193. నూట తొంబది మూడవ అధ్యాయము

ఇంద్ర బక సంవాదము.

వైశంపాయన ఉవాచ
మార్కండేయమృషయో బ్రాహ్మణా యుధిష్ఠిరశ్చ పర్యపృచ్ఛన్నృషిః కేన ।
దీర్ఘాయురాసీద్ బకో మార్కండేయస్తు తాన్ సర్వానువాచ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు -
ఋషులు, బ్రాహ్మణులు, యుధిష్ఠిరుడు "బ్రాహ్మణా! బకమహర్షి ఏ కారణంగా దీర్ఘాయువు కాగలిగాడు" అని మార్కండేయమహర్షిని అడిగారు. మార్కండేయుడు వారందరితో ఇలా అన్నాడు. (1)
మహాతపా దీర్ఘాయుశ్చ బకో రాజన్ నాత్ర కార్యా విచారణా ॥ 2
రాజా! బకమహర్షి మహాతపస్వీ, దీర్ఘాయువు, ఈ విషయంలో ఆలోచించవలసినదేదీ లేదు. (2)
ఏతచ్ఛ్రుత్వా తు కౌంతేయః భ్రాతృభిః సహ భారత ।
మార్కండేయం పర్యపృచ్ఛద్ ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 3
కుంతీనందనుడైన యుధిష్ఠిరుడు సోదరులతో కలిసి మార్కండేయుని మరల ప్రశ్నించాడు. (3)
శ్రూయతే హి మహాభాగ బకో దాల్భ్యో మహాతపాః ।
ప్రియః సఖా చ శక్రస్య చిరజీవీ చ సత్తమ ॥ 4
సత్తమా! మహానుభావా! దలుని కొడుకు బకుడు మహాతపస్వి అనీ, చిరంజీవి అనీ, ఇంద్రునకు ప్రియమిత్రుడనీ వింటున్నాం. (4)
ఏతదిచ్ఛామి భగవాన్ బకశక్రసమాగమమ్ ।
సుఖదుఃఖసమాయుక్తం తత్త్వేన కథయస్వ మే ॥ 5
స్వామీ! ఇంద్రబకుల ఈ సాన్నిహిత్యం సుఖదుఃఖ మిశ్రితమైనదని విన్నాం. యథార్థంగా చెప్పండి. వినగోరుతున్నాం. (5)
మార్కండేయ ఉవాచ
వృత్తే దేవాసురే రాజన్ సంగ్రామే లోమహర్షణే ।
త్రయాణామపి లోకానామ్ ఇంద్రో లోకాధిపోఽభవత్ ॥ 6
మార్కండేయుడిలా అన్నాడు.
రాజా! దేవరాక్షసుల మధ్య ఒళ్ళు గగుర్పొడిచే యుద్ధం జరిగిన తర్వాత ఇంద్రుడు త్రిలోకాధిపతి అయ్యాడు. (6)
సమ్యగ్ వర్షతి పర్జన్యే సస్యసంపద ఉత్తమాః ।
నిరామయాః సుధర్మిష్ఠాః ప్రజా ధర్మపరాయణాః ॥ 7
ఆయన పాలనలో మేఘం చక్కగా వర్షించేది. సర్వసంపదలు బాగా ఉండేవి. ప్రజలు రోగపీడ లేకుండా, ధర్మిష్ఠులై, ధర్మాన్నే ఆశ్రయించి ఉండేవారు. (7)
ముదితశ్చ జనః సర్వః స్వధర్మేషు వ్యవస్థితః ।
తాః ప్రజా ముదితాః సర్వాః దృష్ట్వా బలనిఘాదనః ॥ 8
తతస్తు ముదితో రాజన్ దేవరాజః శతక్రతుః ।
ఐరావతం సమాస్థాయ తాః పశ్యన్ ముదితాః ప్రజాః ॥ 9
స్వధర్మపరాయణులైన ప్రజలంతా ఆనందంగా ఉండేవారు. ఆనందంగా ఉన్న ప్రజలను చూసి దేవరాజయిన ఇంద్రుడు ఇంకా ఆనందించి, ఐరావతాన్ని అధిరోహించి, ప్రజాసందర్శనకై బయలుదేరాడు. (8,9)
ఆశ్రమాంశ్చ విచిత్రాంశ్చ నదీశ్చ వివిధాః శుభాః ।
నగరాణి సమృద్ధాని ఖేటాన్ జనపదాంస్తథా ॥ 10
ప్రజాపాలనదక్షాంశ్చ నరేంద్రాన్ ధర్మచారిణః ।
ఉదపానం ప్రపా వాపీ తడాగాని సరాంసి చ ॥ 11
నానా బ్రహ్మసమాచారైః స్వితాని ద్విజోత్తమైః ।
తతోఽ వతీర్య రమ్యాయాం పృథ్వ్యాం రాజన్ శతక్రతుః ॥ 12
రాజా! విచిత్రాశ్రమాలనూ, వివిధ శుభనదులనూ, సమృద్ధనగరాలనూ, గ్రామాలనూ, జనపదాలనూ, ప్రజాపాలనలో సమర్థులై ధర్మపరాయణులై ఉన్న రాజులను, బావులనూ, చలివేంద్రాలనూ, బ్రహ్మచర్యాసక్తులైన ద్విజశ్రేష్ఠులు సేవిస్తున్న సరస్సులనూ చూస్తూ ఇంద్రుడు ఒకరమణీయ ప్రదేశంలో దిగాడు. (10-12)
తత్ర రమ్యే శివే దేశే బహువృక్షసమాకులే ।
పూర్వస్యాం దిశి రమ్యాయాం సముద్రాభ్యాశతో నృప ॥ 13
తత్రాశ్రమపదం రమ్యం మృగద్విజనిషేవితమ్ ।
తత్రాశ్రమపదే రమ్యే బకం పశ్యతి దేవరాట్ ॥ 14
రాజా! అందమయిన తూర్పుదిక్కులో సముద్రానికి దగ్గరగా రకరకాల చెట్లతో నిండి అందంగా, శుభకరంగా ఉన్న ఒక ఆశ్రమపదాన్ని చూశాడు. అది జంతువులకు, పక్షులకు ఆవాసమైనది. ఆ అందమయిన ఆశ్రమంలో దేవేంద్రుడు బకుని చూశాడు. (13,14)
బకస్తు దృష్ట్వా దేవేంద్రం దృఢం ప్రీతమనాభవత్ ।
పాద్యాసనార్ఘ్యదానేన ఫలమూలైరథార్చయత్ ॥ 15
దేవేంద్రుని చూచి బకుడు ఎంతో ఆనందించాడు. అర్ఘ్యపాద్యాలనిచ్చి, సుఖాసీనుని చేసి ఫలమూలాలతో అర్చించాడు. (15)
సుఖోపవిష్టో వరదః తతస్తు బలసూదనః ।
తతః ప్రశ్నం బకం దేవః ఉవాచ త్రిదశేశ్వరః ॥ 16
వరదుడు, బలసూదనుడు అయిన దేవేంద్రుడు సుఖంగా కూర్చొని బకుని ఇలా ప్రశ్నించాడు. (16)
శతం వర్షసహస్రాణి మునే జాతస్య తేఽనఘ ।
సమాఖ్యాహి మమ బ్రహ్మన్ కిం దుఃఖం చిరజీవినామ్ ॥ 17
అనఘా! మునీ! నీవు జన్మించి లక్షసంవత్సరాలు గడిచిపోయాయి. బ్రాహ్మణా! చిరజీవులకు దుఃఖాన్ని కలిగించే విషయమేమిటో నాకు చెప్పు. (17)
బక ఉవాచ
అప్రియైః సహ సంవాసః ప్రియైశ్చాపి వినాభవః ।
అసద్భిః సంప్రయోగశ్చ తద్ దుఃఖం చిరజీవినామ్ ॥ 18
బకుడు ఇలా అన్నాడు. ఇష్టంలేని వారితో కలిసి ఉండటం, ఇష్టులతో వియోగం, చెడ్డవారితో చెలిమి - ఇది చిరజీవులకు దుఃఖం. (18)
పుత్రదారవినాశోఽత్ర జ్ఞాతీనాం సుహృదామపి ।
పరేష్వాయత్తతా కృచ్ఛ్రం కిం ను దుఃఖతరం తతః ॥ 19
భార్యాపుత్రులు, దాయాదులు, మిత్రులు నశించిపోవటం, పరాధీనంగా బ్రతకటం చాలా కష్టం. ఇంతకన్న దుఃఖమేముంటుంది? (19)
నాన్యద్ దుఃఖతరం కించిత్ లోకేషు ప్రతిభాతి మే ।
అర్థైర్విహీనః పురుషః పరైః సంపరిభూయతే ॥ 20
ధనహీనుడైన పురుషుని ఇతరులు పరాభవిస్తారు. మూడులోకాలలోనూ దీనిని మించిన కష్టం నాకు కనిపించలేదు. (20)
అకులానాం కులే భావం కులీనానాం కులక్షయమ్ ।
సంయోగం విప్రయోగం చ పశ్యంతి చిరజీవినః ॥ 21
అకులీనుల అభివృద్ధి, కులీనుల వంశవినాశం, సంయోగం, వియోగం - ఇవన్నీ చిరజీవి చూడవలసి వస్తుంది. (21)
అపి ప్రత్యక్షమేవైతత్ తవ దేవ శతక్రతో ।
అకులానాం సమృద్ధానాం కథం కులవిపర్యయః ॥ 22
స్వామీ! దేవేంద్రా! అకులీనులు వృద్ధిచెందితే కులాల తారుమారు ఎలా అవుతుందో నీకు తెలియంది కాదు. (22)
దేవాదానవగంధర్వమనుష్యోరగరాక్షసాః ।
ప్రాప్నువంతి విపర్యాసం కిం ను దుఃఖతరం తతః ॥ 23
దేవతలు, దానవులు, గంధర్వులు, మనుష్యులు, నాగులు, రాక్షసులు తారుమారవుతుంటారు. ఇంతకన్నా దుఃఖమేముంటుంది? (23)
కులే జాతాశ్చ క్లిశ్యంతే దౌష్కులేయవశానుగాః ।
ఆఢ్యైర్దరిద్రాశ్చాక్రాంతాః కిమ్ ను దుఃఖతరం తతః ॥ 24
నీచకులస్థులకు లోబడి కులీనులు బాధలు పడుతుంటారు. ధనవంతులు దరిద్రులను లోబరచుకొంటారు. ఇంతకన్న దుఃఖ మేముంటుంది? (24)
లోకే వైధర్మ్యమేతత్ తు దృశ్యతే బహువిస్తరమ్ ।
హీనజ్ఞానాశ్చ హృష్యంతే క్లిశ్యంతే ప్రాజ్ఞకోవిదాః ॥ 25
బహుదుఃఖపరిక్లేశం మానుష్యమిహ దృశ్యతే ।
లోకంలో ఈ విపరీతస్థితి బాగా కనిపిస్తుంది. బుద్ధిహీనులు ఆనందంగా ఉంటారు. పండితులు బాధలు పడతారు. మానవజాతి ఇలా ఎన్నోబాధలు పడటం చూడవలసి వస్తుంది. (25 1/2)
ఇంద్ర ఉవాచ
పునరేవ మహాభాగ దేవర్షిగణసేవిత ॥ 26
సమాఖ్యాహి మమ బ్రహ్మన్ కిం సుఖం చిరజీవినామ్ ।
ఇంద్రుడిలా అన్నాడు. మహాభాగా! దేవర్షిగణసేవితా! విప్రా! చిరజీవులకు సుఖమేమిటో వివరంగా చెప్పు. (26 1/2)
బక ఉవాచ
అష్టమే ద్వాదశే వాపి శాకం యః పచతే గృహే ॥ 27
కుమిత్రాణ్యవపాశ్రిత్య కిం వై సుఖతరం తతః ।
యత్రాహాని న గణ్యంతే నైనమాహుర్మహాశనమ్ ॥ 28
బకుడు ఇలా అన్నాడు. రోజులో ఎనిమిది లేక పండ్రెండవ భాగంలో తన ఇంటిలో వంట చేసికొంటూ, చెడ్డవారి శరణు కోరకుండా జీవించగలిగితే అంతకన్నా సుఖమేముంటుంది? రోజులు లెక్కపెట్టుకొనవలసిన అవసరం లేకుండా జీవించగలిగితే అంతకన్నా సుఖమేముంటుంది? అటువంటి వారు తిండిపోతులు కారు. (27,28)
అపి శాకం పచానస్య సుఖం వై మఘవన్ గృహే ।
అర్జితం స్వేన వీర్యేణ నాప్యపాశ్రిత్య కంచన ॥ 29
దేవేంద్రా! ఇతరుల మీద ఆధారపడకుండా స్వశక్తితో సంపాదించినదాన్ని ఇంట వండుకొని తినటం కన్న సుఖమేముంటుంది? (29)
ఫలశాకమపి శ్రేయః భోక్తుం హ్యకృపణం గృహే ।
పరస్య తు గృహే భోక్తుః పరిభూతస్య నిత్యశః ॥ 30
సుమృష్టమపి న శ్రేయః వికల్పోఽయమతః సతామ్ ।
శ్వవత్ కీలాలపో యస్తు పరాన్నం భోక్తుమిచ్ఛతి ॥ 31
ధిగస్తు తస్య తద్ భుక్తం కృపణస్య దురాత్మనః ।
దైన్యం లేకుండా ఇంటిలో కాయలు, పండ్లు తినగలగటం గొప్ప. నిత్యమూ ఛీత్కారాలతో పరుల ఇంట మృష్టాన్నమయినా మంచిదికాదు. అందుకే సజ్జనులు పరుల ఇంట జీవనాన్ని గడపటాన్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తారు. పరాన్నానికై ఆశపడేవాడు నెత్తురు త్రాగే కుక్కలాంటివాడు. అటువంటి నిర్భాగ్యుని, కృపణుని తిండి.... ఛీఛీ... (30, 31 1/2)
యో దత్త్వాతిథిభూతేభ్యః పితృభ్యశ్చ ద్విజోత్తమః ॥ 32
శిష్టాన్యన్నాని యో భుంక్తే కిం వై సుఖతరం తతః ।
అతో మృష్టతరం నాన్యత్ పూతం కించిచ్ఛతక్రతో ॥ 33
అతిథులకు, ఇతరజీవులకు, పితరులకు పెట్టగా మిగిల్న అన్నాన్ని తినగలిగితే అంతకన్నా సుఖ మేముంటుంది? దేవేంద్రా! ఈ యజ్ఞశేషాన్ని మించి పవిత్రమైన మృష్టాన్న మేముంటుంది? (32,33)
దత్త్వా యస్త్వతిథిభ్యో వై భుంక్తే తేనైవ నిత్యశః ।
యావతో హ్యంధసః పిండాన్ అశ్నాతి సతతం ద్విజః ॥ 34
తావతాం గోసహస్రాణాం ఫలం ప్రప్నోతి దాయకః ।
యదేనో యౌవనకృతం తత్ సర్వం నశ్యతే ధ్రువమ్ ॥ 35
నిత్యమూ అతిథులకు పెట్టి, తాను తినేవాడు శుభఫలాలు పొందుతాడు. అతిథులు ఎన్ని కబళాల అన్నపు ముద్దలు తింటారో అన్నివేలగోవులను దానం చేసిన పుణ్యం ఆ ఆతిధేయునకు లభిస్తుంది. యౌవనంలో తాను చేసిన పాపాలన్నీ నశిస్తాయి కూడా. (34,35)
సదక్షిణస్య భుక్తస్య ద్విజస్య తు కరే గతమ్ ।
యద్ వారి వారిణా సించేత్ తద్ధ్యేనస్తరతే క్షణాత్ ॥ 36
భోజనానంతరం బ్రాహ్మణులకు దక్షిణనిస్తూ విడిచిన నీరు వారి చేతిలో ఉండగా మరల దానవారితో దానిని తడిపితే పాపాలన్నీ క్షణంలో నశిస్తాయి. (36)
ఏతాశ్చాన్యాశ్చ వై బహ్వీః కథయిత్వా కథాః శుభాః ।
బకేన సహ దేవేంద్రః ఆపృచ్ఛ్య త్రిదివం గతః ॥ 37
ఇవేకాక, ఇటువంటి శుభకథలను ఎన్నింటినో బకునిచే చెప్పించి, వీడ్కోలు తీసికొని దేవేంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు. (37)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి బ్రాహ్మణమహాభాగ్యే బకశక్రసంవాదే త్రినవత్యధికశతతమోఽధ్యాయః ॥ 193 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున బ్రాహ్మణమహాభాగ్యమను నూట తొంబది మూడవ అధ్యాయము. (193)