140. నూట నలువదియవ అధ్యాయము
పాండవులు గంధమాదన హిమాలయాలకు బయలుదేరుట.
యుధిష్ఠిర ఉవాచ
అంతర్హితాని భూతాని బలవంతి మహాంతి చ ।
అగ్నినా తపసా చైవ శక్యం గంతుం వృకోదర ॥ 1
యుధిష్ఠిరుడు అన్నాడు.
భీమసేనా! ఇక్కడ విశాలకాయులు, బలవంతులు అయిన రాక్షసులు దాగి ఉన్నారు. అగ్నిహోత్ర, తపః ప్రభావాలతో మాత్రమే మనం ముందుకు సాగగలం. (1)
సన్నివర్తయ కౌంతేయ క్షుత్పిపాసే బలాశ్రయాత్ ।
తతో బలం చ దాక్ష్యం చ సంశ్రయస్వ వృకోదర ॥ 2
భీమా! నీవు బలాన్ని ఆశ్రయించి ఆకలిదప్పికల్ని తొలగించుకో. శారీరకశక్తి, నేర్పునూ ఆశ్రయించు. (2)
ఋషేస్త్వయా శ్రుతం వాక్యం కైలాసం పర్వతం ప్రతి ।
బుద్ధ్యా ప్రపశ్య కౌంతేయ కథం కృష్ణా గమిష్యతి ॥ 3
కైలాసపర్వతాన్ని గూర్చి మహర్షి చెప్పిన మాటలు నీవు కూడ విన్నావు కదా! నీ బుద్ధిని ఉపయోగించి చూడు. ద్రౌపది ఈ దుర్గమారణ్యంలో ఎలా నడువగలదు? (3)
అథవా సహదేవేన ధౌమ్యేన చ సమం విభో ।
సూతైః పౌరోగవైశ్చైవ సర్వైశ్చ పరిచారకైః ॥ 4
రథైరశ్వైశ్చ యే చాన్యే విప్రాః క్లేశాసహాః పథి ।
సర్వైస్త్వం సహితో భీమ నివర్తస్వాయతేక్షణ ॥ 5
సహదేవుడు, ధౌమ్యుడు, సారథి, వంటవాండ్రు, సేవకగణం. రథాలు, గుఱ్ఱాలు, కష్టాలు తట్టుకోలేని బ్రాహ్మణులు వీరందరితో వెనుకకు తిరుగు. (4,5)
త్రయో వయం గమిష్యామః లఘ్వాహారా యతవ్రతాః ।
అహం చ నకులశ్చైవ లోమశశ్చ మహాతపాః ॥ 6
మమాగమనమాకాంక్షన్ గంగాద్వారే సమాహితః ।
వసేహ ద్రౌపదీం రక్షన్ యావదాగమనం మమ ॥ 7
నేను, నకులుడు, లోమశమహర్షి ముగ్గురం మాత్రం నియమపాలనం చేస్తూ ఇక్కడ నుంచి ముందుకు సాగుతాం. స్వల్పహారాన్ని గ్రహిస్తూ ప్రాణాలు నిలబెట్టుకొంటాం. నీవు హరిద్వారంలో ఏకాగ్రచిత్తుడవై నారాకకోసం ఎదురుచూడు. నేను వచ్చే వరకు ద్రౌపదిని రక్షిస్తూ అక్కడే ఉండు.' (6,7)
భీమ ఉవాచ
రాజపుత్రీ శ్రమేణార్తా దుఃఖార్తా చైవ భారత ।
వ్రజత్యేవ హి కల్యాణీ శ్వేతవాహదిదృక్షయా ॥ 8
భీముడు పలికాడు - ద్రౌపది శ్రమతో అలసి, మానసిక దుఃఖంతో ఉన్నది. ఈ మంగళమూర్తి అర్జునుని చూడాలనే కోరికతో, ఉత్సాహంగా మనతో ముందుకు సాగుతోంది. (8)
తవ చాప్యరతిస్తీవ్రా వర్తతే తమపశ్యతః ।
గుడాకేశం మహాత్మానమ్ సంగ్రామేష్వపలాయినమ్ ॥ 9
సంగ్రామంలో ఎన్నడూ వెనుకంజవేయని నిద్రను జయించిన అర్జునుని చూడక పోవడం చేత మీ మనస్సు కూడా మిక్కిలి దుఃఖం కలిగి ఉంది. (9)
కిం పునః సహదేవం చ మాం చ కృష్ణాం చ భారత ।
ద్విజాః కామం నివర్తంతాం సర్వే చ పరిచారకాః ॥ 10
సూతాః పౌరోగవాశ్చైవ యం చ మన్యేత నో భవాన్ ।
న హ్యహం హాతుమిచ్ఛామి భవంతమిహ కర్హిచిత్ ॥ 11
శైలేఽస్మిన్ రాక్షసాకిర్ణే దుర్గేషు విషమేషు చ ।
ఇయం చాపి మహాభాగా రాజపుత్రీ పతివ్రతా ॥ 12
త్వామృతే పురుషవ్యాఘ్ర నోత్సహేద్ వినివర్తితుమ్ ।
తథైవ సహదేవోఽయం సతతం త్వామనువ్రతః ॥ 13
న జాతు వినివర్తేత మనోజ్ఞో హ్యహమస్య వై ।
అపి చాత్ర మహారాజ సవ్యసాచిదిదృక్షయా ॥ 14
సర్వే లాలసభూతాః స్మ తస్మాద్ యాస్మామహే సహ ।
యద్యశక్యో రథైర్గంతుం శైలోఽయం బహుకందరః ॥ 15
పద్భిరేవ గమిష్యామః మా రాజన్ విమనా భవ ।
అహం వహిష్యే పాంచాలీం యత్ర యత్ర న శక్ష్యతి ॥ 16
సహదేవునికి, నాకు, ద్రౌపదికి వేరే చెప్పాల్సింది ఏముంది? బ్రాహ్మణులందరు పరిచారకులతో ఇక్కడి నుంచే వెనుకకు తిరగవచ్చు. వంటవారు, సారథులతో సహా ఎవరు వెనుకకు తిరిగి వెళ్ళాలో వారందరు వెడతారు. రాక్షసులతో నిండిన ఈ పర్వతం మీద నిన్ను ఒక్కడిని వీడి నేను వెనుకకు పోను. పతివ్రత, రాజకుమారి అయిన ద్రౌపది కూడ నిన్ను విడచి వెనుకకు వెళ్ళాలని అనుకోవడం లేదు. సహదేవుడు కూడ నీ పై అనురాగంతో నిన్నే అనుసరిస్తాడు. ఇతని మనస్సును నేను బాగా తెలిసినవాడను. మేమందరం అర్జునుని చూడాలనే కోరికతో ఉన్నాం. తపిస్తున్నాం. మనమందరం కలిసే వెడదాం. అనేక గుహలతో నిండిన ఈ పర్వతం రథగమనానికి అనుకూలం కాకపోతే కాలినడకనే వెడదాము. మీరు విచారింపవలదు. ద్రౌపది నడవలేకపోతే నేను ద్రౌపదిని ఎత్తుకొని తీసుకువస్తాను. (10-16)
ఇతి మే వర్తతే బుద్ధిః మా రాజన్ విమనా భవ ।
సుకుమారౌ తథా వీరౌ మాద్రీనందికరావుభౌ ।
దుర్గే సంతారయిష్యామి యత్రాశక్తౌ భవిష్యతః ॥ 17
ఇది నా ఆలోచన. మీరు విరక్తిపొందవద్దు. మాద్రీనందనులైన నకులసహదేవులిద్దరికీ దుర్గమప్రదేశాల యందు సాయంచేసి తీసుకువస్తాను. (17)
యుధిష్ఠిర ఉవాచ
ఏవం తే భాషమాణస్య బలం భీమాభివర్ధతామ్ ।
యత్ త్వముత్సహసే వోఢుం పాంచాలీం చ యశస్వినీమ్ ॥ 18
యమజౌ చాపి భద్రం తే నైతదన్యత్ర విద్యతే ।
బలం తవ యశశ్చైవ ధర్మః కీర్తిశ్చ వర్ధతామ్ ॥ 19
యత్ త్వముత్సహసే నేతుం భ్రాతరౌ సహ కృష్ణయా ।
మా తే గ్లానిర్మహాబాహో మా చ తేఽస్తు పరాభవః ॥ 20
ధర్మరాజు అన్నాడు - నీ ఉత్సాహం చూస్తే నీవు నకులసహదేవులను, పాంచాలిని మోసేభారం పెరిగినవాడిలా కనిపిస్తున్నావు. ఈ సాహసం నీలోనే ఉంది. వేరొకరిలో లేదు. నీబలం, కీర్తి, ధర్మం, యశస్సు పెరుగుగాల! ద్రౌపదితో సహా నకులసహదేవులను స్వయంగా తీసుకొనిపోగల శక్తి నీకు ఉంది. దానివల్ల నీకు శ్రమకలగకుండుగాక. నిన్నెవరూ ఎదిరించకుందురు గాక. (18-20)
వైశంపాయన ఉవాచ
తతః కృష్ణాబ్రవీద్ వాక్యం ప్రహసంతీ మనోరమా ।
గమిష్యామి న సంతాపః కార్యో మాం ప్రతి భారత ॥ 21
వైశంపాయనుడు పలికాడు - అప్పుడు ద్రౌపది నవ్వుతూ అంది. నేను మీతో కలిసే వస్తాను. నాగురుంచి మీరు దుఃఖింపవలదు. (21)
లోమశ ఉవాచ
తపసా శక్యతే గంతుం పర్వతో గంధమాదనః ।
తపసా చైవ కౌంతేయ సర్వే యోక్ష్యామహే వయమ్ ॥ 22
లోమశుడు పలికాడు - గంధమాదన పర్వతానికి తపస్సుచే వెళ్ళగలరు. మనం తపశ్శక్తి సంపాదించాలి. (22)
నకులః సహదేవశ్చ భీమసేనశ్చ పార్థివ ।
అహం చ త్వం చ కౌంతేయ ద్రక్ష్యామః శ్వేతవాహనమ్ ॥ 23
నకులుడు, సహదేవుడు, భీమసేనుడు, నేను, నీవు తపోబలంతో అర్జునుని చూడగలం. (23)
వైశంపాయన ఉవాచ
ఏవం సంభాషమాణాస్తే సుబాహువిషయం మహత్ ।
దదృశుర్ముదితా రాజన్ ప్రభూతగజవాజిమత్ ॥ 24
కిరాతతంగణాకీర్ణం పులిందశతసంకులమ్ ।
హిమవత్యమరైర్జుష్టం బహ్వాశ్చర్యసమాకులమ్ ।
సుబాహుశ్చాపి తాన్ దృష్ట్వా పూజయా ప్రత్యగృహ్ణాత ॥ 25
విషయాంతే కులిందానామ్ ఈశ్వరః ప్రీతిపూర్వకమ్ ।
తతస్తే పూజితాస్తేన సర్వ ఏవ సుఖోషితాః ॥ 26
వైశంపాయనుడు పలికాడు - ఈ విధంగా మాట్లాడుకొంటూ వారు ముందుకుసాగారు. కొంతదూరం పోయేసరికి కుళిందదేశాధిపతి సుబాహువు యొక్క విశాల రాజ్యం కనిపించింది. అది ఏనుగులు, గుఱ్ఱాలు అధికంగా
కలిగి, వందలకొద్దీ పుళింద, కిరాత, తంగణ, మొదలైన అడవిజాతుల వారితో నిండి ఉంది. దేవతలు సేవించే హిమాలయం అక్కడకు దగ్గరలోనే ఉంది. ఆశ్చర్యాన్ని కలిగించే అనేకవస్తువులు అక్కడ కనిపించాయి. కుళిందరాజు సుబాహువు తన రాజ్యానికి పాండవులు వచ్చారని తెలిసి సరిహద్దుల్లో సత్కరించి, ఆదరించి, తన వారిగా చేసుకొన్నాడు. (24-26)
ప్రతస్థుర్విమలే సూర్యే హిమవంతం గిరిం ప్రతి ।
ఇంద్రసేనముఖాంశ్చాపి భృత్యాన్ పౌరోగవాంస్తథా ॥ 27
సూదాంశ్చ పారిబర్హాంశ్చ ద్రౌపద్యాః సర్వశో నృప ।
రాజ్ఞః కులిందాధిపతేః పరిదాయ మహారథాః ॥ 28
పద్భిరేవ మహావీర్యా యయుః కౌరవనందనాః ।
తే శనైః ప్రాద్రవన్ సర్వే కృష్ణయా సహ పాండవాః ।
తస్మాద్ దేశాత్ సుసంహృష్టాః ద్రష్టుకామా ధనంజయమ్ ॥ 29
రాజా! మరునాడు ఉదయం హిమాలయానికి బయలుదేరారు. ఇంద్రసేనాదిసేవకులను, సూపాధ్యక్షులను, వంటవారినీ, ద్రౌపదీ వస్తు సామాగ్రినీ, సుబాహువుకు అప్పగించి ద్రౌపదితో కలిసి పాండవులు కాలినడకన ముందుకు సాగారు. వారి మనస్సులో అర్జునుని చూడాలనే తీవ్రమైన కోరిక ఉంది. హర్షంతో, ఉల్లాసంతో ఆ ప్రదేశం నుంచి ముందుకు కదిలారు. (27-29)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం గంధమాదనప్రవేశే చత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 140 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో గంధమాదనప్రవేశము అను నూట నలువదియవ అధ్యాయము. (140)