179. నూట డెబ్బది తొమ్మిదవ అధ్యాయము
సర్పరూపుడయిన నహుషునితో భీముడు సంభాషించుట.
వైశంపాయన ఉవాచ
స భీమసేన స్తేజస్వీ తథా సర్పవశం గతః ।
చింతయామాస సర్పస్య వీర్యమత్యద్భుతం మహత్ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - అలా ఆ భీమసేనుడు పాముకి చిక్కాడు. చాలా అద్భుతమైన ఆ పాముయొక్క గొప్పశక్తిన్ గురించి ఆలోచించసాగాడు. (1)
ఉవాచ చ మహాసర్పం కామయో బ్రూహి పన్నగ ।
కస్త్వం భో భుజగశ్రేష్ఠ కిం మయా చ కరిష్యసి ॥ 2
సర్పశ్రేష్ఠమా! స్వేచ్ఛగా చెప్పు. నీవెవడవు? నాతో ఏం చేస్తావు? అని పామునడిగాడు. (2)
పాండవో భీమసేనోఽహం ధర్మరాజాదనంతరః ।
నాగాయుతసమప్రాణః త్వయా నీతః కథం వశమ్ ॥ 3
సింహాః కేసరిణో వ్యాఘ్రాః మహిషా వారణాస్తథా ।
సమాగతాశ్చ శతశః నిహతాశ్చ మయా యుధి ॥ 4
రాక్షసాశ్చ పిశాచాశ్చ పన్నగాశ్చ మహాబలాః ।
భుజవేగమశక్తామే సోఢుం పన్నగసత్తమ ॥ 5
కిం ను విద్యాబలం కిం ను వరదానమథో తవ ।
ఉద్యోగమపి కుర్వాణః వశగోఽస్మి కృతస్త్వయా ॥ 6
అపత్యో విక్రమో వౄణామ్ ఇతి మే ధీయతే మతిః ।
యథేదం మే త్వయా నాగ బలం ప్రతిహతం మహత్ ॥ 7
నేను పాండురాజుకుమారుడిని. ధర్మరాజు తరువాతి వాడిని. భీమసేనుడిని. పదివేల ఏనుగులతో సమానమైన బలం కలవాడిని. నీకు ఎలా వశమయ్యాను? సింహాలు, పులులు దున్నపోతులు అలాగే మదించిన ఏనుగులు వందలుగా వచ్చి యుద్ధంలో నాచేత చంపబడ్డాయి. సర్పశ్రేష్ఠా! ఎంతోబలం గల రాక్షసులు, పిశాచాలు, పాములు నా భుజాల వేగాన్ని ఓర్చుకోవటానికి చాలరు. ప్రయత్నిస్తూ కూడా నీ వశమయ్యాను-నీవిద్యాబలమూ? లేదా నీకున్న వరప్రభావమా? మానవులకుపరాక్రమమన్నది వట్టి బూటకమని నాఅభిప్రాయం. ఎందుకంటే సర్పమా! ఇలా నా గొప్పబలాన్ని నీవు అణగద్రొక్కావు. (3-7)
వైశంపాయన ఉవాచ
ఇత్యేవంవాదినం వీరం భీమమక్లిష్టకారిణమ్ ।
భోగేన మహతా గృహ్య సమంతాత్ పర్యవేష్టయత్ ॥ 8
వైశంపాయనుడు చెపుతున్నాడు.
సునాయాసంగా పనులు చెయ్యగల వీరుడైన భీముడిలా అంటూండగా ఆ పాము తన పెద్దపడగతో అతనిని పట్టుకుని అతని చుట్టూ చుట్టివేసింది. (8)
నిగృహ్యైనం మహాబాహుం తతః స భుజగస్తదా ।
విముచ్యాస్య భుజౌ పీనౌ ఇదం వచనమబ్రవీత్ ॥ 9
గొప్పబాహువులు గల అతనిని గట్టిగా పటుకుని ఉన్న ఆ పాము బలిసిన అతని భుజములను వదలి ఇలా అంది. (9)
దిష్టస్త్వం క్షుధితస్యాద్య దేవైర్భక్షో మహాభుజ ।
దిష్ట్యా కాలస్య మహతః ప్రియాః ప్రాణా హి దేహినామ్ ॥ 10
చాలా కాలం నుండి ఆకలి గొన్న అదృష్టం వల్ల నేడు నీవు దేవతల చేత ఆహారంగా ఇవ్వబడ్డావు. శరీరం కలవాళ్ళకు ప్రాణాలు ప్రియమైనవి గదా! (10)
యథా త్విదం మయా ప్రాప్తం సర్పరూపమరిందమ ।
తథావశ్యం మయా ఖ్యాప్యం తవాద్య శృణు సత్తమ ॥ 11
శ్రేష్ఠుడా! నేనెలా ఈ పాము ఆకారాన్ని పొందానో ఆ విషయాన్ని నీకిప్పుడు తప్పకుండా చెప్పాలి. విను. (11)
ఇమామవస్థానం సంప్రాప్తః హ్యహం కోపాన్మనీషిణామ్ ।
శాపస్యాంతం పరిప్రేప్సుః సర్వం తత్ కథయామి తే ॥ 12
నేను బుద్ధిమంతులైన మహాత్ముల కోపం వల్ల ఈదశను పొందాను. శాపవిముక్తిని పొందగోరి ఆ విషయాన్నంతా నీకు చెపుతున్నాను. (12)
నహుషో నామ రాజర్షిః వ్యక్తం తే శ్రోత్రమాగతః ।
తవైవ పూర్వః పూర్వేషామ్ ఆయోర్వంశధరః సుతః ॥ 13
నేను నహుషుడనే రాజర్షిని. తప్పక నీచెవినపడే ఉంటాను. నీ పూర్వీకులకు ముందువాడిని. ఆయువు యొక్క వంశం కొనసాగేందుకు పుత్రుడ నయిన వాడిని. (13)
సోఽహం శాపాదగస్త్యస్య బ్రాహ్మణానవమన్య చ ।
ఇమామవస్థామాపన్నః పశ్య దైవమిదం మమ ॥ 14
అటువంటి నేను బ్రాహ్మణులనవమానించి అగస్త్యుని శాపం వల్ల ఇలాంటి స్థితిని పొందాను. నాదౌర్భాగ్యమెలా ఉందో చూడు. (14)
త్వాం చేదవధ్యం దాయాదమ్ అతీవ ప్రియదర్శనమ్ ।
అహమద్యోపయోక్ష్యామి విధానం పశ్య యాదృశమ్ ॥ 15
నీవు చంపతగనివాడవు. నావంశంలో పుట్టినవాడివి. చూడముచ్చటగా ఉన్నావు. విధివిధానమెలా ఉందో చూడు. నిన్ను నేడు నా ఆహారంగా ఉపయోగించుకోబోతున్నాను. (15)
న హి మే ముచ్యతే కశ్చిత్ కథంచిత్ ప్రగ్రహం గతః ।
గజో వా మహిషో వాపి షష్ఠే కాలే నరోత్తమ ॥ 16
మానవోత్తమా! రోజుయొక్క ఆరవభాగంలో అది ఏనుగైనా, దున్నపోతైనా ఎలాగైనా నాకు చిక్కితే నానుండి విడువబడదు. (16)
నాసి కేవలసర్పేణ తిర్యగ్యోనిషు వర్తతా ।
గృహీతః కౌరవశ్రేష్ఠ వరదానమిదం మమ ॥ 17
కౌరవశ్రేష్ఠుడా! నీవు కేవలం జంతువుల్లో చేరిన పాముకు చిక్కలేదు. నాకిది వరమిచ్చినట్లుంది.(17)
పతతా హి విమానాగ్య్రాత్ మయా శక్రాసనాద్ ద్రుతమ్ ।
కురు శాపాంతమిత్యుక్తః భగవాన్ మునిసత్తమః ॥ 18
నేను ఇంద్రసింహాసనం నుండి పతనమై వేగంగా శ్రేష్ఠమైన విమానం నుండి పడిపోతూ పూజ్యుడు మునిశ్రేష్ఠుడైన అగస్త్యుని శాపవిమోచనం చెయ్యమని అడిగాను. (18)
స మామువాచ తేజస్వీ కృపయాభిపరిప్లుతః ।
మోక్షస్తే భవితా రాజన్ కస్మాచ్చిత్ కాలపర్యయాత్ ॥ 19
తేజోవంతుడైన ఆ ముని కరుణచే కరిగి రాజా! కొంతకాలమైన తరువాత నీకు విముక్తి లభిస్తుందని నాతో అన్నాడు. (19)
తతోఽస్మి పతితో భూమౌ న చ మామజహాత్ స్మృతిః ।
స్మా ర్తమస్తి పురాణం మే యథైవాధిగతం తథా ॥ 20
తరువాథ భూమిమీద పడిపోయాను. జ్ఞాపకశక్తి నన్ను విడిచిపెట్టలేదు. చాలాకాలం క్రింద జరిగినదైనా జరిగిందంతా నాకు గుర్తుంది (20)
యస్తు తే వ్యాహృతాన్ ప్రశ్నాన్ ప్రతిబ్రూయాద్ విభాగవిత్ ।
స త్వాం మోక్షయితా శాపాత్ ఇతి మామబ్రవీదృషిః ॥ 21
నీవడిగిన ప్రశ్నలకు విడమరిచి సమాధానాలు చెప్పేవాడు శాపం నుండి నిన్ను విడిపిస్తాడని ఆ ఋషి నాకు చెప్పాడు. (21)
గృహీతస్య త్వయా రాజన్ ప్రాణినోఽపి బలీయసః ।
సత్త్వభ్రంశోఽధికస్యాపి సర్వస్యాశు భవిష్యతి ॥ 22
రాజా! బలమైన ప్రాణియైనా, నీకన్న అధికుడెవడైనా సరే నీచేత పట్టుకోబడ్డవాడికి వెంటనే ధైర్యం నశిస్తుంది. (22)
ఇతి చాప్యహమశ్రౌషం వచస్తేషాం దయావతామ్ ।
మయి సంజాతహార్దానామ్ అథ తేఽంతర్హితా ద్విజాః ॥ 23
అని నాపట్ల సహృదయతకలిగిన ఆ దయామయుల ఆ మాటలను కూడ నేను విన్నాను. అటు తరువాత ఆ బ్రహ్మర్షులు అంతర్ధానమయ్యారు. (23)
సోఽహం పరమదుష్కర్మా వసామి నిరయేఽశుచౌ ।
సర్పయోనిమిమాం ప్రాప్య కాలాకాంక్షీ మహాద్యుతే ॥ 24
అలా ఎంతో చెడ్డపనిచేసిన నేను అపవిత్రమైన ఈ నరకంలో ఉన్నాను. ఈ పాము జన్మను పొంది విడుదలయ్యే సమయం కోసం ఎదురుచూస్తున్నాను. (24)
తమువాచ మహాబాహుర్భీమసేనో భుజంగమమ్ ।
న చ కుప్యే మహాసర్ప న చాత్మానం విగర్హయే ॥ 25
భీమసేనుడాపాముతో సర్పమా! నీమీద నాకు కోపం లేదు. నన్ను నేను నిందించుకోవటమూ లేదు అన్నాడు. (25)
యస్మాదభావీ భావీ వా మనుష్యః సుఖదుఃఖయోః ।
ఆగమే యది వాపాయే న తత్ర గ్లపయేన్మనః ॥ 26
కారణమేమంటే మానవుడు సుఖాన్ని పొందటంలో, దుఃఖాన్ని పోగొట్టుకోవడంలో సమర్థుడౌతాడు, అసమర్థుడౌతాడు. కాని అందువల్ల ఎట్టిపరిస్థితిలోను మనసును క్రుంగదీసుకోకూడదు. (26)
దైవం పురుషకారేణ కో వంచయితుమర్హతి ।
దైవమేవ పరం మన్యే పురుషార్థో నిరర్థకః ॥ 27
మానవప్రయత్నంలో దైవాన్ని ఎవడు మోసగించగలుగుతాడు? దైవమే శ్రేష్ఠమైనదని నేను తలుస్తాను. పురుషప్రయత్నం వ్యర్థమైనది. (27)
పశ్య దైవోపఘాతాద్ధిభుజవీర్యవ్యపాశ్రయమ్ ।
ఇమామవస్థాం సంప్రాప్తమ్ అనిమిత్తమిహాద్య మామ్ ॥ 28
భుజబలంపై ఆధారపడ్డ నాకు దైవం దెబ్బతీయటం వల్ల ఇప్పుడిక్కడ అకారణంగా ఈగతి పట్టింది. చూడు. (28)
కింతు వాద్యానుశోచామి తథాఽఽత్మానం వినాశితమ్ ।
యథా తు విపినే న్యస్తాన్ భ్రాతౄన్ రాజ్యపరిచ్యుతాన్ ॥ 29
కాన్ నేడు రాజ్యం కోల్పోయి అడవుల పాలైన సోదరుల గురించి బాధపడ్డట్లుగా నా చావు గురించి బాధపడటం లేదు. (29)
హిమవాంశ్చ సుదుర్గోఽయం యక్షరాక్షససంకులః ।
మాం సముద్వీక్షమాణాస్తే ప్రపతిష్యంతి విహ్వలాః ॥ 30
యక్షులు రాక్షసులతో నిండిన ఈ హిమాలయం చేరటానికి కష్టమైన ప్రాంతం, కలవరంతో నన్ను వెతుకుతూ వాళ్ళు లోయలో పడిపోతారు. (30)
వినష్టమథ మాం శ్రుత్వా భవిష్యంతి నిరుద్యమాః ।
ధర్మశీలా మయా తే హి బాధ్యంతే రాజ్యగృద్ధినా ॥ 31
అటుపిమ్మట నేను మరణించానని విని రాజ్యం పొందటానికి చెయ్యాల్సిన ప్రయత్నాన్ని కట్టి పెట్టేస్తారు. స్వభావం చేత ధర్మాత్ములైన వారు రాజ్యలోభం గల నావల్ల బాధించబడుతున్నారు. (31)
అథవా నార్జునో ధీమాన్ విషాదముపయాస్యతి ।
సర్వాస్త్రవిదధృష్యో దేవగంధర్వరాక్షసైః ॥ 32
లేదా బుద్ధిమంతుడైన అర్జునుడు విషాదం చెందడు. అన్ని అస్త్రములు తెలిసినవాడు, దేవతలు, గంధర్వులు, రాక్షసులు అతనిని ఓడించలేరు. (32)
సమర్థః స మహాబాహుః ఏకోఽపి సుమహాబలః ।
దేవరాజమపి స్థానాత్ ప్రచ్యావయితుమంజసా ॥ 33
గొప్పబాహువులూ ఎంతోగొప్పబలమూ కల ఆ అర్జునుడు తేలికగా దేవరాజైన ఇంద్రుని కూడా ఆయన స్థానం నుండి తొలగించగల సమర్థుడు. (33)
కిం పునర్ధృతరాష్ట్రస్య పుత్రం దుర్ద్యూతదేవినమ్ ।
విద్విష్టం సర్వలోకస్య దంభమోహపరాయణమ్ ॥ 34
కపటమైన జూదమాడేవాడు, లోకమంతటికీ ద్రోహి, డాంబికము, మోహములకు లోనైన ధృతరాష్ట్రునిడికుమారుడు దుర్యోధనుడెంత? (34)
మాతరం చైవ శోచామి కృపణాం పుత్రగృద్ధినీమ్ ।
యస్మాకం నిత్యమాశాస్తే మహత్త్వమధికం పరైః ॥ 35
ఎల్లవేళలా శత్రువులకన్న మేము పైచేయిగా ఉండాలనుకునే పుత్రవాత్సల్యం గల దీనురాలైన మా అమ్మగురించి బాధపడుతున్నాను. (35)
తస్యాః కథం త్వనాథాయా మద్వినాశాద్ భుజంగమ ।
సఫలాస్తే భవిష్యంతి మయి సర్వే మనోరథాః ॥ 36
సర్పమా! నేను మరణిస్తే దిక్కులేనిదైన నాతల్లికి నామీద పెట్టుకున్న ఆశలెలా సఫలమౌతాయి? (36)
నకులః సహదేవశ్చ యమౌ చ గురువర్తినౌ ।
మద్బాహుబలసంగుప్తౌ నిత్యం పురుషమానినౌ ॥ 37
పెద్దలననుసరించే కవలలు ఎల్లప్పుడూ తమ పౌరుషం పట్ల అభిమానం కల నకులసహదేవులు నాభుజబలం వల్ల కాపాడబడుతున్నారు. (37)
భవిష్యతో నిరుత్సాహౌ భ్రష్టవీర్యపరాక్రమౌ ।
మద్వినాశాత్ పరిద్యూనౌ ఇతి మే వర్తతే మతిః ॥ 38
నా వినాశం చేత పూర్తిగా శక్తిహీనులై, బలపరాక్రమాలు పోగొట్టుకొని నిరుత్సాహలవుతారని నాఅభిప్రాయము. (38)
ఏవంవిధం బహు తదా విలలాప వృకోదరః ।
భుజంగభోగసంరుద్ధః నాశకచ్చ విచేష్టితుమ్ ॥ 39
ఈరకంగా అప్పుడెన్నో రకాలుగా భీముడు విలపించాడు. పాము పడగలలో ఇరుక్కుని కదలలేక పోయాడు. (39)
యుధిష్ఠిరస్తు కౌంతేయో బభూవాస్వస్థచేతనః ।
అనిష్టదర్శనాన్ ఘోరాన్ ఉత్పాతాన్ పరిచింతయన్ ॥ 40
కుంతీకుమారుడైన యుధిష్ఠిరుడు భయంకరములైన అపశకునాలను బట్టి ఇష్టం కానివి చూడవలసినవస్తుందని చింతిస్తూ మనసులో కలతచెందాడు. (40)
దారుణం హ్యశివం నాదం శివా దక్షిణతః స్థితా ।
దీప్తాయాం దిశి విత్రస్తా రౌతి తస్యాశ్రమస్య హ ॥ 41
అతని ఆశ్రమానికి దక్షిణదిక్కునందు మంటలు చెలరేగాయి. భయపడి అక్కడున్న నక్క దారుణంగా అశుభాన్ని సూచిస్తూ ఆర్తనాదం చెయ్యసాగింది. (41)
ఏకపక్షాక్షిచరణా వర్తికా ఘోరదర్శనా ।
రక్తం వమంతీ దదృశే ప్రత్యాదిత్యమభాసురా ॥ 42
ఒకరెక్క, ఒకకన్ను, ఒకపాదంతో భయంకరంగా కనబడే మలినంగా ఉన్న తీతువుపిట్ట సూర్యుని వైపురక్తం కక్కుతూ కనబడింది. (42)
ప్రవవౌ చానిలో రూక్షః చండః శర్కరకర్షణః ।
అపసవ్యాని సర్వాణి మృగపక్షిరుతాని చ ॥ 43
అప్పుడు కంకరవాన కురిపించే కఠినమైన, ప్రచండవాయువు వీచింది. జంతువులు పక్షులకూతలన్నీ దక్షిణం వైపు వినబడుతున్నాయి. (43)
పృష్ఠతో వాయసః కృష్ణో యాహి యాహీతి శంసతి ।
ముహుర్ముహుః స్ఫురతి చ దక్షిణోఽస్య భూజస్తథా ॥ 44
వెనుకవైపు నల్లకాకి వెళ్ళు వెళ్ళు అని అరుస్తోంది అలాగే అతని కుడిభుజం మాటిమాటికీ అదురుతోంది. (44)
హృదయం చరణశ్చాపి వామోఽస్య పరితప్యతి ।
సవ్యస్యాక్ష్ణో వికారశ్చాప్యనిష్టః సమపద్యత ॥ 45
అతనిగుండె, ఎడమపాదమూ మండుతున్నాయి. ఇష్టంకానిది జరుగబోతోందని సూచించే మార్పు ఎడమకంటిలో ఏర్పడింది. (45)
ధర్మరాజోఽపి మేధావీ మన్యమానో మహద్ భయమ్ ।
ద్రౌపదీం పరిపప్రచ్ఛ క్వ భీమ ఇతి భారత ॥ 46
భారతా! మేధావి అయిన ధర్మరాజు చాలాభయాన్ని శంకించి ద్రౌపదిని భీముడెక్కడ? అని అడిగాడు. (46)
శశంస తస్మై పాంచాలీ చిరయాతం వృకోదరమ్ ।
స ప్రతిస్థే మహాబాహుః ధౌమ్యేన సహితో నృపః ॥ 47
భీముడు వెళ్ళి చాలాసేపైందని ద్రౌపది అతనికి చెప్పింది. వెంటనే ధర్మరాజు ధౌమ్యుడితో కలిసి బయలుదేరాడు. (47)
ద్రౌపద్యా రక్షణం కార్యమ్ ఇత్యువాచ ధనంజయమ్ ।
నకులం సహదేవం చ వ్యాదిదేశ ద్విజాన్ ప్రతి ॥ 48
అర్జునుడితో ద్రౌపదిని రక్షించమని చెప్పాడు. నకులసహదేవులతో బ్రాహ్మణులను రక్షించమని చెప్పి వెళ్లాడు. (48)
స తస్య పదమున్నీయ తస్మాదేవాశ్రమాత్ ప్రభుః ।
మృగయామాస కౌంతేయో భీమసేనం మహావనే ॥ 49
శక్తిమంతుడైన ధర్మరాజు ఆ ఆశ్రమం నుండే భీమసేనుడి పాదాలగుర్తులను చూస్తూ భీముడిని ఆ అడవిలో వెదుకసాగాడు. (49)
స ప్రాచీం దిశమాస్థాయ మహతో గజయూథపాన్ ।
దదర్శం పృథివీం చిహ్నైః భీమస్య పరిచిహ్నితామ్ ॥ 50
అతడు తూర్పుదిక్కును చేరి పెద్దఏనుగుల గుంపులను, భీముడిపాదాల గుర్తులున్న నేలనూ చూశాడు. (50)
తతో మృగసహస్రాణి మృగేంద్రాణాం శతాని చ ।
పతితాని వనే దృష్ట్వా మార్గం తస్యావిశన్నృపః ॥ 51
తరువాత నేలకూలిన వేల జంతువులను, వందల సింహాలను చూసి, భీమసేనుడు వెళ్ళిన దోవనే రాజు అడవిలో ప్రవేశించాడు (51)
ధావతస్తస్య వీరస్య మృగార్థం వాతరంహసః ।
ఊరువాతవినిర్భగ్నాః ద్రుమా వ్యావర్జితాః పథి ॥ 52
వాయువేగం గల వీరుడైన భీముడు వేటాడటానికి పరుగెడుతుండగా, అతని తొడలకు తగిలి ముక్కలై మార్గంలో పడ్డచెట్లు కనబడ్డాయి. (52)
స గత్వా తైస్తదా చిహ్నైః దదర్శ గిరిగహ్వరే ।
రూక్షమారుతభూయిష్ఠే నిష్పత్రద్రుమసంకులే ॥ 53
ఈరిణే నిర్జలే దేశే కమ్టకిద్రుమసంకులే ।
అశ్మస్థాణూ క్షుపాకీర్ణే సుదుర్గే విషమోత్కటే ।
గృహీతం భూజగేంద్రేణ నిశ్చేష్టమనుజం తదా ॥ 54
అతడప్పుడా గుర్తులను బట్టి వెళ్ళి పెనుగాలులతో కూడి, ఆకులు లేని చెట్లతో నిండి, ఎడారియై, నీరులేని, ముళ్ళచెట్లతో నిండ్, రాళ్ళు, పెంకులు, మొక్కలతో, చేరుకోలేని, ఎత్తుపల్లాలుగా ఉన్న కొండగుహలో పాముకు చిక్కి చేష్టలుడిగిన మనిషిని చూశాడు. (53,54)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఆజగరపర్వణి యుధిష్ఠిరభీమదర్శనే ఏకోనాశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 179 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అజగరపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిర భీమదర్శనమను నూట డెబ్బది తొమ్మిదవ అధ్యాయము. (179)