202. రెండు వందల రెండవ అధ్యాయము
బృహదశ్వుని ద్వారా ధుంధుని వధించవలెనని ఉత్తంకుడు భావించుట.
మార్కండేయ ఉవాచ
ఇక్ష్వాకౌ సంస్థితే రాజన్ శశాదః పృథివీమిమామ్ ।
ప్రాప్తః పరమధర్మాత్మా సోఽయోధ్యాయాం నృపోఽభవత్ ॥ 1
మార్కండేయుడిలా అన్నాడు.
రాజా! ఇక్ష్వాకువు మరణించిన తర్వాత ఆయన కొడుకు శశాదుడు భూపతి అయ్యాడు. పరమధర్మాత్ముడైన ఆ రాజు అయోధ్యలో ఉండేవాడు. (1)
శశాదస్య తు దాయాదః కకుత్ స్థో నామ వీర్యవాన్ ।
అనేనాశ్చాపి కాకుత్ స్థః పృథుశ్చానేనసః సుతః ॥ 2
శశాదునకు కకుత్ స్థుడనే కొడుకు. అతడు పరాక్రమవంతుడు. అతని కొడుకు అనేనుడు. అనేనుని కొడుకు పృథువు. (2)
విష్వగశ్వః పృథోః పుత్రః తస్మాదద్రిశ్చ జజ్ఞివాన్ ।
అద్రేశ్చ యువనాశ్వస్తు శ్రావస్తస్యాత్మజోఽభవత్ ॥ 3
పృథువు కొడుకు విష్వగశ్వుడు. ఆయన కొడుకు అద్రి. అద్రికొడుకు యువనాశ్వుడు. యువనాశ్వుని కొడుకు శ్రావుడు. (3)
తస్య శ్రావస్తకో జ్ఞేయః శ్రావస్తీ యేన నిర్మితా ।
శ్రావస్తకస్య దాయాదః బృహదశ్వో మహాబలః ॥ 4
శ్రావుని కొడుకు శ్రావస్తకుడు. శ్రావస్తీపురిని నిర్మించిన దాయనయే. శ్రావస్తకుని కొడుకు బృహదశ్వుడు. ఆయన మహాబలుడు. (4)
బృహదశ్వస్య దాయాదః కువలాశ్వ ఇతి స్మృతః ।
కువలాశ్వస్య పుత్రాణాం సహస్రాణ్యేకవింశతిః ॥ 5
బృహదశ్వుని కొడుకు కువలాశ్వుడు. కువలాశ్వునకు ఇరవైయొక్కవేలమంది కొడుకులు. (5)
సర్వే విద్యాసు నిష్టాతాః బలవంతో దురాసదాః ।
కువలాశ్వశ్చ పితృతః గుణైరభ్యధికోఽభవత్ ॥ 6
వారంతా విద్యావంతులు, బలవంతులు, ఎదిరింప వీలుకానివారు. కువలాశ్వుడు సద్గుణాలతో తండ్రిని మించిన తనయుడు. (6)
సమయే తం పితా రాజ్యే బృహదశ్వోఽభ్యషేచయత్ ।
కువలాశ్వం మహారాజ శూరముత్తమధార్మికమ్ ॥ 7
మహారాజా! శూరుడు, ఉత్తమధార్మికుడు అయిన కువలాశ్వునికి ఆయన తండ్రి బృహదశ్వుడు తగిన సమయంలో రాజ్యాభిషేకం చేయించాడు. (7)
పుత్రసంక్రామితశ్రీస్తు బృహదశ్వో మహీపతిః ।
జగామ తపసే ధీమాన్ తపోవనమమిత్రహా ॥ 8
ధీమంతుడు, శత్రుసంహర్త అయిన బృహదశ్వమహారాజు కుమారునకు రాజ్యాభిషేకం జరిపించి తపస్సు చేయగోరి వనాలకు వెళ్ళాడు. (8)
అథ శుశ్రావ రాజర్షిం తముత్తంకో నరాధిప ।
వనం సంప్రస్థితం రాజన్ బృహదశ్వం ద్విజోత్తమః ॥ 9
రాజా! ద్విజోత్తముడైన ఉత్తంకుడు బృహదశ్వరాజర్షి వనానికి బయలుదేరాడని విన్నాడు. (9)
తముత్తంకో మహాతేజాః సర్వాస్త్రవిదుషాం వరమ్ ।
న్యవారయదమేయాత్మా సమాసాద్య నరోత్తమమ్ ॥ 10
విశాలమనస్కుడు, మహాతేజస్వి అయిన ఉత్తంకుడు సకలాస్త్రవేత్తలలో శ్రేష్ఠుడైన బృహదశ్వుని సమీపించి, వనగమనాన్ని ఆపి, ఇలా అన్నాడు. (10)
ఉత్తంక ఉవాచ
భవతా రక్షణం కార్యం తత్ తావత్ కర్తుమర్హసి ।
నిరుద్విగ్నా వయం రాజన్ త్వత్ర్పసాదాద్ భవేమహి ॥ 11
ఉత్తంకుడిలా అన్నాడు.
రాజా! ప్రజారక్షణ మీ కర్తవ్యం. దానినే ప్రధానంగా నిర్వహించారు. మీ అనుగ్రహం వలననే మేము నిశ్చింతగా జీవించగలం. (11)
త్వయా హి పృథివీ రాజన్ రక్ష్యమాణా మహాత్మనా ।
భవిష్యతి నిరుద్విగ్నా నారణ్యం గంతుమర్హసి ॥ 12
రాజా! మహాత్ముడవయిన నీవు కాపాడుతుంటే భూమి నిర్భయంగా మనగలుగుతుంది. నీవు అరణ్యానికి వెళ్ళదగదు. (12)
పాలనే హి మహాన్ ధర్మః ప్రజానామిహ దృశ్యతే ।
న తథా దృశ్యతేఽరణ్యే మాభూత్ తే బుద్ధిరీదృశీ ॥ 13
ప్రజాపాలనలోనే గొప్పధర్మం ఇమిడి ఉంది. అరణ్యవాసంలో అంత ధర్మం కనిపించదు. నీ బుద్ధిని అటు మరల్చవద్దు. (13)
ఈదృశో న హి రాజేంద్ర ధర్మః క్వచన దృశ్యతే ।
ప్రజానాం పాలనే యో వై పురా రాజర్షిభిః కృతః ॥ 14
ప్రాచీన రాజర్షులందరు ప్రజాపాలనయందే ధర్మాన్ని దర్శించినవారు. ఇటువంటి ధర్మం మరెక్కడా కనిపించదు. (14)
రక్షితవ్యాః ప్రజా రాజ్ఞా తాస్త్వం రక్షితుమర్హసి ।
నిరుద్విగ్నస్తపశ్చర్తుం న హి శక్నోమి పార్థివ ॥ 15
రాజునకు ప్రజాసంరక్షణమే ధర్మం. కాబట్టి నీవు ప్రజలను కాపాడాలి. రాజా! నేను ప్రశాంతంగా తపస్సు చేయలెకపోతున్నాను. (15)
మమాశ్రమసమీపే వై సమేషు మరుధన్వసు ।
సముద్రో వాలుకాపూర్ణః ఉజ్జాలక ఇతి స్మృతః ॥ 16
నా ఆశ్రమసమీపంలో పూర్తిగా మరుప్రదేశంలో ఇసుకతో నిండిన సముద్ర మొకటున్నది. ఉజ్జాలకమని దానిపేరు. (16)
బహుయోజనవిస్తీర్ణః బహుయోజనమాయతః ।
తత్ర రౌద్రో దానవేంద్రః మహావీర్యపరాక్రమః ॥ 17
మధుకైటభయోః పుత్రః ధుంధుర్నామ సుదారుణః ।
అంతర్భూమిగతో రాజన్ వసత్యమితవిక్రమః ॥ 18
అది ఎన్నో యోజనాల పొడవు వెడల్పులు గలది. అక్కడ మహాబలపరాక్రమాలు గల దానవరాజు ఒకడున్నాడు. అతని పేరు ధుంధుడు. అతడు మధుకైటభుల పుత్రుడు. (17,18)
తం నిహత్య మహారాజ వనం త్వం గంతుమర్హసి ।
శేతే లోకవినాశాయ తప ఆస్థాయ దారుణమ్ ॥ 19
త్రిదశానాం వినాశాయ లోకానాం చాపి పార్థివ ।
లోకాలనన్నింటినీ, దేవతలనూ నాశనం చేయాలని భీకరతపస్సు చేస్తున్నాడు. మహారాజా! ఆ రాక్షసుని చంపి నీవు వనవాసానికి వెళ్ళవచ్చు. (19 1/2)
అవధ్యో దైవతానాం హి దైత్యానామథ రక్షసామ్ ॥ 20
నాగానామథ యక్షాణాం గంధర్వాణాం చ సర్వశః ।
అవాప్య స వరం రాజన్ సర్వలోకపితామహాత్ ॥ 21
రాజా! సర్వలోక పితామహుని నుండి వరాన్ని పొంది ఆ రాక్షసుడు దేవతలకు, దైత్యులకు, రాక్షసులకు, నాగులకు, యక్షులకు, గంధర్వులకు కూడా చంపరాని వాడయ్యాడు. (20,21)
తం వినాశయ భద్రం తే మా తే బుద్ధిరతోఽన్యథా ।
ప్రాప్స్యసే మహతీం కీర్తిం శాశ్వతీమవ్యయాం ధ్రువామ్ ॥ 22
అతనిని చంపు. నీకు శుబం కలుగుతుంది. ఇంతకన్న మరొక ఆలోచన చేయవద్దు. దీనివలన చిరస్థాయి అయిన ఘనకీర్తిని పొందగలవు. (22)
క్రూరస్య తస్య స్వపతః వాలుకాంతర్హితస్య చ ।
సంవత్సరస్య పర్యంతే నిఃశ్వాసః సంప్రవర్తతే ॥ 23
ఇసుక క్రింద నిద్రిస్తూ క్రూరతపస్సు చేస్తున్న ఆ రాక్షసుడు సంవత్సరానికి ఒకసారి గాలి పీల్చుకొంటాడు. (23)
యదా తదా భూశ్చలతి సశైలవనకాననా ।
తస్య నిఃశ్వాసవాతేన రజ ఉద్ధూయతే మహత్ ॥ 24
ఆదిత్యపథమాశ్రిత్య సప్తాహం భూమికంపనమ్ ।
సవిస్ఫులింగం సజ్వాలం ధూమమిశ్రం సుదారుణమ్ ॥ 25
అతడు గాలి పీల్చుకొనే సమయంలో పర్వతాలతో, వనాలతో, కాననాలతో సహా భూమి కంపిస్తుంది. దుమ్ము లేస్తుంది. ఎగిసిన ఆ దుమ్ము సూర్యుని మార్గాన్ని కూడా నిరోధిస్తుంది. ఏడురోజుల వరకు భూమి కంపిస్తుంది. నిప్పురవ్వలు, మంటలు, పొగలతో మహాభయంకర పరిస్థితి ఏర్పడుతుంది. (24,25)
తేన రాజన్ న శక్నోమి తస్మిన్ స్థాతుం స్వ ఆశ్రమే ।
తం వినాశయ రాజేంద్ర లోకానాం హితకామ్యయా ॥ 26
రాజా! ఆ కారణంగా నేను అక్కడ నా ఆశ్రమంలో ఉండలేకపోతున్నాను. రాజేంద్రా! లోకహితాన్ని కోరి ఆ రాక్షసుని నాశనంచేయి. (26)
లోకాః స్వస్థా భవిష్యంతి తస్మిన్ వినిహతేఽసురే ।
త్వం హి తస్య వినాశాయ పర్యాప్త ఇతి మే మతిః ॥ 27
ఆ రాక్షసుడు నశిస్తే లోకాలు సుఖంగా ఉంటాయి. అతనిని చంపటానికి నీవే సమర్థుడవని నా అభిప్రాయం. (27)
తేజసా తవ తేజశ్చ విష్ణురాప్యాయయిష్యతి ।
విష్ణునా చ వరో దత్తః పూర్వం మమ మహీపతే ॥ 28
యస్తం మహాసురం రౌద్రం వధిష్యతి మహీపతిః ।
తేజస్తం వైష్ణవమితి ప్రవేక్ష్యతి దురాసదమ్ ॥ 29
రాజా! విష్ణుమూర్తి తన తేజస్సుతో నీ తేజస్సును వృద్ధి చేయగలడు. గతంలో విష్ణూమూర్తి "ఆ క్రూరరాక్షసుని చంపదలచిన వీరుడైన మహారాజులో నా వైష్ణవ తేజస్సు ప్రవేశిస్తుంది" అని నాకు వరమిచ్చాడు. (28,29)
తత్ తేజస్త్వం సమాధాయ రాజేంద్ర భువి దుఃసహమ్ ।
తం నిఘాదయ రాజేంద్ర దైత్యం రౌద్రపరాక్రమమ్ ॥ 30
రాజేంద్రా! నీవు ఆ దుస్సహవైష్ణవతేజాన్ని ధరించి, రౌద్రపరాక్రముడైన ఆ రాక్షసుని సంహరించు. (30)
న హి ధుంధుర్మహాతేజాః తేజసాల్పేన శక్యతే ।
నిర్దగ్ధుం పృధివీపాల స హి వర్షశతైరపి ॥ 31
రాజా! మహాతేజస్వి అయిన ఆ ధుంధువును వంధ సంవత్సరాలు పోరాడినా అల్పతేజస్సుతో సంహరించటం కష్టం. (31)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ధుంధుమారోపాఖ్యానే ద్వ్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 202 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కంఢేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున ధుంధుమారోపాఖ్యానమను రెండు వందల రెండవ అధ్యాయము. (202)