191. నూట తొంబది ఒకటవ అధ్యాయము
కల్కి కృతయుగమును స్థాపించుట, మార్కండేయుడు ధర్మరాజుకు చేసిన ఉపదేశము.
మార్కండేయ ఉవాచ
తతశ్చోరక్షయం కృత్వా ద్విజేభ్యః పృథివీమిమామ్ ।
వాజిమేధే మహాయజ్ఞే విధివత్ కల్పయిష్యతి ॥ 1
మార్కండేయుడిలా అన్నాడు.
ఆ తరువాత చోరులను అందరినీ నశింపజేసి అశ్వమేధమహాయాగం చేసి ఈ భూమిని యథావిధిగా బ్రాహ్మణులకు దానం చేస్తాడు. (1)
స్థాపయిత్వా చ మర్యాదాః స్వయంభువిహితాః శుభాః ।
వనం పుణ్యయశఃకర్మా రమణీయం ప్రవేక్ష్యతి ॥ 2
పవిత్రకర్మలు చేసి పుణ్యయశస్సును పొంది అతడు బ్రహ్మ నిర్దేశించిన శుబమర్యాదలను స్థాపించి రమణీయమైన వనంలో ప్రవేసిస్తాడు. (2)
తచ్ఛీలమనువర్త్స్యంతి మనుష్యా లోకవాసినః ।
విప్రైశ్చోరక్షయే చైవ కృతే క్షేమం భవిష్యతి ॥ 3
లోకంలోని మనుష్యులందరూ అతని నడవడిని అనుసరిస్తారు. బ్రాహ్మణులు మ్లేచ్ఛులను నశింపజేసిన తరువాత కృతయుగంలో లోకం క్షేమంగా ఉంటుంది. (3)
కృష్ణాజినాని శక్తీశ్చ త్రిశూలాన్యాయుధాని చ ।
స్థాపయన్ ద్విజశార్దూలః దేశేషు విజితేషు చ ॥ 4
సంస్తూయమానో విప్రేంద్రైః మానయానో ద్విజోత్తమాన్ ।
కల్కీ చరిష్యతి మహీం సదా దస్యువధే రతః ॥ 5
ద్విజశ్రేష్ఠుడైన కల్కి చోరులను నశింపజేయటంలో ఆసక్తుడై సమస్తభూమండలంలో సంచరిస్తూ తాను జయించిన దేశాలలో కృష్ణాజినాలను, శక్తిత్రిశూలాలను, వివిధాయుధాలను నిలిపి బ్రాహ్మణులచే స్తుతింపబడుతూ, వారిని సత్కరిస్తూ లోకంలో తిరుగుతాడు. (4,5)
హా మాతస్తాత పుత్రేతి తాస్తా వాచః సుదారుణాః ।
విక్రోశమానాన్ సుభృశం దస్యూన్ నేష్యతి సంక్షయమ్ ॥ 6
తతోఽధర్మవినాశో వై ధర్మవృద్ధిశ్చ భారత ।
భవిష్యతి కృతే ప్రాప్తే క్రియావాంశ్చ జనస్తథా ॥ 7
అమ్మా! కొడుకా! అని దీనంగా ఆక్రోశిస్తున్న దస్యులను అందరనూ ఘోరంగా సంహరిస్తాడు.
అప్పుడు అధర్మం నశించి ధర్మం వర్ధిల్లుతుంది. భారతా! కృతయుగ ప్రారంభం కాగానే జనులంతా దేవపితృకర్మలు చేస్తూ క్రియాశీలురు అవుతారు. (6,7)
ఆరామాశ్చైవ చైత్యాశ్చ తటాకావసథాస్తథా ।
పుష్కరిణ్యశ్చ వివిధాః దేవతాయతనాని చ ॥ 8
యజ్ఞక్రియాశ్చ వివిధాః భవిష్యంతి కృతే యుగే ।
బ్రాహ్మణాః సాధవశ్చైవ మునయశ్చ తపస్వినః ॥ 9
కృతయుగంలో తోటలు, రచ్చమ్రానులు, చెరువులు, ధర్మశాలలు, పుష్కరిణులు, వివిధదేవాలయాలు తయారవుతాయి. వివిధయజ్ఞక్రియలు కొనసాగుతాయి. బ్రాహ్మణులు సాధుస్వభావులవుతారు. మునులు తపోనిష్ఠులవుతారు. (8,9)
ఆశ్రమా సహపాఖండాః స్థితాః సత్యరతాః ప్రజాః ।
ప్రయంతి సర్వబీజాని రోప్యమాణాని చైవ హ ॥ 10
పూర్వం పాషండులతో కలిసి ఉన్న ఆశ్రమ ప్రజలు ఇపుడు ధర్మాసక్తులౌతారు. వారి దుష్టసంస్కార బీజాలు దృఢములైన జ్ఞానంతో నశిస్తాయి. (10)
సర్వేష్వృతుషు రాజేంద్ర సర్వం సస్యం భవిష్యతి ।
నరా దానేషు నిరతాః వ్రతేషు నియమేషు చ ॥ 11
రాజేంద్రా! అన్ని ఋతువులలో అన్నిపైరులు పెరుగుతాయి. ప్రజలందరూ దానవ్రతనియమాలలో ఆసక్తి చూపుతాడు. (11)
జపయజ్ఞపరా విప్రాః ధర్మకామా ముదా యుతాః ।
పాలయిష్యంతి రాజానః ధర్మేణేమాం వసుంధరామ్ ॥ 12
విప్రులంతా జపయజ్ఞాలపై ఆసక్తి చూపుతారు. ధర్మాన్ని ఇష్టపడుతూ ఆనందంగా జీవిస్తారు. రాజులు ఈ నేలను ధర్మబద్ధంగా పరిపాలిస్తారు. (12)
వ్యవహారరతా వైశ్యాః భవిష్యంతి కృతే యుగే ।
షట్ కర్మనిరతా విప్రాః క్షత్రియా విక్రమే రతాః ॥ 13
శుశ్రూషాయాం రతాః శూద్రాః తథా వర్ణత్రయస్య చ ।
కృతయుగంలో వైశ్యులు వాణిజ్యంపై ఆసక్తి చూపుతారు. విప్రులు షట్ కర్మల (అధ్యయన, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహాల) పై ఆసక్తులవుతారు.
క్షత్రియులు పరాక్రమాసక్తులు కాగలరు. శూద్ర్రులు మూడువర్ణాలను సేవించటంపై ఆసక్తిపడతారు. (13 1/2)
ఏష ధర్మః కృతయుగే త్రేతాయాం ద్వాపరే తథా ॥ 14
పశ్చిమే యుగకాలే చ యః స తే సంప్రకీర్తితః ।
సర్వలోకస్య విదితా యుగసంఖ్యా చ పాండవ ॥ 15
కృతయుగంలో ఇదే ధర్మం, త్రేతా, ద్వాపర, కలియుగాలలోని ధర్మస్థితిని నీకు వివరించి చెప్పాను. పాండుకుమారా! సర్వలోకానికి తెలిసిన యుగసంఖ్య కూడా నీకు తెలిసినది గదా! (14,15)
ఏతత్ తే సర్వమాఖ్యాతమ్ అతీతానాగతం తథా ।
వాయుప్రోక్తమనుస్మృత్య పురాణమృషిసంస్తుతమ్ ॥ 16
మహర్షులు ప్రస్తుతించిన వాయుపురాణాన్ని స్మరించి నేను గతించిన దానిని, జరుగబోయేదానిని కూడా పూర్తిగా చెప్పాను. (16)
ఏవం సంసారమార్గా మే బహుశశ్చిరజీవినా ।
దృష్టాశ్చైవానుభూతాశ్చ తాంస్తే కథితవానహమ్ ॥ 17
అదేవిధంగా చిరంజీవినైన నేను అనేకపర్యాయాలు చూచి, అనుభవించిన నా సంసారమార్గాలను నీకు చెప్పాను. (17)
ఇదం చైవాపరం భూయః సహ భ్రాతృభిరచ్యుత ।
ధర్మసంశయమోక్షార్థం నిబోధ వచనం మమ ॥ 18
అచ్యుతా! ధర్మసందేహాలు తొలగిపోవటానికి నీకు మరొకవిషయం చెపుతాను. సోదరులతో కలిసి, విని, గ్రహించు. (18)
ధర్మే త్వయాఽఽత్మా సంయోజ్యః నిత్యం ధర్మభృతాం వర ।
ధర్మాత్మా హి సుఖం రాజన్ ప్రేత్య చేహ చ నందతి ॥ 19
ధర్మాత్ములలో శ్రేష్ఠుడా! రాజా! నీవు ఎప్పుడూ ధర్మబద్ధుడవై ఉండాలి. ధర్మాత్ముడే ఇహపరలోకాలలో సుఖంగా ఉండగలడు. (19)
నిబోధ చ శుభాం వాణీం యాం ప్రవక్ష్యామి తేఽనఘ ।
న బ్రాహ్మణే పరిభవః కర్తవ్యస్తే కదాచన ॥ 20
బ్రాహ్మణః కుపితో హన్యాద్ అపి లోకాన్ ప్రతిజ్ఞయా ।
అనఘా! నీకు చెప్పబోయే మంగళవచనాన్ని విను. నీవెప్పుడూ బ్రాహ్మణుని పరిభవించవద్దు. కోపించిన బ్రాహ్మణుడు ప్రతిజ్ఞతో మూడులోకానౌ నశింపజేయగలడు. (20 1/2)
వైశంపాయన ఉవాచ
మార్కండేయవచః శ్రుత్వా కురూణాం ప్రవరో నృపః ॥ 21
ఉవాచ వచనం ధీమాన్ పరమం పరమద్యుతిః ।
వైశంపాయనుడిలా అన్నాడు.
మార్కండేయుని మాటవిని కురుశ్రేష్ఠుడు, కాంతిమంతుడు, ధీమంతుడు అయిన ధర్మరాజు ఇలా అన్నాడు. (21 1/2)
కస్మిన్ ధర్మే మయా స్థేయం ప్రజాః సంరక్షతా మునే ॥ 22
కథం చ వర్తమానో వై న చ్యవేయం స్వధర్మతః ।
మహర్షీ! ప్రజాసంరక్షణలో నేనే ధర్మంలో నిలవాలి? ఏ పద్ధతి ననుసరిస్తే నేను స్వధర్మం తప్పకుండా నిలువగలుగుతాను? (22 1/2)
మార్కండేయ ఉవాచ
దయావాన్ సర్వభూతేషు హితో రక్తోఽవసూయకః ॥ 23
సత్యవాదీ మృదుర్దాంతః ప్రజానాం రక్షణే రతః ।
చర ధర్మం త్యజాధర్మం పితౄన్ దేవాంశ్చ పూజయ ॥ 24
మార్కండేయుడిలా అన్నాడు. సర్వప్రాణులయందు దయగలవాడనై, హితుడవై, అనురక్తుడవై, అసూయలేనివాడవై సత్యవాదివై మృదుస్వభావుడవై, జితేంద్రియుడవై, ప్రజారక్షణయందు ఆసక్తిగలవాడవై ధర్మాన్ని అనుసరించు. అధర్మాన్ని వీడు. పితరులను, దేవతలను పూజించు. (23,24)
ప్రమాదాద్ యత్ కృతం తేఽభూత్ సమ్యగ్ దానేన తజ్జయ ।
అలం తే మానమాశ్రిత్య సతతం పరవాన్ భవ ॥ 25
పొరపాటున ఏదైనా అన్యాయం జరిగితే బాగా దానంచేసి దానిని పోగొట్టుకో. అహంకారాన్ని ఆశ్రయించవద్దు. ఎప్పుడూ నిన్ను నీవు పరాధీనుడవనుకో. (25)
విజిత్య పృథివీం సర్వాం మోదమానః సుఖీభవ ।
ఏష భూతో భవిష్యశ్చ ధర్మస్తే సముదీరితః ॥ 26
న తేఽస్త్యదితం కించిద్ అతీతానాగతం భువి ।
తస్మాదిమం పరిక్లేశం త్వం తాత హృది మా కృథాః ॥ 27
పృథివినంతా జయించి ఆనందిస్తూ సుఖంగా జీవించు. నీకు నేను ఉపదేశించిన ధర్మం గతంలోనూ భవిష్యత్తులో కూడా అలాగే ఉండు. నాయనా! భూతభవిష్యత్తులలోనూ నసించకుండా ఉండేదిదే కాబట్టి నీకు వచ్చిన ఇప్పటి కష్టాలను మనస్సులో పెట్టుకొనవలదు. (26,27)
ప్రాజ్ఞాస్తాత న ముహ్యంతి కాలేవాపి ప్రపీడితాః ।
ఏష కాలో మహాబాహో అపి సర్వదివౌకసామ్ ॥ 28
నాయనా! కాలం బాధించినా బుద్ధిమంతులు మోహంలో పడరు. కాలమన్నది దేవతలను కూడా లోగొనగలది. (28)
ముహ్యంతి హి ప్రజాస్తాత కాలేనాపి ప్రచోదితాః ।
మా చ తత్ర విశంకాభూద్ యన్మయోక్తం తవానఘ ॥ 29
నాయనా! కాలప్రేరణ వలన కూడా జనులు వ్యామోహంలో పడతారు. అనఘా! నేను చెప్పిన విషయాలను నీవు సందేహించనవసరం లేదు. (29)
ఆశంక్య మద్వచో హ్యేతద్ ధర్మలోపో భవేత్ తవ ।
జాతోఽసి ప్రథితే వంశే కురూణాం భరతర్షభ ॥ 30
కర్మణా మనసా వాచా సర్వమేతత్ సమాచర ।
భరతర్షభా! ప్రసిద్ధికెక్కిన కురువంశంలో జన్మించావు. నా ఈ మాటను శంకిస్తే ధర్మలోపం కలుగుతుంది. కాబట్టి మనసా, వాచా, కర్మణా నా మాటలను అనుసరించు. (30)
యుధిష్ఠిర ఉవాచ
యత్ త్వయోక్తం ద్విజశ్రేష్ఠ వాక్యం శ్రుతిమనోహరమ్ ॥ 31
తథా కరిష్యే యత్నేన భవతః శాసనం విభో ।
న మే లోభోఽస్తి విప్రేంద్ర న భయం న చ మత్సరః ॥ 32
కరిష్యామి హి తత్ సర్వమ్ ఉక్తం యత్ తే మయి ప్రభో ।
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ద్విజశ్రేష్ఠా! నీవు చెప్పిన మాటలన్నీ చెవికింపుగా ఉన్నాయి. స్వామీ! మీ మాటను పాటించే ప్రయత్నం చేస్తాను. విప్రోత్తమా! నాకు లోభం కానీ, భయం కానీ, మాత్సర్యం కానీ లేవు. మీ మాటను పాటిస్తాను. (31, 32 1/2)
వైశంపాయన ఉవాచ
శ్రుత్వా తు వచనం తస్య మార్కండేయస్య ధీమతః ।
సంహృష్టాః పాండవా రాజన్ సహితాః శార్ ఙ్గధన్వానా ।
విప్రర్షభాశ్చ తే సర్వే యే తత్రాసన్ సమాగతాః ॥ 34
వైశంపాయనుడిలా అన్నాడు.
రాజా! ధీమంతుడైన మార్కండేయుని మాటలను విని పాండవులు, శ్రీకృష్ణుడు, అక్కడ చేరి ఉన్న బ్రహ్మర్షులు అందరూ ఆనందించారు. (33,34)
తథా కథం శుభాం శ్రుత్వా మార్కండేయస్య ధీమతః ।
విస్మితాః సమపద్యంత పురాణస్య నివేదనాత్ ॥ 35
ధీమంతుడైన మార్కండేయుడు చెప్పిన శుబకథలను విని, పురాణజ్ఞానాన్ని పొంది అందరూ ఆశ్చర్యపడ్డారు. (35)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి యుధిష్ఠిరానుశాసనే ఏకనవత్యధికశతతమోఽధ్యాయః ॥ 191 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిరానుశాసనమను నూట తొంబది యొకటవ అధ్యాయము. (191)