99. తొంబది తొమ్మిదవ అధ్యాయము

లోమశ ఉవాచ
ఇల్వలస్తాన్ విదిత్వా తు మహర్షిసహితాన్ నృపాన్ ।
ఉపస్థితాన్ సహామాత్యః విషయాంతే హ్యపూజయత్ ॥ 1
లోమశుడు చెప్పాడు.
ఇల్వలుడు రాజులతోడి అగస్త్యునిరాకను తెలిసి రాజ్యసరిహద్దుల్లో మంత్రులతో కలిసి వారిని సమీపించి పూజించాడు. (1)
తేషాం తతోఽసురశ్రేష్ఠస్త్వాతిథ్యమకరోత్ తదా ।
సుసంస్కృతేన కౌరవ్య భ్రాత్రా వాతాపినా యదా ॥ 2
ఆ సమయాన రాక్షసశ్రేష్ఠుడు ఇల్వలుడు తన సోదరుడు వాతాపి మాంసాన్ని వండి సంస్కరించి వారికి ఆతిథ్యం చేశాడు. (2)
తతో రాజర్షయః సర్వే విషణ్ణా గతచేతసః ।
వాతాపిం సంస్కృతం దృష్ట్వా మేషభూతం మహాసురమ్ ॥ 3
మేకగా మారిన రాక్షసుడు వాతాపి సంస్కరింపబడినట్లు చూచి ఆ రాజర్షులందరు దీనులు, అచేతనులు అయ్యారు. (3)
అథాబ్రవీదగస్త్యస్తాన్ రాజర్షీనృషిసత్తమః ।
విషాదో వో న కర్తవ్యో హ్యహం భోక్ష్యే మహాసురమ్ ॥ 4
ధుర్యాసనమథాసాద్య నిషసాద మహానృషిః ।
తం పర్యవేషద్ దైత్యేంద్ర ఇల్వలః ప్రహసన్నివ ॥ 5
ఋషిశ్రేష్ఠుడు అగస్త్యుడు రాజర్షులతో అన్నాడు - మీరు చింతింపవలదు. నేనే ఈ రాక్షసుణ్ణి ఆరగిస్తాను. అని పలికి ప్రధాన ఆసనంపై కూర్చుండి అగస్త్యుడు నవ్వుతూ వడ్డించే ఇల్వలుని చూస్తున్నాడు. (4,5)
అగస్త్య ఏవ కృత్స్నం తు వాతాపిం బుభుజే తతః ।
భుక్తవత్యసురోఽహ్వానమ్ అకరోత్ తస్య చేల్వలః ॥ 6
అగస్త్యుడే వాతాపి శరీరమాంసాన్ని పూర్తిగా తిన్నాడు. భోజనమైన వెంటనే ఇల్వలుడు వాతాపిని నోరారా పిలువసాగాడు. (6)
తతో వాయుః ప్రాదురభూద్ అధస్తస్య మహాత్మనః ।
శబ్దేన మహతా తాత గర్జన్నివ యథా ఘనః ॥ 7
అదే సమయాన అగస్త్యుని అధోరంధ్రం గుండా మేఘధ్వని వంటి అపానవాయువు వెలువడింది. (7)
వాతాపే నిష్ర్కమస్వేతి పునః పునరువాచ హ ।
తం ప్రహస్యాబ్రవీద్ రాజన్ అగస్త్యో మునిసత్తమః ॥ 8
వాతాపీ! బయటకురా! అని చాలాసార్లు ఇల్వలుడు పిలిచాడు. మునిశ్రేష్ఠుడు అగస్త్యుడు నవ్వుతూ ఇల్వలునితో అన్నాడు. (8)
కుతో నిష్ర్కమితం శక్తః మయా జీర్ణస్తు సోఽసురః ।
ఇల్వలస్తు విషణ్ణోఽభూద్ దృష్ట్వా జీర్ణం మహాసురమ్ ॥ 9
ఇకపై వాడు ఎక్కడి నుంచి రాగలడు. ఆ రాక్షసుడు జీర్ణం అయిపోయాడు. నశించిన వాతాపిని తెలిసికొని ఇల్వలుడు దీనుడు అయిపోయడు. (9)
ప్రాంజలిశ్చ సహామాత్యైరిదం వచనమబ్రవీత్ ।
కిమర్థముపయాతాః స్థ బ్రూత కిం కరనాణి వః ॥ 10
మంత్రులతో సహా అంజలి ఘటించి అతడు ఇలా పలికాడు. మీరు వచ్చిన పని తెల్పండి. మీకు నేను ఏం చేయగలను. (10)
ప్రత్యువాచ తతోఽగస్త్యః ప్రహసన్నిల్వలం తదా ।
ఈశం హ్యసుర విద్మస్త్వాం వయం సర్వే ధనేశ్వరమ్ ॥ 11
అగస్త్యుడు నవ్వుతూ ఇల్వలునితో అన్నాడు. మేము నిన్ను శక్తిసంపన్నుడు అయిన శాసకుడవు అని తెలుసుకున్నాం. (11)
ఏతే చ నాతిధనినో ధనార్థశ్చ మహాన్ మమ ।
యథాశక్త్యవిహింస్యాన్యాన్ సంవిభాగం ప్రయచ్ఛ నః ॥ 12
ఈ రాజులు అంతా ధనికులు కారు. నాకు చాలా ధనం కావలసి ఉంది. ఇతరులకు కష్టం కలిగించనంతవరకు నీధనంలో కొంతభాగం మాకు ఇయ్యి. (12)
తతోఽభివాద్య తమృషిమ్ ఇల్వలో వాక్యమబ్రవీత్ ।
దిత్సితం యది వేత్సి త్వం తతో దాస్యామి తే వసు ॥ 13
ఇల్వలుడు అగస్త్యునికి నమస్కరించి పలికాడు. నేను మీకెంత ధనం ఇవ్వదలచానో అది తెలియపరిస్తే అంతా ఇస్తాను అన్నాడు. (13)
అగస్త్య ఉవాచ
గవాం దశసహస్రాణి రాజ్ఞామేకైకశోఽసురః ।
తావదేవ సువర్ణస్య దిత్సితం తే మహాసుర ॥ 14
అగస్త్యుడు పలికాడు. నీవు ఒక్కొక్కనికి పదివేల గోవులు, అంతే విలువ గల బంగారం ఇవ్వనిశ్చయించావు. (14)
మహ్యం తతో వై ద్విగుణం రథశ్చైవ హిరణ్మయః ।
మనోజవౌ వాజినౌ చ దిత్సితం తే మహాసుర ॥ 15
నాకు వీరికిచ్చు దానికంటె రెండురెట్లు గోవులు, బంగారు నాణాలు ఇవ్వాలని అనుకున్నావు. దీనికి బదులుగా ఒక బంగారు రథం, రెండు మనోజవం కల గుఱ్ఱాలు ఇవ్వగోరుతున్నాను. (15)
(లోమశ ఉవాచ
ఇల్వలస్తు మునిం ప్రాహ సర్వమస్తి యథాఽఽత్థ మామ్ ।
రథం తు యమవోచో మాం నైనం విద్మో హిరణ్మయమ్ ॥
లోమశుడు అన్నాడు.
నీవు ఏది పలికావో అది సత్యం అని అగస్త్యునితో ఇల్వలుడు చెప్పాడు. కాని నీవు ఏ రథాన్ని ప్రస్తావించావో ఆ రథాన్ని మేము బంగారుమయం అనుకోవడం లేదు.
అగస్త్య ఉవాచ
న మే వాగనృతా కాచిదుక్తపూర్వా మహాసుర।)
జిజ్ఞాస్యతాం రథం సద్యో వ్యక్త ఏష హిరణ్మయః ।
అగస్త్యుడు అన్నాడు.
నానోటి నుంచి వెలువడిన వచనం ఇంతవరకు అసత్యం కాలేదు. ఆ రథాన్ని గురించి శీఘ్రంగా తెలుసుకో. అది నిశ్చయంగా బంగారురథమే.
లోమశ ఉవాచ
జిజ్ఞాస్యమానః స రథః కౌంతేయాసీద్ధిరణ్మయః ।
తతః ప్రవ్యథితీ దైత్యో దదావభ్యధికం వసు ॥ 16
ఇల్వలునికి జాడ తెలిసిన తరువాత బంగారు రథం బయటకు వచ్చింది. అతని మనస్సులో సోదరుని మృత్యుకారణంగా ఏర్పడిన దుఃఖంతోనే చాలధనం మహర్షికి సమర్పించాడు. (16)
విరావశ్చ సురావశ్చ తస్మిన్ యుక్తౌ రథే హయౌ ।
ఊహతుః సవసూనాశు తావగస్త్యాశ్రమం ప్రతి ॥ 17
సర్వాన్ రాజ్ఞః సహాగస్త్యాన్ నిమేషాదివ భారత ।
(ఇల్వలస్త్వనుగమ్యైనమ్ అగస్త్యం హంతుమైచ్ఛత ।
భస్మ చక్రే మహాతేజా హుంకారేణ మహాసురమ్ ॥
మునేరాశ్రమమశ్వౌ తౌ నిన్యతుర్వాతరంహసౌ ।)
అగస్త్యేనాభ్యనుజ్ఞాతా జగ్మూ రాజర్షయస్తదా ।
కృతవాంశ్చ మునిః సర్వం లోపాముద్రాచికీర్షితమ్ ॥ 18
ఆ రథానికి విరావం, సురావం అను రెండు గుఱ్ఱాలు పూన్చబడ్డాయి. అవి ధనసహితంగా రాజుల్ని, అగస్త్యుని తీసికొని రెప్పపాటు కాలంలో అగస్త్యుని ఆశ్రమం వపు దౌడు తీశాయి. అదే సమయంలో ఇల్వలుడు అగస్త్యుని వెనుకగా పరుగెత్తి చంప నిశ్చయించాడు. అగస్త్యమహర్షి ఇల్వలుని హుంకారమాత్రం చేతనే భస్మం కావించాడు. తరువాత వాయువేగం కల ఆ గుఱ్ఱాలు వారినందర్నీ అగస్త్యాశ్రమానికి చేర్చాయి. అగస్త్యుని ఆజ్ఞగైకొని వారందరు వారి వారి రాజధానీనగరాలకి వెళ్ళారు. అగస్త్యమహర్షి లోపాముద్రాదేవి కోరికలన్నింటినీ ఆ ధనంతో తీర్చాడు. (17,18)
లోపాముద్రోవాచ
కృతవానసి తత్ సర్వం భగవన్ మమ కాంక్షితమ్ ।
ఉత్పాదయ సకృన్మహ్యమ్ అపత్యం వీర్యవత్తరమ్ ॥ 19
అపుడు లోపాముద్ర అంది.
నాకోరికలను అన్నింటినీ మీరు మీ సామర్థ్యంతో తీర్చారు. నా నుంచి శక్తిమంతుడు, తేజస్సంపన్నుడు అయిన కుమారుని పొందండి. (19)
అగస్త్య ఉవాచ
తుష్టోఽహమస్మి కల్యాణి తవ వృత్తేన శోభనే ।
విచారణామపత్యే తు తవ వక్ష్యామి తాం శృణు ॥ 20
అగస్త్యుడు పలికాడు.
నీ సదాచారవ్యవహరశీలాదులతో సంతుష్టుడను అయ్యాను. పుత్రుని గూర్చి నీ ఎదుట ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. విను. (20)
సహస్రం తేఽస్తు పుత్రాణం శతం నా దశసమ్మితమ్ ।
దశ వా శతతుల్యాః స్యురేకో వాపి సహస్రజిత్ ॥ 21
నీ గర్భం నుంచి వేయిమందిగాని, వందమందిగాని పుత్రులు పుడితే వారు సమర్థులు పదిమందితో సమానం. పదిమందిపుడితే వందమందితో సమానం. ఒక్కపుత్రుడే అయితే అతడు వేయిమందిని జయించగలవాడు అవుతాడు. ఏదియో ఒకటి కోరుకో. (21)
లోపాముద్రోవాచ
సహస్రసమ్మితః పుత్ర ఏకోఽప్యస్తు తపోధన ।
ఏకో హి బహుభిః శ్రేయాన్ విద్వాన్ సాధురసాధుభిః ॥ 22
లోపాముద్ర పలికింది.
వేయిమందితో సమానుడైన ఒక్కకుమారుడే నాకు చాలును. చాలమంది దుష్టులకంటె సద్గుణసంపన్నుడు ఒక్కడే ఉత్తముడు కదా! (22)
లోమశ ఉవాచ
స తథేతి ప్రతిజ్ఞాయ తయా సమభవన్మునిః ।
సమయే సమశీలిన్యా శ్రద్ధావాన్ శ్రద్ధధానయా ॥ 23
అప్పుడు అగస్త్యుడు 'అలాగే' అని సరియైన సమయంలో భార్య అయిన లోపాముద్రతో కలిశాడు. (23)
తత ఆధాయ గర్భం తమ్ అగమద్ వనమేవ సః ।
తస్మిన్ వనగతే గర్భః వవృధే సప్త శారదాన్ ॥ 24
గర్భాధానం తరువాత అగస్త్యుడు వనానికి తిరిగివెళ్ళాడు. ఆయన వనానికి వెళ్ళిన పిదప ఏడుసంవత్సరాలపాటు గర్భం పెరగసాగింది. (24)
సప్తమేఽబ్దే గతే చాపి ప్రాచ్యవత్ స మహాకవిః ।
జ్వలన్నివ ప్రభావేణ దృఢస్యుర్నామ భారత ॥ 25
ఏడు సంవత్సరాలు గడిచిపోయాక తేజస్సు, ప్రభావం అధికంగా కల గర్భస్థ శిశువు బయటపడ్డాడు. అతడే దృఢస్యువు అనే పేరుతో ప్రసిద్ధిపొందాడు. (25)
సాంగోపనిషదాన్ వేదాన్ జపన్నివ మహాతపాః ।
తస్య పుత్రోఽభవదృషేః స తేజస్వీ మహాద్విజః ॥ 26
అగస్త్యుని కుమారుడు తేజస్వియై పుట్టినప్పటి నుంచి వేదాల్ని, వేదాంగాల్ని, ఉపనిషత్తుల్ని అన్నింటినీ అభ్యసించాడు. దృఢస్యువు బ్రాహ్మణులలో మిక్కిలి గౌరవింపతగినవాడు. (26)
స బాల ఏవ తేజస్వీ పితుస్తస్య నివేశనే ।
ఇధ్మానాం భారమాజహ్రే ఇధ్మవాహస్తతోఽభవత్ ॥ 27
ఆ దృఢస్యువు తండ్రి ఇంట్లో ఉంటూ బాల్యం నుంచి రోజూ సమిధలభారాన్ని తనపై ఉంచుకుని తీసుకువచ్చేవాడు. దాంతో అతనికి 'ఇధ్మవాహుడు' అనే పేరు స్థిరపడింది. (27)
తథాయుక్తం తు తం దృష్ట్వా ముముదే స మునిస్తదా ।
ఏవం స జనయామాస భారతాపత్యముత్తమమ్ ॥ 28
సమిధానయనంలో, స్వాధ్యాయంలో లగ్నమైన కుమారుని చూచి అగస్త్యుడు ఎంతో సంతోషించాడు. ఈ ప్రకారంగా అగస్త్యుడు లోపాముద్రయందు సత్సంతానానికి కారణభూతుడు అయ్యాడు. (28)
లేభిరే పితరశ్చాస్య లోకాన్ రాజన్ యఠేప్సితాన్ ।
తత ఊర్ధ్వమయం ఖ్యాతస్త్వగస్త్యస్యాశ్రమో భువి ॥ 29
అతని పితృదేవతలు సంతానం కలిగిన కారణంగా మనోవాంఛితలోకాలకు చేరారు. అప్పటి నుంచి ఈ ప్రదేశం అగస్త్యాశ్రమం అని పిలువబడుతూ ప్రసిద్ధిలోకి వచ్చింది. (29)
ప్రాహ్లాదిరేవం వాతాపిః అగస్త్యేనోపశామితః ।
తస్యాయమాశ్రమో రాజన్ రమణియైర్గుణైర్యుతః ॥ 30
ప్రహ్లాదగోత్రజుడు వాతాపిని ఈవిధంగా అగస్త్యుడు తనతపోబలంతో శాంతపరచాడు. ఇది చాల అందమైన గుణాలతో ప్రకాశించే ఆశ్రమం. (30)
ఏషా భాగీరథీ పుణ్యా దేవగంధర్వసేవితా ।
వాతేరితా పతాకేవ విరాజతి నభస్తలే ॥ 31
దీనిని ఆనుకొని దేవతలచే పూజింపబడే భాగీరథీనది ఉంది. ఆకాశంలో వాయుప్రేరణచే రెపరెపలాడే తెల్లటి జెండావలె ఈ నది ప్రకాశిస్తోంది. (31)
ప్రతార్యమాణా కూటేషు యథా నిమ్నేషు నిత్యశః ।
శిలాతలేషు సంత్రస్తా పన్నగేంద్రవధూరివ ॥ 32
ఈ నది క్రమంగా పర్వతాల చిన్నశిఖరాలపై నుంచి జారుతూ ఎల్లప్పుడు తీవ్రవేగంతో ప్రవహిస్తూ ఉంది. భయపడిన సర్పం ఎలా బిలంలోకి ప్రవేశిస్తూ ఉంటుందో అలా ఈ నది రాళ్ళపొరల్లోని సందుల్లోకి ప్రవేశిస్తూ ఉంది. (32)
దక్షిణాం వై దిశం సర్వాం ప్లావయంతీ చ మాతృవత్ ।
పూర్వం శంభోర్జటా భ్రష్టా సముద్రమహిషీ ప్రియా ।
అస్యాం నద్యాం సుపుణ్యాయాం యథేష్టమవగాహ్యతామ్ ॥ 33
ముందుగా శంకరుని జటాజూటంలో దిగిన సముద్రుని ప్రియురాలు, రాణి గంగాదేవి దక్షిణదిక్కును అంతటినీ తనజలాలతో తడిపివేస్తోంది. తనసంతానాన్ని తల్లి ఎలా స్నానం చేయిస్తుందో అలా ఆచరిస్తోంది. ఈ భాగీరథీనదిలో స్వేచ్ఛగా స్నానం చెయ్యి. (33)
యుధిష్ఠిర నిబోధేదం త్రిషు లోకేషు విశ్రుతమ్ ।
భృగోస్తీర్థం మహారాజ మహర్షిగణసేవితమ్ ॥ 34
యుధిష్ఠిరా! దీన్ని శ్రద్ధగా విను. ఇది మహర్షులచే ఆరాధింపబడే భృగుతీర్థం. ముల్లోకాల్లోను ప్రసిద్ధం. (34)
యత్రోపస్పృష్టవాన్ రామో హృతం తేజస్తదాఽఽప్తవాన్ ।
అత్ర త్వం భ్రాతృభిః సార్ధం కృష్ణాయా చైవ పాండవ ॥ 35
దుర్యోధనహృతం తేజః పునరాదాతుమర్హసి ।
కృతవైరేణ రామేణ యథా చోపహృతం పునః ॥ 36
పరశురాముడు ఇక్కడ స్నానం చేసి తనపోయిన తేజస్సును తిరిగిపొందాడు. నీవు ఇక్కడ సోదరులతో, భార్యతో స్నానం చేసి దుర్యోధనునిచే అపహరింపబడిన సంపదను తిరిగి పొందుతావు. రామునితో వైరం కారణంగా పోగొట్టుకొన్న తేజస్సును స్నానప్రభావంతో పరశురాముడు తిరిగిపొందాడు. (35,36)
వైశంపాయన ఉవాచ
స తత్ర భ్రాతృభిశ్చైవ కృష్ణయా చైవ పాండవః ।
స్నాత్వా దేవాన్ పితౄంశ్చైవ తర్పయామాస భారత ॥ 37
వైశంపాయనుడు చెప్పాడు.
యుధిష్ఠిరుడు భార్యతో, సోదరులతో కలిసి భృగుతీర్థంలో స్నానం చేసి దేవతలకు, పితరులకు తర్పణాలు వదిలాడు. (37)
తస్య తీర్థస్య రూపం వై దీప్తాద్ దీప్తతరం బభౌ ।
అప్రధృష్యతరశ్చాసీత్ శాత్రవాణాం నరర్షభ ॥ 38
ఆ తీర్థంలో స్నానం చేసిన వెంటనే యుధిష్టిరుడు మిక్కిలి తేజోవంతుడై ప్రకాశించసాగాడు. ఇప్పుడు అతడు శత్రువులకు లొంగనివాడు అయ్యాడు. (38)
అపృచ్ఛచ్చైవ రాజేంద్ర లోమశం పాండునందనః ।
భగవన్ కిమర్థం రామస్య హృతమాసీద్ వపుః ప్రభో ।
కథం ప్రత్యాహృతం చైవ ఏతదాచక్ష్వ పృచ్ఛతః ॥ 39
అదే సమయంలో ధర్మరాజు లోమశుని అడిగాడు - పరశురాముని తేజస్సు ఏ కారణంగా నశించింది? తిరిగి ఆ తేజాన్ని అతడు ఎలా పొందాడు? నాకు తెలియజెయ్యండి. మీరు దయతో ఈ వృత్తాంతాన్ని వర్ణించండి. (39)
లోమశ ఉవాచ
శృణు రామస్య రాజేంద్ర భార్గవస్య చ ధీమతః ।
జాతో దశరథస్యాసీత్ పుత్రో రామో మహాత్మనః ॥ 40
విష్ణుః స్వేన శరీరేణ రావణస్య వధాయ వై ।
పశ్యామస్తమయోధ్యాయాం జాతం దాశరథిం తతః ॥ 41
లోమశుడు చెప్పాడు.
దశరథనందనుడు శ్రీరాముడు, భృగునందనుడు పరశురాముడు. వీరి చరిత్ర విను. ప్రాచీనకాలంలో దశరథమహారాజుకు సచ్చిదానందవిగ్రహుడు శ్రీమహావిష్ణువు పుత్రునిగా జన్మించాడు. అతని అవతారలక్ష్యం పాపాత్ముడైన రావణుని నాశనం చేయటం. అయోధ్యలో అవతరించిన శ్రీరాముని మేమందరం ప్రత్యక్షంగా దర్శించాము. (40,41)
ఋచీకనందనో రామో భార్గవో రేణుకాసుతః ।
తస్య దాశరథేః శ్రుత్వా రామస్యాక్షిష్టకర్మణః ॥ 42
కౌతూహలాన్వితో రామస్త్వయోధ్యామగమత్ పునః ।
ధనురాదాయ తద్ దివ్యం క్షత్రియాణాం నిబర్హణమ్ ॥ 43
శ్రమ లేకుండ పనుల్ని సాధించ గల దశరథనందనుని పరాక్రమం గురించి విని భృగు, ఋచీకవంశజుడు, రేణుకాదేవి కుమారుడు పరశురాముడు అతనిని చూడటానికి ఉత్సుకతతో వచ్చి క్షత్రియుల్ని సంహరింపగల దివ్యధనువును తీసుకొనివచ్చాడు. (42,43)
జిజ్ఞాసమానో రామస్య వీర్యం దాశరథేస్తదా ।
తం వై దశరథః శ్రుత్వా విషయాంతముపాగతమ్ ॥ 44
ప్రేషయామాస రామస్య రామం పుత్రం పురస్కృతమ్ ।
స తమభ్యాగతం దృష్ట్వా ఉద్యతాస్త్రమవస్థితమ్ ॥ 45
ప్రహసన్నివ కౌంతేయ రామో వచనమబ్రవీత్ ।
కృతకాలం హి రాజేంద్ర ధనురేతన్మయా విభో ॥ 46
పరశురాముని శుభాగమనలక్ష్యం శ్రీరాముని పరీక్షించటం. దశరథుడు పరశురాముడు రాజ్యసరిహద్దుల్ని చేరాడు అని విని శ్రీరాముని ఆహ్వానింప పంపాడు. శ్రీరాముడు ధనుర్బాణాలు చేతిలో ధరించి వచ్చి ఎదురుగా నిలిచాడు.
ఇది చూచిన పరశురాముడు నవ్వుతూ నీకే శక్తి ఉంటే యత్నపూర్వకంగా ఈ ధనుస్సును ఎక్కుపెట్టు. ఇది ఎందరో క్షత్రియుల్ని సంహరించిన విల్లు అన్నాడు. (44-46)
సమారోపయ యత్నేన యది శక్నోషి పార్థివ ।
ఇత్యుక్తస్త్వాహ భగవన్ త్వం నాధిక్షేప్తుమర్హసి ॥ 47
ఇలా పలికిన పరశురామునితో రాముడు మీరు నన్ను ఈవిధంగా అవమానించకండి అన్నాడు. (47)
నాహమప్యధమో ధర్మే క్షత్రియాణాం ద్విజాతిషు ।
ఇక్ష్వాకూణాం విశేషేణ బాహువీర్యే న కత్థనమ్ ॥ 48
నేను కూడ దివజాతులు అన్నింటిలో క్షత్రియధర్మాన్ని పాలించే వారిలో అధముణ్ణికాను. ప్రత్యేకించి ఇక్ష్వాకువంశజులు బాహుబలాన్ని ప్రశంసించుకోరు. (48)
తమేవంవాదినం తత్ర రామో వచనమబ్రవీత్ ।
అలం వై వ్యపదేశేన ధనురాయచ్చ రాఘవ ॥ 49
శ్రీరాముడు పలికిన మాటల్ని విని పరశురాముడు బదులు చెప్పాడు. మాటలకు ఇక్కడ అవకాశం లేదు. ఈ ధనుస్సు తీసుకొని వింటినారిని బిగించు. (49)
తతో జగ్రాహ రోషేణ క్షత్రియర్షభసూదనమ్ ।
రామో దాశరథిర్దివ్య హస్తాద్ రామస్య కార్ముకమ్ ॥ 50
ధనురారోపయామాస సలీల ఇవ భారత ।
జ్యాశబ్దమకరోచ్చైవ స్మయమానః స వీర్యవాన్ ॥ 51
దశరతకుమారుడు శ్రీరాముడు రోషంతో క్షత్రియుల్ని సంహరించిన ఆ ప్రశురాముని వింటిని చేతితో గ్రహించాడు. అతడు విలాసంగా ఆ ధనుస్సుకు నారి బిగించి శబ్దం చేశాడు. శ్రీరాముడు నవ్వుతూ ఉండగనే ఆ ధనుష్టంకారం అన్ని దిశలా వ్యాపించింది. (50,51)
తస్య శబ్దస్య భూతాని విత్రసన్త్యశనేరివ ।
అథాబ్రవీత్ తదా రామో రామం దాశరథిస్తదా ॥ 52
ఇదమారోపితం బ్రహ్మన్ కిమన్యత్ కరవాణి తే ।
తస్య రామో దదౌ దివ్యం జామదగ్న్యో మహాత్మనః ।
శరమాకర్ణదేశాంతమ్ అయమాకృష్యతామితి ॥ 53
పిడిగుపాటులా ఉన్న ఆ ధ్వనికి ప్రాణులందరు భయవిహ్వలులు అయ్యారు. శ్రీరాముడు పరశురామునితో అన్నాడు - మీరు చెప్పిన ఈ ధనుస్సును వశపరచుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి. పరశురాముడు రామునికి బదులు ఇచ్చాడు. నేను ఇచ్చే ఈ బాణాన్ని తీసుకొని ఆ ధనుస్సులో ఉంచి చెవి వరకు లాగు. (52,53)
లోమశ ఉవాచ
ఏతచ్ర్ఛుత్వాబ్రవీద్ రామః ప్రదీప్త ఇవ మన్యునా ।
శ్రూయతే క్షమ్యతే చైవ దర్పపూర్ణోఽసి భార్గవ ॥ 54
లోమశుడు పలికాడు.
ఈ మాట వింటూనే రామునికి చాలకోపం వచ్చి పరశురామునితో అన్నాడు - నీవ గర్వపూర్ణుడివి. నీ పదునైన మాటలు విన్నా నిన్ను క్షమిస్తున్నాను. (54)
త్వయా హ్యధిగతమ్ తేజః క్షత్రియేభ్యో విశేషతః ।
పితామహప్రసాదేన తేన మాం క్షిపసి ధ్రువమ్ ॥ 55
నీ పితామహుడు ఋచీకుని కారణంగా నీకు ఈ క్షత్రియుల్ని జయించే సామర్థ్యం వచ్చింది. అందుచే నిశ్చయంగా మమ్ములను అధిక్షేపిస్తున్నావు. (55)
పశ్య మాం స్వేన రూపేణ చక్షుస్తే వితరామ్యహమ్ ।
తతో రామశరీరే వై రామః పశ్యతి భార్గవః ॥ 56
ఆదిత్యాన్ సవసూన్ రుద్రాన్ సాధ్యాంశ్చ సమరుద్గణాన్ ।
పితరో హుతాశనశ్చైవ నక్షత్రాని గ్రహాస్తథా ॥ 57
గంధర్వా రాక్షసా యక్షా నద్యస్తీర్థాని యాని చ ।
ఋషయో వాలఖిల్యాశ్చ బ్రహ్మభూతాః సనాతనాః ॥ 58
దేవర్షయశ్చ కార్ త్స్న్యేన సముద్రాః పర్వతాస్తథా ।
వేదాశ్చ సోపనిషదో వషట్కారైః సహాధ్వరైః ॥ 59
చేతోమంతి చ సామాని ధనుర్వేదశ్చ భారత ।
మేఘబృందాని వర్షాణి విద్యుతశ్చ యుధిష్ఠిర ॥ 60
నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తాను. దాని ద్వారా నా నిజస్వరూపాన్ని దర్శించుకో. అప్పుడు పరశురామునికి శ్రీరాముని శరీరంలో ఆదిత్యులు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, సాధ్యులు, దేవతలు, నలభైతొమ్మిది మంది మరుత్తులు, పితృగణాలు, అగ్నిదేవుడు, నక్షత్రాలు, గ్రహాలు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, నదులు, తీర్థాలు, సనాతనులు బ్రహ్మస్వరూపులు అంగుష్ఠపరిమాణం గల వాలఖిల్యులు, దేవర్షులు, సప్తసముద్రాలు, పర్వతాలు, ఉపనిషత్తుల సహితంగా వేదాలు, వషట్కారం, యజ్ఞం, సామ, ధనుర్వేదం, అన్నీ చేతనరూపాల్ని ధరించి ప్రత్యక్షంగా కన్పించాయి. మేఘమండలం, వర్షం, మెరుపుతీగలు అన్నీ అతని శరీరంలో దర్శనం ఇచ్చాయి. (56-60)
తతః స భగవాన్ విష్ణుస్తం వై బాణం ముమోచ హ ।
శుష్కాశనిసమాకీర్ణం మహోల్కాభిశ్చ భారత ॥ 61
పాంసువర్షేణ మహతా మేఘవర్షైశ్చ భూతలమ్ ।
భూమికంపాశ్చ నిర్ఘాతైః నాదైశ్చ విపులైరపి ॥ 62
పిమ్మట దసరథనందనుడు శ్రీరాముడు ఎక్కుపెట్టిన బాణాన్ని వదిలాడు. ఆ సమయంలో భూమి అంతా మేఘాలు లేని మెరుపులోని పెద్దపెద్ద ఉల్కలతో వ్యాపించి ధూళివర్షం కురియసాగింది. మేఘాలు ఒక్కసారిగా క్రమ్ముకుని ధారలుగా వర్షం పడసాగింది. మాటిమాటికి భూకంపం వచ్చింది. మేఘగర్జనలు, ఉత్పాతధ్వనులు ఒక్కసారిగా దద్దరిల్లేటట్లు చేశాయి. (61,62)
స రామం విహ్వలం కృత్వా తేజశ్చాక్షిప్య కేవలమ్ ।
ఆగచ్ఛజ్జ్వలితో బాణో రామబాహుప్రచోదితః ॥ 63
శ్రీరాముని భుజాలతో విడువడిన ఆ బాణం ప్రకాశిస్తూ పరశురాముని వ్యాకులపరిచి అతని తేజస్సును మాత్రం గ్రహించి రాముని వచ్చి చేరింది. (63)
స తు విహ్వలతాం గత్వా ప్రతిలభ్య చ చేతనామ్ ।
రామః ప్రత్యాగతప్రాణః ప్రాణమద్ విద్ణుతేజసమ్ ॥ 64
విష్ణునా సోఽభ్యనుజ్ఞాతో మహేంద్రమగమత్ పునః ।
భీతస్తు తత్ర న్యవసద్ వ్ర్రీడితస్తు మహాతపాః ॥ 65
పరశురాముడు హఠాత్తుగా మూర్ఛితుడు అయి తిరిగి కొంతసేపటికి తెలివి పొందాడు. చనిపోయి తిరిగి బ్రతికిన మనుజునివలె తన నుండి విష్ణుతేజాన్ని గ్రహించిన శ్రీరామునికి నమస్కారం చేశాడు. అటు తరువాత శ్రీమన్మహావిష్ణువు అవతారం అయిన శ్రిరాముని అనుమతి గైకొని మహేంద్రపర్వతానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతడు భయపడి, సిగ్గుపడి గొప్పతపస్సులో మునిగిపోయాడు. (64,65)
తతః సంవత్సరేఽతీతే హృతౌజసమవస్థితమ్ ।
నిర్మదం దుఃఖితం దృష్ట్వా పితరో రామమబ్రువన్ ॥ 66
పిమ్మట ఒక సంవత్సరం గడవగా తేజోహీనుడు, అభిమానశూన్యుడు అయిన పరశురాముని చూచి అతని పితృదేవతలు అతనితో ఇలా అన్నారు. (66)
పితర ఊచుః
న వై సమ్యగిదం పుత్ర విష్ణుమాసాద్య వై కృతమ్ ।
స హి పూజ్యశ్చ మాన్యశ్చ త్రిషు లోకేషు సర్వదా ॥ 67
పితరులు పలికారు.
నీవు పూజ్యుడు శ్రీమన్మహావిష్ణువుతో చేసిన వైరం ఎంతమాత్రం ఉచితం అయింది కాదు. అతడు ముల్లోకాల్లో ప్రసిద్ధుడు, పూజనీయుడు, గౌరవింపతగినవాడు. (67)
గచ్ఛ పుత్ర నదీం పుణ్యాం వధూసరకృతాహ్వయామ్ ।
తత్రోపస్పృశ్య తీర్థేషు పునర్వపురవాప్స్యసి ॥ 68
నీవు ఇక్కడి నుండి వధూసరం అనేపేరుగల పుణ్యనదీతీరాన్ని చేరు. అక్కడ తీర్థాల్లో స్నానం చేసి తిరిగి పోయిన పూర్వతేజాన్ని గ్రహిస్తావు. (68)
దీప్తోదం నామ తత్ తీర్థం యత్ర తే ప్రపితామహః ।
భృగుర్దేవయుగే రామ తప్తవానుత్తమం తపః ॥ 69
అది దిప్తోదకం అనే పేరు గల తీర్థం. దేవయుగంలో మీముత్తాత భృగుమహర్షి ఇక్కడే గొప్ప తపస్సు చేశాడు. (69)
తత్ తథా కృతవాన్ రామః కౌంతేయ వచనాత్ పితుః ।
ప్రాప్తవాంశ్చ పునస్తేజస్తీర్థేఽస్మిన్ పాండునందన ॥ 70
పితరులమాటపై పరశురాముడు అలాగే చేశాడు. ఆ తీర్థంలో స్నానం చేసి తిరిగి తను కోల్పోయిన తేజస్సును పొందాడు. (70)
ఏతదీదృశకం తాత రామేణాక్లిష్టకర్మణా ।
ప్రాప్తమాస్మీన్మహారాజ విష్ణుమాసాద్య వై పురా ॥ 71
ఈ ప్రకారంగా పూర్వకాలంలో అనాయాసంగా పనుల్ని సాధించగల పరశురాముడు విష్ణువు అవతారం. శ్రీరామునితో విభేదించి ఈ అవస్థను పొందాడు. (71)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం జామదగ్న్యతేజోహానికథనే ఏకోనశతతమోఽధ్యాయః ॥ 99 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశ తీర్థయాత్రలో జామదగ్న్యతేజోహాని కథనమను తొంబది తొమ్మిదవ అధ్యాయము. (99)
(దాక్షిణాత్య అధికపాఠము 3 శ్లోకములు కలిపి మొత్తము 74 శ్లోకములు)