200. రెండు వందల అధ్యాయము

దానము, శ్రాద్ధము, అతిథిసత్కారము, వాక్శుద్ధి, గాయత్రీజపము - మొదలగు వాని వర్ణనము.

వైశంపాయన ఉవాచ
శ్రుత్వా స రాజా రాజర్షేః ఇంద్రద్యుమ్నస్య తత్ తదా ।
మార్కండేయాన్మహాభాగాత్ స్వర్గస్య ప్రతిపాదనమ్ ॥ 1
యుధిష్ఠిరో మహారాజః పునః పప్రచ్ఛ తం మునిమ్ ।
వైశంపాయనుడిలా అన్నాడు. మహానుభావుడైన మార్కండేయుని ద్వారా రాజర్షి అయిన ఇంద్రద్యుమ్నుడు మరల స్వర్గానికి వెళ్ళిన వృత్తాంతాన్ని విని యుధిష్ఠిరమహారాజు మార్కండేయుని మరల ఇలా అడిగాడు. (1 1/2)
కీదృశీషు హ్యవస్థాసు దత్త్వా దానం మహామునే ॥ 2
ఇంద్రలోకం త్వనుభవేత్ పురుషస్తద్ బ్రవీహి మే ।
మహర్షీ! ఎటువంటి పరిస్థితులలో దానం చేసి మనుజుడు స్వర్గసుఖాలను పొందగలుగుతాడు? ఆ విషయాన్ని నాకు వివరించండి. (2 1/2)
గార్హస్థ్యేఽప్యథవా బాల్యే యౌవనే స్థవిరేఽపి వా ।
యథా ఫలం సమశ్నాతి తథా త్వం కథయస్వ మే ॥ 3
మనుజుడు బాల్యావస్థలోకానీ, గృహస్థావస్థలో కానీ, యౌవనదశలోకానీ, వార్థక్యంలో కానీ దానం చేస్తే ఎటువంటి ఫలితాన్ని పొందగలడు? అది నాకు చెప్పు. (3)
మార్కండేయ ఉవాచ
వృథా జన్మాని చత్వారి వృథా దానాని షోడశ ।
వృథా జన్మ హ్యపుత్రస్య యే చ ధర్మబహిష్కృతాః ॥ 4
పరపాకేషు యేఽశ్నంతి ఆత్మార్థం చ పచేత్ తు యః ।
పర్యశ్నంతి వృథా యే చ తదసత్యం ప్రకీర్త్యతే ॥ 5
మార్కండేయుడిలా అన్నాడు.
జన్మలు నాలుగు విధాలుగా, దానాలు పదహారు రకాలుగా నిరర్థకాలవుతాయి. (1) పుత్రహీనుని జన్మ వ్యర్థం (2) ధర్మభ్రష్టుల జన్మవ్యర్థం (3) ఇతరుల ఇంటనే తింటూ బ్రతికేవాడి జన్మ వ్యర్థం (4) తనకోసమే వండుకుంటూ ఇతరులకు పెట్టకుండా తినే భోజనం చెడ్డది. అలా తినేవాని జన్మ వ్యర్థం. (4,5)
ఆరూఢపతితే దత్తమ్ అన్యాయోపహృతం చ యత్ ।
వ్యర్థం తు పతితే దానం బ్రాహ్మణే తస్కరే తథా ॥ 6
గురౌ చానృతికే పాపే కృతఘ్నే గ్రామయాజకే ।
వేదవిక్రయిణే దత్తం తథా వృషలయాజకే ॥ 7
బ్రహ్మబంధుషు యద్ దత్తం యద్ దత్తం వృషలీపతౌ ।
స్త్రీజనేషు చ యద్ దత్తం వ్యాలగ్రాహే తథైవ చ ॥ 8
పరిచారకేషు యద్ దత్తం వృథా దానాని షోడశ ।
(1) ఆరూఢపతితునకు (సంన్యాసం నుండి మరల సంశారి అయినవాడు) ఇచ్చిన దానం వ్యర్థం. (2) అన్యాయార్జితమైన దానిని దానం చేయటం వ్యర్థం (3) భ్రష్టబ్రాహ్మణునకో (4) దొంగబ్రాహ్మణునకో ఇచ్చిన దానం వ్యర్థం (5) గురువునకు (6) అసత్యవాదికి (7) పాపాత్మునకు (8) కృతఘ్నునకు (9) గ్రామపురోహితునకు (10) వేదవిక్రేతకు (11) శూద్రునకు వివాహాదులు చేయించేవానికి (12) నీచ బ్రాహ్మణునకు (13) ప్రౌఢస్త్రీని పెండ్లాడిన బ్రాహ్మణునకు (14) స్త్రీలకు (15) పాములవానికి (16) సేవకులకు ఇచ్చిన దానం వ్యర్థం. ఈవిధంగా పదహారు రకాల దానాలు నిరర్థకాలు. (ఇవి దానాల లెక్కలోనికి రావు.) (6, 7, 8 1/2)
వి॥సం॥ నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని కానీ, వాన ప్రస్థాన్ని కానీ స్వీకరించి మరల గార్హ్యస్ధ్యం మీది అభిలాషతో ఆ నిష్ఠను విడిచినవానికి ప్రాయశ్చిత్తమే లేదు -
ఆరూఢో నైష్ఠికం ధర్మం యస్తు ప్రచ్యవతే పునః ।
ప్రాయశ్చిత్తం న తస్యాస్తి యేన శుద్ధ్యేత్స ఆత్మహా ॥
తమోవృతస్తు యో దద్యాద్ భయాత్ క్రోధాత్ తథైవ చ ॥ 9
భుంక్తే చ దానం తత్ సర్వం గర్భస్థస్తు నరః సదా ।
దదద్ దానం ద్విజాతిభ్యః వృద్ధభావేన మానవః ॥ 10
తమోగుణానికి లోనై భయంతోనో, క్రోధంతోనో దానం చేస్తే ఆ దానఫలాన్ని (దుఃఖాన్ని) మరుజన్మలో గర్భావస్థలో అనుభవిస్తాడు. బ్రాహ్మణులకు దానంచేసినవాడు ఆ ఫలితాన్ని తాను ఎదిగిన తర్వాత ఇష్టానుసారంగా అనుభవిస్తాడు. (9,10)
తస్మాత్ సర్వాస్వవస్థాసు సర్వదానాని పార్థివ ।
దాతవ్యాని ద్విజాతిభ్యః స్వర్గమార్గజిగీషయా ॥ 11
కాబట్టి రాజా! స్వర్గమార్గాన్ని జయింపదలచినవాడు సర్వావస్థలలోనూ బ్రాహ్మణులకు సర్వదానాలను ఇవ్వాలి. (11)
యుధిష్ఠిర ఉవాచ
చాతుర్వర్ణ్యస్య సర్వస్య వర్తమానాః ప్రతిగ్రహే ।
కేన విప్రా విశేషేణ తారయంతి తరంతి చ ॥ 12
యుధిష్ఠిరుడిలా అన్నాడు. నాలుగు వర్ణాలవారి నుండి దానాలను స్వీకరిస్తున్న బ్రాహ్మణులు ఏ విశేషం కారణంగా తాము తరించి ఇతరులను తరింపజేయగలుగుతారు. (12)
మార్కండేయ ఉవాచ
జపైర్మంత్రైశ్చ హోమైశ్చ స్వాధ్యాయాధ్యయనేన చ ।
నావం వేదమయీం కృత్వా తారయంతి తరంతి చ ॥ 13
మార్కండేయుడిలా అన్నాడు. బ్రాహ్మణులు జపాలతో, మంత్రాలతో, హోమాలతో, స్వశాఖాధ్యయనాలతో వేదమయమయిన నావను తయారుచేసి తాము తరించి ఇతరులను తరింపజేస్తారు. (13)
బ్రాహ్మణాంస్తోషయేద్ యస్తు తుష్యంతే తస్య దేవతాః ।
వచనాచ్చాపి విప్రాణాం స్వర్గలోకమవాప్నుయాత్ ॥ 14
బ్రాహ్మణులను తృప్తిపరిస్తే దేవతలు తృప్తిపడతారు. విప్రులమాట చేతనే స్వర్గలోకాన్ని కూడా పొందవచ్చు. (14)
పితృదైవతపూజాభిః బ్రాహ్మణాభ్యర్చనేన చ ।
అనంతం పుణ్యలోకం తు గంతాసి త్వం న సంశయః ॥ 15
పితరులను, దేవతలను పూజించటం ద్వారా నీవు అనంతపుణ్యలోకాలను పొందగలవు. అనుమానం లేదు. (15)
శ్లేష్మాదిభిర్వ్యాప్తతనుః మ్రియమాణో విచేతనః ।
బ్రాహ్మణా ఏవ సంపూజ్యాః పుణ్యం స్వర్గమభీప్సతా ॥ 16
శ్లేష్మాదులు శరీరాన్ని ఆవరించినా, చావు ముంచుకొస్తున్ణా, చైతన్యాన్ని కోల్పోతున్నా పుణ్యస్వర్గలోకాన్ని చేరాలంటే బ్రాహ్మణులను పూజించాలి. (16)
శ్రాద్దకాలే తు యత్నేన భోక్తవ్యా హ్యజుగుప్సితాః ।
దుర్వర్ణః కునఖీ కుష్ఠీ మాయావీ కుండగోలకౌ ॥ 17
వర్జనీయాః ప్రయత్నేన కాండపృష్ఠాశ్చ దేహినః ।
జుగుప్సితం హి యచ్ర్ఛాద్ధం దహత్యగ్నిరివేంధనమ్ ॥ 18
శ్రాద్ధవేళలో ప్రయత్నించి ఉత్తమబ్రాహ్మణులనే నిమంత్రించాలి. దుష్టవర్ణం కల వానిని, పిప్పిగోళ్ళవానిని, కుష్ఠరోగిని, మాయావిని, కుండుని (మాతృవ్యభిచారం వలన పుట్టిన వానిని). గోళకుని (విధవా స్త్రీకి పుట్టినవానిని), వీపుపై అమ్ములపొది గలవానిని ప్రయత్నపూర్వకంగా పరిహరించాలి. శ్రాద్ధం దూషితమయితే అది అగ్ని ఇంధనాన్ని తగలబెట్టినట్టు యజమానిని దహిస్తుంది. (17,18)
యే యే శ్రాద్ధే న యుజ్యంతే మూకాంధబధిరాదయః ।
తేఽపి సర్వే నియోక్తవ్యాః మిశ్రితా వేదపారగైః ॥ 19
మూగవాడు, గ్రుడ్డివాడు, చెవిటివాడు మొదలయినవారు శ్రాద్ధంలో పరిహరణీయులు అయినా వేదపండితులతో కలిపి వారిని నియంత్రించవచ్చు. (19)
ప్రతిగ్రహశ్చ వై దేయః శృణు యస్య యుధిష్ఠిర ।
ప్రదాతారం తథాఽఽత్మానం తారయేద్ యః స శక్తిమాన్ ॥ 20
యుధిష్ఠిరా! దానం స్వీకరించేవాడు తనను, దాతను కూడా తరింపజేయగల శక్తిగలవాడై ఉండాలి. అటువంటివారెవరో చెపుతా విను. (20)
తస్మిన్ దేయం ద్విజే దానం సర్వాగమవిజానతా ।
ప్రదాతారం యథాఽఽత్మానం తారయేద్ యః స శక్తిమాన్ ॥ 21
సర్వశాస్త్రాలు తెలిసిన మనిషి తనను, దాతను కూడా తరింపజేయగల బ్రాహ్మణునకే దానమివ్వాలి. అతడే శక్తిమంతుడైన బ్రాహ్మణుడు. (21)
న తథా హవిషో హోమైః న పుష్పైర్నానులేపనైః ।
అగ్నయః పార్థ తుష్యంతి యథా హ్యతిథిభోజనే ॥ 22
కౌంతేయా! అతిథులకు భోజనం పెడితే అగ్నులు సంతసిస్తాయి. హవిస్సును ఆహుతి చేసినా, పూలు చల్లినా, గంధం పూసినా కూడా అగ్నులకు అంత ఆనందం కలుగదు. (22)
తస్మాత్ త్వం సర్వయత్నేన యతస్వాతిథిభోజనే ।
పాదోదకం పాదఘృతం దీపమన్నం ప్రతిశ్రయమ్ ॥ 23
ప్రయచ్ఛంతి తు యే రాజన్ నోపసర్పంతి తే యమమ్ ।
కాబట్టి నీవు సర్వప్రయత్నాలతోనూ అతిథులకు అన్నం పెట్టాలి. రాజా! అతిథులకు పాదోదకాన్ని, పాదఘృతాన్ని, దీపాన్ని, అన్నాన్ని, నివాసస్థానాన్ని ఇచ్చిన వారు యముని సమీపించరు. (23 1/2)
దేవమాల్యాపనయనం ద్విజోచ్ఛిష్టావమార్జనమ్ ॥ 24
ఆకల్పః పరిచర్యా చ గాత్రసంవాహనాని చ ।
అత్రైకైకం నృపశ్రేష్ఠ గోదానాద్ధ్యతిరిచ్యతే ॥ 25
రాజశ్రేష్ఠా! దేవనిర్మాల్యాన్ని తొలగించటం, బ్రాహ్మణుల ఎంగిళ్ళు ఎత్తి శుభ్రపరచటం, వారిని గంధమాల్యాదులతో సత్కరించటం, సేవ చేయటం, కాళ్ళు ఒత్తటం - వీటిలో ఒక్కొక్కటీ గోదానం కన్నా గొప్పవి. (24,25)
కపిలాయాః ప్రదానాత్ తు ముచ్యతే నాత్ర సంశయః ।
తస్మాదలంకృతాం దద్యాత్ కపిలాం తు ద్విజాతయే ॥ 26
కపిలగోవును దానంచేస్తే ముక్తి లభిస్తుంది. అనుమానం లేదు. కాబట్టి సాలంకృత అయిన కపిలగోవును బ్రాహ్మణునకు దానమివ్వాలి. (26)
శ్రోత్రియాయ దరిద్రాయ గృహస్థాయాగ్నిహోత్రిణే ।
పుత్రదారాభిభూతాయ తథా హ్యనుపకారిణే ॥ 27
దానంపట్టే ద్విజుడు శోత్రియుడు, దరిద్రుడు, గృహస్థుడు, నిత్యాగ్నిహోత్రి, ఆలుబిడ్డల నిరాదరణను సహించేవాడు, దాతకు ప్రత్యుపకారం చేయలేనివాడు అయిఉండాలి. (27)
ఏవంవిధేషు దాతవ్యా న సమృద్ధేషు భారత ।
కో గుణో భరతశ్రేష్ఠ సమృద్ధేష్వభివర్జితమ్ ॥ 28
భారతా! ఇటువంటి వారికి దానం చేయాలి కానీ సంపన్నులకు కాదు. ధనవంతులకు దానం చేస్తే దానివలన లాభమేముంటుంది? (28)
ఏకస్యైకా ప్రదాతవ్యా న బహూనాం కదాచన ।
సా గౌర్విక్రయమాపన్నా హన్యాత్ త్రిపురుషం కులమ్ ॥ 29
న తారయతి దాతార బ్రాహ్మణం నైవ నైవ తు ।
ఒకగోవును ఒక్కరికే దానమివ్వాలి కానీ చాలామందికి కలిపి ఇవ్వకూడదు. అందరూ పంచుకోదలచి వారు ఆ గోవును అమ్మితే దాతయొక్క మూడుతరాలకు అది హాని చేస్తుంది. దాతను కానీ, దానం పట్టిన బ్రాహ్మణుని కానీ అది తరింపజేయదు. (29 1/2)
సువర్ణస్య విశుద్ధస్య సువర్ణం యః ప్రయచ్ఛతి ॥ 30
సువర్ణానాం శతం తేన దత్తం భవతి శాశ్వతమ్ ।
ఉత్తమవర్ణం గల పవిత్రబ్రాహ్మణునకు సువర్ణదానం చేస్తే దాతకు నిరంతరంగా శతసువర్ణదానఫలం లభిస్తుంది. (30 1/2)
అనడ్ వాహం తు యో దద్యాద్ బలవంతం ధురంధరమ్ ॥ 31
స విస్త్రతి దుర్గాణి స్వర్గలోకం చ గచ్ఛతి ।
బరువులు మోయగల బలిష్ఠమైన ఎద్దును దానం చేస్తే దాత ఇబ్బందులను దాటి స్వర్గలోకానికి కూడా వెళ్ళగలుగుతాడు. (31 1/2)
వసుంధరాం తు యో దద్యాద్ ద్విజాయ విదురాత్మనే ॥ 32
దాతారం హ్యనుగచ్ఛంతి సర్వే కామాభివాంఛితాః ।
పండితుడయిన బ్రాహ్మణునకు భూదానమిస్తే దాత కోరిన భోగాలన్నీ ఆయన దరిజేరుతాయి. (32 1/2)
పృచ్ఛంతి చాత్ర దాతారం వదంతి పురుషా భువి ॥ 33
అధ్వని క్షీణగాత్రాశ్చ పాంసుపాదావగుంఠితాః ।
తేషామేవ శ్రమార్తానాం యో హ్యన్నం కథయేద్ బుధః ॥ 34
అన్నదాతృసమః సోఽపి కీర్త్యతే నాత్ర సంశయః ।
దారిలో ఒళ్ళంతా నలిగి, కాళ్ళంతా దుమ్ము కొట్టుకొని అలసిపోయి అన్నదాతకై అన్వేషించే వారికి అన్నం పెట్టే వానిని చూపించినవానికి కూడా అన్నదానఫలం లభిస్తుంది. అన్నదాతతో సమానంగా అతడూ కీర్తింపబడతాడు. (33,34 1/2)
తస్మాత్ త్వం సర్వదానాని హిత్వాన్నం సంప్రయచ్ఛ హ ॥ 35
న హీదృశం పుణ్యఫలం విచిత్రమిహ విద్యతే ।
కాబట్టి నీవు ఇతరదానాలను వదలిపెట్టి కేవలం అన్నదానం చేయి. అన్నదానం వంటి విచిత్రదానం కానీ, పుణ్యదాయకమైన దానం కానీ లేదు. (35 1/2)
యథాశక్తి చ యో దద్యాద్ అన్నం విప్రేషు సంస్కృతమ్ ॥ 36
స తేన కర్మణాఽఽప్నోతి ప్రజాపతిసలోకతామ్ ।
బ్రాహ్మణులకు చక్కగా వండిన అన్నాన్ని యథాశక్తిగా పెట్టినవాడు ఆ దానంతో బ్రహ్మలోకాన్ని చేరగల్గుతాడు. (36 1/2)
అన్నమేవ విశిష్టం హి తస్మాత్ పరతరం న చ ॥ 37
అన్నం ప్రజాపతిశ్చోక్తః స చ సంవత్సరో మతః ।
సంవత్సరస్తు యజ్ఞోఽసౌ సర్వం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ॥ 38
అన్నమే గొప్పది. దాని కన్న గొప్పది లేదు. అన్నమే బ్రహ్మ. అదియే సంవత్సరం. సంవత్సరమంటే యజ్ఞం. యజ్ఞంలో సమస్తమూ ఉంది. (37,38)
తస్మాత్ సర్వాణి భూతాని స్థావరాణి చరాణి చ ।
తస్మాదన్నం విశిష్టం హి సర్వేభ్య ఇతి విశ్రుతమ్ ॥ 39
యజ్ఞం నుండి స్థావరజంగమరూపాలయిన సమస్త ప్రాణులూ జన్మిస్తాయి. కాబట్టి అన్నమే సర్వపదార్థాలలోనూ శ్రేష్ఠమని ప్రసిద్ధి. (39)
యేషాం తటాకాని మహోదకాని
వాప్యశ్చ కూపాశ్చ ప్రతిశ్రయాశ్చ ।
అన్నస్య దానం మధురా చ వాణీ
యమస్య తే నిర్వచనా భవంతి ॥ 40
పెద్దపెద్ద చెరువులను, బావులను, దిగుడు బావులను త్రవ్వించినవారిని, అన్నదానం చేసినవారిని, మంచిగా మాటాడేవారు యమధర్మరాజు పేరు కూడా విననక్కరలేదు. (40)
ధాన్యం శ్రమేణార్జితవిత్తసంచితం
విప్రే సుశీలేచ ప్రయచ్ఛతే యః ।
వసుంధరా తస్య భవేత్ సుతుష్టా
ధారాం వసూనాం ప్రతిముంచతీవ ॥ 41
ధాన్యాన్ని, కష్టపడి సంపాదించిన ధనాన్ని సత్స్యభావం గల విప్రునకు దానం చేసిన వానిని చూచి భూదేవి ఆనందిస్తుంది. అతనికై ధనధారలను కురిపిస్తుంది. (41)
అన్నదాః ప్రథమం యాంతి సత్యవాక్ తదనంతరమ్ ।
అయాచితప్రదాతా చ సమం యాంతి త్రయో జనాః ॥ 42
అన్నదాత ముందుగా, ఆపై సత్యవాది, ఆ తరువాత అడగకపోయినా దానం చేసేవాడు - ఈ ముగ్గురు పుణ్యాత్ములతో సమంగా స్వర్గలోకానికి వెళతారు. (42)
వైశంపాయన ఉవాచ
కౌతూహలసముత్పన్నః పర్యపృచ్ఛద్ యుధిష్ఠిరః ।
మార్కండేయం మహాత్మానం పునరేవ సహానుజః ॥ 43
వైశంపాయనుడిలా అన్నాడు.
యుధిష్ఠిరుడు కుతూహలంతో తమ్ములతో కలిసి మహాత్ముడైన మార్కండేయుని మరలా ఇలా అడిగాడు. (43)
యమలోకస్య చాధ్వానమ్ అంతరం మానుషస్య చ ।
కీదృశం కింప్రమాణం వా కథం వా తన్మహామునే ।
తరంతి పురుషాశ్చైవ కేనోపాయేన శంస మే ॥ 44
మహర్షీ! మానవలోకం నుండి యమలోకానికి ఎంత దూరం? ఆ దారి ఎటువంటిది? ఎంతది? ఏ ఉపాయంతో మనుష్యులు ఆ మార్గం దాటుతారు? నాకు చెప్పండి. (44)
మార్కండేయ ఉవాచ
సర్వగుహ్యతమం ప్రశ్నం పవిత్రమృషిసంస్తుతమ్ ।
కథయిష్యామి తే రాజన్ ధర్మ్యం ధర్మభృతాం వర ॥ 45
మార్కండేయుడిలా అన్నాడు. ధార్మికశ్రేష్ఠా! రాజా! నీవడిగిన ప్రశ్న అతిరహస్యం, పవిత్రం, ధర్మసమ్మతం, మహర్షులు ప్రశంసించే దీనిని వివరిస్తాను. విను. (45)
షడశీతిసహస్రాణి యోజనానాం నరాధిప ।
యమలోకస్య చాధ్వానమ్ అంతరం మానుషస్య చ ॥ 46
రాజా! మానవలోకం నుండి యమలోకం ఎనభైయారువేల యోజనాల దూరంలో ఉన్నది. (46)
ఆకాశం తదపానీయం ఘోరం కాంతారదర్శనమ్ ।
న తత్ర వృక్షచ్ఛాయా వా పానీయం కేతనాని చ ॥ 47
విశ్రమేద్ యత్ర వై శ్రాంతః పురుషోఽధ్వని కర్శితః ।
ఆ దారిలో నీరులేని ఆకాశం మాత్రమే ఉంటుంది. అది భయంకరమైనది, దుర్గమం కూడా. ప్రమాణంలో అలసిపోయిన వారు మార్గమధ్యంలో విశ్రమించటానికి చెట్లనీడ కానీ నీరు కానీ, నిలయం కానీ అక్కడ దొరకవు. (47 1/2)
నీయతే యమదూతైస్తు యమస్యాజ్ఞాకరైర్బలాత్ ॥ 48
నరాః స్త్రియస్తథైవాన్యే పృథివ్యాం జీవసంజ్ఞితాః ।
యమధర్మరాజు ఆదేశం మేరకు యమదూతలు పురుషులను, స్త్రీలను, లోకంలోని ఇతరజీవులను బలవంతంగా ఆ దారిన కొనిపోతారు. (48 1/2)
బ్రాహ్మణేభ్యః ప్రదానాని నానారూపాణి పార్థివ ॥ 49
హయాదీనాం ప్రకృష్టాని తేఽధ్యానం యాంతి వై నరాః ।
సన్నివార్యాతపం యాంతి ఛత్రేణైవ హి ఛత్రదాః ॥ 50
రాజా! బ్రాహ్మణులకు వివిధజాతులకు చెందిన గుర్రాలు మొదలగు వానిని దానంచేసినవారు ఆ బాటలో ఆ వాహనాలపై వెళతారు. గొడుగులు దానం చేసినవారు ఆ గొడుగులతోనే ఎండను కాచుకొంటూ వెళతారు. (49,50)
తృప్తాశ్చైవాన్నదాతారః హ్యతృప్తాశ్చాప్యనన్నదాః ।
వస్త్రిణో వస్త్రదా యాంతి అవస్త్రా యాంత్యవస్త్రదాః ॥ 51
అన్నదాతలు తృప్తిగా వెళతారు. అన్నదానం చేయనివారు తృప్తి లేకుండా వెళతారు. వస్త్రదాతలు వస్త్రాలతో, వస్త్రదానం చేయనివారు వస్త్రాలు లేకుండా వెళతారు. (51)
హిరణ్యదాః సుఖం యాంతి పురుషాస్త్వభ్యలంకృతాః ।
భూమిదాస్తు సుఖం యాంతి సర్వైః కామైః సుతర్పితాః ॥ 52
స్వర్ణదానం చేసినావారు చక్కని అలంకారాలతో వెళతారు. భూదానం చేసినవారు సర్వకామాలతో తృప్తిచెందుతూ సుఖంగా వెళతారు. (52)
యాంతి చైవాపరిక్లిష్టా నరాః సస్యప్రదాయకాః ।
నరాః సుఖతరం యాంతి విమానేషు గృహప్రదాః ॥ 53
సస్యదానం చేసినవారు ఏ కష్టాలు లేకుండా వెళతారు. గృహదానం చేసినవారు విమానాలలో మరీ సుఖంగా వెళతారు. (53)
పానీయదా హ్యతృషితాః ప్రహృష్టమనసో నరాః ।
పంథానం ద్యోతయంతశ్చ యాంతి దీపప్రదాః సుఖమ్ ॥ 54
జలదానం చేసినవారు దప్పికలేకుండా ప్రసన్నమనస్కులై వెళతారు. దీపదానం చేసినవారు ఆ బాటను ప్రకాశింపజేస్తూ సుఖంగా వెళతారు. (54)
గోప్రదాస్తు సుఖం యాంతి నిర్ముక్తాః సర్వపాతకైః ।
విమానైర్హంససంయుక్తైః యాంతి మాసోపవాసినః ॥ 55
గోదానం చేసినవారు సర్వపాపవిముక్తులై సుఖంగా వెళతారు. నెలంతా ఉపవాసం చేసినవారు హంసలు మోసే విమానంలో వెళతారు. (55)
తథా బర్హిప్రయుక్తైశ్చ షష్ఠరాత్రోపవాసినః ।
త్రిరాత్రం క్షపతే యస్తు ఏకభుక్తేన పాండవ ॥ 56
అంతరా చైవ నాశ్నాతి తస్య లోకా హ్యనామయాః ।
ఆరు రోజులు ఉపవాసం చేసినవారు నెమళ్ళు మోసే విమానంలో వెళతారు. పాండవా! ఏకభుక్తంతో మధ్యలో ఏమీ తినకుండా మూడురాత్రులు గడిపినవాడు అనామయలోకాలకు వెళతాడు. (56 1/2)
పానీయస్య గుణా దివ్యాః ప్రేతలోకసుఖావహాః ॥ 57
తత్ర పుష్పోదకా నామ నదీ తేషాం విధీయతే ।
శీతలం సలిలం తత్ర పిబంతి హ్యమృతోపమమ్ ॥ 58
జలదానఫలితం దివ్యమైనది. ప్రేతలోకంలో సుఖాన్ని కల్గించగలది. జలదానం చేసినవారికై పుష్పోదక అనే నది అక్కడ ఉంటుంది. అమృతోపమమైన చల్లని నీటిని అక్కడ వారు త్రాగుతారు . (57,58)
యే చ దుష్కృతకర్మాణః పూయం తేషాం విధీయతే ।
ఏవం నదీ మహారాజ సర్వకామప్రదా హి సా ॥ 59
మహారాజా! చెడ్డపనులు చేసినవారికి ఆ నదీజలం మలినంగా ఉంటుంది. ఈ రీతిగా ఆ నది అన్ని కోరికలూ తీరుస్తుంది. (59)
తస్మాత్ త్వమపి రాజేంద్ర పూజయైనాన్ యథావిధి ।
అధ్వని క్షీణగాత్రశ్చ పథి పాంసుసమన్వితః ॥ 60
పృచ్ఛతే హ్యన్నదాతారం గృహమాయాతి చాశయా ।
తం పూజయాథ యత్నేన సోఽతిథిర్ర్బాహ్మణశ్చ సః ॥ 61
కాబట్టి రాజేంద్రా! నీవు కూడా ఇటువంటి బ్రాహ్మణులను యథావిధిగా పూజించు. మార్గంలో ఒళ్ళుహూనమై, దుమ్ముకొట్టుకొని, అన్నదాతకోసమై అన్వేషిస్తూ ఆశగా ఇంటికి వచ్చినవానిని ఆదరపూర్వకంగా పూజించు. అతడు అతిథి. అందువలననే బ్రాహ్మణుడు (బ్రాహ్మణసమానుడు) (60,61)
తం యాంతమనుగచ్ఛంతి దేవాః సర్వే సవాసవాః ।
తస్మిన్ సంపూజితే ప్రీతాః నిరాశా యాంత్యపూజితే ॥ 62
అటువంటి అతిథి వెళ్ళిన ఇంటికి, ఇంద్రునితో సహా దేవతలందరూ వెళతారు. అతనిని పూజిస్తే వారంతా ఆనందిస్తారు. నిరాకరిస్తే వారంతా నిరాశతో వెళతారు. (62)
తస్మాత్ త్వమపి రాజేంద్ర పూజ్యయైనం యథావిధి ।
ఏతత్ శతశః ప్రోక్తం కిం భూయః శ్రోతుమిచ్ఛసి ॥ 63
కాబట్టి రాజేంద్రా! అటువంటి అతిథిని నీవు కూడా యథావిధిగా పూజించు. నీకీ విషయాన్ని వందలసార్లు చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకొంటున్నావు. (63)
యుధిష్ఠిర ఉవాచ
పునః పునరహం శ్రోతుం కథాం ధర్మసమాశ్రయామ్ ।
పుణ్యామిచ్ఛామి ధర్మజ్ఞ కథ్యమానాం త్వయా విభో ॥ 64
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ధర్మజ్ఞా! స్వామీ! తమరు వివరించే పుణ్యప్రదమైన ధర్మచర్చను వినాలని నాకు ఇంకా ఇంకా అనిపిస్తోంది. (64)
మార్కండేయ ఉవాచ
ధర్మాంతరం ప్రతి కథాం కథ్యమానాం మయా నృప ।
సర్వపాపహరాం నిత్యం శృణుష్వావహితో మమ ॥ 65
మార్కండేయుడిలా అన్నాడు. రాజా! నేను ధర్మసంబద్ధమైన విషయాలను ఇంకా చెప్తాను. అవి ఎల్లప్పుడూ సర్వపాపాలను హరింపగలవి. సావధానుడవై విను. (65)
కపిలాయాం తు దత్తాయాం యత్ ఫలం జ్యేష్ఠపుష్కరే ।
తత్ ఫలం భరతశ్రేష్ఠ విప్రాణాం పాదధావనే ॥ 66
భరతశ్రేష్ఠా! జ్యేష్ఠపుష్కరతీర్థంలో కపిలగోవును దానం చేస్తే వచ్చే ఫలితం బ్రాహ్మణుల కాళ్ళు కడగటం వలన కూడా వస్తుంది. (66)
ద్విజపాదోదకక్లిన్నా యావత్ తిష్ఠతి మేదినీ ।
తావత్ పుష్కరపర్ణేన పిబంతి పితరో జలమ్ ॥ 67
బ్రాహ్మణుల పాదోదకంతో భూమితడిసి ఉన్నంతకాలం పితృదేవతలు తామరాకులతో నీటిని త్రాగుతారు. (67)
స్వాగతేనాగ్నయస్తృప్తా ఆసనేన శతక్రతుః ।
పితరః పాదశౌచేన అన్నాద్యేన ప్రజాపతిః ॥ 68
బ్రాహ్మణుని స్వాగతిస్తే అగ్ని తృప్తిపడతాడు. ఆసనమిస్తే ఇంద్రుడు తృప్తిపడతాడు. కాళ్ళు కడిగితే పితరులు, భోజనం పెడితే ప్రజాపతి తృప్తిపడతారు. (68)
యావద్ వత్సస్య వై పాదౌ శిరశ్చైవ ప్రదృశ్యతే ।
తస్మిన్ కాలే ప్రదాతవ్యా ప్రయత్నేనాంతరాత్మనా ॥ 69
ఆవు ఈనే సమయంలో దూడకాళ్ళు, తలమాత్రమే కనిపిస్తున్న వేళలో పవిత్రభావంతో ప్రయత్నపూర్వకంగా ఆ ఆవును దానమివ్వాలి. (69)
అంతరిక్షగతో వత్సః యావద్ యోన్యాం ప్రదృశ్యతే ।
తావద్ గౌః పృథివీ జ్ఞేయా యావద్ గర్భం న ముంచతి ॥ 70
ఆవు గర్భం నుండి బయటపడుతున్న దూడ ఆకాశంలోనే కనిపిస్తున్నంతసేపు, ఆవు ఈనటం పూర్తికానంతవరకు ఆ ఆవు భూదేవితో సమానం. (70)
యావంతి తస్యా రోమాణి వత్సస్య చ యుధిష్ఠిర ।
తావద్ యుగసహస్రాణి స్వర్గలోకే మహీయతే ॥ 71
ధర్మరాజా! అటువంటి ఆవును దానంచేస్తే ఆ ఆవు రోమాలు, ఆ దూడ రోమాలు ఎన్ని ఉంటాయో అన్నివేల యుగాలు ఆ దాత స్వర్గంలో నిలుస్తాడు. (71)
సువర్ణనాసాం యః కృత్వా సుఖురాం కృష్ణధేనుకామ్ ।
తిలైః ప్రచ్ఛాదితాం దద్యాత్ సర్వరత్నైరలంకృతామ్ ॥ 72
ప్రతిగ్రహం గృహీత్వా యః పునర్దదతి సాధవే ।
ఫలానాం ఫలమశ్నాతి తదా దత్త్వా చ భారత ॥ 73
బంగారునాసిక, వెండిగిట్టలు కూర్చి, సర్వరత్నాలతో అలంకరించి, నువ్వులతో ఆచ్చాదించి, కపిలగోవును దానం చేసినవాడు, ఆ దానాన్ని స్వీకరించి మరల మరొక సత్పురుషునకు దానం చేసినవాడు సర్వోన్నతఫలితాలను అనుభవిస్తారు. (72,73)
ససముద్రగుహా తేన సశైలవనకాననా ।
చతురంతా భవేద్ దత్తా పృథివీ నాత్ర సంశయః ॥ 74
అటువంటి గోవును దానంచేసినవాడు సముద్రాలు, గుహలు, పర్వతాలు, అడవులు, తోటలతో సహా నాల్గుదిక్కుల మధ్యనున్న భూమిని దానం చేసినట్లే. సందేహం లేదు. (74)
అంతర్జానుశయో యస్తు భుంక్తే సంసక్తభాజనః ।
యో ద్విజః శబ్దరహితం స క్షమస్తారణాయ వై ॥ 75
చేతులను మోకాళ్ళ లోపలనే ఉంచి, ఒకచేతినే కంచానికి తగిలిస్తూ మౌనంగా భోజనం చేసేవాడు తనను ఇతరులను కూడ తరింపజేయగలడు. (75)
అపానపా న గదితాః తథాన్యే యే ద్విజాతయః ।
జపంతి సంహితాం సమ్యక్ తే నిత్యం తారణక్షమాః ॥ 76
సురాపానం చేయనివాడు, ఇతరులు వ్రేలెత్తి చూపుట కవకాశమివ్వనివాడు, నిత్యమూ సంహితాపాఠాన్ని చక్కగా జపిమ్చేవాడు ఇతరులనెప్పుడూ తరింపజేయగలడు. (76)
హవ్యం కవ్యం చ యత్ కించిత్ సర్వం తచ్ర్ఛోత్రియోఽర్హతి ।
దత్తం హి శ్రోత్రియే సాధౌ జ్వలితేఽగ్నౌ యథా హుతమ్ ॥ 77
హవ్యకవ్యాల (యజ్ఞ శ్రాద్ధాల) లోని సమస్తపదార్థాలను స్వీకరించటానికి శ్రోత్రియుడు అర్హుడు. సచ్ర్ఛోత్రియున కర్పించినది జ్వలించే అగ్నికి ఆహుతిచేసిన దానితో సమానం. చక్కగా ఫలిస్తుంది. (77)
మన్యుప్రహరణా విప్రా న విప్రాః శస్త్రయోధినః ।
నిహన్యుర్మన్యునా విప్రాః వజ్రపాణిరివాసురాన్ ॥ 78
బ్రాహ్మణులకు క్రోధమే ఆయుధం. వారు శస్త్రాలతో యుద్ధం చేయరు. దేవేంద్రుడు వజ్రంతో రాక్షసులను సంహరించినట్లు బ్రాహ్మణులు క్రోధంతోనే దోషిని నశింపజేయగలరు. (78)
ధర్మాశ్రితేయం తు కథా కథితేయం తవానఘ ।
యాం శ్రుత్వా మునయః ప్రీతాః నైమిషారణ్యవాసినః ॥ 79
అనఘా! ధర్మయుక్తమయిన విషయమంతా నీకు చెప్పాను. ఇది విని నైమిశారణ్యవాసులయిన మునులు ఆనందించారు. (79)
వీతశోకభయక్రోధాః విపాప్మానస్తథైవ చ ।
శ్రుత్వేమాం తు కథాం రాజన్ న భవంతీహ మానవాః ॥ 80
రాజా! ఈ కథను విని మానవులు శోకభయాల నుండి, క్రోధాల నుండి బయటపడి పాపవిముక్తులై మోక్షాన్ని పొందుతారు. (80)
యుధిష్ఠిర ఉవాచ
కిం తచ్ఛౌచం భవేద్ యేన విప్రః శుద్ధః సదా భవేత్ ।
తదిచ్ఛామి మహాప్రాజ్ఞ శ్రోతుం ధర్మభృతాం వర ॥ 81
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ధార్మికశ్రేష్ఠా! మహాజ్ణానీ! బ్రాహ్మణుని సదా పవిత్రుని చేయగల శౌచం ఏది? వినాలనుకొంటున్నాను. (81)
మార్కండేయ ఉవాచ
వాక్ శౌచం కర్మశౌచం చ యచ్చ శౌచం జలాత్మకమ్ ।
త్రిభిః శౌచైరుపేతో యః స స్వర్గీ నాత్ర సంశయః ॥ 82
మార్కండేయుడిలా అన్నాడు. వాక్కులలో శౌచం, కర్మలలో శౌచం, జలశౌచం - ఈ మూడు శౌచాలు గల విప్రుడు స్వర్గాన్ని పొందగలడు. సందేహం లేదు. (82)
సాయం ప్రాతశ్చ సంధ్యాం యో బ్రాహ్మణోఽభ్యుపసేవతే ।
ప్రజపన్ పావనీం దేవీం గాయత్రీం వేదమాతరమ్ ॥ 83
స తయా పావితో దేవ్యా బ్రాహ్మణో నష్టకిల్బిషః ।
న సీదేత్ ప్రతిగృహ్ణానః మహీమపి ససాగరామ్ ॥ 84
ఉదయమూ, సాయంకాలమూ కూడా వేదమాత, పవిత్రదేవి అయిన గాయిత్రిని జపిస్తూ సంధ్యావందనమాచరించిన బ్రాహ్మణుడు ఆ దేవిచే పవిత్రీకృతుడై పాపాలను పోగొట్టుకొంటాడు. అటువంటివాడు సాగరపర్యంతమైన భూమిని దానం పట్టినా కష్టాలపాలు కాడు. (83,84)
యే చాస్య దారుణాః కేచిద్ గ్రహాః సూర్యాదయో దివి ।
తే చాస్య సౌమ్యా జాయంతే శివాః శివతరాః సదా ॥ 85
అటువంటివానికి సుర్యాదిగ్రహాలలో ఏవైనా ప్రతికూలంగా ఉన్నా కూడా అవి సౌమ్యంగా, సుఖకరంగా, శుభకరంగా మారుతాయి. (85)
సర్వే నానుగతం చైనం దారుణాః పిశితాశనాః ।
ఘోరరూపా మహాకాయాః ధర్షయంతి ద్విజోత్తమమ్ ॥ 86
భీకరులు, మాంసభక్షకులు, ఘోరరూపులు, మహాకాయులు అయిన రాక్షసులు కూడా గాయత్రీ జపపరాయణుడైన బ్రాహ్మణునిపై పడలేరు. (86)
నాధ్యాపనాద్ యాజనాద్ వా అన్యస్మాద్ వా ప్రతిగ్రహాత్ ।
దోషో భవతి విప్రాణాం జ్వలితాగ్నిసమా ద్విజాః ॥ 87
సంధ్యోపాసనచేసే ద్విజులు మండే అగ్నివంటివారు. వారు అధ్యాపన చేసినా, యాగాలు చేయించినా, పరుల నుండి దానాలు స్వీకరించినా దోషం లేదు. (87)
దుర్వేదా వా సువేదా వా ప్రాకృతాః సంస్కృతాస్తథా ।
బ్రాహ్మణా నావమంతవ్యాః భస్మచ్ఛన్నా ఇవాగ్నయః ॥ 88
బ్రాహ్మణులు వేదాన్ని బాగా చదివినా, చదవకపోయినా, సంస్కారవంతులయినా, సంస్కారహీనులయినా వారిని పరాభవించరాదు. వారు నివురుకప్పిన నిప్పువంటి వారు. (88)
యథా శ్మశానే దీప్తౌజాః పావకో నైవ దుష్యతి ।
ఏవం విద్వానవిద్వాన్ వా బ్రాహ్మణో దైవతరం మహత్ ॥ 89
జ్వలించే అగ్ని శ్మశానంలో అయినా దోషరహితమయినట్లు బ్రాహ్మణుడు పండితుడయినా, అపండితుడయినా గొప్పదేవతతో సమానం. (89)
ప్రాకారైశ్చ పురద్వారైః ప్రాసాదైశ్చ పృథగ్విధైః ।
నగరాణి న శోభంతే హీనాని బ్రాహ్మణోత్తమైః ॥ 90
గొప్పప్రాకారాలు, పురద్వారాలు, వివిధభవనాలూ ఉన్నా బ్రాహ్మణోత్తములు లేని నగరాలు శోభించవు. (90)
వేదాఢ్యా వృత్తసంపన్నాః జ్ఞానవంతస్తపస్వినః ।
యత్ర తిష్ఠంతి వై విప్రాః తన్నామ నగరం నృప ॥ 91
రాజా! వేదవేత్తలు, సదాచారులు, జ్ఞానులు, తపస్వులు అయిన బ్రాహ్మణులు ఎక్కడుంటే అదే నగరం. (91)
వ్రజే వాప్యథవారణ్యే యత్ర సంతి బహుశ్రుతాః ।
తత్ తన్నగరమిత్యాహుః పార్థ తీర్థం చ తద్ భవేత్ ॥ 92
కౌంతేయా! అది పల్లె అయినా, అరణ్యమయినా బహువేదవేత్తలయిన బ్రాహ్మణులుంటే అదే నగరం, అదే తీర్థం. (92)
రక్షితారం చ రాజానం బ్రాహ్మణం చ తపస్వినమ్ ।
అభిగమ్యాబిపూజ్యాథ సద్యః పాపాత్ ప్రముచ్యతే ॥ 93
రక్షకుడైన రాజును, తపస్వి అయిన బ్రాహ్మణుని సమీపించి, అర్చించినవాడు వెంటనే పాపాలనుండి విముక్తినందుతాడు. (93)
పుణ్యతీర్థాభిషేకం చ పవిత్రానాం చ కీర్తనమ్ ।
సద్భిః సంభాషణం చైవ ప్రశస్తం కీర్త్యతే బుధైః ॥ 94
పుణ్యతీర్థాలలో స్నానం చేయటం, పవిత్రమంత్రాలను పఠించటం, సజ్జనులతో సంభాషించటం - ఇవి సత్కర్మలని పండితులంటారు. (94)
సాధుసంగమపూతేన వాక్సుభాషితవారిణా ।
పవిత్రీకృతమాత్మానం సంతో మన్యంతి నిత్యశః ॥ 95
సజ్జనసమాగమం చేత పవిత్రమయిన వాక్కులతో పలికిన సుభాషితమనే జలంతో తాము పవిత్రులయినట్లు సజ్జనులు ఎప్పుడూ భావిస్తుంటారు. (95)
త్రిదండధారణం మౌనం జటాభారోఽథ ముండనమ్ ।
వల్కలాజినసంవేష్టం వ్రతచర్యాభిషేచనమ్ ॥ 96
అగ్నిహోత్రం వనే వాసః శరీరపరిశోషణమ్ ।
సర్వాణ్యేతాని మిథ్యాః స్యుః యది భావో న నిర్మలః ॥ 97
త్రిదండధారణం, మౌనం, జటాభారం, శిరోముండనం, వల్కలాజినధారణం, వ్రతాచరణం, పవిత్రస్నానం, అగ్నిహోత్రం, వనవాసం, శరీరాన్ని శుష్కింపజేయటం - మనస్సు నిర్మలంగా లేకపోతే ఇవ్వనీ దండగ. (96,97)
న దుష్కరమనాశిత్వం సుకరం హ్యశనం వినా ।
విశుద్ధిం చక్షురాదీనాం షణ్ణామింద్రియగామినామ్ ॥ 98
వికారి తేషాం రాజేంద్ర సుదుష్కరకరం మనః ।
కన్ను మొదలయిన ఆరు ఇంద్రియాల విషయాలను వాటిలో శుద్ధి లేకపోయినా అనుభవించటం తేలికే. వాటిని విడిచిపెట్టడం మాత్రం శుద్ధిలేనిదే జరగదు. అది దుష్కరం. ఇంద్రియములను స్వేచ్ఛగా ప్రవర్తింపజేసే మనస్సును వశపరచుకోవటం కూడా దుస్సాధ్యం. (98 1/2)
వి॥సం॥ ఇంద్రియ విషయాలను విషయశుద్ధి లేకపోయినా అనుభవించటం తేలికే. భోగం విషయశుద్ధిని కోరదు. వారాంగనల దగ్గర కూడా భోగం దొరుకుతుంది. కానీ అనుభవాలను పరిత్యజించటంకానీ, అమృతత్వాన్ని పొందటం కానీ అంత తేలిక కాదు. అది విషయశుద్ధి లేకపోతే సాధ్యంకాదు. (నీల)
యే పాపాని న కుర్వంతి మనోవాక్కర్మబుద్ధిభిః ।
తే తపంతి మహాత్మానః న శరీరస్య శోషణమ్ ॥ 99
మనోవాక్కర్మలచేత పాపాలు చేయనివారే మహాత్ములు, వారే తపస్వులు. అంతేకానీ శరీరాన్ని శుష్కింపజేయటం తపస్సు కాదు. (99)
న జ్ఞాతిభ్యో దయా యస్య శుక్లదేహోఽవికల్మషః ।
హింసా సా తపసస్తస్య నానాశిత్వం తపః స్మృతమ్ ॥ 100
శరీరాన్ని పవిత్రీకరించుకొని, పాపకర్మలు మానినా దాయాదులపై దయలేకపోతే ఆ క్రూరతత్వం అతని తపస్సును నాశనం చేస్తుంది. భోజనం మానటమే తపస్సు కాదు. (100)
తిష్ఠన్ గృహే చైవ మునిః నిత్యం శుచిరలంకృతః ।
యావజ్జీవం దయావాంశ్చ సర్వపాపైః ప్రముచ్యతే ॥ 101
ఎప్పుడూ ఇంటిలోనే ఉన్నా, పవిత్రభావంతో, సద్గుణాలతో, యావజ్జీవమూ భూతదయతో ఉంటే అతడే ముని. పాపవిముక్తి కూడా అతనికే కలుగుతుంది. (101)
న హి పాపాని కర్మాణి శుద్ధ్యంత్యనశనాదిభిః ।
సీదత్యనశనాదేవ మాంసశోనితలేపనః ॥ 102
భోజనం మానినంతమాత్రాన పాపప్రక్షాళనం జరుగదు. భోజనం మానితే రక్తమాంసాలు గల శరీరం మాత్రమే క్షీణిస్తుంది. (102)
అజ్ఞాతం కర్మ కృత్వా చ క్లేశో నాన్యత్ ప్రహీయతే ।
నాగ్నిర్దహతి కర్మాణి భావశూన్యస్య దేహినః ॥ 103
శాస్త్రవిహితం కాని కర్మలను ఆచరించటం వలన క్లేశమే కానీ పాపం నశించదు. అగ్నిహోత్రాదులు కూడా శ్రద్ధలేనివాని పాపములను దహింపజేయలేవు. (103)
పుణ్యాదేవ ప్రవ్రజంతి శుద్ధ్యంత్యనశనాని చ ।
న మూలఫలభక్షిత్వాన్న మౌనాన్నానిలాశనాత్ ॥ 104
శిరసో ముండనాద్ వాపి న స్థానకుటికాసనాత్ ।
న జటాధారణాద్ వాపి న తు స్థండిలశయ్యయా ॥ 105
నిత్యం హ్యనశనాద్ వాపి నాగ్నిశుశ్రూషణాదపి ।
న చోదకప్రవేశేన న చ క్ష్మాశయనాదపి ॥ 106
పుణ్యం వలననే ఉత్తమగతులు పొందగలరు. ఉపవాసాలు కూడా పవిత్రభావనతోనే శుద్ధి కారణాలు అవుతాయి. కందమూలఫలాలు తిన్నంతమాత్రాన, మౌనాన్ని పూనినంత మాత్రాన, గాలిని ఆహారంగా తీసికొనినంతమాత్రాన, సన్యాసం స్వీకరించినంతమాత్రాన, ఇల్లువిడిచి వెళ్ళినంత మాత్రాన, జడలు ధరించినంతమాత్రాన, వ్రతం కోసం నేలపై పరుండినంతమాత్రాన, రోజూ ఉపవాసమున్నంతమాత్రాన, నిత్యాగ్నిహోత్రం చేసినంతమాత్రాన, గంగాది తీర్థములలో దేహత్యాగం చేసినంతమాత్రాన, నేలపైనే పండుకొన్నంతమాత్రాన, పవిత్రత కలుగదు. (104-106)
జ్ఞానేన కర్మణా వాపి జరామరణమేవ చ ।
వ్యాధయశ్చ ప్రహీయంతే ప్రాప్యతే చోత్తమం పదమ్ ॥ 107
తత్త్వజ్ఞానం వలన కానీ, సత్కర్మలవలన కానీ జరామరణాలు, వ్యాధులు నశిస్తాయి. ఉత్తమగతులు సిద్ధిస్తాయి. (107)
బీజాని హ్యగ్నిదగ్ధాని న రోహంతి పునర్యథా ।
జ్ఞానదగ్ధైస్తథా క్లేశైః నాత్మా సంయుజ్యతే పునః ॥ 108
నిప్పులో కాలిన గింజలు మొలకెత్తనట్లు జ్ఞానదగ్ధాలైన కర్మలు మరలా ఆత్మను అంటవు. (108)
ఆత్మనా విప్రహీణాని కాష్ఠకుడ్యోపమాని చ ।
వినశ్యంతి న సందేహః ఫేనానీవ మహార్ణవే ॥ 109
ఆత్మ విడిచిన తర్వాత శరీరం కట్టె, గోడలవంటిది. మహాసాగరంలో పుట్టిన నురగలాగా నశించిపోతుంది. సందేహం లేదు. (109)
వి॥సం॥ నిరాత్మక దృశ్యాలన్నీ జడాలు. రజ్జుసర్పం వంటివి. కాబట్టి దృశ్యవిషయమంతా మిథ్యయే. దృశ్యమంతా నశిమ్చేదే. కాబట్టి విషయాదులు, అహంకారం సాక్షి భాస్యాలు కాబ్బటి ఘటాదులవలె నశించెడివే. (నీల).
ఆత్మానం విందతే యేన సర్వభూతగుహాశయమ్ ।
శ్లోకేన యది వార్ధేన క్షీణం తస్య ప్రయోజనమ్ ॥ 110
శ్లోకంతో కానీ, శ్లోకార్ధంతో కానీ సమస్తప్రాణుల హృదయాలలో శయనించి ఉన్న పరమాత్మను తెలిసినవానికి సర్వశాస్త్రాధ్యయన ప్రయోజనం పూర్తి అయినట్లే. (110)
ద్వ్యక్షరాదభిసంధాయ కేచిచ్ఛ్లోకపదాంకితైః ।
శతైరన్యైః సహస్రైశ్చ ప్రత్యయో మోక్షలక్షణమ్ ॥ 111
కొందరు 'తత్త్వమ్' అన్న రెండక్షరాలతోనే పరమాత్మజ్ఞానాన్ని పొందుతారు. మరికొందరు పదాలతో, శ్లోకాలతో గూడిన వందలు వేలు శాస్త్రాంతరాలు చదివి పరమాత్మను గ్రహిస్తారు. ఏది ఏమైనా జ్ఞానమే మోక్షలక్షణం. (111)
నాయం లోకోఽస్తి న పరః న సుఖం సంశయాత్మనః ।
ఊచుర్ జ్ఞానవిదో వృద్ధాః ప్రత్యయో మోక్షలక్షణమ్ ॥ 112
సంశయగ్రస్తునకు ఇహపరలోకాలూ రెండూ ఉండదని జ్ఞానులయిన పెద్దలు చెపుతుంటారు. జ్ఞానమే మోక్షలక్షణమని పెద్దలమాట. (112)
విదితార్థస్తు వేదానాం పరివేద ప్రయోజనమ్ ।
ఉద్విజేత్ స తు వేదేభ్యః దావాగ్నేరివ మానవః ॥ 113
వేదార్థం గ్రహించి వేదాలప్రయోజనాన్ని చక్కగా తెలిసినవాడు దావాగ్నిని చూసి మానవుడు దూరంగా పోయినట్లు వేదాలనుండి దూరంగా వెళతాడు. (113)
శుష్కం తర్కం పరిత్యజ్య ఆశ్రయస్వ శ్రుతిం స్మృతిమ్ ।
ఏకాక్షరాభిసంబద్ధం తత్త్వం హేతుభిరిచ్ఛసి ।
బుద్ధిర్న తస్య సిద్ధ్యేత సాధనస్య విపర్యయాత్ ॥ 114
ప్రణవస్వరూపుడయిన పరమాత్మతత్తాన్ని యుక్తిపూర్వకంగా తెలిసికొనాలంటే శుష్కతర్కాన్ని వీడి శ్రుతి, స్మృతులను ఆశ్రయించాలి. వాటిని ఆశ్రయించకపోయినా, సాధనసంపత్తి లేకపోయినా తత్త్వనిర్ణయం కుదరదు. (114)
వి॥సం॥ ప్రపంచః సత్యః అబాధ్యత్వాత్, ఆత్మవత్. ప్రపంచః అసత్యః బాధ్యత్వాత్ శుక్తిరజతవత్ - ఇటివంటిది శుష్కతర్కం.
'నేహనానాస్తి కించన' ఇదిశ్రుతివచనం. అజ్ఞానప్రభవాలోకా
వేదాశ్చాజ్ఞానసంభవాః । విదితాత్మసతత్త్వస్య నేహనానాస్తి కించన ॥ ఇది స్మృతి వచనం. ఇటువంటి శ్రుతిస్మృతివచనాలను ఆశ్రయించాలి. 'నైషా తర్కేణ మతిరాపనేయా' 'నావేద విన్మనుతే తం బృహంతం' ఇటువంటి శ్రుతి వచనాలననుసరించి అద్వితీయమూ, అక్షరమూ, అభివ్యాపకమూ, త్రివిధభేదశూన్యమూ అయిన తత్త్వాన్ని గ్రహించాలి. (నీల)
వేదపూర్వం వేదితవ్యం ప్రయత్నాత్
తద్ వై వేదస్తస్య వేదః శరీరమ్ ।
వేదస్తత్త్వం తత్సమాసోపలబ్ధౌ
క్లీబస్త్వాత్మా తత్ స వేద్యస్య వేద్యమ్ ॥ 115
పరమాత్మతత్త్వజ్ఞానాన్ని వేదాలద్వారానే గ్రహించాలి. పరమాత్మ వేదస్వరూపుడు. వేదం ఆయన శరీరం. పరమాత్మను పొందించటంలో వేదమే హేతువు. పరమాత్మ వేదవేద్యం కాబట్టి జీవాత్మ స్వయంగా దానిని గ్రహించలేడు. (115)
వి॥సం॥ చక్షుస్సన్నిహితం కుంభం యథాసూర్యోఽవ భాసయేత్ ॥
స్వప్రకాశం చిదాత్మానం వృత్తిరాత్మాంతరం వినా ।
భాసయేద్భాస్కరమివ చక్షుః సూర్యాంతరం వినా ।
వృత్తివ్యాప్తిమపేక్ష్యైవ వేద్యత్యం ప్రాహురాత్మనః ।
చిదంతరానపేక్ష్యత్వాత్ అవేద్యత్వం తథాగమాః ॥ అని ఆగమవచనం. (నీల)
వేదోక్తమాయుర్దేవానామ్ ఆశిషశ్చైవ కర్మణామ్ ।
ఫలత్యనుయుగం లోకే ప్రభావశ్చ శరీరిణామ్ ॥ 116
దేవతల ఆయుస్సు, కర్మలఫలితం మొదలయిన విషయాలను వేదాలు నిర్దేశిస్తాయి. వాటిననుసరించియే జీవుల ప్రభావం ప్రతియుగంలోనూ ఫలిస్తుంటుంది. (116)
ఇంద్రియాణాం ప్రసాదేన తదేతత్ పరివర్జయేత్ ।
తస్మాదనశనం దివ్యం నిరుద్ధేంద్రియగోచరమ్ ॥ 117
కాబట్టి మనిషి ఇంద్రియాలశుద్ధి ద్వారా విషయభోగాలను పరిత్యజించాలి. ఇంద్రియనిరోధం వలన ఏర్పడిన భోగరాహిత్యం దివ్యమైనది. (117)
తపసా స్వర్గగమనం భోగో దానేన జాయతే ।
జ్ఞానేన మోక్షో విజ్ఞేయః తీర్థస్నానాదఘక్షయః ॥ 118
తపస్సుచే స్వర్గప్రాప్తి, దానంచేత భోగం, జ్ఞానం ద్వారా మోక్షం, తీర్థస్నానంతో పాపనాశనమూ కలుగుతాయి. (118)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు రాజేంద్ర ప్రత్యువాచ మహాయశాః ।
భగవన్ శ్రోతుమిచ్ఛామి ప్రధానవిధిముత్తమమ్ ॥ 119
వైశంపాయనుడిలా అన్నాడు.
రాజేంద్రా! మార్కండేయుడు ఆ రీతిగా చెప్పగానే మహాయశస్వి అయిన యుధిష్ఠిరుడు "స్వామీ! దానం చేయటంలో ఉత్తమమూ, ప్రధానమూ అయిన విధి ఏమిటో తెలియగోరుతున్నాను" అన్నాడు. (119)
మార్కండేయ ఉవాచ
యత్ త్వమిచ్ఛసి రాజేంద్ర దానధర్మం యుధిష్ఠిర ।
ఇష్టం చేదం సదా మహ్యం రాజన్ గౌరవతస్తథా ॥ 120
మార్కండేయుడిలా అన్నాడు.
రాజేంద్రా! యుధిష్ఠిరా! దానధర్మాన్ని గురించి నీవు వినగోరుతున్నావు. అది గౌరవాస్పదం కాబట్టి నాకు కూడా ఇష్టమయిన విషయమే. (120)
శృణు దానరహస్యాని శ్రుతిస్మృత్యుదితాని చ ।
ఛాయాయాం కరిణః శ్రాద్ధం తత్ కర్ణపరివీజితే ।
దశకల్పాయుతానీహ న క్షీయేత యుధిష్ఠిర ॥ 121
యుధిష్ఠిరా! శ్రుతిస్మృతులు వివరించిన దానరహస్యాలను విను. గజచ్ఛాయాపర్వదినాన, రావి ఆకుల గాలితగిలే తావున పెట్టిన శ్రాద్ధం లక్షకల్పాల వరకు నశించదు. (121)
వి॥ అమావాస్యా, గురువారం కలిసిన రోజు రావిచెట్టు నీడను గజచ్ఛాయాపర్వమంటారు.
జీవనాయ సమాక్లిన్నం వసు దత్త్వా మహీయతే ।
వైశ్యం తు వాసయేద్ యస్తు సర్వయజ్ఞైః స ఇష్టవాన్ ॥ 22
తాను జీవించటానికి వండుకొన్న అన్నం దానం ఇస్తే స్వర్గలోకానికి వెళతాడు. ఆశ్రయాన్ని వెతుకుతున్నవానికి వాసస్థానాన్ని ఇస్తే సర్వయజ్ఞాలు చేసిన ఫలం సిద్ధిస్తుంది. (122)
ప్రతిస్రోతశ్చిత్రవాహాః పర్జన్యోఽన్నానుసంచరన్ ।
మహాధురి యథా నావా మహాపాపైః ప్రముచ్యతే ॥ 123
విప్లవే విప్రదత్తాని దధిమస్త్వక్షయాణి చ ।
ప్రతిస్రోతం (పూర్వదిక్కుకు ప్రవహిస్తున్న ప్రవాహం వెనుదిరిగి పశ్చిమంగా ప్రవహిస్తే అది ప్రతిస్రోతం)లో ఉత్తమాశ్వాలను దానం చేస్తే అది అక్షయపుణ్యప్రద మవుతుంది. అన్నానికై తిరుగుతున్న అతిథిరూపుడైన ఇంద్రుని భోజనంతో తృప్తిపరిస్తే అది కూడా అక్షయపుణ్యప్రద మవుతుంది. గ్రహణసమయంలో నదీ ప్రవాహం దగ్గర పెరుగు మొదలగుపదార్థాల దానం అక్షయపుణ్యప్రద మవుతుంది. మహాప్రవాహంలో స్నానం చేయటం కూడా నావ తరింపజేసినట్లు పాపాల నుండి విముక్తిని కలిగిస్తుంది. (123 1/2)
పర్వసు ద్విగుణం దానమ్ ఋతౌ దశగుణం భవేత్ ॥ 124
ఆయనే విషువే చైవ షడశీతిముఖేషు చ ।
చంద్రసూర్యోపరాగే చ దత్తమక్షయముచ్యతే ॥ 125
పర్వకాలంలో చేసిన దానం రెండురెట్లు, ఋతుప్రారంభ కాలంలో చేసినదానం పదిరెట్లు పుణ్యప్రదమవుతుంది. ఆయనకాలంలో, తులామేష సంక్రాంతులలో, మిథునకన్యాధనుర్మీన సంక్రాంతులలో చంద్రసూర్య గ్రహణకాలాల్లో చేసిన దానం అక్షయమవుతుంది. (124,125)
ఋతుషు దశగుణం వదంతి దత్తం
శతగుణమృత్వయనాదిషు ధ్రువమ్ ।
భవతి సహస్రగుణం దినస్య రాహోః
విషువతి చాక్షయమశ్నుతే ఫలమ్ ॥ 126
ఋతుప్రారంభవేళలో ఇచ్చినదానం పదిరెట్లు, అయనారంభవేళలో ఇచ్చినదానం వందరెట్లు, గ్రహణవేళలో ఇచ్చినదానం వేయిరెట్లు, విషువద్వేళలో ఇచ్చిన దానం అక్షయంగా పుణ్యాన్ని ఇస్తాయి. (126)
నాభూమిదో భూమిమశ్నాతి రాజన్
నాయానదో యానమారుహ్య యాతి ।
యాన్ యాన్ కామాన్ బ్ర్రాహ్మణేభ్యో దదాతి
తాంస్తాన్ కామాన్ జాయమానః స భుంక్తే ॥ 127
రాజా! భూదానం చేయకుండా భూమిని పొందలేడు. వాహనదానం చేయనివాడు వాహనాన్ని పొందలేడు. బ్రాహ్మణులకు ఏయే పదార్థాలు దానం చేస్తాడో అవన్నీ మరుసటి జన్మలో పొందగలగుతాడు. (127)
అగ్నేరపత్యం ప్రథమం సువర్ణం
భూర్వైష్ణవీ సూర్యసుతాశ్చ గావః ।
లోకాస్త్రయస్తేన భవంతి దత్తా
యః కాంచనం గాశ్చ మహీం చ దద్యాత్ ॥ 128
అగ్ని తొలిసంతానం బంగారం. భూమి విష్ణుపత్ని. ఆవులు సూర్యునిపుత్రికలు. కాబట్టి బంగారాన్ని, భూమిని, ఆవులను దానం చేసినవాడు మూడులోకాలనూ దానం చేసినట్లే. (128)
పరం హి దానాన్న బభూవ శాశ్వతం
భవ్యం త్రిలోకే భవతే కుతః పునః ।
తస్మాత్ ప్రధానం పరమం హి దానం
వదంతి లోకేషు విశిష్టబుద్ధయః ॥ 129
దానంకన్నా గొప్పదైన శాశ్వతపుణ్యం ఇంతకుముందు లేదు. ఇప్పుడూ లేదు. కాబట్టి బుద్ధిమంతులు దానాన్ని సర్వోత్కృష్టకర్మగా చెపుతుంటారు. (129)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి దానమాహత్మ్యే ద్విశతతమోఽధ్యాయః ॥ 200 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున దానమాహాత్మ్యమను రెండువందలవ అధ్యాయము. (200)