185. నూట ఎనుబది అయిదవ అధ్యాయము

అత్రిముని, పృథుమహారాజుల ప్రశంస.

మార్కండేయ ఉవాచ
భూయ ఏవ మహాభాగ్యం బ్రాహ్మణానాం నిబోధ మే ।
వైన్యో నామేహ రాజర్షిః అశ్వమేధాయ దీక్షితః ॥ 1
మార్కండేయుడిలా అన్నాడు. బ్రాహ్మణుల మాహాత్మ్యాన్ని ఇంకా చెపుతాను. విను. వైన్యుడనే రాజర్షి అశ్వమేధయాగానికి దీక్షపూనాడు. (1)
తమత్రిర్గంతుమారేభే విత్తార్థమితి నః శ్రుతమ్ ।
భూయోఽర్థం నామరుధ్యత్ సః ధర్మవ్యక్తినిదర్శనాత్ ॥ 2
అత్రిమహర్షి ధనం కోసం వైన్యుని దగ్గరకు వెళ్ళాలనుకొన్నాడని విన్నాను. కానీ అత్రి తన ధర్మవ్యక్తిత్వాన్ని బయలుపరచుకొనవలసి వస్తుందన్న భావంతో డబ్బుకోసం వెళ్ళలేదు. (2)
స విచింత్య మహాతేజాః వనమేవాన్వరోచయత్ ।
ధర్మపత్నీం సమాహూయ పుత్రాంశ్చేదమువాచ హ ॥ 3
ఆయన బాగా ఆలోచించి అరణ్యాలలోనికి వెళ్ళాలనే నిశ్చయించుకొన్ భార్యాపుత్రులను పిలిచి వారితో ఇలా అన్నాడు. (3)
ప్రాప్స్యామః ఫలమత్యంతం బహులం నిరుపద్రవమ్ ।
అరణ్యగమనం క్షిప్రం రోచతాం వో గుణాధికమ్ ॥ 4
అరణ్యాలలో నివసిస్తూ నిరుపద్రవమైన ధర్మఫలాన్ని ఎంతో పొందవచ్చు. కాబట్టి గ్రామజీవనం కన్న ఎన్నోరెట్లు గొప్పదైన అరణ్యజీవనం మీదికి వెంటనే మీరు మనస్సును మళ్ళించాలి. (4)
తం భార్యా ప్రత్యువాచాథ ధర్మమేవానుతన్వతీ ।
వైన్యం గత్వా మహాత్మానమ్ అర్థయస్వ ధనం బహు ॥ 5
అత్రిభార్య యజ్ఞయాగాది ధర్మం మీదనే దృష్టి గలదై భర్తతో ఇలా అన్నది - మహానుభావుడైన వైన్యుని దగ్గరకు పోయి ఎక్కువధనాన్ని అడగండి. (5)
స తే దాస్యతి రాజర్షిః యజమానోఽర్థితో ధనమ్ ।
తత ఆదాయ విప్రర్షే ప్రతిగృహ్య ధనం బహు ॥ 6
భృత్యాన్ సుతాన్ సంవిభజ్య తతో వ్రజ యథేప్సితమ్ ।
ఏష వై పరమో ధర్మః ధర్మవిద్భిరుదాహృతః ॥ 7
విప్రర్షీ! యాగం చేస్తున్న వైన్యుడు మీరు అడగగానే ధనాన్ని ఇస్తాడు. ఆ ధనరాశిని తీసికొనివచ్చి మీరు పోషించవలసిన ఈ కుమారులకు పంచి ఇచ్చి ఆ తర్వాత స్వేచ్ఛగా అరణ్యాలకు వెళ్ళండి. ధర్మవేత్తలయిన మహాత్ములు దీనినే పరమధర్మమంటారు. (6,7)
అత్రిరువాచ
కథితో మే మహాభాగే గౌతమేన మహాత్మనా ।
వైన్యో ధర్మార్థసంయుక్తః సత్యవ్రతసమన్వితః ॥ 8
అత్రి ఇలా అన్నాడు. కళ్యాణీ! వైన్యుడు ధర్మార్థాలపై ఆసక్తిగలవాడనీ, సత్యవ్రతనిష్ఠుడనీ మహాత్ముడైన గౌతముడు చెప్పగా విన్నాను. (8)
ద్వేష్టారః కింతు నః సంతి వసంతస్తత్ర వై ద్విజాః ।
యథా మే గౌతమః ప్రాహ తతో నవ్యవసామ్యహమ్ ॥ 9
అయితే అక్కడున్న విప్రులంతా నన్ను ద్వేషించేవారు. ఇది కూడా నాకు గౌతముడే చెప్పాడు. అందువల్ల నేను ఆ ప్రయత్నం చేయటం లేదు. (9)
తత్ర స్మ వాచం కల్యాణీం ధర్మకామార్థసంహితామ్ ।
మయోక్తామన్యథా బ్రూయుః తతస్తే వై నిరర్థికామ్ ॥ 10
నేను అక్కడకు పోయి ధర్మకామార్థాలతో కూడిన మంచి మాటలను చెప్పినా వారు అపార్థాలు కల్పించి నా మాట నిరర్థకమనే అంటారు. (10)
గమిష్యామి మహాప్రాజ్ఞే రోచతే మే వచస్తవ ।
గాశ్చ మే దాస్యతే వైన్యః ప్రభూతం చార్థసంచయమ్ ॥ 11
అయుననూ ధీమంతులారా! నీమాట నాకు నచ్చింది. నేను వెళతాను. వైన్యుడు నాకు గోవులను గొప్పధనరాశులను ఇవ్వగలడు (11)
ఏవముక్త్వా జగామాశు వైన్యయజ్ఞం మహాతపాః ।
గత్వా చ యజ్ఞాయతనమ్ అత్రిస్తుష్టావ తం నృపమ్ ॥ 12
వాక్యైర్మంగలసంయుక్తైః పూజయానోఽబ్రవీద్ వచః ।
ఈ విధంగా చెప్పి మహాతపస్వి అయిన అత్రి వెంటనే వైన్యుని యజ్ఞశాలకు పోయి కళ్యాణమయ వాక్యాలతో ఆయనను స్తుతించి ఆదరపూర్వకంగా ఇలా అన్నాడు. (12, 1/2)
అత్రిరువాచ
రాజన్ ధన్యస్త్వమీశశ్చ భువి త్వం ప్రథమో నృపః ॥ 13
అత్రి ఇలా అన్నాడు. రాజా! భూలోకంలో నీవే తొలిరాజువు. నీవు ధన్యుడవు. ఐశ్వర్య సంపన్నుడవు. (13)
స్తువంతి త్వాం మునిగణాః త్వదన్యో నాస్తి ధర్మవిత్ ।
తమబ్రవీదృషిః క్రుద్ధః వచనం వై మహాతపాః ॥ 14
మునులంతా నిన్నే స్తుతిస్తున్నారు. నిన్ను మించిన ధర్మవేత్తలేడు. మహాతపస్వి అయిన గౌతముడు కోపంతో ఇలా అన్నాడు. (14)
గౌతమ ఉవాచ
మైవమత్రే పునర్బ్రూయాః న తే ప్రజ్ఞా సమాహితా ।
అత్ర నః ప్రథమం స్థాతా మహేంద్రో వై ప్రజాపతిః ॥ 15
గౌతముడిలా అన్నాడు - అత్రీ! మరొకసారి ఇలా అనవద్దు. నీ బుద్ధి సావధానంగా లేదు ఇక్కడ మా ప్రథమ ప్రజాపతిగా ఇంద్రుడే ఉన్నాడు (15)
అథాత్రిరపి రాజేంద్ర గౌతమం ప్రత్యభాషత ।
అయమేవ విధాతా హి యథైవేంద్రః ప్రజాపతిః ।
త్వమేవ ముహ్యసే మోహాత్ న ప్రజ్ఞానం తవాస్తి హ ॥ 16
రాజేంద్రా! అప్పుడు అత్రి కూడా గౌతమునితో ఇలా అన్నాడు. ఈ పృథువే ప్రజాపతి. ఈ ప్రజాపతియే ఇంద్రసమానుడు. నీవే వ్యామోహంలో పడి ఉన్నావు. నీ బుద్ధియే సరిగా లేదు. (16)
గౌతమ ఉవాచ
జానామి నాహం ముహ్యామి త్వమేవాత్ర విముహ్యతే ।
స్తౌషి త్వం దర్శన ప్రేప్సుః రాజానం జనసంసది ॥ 17
గౌతముడిలా అన్నాడు. నాకు మోహం లేదు. ఎరుక కలిగియే ఉన్నాను. నీవే మోహంలో పడ్డావు. రాజదర్శనం కోసం జనులసమక్షంలో రాజును ప్రశంసిస్తున్నావు. (17)
న వేత్థ పరమం ధర్మం న చావైషి ప్రయోజనమ్ ।
బాలస్త్వమపి మూఢశ్చ వృద్ధః కేనాపి హేతునా ॥ 18
నీకు పరమధర్మమూ తెలియదు. ధర్మప్రయోజనమూ తెలియదు నీవు బాలుడవు, మూఢుడవు కూడా. వయస్సు చేత మాత్రమే వృద్ధుడవు. (18)
వివదంతౌ తథా తౌ తు మునీనాం దర్శనే స్థితౌ ।
యే తస్య యజ్ఞే సంవృత్తాః తేఽపృచ్ఛంత కథం త్విమౌ ॥ 19
మహర్షుల ముందు నిలిచి ఈ విధంగా గొడవపడుతున్న ఆ ఇద్దరినీ చూచి అంతకు ముందే యజ్ఞనిర్వహణకై వరింపబడిన ఋత్విక్కులు ఇలా అనసాగారు " వీరిలా గొడవ పడుతున్నారేమిటి? (19)
ప్రవేశః కేన దత్తోఽయమ్ ఉభయోర్వైన్యసంసది ।
ఉచ్ఛైః సమభిభాషంతౌ కేన కార్యేణ ధిష్ఠితౌ ॥ 20
తతః పరమధర్మాత్మా కాశ్యపః సర్వధర్మవిత్ ।
వివాదినావనుప్రాప్తౌ తావుభౌ ప్రత్యవేదయత్ ॥ 21
వైన్యుని యజ్ఞశాలలోనికి వీరిరువురిని ఎవరు అనుమతించారు? పెద్ద పెద్దగా మాటాడుతూ గొడవపడుతున్న
వీరిక్కడెందుకున్నారు? అపుడు సర్వధర్మవేత్త, పరమధర్మస్వరూపుడూ అయిన కాశ్యపుడు "వీరిరువురు ఏదోవిషయంలో భేదాభిప్రాయాలతో ఉన్నారు. దాని నిర్ణయం కోసమే వచ్చినట్లున్నారు" అన్నాడు. (20,21)
అథాబ్రవీత్ సదస్యాంస్తు గౌతమో మునిసత్తమాన్ ।
ఆవయోర్వ్యాహృతం ప్రశ్నం శృణుత ద్విజసత్తమాః ॥ 22
వైన్యం విధాతేత్యాహాత్రిః అత్ర నౌ సంశయో మహాన్ ।
శ్రుత్వైవ తు మహాత్మానః మునయోఽభ్యద్రవన్ ద్రుతమ్ ॥ 23
సనత్కుమారం ధర్మజ్ఞం సంశయచ్ఛేదనాయ వై ।
స చ తేషాం వచః శ్రుత్వా యథాతత్త్వం మహాతపాః ।
ప్రత్యువాచాథ తానేవ ధర్మార్థసహితం వచః ॥ 24
అప్పుడు గౌతముడు సదస్యులైన మునివర్యులతో ఇలా అన్నాడు. ద్విజశ్రేష్ఠులారా! మా ప్రశ్నను వినండి. అత్రి పృథువును విధాత అన్నాడు. ఆ విషయంలోనే మాకు సందేహం, వివాదం కూడా. అది వినగానే మహాత్ములయిన మునులు సంశయనివృత్తికై ధర్మవేత్త అయిన సనత్కుమారుని దగ్గరకు వెళ్ళారు.
మహాతపస్వి అయిన సనత్కుమారుడు వారి మాటను యథాతథంగా విని వారికి ఇలా సమాధానమిచ్చాడు. (22-24)
సనత్కుమార ఉవాచ
బ్రహ్మ క్షత్రేణ సహితం క్షత్రం చ బ్రహ్మణా సహ ।
సంయుక్తౌ దహతః శత్రూన్ వనానీవాగ్నిమారుతౌ ॥ 25
సనత్కుమారుడిలా అన్నాడు. బ్రాహ్మధర్మం క్షాత్రధర్మంతో, క్షాత్రధర్మం బ్రాహ్మధర్మంతో కలిస్తే నిప్పూ గాలీ కలిసి వనాలను దహించినట్లు శత్రువులను దహించగలవు. (25)
వి॥సం॥ బ్రాహ్మణ బలంతో కలిస్తే రాజుకుబలం. కేవలం తన బలం చాలదు అని గ్రంథార్థం. అంతమాత్రాన గౌతముడి నిందా వ్యర్థం కాదు. అత్రిచేసిన రాజస్తుతీ నిరాధారం కాదు. రాజస్తుతి లోభమూలకంగా కనిపిస్తున్నా ధనాన్ని ఆశించినవాడు రాజులోలేనొ విశేషణాలనైనా వాడి రాజును స్తుతించినవలసినదే కదా అని సనత్కుమారుని ఆశయం. (నీల)
రాజా వై ప్రథితో ధర్మః ప్రజానం పతిరేవ చ ।
స ఏవ శక్రః శుక్రశ్చ స ధాతా చ బృహస్పతిః ॥ 26
రాజే ధర్మమని ప్రసిద్ధి. రాజే ప్రజాపతి. ఇంద్రుడు, శుక్రుడు, బ్రహ్మ, బృహస్పతి అందరూ రాజే. (26)
ప్రజాపతిర్విరాట్ సమ్రాట్ క్షత్రియో భూపతిర్నృపః ।
య ఏభిః స్తూయతే శబ్దైః కస్తం నార్చితుమర్హతి ॥ 27
పురయోనిర్యుధాజిచ్చ అభియా ముదితో భవః ।
స్వర్ణేతా సహజిద్ బభ్రుః ఇతి రాజాభిధీయతే ॥ 28
సత్యయోనిః పురావిచ్చ సత్యధర్మప్రవర్తకః ।
అధర్మాదృషయో భీతాః బలం క్షత్రే సమాదధన్ ॥ 29
రాజే ప్రజాపతి, విరాట్టు, సమ్రాట్టు, క్షత్రియుడు, భూపతి, నృపుడు - మొదలైన శబ్దాలతో సుత్తింపబడతాడు. ఆయననందరూ పూజిస్తారు. పురాయోని, యుధాజిత్తు, అభియుడు, ముదితుడు, భవుడు, స్వర్ణేత, సహజిత్తు, బభ్రువు - ఇవన్నీ రాజుకు పేర్లే. రాజే సత్యానికి కారణం. రాజే ప్రాచీన చరిత్ర తెలిసినవాడు. రాజే సత్యధర్మప్రవర్తకుడు. మహర్షులు అధర్మం వలన భయపడి బ్రాహ్మబలాన్ని క్షత్రియులలో నిక్షేపించారు. (27-29)
ఆదిత్యో దివి దేవేషు తమో నుదతి తేజసా ।
తథైవ నృపతిర్భూమౌ అధర్మాన్నుదతే భృశమ్ ॥ 30
దేవలోకంలోని దేవతలలో సూర్యుడు తన తేజస్సుతో చీకటిని పారద్రోలినట్లు భూలోకంలో రాజు అధర్మాన్ని పారద్రోలుతాడు. (30)
తతో రాజ్ఞః ప్రధానత్వం శాస్త్రప్రామాణ్యదర్శనాత్ ।
ఉత్తరః సిద్ధ్యతే పక్షో యేన రాజేతి భాషితమ్ ॥ 31
కాబట్టి శాస్త్రప్రమాణాల ననుసరించి రాజే ప్రధానుడు. రాజే విధాత అని పలికిన వాని వాదమే శ్రేష్ఠం. (31)
మార్కండేయ ఉవాచ
తతః స రాజా సంహృష్టః సిద్ధే పక్షే మహామనాః ।
తమత్రిమబ్రవీత్ ప్రీతః పూర్వం యేనాభిసంస్తుతః ॥ 32
యస్మాత్ పూర్వం మనుష్యేషు జ్యాయాంసం మామిహాబ్రవీః ।
సర్వదేవైశ్చ విప్రర్షే సమ్మితం శ్రేష్ఠమేవ చ ॥ 33
తస్మాత్ తేఽహం ప్రదాస్యామి వివిధం వసు భూ చ ।
దాసీసహస్రం శ్యామానాం సువస్త్రాణామలంకృతమ్ ॥ 34
దశకోటీర్హిరణ్యస్య రుక్మభారాంస్తథా దశ ।
ఏతద్ దదామి విప్రర్షే సర్వజ్ఞస్త్వం మతో హి మే ॥ 35
మార్కండేయుడిలా అన్నాడు - ఏదో ఒక పక్షం గెలిచి వివాదం సమసిపోగా ఆనందించిన మహనీయుడు, పృథువు అంతకుముందు తనను స్తుతించిన అత్రితో ఇలా అన్నాడు.
బ్రహర్షీ! ఇంతకుముందు నన్ను (రాజును) జ్యేష్ఠునిగా, శ్రేష్ఠునిగా సర్వదేవసమానునిగా ప్రకటించావు. కాబట్టి నీకు వివిధధనాలను మిక్కిలిగా ఇస్తాను. సుందరవస్త్రాభరణాలు
ధరించిన యువతులను వేలకొలదిగ నీకు దాసులుగా ఇస్తాను.
బ్రహ్మర్షీ! పదికోట్ల బంగారు నాణాలు, పదిబారువుల బంగారం నీకిస్తాను. నీవు సర్వజ్ఞుడ వని నేను భావిస్తున్నాను. (32-35)
తదత్రిర్న్యాయతః సర్వం ప్రతిగృహ్యాభిసత్కృతః ।
ప్రత్యుజ్జగామ తేజస్వీ గృహనేవ మహాతపాః ॥ 36
తేజస్వి, మహాతపస్వి అయిన అత్రిమహర్షి ఆ రాజసత్కారాన్ని పొంది న్యాయబద్ధంగా లభించిన ఆ ధనాన్నంతా తీసికొని ఇంటికి వెళ్ళిపోయాడు. (36)
ప్రదాయ చ ధనం ప్రీతః పుత్రేభ్యః ప్రయతాత్మవాన్ ।
తపః సమభిసంధాయ వనమేవాన్వపద్యత ॥ 37
అత్రి ఆనందంతో తన కుమారులకు ధనాన్ని ఇచ్చి నియతాత్ముడై తపస్సుపై మనస్సు నుంచి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. (37)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి బ్రాహ్మణమాహాత్మ్యే పంచాశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 185 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున బ్రాహ్మణమాహాత్మ్యమను నూట యెనుబది అయిదవ అధ్యాయము. (185)