132. నూట ముప్పది రెండవ అధ్యాయము
అష్టావక్రముని జన్మవృత్తాంతము, జనకుని సభకు ఆయన రాక.
లోమశ ఉవాచ
యః కథ్యతే మంత్రవిదగ్ధబుద్ధిః
ఔద్దాలకిః శ్వేతకేతుః పృథివ్యామ్ ।
తస్యాశ్రమం పశ్య నరేంద్ర పుణ్యం
సదాఫలైరుపపన్నం మహీజైః ॥ 1
లోమశుడు పలికాడు. -
ఉద్దాలకుని కుమారుడు శ్వేతకేతువు. భూమిపై మంత్రశాస్త్రంలో అతనితో సమానుడు వేరొకడు లేడు. ఇదే అతని ఆశ్రమం. ఎల్లప్పుడు ఫలపుష్పసమృద్ధి కల చెట్లతో నిండి ఉంటుంది. (1)
సాక్షాదత్ర శ్వేతకేతుర్దదర్శ
సరస్వతీం మానుషదేహరూపామ్ ।
వేత్స్యామి వాణీమితి సంప్రవృత్తాం
సరస్వతీం శ్వేతకేతుర్బభాషే ॥ 2
ఈ ఆశ్రమంలోనే శ్వేతకేతువు మానుషదేహం పొందిన సరస్వతి ని దర్శించాడు. "వాణీ స్వరూపవు అయిన నిన్ను దర్శించాను" అని ఆమెతోనే అతడు స్వయంగా అన్నాడు. (2)
తస్మిన్ యుగే బ్రహ్మకృతాం వరిష్ఠా
వాస్తాం మునీ మాతులభాగినేయౌ ।
అష్టావక్రశ్చైవ కహోడసూనుః
ఔద్దాలకిః శ్వేతకేతుః పృథివ్యామ్ ॥ 3
పూర్వయుగంలో శ్రేష్ఠులు, మామ అల్లుళ్ళు అయిన ఋషులు ఇద్దరు ఉన్నారు. వారిలో అష్టావక్రుడు కహోడుని పుత్రుడు. శ్వేతకేతువు ఉద్దాలకుని పుత్రుడు. వీరిలో శ్వేతకేతువు మామ. అష్టావక్రుడు అల్లుడు. (3)
విదేహరాజస్య మహీపతేస్తౌ
విప్రావుభౌ మాతులభాగినేయౌ ।
ప్రవిశ్య యజ్ఞాయతనం వివాదే
బందిం నిజగ్రాహతురప్రమేయౌ ॥ 4
ఒకానొక సమయాన మామ, అల్లుడు కలిసి విదేహరాజు యజ్ఞమండపానికి వెళ్ళారు. వీరు ఇరువురు సాటిలేని విద్వాంసులు, శాస్త్రార్థచర్చలు అక్కడ జరిగితే బందిని వారు ఓడించారు. (4)
ఉపాస్స్వ కౌంతేయ సహానుజస్త్వం
తస్యాశ్రమం పుణ్యతమం ప్రవిశ్య ।
అష్టావక్రం యస్య దుఅహిత్రమాహుః
యోఽసౌ బందిం జనకస్యాథ యజ్ఞే ॥ 5
వాదీ విప్రాగ్ర్యో బాల ఏవాభిగమ్య
వాదే భమ్క్త్వా మజ్జయామాస నద్యామ్ ॥ 6
కౌంతేయా! విప్రశ్రేష్ఠుడు అష్టావక్రుడు వాదప్రతివాదాల్లో నిపుణుడు. బాల్యంలో అష్టావక్రుడు జనకుని యజ్ఞమండపానికి పోయి తన ప్రతిపక్షం అయిన బందిని ఓడించి నదిలో ముంచివేశాడు. అతడు ఉద్దాలకుని దౌహిత్రుడు. ఇది అతని పవిత్రాశ్రమం. నీవు సోదర సహితంగా ఈ ఆశ్రమంలో ప్రవేశించి కొంతసేపు ఉపాసించు. (5,6)
యుధిష్ఠిర ఉవాచ
కథంప్రభావః స బభూవ విప్రః
తథాభూతం యో నిజగ్రాహ బందిమ్ ।
అష్టావక్రః కేన చాసౌ బభూవ
తత్ సర్వం మే లోమశ శంస తత్త్వమ్ ॥ 7
ధర్మరాజు పలికాడు -
లోమశా! అతని ప్రభావం ఎలాంటిది? వాదంలో తన శత్రువు అయిన బందిని ఓడించాడు కదా! ఏ కారణంగా అతడు అష్టావక్రుడు అయ్యాడో దాన్ని నాకు వివరంగా చెప్పు. (7)
లోమశ ఉవాచ
ఉద్దాలకస్య నియతః శిష్య కో
నామ్నా కహోడ ఇతి విశ్రుతోఽభూత్ ।
శుశ్రూషురాచార్యవశానువర్తీ
దీర్ఘం కాలం సోఽధ్యయనం చకార ॥ 8
లోమశుడు పలికాడు - ఉద్దాలక మహర్షికి కహోడుడు అనే శిష్యుడు ఉన్నాడు. ఇంద్రియనిగ్రహం, నియమం కలిగి ఆచార్యుని సేవించాడు. గురువు ఆజ్ఞానుసారం చాలా కాలం విద్యాభ్యాసం చేశాడు. (8)
తం వై విప్రః పర్యచరత్ సశిష్యః
తాం చ జ్ఞాత్వా పరిచర్యాం గురుః సః ।
తస్మై ప్రాదాత్ సద్య ఏవ శ్రుతం చ
భార్యాం చ వై దుహితరం స్వం సుజాతామ్ ॥ 9
కహోడుడు వినయం కలిగి ఉద్దాలకుని సేవలో నిమగ్నం అయ్యాడు. గురువు శిష్యుని సేవాభావాన్ని గుర్తించి సంపూర్ణ వేదశాస్త్ర జ్ఞానాన్ని ఇచ్చి, తన పుత్రిక సుజాతను భార్యగా చేశాడు. (9)
తస్యా గర్భః సమభవదగ్నికల్పఆఆ
సోఽధీయానం పితరం చాప్యువాచ ।
సర్వా రాత్రిమధ్యయనం కరోషి
నేదం పితః సమ్యగివోపవర్తతే ॥ 10
కొంతకాలానికి సుజాత గర్భవతి అయింది. ఆమె గర్భం తేజస్సుతో ప్రకాశిస్తోంది. ఒకనాడు గాఢంగా వేదాధ్యయనంలో మునిగిన తండ్రితో గర్భస్థ శిశువు అన్నాడు. 'మీరు రాత్రి అంతా శ్రమపడి వేదాధ్యయనం చేస్తున్నారు. కాని శుద్ధ మయిన ఉచ్చారణ అందులో లేదు.' (10)
ఉపాలబ్ధః శిష్యమధ్యే మహర్షిః
స తం కోపాదుదరస్థం శశాప ।
యస్మాత్ కుక్షౌ వర్తమానో బ్రవీషి
తస్మాద్ వక్రో భవితాస్యష్టకృత్వః ॥ 11
శిష్యులమధ్యలో కుమారునిచే నిందింపబడిన కహోడుడు కోపంతో కడుపులోని బాలుని 'పొట్టలో ఉండి ఇలా నిందిస్తున్నావు కనుక నీవు శరీరంలో ఎనిమిది వంకరలు పొందుతావు' అని శపించాడు. (11)
స వై తథా వక్ర ఏవాభ్యజాయత్
అష్టావక్రః ప్రథితో వై మహర్షిః ।
అస్యాసీద్ వై మాతులః శ్వేతకేతుః
స తేన తుల్యో వయసా బభూవ ॥ 12
అతని శాపం ప్రకారం ఎనిమిది వంకరలతో కుమారుడు పుట్టాడు. అతడే అష్టావక్రుడు. శ్వేతకేతుడు అతని మామ. కాని విద్యలో అతనితో సమానుడు. (12)
సంపీడ్యమానా తు తదా సుజాతా
సా వర్ధమానేన సుతేన కుక్షౌ ।
ఉవాచ భర్తారమిదం రహోగతా
ప్రసాద్య హీనం వసునా ధనార్థినీ ॥ 13
సుజాత కడుపులోని గర్భం పెరగసాగింది. సుజాత గర్భబాధ భరించలేక బాధపడుతూ ఏకాంతంలో భర్తను ధనాన్ని సంపాదించమని కోరింది. (13)
కథం కరిష్యామ్యధునా మహర్షే
మాసశ్చాయం దశమో వర్తతే మే ।
నైవాస్తి తే వసు కించిత్ ప్రజాతా
యేనాహమేతామాపదం నిస్తరేయమ్ ॥ 14
'నా కడుపుల్ని శిశువుకు పదవనెల నడుస్తోంది. నేను ధనహీననై ఈ కష్టం ఎలా భరిస్తాను? మీ దగ్గర కొంచెం కూడ ధనం లేదు. ప్రసవకాలానికి తగిన ధనం ఉంటేనే ఈ ఆపద గట్టెక్కుతాం.' (14)
ఉక్తస్త్వేవం భార్యయా వై కహోడః
వితస్యార్థే జనకమథాభ్యగచ్ఛత్ ।
స వై తదా వాదవిదా నిగృహ్య
నిమజ్జితో బందినేహాప్సు విప్రః ॥ 15
భార్య మాటలు విని కహోడుడు ధనం కోసం జనకమహారాజు వద్దకు వెళ్ళాడు. ఆ సమయాన శాస్త్రాలు తెలిసిన బంది ఆ బ్రహ్మర్షి కహోడుని ఓడించి నీటిలో ముంచివేశాడు. (15)
ఉద్దాలకస్తం తు తదా నిశమ్య
సూతేన వాదేఽప్సు నిమజ్జితం తథా ।
ఉవాచ తాం తత్ర తతః సుజాతామ్
అష్టావక్రే గూహితవ్యోఽయమర్థః ॥ 16
కహోడుడు బంది చేతిలో ఓడి, నీటిలో మునిగాడు అని ఉద్దాలకుడికి తెలిసింది. వెంటనే సుజాత వద్దకు పోయి అష్టావక్రునికి ఈ వృత్తాంతం చెప్పవద్దు అన్నాడు. (16)
రరక్ష సా చాపి తమస్య మంత్రం
జాతోఽప్యసౌ నైవ శుశ్రావ విప్రః ।
ఉద్దాలకం పితృవచ్చాపి మేనే
తథాష్టావక్రో భ్రాతృవచ్ఛ్వేతకేతుమ్ ॥ 17
సుజాత పుత్రునికి చెప్పక ఈ విషయాన్ని దాచింది. పుట్టిన తరువాత కూడా అష్టావ్రకునికి ఈ విషయం తెలియలేదు. ఉద్దాలకునే అతడు తండ్రిగా భావించాడు. శ్వేతకేతువును తన సోదరుడిగా తలచాడు. (17)
తతో వర్షే ద్వాదశే శ్వేతకేతుః
అష్టావక్రం పితురంకే నిషణ్ణమ్ ।
అపాకర్షద్ గృహ్య పాణౌ రుదంతమ్
నాయం తవాంకః పితురిత్యు క్తవాంశ్చ ॥ 18
తరువాత అష్టావక్రునికి పన్నెండు ఏళ్ళు వచ్చాయి. ఒకనాడు తండ్రి వంటి ఉద్దాలకుని ఒడిలో కూర్చున్న అష్టావక్రుని శ్వేతకేతువు క్రిందికి లాగివేసి 'ఇది నీ తండ్రి ఒడికాదు' అన్నాడు. (18)
యత్ తేనోక్తం దురుక్తం తత్ తదానీం
హృది స్థితం తస్య సుదుఃఖమాసీత్ ।
గృహం గత్వా మాతరం సోఽభిగమ్య
పప్రచ్ఛేదం క్వ ను తాతో మమేతి ॥ 19
శ్వేతకేతుని మాటలకు ఉద్దాలకుని మనస్సు గాయపడింది. అతనికి చాల దుఃఖం కలిగింది. తల్లి వద్దకు పోయి "నా తండ్రి ఎక్కడ ఉన్నాడు" అని అష్టావక్రుడు ప్రశ్నించాడు. (19)
తతః సుజాతా పరమార్తరూపా
శాపాద్ భీతా సర్వమేవాచచక్షే ।
తద్ వై తత్త్వం సర్వమాజ్ఞాయ రాత్రౌ
ఇత్యబ్రవీత్ శ్వేతకేతుం స విప్రః ॥ 20
గచ్ఛావ యజ్ఞం జనకస్య రాజ్ఞో
బహ్వాచర్యః శ్రూయతే తస్య యజ్ఞః ।
శ్రోష్యావోఽత్ర బ్రాహ్మణానాం వివాద
మర్థం చాగ్ర్యం తత్ర భోక్ష్యావహే చ ॥ 21
దీనురాలై సుజాత జరిగిన వృత్తాంత మంతా కుమారునికి చెప్పింది. ఈ రహస్యాన్ని విని అతడు శ్వేతకేతువుతో 'మనం ఇద్దరం జనకుని యజ్ఞానికి పోదాం. ఆ యజ్ఞంలో చాల ఆశ్చర్యకరమయిన మాటలు వినవలసి ఉంది. మనం ఇద్దరం అక్కడ విద్వాంసుల (బ్రాహ్మణుల) శాస్త్రచర్చలు విందాం. మంచి మంచి విందులు తిందాం. (20,21)
విచక్షణత్వం చ భవిష్యతే నౌ
శివశ్చ సౌమ్యశ్చ హి బ్రహ్మఘోషః ।
తౌ జగ్మతుర్మాతులభాగినేయౌ
యజ్ఞం సమృద్ధం జనకస్య రాజ్ఞః ॥ 22
అక్కడికి పోవటం వలన మన విచక్షణాశక్తి, తెలివి పెరుగుతాయి. సుమధర స్వరంతో వేదమంత్రాల పవిత్రఘోషలు వినపడతాయి' అన్నాడు. అపుడు ఆ మామ అల్లుళ్ళు సంపదతో తులతూగే జనకుని యజ్ఞానికి వెళ్ళారు. (22)
అష్టావక్రః పథి రాజ్ఞా సమేత్య
ప్రోత్సార్యమాణో వాక్యమిదం జగాద ॥ 23
అష్టావక్రుడు యజ్ఞమండపమార్గంలో రాజునే కలిశాడు. ఆ సమయాన ద్వారపాలకునిచే మార్గానికి దూరంగా నెట్టి వేయబడి ఇలా అన్నాడు. (23)
ఇది శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి
లోమశతీర్థయాత్రాయామష్టావక్రీయే ద్వాత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 132 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో అష్టావక్రకథ అను నూట ముప్పది రెండవ అధ్యాయము. (132)