144. నూట నలువది నాలుగవ అధ్యాయము

ద్రౌపది మూర్ఛ, ఘటోత్కచుని రాక.

వైశంపాయన ఉవాచ
క్రోశమాత్రం ప్రయాతేషు పాండవేషు మహాత్మసు ।
పద్భ్యామనుచితా గంతుం ద్రౌపదీ సముపావిశత్ ॥ 1
శ్రాంతా దుఃఖపరీతా చ వాతవర్షేణ తేన చ ।
సౌకుమార్యాచ్చ పాంచాలీ సమ్ముమోహ తపస్వినీ ॥ 2
వైశంపాయనుడు పలికాడు.
పాండవులు రెమ్డు మైళ్ళు నడిచే సరికి ద్రౌపది నడువలేక చతికిలబడి పోయింది. అలసి, దుఃఖంతో కూడిన దీనురాలు పాంచాలి సుకుమారి అవటంచేత ఆ గాలివానకు మూర్ఛపోయింది. (1,2)
సా కంపమానా మోహేన బాహుభ్యామసితేక్షణా ।
వృత్తాభ్యామనురూపాభ్యామ్ ఊరూ సమవలంబత ॥ 3
వ్యాకులపాటుతో వణుకుతూ తెలివితప్పి రెండు చేతులతో రెండు తొడలనూ పట్టుకొంది. (3)
ఆలంబమానా సహితౌ ఊరూ గజకరోపమౌ ।
పపాత సహసా భూమౌ వేపంతీ కదలీ యథా ॥ 4
తాం పతంతీం వరారోహాం భజ్యమానాం లతామివ ।
నకులః సమభిద్రుత్య పరిజగ్రాహ వీర్యవాన్ ॥ 5
ఏనుగు తొండాలవంటి తొడలు పట్టుకొని వణకుతూ అరటిచెట్టువలె వేగంగా భూమిపై పడింది. సుందరాంగియై చెట్టునుంచి జారి, క్రిందపడుచున్న తీగవలె ఉన్న ద్రౌపదిని నకులుడు త్వరగా వచ్చి పట్టుకొన్నాడు. (4,5)
నకుల ఉవాచ
రాజన్ పంచాలరాజస్య సుతేయమసితేక్షణా ।
శ్రాంతా నిపతితా భూమౌ తామవేక్షస్వ భారత ॥ 6
నకులుడు అన్నాడు - రాజా! పాంచాల రాజకుమారి, నల్లటి నేత్రాలు గల ద్రౌపది అలసి భూమిపై పడిపోయింది. ఈమెను ఒక్కసారి చూడు. (6)
అదుఃఖార్హా పరం దుఃఖం ప్రాప్తేయం మృదుగామినీ ।
ఆశ్వాసయ మహారాజ తామిమాం శ్రమకర్శితామ్ ॥ 7
దుఃఖానికి తగని ఈ మందగమన దుఃఖాన్ని పొంది తట్టుకోలేకపోతోంది. శ్రమకలిగిన ఈమెను ఊరడించు. (7)
వైశంపాయన ఉవాచ
రాజా తు వచనాత్ తస్య భృశం దుఃఖసమన్వితః ।
భీమశ్చ సహదేవశ్చ సహసా సముపాద్రవన్ ॥ 8
వైశంపాయనుడు పాలికాడు - రాజు ఆ మాట విని, దుఃఖం పొంగి, భీమసహదేవులతో కలిసి అక్కడికి పరుగెత్తి వచ్చాడు. (8)
తామవేక్ష్య తు కౌంతేయః వివర్ణవదనాం కృశామ్ ।
అంకమానీయ ధర్మాత్మా పర్యదేవయదాతురః ॥ 9
ద్రౌపది ముఖకాంతి వాడిపోయింది. ఆమె చిక్కిపోయి ఉంది. ఆమెను ఒడిలోనికి తీసుకొని శోకపీడితుడై ధర్మరాజు విలపించసాగాడు. (9)
యుధిష్ఠిర ఉవాచ
కథం వేశ్మసు గుప్తేషు స్వాస్తీర్నశయనోచితా ।
భూమౌ నిపతితా శేతే సుఖార్హా వరవర్ణినీ ॥ 10
యుధిష్ఠిరుడు పలికాడు - సురక్షితగృహాల్లో హంసతూలికా తల్పాలకు అర్హురాలయిన ఈమె భూమిపై పడిపోయింది. (10)
సుకుమారౌ కథం పాదౌ ముఖం చ కమలప్రభమ్ ।
మత్కృతేఽద్య వరార్హాయాః శ్యామతాం సముపాగతమ్ ॥ 11
సుకుమారమైన ఈమె పాదాలూ, పద్మకాంతి కల ఈ ముఖమూ నా కోసం శ్రమపడుతూ నల్లబడి పోయాయి. (11)
కిమిదం ద్యూతకామేన మయా కృతమబుద్ధినా ।
ఆదాయ కృష్ణాం చరతా వనే మృగగణాయుతే ॥ 12
ద్యూతాసక్తితో బుద్ధిని కోల్పోయిన నేను ద్రౌపదిని తీసుకొని క్రూరమృగాలతో నిండిన అడవిలో తిరుగుతున్నాను. (12)
సుఖం ప్రాప్స్యసి కల్యాణి పాండవాన్ ప్రాప్య వై పతీన్ ।
ఇతి ద్రుపదరాజేన పిత్రా దత్తాఽఽయతేక్షణా ॥ 13
తత్ సర్వమనవాప్యేయం శ్రమశోకాధ్వకర్శితా ।
శేతే నిపతితా భూమౌ పాపస్య మమ కర్మభిః ॥ 14
ద్రుపదమహారాజు వివాహసమయంలో 'పాండవులను పొంది సుఖించగలవు అని' చెప్పి మరీ కన్యాదానం చేశాడు. కాని నా పాపపుపనులచే ఈమె సుఖాన్ని పొందక శ్రమ, దుఃఖం, మార్గాయాసం కలిగి ఈనాడు భూమిపై అచేతనంగా పడి ఉంది. (13,14)
వైశంపాయన ఉవాచ
తథా లాలప్యమానే తు ధర్మరాజే యుధిష్ఠిరే ।
ధౌమ్యప్రభృతయః సర్వే తత్రాజగ్ముర్ద్విజోత్తమాః ॥ 15
వైశంపాయనుడు పలికాడు - ధర్మరాజు ఆ ప్రకారం విలపిస్తుండగా ధౌమ్యాది పురోహితగణం అక్కడకు వచ్చింది. (15)
తే సమాశ్వాసయామాసుః ఆశీర్భిశ్చాప్యపూజయన్ ।
రక్షోఘ్నాంశ్చ తథా మంత్రాన్ జేపుశ్చక్రుశ్చ తె క్రియాః ॥ 16
వారు ఆయనను ఊరడించి, ఆశీస్సులతో పూజించారు. రాక్షసులను వినాశనం చేసే మంత్రాలను, జపాన్ని, శాంతికర్మలను ఆచరించారు. (16)
పఠ్యమానేషు మంత్రేషు శాంత్యర్థం పరమర్షిభిః ।
స్పృశ్యమానా కరైః శీతైః పాండవైశ్చ ముహుర్ముహుః ॥ 17
శాంతికోసం పరమర్షులచే మంత్రాలు పఠింపబడుతూంటే తమ చల్లనిచేతులతో పాండవులు ద్రౌపదిని పదేపదే నిమిరారు. (17)
సేవ్యమానా చ శీతేన జలమిశ్రేణ వాయునా ।
పాంచాలీ సుఖమాసాద్య లేభే చేతః శనైః శనైః ॥ 18
చల్లని జలంకల వాయువు సోకగానే ఆమెకు సుఖం కలిగింది. పాంచాలి మెల్లమెల్లగా తెలివి తెచ్చుకుంది. (18)
పరిగృహ్య చ తాం దీనాం కృష్ణామజినసంస్తరే ।
పార్థా విశ్రామయామాసుః లబ్ధసంజ్ఞాం తపస్వినీమ్ ॥ 19
దీనావస్థలో ఉన్న ద్రౌపదిని పట్టుకొని, లేడిచర్మం పరచి, పడుకోబెట్టి, విశ్రమింపచేశారు. అపుడామెకు స్పృహ వచ్చింది. (19)
తస్యా యమౌ రక్తతలౌ పాదౌ పూజితలక్షణౌ ।
కరాభ్యాం కిణజాతాభ్యాం శనకైః సంవవాహతుః ॥ 20
నకుల సహదేవులు పూజింపవలసిన లక్షణాలు గల ఆమె ఎఱ్ఱటి పాదాలను వింటినారిచే కాయలు కాసిన చెతులతో మెల్లగా ఒత్తసాగారు. (20)
పర్యాశ్వాసయదప్యేనాం ధర్మరాజో యుధిష్ఠిరః ।
ఉవాచ చ కురుశ్రేష్ఠః భీమసేనమిదం వచః ॥ 21
ధర్మరాజు కూడ ఆమెను చాలావిధాలుగా ఊరడించినాడు. భీమసేనునితో ఇలా పలికాడు. (21)
బహవః పర్వతా భీమ విషమా హిమదుర్గమాః ।
తేషు కృష్ణా మహాబాహో కథం ను విచరిష్యతి ॥ 22
ఇక్కడ నుంచి ఎత్తుపల్లాలైన పర్వతాలు చాలా ఉన్నాయి. మంచుకారణంగా నడవడానికి వీలుగా లేవు. వాటిపై ద్రౌపది ఎలా నడ్వగలదు? (22)
భీమసేన ఉవాచ
త్వాం రాజన్ రాజపుత్రీం చ యమౌ చ పురుషర్షభ ।
స్వయం నేష్యామి రాజేంద్ర మా విషాదే మనః కృథాః ॥ 23
భీమసేనుడు చెప్పాడు - రాజా! మీరు విచారించవద్దు. నేను కవలలను, ద్రౌపదిని, మిమ్ములను కూడ ఎత్తుకొని నడవగలను. (23)
హైడింబశ్చ మహావీర్యః విహగో మద్బలోపమః ।
వహేదనఘ సర్వాన్నః వచనాత్ తే ఘటోత్కచః ॥ 24
హిడింబకుమారుడు, మహావీరుడు, నాతో సమానమైన బలం కలవాడు, ఆకాశంలో సంచరించగలవాడు అయిన ఘటోత్కచుడు నామాటగా మిమ్ములను అందరినీ వీపుపై ఎక్కించుకొని, ఎగురగలడు. (24)
వైశంపాయన ఉవాచ
అనుజ్ఞాతో ధర్మరాజ్ఞా పుత్రం సస్మార రాక్షసమ్ ।
ఘటోత్కచస్తు ధర్మాత్మా స్మృతమాత్రః పితుస్తదా ॥ 25
కృతాంజలిరుపాతిష్ఠత్ అభివాద్యాథ పాండవాన్ ।
బ్రాహ్మణాంశ్చ మహాబాహుః స చ తైరభినందితః ॥ 26
ఉవాచ భీమసేనం సః పితరం భీమవిక్రమమ్ ।
స్మృతోఽస్మి భవతా శీఘ్రం శుశ్రూషురహమాగతః ॥ 27
వైశంపాయనుడు పలికాడు - ధర్మరాజు అంగీకరించగా భీముడు ఘటోత్కచుని తలచుకొన్నాడు. తలవడంతోనే ధర్మాత్ముడైన ఘటోత్కచుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మణులకు, పాండవులకు నమస్కరించి వారిచే అబినందితుడై భయంకరపరాక్రం గల తన తండ్రితో ఇలా అన్నాడు. 'నీ చే స్మరింపబడి నిన్ను సేవించాలని శీఘ్రంగా వచ్చాను. (25-27)
ఆజ్ఞాపయ మహాబాహో సర్వం కర్తాస్మ్యసంశయమ్ ।
తచ్ర్ఛుత్వా భీమసేనస్తు రాక్షసం పరిషస్వజే ॥ 28
ఆజ్ఞాపించు. నేను మీ పనులన్నింటినీ పూర్తిచేస్తాను.' అది విని భీమసేనుడు ఆనందంతో కుమారుని కౌగిలించుకొన్నాడు. (28)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం గంధమాదనప్రవేశే చతుశ్చత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 144 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో గంధమాదనప్రవేశమను నూట నలువది నాలుగవ అధ్యాయము. (144)