72. డెబ్బది రెండవ అధ్యాయము
నలుడు ఋతుపర్ణుని నుండి ద్యూతవిద్యారహస్యము గ్రహించుట - నలుని శరీరము నుండి కలి నిష్క్రమించుట.
బృహదశ్వ ఉవాచ
స నదీః పర్వతాంశ్చైవ వనాని చ సరాంసి చ ।
అచిరేణాతిచక్రామ ఖేచరః ఖే చరన్నివ ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు.
బాహుకుడు రథాన్ని నడుపుతూంటే, ఆకాశంలో పయనిస్తున్నట్లుగా అది నదులను, పర్వతాలను, అరణ్యాలను, సరస్సులను శీఘ్రంగా అధిగమించింది. (1)
తథా ప్రయాతే తు రథే తదా భాంగాసురిర్నృపః ।
ఉత్తరీయమధోఽపశ్యమ్ భ్రష్టం పరపురంజయః ॥ 2
రథం మహావేగంగా ప్రయానిస్తున్నప్పుడు తన భుజాన్నుండి ఉత్తరీయం జారిక్రిందపడినట్లు మహారాజు చూశాడు. (2)
తతః స త్వరమాణస్తు పటే నిపతితే తదా ।
గ్రహీష్యామీతి తం రాజా నలమహ మహామనాః ॥ 3
నిగృహ్ణీష్వ మహాబుద్ధే హయానేతాన్ మహాజవాన్ ।
వార్ ష్ణేయో యావదేనం మే పటమానయతామిహ ॥ 4
వెనువెంటనే మహారాజు, 'ఉత్తరీయం జారిక్రిందపడింది. దాన్ని తీసికొంటాను! బుద్ధిమంతుడవగు బాహుకా! పరుగులు తీయించే గుర్రాలను ఆపుచేయి. క్రిందపడిన ఉత్తరీయాన్ని ఈ వార్ష్ణేయుడు తీసికొని రావాలని' పలికాడు. (3,4)
నలస్తం ప్రత్యువాచాథ దూరే భ్రష్టః పటస్తవ ।
యోజనం సమతిక్రాంతః నాహర్తుం శక్యతే పునః ॥ 5
రథం అపుడే యోజన దూరం వచ్చేసింది. రథాన్ని ఆపినప్పటికిని, ఉత్తరీయాన్ని తీసికొనిరావటం సాధ్యంకాదని నలుడు సమాధానం చెప్పాడు. (5)
ఏవముక్తో నలేనాథ తదా భాంగాసురిర్నృపః ।
ఆససాద వనే రాజన్ ఫలవంతం బిభీతకమ్ ॥ 6
నలుడీవిధంగా చెప్పిన తర్వాత ఋతుపర్ణమహారాజు ఆ అరణ్యంలో ఫలసమృద్ధమైన ఓ తాండ్రచెట్టును సమీపించాడు. (6)
తం దృష్ట్వా బాహుకం రాజా త్వరమాణోఽభ్యభాషత ।
ఆ తాండ్రచెట్టును చూచిన ఋతుపర్ణమహారాజు బాహుకునితో తొందరగా ఇలా పలికాడు. (6)
మమాపి సుత పశ్య త్వం సంఖ్యానే పరమం బలమ్ ॥ 7
సారథీ! నాకు సంఖ్యాశాస్త్రంలో విశిష్టమైన శక్తి ఉంది. ఇది నీవు చూడాల్సిన విషయం. (7)
సర్వః సర్వం న జానాతి సర్వజ్ఞో నాస్తి కశ్చన ।
నైకత్ర పరినిష్ఠాస్తి జ్ఞానస్య పురుషే క్వచిత్ ॥ 8
అందరికీ అన్నీ తెలియవు. ఏ ఒక్కడూ సర్వజ్ఞుడు కాడు. పరాకాష్ఠనందిన జ్ఞానం ఒకనిలోనే ఉండదు. (8)
వృక్షేఽస్మిన్ యాని పర్ణాని ఫలాన్యపి చ బాహుక ।
పతితాన్యపి యాన్యత్ర తత్రైకమధికం శతమ్ ॥ 9
ఏకపత్రాధికం చాత్ర ఫలమేకం చ బాహుక ।
పంచకోట్యోఽథ పత్రాణాం ద్వయోరపి చ శాఖయోః ॥ 10
ప్రచినుహ్యస్య శాఖే ద్వే యాశ్చాప్యన్యాః ప్రశఖికాః ।
ఆభ్యాం ఫలసహస్రే ద్వే పంచోనం శతమేవ చ ॥ 11
ఈ వృక్షానికి ఆకులు, పండ్లు ఉన్నాయి.
బాహుకా! ఈ తాండ్రచెట్టు నుండి రాలిపడిన ఆకులు నూటొక్కటి, పండు ఒకటి. ఈ వృక్షానికి ఉనన్ రెండు కొమ్మలకు, ఐదుకోట్ల ఆకులున్నాయి. ఆ శాఖలకు కొన్ని ప్రశాఖలున్నాయి. ఆ రెండు శాఖలకు రెండువేల తొంభై ఐదు ఫలాలున్నాయి. (9-11)
తతో రథమవస్థాప్య రాజానం బాహుకోఽబ్రవీత్ ।
పరోక్షమివ మే రాజన్ కత్థసే శత్రుకర్శన ॥ 12
ప్రత్యక్షమేతత్ కర్తాస్మి శాతయిత్వా బిభీతకమ్ ।
అథాత్ర గణితే రాజన్ విద్యతే న పరోక్షతా ॥ 13
ప్రత్యక్షం తే మహారాజ శాతయిష్యే బిభీతకమ్ ।
అహం హి నాభిజానామి భవేదేవం న వేతి వా ॥ 14
అప్పుడు బాహుకుడు రథాన్ని ఆపి మహారాజుతో ఇలా పలికాడు. 'మీరు చెప్పింది నాకు పరోక్షంగానే ఉంది. ఈ తాండ్రవృక్షం విషయంలో మీరు చెప్పినదాన్ని బట్టి లెక్కించి దానిని ప్రత్యక్షం చేస్తాను.
మహారాజా! తాండ్రచెట్టు విషయంలో మీరు తెల్పిన సంఖ్యలను లెక్కించనిదే సరియైనదో కాదో నాకు తెలియదు కదా! (12-14)
సంఖ్యాస్యామి ఫలాన్యస్య పశ్యతస్తే జనాధిప ।
ముహూర్తమపి వార్ ష్ణేయః రశ్మీన్ యచ్ఛతు వాజినామ్ ॥ 15
ఫలాలను లెక్కించి చూస్తాను. రాజా! ఒక్కముహూర్తకాలం ఈ కళ్ళాలను వార్ష్ణేయుడు పట్టుకొంటాడు. (15)
తమబ్రవీన్నృపః సూతం నాయం కాలో విలంబితుమ్ ।
బాహుకస్త్వబ్రవీదేనం పరం యత్నం సమాస్థితః ॥ 16
ప్రతీక్షస్వ ముహూర్తం త్వమ్ అథవా త్వరతే భవాన్ ।
ఏష యాతి శివః పంథాః యాహి వార్ ష్ణేయసారథిః ॥ 17
ఆలస్యం చేయటానికి తగిన సమయం కాదని, బాహుకునితో ఋతుపర్ణుడన్నాడు. అంత బాహుకుడు మహారాజు ఋతుపర్ణునితో ఇలా అన్నాడు. 'ఉత్కృష్టమైన ప్రయత్నం జరుగుతోంది. ముహూర్తకాలం వేచి చూడండి. కాదని త్వరపడితే మీరు వార్ష్ణేయుని సారథిగా తీసుకొని వెళ్లండి. మీకు శుభమగుగాక. అన్నాడు. (16,17)
అబ్రవీదృతుపర్ణస్తు సాంత్వయన్ కురునందన ।
త్వమేవ యంతా నాన్యోఽస్తి పృథివ్యామపి బాహుక ॥ 18
ధర్మరాజా! ఋతుపర్ణుడు బాహుకుని ఊరడిస్తూ 'నీవే సారథ్యం వహించాలి. ఈ భూతలంలో సారథ్యం చేసే విషయంలో నీకు సాటి ఎవ్వరూ లేరు. (18)
త్వత్కృతే యాతుమిచ్చామి విదర్భాన్ హయకోవిద ।
శరణం త్వాం ప్రపన్నోఽస్మి న విఘ్నం కర్తుమర్హసి ॥ 19
నీ సారథ్యంతోనే నేను విదర్భదేశాన్ని చేరాలి - ప్రపత్తితో నిన్ను శరణువేడుతున్నాను. విఘ్నాన్ని కలుగచేయవద్దు. (19)
కామం చ తే కరిష్యామి యన్మాం వక్ష్యసి బాహుక ।
విదర్భాన్ యది యాత్వాద్య సూర్యం దర్శయితాపి మే ॥ 20
బాహుకా! నీవు చెప్పినట్లే చేస్తాను. తెల్లవారేసరికి విదర్భ చేరాలి. సూర్యుని నాకు చూపించాలి.' అన్నాడు. (20)
అథాబ్రవీద్ బాహుకస్తం సంఖ్యాయ చ బిభీతకమ్ ।
తతో విదర్భాన్ యాస్యామి కురుష్వైవం వచో మమ ॥ 21
తాని (తాండ్ర) పండ్లను లెక్కించిన వెంటనే విదర్భకు చేరగలం. నామాటను మన్నింపుడని బాహుకుడు ఋతుపర్ణునితో పలికాడు. (21)
అకామ ఇవ తం రాజా గణయస్వేత్యువాచ హ ।
ఏకదేశం చ శాఖాయాః సమాదిష్టం మయానఘ ॥ 22
గణయస్వాశ్వతత్త్వజ్ఞ తతస్త్వం ప్రీతిమావహ ।
సోఽవతీర్య రథాత్ తూర్ణం శాతయామాస తం ద్రుమమ్ ॥ 23
తనకు ఇష్టం లేనట్లు ఋతుపర్ణమహారాజు బాహుకునితో "కొమ్మలో కొంతభాగం లెక్కించి చెప్పి ప్రీతిచెందు" అన్నాడు. అంతట బాహుకుడు రథం దిగి ఆ చెట్టును నరికాడు. (22,23)
తతః స విస్మయావిష్టః రాజానమిదమబ్రవీత్ ।
గణయిత్వా యథోక్తాని తావంత్యేవ ఫలాని తు ॥ 24
బాహుకుడు పండ్లను లెక్కించి మహారాజు చెప్పినవిధంగానే పండ్లు ఉండటాన్ని చూచి ఆశ్చర్యచకితుడై ఋతుపర్ణమహారాజుతో ఇట్లన్నాడు. (24)
అత్యద్భుతమిదం రాజన్ దృష్టవానస్మి తే బలమ్ ।
శ్రోతుమిచ్ఛామి తాం విద్యాం యయైతద్ జ్ణాయతే నృప ॥ 25
తమువాచ తతో రాజా త్వరితో గమనే నృప ।
విద్ధ్యక్షహృదజ్ఞం మాం సంఖ్యానే చ విశారదమ్ ॥ 26
మహారాజా! ఇది అత్యద్భుతమైంది. మీ విద్యాబలాన్ని ప్రత్యక్షంగా చూశాను. మీరు ఏ విద్యతో సంఖ్యను చెప్పగలుగుతున్నారో, ఆవిద్యను గూర్చి వినగోరుతున్నాను. అని బాహుకుడు అడిగాడు.
మహారాజు ప్రయాణాన్ని తొందరచేస్తూనే, ఆవిద్యపేరు, అక్షహృదయమనీ, తనను సంఖ్యా విశారదునిగా అక్షహృదయజ్ఞునిగా గ్రహించమనీ చెప్పాడు. (25,26)
బాహుకస్తమువాచాథ దేహి విద్యామిమాం మమ ।
మత్తోఽపి చాశ్వహృదయం గృహాణ పురుషర్షభ ॥ 27
అంతట బాహుకుడు, మహారాజుతో - "పురుషశ్రేష్ఠుడవైన ఋతుపర్ణమహారాజా! అక్షహృదయవిద్యను నాకు అనుగ్రహించు. నా వలన అశ్వహృదయవిద్యను నీవు గ్రహించు" - అని పలికాడు. (27)
ఋతుపర్ణస్తతో రాజా బాహుకం కార్యగౌరవాత్ ।
హయజ్ఞానస్య లోభాచ్చ తం తథేత్యబ్రవీద్ వచః ॥ 28
ఋతుపర్ణమహారాజు కార్యభారం వల్లనూ, అశ్వహృదయవిద్యను పొందాలనే ఆశవల్లనూ, బాహకుని కోర్కెను అంగీకరించాడు. (28)
యథోక్తం త్వం గృహాణేదమ్ అక్షాణాం హృదయం పరమ్ ।
నిక్షేపో మేఽశ్వహృదయం త్వయి తిష్ఠతు బాహుక ।
ఏవముక్త్వా దదౌ విద్యామ్ ఋతుపర్ణో నలాయ వై ॥ 29
బాహుకా! నీవుకోరినట్లే, అక్షహృదయవిద్యను నీవు గ్రహించు. అశ్వహృదయవిద్యను నాకు ప్రసాదించు - అని పలికి ఋతుపర్ణుడు అక్షహృదయవిద్యను బాహుకునకు ఉపదేశించాడు. (29)
తస్యాక్షహృదయజ్ఞస్య శరీరాన్నిఃసృతః కలి ।
కర్కోటకవిషం తీక్ష్ణం ముఖాత్ సతతముద్వమన్ ॥ 30
కలేస్తస్య తదార్తస్య శాపాగ్నిః స వినిఃసృతః ।
స తేన కర్శితో రాజా దీర్ఘకాలమనాత్మవాన్ ॥ 31
కర్కోటక విషాన్ని మాటిమాటికి నోటి నుండి క్రక్కుతూ కలి అషహృదయ విద్యను గ్రహించిన నలుని శరీరం నుండి బయట పడ్డాడు. అప్పుడు విషరూపమయిన కలిశాపాగ్ని కూడా బయటపడింది. ఆ కలి పెట్టిన బాధవల్లనే అంతవరకు నలుడు కర్తవ్యమూఢుడయ్యాడు. (30,31)
తతో విషవిముక్తాత్మా స్వం రూపమకరోత్ కలిః ।
తం శప్తుమైచ్ఛత్ కుపితః నిషధాధితిర్నలః ॥ 32
విషవిముక్తుడైన కలి స్వస్వరూపాన్ని పొందాడు. దాంతో విషయాన్నంతా అర్థంచేసికొన్న నలమహారాజు కోపంతో కలిపురుషుని శపింపబోయాడు. (32)
తమువాచ కలిర్భీతః వేపమానః కృతాంజలిః ।
కోపం సంయచ్ఛ నృపతే కీర్తిం దాస్యామి తే పరామ్ ॥ 33
అపుడు కలి చేతులు జోడించాడు. వణకిపోయాడు. భయపడిపోతూ ఇలా అన్నాడు - మహారాజా! కోపాన్ని నిగ్రహించుకోండి! మీకు అపారమైన కీర్తిని కలుగజేస్తాను. (33)
ఇంద్రసేనస్య జననీ కుపితా మాఽశపత్ పురా ।
యదా త్వయా పరిత్యక్తా తతోఽహం భృశపీడితః ॥ 34
నీ చే విడిచిపెట్టబడిన ఇంద్రసేనుని తల్లి నీపై కోపం కల్గినా నిన్ను శపించలేదు. కాని ఆమె శాపముచేత నీ శరీరమందుండి నేను మిక్కిలి బాధ పొందాను. (34)
అవసం త్వయి రాజేంద్ర సుదుఃఖమపరాజిత ।
విషేణ నాగరాజస్య దహ్యమానో దివానిశమ్ ॥ 35
నేను నీ శరీరంలో ఉన్నప్పుడు చాలా దుఃఖాన్ని పొందాను. నాగరాజైన తక్షకుని కాటుచే నిన్నుపొందిన విషం నీలోనున్న నన్ను రాత్రింబవళ్ళూ దహించింది. (35)
శరణం త్వాం ప్రపన్నోఽస్మి శృణు చేదం వచోమమ ।
యే చ త్వాం మనుజా లోకే కీర్తయిష్య త్యతంద్రితాః ।
మత్ప్రసూతం భయం తేషాం న కదాచిద్ భవిష్యతి । 36
భయార్తం శరణం యాతం యది మాం త్వం న శప్స్యసే ।
ఏవముక్తో నలో రాజా న్యయచ్ఛత్ కోపమాత్మనః ॥ 37
నేనిపుడు నిన్ను శరణు పొందాను. నామాట విను. శరణుపొందిన నన్ను నీవు శపించకుండా ఉన్నట్లయితే లోకంలో నిన్ను కీర్తించే మనుజులకు నా వలన ఏ భయమూ ఉండదు - అని కపిపురుషుడు పలికిన పిదప నలుడు తన కోపాన్ని మరల్చుకొన్నాడు. (36,37)
శ్లో. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ।
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్ ॥ - భారతం
తతో భీతః కలిః క్షిప్రం ప్రవివేశ బిభీతకమ్ ।
కలిస్త్వన్యైస్తదాదృశ్యః కథయన్ నైషధేన వై ॥ 38
భయపడిన కలి వెంటనే తాండ్రచెట్టులో ప్రవేశించి అందరికీ అదృశ్యమైపోయాడు. (38)
తతో గతజ్వరో రాజా నైషధః పరవీరహా ।
సంప్రణష్టే కలౌ రాజా సంఖ్యాయాస్య ఫలాన్యుత ॥ 39
ముదా పరమయా యుక్తః తేజసాథ పరేణ వై ।
రథమారుహ్య తేజస్వీ ప్రయయౌ జవనైర్హయైః ॥ 40
ఆ తాండ్రచెట్టుకు గల ఫలాలను లెక్కించి కలిదోషం తొలగి, విగతజ్వరుడైన నలుడు - తేజస్వియై సమధికోత్సాహంతో రథాన్ని అధిరోహించి బయలుదేరాడు. (39,40)
బిభీతకశ్చాప్రశస్తః సంవృత్తః కలిసంశ్రయాత్ ।
హయోత్తమానుత్పతతఆఆ ద్విజానివ పునః పునః ॥ 41
నలః సంచోదయామాస ప్రహృష్టేనాంతరాత్మనా ।
విదర్భాభిముఖో రాజా ప్రయయౌ స మహాయశాః ॥ 42
కలిపురుషుడు తనలో ప్రవేశించటం వలన నాటి నుండి తాండ్రచెట్టు అపఖ్యాతిని పొందింది.
నలుడు రథాన్ని నడుపుతూంటే గుర్రాలు పక్షుల్లా ఆకాశంలో ఎగురుతున్నాయి. నలమహారాజు సంతుష్టాంతరంగుడై విదర్భదేశంవైపు పయనం సాగించాడు. (41,42)
నలే తు సమతిక్రాంతే కలిరప్యగమద్ గృహమ్ ।
తతో గతజ్వరో రాజా నలోఽభూత్ పృథివీపతిః ।
విముక్తః కలినా రాజన్ రూపమాత్రవియోజితః ॥ 43
నలుడు నిష్ర్కమించగానే కలి కూడా ఇంటికి వెళ్ళాడు. రాజా! కలి విడవగానే నలుని చింత తొలగిపోయింది. రూపం మాత్రం అలాగే ఉండిపోయింది. (43)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి కలినిర్గమే ద్విసప్తతితమోఽధ్యాయః ॥72 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున కలినిర్గమమను డెబ్బది రెండవ అధ్యాయము. (72)