195. నూట తొంబది అయిదవ అధ్యాయము

యయాతి గోదానము చేయుట.

మార్కండేయ ఉవాచ
ఇదమన్యచ్ర్ఛూయతాం యయాతిర్నాహుషో రాజా
రాజ్యస్థః పౌరజనావృత ఆసాంచక్రే
గుర్వర్థీ బ్రాహ్మణ ఉపేత్యాబ్రవీద్ భో రాజన్
గుర్వర్థం భిక్షేయం సమయాదితి ॥ 1
మారండేయుడిలా అన్నాడు.
క్షత్రియమాహాత్మ్యాన్ని తెలిపే మరొకకథ చెపుతాను వినండి. యయాతి అనే రాజుండేవాడు. ఒకనాడు పురజనులు చుట్టిఉండగా సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. గురుదక్షిణ కోసం ఒకబ్రాహ్మణుడు అక్కడకు వచ్చి "రాజా! గురుదక్షిణకై యాచిస్తున్నాను. కానీ ముందు నాకు మాట ఇవ్వాలి" అన్నాడు. (1)
రాజోవాచ
బ్రవీతు భగవాన్ సమయమితి ॥ 2
రాజు ఇలా అన్నాడు.
స్వామీ! ఆ నియమ మేమిటో చెప్పండి. (2)
బ్రాహ్మణ ఉవాచ
విద్వేషణం పరమం జీవలోకే
కుర్యాన్నరః పార్థివ యాచ్యమానః ।
తం త్వాం పృచ్ఛామి కథం తు రాజన్
దద్యాద్ భవాన్ దయితం చ మేఽద్య ॥ 3
బ్రాహ్మణుడిలా అన్నాడు.
రాజా! లోకంలో ఎవరైనా యాచించేవారిని ద్వేషిస్తారు. కాబట్టి రాజా! మీరు నాకు నాకిష్టమైన దాని నెలా ఇవ్వగలరు? (ప్రీతితో ఇస్తే తీసుకొంటాను) (3)
రాజోవాచ
న చానుకీర్తయేదద్య దత్త్వా
అయాచ్యమర్థం న చ సంశృణోమి ।
ప్రాప్యమర్థం చ సంశ్రుత్య
తం చాపి దత్త్వా సుసుఖీ భవామి ॥ 4
రాజు ఇలా అన్నాడు. నేను దానం చేసిన తర్వాత దానిని గూర్చి చర్చించను. సృష్టిలో లేనివస్తువును నీవు అడగవు. ఉన్నదానిని నేను తృప్తిగా ఇస్తాను ఇవ్వగల వస్తువునిచ్చి నేను సుఖంగా ఉంటాను. (4)
దదామి తే రోహిణానాం సహస్రం
ప్రియో హి మే బ్రాహ్మణో యాచమానః ।
న మే మనః కుప్యతి యాచమానే
దత్తం న శోచామి కదాచిదర్థమ్ ॥ 5
అర్థియై వచ్చిన బ్రాహ్మణుడంటే నాకు ఇష్టం. నీకు వేయి కపిలగోవులను ఇస్తాను. యాచకులను నేను కోపించను. ఇచ్చిన దానిగురించి బాధపడను. (5)
ఇత్యుక్త్వా బ్రాహ్మణాయ రాజా గోసహస్రం దదౌ ।
ప్రాప్తవాంశ్చ గవాం సహస్రం బ్రాహ్మణ ఇతి ॥ 6
అని చెప్పి రాజు బ్రాహ్మణునకు వేయి ఆవులను ఇచ్చాడు. బ్రాహ్మణుడు వేయి ఆవులను స్వీకరించాడు. (6)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి నాహుషచరితే వంచనవత్యధికశతతమోఽధ్యాయః ॥ 195 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున నాహుషచరితమను నూట తొంబది అయిదవ అధ్యాయము. (195)