181. నూట ఎనుబది ఒకటవ అధ్యాయము

నహుషుని శాపవిముక్తి.

యుధిష్ఠిర ఉవాచ
భవానేతాదృశో లోకే వేదవేదాంగపారగః ।
బ్రూహి కిం కుర్వతః కర్మ భవేద్ గతిరనుత్తమా ॥ 1
యుధిష్ఠిరుడు చెపుతున్నాడు - నీవు వేదవేదాంగముల హద్దునెరిగినవాడవు. లోకంలో అలాంటివాడివని పేరొందినవాడవు. ఏపనిచెయ్యటం వల్ల నీకు అన్నిటికన్న ఉత్తమమైన స్థితి కలుగుతుందో చెప్పు. (1)
సర్ప ఉవాచ
పాత్రే దత్త్వా ప్రియాణ్యుక్త్వా సత్యముక్త్వా చ భారత ।
అహింసానిరతః స్వర్గం గచ్ఛేదితి మతిర్మమ ॥ 2
పాము చెపుతోంది - భారతా! తగినవాడికి దానం చెయ్యటం, ప్రియమైన మాటలు పలకటం నిజం పలకటం, అహింసయందే ఆసక్తుడవటం వల్ల స్వర్గానికి చేరుకుంటాడని నా అభిప్రాయం. (2)
యుధిష్ఠిర ఉవాచ
దానాద్ వా సర్ప సత్యాద్ వా కిమతో గురు దృశ్యతే ।
అహింసాప్రియయోశ్చైవ గురులాఘవముచ్యతామ్ ॥ 3
యుధిష్ఠిరుడడుగుతున్నాడు. సర్పమా! దానము, సత్యము - వీటిలో ఏది బరువైనది? అహింస, ప్రియముగా మాటలాడుట - వీటిలో బరువేది, తేలికైనదేదో చెప్పవలసినది. (3)
సర్ప ఉవాచ
దానం చ సత్యం తత్త్వం వా అహింసా ప్రియమేవ చ ।
ఏషాం కార్యగరీయస్త్వాద్ దృశ్యతే గురులాఘవమ్ ॥ 4
అజగరము చెపుతోంది - దానము, సత్యము, తత్త్వము, అహింస, ప్రియభాషణము వీటి గురులాఘవములు (హెచ్చు తగ్గులు) పని యొక్క ప్రాధాన్యతను బట్టి చూడబడతాయి. (4)
కస్మాచ్చిద్ దానయోగాద్ధి సత్యమేవ విశిష్యతే ।
సత్యవాక్యాచ్చ రాజేంద్ర కించిద్ దానం విశిష్యతే ॥ 5
రాజేంద్రా! ఒకదానం కన్న సత్యమే గొప్పదౌతుంది. సత్యవాక్యం కన్న ఒకదానం గొప్పదౌతుంది (5)
ఏవమేవ మహేష్వాస ప్రియవాక్యాన్మహీపతే ।
అహింసా దృశ్యతే గుర్వీ తతశ్చ ప్రియమిష్యతే ॥ 6
మహారాజా! ఇలాగే ప్రియమైన మాటలకంటే అహింసకు గౌరవమెక్కువ. అహింసకన్న ప్రియసంభాషణము గొప్పదిగా కనబడుతుంది. (6)
ఏవమేతద్ భవేద్ రాజన్ కార్యాపేక్షమనంతరమ్ ।
యదభిప్రేతమన్యత్ తే బ్రూహి యావద్ బ్రవీమ్యహమ్ ॥ 7
రాజా! ఈవిధంగా గౌరవలాఘవముల నిర్ణయము పనిని బట్టి జరుగుతుంది. నీవింకా దేనిని అడగదలచావో అడుగు. సాధ్యమైనంతవరకు సమాధానమిస్తాను. (7)
యుధిష్ఠిర ఉవాచ
కథం స్వర్గే గతిః సర్ప కర్మణాం చ ఫలం ధ్రువమ్ ।
అశరీరస్య దృశ్యేత ప్రబ్రూహి విషయాంశ్చ మే ॥ 8
యుధిష్ఠిరుడడుగుతున్నాడు. సర్పమా! మానవుడికి స్వర్గమెలా కలుగుతుంది? చేసే కర్మలకు (పనులకు) తప్పకుండా కలిగే ఫలాన్నెలా చూడగలుగుతాం? శరీరాభిమానం లేని (సిద్ధుడికి) వ్యక్తి ఎలా మసలుతాడు? ఈ విషయాలను నాకు చక్కగా చెప్పు. (8)
సర్ప ఉవాచ
తిస్రో వ గతయో రాజన్ పరిదృష్టాః స్వకర్మభిః ।
మానుషం స్వర్గవాసశ్చ తిర్యగ్యోనిశ్చ తత్ త్రిధా ॥ 9
పాము చెపుతోంది. రాజా! తానాచరించిన కర్మలకు మూడుగతులు చూపబడ్డాయి. మనిషిగాపుట్టటం, స్వర్గంలో నివసించటం, పశుపక్ష్యాదులలో పుట్టటం అనేవి ఆ మూడు. (9)
తత్ర వై మానుషాల్లోకాద్ దానాదిభిరతంద్రితః ।
అహింసార్థసమాయుక్తైః కారణైః స్వర్గమశ్నుతే ॥ 10
సోమరితనం, ప్రమాదం లేకుండా అహింసను పాటిస్తూ దానం మొదలైన మంచిపనుల కారణంగా మనుష్యలోకం నుండి స్వర్గాన్ని పొందుతాడు. (10)
విపరీతైశ్చ రాజేంద్ర కారణైర్మానుషో భవేత్ ।
తిర్యగ్యోనిస్తథా తాత విశేషశ్చాత్ర వక్ష్యతే ॥ 11
కామక్రోధసమాయుక్తః హింసాలోభసమన్వితః ।
మనుష్యత్వాత్ పరిభ్రష్టః తిర్యగ్యోనౌ ప్రసూయతే ॥ 12
రాజేంద్రా! పైనపేర్కొన్న దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా మనిషి ఔతాడు. నాయనా! ఇంకా ఎంతో విపరీతంగా ప్రవర్తిస్తే పశుపక్ష్యాదుల జన్మ కలుగుతోంది. కామము, క్రోధము, హింస, లోభములతో కూడిన వాడు మనుష్యత్వం నుండి భ్రష్టుడై (పతనమై) పశుపక్ష్యాలందు పుడతాడు. (11,12)
తిర్యగ్యోన్యాః పృథగ్భావః మనుష్యార్థే విధీయతే ।
గవాదిభ్యస్తథాశ్వేభ్యః దేవత్వమపి దృశ్యతే ॥ 13
మానవజన్మ పొందటానికి పశూపక్ష్యాది జన్మల నుండి ఉద్ధరించబడటం జరుగుతుంది. ఆవు, గుర్రము మొదలయిన జన్మలనుండి దేవత్వం సిద్ధించటం కూడా కనబడుతోంది. (13)
సోఽయమేతా గతీస్తాత జంతుశ్చరతి కార్యవాన్ ।
నిత్యే మహతి చాత్మానమ్ అవస్థాపయతే ద్విజః ॥ 14
జాతో జాతశ్చ బలవద్ భుంక్తే చాత్మా స దేహవాన్ ।
ఫలార్థస్తాత నిష్పృక్తః ప్రజాపాలనభావనః ॥ 15
నాయనా! ఆయా పనుల నాచరించటం చేత జీవుడు ఈ మూడుగతులలోను తిరుగుతాడు. తానాచరించిన కర్మకు ఫలం కోరే అభిమానం గల జీవుడు పరవశుడై మాటిమాటికీ పుడతాడు. తప్పనిసరిగా సుఖదుఃఖాల ననుభవిస్తాడు కర్మఫలం మీద ఆసక్తిలేని ప్రజలకు వ్యవస్థను కల్పించాలనే భావన గల ద్విజుడు తన ఆత్మను నిత్యమైన పరమాత్మయంది సంలగ్నం చేస్తాడు. (14,15)
యుధిష్ఠిర ఉవాచ
శబ్దే స్పర్శే చ రూపే చ తథైవ రసగంధయోః ।
తస్యాధిష్ఠానమన్యగ్రః బ్రూహి సర్ప యథాతథమ్ ॥ 16
యుధిష్ఠిరుడడుగుతున్నాడు - సర్పమా! శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములకు ఆధారమేదో ప్రసన్నుడవై ఉన్నది ఉన్నట్లు చెప్పు. (16)
కిం న గృహ్ణాతి విషయాన్ యుగపచ్చ మహామతే ।
ఏతావదుచ్యతాం చోక్తం సర్వం పన్నగసత్తమ ॥ 17
బుద్ధిమంతుడా! మనసెందుకు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే) విషయాలను ఒకేసారి గ్రహించదు. ఇంతవరకు అడిగిన విషయాలన్నింటిని చెప్పవలసినది. (17)
సర్ప ఉవాచ
యదాత్మద్రవ్యమాయుష్మన్ దేహసంశ్రయణాన్వితమ్ ।
కరణాధిష్ఠితం భోగాన్ ఉపభుంక్తే యథావిధి ॥ 18
పాము చెపుతోంది - చిరంజీవి! ఆత్మ అనబడే ద్రవ్యము స్థూల, సూక్ష్మ, కారణ శరీరములను ఆశ్రయించి, ఇంద్రియములతో కూడి విధి (కర్మ) ననుసరించి సుఖదుఃఖముల ననుభవిస్తుంది. (18)
జ్ణానం చైవాత్ర బుద్ధిశ్చ మనశ్చ భరతర్షభ ।
తస్య భోగాధికరణే కరణాని నిబోధ మే ॥ 19
భరతశ్రేష్ఠా! ఆత్మసుఖదుఃఖరూపలైన భోగము ననుభవించుటకు ఆధారమైన శరీరంలో, దానికి జ్ఞానము, బుద్ధి, మనస్సు సాధనములని నేను చెపుతున్న విషయమును గ్రహించుము. (19)
మనసా తాత పర్యేతి క్రమశో విషయానిమాన్ ।
విషయాయతనస్థో హి భూతాత్మా క్షేత్రమాస్థితః ॥ 20
నాయనా! శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఐదు విషయాలకు ఆధారములైన పంచభూతాలచే నిర్మించబడ్డ శరీరంలో ఉన్న జీవాత్మ; ఈ శరీరంలో ఉన్న మనస్సు ద్వారా వరుసగా ఈ ఐదు విషయాలను అనుభవిస్తాడు. (20)
తత్ర చాపి నరవ్యాఘ్ర మనో జంతోర్విధీయతే ।
తస్మాద్ యుగపదత్రాస్య గ్రహణం నోపపద్యతే ॥ 21
మానవశ్రేష్ఠా! విషయాలననుభవించేటప్పుడు ఈ జీవాత్మ మనస్సు ఒక విషయం మీదే లగ్నమవటం చేత ఒకేసారి అనేక విషయాలను గ్రహించటం కుదరదు. (21)
స ఆత్మా పురుషవ్యాఘ్ర భ్రువోరంతరమాశ్రితః ।
బుద్ధిం ద్రవ్యేషు సృజతి వివిధేషు పరావరామ్ ॥ 22
పురుషశ్రేష్ఠా! ఆ ఆత్మ కనుబొమల మధ్య నుండి ఉత్తమము, అధమము అయిన బుద్ధిని అనేకరకాలైన ద్రవ్యముల వైపు ప్రేరేపిస్తుంది. (22)
బుద్ధేరుత్తరకాలా చ వేదనా దృశ్యతే బుధైః ।
ఏష వై రాజశార్దూల విధిః క్షేత్రజ్ఞభావనః ॥ 23
విద్వాంసులు బుద్ధి పనిచేసిన తరువాతనే అనుభవాన్ని చూస్తున్నారు. రాజశ్రేష్ఠా! ఇదే క్షేత్రంలో (శరీరంలో) ఉన్న ఆత్మను ప్రకాశింపచేసే విధానము. (23)
యుధిష్ఠిర ఉవాచ
మనసశ్చాపి బుద్ధేశ్చ బ్రూహి మే లక్షణం పరమ్ ।
ఏతదధ్యాత్మవిదుషాం పరం కార్యం విధీయతే ॥ 24
యుధిషిరుడడుగుతున్నాడు - నాకు మనస్సు, బుద్ధి వీని ఉత్తమలక్షణాలను చెప్పు. అధ్యాత్మశాస్త్ర (వేదాంతశాస్త్ర) విద్వాంసులకిది తెలుసుకోవటం ముఖ్యకర్తవ్యంగా చెపుతారు. (24)
సర్ప ఉవాచ
బుద్ధిరాత్మానుగా తాత ఉత్పాతేన విధీయతే ।
తదాశ్రితా హి సంజ్ఞైషా బుద్ధిస్తస్యైషిణీ భవేత్ ॥ 25
బుద్ధిరుత్పద్యతే కార్యాన్మనస్తూత్పన్నమేవ హి ।
బుద్ధేర్గుణవిధానేన మనస్తద్గుణవద్ భవేత్ ॥ 26
పాము చెపుతోంది - నాయనా! ఆత్మకు భోగమోక్షములను సంపాదించటమే బుద్ధి యొక్క పని. ఆత్మనాశ్రయించే బుద్ధి విషయాలవైపు వెళుతుంది. అందువల్ల బుద్ధి ఆత్మనను సరిస్తుందని తలచబడుతోంది. బుద్ధి యొక్క గుణాన్ని బట్టి మనస్సు గుణాన్ని పొందుతుంది. పనిమొదలైనప్పుడే బుద్ధివ్యక్తమౌతుంది. మనస్సెప్పుడూ వ్యక్తమౌతూనే ఉంటుంది. (25-26)
ఏతద్ విశేషణం తాత మనోబుద్ధ్యోర్యదంతరమ్ ।
త్వమప్యత్రాభిసంబుద్ధః కథం వా మన్యతే భవాన్ ॥ 27
నాయనా! మనస్సు బుద్ధి వీనికి గల ఈ తేడాయే వాటిని వేరుచేస్తోంది. నీవు కూడా ఈ విషయాన్ని బాగా తెలిసినవాడవు. నీవే మనుకుంటున్నావు? (27)
యుధిష్ఠిర ఉవాచ
అహో బుద్ధిమతాం శ్రేష్ఠ శుభా బుద్ధిరయం తవ ।
విదితం వేదితవ్యం తే కస్మాత్ సమనుపృచ్ఛసి ॥ 28
యుధిష్ఠిరుడు చెపుతున్నాడు - బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా! ఈ నీబుద్ధి చాలా ఉత్తమమైనది. ఆహా! నీవు తెలియవలసిన దానిని తెలుసుకున్నావు. కాని నన్నెందుకు అడుగుతున్నావు? (28)
సర్వజ్ఞం త్వాం కథం మోహః ఆవిశత్ స్వర్గవాసినమ్ ।
ఏవమద్భుతకర్మాణమితి మే సంశయో మహాన్ ॥ 29
అన్నీ తెలిసినవాడివి. స్వర్గంలో ఉండేవాడివి. చాలా అద్భుతమైన పనులు చేసినవాడివి. బ్రాహ్మణుల నవమానించాలనే మోహం నిన్నెలా చేరుకుంది? ఇది నాకు చాలా పెద్ద సందేహము. (29)
సర్ప ఉవాచ
సుప్రజ్ఞమపి చేచ్ఛూరమ్ ఋద్ధిర్మోహయతే నరమ్ ।
వర్తమానః సుఖే సర్వః ముహ్యతీతి మతిర్మమ ॥ 30
పాము చెపుతోంది - సంపద చాలా తెలివైనవాడైనా, శూరుడైనా సరే మానవుని మోహంలో పడేస్తుంది. సుఖవిలాసాల్లో మునిగిన ప్రతివాడూ మోహపడతాడని నా అభిప్రాయము. (30)
సోఽహమైశ్వర్యమోహేన మదావిష్ణో యుధిష్ఠిర ।
పతితఃప్రతిసంబుద్ధః త్వాం తు సంబోధయామ్యహమ్ ॥ 31
యుధిష్ఠిరుడా! ఇలా నేను ఐశ్వర్యం వల్ల మోహం చెంది మదోన్మత్తుడనై పతనమయ్యాను. పతనమైన తరువాత తెలుసుకున్నాను. కాబట్టి నిన్నిప్పుడు మేల్కొలుపుతున్నాను. (31)
కృతం కార్యం మహారాజ త్వయా మమ పరంతప ।
క్షీణః శాపః సుకృచ్ఛ్రో మే త్వయా సంభాష్య సాధునా ॥ 32
మహారాజా! నీవు నాకోసం చెయ్యాల్సింది చేశావు. సజ్జనుడైన నీతో సంభాషణం చేసిన నాకు ఎంతో కష్టాన్నిచ్చిన శాపం తొలగిపోయింది. (32)
అహం హి దివి దివ్యేన విమానేన చరన్ పురా ।
అభిమానేన మత్తః సన్ కంచిన్నాన్యమచింతయమ్ ॥ 33
పూర్వం నేను స్వర్గంలో దివ్యమైన విమానం మీద తిరుగుతూ అభిమానం చేత ఒళ్ళు తెలియక ఇతరునెవరినీ గుర్తించేవాడిని కాను. (33)
బ్రహ్మర్షిదేవగంధర్వయక్షరాక్షసపన్నగాః ।
కరాన్ మమ ప్రయచ్ఛంతి సర్వే త్రైలోక్యవాసినః ॥ 34
బ్రహ్మర్షులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు పాములు, ముల్లోకవాసులందరూ నాకు పన్నులు చెల్లించేవారు. (34)
చక్షుషా యం ప్రపశ్యామి ప్రాణినం పృథివీపతే ।
తస్య తేజో హరామ్యాశు తద్ధిదృష్టేర్బలం మమ ॥ 35
రాజా! కంటితో ఏప్రాణిని చూశానో ఆ ప్రాణి యొక్క తేజస్సును వెంటనే హరించే బలం నాకంటికుండేది. (35)
బ్రహ్మర్షీణాం సహస్రం హి ఉవాహ శిబికాం మమ ।
స మామపనయో రాజన్ భ్రంశయామాస వైశ్రియః ॥ 36
వేలమంది బ్రహ్మర్షులు నాపల్లకిని మోసేవారు. రాజా ఆనా చెడు ప్రవర్తన స్వర్గరాజ్యలక్ష్మి నుండి కూలద్రోసింది. (36)
తత్ర హ్యగస్త్యః పాదేవ వహన్ స్పృష్టో మయా మునిః ।
అగస్త్యేన తతోఽస్మ్యుక్తః సర్పస్త్వం చ భవేతి హ ॥ 37
స్వర్గంలో అగస్త్యమహాముని నాపల్లకి మోస్తుండగా పాదంతో తాకాను. దానివల్ల నీవు పామువైపొమ్మని అగస్త్యుడిచేత శపించబడ్డాను. (37)
తతస్తస్మాద్ విమానాగ్య్రాత్ ప్రచ్యుతశ్చ్యుతలక్షణః ।
ప్రపతన్ బుబుధేఽత్మానం వ్యాలీభూతమధోముఖమ్ ।
ఆయాచం తమహం విప్రం శాపస్యాంతో భవేదితి ॥ 38
అందువల్ల రాజచిహ్నాలన్నీ లోపించి ఆ శ్రేష్ఠమైన విమానం నుండి జారిపడ్డాను. పామునై తలక్రిందులుగా పడుతూ నన్ను గుర్తించాను. శాపం తొలగుతుందనుకుని ఆ బ్రహ్మర్షిని నేను యాచించాను. (38)
సర్ప ఉవాచ
ప్రమాదాత్ సంప్రమూఢస్య భగవన్ క్షంతుమర్హసి ।
తతః స మామూవాచేదం ప్రపతంతం కృపాన్వితః ॥ 39
పాము చెపుతోంది - భగవంతుడా! ప్రమాదం వల్ల వివేకం కోల్పోయిన నన్ను క్షమించు అన్నాను. తరువాత పడిపోతున్న నాపై దయ కలిగి అతడిలా అన్నాడు. (39)
యుధిష్ఠిరో ధర్మరాజః శాపాత్ త్వాం మోక్షయిష్యతి ।
అభిమానస్య ఘోరస్య పాపస్య చ నరాధిప ॥ 40
ఫలే క్షీణే మహారాజ ఫలం పుణ్యమవాప్స్యసి ।
తతో మే విస్మయో జాతః తద్ దృష్ట్వా తపసో బలమ్ ॥ 41
యుధిష్ఠిరుడైన ధర్మరాజు నిన్ను శాపవిముక్తుని చేస్తాడు. నీ అభిమానం, ఘోరమైన పాపం యొక్క ఫలం క్షీణించగానే పుణ్యఫలాన్ని పొందుతావు (40,41)
బ్రహ్మ చ బ్రాహ్మణత్వం చ యేన త్వాహమచూచుదమ్ ।
సత్యం దమస్తపో దానమ్ అహింసా ధర్మనిత్యతా ॥ 42
సాధకాని సదా పుంసాం న జాతి ర్న కులం నృప ।
అరిష్ట ఏష తే భ్రాతా భీమసేనో మహాబలః ।
స్వస్తి తేఽస్తు మహారాజ గమిష్యామి దివం పునః ॥ 43
రాజా! ఆయన బ్రహ్మజ్ఞానము, బ్రాహ్మణాత్వాన్నీ చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. అందుకే మొదట ఈ విషయం గూర్చే ప్రశ్నించాను. సత్యము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, దానము, అహింస, ధర్మపరాయణత్వము - ఈ మంచి గుణాలెప్పుడూ మానవునికి సిద్ధిని చేకూరుస్తాయి. జాతి, కులం సిద్ధినివ్వవు. మహాబలుడైన ఈ నీ తమ్ముడు భీముడిక పూర్తిగా క్షేమాన్ని పొందాడు. మహారాజా! నీకు శుభమగుగాక! నేనిప్పుడు మళ్ళీ స్వర్గానికి వెళతాను. (42,43)
(స చాయం పురుషవ్యాఘ్ర కాలః పుణ్య ఉపాగతః ।
తదస్మాత్ కారణాత్ పార్థ కార్యం మమ మహత్ కృతమ్ ॥)
పురుషసింహమా! ధర్మజా! శుభకరమైన నీరాకచేత ఈ పుణ్యకాలము సమీపించింది. ఈ కారణంగా నీవు నాకోసమెంతో గొప్పపని చేశావు.
వైశంపాయన ఉవాచ
తతస్తస్మిన్ ముహూర్తే తు విమానం కామగామి వై ।
అవపాతేన మహతా తత్రావాప తదుత్తమమ్ ॥)
ఇత్యు క్త్వాఽఽజగరం దేహం ముక్త్వా స నహుషో నృపః ।
దివ్యం వపుః సమాస్థాయ గతస్త్రిదివమేవ హ ॥ 44
వైశంపాయనుడు చెపుతున్నాడు - అలా అంటూ ఆ నహుషమహారాజు పాముశరీరాన్ని విడిచి, దివ్యశరీరాన్ని పొందాడు. ఆ సమయంలోనే సేచ్ఛగా తిరిగే ఉత్తమమైన విమానం అక్కడ దిగింది. దానినెక్కి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. (44)
యుధిష్ఠిరోఽసి ధర్మాత్మా భ్రాత్రా భీమేన సంగతః ।
ధౌమ్యేన సహితః శ్రీమాన్ ఆశ్రమం పునరాగమత్ ॥ 45
శ్రీమంతుడు ధర్మాత్ముడూ అయిన యుధిష్ఠిరుడు కూడ తమ్ముడైన భీమునితో కలసి, ధౌమ్యునితో ఆశ్రమానికి తిరిగివచ్చాడు. (45)
తతో ద్విజేభ్యః సర్వేభ్యః సమేతేభ్యో యథాతథమ్ ।
కథయామాస తత్ సర్వం ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 46
యుధిష్ఠిరుడైన ధర్మరాజు తరువాత అక్కడకు చేరుకున్న బ్రాహ్మణులందరికీ ఉన్నది ఉన్నట్లు జరిగినదంతా చెప్పసాగాడు. (46)
తచ్ఛ్రుత్వా తే ద్విజాః సర్వే భ్రాతరశ్చాస్య తే త్రయః ।
ఆసన్ సువ్రీడితా రాజన్ ద్రౌపదీ చ యశస్వినీ ॥ 47
అతని సోదరులు ముగ్గురూ, ఆ బ్రాహ్మణులందరూ, కీర్తికల ద్రౌపదీ ఆ విషయాన్నంతా విని ఎంతో సిగ్గుపడ్డారు. (47)
తే తు సర్వే ద్విజశ్రేష్ఠాః పాండవానాం హితేప్సయా ।
మైవమిత్యబ్రువన్ భీమం గర్హయంతోఽస్య సాహసమ్ ॥ 48
పాండవుల మేలుకోరి ఆ బ్రాహ్మణశ్రేష్ఠులందరీ భీముడిని, అతని సాహసాన్ని నిందిస్తూ ఇలా చెయ్యవద్దన్నారు. (48)
పాండవాస్తు భయాన్ముక్తం ప్రేక్ష్య భీమం మహాబలమ్ ।
హర్షమాహారయాంచక్రుః విజహ్రుశ్చ ముదా యుతాః ॥ 49
భయము నుండి విడువడిన మహాబలుడైన భీముడిని చూసి పాండవులు సంతోషంతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. భయాన్ని విడిచిపెట్టారు. (49)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఆజగరపర్వణి భీమమోచనే ఏకాశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 181 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఆజగరపర్వమను ఉపపర్వమున భీమవిమోచనమను నూట ఎనుబది ఒకటవ అధ్యాయము. (181)
(దాక్షిణాత్య అధికపాఠం 2 శ్లోకాలతో కలిపి మొత్తం 51 శ్లోకాలు.)