ బాధ కలిగించకుండా జీవనం గడపటానికి తగిన వృత్తిని కోరాలి. (44)
స్వధర్మేణ క్రియా లోకే కర్మణః సోఽప్యసంకరః ।
సంతి హ్యాగమవిజ్ఞానాః శిష్టాః శాస్త్రే విచక్షణాః ॥ 45
లోకంలో చాలామంది వేదవేత్తలు, శాస్త్రజ్ఞానంలో నిపుణులు అయిన శిష్టులు ఉన్నారు. వారి ఉపదేశాన్ని అనుసరించి స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ధర్మసాంకర్యం లేకుండా ఉంటుంది. (45)
ప్రాజ్ఞో ధర్మేణ రమతే ధర్మం చైవోపజీవతి ।
తస్మాత్ ధర్మాదవాప్తేన ధనేన ద్విజసత్తమ ॥ 46
తస్యైవ సించతే మూలం గుణాన్ పశ్యతి తత్ర వై ।
ద్విజసత్తమా! వివేకవంతుడు ధర్మాచరణంతో ఆనందపడతాడు. ధర్మాన్ని అనుసరించే బ్రతుకు తెరువు చూసుకొంటాడు. ధర్మంతో సంపాదించిన ధనంతోనే ఆ ధర్మమూలం తడిపి పోషిస్తాడు - ధర్మాన్ని ఆచరిస్తాడు. ధర్మంలోనే సద్గుణాలను చూస్తాడు. (46 1/2)
ధర్మాత్మా భవతి హ్యేవం చిత్తం చాస్య ప్రసీదతి ॥ 47
స మిత్రజనసంతుష్టః ఇహ ప్రేత్య చ నందతి ।
ఈ విధంగా ధర్మాత్ముడవుతాడు. ఈతని మనస్సు నిర్మలంగా ఉంటుంది. మిత్రుల సాంగత్యంతో సంతృప్తుడై ఇహలోక పరలోకాల్లో ఆనందిస్తాడు. (47 1/2)
శబ్దం స్పర్శం తథా రూపం గంధానిష్టాంశ్చ సత్తమ ॥ 48
ప్రభుత్వం లభతే చాపి ధర్మస్యైతత్ ఫలం విదుః ।
అతడు ఇష్టమైన శబ్ద స్పర్శ రూప (రస) గంధాలతో అన్ని ఇంద్రియసాఖ్యాలను, అధికారాన్ని పొందుతాడు. ఇది అంతా ధర్మఫలం అనే (పెద్దలు) భావిస్తారు. (48 1/2)
ధర్మస్య చ ఫలం లబ్ధ్వా న తృప్యతి మహాద్విజ ॥ 49
అతృప్యమాణో నిర్వేదమ్ ఆపేదే జ్ఞానచక్షుషా ।
బ్రాహ్మణోత్తమా! ధర్మఫలాన్ని పొందిన పిదప సంసారసుఖంతో మాత్రమే తృప్తి పడడు. వీటిని జ్ఞాన దృష్టితో చూచి (ఇంద్రియతృప్తి మేలని అనుకొనక) నిర్వేదాన్ని - వైరాగ్యాన్ని పొందుతాడు. (49 1/2)
ప్రజ్ఞాచక్షుర్నర ఇహ దోషం నైవాసురుధ్యతే ॥ 50
విరజ్యతి యథాకామం న చ ధర్మం విముంచతి ।
ఈ లోకంలో జ్ఞానదృష్టి కల వ్యక్తి రాగ ద్వేషాదులయిన దోషాలను అనుసరించడు. ఆయనకు యథేచ్ఛగా వైరాగ్యం కలుగుతుంది. అయినా ధర్మాన్ని ఆయన ఎప్పుడూ వదలడు. (50 1/2)
సర్వత్యాగే చ యతతే దృష్ట్వా లోకం క్షయాత్మకమ్ ॥ 51
తతో మోక్షే ప్రయతతే నానుపాయాదుపాయతః ।
జగత్తు అంతా అశాశ్వతమని భావించి అన్నింటిని వదలిపెట్టటానికి ప్రయత్నం చేస్తాడు. తరువాత తగిన ఉపాయంతో మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు. అనుపాయాన్ని (ప్రారబ్ధాన్ని) అవలంబించి ఊరుకోడు. (51 1/2)
ఏవం నిర్వేదమాదత్తే పాపం కర్మ జహాతి చ ॥ 52
ధార్మికశ్చాపి భవతి మోక్షం చ లభతే పరమ్ ।
ఈ రీతిగా వైరాగ్యాన్ని పొంది పాపపు పనులు వదిలిపెడతాడు. ధర్మాత్ముడవుతాడు. తరువాత పరమ మోక్షాన్ని పొందుతాడు. (52 1/2)
తపా సాశ్రేయసం జంతోః తస్య మూలం శమో దమః ॥ 53
తేన సర్వాసవాప్నోతి కామాన్ యాన్ మనసేచ్ఛతి ।
జీవునికి మేలు కలిగించేది తపస్సు. దానికి మూలం శమం(మనోనిగ్రహం), దమం (ఇంద్రియజయం), మానవుడు మనస్సుతో కోరుకొనే వాటిని అన్నింటిని తపస్సు వల్ల పొందుతాడు. (53 1/2)
ఇంద్రియాణాం నిరోధేన సత్యేన చ దమేన చ ।
బ్రాహ్మణః పదమాప్నోతి యత్ పరం ద్విజసత్తమ ॥ 54
ఇంద్రియాలను నిగ్రహించటం, సత్యం పలకటం, మనోనిగ్రహం అనే వాటివల్ల మానవుడు పరబ్రహ్మ పదవిని పొందుతాడు. (54)
బ్రాహ్మణ ఉవాచ
ఇంద్రియాణి తు యాన్యాహుః కాని తాని యతవ్రత ।
నిగ్రహశ్చ కథం కార్యః నిగ్రహస్య చ కిం ఫలమ్ ॥ 55
బ్రాహ్మణుడు అన్నాడు (అడిగాడు) - ఉత్తమవ్రతాన్ని పాటిమ్చే వ్యాధా! వేటిని ఇంద్రియాలు అంటారు? అవి ఏవి? వాటిని నిగ్రహిమ్చటం ఎలాగ? నిగ్రహానికి ఫలం ఏమిటి? (55)
కథం చ ఫలమాప్నోతి తేషాం ధర్మభృతాం వర ।
ఏతదిచ్ఛామి తత్త్వేన ధర్మం జ్ఞాతుం నిబోధ మే ॥ 56
ధర్మాత్ములలో శ్రేష్ఠుడా! ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం వల్ల ఏ ఫలం పొందుతాడు? ఈ ఇంద్రియనిగ్రహం అనే ధర్మాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవాలి అనుకొంటున్నాను. దాన్ని నాకు తెలియజెప్పు. (56)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి బ్రాహ్మణవ్యాధసంవాదే నవాధికద్విశతతమోఽధ్యాయః ॥ 209 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున బ్రాహ్మణవ్యాధ సంవాదమను రెండువందల తొమ్మిదవ అధ్యాయము. (209)