169. నూట అరువది తొమ్మిదవ అధ్యాయము
అర్జునుడు నివాతకవచులతో యుద్ధము ప్రారంభించుట.
అర్జున ఉవాచ
తతోఽహం స్తూయామానస్తు తత్ర తత్ర మహర్షిభిః ।
అపశ్యముదధిం భీమమ్ అపాంపతిమథావ్యయమ్ ॥ 1
ఫేనవత్యః ప్రకీర్ణాశ్చ సంహతాశ్చ సముత్థితాః ।
ఊర్మయశ్చాత్ర దృశ్యంతే వల్గంత ఇవ పర్వతాః ॥ 2
అర్జునుడు చెపుతున్నాడు - తరువాత నేను దోవలో అక్కడక్కడా మహర్షుల చేత స్తుతింపబడుతూ సాగి భయంకరమైన సముద్రాల్ని చూశాను. అందులో అలలు నురుగులో ఉన్నాయి. చెల్లాచెదరుగా, కలిసికట్టుగా నాట్యమాడే పర్వతాల్లాగా చెలరేగుతూ దుముకుతూ కనబడసాగాయి. (1,2)
నావః సహస్రశస్తత్ర రత్నపూర్ణాః సమంతతః ।
నభసీవ విమానాని విచరంత్యో విరేజిరే ।
తిమింగిలాః కచ్ఛపాశ్చ తథా తిమితిమింగిలాః ॥ 3
మకరాశ్చాత్ర దృశ్యంతే జలే మగ్నా ఇవాద్రయః ।
శంఖానాం చ సహస్రాణి మగ్నాన్యప్సు సమంతతః ॥ 4
చుట్టూ తిరిగే ఆకాశంలోని విమానాల్లాగా అక్కడ రత్నాలతో నిండిన పడవలు ప్రకాశిస్తున్నాయి. తిమింగిలాలు, తాబేళ్ళు, అలాగే తిమితిమింగలాలు మొసళ్ళు అక్కడ నీళ్ళలో మునిగిన కొండల్లాగా కనబడసాగాయి. అంతటా వేలకొలది శంఖాలు నీళ్ళలో ఉన్నాయి. (3,4)
దృశ్యంతే స్మ యథా రాత్రౌ తారాస్తన్వభ్రసంవృతాః ।
తథా సహస్రశస్తత్ర రత్నసంఘాః ప్లవంత్యుతః ॥ 5
రాత్రిపూట విస్తరించిన మబ్బుతునకలచే చుట్టబడ్డ నక్షత్రాల లాగా రత్నరాశులక్కడ తేలుతూ కనబడుతున్నాయి. (5)
వాయుశ్చ ఘూర్ణతే భీమః తదద్భుతమివాభవత్ ।
తముదీక్ష్య మహావేగం సర్వాంభోనిధిముత్తమమ్ ॥ 6
అపశ్యం దానవాకీర్ణం తద్ దైత్యపురమంతికాత్ ।
తత్రైఅ మాతలిస్తూర్ణం నిపత్య పృథివీతలే ॥ 7
రథం తం తు సమాశ్లిష్య ప్రాద్రవద్ రథయోగవిత్ ।
త్రాసయన్ రథఘోషేణ తత్ పురం సముపాద్రవత్ ॥ 8
భయంకరంగా గాలి గర్జిస్తోంది. అది అద్భుతంగా ఉంది చాలా వేగం కల ఉత్తమమైన ఆ సముద్రాన్ని చూసి దానికి దగ్గరలో దానవులతో నిండిన ఆ దైత్యుల పట్టణాన్ని చూశాను. రథాన్ని నడపడంలో నేర్పరి అయిన మాతలి వెంటనే అకక్డే భూమ్మీద దింపి ఆ రథాన్ని జాగ్రత్తగా అదుపుచేస్తూ పోనిచ్చాడు. ఆ రథం చప్పుడుతో బెదరగొడుతూ ఆ పట్టణం వైపు దౌడుతీశాడు. (6-8)
రథఘోషం తు తం శ్రుత్వా స్తనయిత్నోరివాంబరే ।
మన్వానా దేవరాజం మామ్ ఆవిగ్నా దానవాభవన్ ॥ 9
ఆకాశంలో మేఘగర్జనలాంటి ఆ రథం చప్పుడు విని దానవులు నన్ను దేవరాజుగా తలచి కలవరం చెందారు. (9)
సర్వే సంభ్రాంతమనసః శరచాపధరాః స్థితాః ।
తథాసిశూలపరశుగదాముసలపాణయః ॥ 10
అందరూ తత్తరపాటుతో బాణాలను ధనుస్సులను పట్టుకున్నారు. అలాగే కత్తి, శూలం, గొడ్డలి, గద, రోకళ్ళను పట్టుకున్నారు. (10)
తతో ద్వారాణీ పిదధుః దానవాస్త్రస్తచేతసః ।
సంవిధాయ పురే రక్షాం న స్మ కశ్చన దృశ్యతే ॥ 11
తరువాత బెదిరిపోయిన మనస్సులతో దానవులు రక్షణ కల్పించి తలుపులు మూసేశారు. పట్టణానికి బయట ఒక్కడూ కనపడటం లేదు. (11)
తతః శంఖముపాదాయ దేవదత్తం మహాస్వనమ్ ।
పరమాం ముదమాశ్రిత్య ప్రాధమం తం శనైరహమ్ ॥ 12
తరువాత మహాధ్వని గల దేవదత్తశంఖాన్ని తీసుకుని చాలా సంతోషంతో నేను మెల్లగా పూరించాను. (12)
స తు శబ్దో దివం స్తబ్ధ్వా ప్రతిశబ్దమజీజనత్ ।
విత్రేసుశ్చ నిలిల్యుశ్చ భూతాని సుమహాంత్యపి ॥ 13
ఆ శబ్దం స్వర్గాన్ని తాకి ప్రతిధ్వనించింది. దానికి పెద్దపెద్ద ప్రాణులు కూడా భయాన్ని పొంది ఇటు - అటూ దాక్కున్నాయి. (13)
తతో నివాతకవచాః సర్వ ఏవ స్వలంకృతాః ।
దాంశితా వివిధైస్త్రాణైః విచిత్రాయుధపాణయః ॥ 14
ఆయసైశ్చ మహాశూలైః గదాభిర్ముసలైరపి ।
పట్టిశైః కరవాలైశ్చ రథచక్రైశ్చ భారత ॥ 15
శతఘ్నీభిర్భుశుండీభిః ఖడ్గైశ్చిత్రైః స్వలంకృతైః ।
ప్రగృహీతైర్దితేః పుత్రాః ప్రాదురాసన్ సహస్రశః ॥ 16
భారతా! పిమ్మట నివాతకవచులందరూ చక్కగా అలంకరించుకొని, అనేక విధాలైన తొడుగులను తొడుగుకొని, విచిత్రములైన ఆయుధాలను చేతపట్టారు. చేతుల్లో ఇనుపశూలాలతో, గదలతో, రోకళ్ళతో, బడిసెలతో, కత్తులతో, రథచక్రాలతో, ఫిరంగులతో, తూటాలతో, అలంకరించబడిన అనేకరకాలకత్తులతో వేలసంఖ్యలో దైత్యులు నగరం బయటకు వచ్చారు. (14-16)
తతో విచార్య బహుశః రథమార్గేషు తాన్ హయాన్ ।
ప్రాచోదయత్ సమే దేశే మాతలిర్భరతర్షభ ॥ 17
తేన తేషాం ప్రణున్నానామ్ ఆశుత్వాచ్ఛీఘ్రగామినామ్ ।
నాన్వపశ్యం తదా కించిత్ తన్మేఽద్భుతమివాభవత్ ॥ 18
భరతశ్రేష్ఠా! అప్పుడు మాతలి అనేకరకాలుగా ఆలోచించి ఎత్తుపల్లాలు లేనిచోట తగిన మార్గాలలో ఆ గుర్రాలను పోనిచ్చాడు. అలా పోనివ్వటం వల్ల చక్కగా శిక్షణ పొంది వేగంగా వెళ్ళే ఆ గుర్రాల వేగం వల్ల అప్పుడు నేను ఏమీ చూడలేకపోయాను. అది నాకెంతో అద్భుత మనిపించింది. (17-18)
తతస్తే దానవాస్తత్ర వాదిత్రాని సహస్రశః ।
వికృతస్వరరూపాణి భృశం సర్వాణ్యనాదయన్ ॥ 19
పిమ్మట ఆ దానవులక్కడ చాలా రోతపుట్టించే స్వరము, రూపము గల వాద్యాలన్నింటిని వేలకొలదిగా వాయించారు. (19)
తేన శబ్దేన సహసా సముద్రే పర్వతోపమాః ।
ఆప్లవంత గతైః సత్త్వైః మత్స్యాః శతసహస్రశః ॥ 20
ఆ శబ్దం వల్ల సముద్రంలో కొండల్లా ఉన్న చేపలు ఒక్కసారిగా ప్రాణాలు పోగా వందలు వేలసంఖ్యలో పైకితేలాయి. (20)
తతో వేగేన మహతా దానవా మాముపాద్రవన్ ।
విముంచంతః శితాన్ బాణాన్ శతశోఽథ సహస్రశః ॥ 21
పిమ్మట చాలా వేగంతో వందలు వేలసంఖ్యలో వాడిగా బాణాలను వదులుతూ దానవులు నా మీదకు వచ్చారు. (21)
స సంప్రహారస్తుములః తేషాం చ మమ భారత ।
అవర్తత మహాఘోరః నివాతకవచాంతకః ॥ 22
భారతా! వారికి నాకూ ఆయుద్ధం చాలా భయంకరమైనది, గుక్కతిప్పుకో లేనిదో అయింది. అది నివాతకవచుల ముగింపుకే దారి తీసింది. (22)
తతో దేవర్షయశ్చైవ తథాన్యే చ మహర్షయః ।
బ్రహ్మర్షయశ్చ సిద్ధాశ్చ సమాజగ్ముర్మహామృధే ॥ 23
తే వై మామనురూపాభిః మధురాభిర్జయైషిణః ।
అస్తువన్ మునయో వాగ్భిః యథేంద్రం తారకామయే ॥ 24
దేవర్షులు ఇతరులైన మహర్షులు, బ్రహ్మర్షులు, సిద్ధులు ఆ యుద్ధాన్ని తిలకించటానికి వచ్చారు. తారకామయ యుద్ధంలో ఇంద్రుని స్తుతించినట్లు నాజయాన్ని కోరుతున్న ఆ మునులు నన్ను తగిన మధురమైన మాటలతో పొగిడారు. (23,24)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నివాతకవచయుద్ధపర్వణి యుద్ధారంభే ఏకోనసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 169 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నివాతకవచయుద్ధపర్వమను ఉపపర్వమున యుద్ధారంభమను నూట అరువది తొమ్మిదవ అధ్యాయము. (169)