183. నూట ఎనుబది మూడవ అధ్యాయము
సత్యాకృష్ణులు నారదమార్కండేయులు కామ్యకవనము చేరుట.
కామ్యకం ప్రాప్య కౌరవ్య యుధిష్ఠిరపురోగమాః ।
కృతాతిథ్యా మునిగణైః నిషేదుః సహ కృష్ణయా ॥ 1
తతస్తాన్ పరివిశ్వస్తాన్ వసతః పాండునందనాన్ ।
బ్రాహ్మణా బహవస్తత్ర సమంతాత్ పర్యవారయన్ ॥ 2
అథాబ్రవీద్ ద్విజః కశ్చిద్ అర్జునస్య ప్రియః సఖా ।
స ఏష్యతి మహాబాహుః వశీ శౌరిరుదారధీః ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు.
జనమేజయా! ధర్మరాజు మొదలుగా గల పాండవులు కామ్యకవనాన్ని చేరి మునిజనుల ఆతిథ్యాన్ని స్వీకరించి ద్రౌపదితో కలిసి నివసిస్తున్నారు. విశ్వాసపాత్రులైన ఆ పాండుకుమారులు అక్కడ నివసిస్తున్న సమయంలో చాలా మంది బ్రాహ్మణులు వారి చుట్టూ చేరారు.
వారిలో ఒక బ్రాహ్మణులు అందరినీ అదుపు చేయగల ఉదారబుద్ధి, అర్జునుని ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుడు అక్కడకు రాబోతున్నాడని చెప్పాడు. (1-3)
విదితా హి హరేర్యూయమ్ ఇహాయాతాః కురూద్వహాః ।
సదా హి దర్శనాకాంక్షీ శ్రేయోఽన్వేషీ చ వో హరిః ॥ 4
కురువంశశ్రేష్ఠులారా! మీరు ఇక్కడకు వచ్చినట్లు శ్రీకృష్ణునకు తెలుసు. ఆయనెప్పుడూ మీ శ్రేయస్సును గురించియే ఆలోచిస్తూ మిమ్ములను చూడగోరుతుంటాడు. (4)
బహువత్సరజీవీ చ మార్కండేయో మహాతపాః ।
స్వాధ్యాయతపసా యుక్తః క్షిప్రం యుష్మాన్ సమేష్యతి ॥ 5
మహాతపస్వి, స్వాధ్యాయ తపస్సులమీదనే ఆసక్తి గలవాడు. చిరంజీవి అయిన మార్కండేయమహర్షి కూడా త్వరలోనే మిమ్ములను కలుస్తాడు. (5)
తథైవ బ్రువతస్తస్య ప్రత్యదృశ్యత కేశవః ।
శైబ్యసుగ్రీవయుక్తేన రథేన రథినాం వరః ॥ 6
మఘవానివ పౌలోమ్యా సహితః సత్యభామయా ।
ఉపాయాద్ దేవకీపుత్రో దిదృక్షుః కురుసత్తమాన్ ॥ 7
ఆ బ్రాహ్మణుడు అలా అంటుండగానే కేశవుడు కనిపించాడు. రథికశ్రేష్ఠుడైన ఆ హరి శైబ్యసుగ్రీవాలనే గుర్రాలు పూన్చిన రథంపై సత్యభామతో కూడి శచీదేవితో కూడిన ఇంద్రునివలె కురుసత్తములైన పాండవులను చూడాలని వచ్చాడు. (6,7)
అవతీర్య రథాన్ కృష్ణః ధర్మరాజం యథావిధి ।
వవందే ముదితో ధీమాన్ భీమం చ బలినాం వరమ్ ॥ 8
ధీమంతుడైన శ్రీకృష్ణుడు రథం నుండి దిగి ధర్మరాజుకు, బలిష్ఠుడైన భీమునకు యథావిధిగా నమస్కరించి, ఆనందించాడు. (8)
పూజయామాస ధౌమ్యం చ యమాభ్యామభివాదితః ।
ప।ష్వజ్య గుడాకేశం ద్రౌపదీం పర్యసాంత్వయత్ ॥ 9
స దృష్ట్వా ఫాల్గునం వీరం చిరస్య ప్రియమాగతమ్ ।
పర్యష్వజత దాశార్హః పునః పునరరిందమః ॥ 10
శ్రీకృష్ణుడు ధౌమ్యుని అర్చించాడు. నకులసహదేవుల అభివాదాలు స్వీకరించాడు. అర్జునుని కౌగిలించుకొన్నాడు. ద్రౌపదిని ఓదార్చాడు. చాలాకాలం తర్వాత కనిపించిన వీరుని, తనకిష్టుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు పదేపదే కౌగిలించుకొన్నాడు. (9,10)
తథైవ సత్యభామాపి ద్రౌపదీం పరిషస్వజే ।
పాండవానాం ప్రియాం భార్యాం కృష్ణస్య మహిషీ ప్రియా ॥ 11
కృష్ణుని పట్టమహిషి అయిన సత్యభామకూడా పాండవుల ప్రియబార్యా అయిన ద్రౌపదిని కౌగిలించుకొన్నది. (11)
తతస్తే పాండవాః సర్వే సభార్యాః సపురోహితాః ।
ఆనర్చుః పుండరీకాక్షం పరివవ్రుశ్చ సర్వశః ॥ 12
అప్పుడుఆ పాండవులందరూ భార్యాపురోహితులతో కలిసి కృష్ణుని పూజించి ఆయనచుట్టూ చేరారు. (12)
కృష్ణస్తు పార్థేన సమేత్య విద్వాన్
ధనంజయేనాసురతర్జనేన ।
బభౌ యథా భూతపతిర్మహాత్మా
సమేత్య సాక్షాద్ భగవాన్ గుహేన ॥13
శత్రుభయంకరుడైన ధనంజయునితో కూడిన సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు కార్తికేయునితో కూడిన మహనీయుడైన సాక్షాత్తు పరమేశ్వరునివలె శోభిల్లాడు. (13)
తతః సమస్తాని కిరీటమాలీ
వనేషు వృత్తాని గదాగ్రజాయ ।
ఉక్త్వా యథావత్ పునరన్వపృచ్ఛత్
కథం సుభద్రా చ స చాభిమన్యుః ॥ 14
అప్పుడు అర్జునుడు అరణ్యవాసంలోని సర్వవృత్తాంతాన్ని యథాతథంగా శ్రీకృష్ణునకు చెప్పి సుభద్రాభిమన్యుల క్షేమాన్ని అడిగాడు. (14)
స పూజయిత్వా మధుహా యథావత్
పార్థం చ కృష్ణాం చ పురోహితం చ ।
ఉవాచ రాజానమభిప్రశంసన్
యుధిష్ఠిరం తత్ర సహోపవిశ్య ॥ 15
మధుసూదనుడు అర్జునుని, ద్రౌపదిని, పురోహితుని సత్కరించి అందరితో కలిసి కూర్చొని యుధిష్ఠిరుని ప్రశంసిస్తూ ఇలా అన్నాడు. (15)
ధర్మః పరః పాండవ రాజ్యలాభాత్
తస్యార్థమాహుస్తవ ఏవ రాజన్ ।
సత్యార్జవాభ్యాం చరతా స్వధర్మం
జితస్త్వయాయం చ పరశ్చ లోకః ॥ 16
పాండుకుమారా! రాజ్యలాభం కన్న ధర్మమే గొప్పది. ధర్మసాధనకు తపస్సే మార్గం. నీవు సత్యంగా, నిజాయితీగా ధర్మాన్ని పాటిస్తున్నావు. అందువలన ఇహపరలోకాలను గెలువగలుతున్నావు. (16)
అధీతమగ్రే చరతా వ్రతాని
సమ్యగ్ ధనుర్వేదమవాప్య కృత్స్నమ్ ।
క్షాత్రేణ ధర్మేణ వసూని లబ్ధ్వా
సర్వే హ్యవాప్తాః క్రతవః పురాణాః ॥ 17
న గ్రామ్యధర్మేషు రతిస్తవాస్తి
కామాన్న కించిత్ కురుషే నరేంద్ర ।
న చార్థలోభాత్ ప్రజహాసి ధర్మం
తస్మాత్ ప్రభావాదసి ధర్మరాజః ॥ 18
బ్రహ్మచర్యాదివ్రతపాలన చేస్తూ ముందు వేదాధ్యయనం చేశావు. ఆఫై ధనుర్వేదం మొత్తాన్ని చక్కగా అభ్యసించావు. క్షాత్రధర్మంతో ధనం సంపాదించి ప్రాచీన క్రతువుల నన్నింటినీ నిర్వహించావు. నీకు గ్రామ్యధర్మాలపై ఆసక్తిలేదు. కామదృష్టితో ఏ పనీ చేయవు. అర్థం మీది ఆసక్తితో ధర్మాన్ని వీడవు. ఆ ప్రభావం వలననే నీవు ధర్మరాజువు. (17,18)
దానం చ సత్యం చ తపశ్చ రాజన్
శ్రద్ధా చ బుద్ధిశ్చ క్షమా ధృతిశ్చ ।
అవాస్య రాష్ట్రాణి వసూని భోగా
నేషా పరా పార్థ సదా రతిస్తే ॥ 19
రాజా! రాజ్యాన్ని, సంపదను, భోగాలను పొంది కూడా నీవు సత్యం, తపస్సు, శ్రద్ధ , బుద్ధి, క్షమ, ధైర్యం ఈ సద్గుణాలను ప్రేమిస్తున్నావు. (19)
యదా జనౌఘః కురుజాంగలానాం
కృష్ణాం సభాయామవశామపశ్యత్ ।
అపేతధర్మవ్యవహారవృత్తం
సహేత తత్ పాండవ కస్త్వదన్యః ॥ 20
పాండుకుమారా! కురుజాంగల దేశంలోని జనసమూహం జూదసభలో నిస్సహాయ అయిన ద్రౌపదిని చూచి, ఆమెతో అధర్మంగా మాటాడినప్పుడు కూడా దానిని నీవు సహించావు. మరొకడు అటువంటిది సహించలేడు. (20)
అసంశయం సర్వసమృద్ధకామః
క్షిప్రం ప్రజాః పాలయితాసి సమ్యక్ ।
ఇమే వయం నిగ్రహణే కురూణాం
యది ప్రతిజ్ఞా భవతః సమాప్తా ॥ 21
త్వరలోనే నీ కోరికలన్నీ తీరి ప్రజలను చక్కగా ప।పాలించగలుగుతావు. సందేహం లేదు. అరణ్యవాసరూపమైన నీ ప్రతిజ్ఞ ముగిసిన వెంటనే కౌరవులను దండించటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. (21)
ధౌమ్యం చ భీమం చ యుధిష్ఠిరం చ
యమౌ చ కృష్ణాం చ దశార్హసింహః ।
వాచ దిష్ట్యా భవతాం శివేన
ప్రాప్తః కిరీటీ మిదితః కృతాస్త్రః ॥ 22
ధౌమ్యుని, భీముని, ధర్మరాజును, నకులసహదేవులను, ద్రౌపదిని చూచి శ్రీకృష్ణుడు "మీపుణ్యం వలన, అదృష్టం వలన అర్జునుడు అస్త్రవిద్యలో పారంగతుడై ఆనందంగా తిరిగివచ్చాడు" అన్నాడు. (22)
ప్రోవాచ కృష్ణామపి యాజ్ఞసేనీం
దశార్హభర్తా సహితః సుహృద్భిః ।
దిష్ట్యా సమగ్రాసి ధనంజయేన
సమాగతేత్యేవమువాచ కృష్ణః ॥ 23
కృష్ణే ధనుర్వేదరతిప్రధాన
స్తవాత్మజాస్తే శిశవః సుశీలాః ।
సద్భిః సదైవాచరితం సుహృద్భి
శ్చరంతి పుత్రాస్తవ యాజ్ఞసేవి ॥ 24
మిత్రపరివృతుడైన కృష్ణుడు యాజ్ఞసేని అయిన ద్రౌపదితో ఇలా అన్నాడు - అర్జునుని పొంది నీ మనోరథాలను సఫలం చేసికొన్నావు. ఇది అదృష్టఫలం. ద్రౌపదీ! నీ బిడ్డలు మంచివారు. ధనుర్వేద విశారదులు. వారు సజ్జనుల మధ్య నిలిచి సత్పురుషుల మార్గాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నారు. (23,24)
రాజ్యేన రాష్ట్రైశ్చ నిమంత్య్రమాణాః
పిత్రా చ కృష్ణే తవ సోదరైశ్చ ।
న యజ్ఞసేనస్య న మాతులానాం
గృహేషు బాలా రతిమాప్నువంతి ॥ 25
ద్రౌపదీ! నీ తండ్రీ, నీ సోదరులూ రాజ్యాన్నీ, రాజ్యభోగాలనూ ఎరగా చూపి పిలిచినా నీ పిల్లలు తమ తాత దగ్గర కానీ, మేనమామల దగ్గర గానీ ఉండటానికి ఇష్టపడలేదు. (25)
ఆనర్తమేవాభిముఖాః శివేన
గత్వా ధనుర్వేదరతిప్రధానాః ।
తవాత్మజా వృష్టిపురం ప్రవిశ్య
న దైవతేభ్యః స్పృహయంతి కృష్ణే ॥ 26
ద్రౌపదీ! ధనుర్విద్యాసక్తులయిన నీ కుమారులు ఆనర్తదేశానికి క్షేమంగా చేరి ద్వారకలో నివసిస్తున్నారు. వారు అక్కడ నుండి దేవలోకానికి వెళ్ళటానికి కూడా ఇష్టపడటం లేదు. (26)
యథా త్వమేవార్హసి తేషు వృత్తం
ప్రయోక్తుమార్యా చ తథైవ కుంతీ ।
తేష్వప్రమాదేవ తథా కరోతి
తథైవ భూయశ్చ తథా సుభద్రా ॥ 27
నీవు కానీ, పూజ్యురాలు కుంతి కానీ ఏవిధంగా బుద్ధులు చెప్పి పిల్లలను పెంచగలరో అదేవిధంగా సుభద్రకూడా ఏమరుపాటు లేకుండా వారిని పెంచుతోంది. (27)
యథానిరుద్ధస్య యథాభిమన్యోః
యథా సునీథస్య యథైవ భానోః ।
తథా వినేతా చ గతిశ్చ కృష్ణే
తవాత్మజానామపి రౌక్మిణేయః ॥ 28
ద్రౌపదీ! రుక్మిణి కొడుకు ప్రద్యుమ్నుడు అనిరుద్ధునికి, అభిమన్యునికి, సునీథునకు, భానువునకు విద్య నేర్పి సంరక్షించినట్లు నీ కొడుకులకు కూడా శిక్షకుడు, సంరక్షకుడు అయ్యాడు. (28)
గదాసిచర్మగ్రహణేషు శూరాన్
అస్త్రేషు శిక్షాసు రథాశ్వయానే ।
సమ్యగ్ వినేతా వినయత్యతంద్రః
తాంశ్చాభిమన్యుః సతతం కుమారః ॥ 29
అభిమన్యుకుమారుడు శూరలయిన నీ కుమారులకు గద, కత్తి, డాలులను ప్రయోగించటంలో, వివిధాస్త్రవిద్యలలో అవిశ్రాంతంగా తీర్చిదిద్ధుతున్నాడు. రథాన్ని, గుర్రాలను నడపటంలో శిక్షణనిస్తున్నాడు. (29)
స చాపి సమ్యక్ ప్రణిధాయ శిక్షాం
శస్త్రాణి చైషాం విధివత్ ప్రదాయ ।
తవాత్మజానాం చ తథాభిమన్యోః
పరాక్రమైస్తుష్యతి రౌక్మిణేయః ॥ 30
రుక్మిణికొడుకు ప్రద్యుమ్నుడు కూడా నీ కుమారులకు శిక్షణనిచ్చి వివిధ శస్త్రాలను విధిపూర్వకంగా ఇచ్చాడు. నీ కొడుకులూ, అభిమన్యుడూ ప్రదర్శిస్తున్న పరాక్రమాలను చూచి ఆనందిస్తున్నాడు. (30)
యదా విహారం ప్రసమీక్షమాణాః
ప్రయాంతి పుత్రాస్తవ యాజ్ఞసేని ।
ఏకైకమేషామనుయాంతి తత్ర
రథాశ్చ యానాని చ దంతినశ్చ ॥ 31
యాజ్ఞసేనీ! నీ కుమారులు నగర విహారానికి బయలుదేరినప్పుడు ఒక్కొక్కరి వెంట రథాలు, పల్లకీలు, ఏనుగులు వెళ్తున్నాయి. (31)
అథాబ్రవీద్ ధర్మరాజం తు కృష్ణః
దశార్హయోధాః కుకురాంధకాశ్చ ।
ఏతే నిదేశం తవ పాలయంతః
తిష్ఠంతు యత్రేచ్ఛసి తత్ర రాజన్ ॥ 32
అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. రాజా! దశార్హ, కుకుర, అంధక వీరులు నీ ఆదేశాలను పాటిస్తూ నీవు ఉండమన్న చోట ఉండటానికి సిద్ధంగా ఉన్నారు. (32)
ఆవర్తతాం కార్ముకవేగవాతా
హలాయుధప్రగ్రహణా మధూనామ్ ।
సేనా తవార్థేషు నరేంద్ర యత్తా
ససాదిపత్త్యశ్వరథా సనాగా ॥ 33
రాజా! బలరాముని నేతృత్వంలోని గోపసేన ఆశ్వికులతో కూడిన అశ్వాలు, రథాలు, ఏనుగులు, పదాతులతో సహా సదా సన్నద్ధమై నీకోసమున్నది. ఆ యోధుల ధనుర్వేగం వాయువేగంతో సమానం. (33)
ప్రస్థాప్యతాం పాండవ ధార్తరాష్ట్రః
సుయోధనః పాపకృతాం వరిష్ఠః ।
స సానుబంధః ససుహృద్గణశ్చ
భౌమస్య సౌభాధిపతేశ్చ మార్గమ్ ॥ 34
పాండునందనా! పాపాత్ములలో శ్రేష్ఠుడైన ధృతరాష్ట్రకుమారుని - సుయోధనుని - బంధుమిత్రులతో సహా నరకాసురుని శాల్వుని నడిపించిన బాటలోనే నడిపించు. (34)
కామం తథా తిష్ఠ నరేంద్ర తస్మిన్
యథా కృతస్తే సమయః సభాయామ్ ।
దాశార్హయోధైస్తు హతారియోధం
ప్రతీక్షతాం నాగపురం భవంతమ్ ॥ 35
మహారాజా! సభలో నీవు చేసిన ప్రతిజ్ఞను నీవు పాటించు. నీవు ఆదేశిస్తే యదువీరులు నీ శత్రువుల నందరినీ సంహరిస్తారు. హస్తినాపురం నీరాకకై నిరీక్షిస్తుంది. (35)
వ్యపేతమన్యుర్వ్యపనీతపాప్మా
విహృత్య యత్రేచ్ఛసి తత్ర కామమ్ ।
తతః ప్రసిద్ధం ప్రథమం విశోకః
ప్రపత్స్యసే నాగపురం సురాష్ట్రమ్ ॥ 36
నీవు క్రోధాన్నీ, దైన్యాన్నీ వీడి నీ ఇష్టం వచ్చినచోట వసించు. ఆ తరువాత శోకరహితుడవై ప్రసిద్ధమూ, శ్రేష్ఠమూ అయిన హస్తినాపురికి చేరుకో! (36)
తతస్తదాజ్ఞాయ మతం మహాత్మా
యథావదుక్తం పురుషోత్తమేన ।
ప్రశస్య విప్రేక్ష్య చ ధర్మరాజః
కృతాంజలిః కేశవమిత్యువాచ ॥ 37
అప్పుడు మహాత్ముడైన ధర్మరాజు పురుషోత్తముడైన శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని విని, గ్రహించి బహుధా ప్రశంసించి చేతులు జోడించి ఇలా అన్నాడు. (37)
అసంశయం కేశవ పాండవానాం
భవాన్ గతిస్త్వచ్ఛరణా హి పార్థాః ।
కాలోదయే తచ్చ తతశ్చ భూయః
కర్తా భవాన్ కర్మ న సంశయోఽస్తి ॥ 38
కేశవా! పాండవులకు నీవే గతి. కుంతీపుత్రులకు నీవే శరణు. ఈ విషయంలో సంశయం లేదు. సమయం వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పిన పని అంతా నీవు చేసి చూపిస్తావు. దానిలో కూడా సందేహం లేదు. (38)
యథాప్రతిజ్ఞం విహృతశ్చ కాలః
సర్వాః సమా ద్వాదశ నిర్జనేషు ।
అజ్ఞాతచర్యాం విధివత్ సమాప్య
భవద్గతాః కేశవ పాండవేయాః ॥ 39
ఏషైవ బుద్ధిర్జుషతాం సదా త్వాం
సత్యే స్థితాః కేశవ పాండవేయాః ।
సదానధర్మాః సజనాః సదారాః
సబాంధవాస్త్వచ్ఛరణాహి పార్థాః ॥ 40
చేసిన ప్రతిజ్ఞ ననుసరించి పండ్రెండు సంవత్సరాల కాలం నిర్జనవనాల్లో గడిపి, యథావిధిగా అజ్ఞాత వాసాన్ని కూడా పూర్తిచేసి మేమంతా నీ అధీనంలో నిలుస్తాం.
కేశవా! పాండవులు సత్యవంతులన్న నీ అభిప్రాయాన్ని స్థిరంగా నిలవనీ! దానధర్మాలతో, పరిజనులతో, పత్నులతో, బాంధవులతో కలిసి కౌంతేయులు ఎప్పుడూ నీ అధీనంలోని వారే. (39,40)
వైశంపాయన ఉవాచ
తథా వదతి వార్ ష్ణేయ ధర్మరాజే చ భారత ।
అథ పశ్చాత్ తపోవృద్ధః బహువర్షసహధృక్ ॥ 41
ప్రత్యదృశ్యత ధర్మాత్మా మార్కండేయో మహాతపాః ।4
అజరశ్చామరశ్చైవ రూపౌదార్యగుణాన్వితః ॥ 42
వ్యదృశ్యత తథా యుక్తో యథా స్యాత్ పంచవింశకః ।
వైశంపాయనుడిలా అన్నాడు.
శ్రీకృష్ణధర్మజులు ఈరీతిగా మాటాడుకొంటున్న సమయంలోనే మహాతపస్వి, తపోవృద్ధుడైన మార్కండేయమహర్షి అక్కడకు వచ్చారు. ఆయన చిరంజీవి. ధర్మస్వరూపుడు అజరుడు, అమరుడు. రూపౌదార్యసంపన్నుడు. వృద్ధుడైనా కూడా ఇరువది అయిదు సంవత్సరాల యువకుడుగా కనిపిస్తున్నవాడు. (41,42 1/2)
తమాగతమృషిం వృద్ధం బహువర్షసహస్రిణమ్ ॥ 43
ఆనర్చుర్బ్రాహ్మణాః సర్వే కృష్ణశ్చ సహ పాండవైః ।
తమర్చితం సవిశ్వస్తమ్ ఆసీనం ఋషిసత్తమమ్ ।
బ్రాహ్మణానాం మతేనాహ పాండవానాం చ కేశవః ॥ 44
వేలసంవత్సరాల వయస్సు గల ఆ మార్కండేయుడు రాగా పాండవులు, శ్రీకృష్ణుడు, బ్రాహ్మణులందరూ ఆయనను అర్చించారు. పూజలందుకొని విశ్వసనీయుడైన ఆ మహర్షి ఆసీనుడు అయ్యాడు. అపుడు పాండవుల, బ్రాహ్మణుల అనుమతితో శ్రీకృష్ణుడు ఆయనతో ఇలా అన్నాడు. (43,44)
కృష్ణ ఉవాచ
శుశ్రూషవః పాండవాస్తే బ్రాహ్మణాశ్చ సమాగతాః ।
ద్రౌపదీ సత్యభామా చ తథాహం పరమం వచః ॥ 45
పురావృత్తాః కథాః పుణ్యా సదాచారాన్ సనాతనాన్ ।
రాజ్ఞాం స్త్రీణామృషీణాం చ మార్కండేయ విచక్ష్వ నః ॥ 46
కృష్ణుడిలా అన్నాడు. మార్కండేయా! ఇక్కడ చేరిన బ్రాహ్మణులు, పాండవులు, ద్రౌపది, సత్యభామ, నేను తమ మాటలు వినాలనుకొంటున్నాము. ప్రాచీనరాజులకు, స్త్రీలకు, మునులకు సంబంధించిన చరిత్రను, కథలను సనాతన సదాచారాలను మాకు చెప్పండి. (45,46)
వైశంపాయన ఉవాచ
తేషు తత్రోపవిష్టేషు దేవర్షిరపి నారదః ।
ఆజగామ విశుద్ధాత్మా పాండవానవలోకకః ॥ 47
వైశంపాయనుడిలా అన్నాడు. వారు అక్కడ కూర్చొని ఉండగానే దేవర్షి, పరిశుద్ధ మనస్కుడైన నారదుడు కూడా పాండవులను చూడాలని అక్కడకు వచ్చాడు. (47)
తమప్యథ మహాత్మానం సర్వే తే పురుషర్షభాః ।
పాద్యార్ఘ్యాభ్యాం యథాన్యాయమ్ ఉపతస్థుర్మనీషిణః ॥ 48
బుద్ధిమంతులు, పురుషశ్రేష్ఠులు అయిన పాండవాదులంతా ఆ మహాత్ముని (నారదుని) కూడా శాస్త్రోక్తరీతిలో అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. (48)
నారదస్త్వథ దేవర్షిః జ్ఞాత్వా తాంస్తు కృతక్షణాన్ ।
మార్కండేయస్య వదతః తాం కథామన్వమోదత ॥ 49
అప్పుడు నారదమహర్షి వారంతా కథాశ్రవణ కుతూహలంతో ఉన్నారని తెలిసి మార్కండేయముని కథాకథనాన్ని ఆమోదించాడు. (49)
ఉవాచ చైనం కాలజ్ఞః స్మయన్నివ సనాతనః ।
బ్రహ్మర్షే కథ్యతాం యత్ తే పాండవేషు వివక్షితమ్ ॥ 50
సనాతనుడు, కాలజ్ఞుడు అయిన శ్రీకృష్ణుడు నవ్వుతూ "బ్రహ్మర్షీ! పాండవులకు మీరు చెప్పదలచినది చెప్పండి" అని మార్కండేయునితో అన్నాడు. (50)
ఏవముక్తః ప్రత్యువాచ మార్కండేయో మహాతపాః ।
క్షణం కురుధ్వం విపులమ్ ఆఖ్యాతవ్యం భవిష్యతి ॥ 51
శ్రీకృష్ణుని మాటలు విని మహాతపస్వి అయిన మార్కండేయుడు "ఏకాగ్రచిత్తులు కండి. చెప్పవలసింది చాలా ఉంది" అని పలికాడు. (51)
ఏవముక్తాః క్షణం చక్రుః పాండవాః సహ తైర్ద్విజైః ।
మధ్యందినే యథాఽదిత్యం ప్రేక్షంతస్తే మహామునిమ్ ॥ 52
ఆ మాటవిని పాండవులు ఆ బ్రాహ్మణులతో సహా మధ్యందిన మార్తాండుని చూస్తున్నట్లు ఆ మార్కండేయమహర్షిని చూస్తూ మిన్నకున్నారు. (52)
వైశంపాయన ఉవాచ
తం వివక్షంతమాలక్ష్య కురురాజో మహామునిమ్ ।
కథాసంజననార్థాయ చోదయామాస పాండవః ॥ 53
వైశంపాయనుడిలా అన్నాడు.
మార్కండేయుడు చెప్పబోవటాన్ని గమనించి యుధిష్ఠిరుడు ఆ మునిని కథాప్రారంభానికి ప్రోత్సహిస్తూ ఇలా అన్నాడు. (53)
భవాన్ దైవతదైత్యానామ్ ఋషీణాం చ మహాత్మనామ్ ।
రాజర్షీణాం చ సర్వేషాం చరితజ్ఞః పురాతనః ॥ 54
తమరు దేవతలు, దైత్యులు, మహర్షులు, రాజర్షులు... ఈ అందరి చరిత్రలు తెలిసిన పురాతనులు. (54)
సేవ్యశ్చోపాపితవ్యశ్చ మతో నః కాంక్షితశ్చిరమ్ ।
అయం చ దేవకీపుత్రః ప్రాప్తోఽస్మానవలోకకః ॥ 55
ఎప్పటినుండో మిమ్ము చూడాలనీ, సేవించాలనీ కోరుకొంటున్నాం.ఈ శ్రీకృష్ణుడు కూడా మమ్ము చూడాలని వచ్చాడు. (55)
భవత్యేవహి మే బుద్ధిః దృష్ట్వాఽఽత్మానం సుఖాచ్ఛ్యుతమ్ ।
ధార్తరాష్ట్రాంశ్చ దుర్వృత్తాన్ ఋధ్యతః ప్రేక్ష్య సర్వశః ॥ 56
సుఖాలకు దూరమైన నన్ను దుర్మార్గులై కూడా సమృద్ధిని పొందుతున్న ధార్తరాష్ట్రులను చూచి నేను ఆలోచిస్తుంటాను. (56)
కర్మణః పురుషః కర్తా శుభస్యాప్యశుభస్య వా ।
స ఫలం తదుపాశ్నాతి కథం కర్తా స్విదీశ్వరః ॥ 57
కుతో వా సుఖదుఃఖేషు నృణాం బ్రహ్మవిదాం వర ।
ఇహ వా కృతమన్వేతి పరదేహేఽథ వా పునః ॥ 58
మంచిపనికైనా చెడ్డపనికైనా కర్త పురుషుడే. దాని ఫలాన్ని తాను అనుభవిస్తాడే కాని పరమాత్మా కర్త కాడు. బ్రహ్మజ్ఞానీ!
సుఖదుఃఖకారణాలయిన కర్మలపై మనుషుల బుద్ధి ఎందుకు చిక్కుకొంటోంది? ఫలితం ఈ లోకంలోనే కలుగుతుందా? పరలోకంలోనా? (57,58)
దేహీ చ దేహం సంత్యజ్య మృగ్యమాణః శుభాశుభైః ।
కథం సంయుజ్యతే ప్రేత్య ఇహ వా ద్విజసత్తమ ॥ 59
ద్విజోత్తమా! ప్రాణి దేహాన్ని విడిచిన తరువాత శుభాశుభకర్మలు ప్రాణిని ఎలా చేరుతాయి? ఇహపర లోకాలలో కర్మఫలాలతో జీవునకు సంయోగమెలా జరుగుతుంది? (59)
ఐహలౌకికమేవేహ ఉతాహో పారలౌకికమ్ ।
క్వ చ కర్మాణి తిష్ఠంతి జంతోః ప్రేతస్య భార్గవ ॥ 60
మార్కండేయ ఉవాచ
త్వద్యుక్తోఽయమనుప్రశ్నః యథావద్ వదతాం వర ।
విదితం వేదితవ్యం తే స్థిత్యర్థం త్వం తు పృచ్ఛసి ॥ 61
మార్కండేయుడిలా అన్నాడు. వాగ్మీ! ఈ నీ ప్రశ్నలు అన్నీ యుక్తియుక్తాలే. తెలియవలసినదంతా తెలిసినవాడవు నీవు. కేవలం లోకమర్యాద కోసం నన్ను అడుగుతున్నావు. (61)
అత్ర తే కథయిష్యామి తదిహైకమనాః శృణు ।
యథేహాముత్ర చ నరః సుఖదుఃఖముపాశ్నుతే ॥ 62
ఈ లోకంలో కానీ పరలోకంలో కాని ప్రాణి సుఖదుఃఖాలను అనుభవించే విషయాన్ని నీకు చెపుతాను. సావధానుడవై విను. (62)
నిర్మలాని శరీరాణి విశుద్ధాని శరీరిణామ్ ।
ససర్జ ధర్మతంత్రాణి పూర్వోత్పన్నః ప్రజాపతిః ॥ 63
తొలుత ప్రజాపతి బ్రహ్మ జన్మించాడు. ప్రాణులకోసం నిర్మలపవిత్ర శరీరాలను సృష్టించాడు. వాటితోపాటు ధర్మతంత్రాలను ప్రకటించాడు.(63)
అమోఘఫలసంకల్పాః సువ్రతాః సత్యవాదినః ।
బ్రహ్మభూతా నరాః పుణ్యాః పురాణాః కురుసత్తమ ॥ 64
కురుశ్రేష్ఠా! ప్రాచీన మానవులు మంచివ్రతాలు చేసేవారు. సత్యవాదులు.వారి సంకల్పాలు వ్యర్థమయ్యేవి కావు. వారంతా పున్యాత్ములు, బ్రహ్మస్వరూపులూనూ. (64)
సర్వే దేవైః సమాయాంతి స్వచ్ఛందేన నభస్తలమ్ ।
తతశ్చ పునరాయాంతి సర్వే స్వచ్ఛందచారిణః ॥ 65
స్వచ్ఛందమరణాశ్చాసన్ నరాః స్వచ్ఛందచారిణః ।
అల్పబాధా నిరాతంకాః సిద్ధార్థా నిరుపద్రవాః ॥ 66
నాటివారందరూ స్వచ్ఛందంగా ప్రయాణించగలవారు. స్వచ్ఛందమరణం గలవాఱు. బాధలూ, భయాలూ, ఉపద్రవాలూ లేనివారు. సిద్ధసంకల్పులు. (65,66)
ద్రష్టారో దేవసంఘానామ్ ఋషీణాం చ మహాత్మనామ్ ।
ప్రత్యక్షాః సర్వధర్మాణాం దాంతా విగతమత్సరాః ॥ 67
ఆసన్ వర్షసహస్రీయాః తథా పుత్రసహస్రిణః ।
మహనీయులయిన మునులను దేవతలను వారు చూడగలిగేవారు. సర్వధర్మాలు వారికి తెలిసినవే. వారు నిగ్రహం కలవారూ, మాత్సర్యం లేనివారూను వేయిసంవత్సరాలు జీవించేవారు. వేలకొద్ది పుత్రులను పొందేవారు. ((67 1/2)
తతః కాలాంతరేఽన్యస్మిన్ పృథివీతలచారిణః ॥ 68
కామక్రోధాభిభూతాస్తే మాయావ్యాజోపజీవినః ।
లోభమోహాభిభూతాశ్చ త్యక్తా దేహైస్తతో నరాః ॥ 69
కొంతకాలం తర్వాత భూలోకవాసులంతా కామక్రోధాలకు లొంగి, లోభమోహవశులై మాయలతోనూ, సాకులతోనూ జీవిస్తూ శరీరాన్ని విడిచేవారు. (68,69)
అశుభైః కర్మభిః పాపాః తిర్యఙ్ నిరయగామినః ।
సంసారేషు విచిత్రేషు పచ్యమానాః పునః పునః ॥ 70
అశుభకర్మల నాచరిస్తూ పాపాత్ములై సంసారజీవితంలో మరలమరల పరితపిస్తూ జీవించేవారు. (70)
మోఘేష్టా మోఘసంకల్పాః మోఘజ్ఞానా విచేతసః ।
సర్వాభిశంకినశ్చైవ సంవృత్తాః క్లేశదాయినః ॥ 71
వారి యాగాలు, వారు సంకల్పాలు, వారి జ్ఞానం అంతా వ్యర్థమయ్యాయి. బుద్ధిహీనులై అన్నింటిని సంశయిస్తూ కష్టపెట్టేవారయ్యారు. (71)
అశుభైః కర్మభిశ్చాపి ప్రాయశః పరిచిహ్నితాః ।
దౌష్కుల్యా వ్యాధిబహులా దురాత్మానోఽప్రతాపినః ॥ 72
సాధారణంగా అశుభకర్మలచేతనే గుర్తింపబడుతూ వంశభ్రష్టులు, వ్యాధిపీడితులు, దుర్మార్గులు, ప్రతాపహీనులు అయ్యారు. (72)
భవంత్యల్పాయుషః పాపాః రౌద్రకర్మఫలోదయాః ।
వాథంతః సర్వకామానాం నాస్తికా భిన్నచేతసః ॥ 73
పాపులై దారుణమైన పనులు చేసినందువల్ల అల్పాయుష్కులవుతారు. అన్ని కోరికలపై పెత్తనం చేస్తూ నాస్తికులుగానూ, మనోభేదం కలవారుగానూ తయారవుతారు. (73)
జంతోః ప్రేతస్య కౌంతేయ గతిః స్వైరిహ కర్మభిః ।
ప్రాజ్ఞస్య హీనబుద్ధేశ్చ కర్మకోశః క్వ తిష్ఠతి ॥ 74
క్వస్థస్తత్ సముపాశ్నాతి సుకృతం యది వేతరత్ ।
ఇతి తే దర్శనం యచ్చ తత్రాప్యనునయం శృణు ॥ 75
కుంతీనందనా! మరణానంతరం జీవునిగతి తానుచేసిన కర్మల ననుసరించి ఉంటుంది. అయితే జ్ఞానికయినా అజ్ఞానికయినా తాను చేసిన కర్మలు ఎక్కడ నిలిచి ఉంటాయి? జీవుడు ఎక్కడ నిలిచి పాపపుణ్యాల ఫలితాలను అనుభవిస్తాడు? ఇది నీ ప్రశ్న. దానికి సమాధానమిస్తాను. విను. (74,75)
అయమాదిశరీరేణ దేవసృష్టేన మానవః ।
శుభానామశుభానాం చ కురుతే సంచయం మహత్ ॥ 76
ఆయుషోఽంతే ప్రహాయేదం క్షీణప్రాయం కలేబరమ్ ।
సంభవత్యేవ యుగపద్ యోనౌ నాస్త్యంతరాభవః ॥ 77
మానవుడు శుభాశుభ కర్మలను దైవనిర్మితమయిన అంతఃకరణంలో ప్రోగుచేసి నిలుపుకొంటాడు ఆయువు తీరినంతనే నశ్వరమయిన ఈ శరీరాన్ని వీడి వెంటనే మరొక శరీరంలో ప్రవేశిస్తాడు. ఈ మధ్యలో క్షణకాలం కూడా వ్యవధి ఉండదు. (76,77)
తత్రాస్య స్వకృతం కర్మ ఛాయేవానుగతం సదా ।
ఫలత్యథ సుఖార్హో వా దుఃఖార్హో వాథ జాయతే ॥ 78
కృతాంతవిధిసంయుక్తః స జంతుర్లక్షణైః శుభైః ।
అశుభైర్వా నిరాదానో లక్ష్యతే జ్ఞానదృష్ఠిభిః ॥ 79
ఆ నూతనశరీరంలో తాను ముందు చేసిన కర్మ నీడలా వెంటాడుతూ తగిన సమయంలో ఫలిస్తుంది. ఈ విధంగా జీవుడు సుఖదుఃఖాలను అనుభవించవలసి వస్తుంది. యమునికి లోబడిన ఈ జీవుడు శుభాశుభకర్మల వలన కలిగిన సుఖ దుఃఖాలను నివారింపజాలడు. ఇది జ్ఞానులదర్శనం. (78,79)
అతివాహిక ఏవాయం త్వాదృశైశ్చిత్తదాహక,
అధిభౌతికయా బుద్ధ్యా గృహీతశ్చిర భావనాత్ ॥ (నీల)
ఏషా తావదబుద్ధీనాం గతిరుక్తా యుధిష్ఠిర ।
అతః పరం జ్ణానవతాం నిబోధ గతిముత్తమామ్ ॥ 80
యుధిష్ఠిరా! ఈ స్వర్గనరకాత్మకమైన గతి తత్త్వజ్ఞాన శూన్యులకు సంబంధించినది జ్ఞానులు పొందే ఉత్తమగతులను కూడా చెపుతాను. (80)
మనుష్యాస్తప్తతపసః సర్వాగమపరాయణాః ।
స్థిరవ్రతాః సత్యపరాః గురుశుశ్రూషణే రతాః ॥ 81
సుశీలాః శుక్లజాతీయాః క్షాంతా దాంతాః సుతేజసః ।
శుచియోన్యంతరగతాః ప్రాయశః శుభలక్షణాః ॥ 82
జ్ఞానులు తపస్వులు, సర్వశాస్త్రాధ్యయన తత్పరులు స్థిరవ్రతులు, సత్యపరాయణులు, గురుసేవయందు ఆసక్తి గలవారు, సుశీలురు, సత్త్వసంపన్నులు, సహనశీలురు, జితేంద్రియులు, తేజోమయులై ఉంటారు. వారు పరిశుద్ధజన్మను పొంది శుభలక్షణాలతో శోభిల్లుతారు. (81,82)
జితేంద్రియత్వాద్ వశినః శుక్లత్వాన్మందరోగిణః ।
అల్పాబాధపరిత్రాసాద్ భవంతి నిరుపద్రవాః ॥ 83
చ్యవంతం జాయమానం చ గర్భస్థం చైవ సర్వశః ।
స్వమాత్మానం పరం చైవ బుధ్యంతే జానచక్షుషా ॥ 84
వారు జితేంద్రియులు కాబట్టి తమను తాము అదుపుచేసికొనగలరు. సాత్త్వికులు కాబట్టి రోగపీడ కలుగదు. దుఃఖాన్నీ, భయాన్నీ వీడినవారు. ఉపద్రవాలు ఉండవు. వారు గర్భస్థులయినా, గర్భం నుండి జారుతున్నా, జన్మించినా జ్ఞానదృష్టితో ఆత్మానుభవాన్నీ, పరమాత్మానుభవాన్నీ పొందగలరు. (83,84)
ఋషయస్తే మహాత్మానః ప్రత్యక్షాగమబుద్ధయః ।
కర్మభూమిమిమాం ప్రాప్య పునర్యాంతి సురాలయమ్ ॥ 85
లౌకిక శాస్త్రజ్ఞానద్రష్టలు, మహాత్ములు అయిన మహర్షులు ఈ కర్మభూమికి వచ్చి మరల దేవలోకానికి వెళ్తుంటారు. (85)
కించిద్ దైవాద్ధఠాత్ కించిత్ కించిదేవ స్వకర్మభిః ।
ప్రాప్నువంతి నరా రాజన్ మా తేఽస్త్వన్యా విచారణా ॥ 86
రాజా! మనుజుల కర్మఫలంలో కొంత ప్రారబ్ధం వలన, కొంత అప్రయత్నంగా, మరికొంత తమ కర్మల వలన లభిస్తుంది. నీవు మరొకరీతిగా ఆలోచించవలదు. (86)
ఇమామత్రోపమాం చాపి నిబోధ వదతాం వర ।
మనుష్యలోకే యచ్ఛ్రేయః పరం మన్యే యుధిష్ఠిర ॥ 87
ఇహ వైకస్య నాముత్ర అముత్రైకస్య నో ఇహ ।
ఇహ వాముత్ర చైకస్య నాముత్రైకస్య నో ఇహ ॥ 88
యుధిష్ఠిరా! ఈ లోకంలో నేను పరమశ్రేయస్సుగా భావించే విషయంలో ఒక ఉదాహరణ చెపుతాను విను.
కొందరు ఇహలోకంలో సుఖపడతారు పరలోకంలో సుఖముండదు. కొందరు ఇహలోకంలో దుఃఖించినా పరలోకాన సుఖపడతారు కొందరు ఇహపరలోకాలలో సుఖిస్తారు. కొందరు ఇహపరాలలో కూడా సుఖాలను పొందలేరు. (87,88)
ధనాని యేషాం విపులాని సంతి
నిత్యం రమంతే సువిభుషితాంగాః ।
తేషామయం శత్రువరఘ్న లోకః
నాసౌ సదా దేహసుఖే రతానామ్ ॥ 89
శత్రుసూదనా! ధనవంతులై శరీరమంతా అలంకరించుకొని ఇహలోకంలో శారీరక సుఖాసక్తులై భోగాలననుభవించినవారికి పరలోకంలో సుఖముండదు. (89)
యే యోగయుక్తాస్తపసి ప్రసక్తాః
స్వాధ్యాయశీలా జరయంతి దేహాన్ ।
జితేంద్రియాః ప్రాణివధే నివృత్తః
తేషామసౌ నాయమరిఘ్న లోకః ॥ 90
శత్రుసూదనా! యోగులై, తపోదీక్షితులై, స్వాధ్యాయతత్పరులై, అహింసావాదులై, జితేంద్రియులయిన వారికి ఇహలోకంలో సుఖముండదు కాని వారు పరలోకంలో సుఖిస్తారు. (90)
యే ధర్మమేవ ప్రథమం చరంతి
ధర్మేణ లబ్ధ్వా చ ధనాని కాలే ।
దారానవాప్య క్రతుభిర్యజంతే
తేషామయం చైవ పరశ్చ లోకః ॥ 91
ధర్మాన్ని పాటిస్తూ, ధర్మమార్గంలో ధనాన్ని సంపాదించి, తగిన సమయంలో పెండ్లాడి, యాగాదుల ననుష్ఠించినవారు ఇహపరాలలో సుఖిస్తారు. (91)
యే నైవ విద్యాం న తపో న దానం
న చాపి మూఢాః ప్రజనే యతంతి ।
న చానుగచ్ఛంతి సుఖాని భోగాః
తేషామయం నైవ పరశ్చ లోకః ॥ 92
విద్యకై కానీ, తపస్సుకై కానీ, దాతృత్వానికై కానీ, ధర్మబద్ధసంతానానికై కానీ ప్రయత్నించని వారు సుఖాలను కానీ భోగాలను కానీ అనుభవించరు. వారికి ఇహపరాలు రెండూ దక్కవు. (92)
సర్వే భవంతస్త్వతివీర్యసత్త్వాః
దివ్యౌజసః సంహననోపపన్నాః ।
లోకాదముష్మాదవనిం ప్రపన్నాః
స్వధీతవిద్యాః సురకార్యహేతోః ॥ 93
మీరంతా ధీరులూ, శూరులు. దివ్యతేజస్సు గలవారు. దృఢశరీరులు. దేవతాకార్యసిద్ధికై దివ్యలోకాల నుండి భూమి కవతరించినవారు. చక్కగా అధ్యయనం చేసినవారు. (93)
కృత్వైవ కర్మాణి మహాంతి శూరాః
తపోదమాచారవిహారశీలాః ।
దేవానృషీన్ ప్రేతగణాంశ్చ సర్వాన్
సంతర్పయిత్వా విధినా పరేణ ॥ 94
స్వర్గం పరం పుణ్యకృతో నివాసం
క్రమేణ సంప్రాప్స్యథ కర్మభిః స్వైః ।
మా భూద్ విశంకా తవకౌరవేంద్ర
దృష్ట్వాఽఽత్మనః క్లేశమిమం సుఖార్హమ్ ॥ 95
శూరులు, తపస్వులు, జితేంద్రియులు, సదాచారవ్యవహారాలు కల మీరు ఉత్తమకర్మలతో దేవతలను, ఋషులను, పితరులను అందరినీ తృప్తిపరచి, మీకర్మల ఫలితంగా పుణ్యాత్ముల వాసస్థానమయిన స్వర్గానికి చేరతారు కరవనాథా! సంశయించవద్దు. ఇప్పటి నీ దుఃఖం భవిష్యత్సుఖ కారణమే. (94,95)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి త్య్రశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 183 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున నూట యెనుబది మూడవ అధ్యాయము. (183)