171. నూట డెబ్బది ఒకటవ అధ్యాయము

దానవుల మాయా యుద్ధము.

అర్జున ఉవాచ
తతోఽశ్మవర్షం సుమహత్ ప్రాదురాసీత్ సమంతతః ।
నగమాత్రైః శిలాఖండైః తన్మాం దృఢమపీడయత్ ॥ 1
అర్జునుడు చెపుతున్నాడు.
తరువాత నాచుట్టూ భారీగా రాళ్ళవర్షం మొదలైంది. కొండలతో సమానమైన రాళ్ళు పడుతున్నాయి. అది నన్ను ఎంతో బాధించింది. (1)
తదహం వజ్రసంకాశైః మహేంద్రాస్త్రప్రచోదితైః ।
అచూర్ణయం వేగవద్భిః శరజాలైర్మహాహవే ॥ 2
ఆ యుద్ధంలో నేను మహేంద్రాస్త్రంతో అభిమంత్రించి వేగం గల వజ్రాయుధంలాంటి బాణాల వరుసతో ఆ రాళ్ళవానను పొడిపొడి చేశాను. (2)
చూర్ణ్యమానేఽశ్మవర్షే తు పావకః సమజాయత ।
తత్రాశ్మచూర్ణాన్యపతన్ పావకప్రకరా ఇవ ॥ 3
రాళ్ళవాన నుగ్గుచేయబడుతుండగా మంటపుట్టింది. రాతిముక్కలక్కడ నిప్పురవ్వల్లాగా పడ్డాయి. (3)
తతోఽశ్మవర్షే విహతే జలవర్షం మహత్తరమ్ ।
ధారాభిరక్షమాత్రాభిః ప్రాదురాసీన్మమాంతికే ॥ 4
రాళ్ళవాన శాంతించింది - పాముల్లాంటి ధారలతో నాకు దగ్గరగా చాలా పెద్ద నీటివర్షం మొదలైంది. (4)
నభసః ప్రచ్యుతా ధారాః తిగ్మవీర్యాః సహస్రశః ।
ఆవృణ్వన్ సర్వతో వ్యోమ దిశశ్చోపదిశస్తథా ॥ 5
ఆకాశం నుండి జారే ప్రచండమైన శక్తిగల వేల కొద్దీ ధారలు ఆకాశన్నంతా అలాగే దిక్కుల్ని మూలల్ని కూడా కమ్మేశాయి. (5)
ధారాణాం చ నిపాతేన వాయోర్విస్ఫూర్జితేన చ ।
గర్జితేన చ దైత్యానాం న ప్రాజ్ఞాయత కించన ॥ 6
ధారలు కురియటం చేత గాలి తాకిడిచేత రాక్షసుల గర్జనచేత ఏమీ తెలియటం (తోచటం) లేదు. (6)
ధారా దివి చ సంబద్ధా వసుధాయాం చ సర్వశః ।
వ్యామోహయంత మాం తత్ర నిపతంత్యోఽనిశం భువి ॥ 7
స్వర్గం నుండి భూమిదాకా కలుపుకుని అన్నిప్రక్కలా ఎప్పుడూ భూమిపైన కురుస్తున్న ఆ ధారలు నన్నక్కడ మోహంలో పడేశాయి. (7)
తత్రోపదిష్టమింద్రేణ దివ్యమస్త్రం విశోషణమ్ ।
దీప్తం ప్రాహిణవం ఘోరమ్ అశుష్యత్ తేన తజ్జలమ్ ॥ 8
ఆ సందర్భంలో తేజోవంతము, భయంకరమూ అయిన ఇంద్రుడుపదేశించిన దివ్యమైన విశోషణాస్త్రాన్ని ప్రయోగించాను. దానితో ఆ నీరు ఎండిపోయింది. (8)
హతేఽశ్మవర్షే చ మయా జలవర్షే చ శోషితే ।
ముముచుర్దానవా మాయామ అగ్నిం వాయుం చ భారత ॥ 9
భారతా! నేను రాళ్ళ వర్షాన్ని నశింపచేసి జలవర్షాన్నిఎండిపోయేటట్లు చెయ్యగానే దానవులు మాయామయమైన నిప్పును గాలిని వదలసాగారు. (9)
తతోఽహమగ్నిం వ్యధమం సలిలాస్త్రేణ సర్వశః ।
శైలేన చ మహాస్త్రేణ వాయోర్వేగమధారయమ్ ॥ 10
అప్పుడు నేనా మంటలన్నింటినీ వారుణాస్త్రంతో చల్లార్చాను. గొప్పదైన శైలాస్త్రంతో వాయువు యొక్క వేగాన్ని అడ్డుకున్నాను. (10)
తస్యాం ప్రతిహతాయాం తే దానవా యుద్ధదుర్మదాః ।
ప్రాకుర్వన్ వివిధాం మాయాం యౌగపద్యేన భారత ॥ 11
భారతా! ఆ మాయ తిప్పి కొట్టబడగానే యుద్ధోన్మాదంతో ఆ దానవులు ఒకేసారి అనేకరకాలైన మాయను ప్రయోగించారు. (11)
తతో వర్షం ప్రాదురభూత్ సుమహల్లోమహర్షణమ్ ।
అస్త్రాణాం ఘోరరూపాణామ్ అగ్నేర్వాయోస్తథాశ్మనామ్ ॥ 12
అప్పుడు ఎంతో భారీగా, గగుర్పాటు కలిగించే భయంకరమైన అస్త్రాలు, నిప్పులు, గాలి, రాళ్ళ వాన మొదలైంది. (12)
సా తు మాయామయూ వృష్టిః పీడయామాస మాం యుధి ।
అథ ఘోర తమస్తీవ్రం ప్రాదురాసీత్ సమంతతః ॥ 13
ఆ మాయామయమైన వర్షం యుద్ధంలో నన్ను భాధించసాగింది అటుపిమ్మట అన్నిప్రక్కలా భయంకరమైన చిమ్మచీకటి ఆవరించింది. (13)
తమసా సంవృతే లోకే ఘోరేణ పరుషేణ చ ।
హరయో విముఖాశ్చాసన్ ప్రాస్ఖలచ్చాపి మాతలిః ॥ 14
ఘోరమైన చీకటి లోకమంతా ఆవరించగానే గుర్రాలు యుద్ధానికి విముఖత చూపాయి. మాతలి కూడ జారిపోయాడు. (14)
హస్తాద్ధి రశ్మయశ్చాస్య ప్రతోదః ప్రాపతద్ భువి ।
అసకృచ్చాహ మాం భీతః క్వాసీతి భరతర్షభ ॥ 15
అతని చేతి నుండి గుర్రాలను కట్టిన త్రాళ్ళు చెర్నాకోల నేలమీద పడిపోయాయి. భయంతో నన్ననేకసార్లు 'భరతశ్రేష్ఠా! అర్జునా! ఎక్కడున్నా'వని పిలిచాడు. (15)
మాం చ భీరావిశత్ తీవ్రా తస్మిన్ విగతచేతసి।
స చ మాం విగతజ్ఞానః సంత్రస్తమిదమబ్రవీత్ ॥ 16
అతడలా తెలివి తప్పితే నాకు చాలా భయం వేసింది. తెలివి తప్పిన ఆ మాతలి ఎంతో బెదిరిపోయిన నాతో ఇలా అన్నాడు. (16)
సురాణామసురాణాం చ సంగ్రామః సుమహానభూత్ ।
అమృతార్థం పురా పార్థ చ స చ దృష్టో మయానఘ ॥ 17
కుంతీకుమారా! పూర్వం అమృతం కోసం దేవాసురులమధ్య గొప్పయుద్ధం జరిగింది. దాన్ని నేను చుశాను. (17)
శంబరస్య వధే ఘోరః సంగ్రామః సుమహానభూత్ ।
సారథ్యం దేవరాజస్య తత్రాపి కృతవానహమ్ ॥ 18
శంబరుణ్ణి చంపటానికి గొప్పభయంకరమైన యుద్ధం జరిగింది. అక్కడ కూడ నేను దేవరాజైన ఇంద్రుడికి సారథ్యం చేశాను. (18)
తథైవ వృత్రస్య వధే సంగృహీతా హయా మయా ।
వైరోచనేర్మహాయుద్ధం దృష్టం చాపి సుదారుణమ్ ॥ 19
అలాగే వృత్రుణ్ణి చంపే సమయంలో నేను గుర్రాలను కట్టడి చేశాను. విరోచనుడి కుమారుడైన బలి చేసిన గొప్ప భయంకరమైన యుద్ధాన్నీ చూశాను. (19)
ఏతే మయా మహాఘోరాః సంగ్రామాః పర్యుపాసితాః ।
న చాపి విగతజ్ఞానోఽభూతపూర్వోఽస్మి పాండవ ॥ 20
చాలా ఘోరమైన ఈ యుద్ధాల్లో నేను పాల్గొన్నాను. పాండవా! ఇలా మందెన్నడూ తెలివిని కోల్పోలేదు. (20)
పితామహేన సంహారః ప్రజానాం విహితో ధ్రువమ్ ।
న హి యుద్ధమిదం యుక్తమ్ అన్యత్ర జగతః క్షయాత్ ॥ 21
తప్పకుండా ఇది సృష్టికర్త ప్రజలను చంపదలిచి చేసినదై ఉంటుంది. ఇలాంటి యుద్ధం ప్రపంచ ప్రళయసమయంలో తప్ప మరెప్పుడూ జరగదు. (21)
తస్య తద్ వచనం శ్రుత్వా సంస్తభ్యాత్మానమాత్మనా ।
మోహయిష్యన్ దానవానామ్ అహం మాయాబలం మహత్ ॥ 22
అబ్రువం మాతలిం భీతం పశ్య మే భుజయోర్బలమ్।
అస్త్రాణాం చ ప్రభావం వై ధనుషో గాండివస్య చ ॥ 23
అద్యాస్త్రమాయయతేషాం మాయామేతాం సుదారుణామ్ ।
వినిహన్మి తమశ్చోగ్రం మా భైః సూత స్థిరో భవ ॥ 24
అతని ఆ మాటవిని నన్ను నేను అదుపుచేసుకుని నేను ఆదానవుల గొప్ప మాయాబలాన్ని అడ్డుకుంటూ భయంతో ఉన్న మాతలిలో నాభుజబలాన్ని అస్త్రాల యొక్క గాండివ ధనుస్సు యొక్క ప్రభావాన్ని చూడు అన్నాను. సూతా! నేనీరోజు భయంకరమైన వీరమాయను, ఈ చిమ్మ చీకటిని నా అస్త్రమాయతో నశింపచేస్తాను. భయపడకు. నిలకడగా ఉండు అన్నాను. (22-24)
ఏవముక్త్వాహమసృజమ్ అస్త్రమాయాం నరాధిప ।
మోహనీం సర్వభూతానాం హితాయ త్రిదివౌకసామ్ ॥ 25
రాజా! ఈ విధంగా చెప్పి దేవతల మేలుకై అన్ని ప్రాణులనూ మోహింపచేసే నా అస్త్రమాయను సృష్టించాను. (25)
పీడ్యమానాసు మాయాసు తాసు తాస్వసురోత్తమాః ।
పునర్బహువిధా మాయాః ప్రాకుర్వన్నమితౌజసః ॥ 26
ఆ మాయలను నివారిస్తూ మితంలేని తేజస్సు గలిగిన ఆ రాక్షసోత్తములు మళ్ళీ అనేక రకాలైన మాయలను కల్పించారు. (26)
పునః ప్రకాశమభవత్ తమసా గ్రస్యతే పునః ।
భవత్యదర్శనో లోకః పునరప్సు నిమజ్జతి ॥ 27
ఒకప్పుడు వెలుగు ఏర్పడుతోంది. మరొకప్పుడు చీకటి కమ్మేస్తోంది. లోకమంతా కనబడకుండా పోతోంది. ఒకప్పుడు నీళ్ళలో మునిగిపోతోంది. (27)
సుసంగృహీతైర్హరిభిః ప్రకాశే సతి మాతలిః ।
వ్యచరత్ స్యందనాగ్య్రేణ సంగ్రామే లోమహర్షణే ॥ 28
వెలుగు వచ్చినప్పుడు మాతలి గుర్రాలను అదుపుచేస్తూ గగుర్పాటు కలిగించే యుద్ధంలో ఆ శ్రేష్ఠమైన రథం మీద ముందుకు పోసాగాడు. (28)
తతః పర్యపతన్నుగ్రాః నివాతకవచా మయి ।
తానహం వివరం దృష్ట్వా ప్రాహిణ్వం యమసాదనమ్ ॥ 29
అప్పుడు భయంకరులైన నివాతకవచులు నామీద విరుచుకుపడ్డారు. అవకాశం చేజిక్కించుకుని నేను వాళ్లను యమలోకానికి పంపాను. (29)
వర్తమానే తథా యుద్ధే నివాతకవచాంతకే ।
నాపశ్యం సహసా సర్వాన్ దానవాన్ మాయయాఽఽవృతాన్ ॥ 30
నివాతకవచుల్ని అంతమొందించటానికి అలా యుద్ధం జరుగుతుండగా మాయతో కప్పబడిన ఆ రాక్షసులందర్నీ వెంటనే చూడలేకపోయాను. (30)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నివాతకవచయుద్ధపర్వణి మాయాయుద్ధే ఏకసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 171 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నివాతకవచయుద్ధపర్వమను ఉపపర్వమున మయాయుద్ధమను నూట డెబ్బది ఒకటవ అధ్యాయము. (171)