198. నూట తొంబది ఎనిమిదవ అధ్యాయము

నారదుడు శిబి మాహాత్మ్యమును చెప్పుట.

వైశంపాయన ఉవాచ
భూయ ఏవ మహాభాగ్యం కథ్యతామిత్యబ్రవీత్
పాండవో మార్కండేయమ్ । అథాచష్ట
మార్కండేయః । అష్టకస్య వైశ్యామిత్రేరశ్వమేధే సర్వే
రాజానః ప్రాగచ్ఛన్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
క్షత్రియుల మాహాత్మ్యాన్ని ఇంకా చెప్పండి అని ధర్మరాజు మార్కండేయుని అడిగాడు. మార్కండేయుడిలా చెప్పాడు. విశ్వామిత్రుని కుమారుడైన అష్టకుడు అశ్వమేధయాగం చేస్తుంటే రాజులందరూ వచ్చారు. (1)
భ్రాతరశ్చాస్య ప్రతర్దనో వసుమనాః శిబిరౌశీనర ఇతి ।
స చ సమాస్తయజ్ఞో భ్రాతృభిః సహ రథేన ప్రాయాత్ ।
తే చ నారదమాగచ్ఛంతమభివాద్యారోహతు భవాన్ రథమిత్యబ్రువన్ ॥ 2
ప్రతర్దనుడు, వసుమనుడు, ఉశీనరనందనుడు శిబి, అష్టకుని సోదరులు, యాగం ముగిసిన తర్వాత అష్టకుని రథంపై బయలుదేరాడు. వారు అప్పుడు నారదుని రాకను గమనించి "రథాన్ని ఎక్కండి" అని నారదునితో అన్నారు. (2)
తాంస్తథేత్యుక్త్వా రథమారురోహ । అథ తేషామేకః
సురర్షిం నారదమబ్రవీత్ । ప్రసాద్య
భగవంతం కించిదిచ్ఛేయం ప్రష్టుమితి ॥ 3
'అలాగే' అని వారితో అని నారదుడు రథమెక్కాడు. అప్పుడు వారిలో ఒకడు నారదునితో ఇలా అన్నాడు. "స్వామీ! మిమ్ములను ప్రసన్నులను చేసికొని కొద్దిగా అడగాలనుకొంటున్నాను. (3)
పృచ్ఛేత్యబ్రవీదృషిః సోఽబ్రవీదాయుష్మంతః
సర్వగుణప్రముదితాః । అథాయుష్మంతం స్వర్గస్థానం
చతుర్భిర్యాతవ్యం స్యాత్ కోఽవతరేత్ ।
అయమష్టకోఽవతరేదిత్యబ్రవీదృషిః ॥ 4
'అడుగు' అన్నాడు నారదుడు. అతడిలా అన్నాడు "స్వామీ! మేము దీర్ఘాయుష్కులము, సర్వగుణసంపన్నులము. ప్రసన్నులమైన మేము నలుగురము స్వర్గానికి వెళ్ళదలచాము. అయితే అక్కడ నుండి ఎవరు ముందుగా తిరిగి రావలసి ఉంటుంది"? అష్టకుడు ముందు వెనుదిరుగుతాడు. అని నారదుడన్నాడు. (4)
కిం కారణమిత్యపృచ్ఛత్ । అథాచష్టాష్టకస్య
గృహే మయా ఉషితం స మాం
రథేనానుప్రావహదథాపశ్యమనేకాని గోసహస్రాణి
వర్ణశో వివిక్తాని తమహమపృచ్ఛం
కస్యేమా గావ ఇతి సోఽబ్రవీత్ । మయా నిసృష్టా
ఇత్యేతాస్తేనైవ స్వయం శ్లాఘతి కథితేన ।
ఏషోఽవతరే దథ త్రిభిర్యాతవ్యం
సాంప్రతం కోఽవతరేత్ ॥ 5
"ఎందుకని?" అడిగాడు. నారదుడిలా అన్నాడు - "నేనొకప్పుడు అష్టకుని ఇంటిలో ఉన్నాను. ఒకసారి నన్ను రథంపై ఎక్కించుకొని తిరుగుతున్నాడు అష్టకుడు. అప్పుడు వివిధ వర్ణాలతో ఉన్న వేలవేలగోవులను నేను చూచాను. "ఎవరివీ గోవు? లని అతనినడిగాను. "ఇవన్నీ నేను దానం చెసినవే" అన్నాడు అష్టకుడు. "తాను చేసిన దానాన్ని తానే చెప్పుకొన్నాడు". "అష్టకుడు మరలాడు. సరే మిగిలిన ముగ్గురులో ఎవరు ముందు రావలసి ఉంటుంది" అని మరల అడిగాడు. (5)
ప్రతర్దన ఇత్యబ్రవీదృషిః । తత్ర కిం కారణం
ప్రతర్దనస్యాపి గృహే మయోషితం స మాం
రథేనానుప్రవాహత్ ॥ 6
అథైనం బ్రాహ్మణోఽభిక్షేతాశ్వం మే దదాతు
భవాన్ నివృత్తో దాస్యామీత్యబ్రవీద్
బ్రాహ్మణం త్వరితమేవ దీయతామిత్యబ్రవీద్
బ్రాహ్మణస్త్వరితమేవ స
బ్రాహ్మణస్యైవముక్త్వా దక్షిణ పార్శ్వమదదత్ ॥ 7
"ప్రతర్దనుడు" అని నారదుడు బదులిచ్చాడు. "కారణం"? వారు అడిగారు. "నారదుడు ఇలా అన్నాడు - "నేను ఒకప్పుడు ప్రతర్దనుని ఇంటనున్నాను. ప్రతర్దనుడు నన్ను రథంపై త్రిప్పుతున్నాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి "నాకు ఒక గుర్రాన్ని ఇవ్వండి" అని యాచించాడు. ప్రతర్దనుని. "మరలి వచ్చి ఇస్తాను" అన్నాడు ప్రతర్దనుడు. "వెంటనే ఇవ్వండి" అన్నాడు బ్రాహ్మణుడు. "సరే" అంటూ రథానికి దక్షిణం వైపు ఉన్న గుర్రాన్ని విడిపించి బ్రాహ్మణునకిచ్చాడు. (6,7)
అథాన్యోఽప్యశ్వార్థీ బ్రాహ్మణ ఆగచ్ఛత్ । తథైవ
చైనముక్త్వా వామపార్ ష్ణిమభ్యదాదథ
ప్రాయాత్ పునరపి చాన్యోఽప్యశ్వార్థీ బ్రాహ్మణ
ఆగచ్ఛత్ త్వరితోఽథ తస్మై అపనహ్యం
వామం ధుర్యమదదత్ ॥ 8
ఆపై గుర్రాన్ని యాచిస్తూ మరొకబ్రాహ్మణుడు వచ్చాడు. ఇంతకుముందువలె రథానికి ఎడమవైపునున్న గుర్రాన్ని విప్పి బ్రాహ్మణున కిచ్చాడు. తదుపరి గుర్రాన్ని యాచిస్తూ మరొక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన కూడా వెంటనే కావాలన్నాడు. ప్రతర్దనుడు ఎడమవైపు భారాన్ని మోస్తున్న గుర్రాన్ని విప్పి ఇచ్చాడు. (8)
అథ ప్రాయాత్ పునరన్య ఆగచ్ఛదశ్వార్థీ
బ్రాహ్మణస్తమబ్రవీదతియాతో దాస్యామి
త్వరితమేవ మే దీయతామిత్యబ్రవీద్
బ్రాహ్మణస్తస్మై దత్త్వాశ్వం రథధురం గృహ్ణతా
వ్యాహృతం బ్రాహ్మణానాం సాంప్రతం నాస్తి కించిదితి ॥ 9
ఆయన వెళ్లిపోయాడు. మరల ఇంకొక బ్రాహ్మణుడు గుర్రానికై యాచించాడు. "త్వరగా గమ్యాన్ని చేరిన తర్వాత ఇస్తాను" అన్నాడు ప్రతర్దనుడు. వెంటనే కావాలన్నాడు బ్రాహ్మణుడు. వెంటనే ఆ బ్రాహ్మణునకు నాలుగవ గుర్రాన్ని ఇచ్చి రథభారాన్ని తానుమోస్తూ "బ్రాహ్మణులకు యుక్తాయుక్త వివేకం ఉండదు" అన్నాడు. (9)
య ఏష దదాతి చాసూయతి చ తేన వ్యాహృతేన
తథావతరేత్ । అథ ద్వాభ్యాం
యాతవ్యమితి కోఽవతరేత్ ॥ 10
బ్రాహ్మణులకు దానం చేసివారికై కోపగించాడు. ఆ విధంగా మాటాడాడు. కాబట్టి ముందుగా వెనుదిరిగవలసి ఉంటుంది." "మేమిద్దరమే మిగిలి ఉంటే మాలో ఎవరు ముందుగా మరలిరావాలి" అని అడిగారు వారు. (10)
వసుమనా అవతరేదిత్యబ్రవీదృషిః ॥ 11
"వసుమనుడు రావలసి ఉంటుంది" అన్నాడు నారదుడు. (11)
కిం కారణమిత్యపృచ్ఛదథాచష్ట నారదః ।
అహం పరిభ్రమన్ వసుమనసో
గృహముపస్థితః ॥ 12
"కారణమేమిటి?" వారు అడిగారు. అప్పుడు నారదుడిలా అన్నాడు. నేను లోకసంచారం చేస్తూ వసుమనుని ఇంటికి వచ్చాను. (12)
స్వస్తివచనమాసీత్ పుష్పరథస్య ప్రయోజనేన
తమహమన్వగచ్ఛం స్వస్తివాచితేషు
బ్రాహ్మణేషు రథో బ్రాహ్మణానాం దర్శితః ॥ 13
ఆ రోజు అక్కడ స్వస్తివాచనం జరుగుతోంది. పుష్పరథం కోసం నేను అక్కడకు వెళ్ళాను. బ్రాహ్మణులు స్వస్తివచనం ముగించగానే వారికి పుష్పరథాన్ని చూపించారు. (13)
తమహం రథం ప్రాశంసమథ రాజాబ్రవీద్ భగవతా
రథః ప్రశస్తః ఏష భగవతో రథ ఇతి ॥ 14
నేను ఆ రథాన్ని ప్రశంసించాను. "దీనిని ప్రశంసించారు కాబట్టి ఈ రథం మీదే" అన్నాడు రాజు. (14)
అథ కదాచిత్ పునరప్యహముపస్థితః పునరేవ
చ రథప్రయోజనమాసీత్ । సమ్యగయమేష
భగవత ఇత్యేవం రాజాబ్రవీదితి పునరేవ
తృతీయం స్వస్తివాచనం సమభావయమథ
రాజా బ్రాహ్మణానాం దర్శయన్
మామభిప్రేక్ష్యాబ్రవీత్ । అథో భగవతా పుష్పరథస్య
స్వస్తివాచనాని సుష్ఠు సంభావితాని ఏతేన
ద్రోహవచనేనావతరేత్ ॥ 15
నేను మరొకసారి ఆయన దగ్గరకు వెళ్ళాను. అప్పుడు కూడా పుష్పరథం కోసం వెళ్ళాను. "స్వామీ! ఈ రథంమీదే" అని రాజు ఆదరంతో చెప్పాడు. నేను మరల మూడవసారి వెళ్ళి స్వస్తివచనాన్ని చక్కగా జరిపించాను. రాజు రథాన్ని బ్రాహ్మణులకు చూపిస్తూ నన్ను చూచి "మీరు స్వస్తివాచనాన్ని చక్కగా జరిపించారు" అన్నాడు. (కానీ రథాన్ని ఇవ్వలేదు). ఈ ద్రోహవచనం కారణంగా వసుమనుడే దిగవలసి వస్తుంది. (15)
అథైకేన యాతవ్యం స్యాత్ కోఽవతరేత్
పునర్నారద ఆహ
శిబిర్యాయాదహమవతరేయమత్ర కిం
నాస్మి యతో బ్రాహ్మణః కశ్చిదేనమబ్రవీత్ ॥ 16
శిబే అన్నార్థ్యస్మీతి తమబ్రవీచ్ఛిబిః కిం
క్రియతామాజ్ఞాపయతు భవానితి ॥ 17
"మీ ఇద్దరిలో ఒక్కరే వెళ్ళవలసివస్తే ఎవరు దిగాలి" అని మరల అడిగారు. నారదుడు ఇలా అన్నాడు.
"శిబి వెళతాడు. నేను దిగిపోతాను" అన్నాడు నారదుడు. వారు కారణమడగగా నారదుడు ఇలా చెప్పాడు. నేను శిబితో సమానుడను కాను. ఒకసారి ఒక బ్రాహ్మణుడు అన్నార్థియై శిబి దగ్గరకు వచ్చాడు. "అన్నం కావాలి" అన్నాడు. "ఏం చేయాలో ఆదేశించండి" అన్నాడు శిబి. (16,17)
అథైనం బ్రాహ్మణోఽబ్రవీద్ య ఏష తే పుత్రో బృహద్గర్భో నామ ఏష ప్రమాతవ్య ఇతి
తమేనం సంస్కురు అన్నం చోపపాదయ తతోఽ
హం ప్రతీక్ష్య ఇతి । తతః పుత్రం ప్రమాథ్య
సంస్కృత్య విధినా సాధయిత్వా
పాత్ర్యామర్పయిత్వా శిరసా ప్రతిగృహ్య
బ్రాహ్మణమమృగయత్ ॥ 18
బ్రాహ్మణుడిలా అన్నాడు. "నీ కుమారుని బృహద్గర్భుని చంపు. వానిని వండుము. నాకోసం నిరీక్షించు." అప్పుడు శిబి కుమారుని చంపి, సంస్కారం జరిపించి, వంట చేయించి, పాత్రలలో పెట్టించి, వాటిని తలపై పెట్టుకొని బ్రాహ్మణునికై వెదికాడు. (18)
అథాస్య మృగయమాణస్య కశ్చిదాచష్ట ఏష
తే బ్రాహ్మణో నగరం ప్రవిశ్య దహతి తే
గృహం కోశాగారమాయుధాగారం స్త్ర్యగారమశ్వశాలాం
హస్తిశాలాం చ క్రుద్ధ ఇతి ॥ 19
రాజు అలా వెదుకుతుంటే ఎవరో "ఆ బ్రాహ్మణుడు కోపంతో నగరంలో ప్రవేశించి రాజగృహాన్ని, కోశాగారాన్నీ, ఆయుధాగారాన్నీ, అంతఃపురాన్నీ, అశ్వశాలను, గజశాలను తగులబెడుతున్నా" డని చెప్పారు. (19)
అథ శిబిస్తథైవావికృతముఖవర్ణో నగరం ప్రవిశ్య
బ్రాహ్మణం తమ బ్రవీత్ సిద్ధం
భగవన్నన్నమితి బ్రాహ్మణో న కించిద్ వ్యాజహార
విస్మయాదధోముఖశ్చాసీత్ ॥ 20
అది విని కూడా శిబిముఖంలో ఏ మార్పూలేకుండా నగరంలోనికి ప్రవేశించి 'స్వామీ! అన్నం సిద్ధమైంది" అని బ్రాహ్మణునితో అన్నాడు.
బ్రాహ్మణుడు ఏమీ పలుకలేదు. ఆశ్చర్యంతో తలవాల్చి నిలిచాడు. (20)
తతః ప్రాసాదయద్ బ్రాహ్మణం భగవన్ భుజ్యతామితి ।
ముహూర్తాదుద్వీక్ష్య శిబిమబ్రవీత్ ॥ 21
"స్వామీ! భుజించండి" అని బ్రాహ్మణుని బ్రతిమిలాడాడు రాజు. రెండు క్షణాల తరువాత పైకి చూచి బ్రాహ్మణుడు శిబితో ఇలా అన్నాడు. (21)
త్వమేవైతదశానేతి తత్రాహ తథేతి శిబిస్తథైవావిమనా
మహిత్వా కపాలమభ్యుద్దార్య భోక్తుమైచ్ఛత్ ॥ 22
"నీవే దీనిని తిను" శిబి 'అలాగే' అని మనస్సులో ఏమీ పెట్టుకోకుండా ఆయనను అర్చించి గిన్నె తీసుకొని భుజింపనారంభించాడు. (22)
అథాస్య బ్రాహ్మణో హస్తమగృహ్ణాత్ । అబ్రవీచ్చైనం
జితక్రోధోఽసి న తే
కించిదపరిత్యాజ్యం బ్రాహ్మణార్థే బ్రాహ్మణోఽపి
తం మహాభాగం సభాజయత్ ॥ 23
అప్పుడు బ్రాహ్మణుడు ఆయన చేయి పట్టుకొన్నాడు. ఇలా అన్నాడు. "నీవు కోపాన్ని జయించావు. బ్రాహ్మణులకివ్వరానిదంటూ నీ దగ్గర ఏదీలేదు" అలా అంటూ శిబిని ఆదరించాడు. (23)
స హ్యుద్వీక్షమాణః పుత్రమపశ్యదగ్రే తిష్ఠంతం దేవకుమారమివ
పుణ్యగంధాన్వితమలంకృతం సర్వం చ తమర్థం
విధాయ బ్రాహ్మణోఽంతరధీయత ॥ 24
రాజు అలా తలపైకెత్తగానే కుమారుడెదురుగా నిలిచి, కనిపించాడు. దేవకుమారునివలె పుణ్యగంధాలతో, ఆభరణాలతో అలంకరింపబడి ఉన్నాడు. బ్రాహ్మణుడు సమస్తాన్నీ యథాపూర్వకంగా చేసి మాయమయ్యాడు. (24)
తస్య రాజర్షేర్విధాతా తేనైవ వేషేణ
పరీక్షార్థమాగత ఇతి తస్మిన్నంతర్హితే అమాత్యా
రాజానమూచుః । కిం ప్రేప్సునా బవతా ఇదమేవం
జానతా కృతమితి ॥ 25
రాజును పరీక్షించటానికై బ్రహ్మయే బ్రాహ్మణరూపాన్ని ధరించి వచ్చాడు. బ్రాహ్మణుడు అదృశ్యం కాగానే "తెలిసి తెలిసి ఇంత సాహసమెందుకు చేశా"రని మంత్రులు శిబిని అడిగారు. (25)
శిబిరువాచ
నైవాహమేతద్ యశసే దదాని
న చార్థహేతోర్న చ భోగతృష్ణయా ।
పాఫైరనాసేవిత ఏష మార్గ
ఇత్యేవమేతత్ సకలం కరోమి ॥ 26
శిబి ఇలా అన్నాడు.
నేను కీర్తికోసం కానీ, సంపదకోసం కానీ, భోగాశతో కానీ దానాలనివ్వటం లేదు. పాపాత్ములు ఈ బాటలో నడవలేరు. అందుకనే ఇదంతా చేస్తున్నాను. (26)
సద్భిః సదాధ్యాసితం తు ప్రశస్తం
తస్మాత్ ప్రశస్తం శ్రయతే మతిర్మే ।
ఏతన్మహాభాగ్యవరం శిబేస్తు
తస్మాదహం వేద యథావదేతత్ ॥ 27
సత్పురుషులు నిత్యమూ నడిచేదే ఉత్తమమార్గం. కాబట్టి నా బుద్ధి సన్మార్గాన్నే అనుసరిస్తుంది.
ఇది శిబి వంశీయుల గొప్పతనం. అందుకే యథాతథంగా ఎరిగి అనుసరిస్తున్నాను. (27)
వి॥సం॥ దానం చేసి పొగడుకొనేవాడు. దానం చేసి అసూయ పడేవాడు, యాచకుని భావాన్ని ఇంగితాలతో గ్రహించి కూడా ధనమివ్వక స్తుతులతో గౌరవించేవాడు, బ్రాహ్మణుడు యాచిస్తే శ్రద్ధాసహనాలతో ఇవ్వరాని దానిని కూడా ఇచ్చేవాడు, చేయకూడని పనిని కూడా చేసేవాడు - వీరు ఉత్తరోత్తరశ్రేష్ఠులు (నీల)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి రాజన్యమహాభాగ్యే శిబిచరితే అష్టనవత్యధికశతతమోఽధ్యాయః ॥ 198 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమస్యాపర్వమను ఉపపర్వమున శిబిచరితమను నూట తొంబది యెనిమిదవ అధ్యాయము. (198)