142. నూట నలువది రెండవ అధ్యాయము

లోమశుడు వరాహావతారమును వర్ణించుట.

లోమశ ఉవాచ
ద్రష్టారః పర్వతాః సర్వే నద్యః సపురకాననాః ।
తీర్థాని చైవ శ్రీమంతి స్పృష్టం చ సలిలం కరైః ॥ 1
నీవు అన్ని పర్వతాలను జాగ్రత్తగా చూశావు. నగరాలు, వనాలతో కూడిన నదులను చూశావు. ప్రభావం కల తీర్థదర్శనం, జలపానం స్వయంగా నీ చేతులతో చేశావు. (1)
పర్వతం మందరం దివ్యమ్ ఏష పంథాః ప్రయాస్యతి ।
సమాహితా నిరుద్విగ్నాః సర్వే భవత పాండవాః ॥ 2
అయం దేవనివాసో వై గంతవ్యో వో భవిష్యతి ।
ఋషీణాం చైవ దివ్యానాం నివాసః పుణ్యకర్మణామ్ ॥ 3
ఈ మార్గం పవిత్రం అయిన మందరాద్రివైపు పోతుంది. మీరందరు ఉద్విగ్నతకు లోనుకాక ఏకాగ్రచిత్తంతో ఉండండి. ఇది దేవతల నివాసం. దీనిపైకి మీరు చేరాలి. పుణ్యకర్మలు ఆచరించే దివ్యర్షుల నివాసం. (2,3)
ఏషా శివజలా పుణ్యా యాతి సౌమ్య మహానదీ ।
బదరీప్రభవా రాజన్ దేవర్షిగణసేవితా ॥ 4
రాజా! ఇది మంగళప్రదం అయిన నీటితో ప్రవహించే మహానది అలకనంద (గంగ). దేవర్షిలోకం దీనిలో సదా స్నానం చేస్తుంది. బదరికాశ్రమం నుంచి ఉద్భవించింది. (4)
ఏషా వైహాయసైర్నిత్యం వాలఖిల్యైర్మహాత్మభిః ।
అర్చితా చోపయాతా చ గంధర్వైశ్చ మహాత్మభిః ॥ 5
ఆకాశసంచారులు, అంగుష్ఠమాత్రపరిమాణం గల వాలఖిల్యులు దీన్ని సేవిస్తారు. గంధర్వులు నిత్యం దీన్ని కొలుస్తారు. (5)
అత్ర సామ స్మ గాయంతి సామగాః పుణ్యనిఃస్వనాః ।
మరీచిః పులహశ్చైవ భృగుశ్చైవాంగిరాస్తథా ॥ 6
ఇక్కడ సామగానం చేసేవారి పుణ్యధ్వనులు వ్యాపించి ఉంటాయి. సామవేదంలోని ఋక్కులు గానం చేస్తారు. మరీచి, పులహుడు, భృగువు, ఆంగిరసుడు ఇక్కడ జపతపోవేదాధ్యయనాలు చేస్తారు. (6)
అత్రాహ్నికం సురశ్రేష్ఠః జపతే సమరుద్గణః ।
సాధ్యాశ్చైవాశ్వినౌ చైవ పరిధావంతి తం తదా ॥ 7
దేవతలరాజైన ఇంద్రుడు మరుద్గణాలతో ఇక్కడే ప్రతిరోజు జపాదులు చేస్తాడు. సాధ్యులు, అశ్వినీదేవతలు ఆ సమయంలో అతనిని అనుసరిస్తారు. (7)
చంద్రమాః సహ సూర్యేణ జ్యోతీంషి చ గ్రహైః సహ ।
అహోరాత్రవిభాగేన నదీమేనామనువ్రజన్ ॥ 8
చంద్రుడు, సూర్యునితో, నక్షత్రాలుతో, గ్రహాలతో పగలు రాత్రి ఈ నదీయాత్ర చేస్తున్నాడు. (8)
ఏతస్యాః సలిలం మూర్ధ్ని వృషాంకః పర్యధారయత్ ।
గంగాద్వారే మహాభాగ యేన లోకస్థితిర్భవేత్ ॥ 9
హరిద్వారంలో ఈ నదీజలాన్ని ప్రత్యక్షంగా శంకరుడే శిరస్సుపై ధరించాడు. దీనిచే లోకానికి రక్షణ ఏర్పడింది. (9)
ఏతాం భగవతీం దేవీం భవంతః సర్వ ఏవ హి ।
ప్రయతేనాత్మనా తాత ప్రతిగమ్యాభివాదత ॥ 10
మీరందరు ఇంద్రియనిగ్రహంతో ఉండి ఐశ్వర్యాన్ని ఇచ్చే అలకనంద ఒడ్డుపై నిలబడి సాదరంగా నమస్కరించండి. (10)
తస్య తద్ వచనం శ్రుత్వా లోమశస్య మహాత్మనః ।
ఆకాశగంగాం ప్రయతాః పాండవాస్తేఽభ్యవాదయన్ ॥ 11
మహాత్ముడైన లోమశుని మాటలు విని పాండవులు ఏకాగ్ర చిత్తంతో ఆకాశగంగకు నమస్కారం చేశారు. (11)
అభివాద్య చ తే సర్వే పాండవా ధర్మచారిణః ।
పునః ప్రయాతాః సంహృష్టాః సర్వైఋషిగణైః సహ ॥ 12
గంగకు నమస్కరించి ధర్మాచరణమందు ఆసక్తి గల పాండవులు ఋషిగణాలతో కలిసి ఆనందంతో ముందుకుసాగారు. (12)
తతో దూరాత్ ప్రకాశంతం పాండురం మేరుసన్నిభమ్ ।
దద్ఱ్రుశుస్తే నరశ్రేష్ఠాః వికీర్ణం సర్వతోదిశమ్ ॥ 13
దూరం నుంచే ప్రకాశించే శక్తి గల తెల్లని మేరుపర్వతంతో సమానం అయిన పర్వతాన్ని వారు చూశారు. అది అన్నిదిక్కులకు వ్యాపించి ఉంది. (13)
తాన్ ప్రష్టుకామాన్ విజ్ఞాయ పాండవాన్ స తు లోమశః ।
ఉవాచ వాక్యం వాక్యజ్ఞః శృణుధ్వం పాండునందనాః ॥ 14
'పాండవులు దీని గురించి ప్రశ్నిస్తారు' అని ముందే తెలిసిన లోమశుడు ప్రవచనకళలో ఆరితేరిన వాడు కావడం వల్ల వారితో ఇలా పలికాడు. (14)
ఏతద్ వికీర్ణం సుశ్రీమత్ కైలాసశిఖరోపమమ్ ।
యత్ పశ్యసి నరశ్రేష్ఠ పర్వతప్రతిమం స్థితమ్ ॥ 15
ఏతాన్యస్థీని దైత్యస్య నరకస్య మహాత్మనః ।
పర్వతప్రతిమం భాతి పర్వతప్రస్తరాశ్రితమ్ ॥ 16
అనివైపులకు ప్రసరించి, సుందరంగా కైలాసపర్వతశిఖరం వలె ప్రకాశించే ప్రదేశాన్ని నీవు చూస్తున్నావు. ఇవి రాక్షసరాజైన నరకుని ఎముకులు. పర్వతంపై రాతిశిలలపై ఉండడం వల్ల పర్వతసమానంగా అనిపిస్తున్నాయి. (15,16)
పురాతనేన దేవేన విష్ణునా పరమాత్మనా ।
దైత్యో వినిహతస్తేన సురరాజహితైషిణా ॥ 17
దేవేంద్రుని హితం కోరి శ్రీమహావిష్ణువు పూర్వకాలంలో ఈ రాక్షసుని ఇక్కడ వధించాడు. (17)
దశవర్షసహస్రాణి తపస్తప్యన్ మహామనాః ।
ఐంద్రం ప్రార్థయతే స్థానం తపఃస్వాధ్యాయవిక్రమాత్ ॥ 18
ఆ నరకాసురుడు పదివేల సంవత్సరాలు తపస్సుచేసి వేదాధ్యయనాలతో, పరాక్రమంతో ఇంద్రస్థానాన్ని అభిలషించాడు. (18)
తపోబలేన మహతా బాహువేగబలేన చ ।
నిత్యమేవ మహతా బాహువేగబలేన చ ।
నిత్యమేవ దురాధర్షో ధర్షయన్ స దితేః సుతః ॥ 19
దితికుమారుడు అయిన అతడు తపశ్శక్తితో బాహుబలంతో అజేయుడై నిత్యం దేవతలను పీడించసాగాడు. (19)
స తు తస్యబలం జ్ఞాత్వా ధర్మే చ చరితవ్రతమ్ ।
భయాభిభూతః సంవిగ్నః శక్ర ఆసీత్ తదానఘ ॥ 20
'నరకాసురుడు బలవంతుడు, పైగా ధర్మంగా నియమాలను పాలిస్తున్నాడు' అనే భయంతో ఇంద్రుడు వ్యాకులపడసాగాడు. (20)
తేన సంచింతితో దేవః మనసా విష్ణూరవ్యయః ।
సర్వత్రగః ప్రభుః శ్రీమాన్ ఆగతశ్చ స్థితో బభౌ ॥ 21
అతడు మనస్సులోనే వినాశంలేని విష్ణువుని ధ్యానించాడు. అది పూర్తికాగానే సర్వాంతర్యామి అయిన శ్రీపతి అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. (21)
ఋషయశ్చాపి తం సర్వే తుష్ణువుశ్చ దివౌకసః ।
తం దృష్ట్వా జ్వలమానశ్రీః భగవాన్ హవ్యవాహనః ॥ 22
నష్టతేజాః సమభవత్ తస్య తేజోఽభిభర్త్సితః ।
తం దృష్ట్వా వరదం దేవం విష్ణుం దేవగణేశ్వరమ్ ॥ 23
ప్రాంజలిః ప్రణతో భూత్వా నమస్కృత్య చ వజ్రభృత్ ।
ప్రాహ వాక్యం తతస్తత్త్వం యతస్తస్య భయం భవేత్ ॥ 24
ఆ సమయంలో ఋషులు, దేవతలు అతనిని స్తోత్రం చేశారు. అతనిని చూస్తుండగానే అంతవరకు ప్రకాశించిన అగ్నితేజం నశించింది. వరాలిచ్చే శ్రీమహావిష్ణువును చూచి ఇంద్రుడు అంజలి ఘటించి, నమస్కరించి, మాటిమాటికి శిరస్సు వంచి, కనిపించాడు. పిమ్మట వృత్తాంతమంతా ఆయనకు నివేదించి, ఎవని వల్ల భయం ఏర్పడిందో వివరించాడు. (22-24)
జానామి తే భయం శక్ర దైత్రేంద్రాన్నరకాత్ తతః ।
ఐంద్రం ప్రార్థయతే స్థానం తపః సిద్ధేన కర్మణా ॥ 25
నీకు రాక్షసరాజైన నరకుని వలన కలిగిన భయాన్ని తెలుసుకొన్నాను. అతడు తన తపఃప్రభావంచే ఇంద్రపదవిని పొందాలి అనుకొంటున్నాడు. (25)
సోఽహమేనం తవ ప్రీత్యా తపః సిద్ధమపి ధ్రువమ్ ।
వియునజ్మి దేహాద్ దేవేంద్ర ముహూర్తం ప్రతిపాలయ ॥ 26
తపస్సు వల్ల అతనికి ఆ ప్రభావం ఏర్పడింది. కాని నేను నీ పట్ల ప్రేమకలవాణ్ణి. ఆ రాక్షసుని నేను చంపి తీరతాను, కొంతకాలం ఓపికపట్టు. (26)
తస్య విష్ణుర్మహాతేజాః పాణినా చేతనాం హరత్ ।
స పపాత తతో భూమౌ గిరిరాజ ఇవాహతః ॥ 27
అని పలికి తేజోవంతుడైన విష్ణువు ఆ రాక్షసుని తాకి, ప్రాణాల్ని హరించాడు. అతడు వజ్రపు, దెబ్బతిన్న పర్వతం వలె నేలపై పడ్డాడు. (27)
తస్యైతదస్థిసంఘాతం మాయావినిహతస్య వై ।
ఇదం ద్వితీయమపరం విష్ణోః కర్మ ప్రకాశతే ॥ 28
కావున మాయద్వారా చంపిన నరకాసురుని ఎముకలే ఇవి. రెండవదైన విష్ణువు చేష్టను వివరిస్తాను. ఇది లోకంలో వ్యాపించి ఉన్నదే. (28)
నష్టా వసుమతీ కృత్స్నా పాతాలే చైవ మజ్జితా ।
పునరుద్ధరితా తేన వారాహేణైకశృంగిణా ॥ 29
ఒకానొక సమయంలో భూమి ఒక సముద్రం జలంలో మునిగి పాతాళానికి చేరింది. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఒక దంతం గల అడవిపంది రూపం దాల్చి భూమినిపైకి తీశాడు. (29)
యుధిష్ఠిర ఉవాచ
భగవాన్ విస్తరేణేమాం కథాం కథయ తత్త్వతః ।
కథం తేన సురేశేన నష్టా వసుమతీ తదా ॥ 30
యోజనానాం శతం బ్రహ్మన్ పునరుద్ధరితా తదా ।
కేన చైవ ప్రకారేణ జగతో ధరణీ ధ్రువా ॥ 31
ధర్మరాజు అడిగాడు - మహర్షీ! విస్తరంగా నా కీ కథను తెలియజెయ్యి. పాతాళాంలోకి వందలకొద్దీ యోజనాల వరకు భూమి ఎందుకు మునిగింది? భూభారాన్ని వహించగల ఈ ధరణి ఏ విధంగా విష్ణువుచే ఉద్ధరింపబడిందో దానికి అతడు ఏ ఉపాయం ఆలోచించాడో చెప్పు. (30,31)
శివా దేవీ మహాభాగా సర్వసస్యప్రరోహిణీ ।
కస్య చైవ ప్రభావాద్ధి యోజనానాం శతం గతా ॥ 32
సస్యాలన్నింటినీ పుట్టించే ఈ పవిత్ర భూమి ఎవని కారణంగా వందల యోజనాలు సముద్రంలో మునిగింది? (32)
కేన తద్ వీర్యసర్వస్యం దర్శితం పరమాత్మనః ।
ఏతత్ సర్వం యథాతత్త్వమ్ ఇచ్ఛామి ద్విజసత్తమ ।
శ్రోతుం విస్తరశః సర్వం త్వం తస్య ప్రతిశ్రయః ॥ 33
అప్పటి పరమాత్మ దర్శనం ఎవరి వలన లోకానికి కలిగింది? ఉన్నది ఉన్నట్టుగా నాకు వివరించు. ఆ వృత్తాంతాన్ని పూర్తిగా వినగోరుతున్నాను. (33)
లోమశ ఉవాచ
యత్ తేఽహం పరిపృష్టోఽస్మి కథామేతాం యుధిష్ఠిర ।
తత్ సర్వమఖిలేనేహ శ్రూయతాం మమ భాషతః ॥ 34
లోమశుడు పలికాడు - నీవు ప్రశ్నించిన దాన్ని పూర్తిగా నీకు వివరిస్తాను. విను. (34)
పురా కృతయుగే తాత వర్తమానే భయంకరే ।
యమత్వం కారయామాస ఆదిదేవః పురాతనః ॥ 35
ఈ కల్పంలోని సత్యయుగంలో జరిగిన విషయం ఇది. ఒకప్పుడు లోకంలో భయంకరపరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఆదిదేవుడు యముని పనిని కూడ ఆచరిస్తున్నాడు. (35)
యమత్వం కుర్వతస్తస్య దేవదేవస్య ధీమతః ।
న తత్ర మ్రియతే కశ్చిజ్జాయతే వా తథాప్యుత ॥ 36
యముని పని ఆచరించే అతని ప్రభావంచే ప్రాణులకు మృత్యువు కలగటం లేదు. పుట్టుక మాత్రం యథావిధిగా సాగుతోంది. (36)
వర్ధంతే పక్షిసంఘాశ్చ తథా పశుగవేడకమ్ ।
గవాశ్వం చ మృగాశ్చైవ సర్వే తే పిశితాశనాః ॥ 37
పక్షిసంఘాలు పెరిగిపోయాయి. ఆవులు, ఎద్దులు, గేదెలు, మేకలు, గుఱ్ఱాలు, మాంసాహారులైన జంతువులు అలాగే వృద్ధి చెందాయి. (37)
తథా పురుషశార్దూల మానుషాశ్చ పరంతప ।
సహస్రశో హ్యయుతశః వర్ధంతే సలిలం యట్థా ॥ 38
అలాగే మనుష్యులు వేలకువేలుగా, పదివేలకు పదివేలుగా వర్షాకాలంలో నీరు పెరిగినట్లు పెరిగిపోసాగారు. (38)
ఏతస్మిన్ సంకులే తాత వర్తమానే భయంకరే ।
అతిభారాద్ వసుమతీ యోజనానాం శతం గతా ॥ 39
ఇలాంటి సమయంలో భయంకరపరిస్థితి ఏర్పడి భూమి అతిభారం వలన వందయోజనాల సముద్రంలో మునిగిపోయింది. (39)
సా వై వ్యథితసర్వాంగీ భారేణాక్రాంతచేతనా ।
నారాయణం వరం దేవం ప్రపన్నా శరణం గతా ॥ 40
భూమి శరీరావయవాలన్నీ పీడను అనుభవిస్తున్నాయి. భారంతో కదలలేక వెంటనే భూమి నారాయణుని శరణు కోరింది. (40)
పృథివ్యువాచ
భగవంస్త్వత్ర్పసాదాద్ధి తిష్ఠేయం సుచిరం త్విహ ।
భారేణాస్మి సమాక్రాంతా న శక్నోమి స్మ వర్తితుమ్ ॥ 41
భూమి పలికింది. మీరు నాపై దయచూపండి. చిరకాలం నేను ఉండేలాగ చేయండి. నేను భారంతో క్రుంగిపోతున్నాను. నాకు ప్రాణాలు నిలిచేలా లేవు. (41)
మమేమం భగవన్ భారం వ్యపనేతుం త్వమర్హసి ।
శరణాగతాస్మి తే దేవ ప్రసాదం కురు మే విభో ॥ 42
నా ఈ భారాన్ని తొలగించేందుకు మీరే తగినవారు. మిమ్ము శరణుకోరుతున్నాను. నాపై దయచూపండి. (42)
తస్యాస్తద్ వచనం శ్రుత్వా భగవానక్షరః ప్రభుః ।
ప్రోవాచ వచనం హృష్టః శ్రవ్యాక్షరసమీరితమ్ ॥ 43
భూమి మాటలు విని నారాయణుడు ప్రసన్నుడై వినసొంపైన మధురవచనాలను ఆమెతో ఇలా పలికాడు. (43)
విష్ణురువాచ
న తే మహి భయం కార్యం భారార్తే వసుధారిణి ।
అహమేవం తథా కుర్మి యథా లఘ్వీ భవిష్యసి ॥ 44
విష్ణువు పలికాడు - నీవు భారంతో క్రుంగిపోయావు. దాన్ని గురించి నీవు భయపడకు. భూమి తేలికపడే ఉపాయం ఇప్పుడే చేస్తాను. (44)
లోమశ ఉవాచ
స తాం విసర్జయిత్వా తు వసుధాం శైలకుండలామ్ ।
తతో వరాహః సంవృత్తః ఏకశృంగో మహాద్యుతిః ॥ 45
లోమశుడు పలికాడు. పర్వతాలనే కుండలాలు కల భూమిని తనచోటికి పంపి విష్ణువు ఒకే ఒక కోరతో ప్రకాశించే అడవిపందిగా మారిపోయాడు. (45)
రక్తాభ్యాం నయనాభ్యాం తు భయముత్పాదయన్నివ ।
ధూమం చ జ్వలయన్ లక్ష్మ్యా తత్ర దేశే వ్యవర్ధత ॥ 46
ఎఱ్ఱటి కళ్ళతో భయం పుట్టిస్తున్నట్లు అయి తన శరీరతేజంతో పొగను చిమ్ముతూ అక్కడే పెరగసాగాడు. (46)
స గృహీత్వా వసుమతీం శృంగేణైకేన భాస్వతా ।
యోజనానాం శతం వీర సముద్ధరతి సోఽక్షరః ॥ 47
అతడు ప్రకాశిస్తూ ఒకే ఒక కొమ్ముతో భూమిని భరించి, నాశంలేనివాడై వందలయోజనాలు భూమిని పైకి తీశాడు. (47)
తస్యాం చోద్ధార్యమాణాయాం సంక్షోభః సమజాయత ।
దేవాః సంక్షుభితాః సర్వే ఋషయశ్చ తపోధనాః ॥ 48
దాన్ని పైకి తీస్తుండగా గొప్ప కలకలం బయలుదేరింది. దేవతలు, ఋషులు, తపోధనులు క్షోభించిపోయారు. (48)
హాహాభూతమభూత్ సర్వం త్రిదివం వ్యోమ భూస్తథా ।
న పర్యవస్థితః కశ్చిద్ దేవో వా మానుషోఽపి వా ॥ 49
తతో బ్రహ్మాణమాసీనం జ్వలమానమివ శ్రియా ।
దేవాః సర్షిగణాశ్చైవ ఉపతస్థురనేకశః ॥ 50
స్వర్గం, ఆకాశం, భుమి అంతటా హాహాకారాలు వ్యాపించాయి. ఏ దేవతా, ఏ ప్రాణీ స్థిరంగా ఉండలేకపోయారు. వెంటనే దేవతలు, ఋషులు బ్రహ్మవద్దకు చేరారు. అప్పుడు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఆసనంపై కూర్చుని ఉన్నాడు. (49,50)
ఉపసర్ప్య చ దేవేశం బ్రహ్మాణం లోకసాక్షికమ్ ।
భూత్వా ప్రాంజలయః సర్వే వాక్యముచ్చారయంస్తదా ॥ 51
లోకసాక్షియైన బ్రహ్మను సమీపించి, ప్రాణులందరు చేతులు జోడించి, ఇలా అన్నారు. (51)
లోకాః సంక్షుభితాః సర్వే వ్యాకులం చ చరాచరమ్ ।
సముద్రాణాం చ సంక్షోభః త్రిదశేశ ప్రకాశతే ॥ 52
లోకాలన్నీ కల్లోల పడుతున్నాయి. చరాచరప్రాణులన్నీ వ్యాకులపడ్డాయి. సముద్రాలు అల్లకల్లోలం అవుతున్నాయి. (52)
సైషా వసుమతీ కృత్స్నా యోజనానాం శతం గతా ।
కిమేతత్ కింప్రభావేణ యేనేదం వ్యాకులం జగత్ ।
ఆఖ్యాతు నో భవాన్ శీఘ్రం విసంజ్ఞాః స్మేహ సర్వశః ॥ 53
ఈ భూమి వందల కొద్ది యోజనాలు సముద్రంలో మునిగిపొయింది. ఎవరి ప్రభావంచే ఈ అద్భుతం జరుగుతోంది? ప్రపంచమంతా వ్యాకులపై ఉంది. మీరు శీఘ్రంగా కారణాన్ని తెల్పండి. మేం అచేతనులమై ఉన్నాం. (53)
బ్రహ్మోవాచ
అసురేభ్యో భయం నాస్తి యుష్మాకం కుత్రచిత్ క్వచిత్ ।
శ్రూయతాం యత్కృతేష్వేషః సంక్షోభో జాయతేఽమరాః ॥ 54
యోఽసౌ సర్వత్రగః శ్రీమాన్ అక్షరాత్మా వ్యవస్థితః ।
తస్య ప్రభావాత్ సంక్షోభః త్రిదివస్య ప్రకాశతే ॥ 55
బ్రహ్మ చెప్పాడు - రాక్షసుల మూలంగా ఎలాంటి భయమూ లేదు. అన్నివైపులా ఇలా సంక్షోబం వ్యాపించడానికి కారణం ఏమిటో వినండి. సర్వవ్యాపకుడు, నాశంలేనివాడు, నారాయణుడు. అతని కారణంగా ఈ కల్లోలం లోకంలో ఏర్పడింది. (54,55)
యైషా వసుమతీ కృత్స్నా యోజనానాం శతం గతా ।
సముద్ధృతా పునస్తేవ విష్ణునా పరమాత్మనా ॥ 56
ఈ భూమి అంతా యోజనాల కొద్దీ లోపలకి మునిగిపోయింది. దాన్ని ఉద్ధరించే ప్రయత్నంలో ఈ అద్భుతం జరిగింది. (56)
తస్యాముద్ధార్యమాణాయాం సంక్షోభః సమజాయత ।
ఏవం భవంతో జానంతు ఛిద్యతాం సంశయశ్చ వః ॥ 57
దానిని పైకి లేవనెత్తుతూ ఉంటే సంక్షోభం ఏర్పడింది. దీనికి కారణాన్ని మీరు తెలుసుకోండి. మీ లోపలి సందేహాలు తీర్చుకోండి. (57)
దేవా ఊచుః
క్వ తద్ భూతం వసుమతీం సముద్ధరతి హృష్టవత్ ।
తం దేశం భగవన్ బ్రూహి తత్ర యాస్యామహే వయమ్ ॥ 58
దేవతలు పలికారు - భూమిని ఉద్ధరించే ఆ ప్రాణి ప్రసన్నుడై ఎక్కడ అవతరించాడు. అది చెప్తే ఆ ప్రదేశానికి మేం వెడతాం. (58)
బ్రహ్మోవాచ
హంత గచ్ఛత భద్రం వః నందనే పశ్యత స్థితమ్ ।
ఏషోఽత్ర భగవాన్ శ్రీమాన్ సుపర్ణః సంప్రకాశతే ॥ 59
వారాహేణైవ రూపేణ భగవాన్ లోకభావనః ।
కాలానల ఇవాభాతి పృథివీతలముద్ధరన్ ॥ 60
బ్రహ్మ పలికాడు - మీకు మంగళం. చాల సంతోషం. శ్రీమహావిష్ణువు నందనవనంలో ఉన్నాడు. అతనిని దర్శించండి. ఆ వనసమీపంలో పూజ్యుడు, లోకభావనుడు అయిన శ్రీమహావిష్ణువు వరాహరూపంలో ప్రకాశిస్తున్నాడు. భూమిని ఉద్ధరించే వేళలో ప్రళయకాలాగ్నిలా ప్రకశిస్తున్నాడు. (59,60)
ఏతస్యోరసి సువ్యక్తం శ్రీవత్సమభిరాజతే ।
పశ్యధ్వం విబుధాః సర్వే భూతమేతదనామయమ్ ॥ 61
ఇతని వక్షస్థలంపై శ్రీవత్సం అనే పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తోంది. రోగశోకాలు లేని భగవంతుని వరాహరూపాన్ని మీరంతా తిలకించండి. (61)
లోమశ ఉవాచ
తతో దృష్ట్వా మహాత్మానం శ్రుత్వా చామంత్ర్య చామరాః ।
పితామహం పురస్కృత్య జగ్ముర్దేవా యథాగతమ్ ॥ 62
లోమశుడు పలికాడు - "పిమ్మట ఆ స్వామిని చూసి ఆయన మహిమలు విని, ఆయన ఆజ్ఞను గైకొని, బ్రహ్మను ముందుంచుకొని, దేవతలు ఎలా వచ్చారో అలా వెళ్ళారు. (62)
వైశంపాయన ఉవాచ
శ్రుత్వా తు తాం కథాం సర్వే పాండవా జనమేజయ ।
లోమశాదేశితేనాశు పథా జగ్ముః ప్రహృష్టవత్ ॥ 63
ఈ కథ విని పాండవులు ప్రసన్నులై, లోమశుడు చూపే మార్గంలో ఉత్సాహంగా ముందుకు సాగారు. (63)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం గంధమాదనప్రవేశే ద్విచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 142 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో గంధమాదనప్రవేశము అను నూట నలువది రెండవ అధ్యాయము. (142)