130. నూట ముప్పదియవ అధ్యాయము

విభిన్నతీర్థాలమహిమ, ఉశీనరరాజు కథ.

లోమశ ఉవాచ
ఇహ నర్త్యాస్తనూస్త్యక్త్వా స్వర్గం గచ్ఛంతి భారత ।
మర్తుకామా నరా రాజన్ ఇహాయాంతి సహస్రశః ॥ 1
లోమశుడు అన్నాడు - రాజా! ఇక్కడ మానవులు శరీరాన్ని విడచి స్వర్గాన్ని చేరుకొంటారు. మరణించాలి అని అనుకొనేవారు కూడ ఈ తీర్థానికి వేలకొద్దీ వస్తారు. (1)
ఏవమాశీః ప్రయుక్తా హి దక్షేణ యజతా పురా ।
ఇహ యే వై మరిష్యంతి తే వై స్వర్గజితో నరాః ॥ 2
ఏషా సరస్వతీ రమ్యా దివ్యా చౌఘవతీ నదీ ।
ఏతద్ వినశనం నామ సరస్వత్యా విశాంపతే ॥ 3
రాజా! ప్రాచీనకాలంలో దక్షప్రజాపతి యజ్ఞసమయంలో "ఇక్కడ ఏ మానవులు మరణిస్తారో వారు స్వర్గాన్ని సాధిస్తారు." అని ఆశీర్వదించాడు. ఇది సుందరం, దివ్యం, ప్రవాహవేగం గల సరస్వతీనది. దీనిపేరు సరస్వతీ వినశన తీర్థం. (2,3)
ద్వారం నిషాదరాష్ట్రస్య యేషాం దోషాత్ సరస్వతీ ।
ప్రవిష్టా పృథివీం వీర మా నిషాదా హి మాం విదుః ॥ 4
ఏష వై చమసోద్భేదః యత్ర దృశ్యా సరస్వతీ ।
యత్రైనామభ్యవర్తంత సర్వాః పుణ్యాః సముద్రగాః ॥ 5
వీరా! ఇది నిషాద రాజ్యద్వారం. నిషాదుల సంబంధంచే దోషం పొందిన సరస్వతి వారికి కనపడకుండా ఉండాలని ఇక్కడే భూమిలోనికి చొరబడింది.
దీనిపేరు చమసోద్భేద తీర్థం. ఇక్కడ సరస్వతీ నది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సముద్రంలో కలవాలి అనుకొనే నదులన్నీ ఈమెను అనుసరించాయి. (4,5)
ఏతత్ సింధోర్మహాత్ తీర్థం యత్రాగస్త్యమరిందమ ।
లోపాముద్రా సమాగమ్య భర్తారమవృణీత వై ॥ 6
అరిందమా! ఇది లోపాముద్ర అగస్త్యుని భర్తగా వరించిన చోటు. సింధు నదీ తీరాన ఉన్న గొప్పతీర్థం. (6)
ఏతత్ ప్రకాశతే తీర్థం ప్రభాసం భాస్కరద్యుతే ।
ఇంద్రస్య దయితం పుణ్యం పవిత్రం పాపనాశనమ్ ॥ 7
సూర్యతేజా! ఈ ప్రకాశించే తీర్థం ప్రభాసతీర్థం. ఇది ఇంద్రునికి చాలా ఇష్టమయింది. పవిత్రం, పాపనాశనం కూడ. (7)
ఏతత్ విష్ణుపదం నామ దృశ్యతే తీర్థముత్తమమ్ ।
ఏషా రమ్యా విపాశా చ నదీ పరమపావనీ ॥ 8
అత్ర వై పుత్రశోకేన వసిష్టో భగవానృషిః ।
బద్ ధ్వాఽఽత్మానం నిపతితః విపాశః పునరుత్థితః ॥ 9
ఇదే విష్ణు పదమనే పేరు గల దివ్యతీర్థం. పరమపావని అయిన విపాశానది ఇక్కడే ఉంది. ఈ తీర్థంలో వసిష్ఠముని పుత్రశోకంతో పీడితుడై తన శరీరాన్ని పాశాలతో కట్టుకొని నదిలో దూకాడు. కాని పాశాల నుంచి విడివడి నది నుంచి బయటికి వచ్చాడు. (8,9)
కాశ్మీరమండలం చైతత్ సర్వపుణ్యమరిందమ ।
మహర్షిభిశ్చాధ్యుషితం పశ్యేదం భ్రాతృభిః సహ ॥ 10
యత్రోత్తరాణాం సర్వేషామ్ ఋషీణాం నాహుషస్య చ ।
అగ్నేశ్చైవాత్ర సంవాదః కాశ్యపస్య చ భారత ॥ 11
భారతా! ఇది పుణ్యప్రదం అయిన కాశ్మీరదేశం. ఇక్కడ్ చాల మంది ఋషులు నివసించారు. నీ సోదరులతో సహా దీన్ని దర్శించు. ఉత్తర ప్రాంతపు ఋషులు, యయాతి; అగ్ని, కశ్యపుల సంవాదం ఇక్కడే జరిగింది. (10,11)
ఏతద్ ద్వారం మహారాజ మానసస్య ప్రకాశతే ।
వర్షమస్య గిరేర్మధ్యే రామేణ శ్రీమతా కృతమ్ ॥ 12
మహారాజా! ఇదే మానససరోవరానికి ద్వారం అని చెబుతారు. ఈ పర్వత మధ్యభాగంలో పరశురాముడు ఆశ్రమం నిర్మించాడు. (12)
ఏష వాతికషండో వై ప్రఖ్యాతః సత్యవిక్రమః ।
నాత్యవర్తత యద్ ద్వారం విదేహాదుత్తరం చ యః ॥ 13
సత్యవిక్రముడైన పరశురాముడు అందరికీ సుపరిచితుడే. ఈ ఆశ్రమం విదేహదేశానికి ఉత్తరంగా ఉంది. ఈ ప్రదేశాన్ని వాయువు కూడ దరి చేరలేదు. (13)
ఇదమాశ్చర్యమపరం దేశేఽస్మిన్ పురుషర్షభ ।
క్షీణే యుగే తు కౌంతేయ శర్వస్య సహ పార్షదైః ॥ 14
సహోమయా చ భవతి దర్శనం కామరూపిణః ।
అస్మిన్ సరసి సత్రైర్వై చైత్రే మాసి పినాకినమ్ ॥ 15
యజంతే యాజకాః సమ్యక్ పరివారం శుభార్థినః ।
అత్రోపస్పృశ్య సరసి శ్రద్ధధానో జితేంద్రియః ॥ 16
క్షీణపాపః శుభాన్ లోకాన్ ప్రాప్నుతే నాత్ర సంశయః ।
ఏష ఉజ్జానకో నామ పావకిర్యత్ర శాంతవాన్ ।
అరుంధతీసహాయశ్చ వసిష్ఠో భగవానృషిః ॥ 17
కౌంతేయా! ఇది మరో ఆశ్చర్యకరమైన విషయం. ఈ తీర్థంలో నివసించే సాధకులకు యుగాంతంలో స్వేచ్ఛారూపాన్ని ధరించగల శక్తి, ప్రమథగణాలు, పార్వతితో కూడిన శంకరుని ప్రత్యక్షదర్శనం కలుగుతుంది. ఈ సరోవరతీరాన చైత్రమాసంలో శుభాలను కోరే యాజకులు అనేక రకాల యజ్ఞాలతో పరివారగణంతో కలిసి శివుని ఆరాధిస్తారు. ఈ సరస్సులో శ్రద్ధతో జితేంద్రియుడై స్నానం ఆచమనం చేస్తే పాపాలు పోయి శుభలోకాలను చేరుతాడు. ఈ సరస్సుకి ఉజ్జానకం అని పేరు. ఇక్కడే కుమారస్వామి, అరుంధతీ సహితుడు అయిన వసిష్ఠుడు సాధన చేసి సిద్ధిని, శాంతిని పొందారు. (14-17)
వి॥సం॥ 'యుగే క్షీణే' అంటే సంవత్సరం ముగియగానే అని కూడా చెప్పవచ్చు. చైత్రప్రతిపత్తును యుగాదిగా వ్యవహరిస్తున్నాం గదా! (నీల)
హ్రదశ్చ కుశవానేష యత్ర పద్మం కుశేశయమ్ ।
ఆశ్రమశ్చైవ రుక్మిణ్యాః యత్రాశామ్యదకోపనా ॥ 18
ఇది కుశవంతం నే మడుగు. ఇక్కడే కుశేశయం అనే పేరు గల పద్మం వికసిస్తుంది. ఇది రుక్మినీదేవి ఆశ్రమం. ఇక్కడ ఆమె కోపాన్ని జయించి శాంతిని పొందింది. (18)
సమాధీనాం సమాసస్తు పాండవేయ శ్రుతస్త్వయా ।
తం ద్రక్ష్యసి మహారాజ భృగుతుంగం మహాగిరిమ్ ॥ 19
పాండవా! ఏది యోగసిద్ధికి సంక్షేపస్వరూపం అని పూర్వం విన్నావో, దేన్ని చూస్తే సమాధి ఫలం లభిస్తుందో ఆ భృగుతుంగమనే పర్వతం నీ ఎదుట ఉంది. దాన్నే నీవు చూస్తున్నావు. (19)
వితస్తాం పశ్య రాజేంద్ర సర్వపాపప్రమోచనీమ్ ।
మహర్షిభిశ్చాధ్యుషితాం శీతతోయాం సునిర్మలామ్ ॥ 20
రాజేంద్రా! వితస్తానదిని చూడు. ఇది పాపాలు పోగొట్టే నది. దీని నీరు చల్లగా, నిర్మలంగా ఉంటుంది. దీని ఒడ్డున చాలా మంది మహర్షులు నివసిస్తున్నారు. (20)
జలాం చోపజలాం చైవ యమునామభితో నదీమ్ ।
ఉశీనరో వై యత్రేష్ట్వా వాసవాదత్యరిచ్యత ॥ 21
యమునా నదికి రెండువైపుల ప్రవహించే జల, ఉపజల అనే నదులను చూడు. రాజు ఉశీనరుడు ఇక్కడ యజ్ఞం చేసి, ఇంద్రుని మించిన స్థానం దక్కించుకొన్నాడు. (21)
తాం దేవసమితిం తస్య వాసవశ్చ విశాంపతే ।
అభ్యాగచ్ఛన్నృపవరం జ్ఞాతుమగ్నిశ్చ భారత ॥ 22
ఉశీనరుని మహిమ తెలిసికొనటం కోసం ఒకసారి అగ్ని, ఇంద్రుడు అతని రాజసభకు వచ్చారు. (22)
జిజ్ఞాసమానౌ వరదౌ మహాత్మానముశీవరమ్ ।
ఇంద్రః శ్యేనః కపోతోఽగ్నిః భూత్వా యజ్ఞేఽభిజగ్ముతుః ॥ 23
వరాల నివ్వగల వారిరువురు ఆ సమయాన శిబిని పరీక్షింప నిశ్చయించి ఇంద్రుడు డేగగా; అగ్ని పావురంగా మారి అతని యజ్ఞమండపానికి వచ్చారు. (23)
ఊరూ రాజ్ఞః సమాసాద్య కపోతః శ్యేనజాద్ భయాత్ ।
శరణార్థీ తదా రాజన్ నిలిల్యే భయపీడితః ॥ 24
తన రక్షణకై ఆశ్రయాన్ని కోరిన పావురం డేగ భయంతో రాజు తొడలను చేరి దాగి ఉంది. (24)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం శ్యేనకపోతీయే త్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 130 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున లోమశతీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో శ్యేనకపోతీయమను నూట ముప్పదియవ అధ్యాయము. (130)