97. తొంబది ఏడవ అధ్యాయము

అగస్త్యుడు లోపాముద్రను వివాహమాడి ధనసంగ్రహణము చేయగోరుట.

లోమశ ఉవాచ
యదా త్వమన్యతాగస్త్యః గార్హ స్థ్యే తాం క్షమామితి ।
తదాభిగమ్య ప్రోవాచ వైదర్భం పృథివీపతిమ్ ॥ 1
లోమశుడు చెప్పాడు.
అగస్త్యుడు లోపాముద్రను తన సంసారాన్ని నడిపించగల గృహిణిగా భావించి రాజసమీపానికి పోయి ఇలా పలికాడు. (1)
రాజన్ నివేశే బుద్ధిర్మే వర్తతే పుత్రకారణాత్ ।
వరయే త్వాం మహీపాల లోపాముద్రాం ప్రయచ్ఛ మే ॥ 2
పుత్రోత్పత్తి కారణంగా నాకు వివాహంపై కోరిక కలిగింది. మీ పెంపకంలో ఉన్న కన్యకను వివాహమాడతాను. మీరు లోపాముద్రను నాకు సమర్పించండి." (2)
ఏవముక్తః స మునినా మహీపాలో విచేతనః ।
ప్రత్యాఖ్యానాయ చాశక్తః ప్రదాతుం చైవ నైచ్ఛత ॥ 3
అగస్త్యుని మాటలు విన్న విదర్భరాజు చైతన్యం కోల్పోయి ఆ మాటల్ని అంగీకరించలేకపోయాడు. తిరస్కరించలేకపోయాడు కూడ. (3)
తతః స భార్యామభ్యేత్య ప్రోవాచ పృథివీపతిః ।
మహర్షిర్వీర్యవానేష క్రుద్ధః శాపాగ్నినా దహేత్ ॥ 4
అప్పుడు విదర్భరాజు తనభార్య వద్దకు పోయి పలికాడు - ప్రియా! మహర్షి అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. కోపిస్తే శాపాగ్నిలో మనలను అందరినీ భస్మం చేస్తాడు. (4)
తం తహిథా దుఃఖితం దృష్ట్వా సభార్యం పృథివీపతిమ్ ।
లోపాముద్రాభిగమ్యేదం కాలే వచనమబ్రవీత్ ॥ 5
భార్యతో కలిసి విలపిస్తున్న తండ్రి సమీపానికి లోపాముద్ర చేరి సమయానికి తగినట్లు ఇలా పలికింది. (5)
న మత్కృతే మహీపాల పీడామభ్యేతుమర్హసి ।
ప్రయచ్ఛ మామగస్త్యాయ త్రాహ్యాత్మానం మయా పితః ॥ 6
మీరు నాకొరకు దుఃఖం అనుభవింపవలదు. తండ్రీ! మీరు నన్ను అగస్త్యమహర్షికి అప్పగించండి. నాద్వారా మీకు రక్షణ దొరకుతుంది. (6)
దిహితుర్వచనాద్ రాజా సోఽగస్త్యాయ మహాత్మనే ।
లోపాముద్రాం తత్రః ప్రాదాద్ విధిపూర్వం విశాంపతే ॥ 7
పుత్రికవచనాలు విన్న విదర్భరాజు మహాత్ముడు అగస్త్యునికి శాస్త్రవిధిని అనుసరించి లోపాముద్రను కన్యాదానం చేశాడు. (7)
ప్రాప్య భార్యామగస్త్యస్తు లోపాముద్రామభాషత ।
మహార్హాణ్యుత్సృజైతాని వాసాంస్యాభరణాని చ ॥ 8
లోపాముద్రను భార్యగా పొందిన అగస్త్యుడు విదర్భరాజుకుమార్తెతో ఇలా పలికాడు - మీ విలువైన వస్త్రాల్ని, ఆభరణాల్ని శరీరం నుంచి తొలగించుకో. (8)
తతః సా దర్శనీయాని మహార్హాణి తనూని చ ।
సముత్ససర్జ రంభోరూః వసనాన్యాయతేక్షణా ॥ 9
తతశ్చీరాణి జగ్రాహ వల్కలాన్యజినాని చ ।
సమానవ్రతచర్యా చ బభువాయతలోచనా ॥ 10
పిమ్మట ఆమె అరటిబోదెల వంటి తొడలు, విశాలనేత్రాలు గల తన శరీరం నుంచి విలువైన వస్త్రాల్ని ఆభరణాల్ని తొలగించి వాటికి మారుగా పాతబట్టలు, నారబట్టలు, మృగచర్మాలు ధరించి భర్తతో సమానంగా వ్రతాచారాలు పాటించసాగింది. (9,10)
గంగాద్వారమథాగమ్య భగవానృషిసత్తమః ।
ఉగ్రమాతిష్ఠత తపః సహ పత్న్యానుకూలయా ॥ 11
ఋషిశ్రేష్ఠుడు అగస్త్యుడు తనకు అన్నివిధాలా అనుకూలవతియైన భార్యను గ్రహించి గంగాతీరానికి వచ్చి ఘోరతపస్సులో మునిగిపోయాడు. (11)
సా ప్రీతా బహుమానాశ్చ పతిం పర్యచరత్ తదా ।
అగస్త్యశ్చ పరాం ప్రీతిం భార్యాయామచరత్ ప్రభుః ॥ 12
లోపాముద్ర మిక్కిలి ప్రసన్నతతో, ఆదరంతో భర్తను సేవించసాగింది. శక్తిసంపన్నుడు అగస్త్యమహర్షి తనభార్యపై ప్రేమను పెంచుకోసాగాడు. (12)
తతో బహుతిథే కాలే లోపాముద్రాం విశాంపతే ।
తపసా ద్యోతితాం స్నాతాం దదర్శ భగవానృషిః ॥ 13
స తస్యాః పరిచారేణ శౌచేన చ దమేన చ ।
శ్రియా రూపేణ చ ప్రీతో మైథునాయాజుహావ తామ్ ॥ 14
ఈ రీతిగా చాలారోజులు గడచాయి. ఒకనాడు ఋతుస్నాత అయిన పత్ని లోపాముద్రను అగస్త్యమహర్షి చూశాడు. ఆమె తపస్సుతో ప్రకాశిస్తోంది. ఆ మహర్షి తనభార్య సేవ, పవిత్రత, ఇంద్రియసంయమనం, కాంతి, రూప, సౌందర్యాలతో ప్రసన్నుడై మైథునానికై ఆమెను అహ్వానించాడు. (13,14)
తతః సా ప్రాంజలిర్భూత్వా లజ్జమానేవ భావినీ ।
తదా సప్రణయం వాక్యం భగవంతమథాబ్రవీత్ ॥ 15
అనురాగవతి లోపాముద్ర సిగ్గుపడుతూ చేతులు జోడించి ప్రేమభావంతో మహర్షిని ఇలా పలికింది. (15)
అసంశయం ప్రజాహేతోర్భార్యాం పతిరవిందత ।
యా తు తవ్యి మమ ప్రీతిః తామృషే కర్తుమర్హసి ॥ 16
నిస్సంశయంగా భర్త సంతానార్థం తనభార్యను చేరుట లోకాచారం. కాని మీపట్ల నా మనస్సులో ఎలాంటి స్నేహభావం ఉందో దానికి తగినట్లు మీరు సఫలం చెయ్యాలి. (16)
యథా పితుర్గృహే విప్ర ప్రాసాదే శయనం మమ ।
తథావిధే త్వం శయనే మాముపైతుమిహార్హసి ॥ 17
నేను నా తండ్రి ఇంట రాజమందిర శయ్యలలో నిద్రించాను. అట్టి శయ్యపై మీరు నాతో సంగమించండి. (17)
ఇచ్ఛామి త్వాం స్రగ్విణం చ భూషణైశ్చ విభూషితమ్ ।
ఉపసర్తుం యథాకామం దివ్యాభరణభూషితా ॥ 18
స్వామీ! మీరు సుందరహారాలు, అలంకారాలు, భూషణాలు ధరించండి. నేను వాటిని అన్నిటిని ధరిస్తాను. అప్పుడు స్వేచ్ఛానుసారం సమాగమసుఖాన్ని పొందండి. ఇది నా అభీష్టం. (18)
అన్యథా నోపతిష్ఠేయం చీరకాషాయవాసినీ ।
నైవాపవిత్రో విప్రర్షే భూషణోఽయం కథంచన ॥ 19
అలా కాక నేను చిరిగిన కాషాయవస్త్రాలతో మీసంగమసుఖాన్ని ఆశించను. తాపసుల ఈ ఆభరణాలు సంభోగాదుల వలన మలినమగుట నాకిష్టంలేదు. (19)
అగస్త్య ఉవాచ
న తే ధనాని విద్యంతే లోపాముద్రే తథా మమ ।
యథావిధాని కల్యాణి పితుస్తవ సుమధ్యమే ॥ 20
అగస్త్యుడు పలికాడు. నీతండ్రి రాజమందిరంలో ఎట్టి ధనవైభవం ఉందో అట్టి వైభవం నాఇంట లేదు. నీవద్దలేదు. (20)
లోపాముద్రోవాచ
ఈశోఽసి తపసా సర్వం సమాహర్తుం తపోధన ।
క్షణేన జీవలోకే యద్ వసు కించన విద్యతే ॥ 21
లోపాముద్ర అన్నది. ఈ ప్రాణిలోకాన ఎంతధనరాశి, ఆభరణాలు ఉన్నాయో వాటిని మీరు క్షణకాలంలో మీతపస్సుచే ఆ ధనరాశుల్ని ప్రోగుచేస్తారు. (21)
అగస్త్య ఉవాచ
ఏవమేతద్ యతాఽఽత్థ త్వం తపోవ్యయకరం తు తత్ ।
యతా తు మే న నశ్యతే తపస్తన్మాం ప్రచోదయ ॥ 22
అగస్త్యుడు అన్నాడు.
నీవు పలికింది అక్షరాలా నిజం. కాని అలా ఆచరిస్తే తపస్సు వ్యర్థం అవుతుంది. నీకు తెలిసిన నా తపస్సు నశించకుండ ధనాన్ని ప్రోగుచేసే ఉపాయాన్ని వివరించు. (22)
లోపాముద్రోవాచ
అల్పావశిష్టః కాలోఽయమ్ ఋతోర్మమ తపోధన ।
న చాన్యథాహమిచ్ఛామి త్వాముపైతుం కథంచన ॥ 23
నా ఋతుసమయం కొంచెమే మిగిలి ఉంది. నేను చెప్పిన విధంగానే నేను మీతో ఆభరణాలు, వస్త్రాలు మొదలైనవి కలిగిన దశలోనే సంగమానికి ఇష్టపడతాను. (23)
న చాపి ధర్మమిచ్ఛామి విలోప్తుం తే కథంచన ।
ఏవం తు మే యతాకామం సంపాదయితుమర్హసి ॥ 24
ఏవిధంగాను మీ ధర్మలోపానికి నేను ఇష్టపడను. ఈ ప్రకారంగా మీరు మీ ధర్మాన్ని, తపస్సును రక్షించుకుంటూనే ఏ రకంగా సాధ్యమగునో అలా నా కోరికను తీర్చండి. (24)
అగస్త్య ఉవాచ
యద్యేష కామః సుభగే తవ బుద్ధ్యా వినిశ్చితః ।
హర్తుం గచ్ఛామ్యహం భద్రే చర కామమిహ స్థితా ॥ 25
అగస్త్యుడు చెప్పాడు.
నీ బుద్ధికి అనుగుణంగా ఈ కోర్కె తీర్చుకొనుటకు నిశ్చయించావు. నేను ధనాన్ని తెచ్చుటకు వెడతాను. నీవు ఇక్కడే ఉండి స్వేచ్ఛానుసారం ధర్మాచరణం చెయ్యి. (25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయామగస్త్యోపాఖ్యానే సప్తనవతితమోఽధ్యాయః ॥ 97 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్ర యందు ఆగస్త్యోపాఖ్యానము అను తొంబది ఏడవ అధ్యాయము. (97)