79. డెబ్బది తొమ్మిదవ అధ్యాయము
బృహదశ్వుడు ద్యూతాశ్వవిద్యల రహస్యము తెలిపి వెడలుట.
బృహదశ్వ ఉవాచ
ప్రశాంతే తు పురే హృష్టే సంప్రవృత్తే మహోత్సవే ।
మహత్యా సేనయా రాజా దమయంతీముపానయత్ ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు.
నగరంలో ప్రశాంత వాతావరణంలో అంతా సంతోషంతో వేడుకలు జరుపుకొంటూఉండగా గొప్పసేనతో నలమహారాజు దమయంతిని నగరానికి తీసికొనివచ్చాడు. (1)
దమయంతీమపి పితా సత్కృత్య పరవీరహా ।
ప్రాస్థాపయదమేయాత్మా భీమే భీమపరాక్రమః ॥ 2
అవక్రపరాక్రమశాలియగు భీమమహారాజు కుమార్తెయగు దమయంతిని సత్కరించి పంపాడు. (2)
ఆగతాయాం తు వైదర్భ్యాం సపుత్రాయాం నలో నృపః ।
వర్తయామాస ముదితః దేవరాడివ నందనే ॥ 3
తథా ప్రకాశతాం యాతః జంబూద్వీపే స రాజసు ।
పునః శశాస తద్ రాజ్యం ప్రత్యాహృత్య మహాయశాః ॥ 4
పిల్లలతో పట్టణానికి వచ్చిన మహారాణి దమయంతితో నందనవనంలో దేవేంద్రునివలె నలమహారాజు సంతోషంగా ఉన్నాడు. యశశ్శాలియైన నలమహారాజు శత్రువుల నుండి రాజ్యాన్ని తిరిగి తీసికొని జంబూద్వీపమందలి రాజులలో ప్రఖ్యాతినొంది రాజ్యాన్ని పరిపాలించాడు. (3,4)
ఈజే చ వివిధైర్యజ్ఞైః విధివచ్చాప్తదక్షిణైః ।
తథా త్వమపి రాజేంద్ర ససుహృష్ యక్ష్యసేఽచిరాత్ ॥ 5
ధర్మరాజా! నలమహారాజు విధివిధానంగా భూరిదక్షిణలతో వివిధ యజ్ఞయాగాలను చేశాడు. అదేవిధంగా నీవు కూడ నీమిత్రులతో కలిసి అతిత్వరలో యజ్ఞాలను చేయగలవు. (5)
దుఃఖమేతాదృశం ప్రాప్తః నలః పరపురంజయః ।
దేవనేన నరశ్రేష్ఠ సభార్యో భరతర్షభ ॥ 6
నరోత్తమా ధర్మరాజా! జూదం వల్ల శత్రుంజయుడైన నలుడు భార్యాసహితుడై ఈ విధమైన దుఃఖాలను పొందాడు. (6)
ఏకాకినైవ సుమహత్ నలేన పృథివీపతే దుఃఖమాసాదితం ఘోరం ప్రాప్తశ్చాభ్యుదయః పునః ॥ 7
ఇంతటి ఘోరమైన దుఃఖాన్ని నలుడు ఏకాకిగానే అనుభవించాడు. తిరిగి అభ్యుదయాన్ని కూడ పొందాడు. (7)
త్వం పునర్భ్రాతృసహితః కృష్ణయా చైవ పాండవ ।
రమసేఽస్మిన్ మహారణ్యే ధర్మమేవానుచింతయన్ ॥ 8
ధర్మరాజా! నీవు ఈ మహారణ్యంలో నీ తమ్ములతోను భార్యయగు ద్రౌపదితోను కలిసియే ధర్మాన్ని ఆచరిస్తూ సుఖంగా ఉన్నావు. (8)
బ్రాహ్మణైశ్చ మహాభాగైః వేదవేదాంగపారగైః ।
నిత్యమన్వాస్యసే రాజన్ తత్ర కా పరిదేవనా ॥ 9
రాజా! మహాత్ములను వేదపారగులైన బ్రాహ్మణోత్తములతో నిత్యం కాలం గడుపుతున్న నీకు దుఃఖం ఎందులకు? (9)
కర్కోటకస్య నాగస్య్ దమయంత్యా నలస్య చ ।
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్ ॥ 10
నాగజాతివాడైన కర్కోటకుని, దమయంతిని, నలుని, రాజర్షియైన ఋతుపర్ణుని కీర్తించిన వారికి కలి దోషం నుండి విముక్తి కల్గుతుంది. (10)
ఇతిహాసమిమం చాపి కలినాశనమచ్యుత ।
శక్యమాశ్వసితుం శ్రుత్వా త్వద్విధేన విశాంపతే ॥ 11
కలిదోషవినాశకమైన నలచరిత్రమనే ఈ కథను వినుట వలన కూడ కలిదోషాలు పోతాయి. దీని మహత్వం చెప్పశక్యమా? (11)
అస్థిరత్వం చ సంచింత్య పురుషార్థస్య నిత్యదా ।
తస్యోదయే వ్యయే చాపి న చింతయితుమర్హసి ॥ 12
పురుషునికి కలిగే విషయాలన్నీ అస్థిరాలు - ఇది గ్రహించి సంపత్ సమృద్ధి కల్గినపుడు, సంపదలు నశించినపుడును కూడ చింతింప తగదు కదా! (12)
శ్రుత్వేతిహాసం నృపతే సమాశ్వసిహి మా శుచః ।
వ్యసనే త్వం మహారాజ న విషీదితుమర్హసి ॥ 13
ధర్మజా! నలమహారాజు కథను విని, ఊరడిల్లు. కష్టం వచ్చినపుడు క్రుంగిపోవద్దు. (13)
విషమావస్థితే దైవే పౌరుషేఽఫలతాం గతే ।
విషాదయంతి నాత్మానం సత్త్వోపాశ్రయిణో నరాః ॥ 14
దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడును, పురుషప్రయత్నాలు ఫలించనపుడునూ దుఃఖించటం సాధారణ విషయం. ఇట్టి సమయంలోనే మానవులు ధైర్యంతో ఉండాలి. (14)
యే చేదం కథయుష్యంతి నలస్య చరితం మహత్ ।
శ్రోష్యంతి చాప్యభీక్ష్ణం వఒ నాలక్ష్మీస్తాన్ భజిష్యతి ॥ 15
అర్థాస్తస్యోపపత్స్యంతే ధన్యతాం చ గమిష్యతి ।
మహత్త్వపరిపూర్ణమైన ఈ నలమహారాజు చరిత్రను చెప్పినవారికిని, శ్రద్ధగా విన్నవారికిని దారిద్ర్యం ఉండదు. సంపదలు సమృద్ధిగా లభిస్తాయి. ధన్యులౌతారు. (15 1/2)
ఇతిహాసంమిమం శ్రుత్వా పురాణం శశ్వదుత్తమమ్ ॥ 16
పుత్రాన్ పౌత్రాన్ పశూంశ్చాపి లభతే నృషు చాగ్ర్యతామ్ ।
ఆరోగ్యప్రీతిమాంశ్చైవ భవిష్యతి న సంశయః ॥ 17
ప్రాచీనమైన ఈ ఇతిహాసాన్ని విన్నవారికి పుత్రులు, పౌత్రులు, పశుసంపదలు లభిస్తాయి. మానవులలో ఉన్నతమైన స్థితిని పొందుతారు. అందరి యందు మంచి ప్రీతి కల్గుతుంది. ఆరోగ్యసంపత్తి లబిస్తుంది. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. (16,17)
భయాత్ త్రస్యసి యచ్చ త్వం ఆహ్వయిష్యతి మాం పునః ।
అక్షజ్ఞ ఇతి తత్ తేఽహం నాశయిష్యామి పార్థివ ॥ 18
ధర్మరాజా! నీవు భయభ్రాంతుడవైనపుడు, "అక్షజ్ఞ" - అని నన్నాహ్వానించు. నేను నీభయాన్ని పోగొట్టగలను. (18)
వేదాక్షహృదయం కృత్స్నమ్ అహం సత్యపరాక్రమ ।
ఉపపద్యస్వ కౌంతేయ ప్రసన్నోఽహం బ్రవీమి తే ॥ 19
సత్యపరాక్రమా! ధర్మజా! నీపట్ల ప్రసన్నుడనయ్యాను. కష్టసాధ్యమైన అక్షహృదయమనే విద్యను నేనెరుగుదును. నీకా విద్యను ఉపదేశిస్తాను. (19)
వైశంపాయన ఉవాచ
తతో హృష్టమనా రాజా బృహదశ్వమువాచ హ ।
భగవన్నక్షహృదయం జ్ఞాతుమిచ్ఛామి తత్త్వతః ॥ 20
వైశంపాయనుడిలా అన్నాడు. ధర్మరాజు సంతోషంతో బృహదశ్వుని ఉద్దేశించి ఇలా అన్నాడు. భగవన్! మీ వలన "అక్షహృదయం" అనే విద్యను తెలిసికొనగోరుతున్నాను. (20)
తతోఽక్షహృదయం ప్రాదాత్ పాండవాయ మహాత్మనే ।
దత్త్వా చాశ్వశిరోఽగచ్ఛద్ ఉపస్ర్పష్టుం మహాతపాః ॥ 21
అప్పుడు బృహదశ్వమహాముని ధర్మరాజునకు అక్షహృదయాన్ని ప్రసాదించాడు. తర్వాత మహాతపస్వి అయిన బృహదశ్వుడు అచట నుండి వెళ్ళాడు. (21)
బృహదశ్వే గతే పార్థమ్ అశ్రౌషీత్ సవ్యసాచినమ్ ।
వర్తమానం తపస్యుగ్రే వాయుభక్షం మనీషిణమ్ ॥ 22
బ్రాహ్మణేభ్యస్తపస్విభ్యః సంపతద్భ్యస్తతస్తతః ।
తీర్థశైలవనేభ్యశ్చ సమేతేభ్యో దృఢవ్రతః ॥ 23
బృహదశ్వుడు వెళ్ళిన తర్వాత ధర్మరాజు పుణ్యతీర్థాల నుండి పుణ్యారణ్యాల నుండి, కులపర్వతాల నుండి వస్తూన్న తపోధనులైన బ్రాహ్మణోత్తముల వలన - అర్జునుడు వాయు భక్షణ చేస్తూ ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడని విన్నాడు. (22,23)
ఇతి పార్థో మహాబాహుః దురాపం తప ఆస్థితః ।
న తథా దృష్టపూర్వోఽన్యః కశ్చిదుగ్రతపా ఇతి ॥ 24
ధనుర్ధారియైన పార్థుడు అత్యంత కష్టతరమైన తపస్సు చేస్తున్నాడని అంతటి ఉగ్రతపాన్ని ఆచరించినవాడు ఇతః పూర్వం మరెవ్వడూ లేడని, చూడలేదని బ్రాహ్మణోత్తములైన తపోధనుల వలన ధర్మరాజు విన్నాడు. (24)
యథా ధనంజయః పార్థః తపస్వీ నియతవ్రతః ।
మునిరేకచరః శ్రీమాన్ ధర్మో విగ్రహవానివ ॥ 25
అర్జునుడు నియతవ్రతుడై తపస్సు చేస్తూ మూర్తీభవించిన ధర్మస్వరూపం వలె మునివృత్తిలో నున్నట్లు ధర్మజుడు విన్నాడు. (25)
తం శ్రుత్వా పాండవో రాజన్ తప్యమానం మహావనే ।
అన్వశోచత కౌంతేయః ప్రియం వై భ్రాతరం జయమ్ ॥ 26
మహారణ్యంలో అర్జునుడు తపమాచరిస్తూ శ్రమ పడుతున్నట్లు విన్న ధర్మజుడు ప్రీతిపాత్రుడైన తమ్మునిగూర్చి చాలా విచారించాడు. (26)
దహ్యమానేన తు హృదా శరణార్థీ మహావనే ।
బ్రాహ్మణాన్ వివిధజ్ఞానాన్ పర్యపృచ్ఛద్ యుధిష్ఠిరః ॥ 27
ధర్మరాజు దహింపబడుతున్న హృదయంతో - మహారణ్యంలో శరణార్థియై విజ్ఞులైన బ్రాహ్మణోత్తములను, తమ్ముని గూర్చి ప్రశ్నించాడు. (27)
(ప్రతిగృహ్యాక్షహృదయం కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
ఆసీద్ధృష్టమనా రాజన్ భీమసేనాదిభిర్యుతః ॥
కుంతీకుమారుడైన ధర్మరాజు అక్షహృదయాన్ని స్వీకరింది భీమసేనాదులతో కూడి సంతోషంతో ఉన్నాడు.
స్వభ్రాతౄన్ సహితాన్ పశ్యన్ కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
అపశ్యన్నర్జునం తత్ర బభువాశ్రుపరిప్లుతః ।
సంతప్యమానః కౌంతేయః భీమసేనమువాచ హ ॥
కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు తనవెంటనున్న తమ్ములతోపాటు అచట అర్జునుని చూడక కనులు చెమ్మగిల్లగా ఇలా పలికాడు.
యుధిష్ఠిర ఉవాచ
కదా ద్రక్ష్యామి వై భీమ పార్థమత్ర తవానుజమ్ ।
మత్కృతే హి కురుశ్రేష్ఠః తప్యతే దుశ్చరం తపః ॥
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
భీమా! అర్జునుడు నాకొఱకే కఠినమైన తపస్సు చేస్తున్నాడు. మీలా అర్జునుని నేనెప్పుడు చూస్తానో!
తస్యాక్షహృదయజ్ఞానమ్ ఆఖ్యాస్యామి కదా న్వహమ్ ।
స హి శ్రుత్వాక్షహృదయం సముపాత్తం మయా విభో ॥
ప్రహృష్టః పురుషవ్యాఘ్రః భవిష్యతి న సంశయః ।)
అక్షహృదయ విద్యను పొందిన నేను అర్జునునకు ఎప్పుడు చెప్పగలనో? నేను సంపాదించిన అక్షహృదయం గురించి విని అర్జునుడు అధికంగా సంతోషిస్తాడు. సందేహం లేదు.
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి బృహదశ్వగమనే ఏకోనాశీతితమోఽధ్యాయః ॥ 79
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున బృహదశ్వగమనమను డెబ్బది తొమ్మిదవ అధ్యాయము. (79)
(దాక్షిణాత్య అధికపాఠము 5 శ్లోకములు కలిపి మొత్తము 32 శ్లోకములు)