65. అరువది ఐదవ అధ్యాయము
దమయంతి చేదిరాజగృహమును చేరుట.
బృహదశ్వ ఉవాచ
సా తచ్ఛ్రుత్వానవద్యాంగీ సార్థవాహవచస్తదా ।
జగామ సహ తేనైవ సార్థేన పతిలాలసా ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు -
భర్తమీది ఆసక్తితో ఆ దమయంతి సార్థవాహుని మాటలను విని వారితో కలసి వెళ్ళింది. (1)
అథ కాలే బహుతిథే వనే మహతి దారుణే ।
తడాగం సర్వతోభద్రం పద్మసౌగంధికం మహత్ ॥ 2
దదృశుర్వణిజో రమ్యం ప్రభూతయవసేంధనమ్ ।
బహుపుష్పఫలోపేతం నానాపక్షినిషేవితమ్ ॥ 3
దారుణారణ్యంలో పయనిస్తున్న ఆ వ్యాపారులు కొన్ని రోజుల తర్వాత పద్మపరిమళాలతో, రకరకాల పుష్పాలతో, నానావిధపక్షులతో కూడిన మంగళకరమైన ఒక పెద్ద చెఱువును చూశారు. (2,3)
నిర్మలస్వాదుసలిలం మనోహారి సుశీతలమ్ ।
సుపరిశ్రాంతవాహాస్తే నివేశాయ మనో దధుః ॥ 4
స్వచ్ఛమై, మనోహరమైన చల్లని తీయని ఆ తటాకోదకము అలసిపోయిన ఆ వ్యాపారులకు అచట కొంతసేపు ఆగాలనే కోరకను కల్గించింది. (4)
సమ్మతే సార్థవాహస్య వివిశుర్వనముత్తమమ్ ।
ఉవాస సార్థః సుమహాన్ వేలామాసాద్య పశ్చిమామ్ ॥ 5
సార్థవాహులందరూ తమ మనోభావాలకు అనుకూలంగా ఆ చెరువు పడమటి ఒడ్డునకు చేరి అచటనే విశ్రమించారు. (5)
అథార్ధరాత్రసమయే నిఃశబ్దస్తిమితే తదా ।
సుప్తే సార్థే పరిశ్రాంతే హస్తియూథముపాగమత్ ॥ 6
పానీయార్థం గిరినదీం మదప్రస్రవణావిలామ్ ।
అథాపశ్యత సార్థం తం సార్థజాన్ సుబహూన్ గజాన్ ॥ 7
అలసిపోయిన ఆ వ్యాపారులంతా గాఢ నిద్రలోనున్న అర్థరాత్రివేళ ఏనుగుల గుంపొకటి ఆ చెరువు నీరు త్రాగడానికై వచ్చి, ఏనుగులమదస్రావంతో కలుషితమైన ఆ జలాన్ని చూచి, ఆ సమీపంలోనే ఉన్న సార్థవాహసమూహానికి సంబంధించిన ఏనుగుల గుంపును చూసింది. (6,7)
తే తాన్ గ్రామ్యగజాన్ దృష్ట్వ్ సర్వే వనగజాస్తదా ।
సమాద్రవంత వేగేన జిఘాంసంతో మదోత్కటాః ॥ 8
మదించిన ఆ అడవిఏనుగులు, వ్యాపారుల ఏనుగులను చూసి, వాటిని చంపాలనే కోర్కెతో వెనువెంటనే వాటిపైకి ఉరికాయి. (8)
తేషామాపతతాం వేగః కరిణాం దుఃసహోఽభవత్ ।
నగాగ్రాదివ శీర్ణానాం శృంగాణాం పతతాం క్షితౌ ॥ 9
అతివేగంగా విరుచుకుపడ్డ ఆ అడవిఏనుగుల గుంపు కొండశిఖరాలు విరిగి క్రిందపడుతున్నట్లు భరింపరాని దయింది. (9)
స్పందతామపి నాగానాం మార్గా నష్టా వనోద్భవాః ।
మార్గం సంరుధ్య సంసుప్తం పద్మిన్యాః సార్థముత్తమమ్ ॥ 10
ఎదురు తిరగటానికి స్పందించిన వ్యాపారుల ఏనుగులకు అడవి ఏనుగులు దారిలేకుండా చేశాయి. సరోవరతీరాన దారికడ్డంగా సార్థవాహసమూహం పరుండి నిద్రిస్తోంది. (10)
తే తం మమర్దుః సహసా చేష్టమానం మహీతలే ।
హాహాకారం ప్రముంచంతః సార్థికాః శరణార్థినః ॥ 11
నిద్రించేవారు మేల్కొనేలోపలే వారినందరినీ త్రొక్కివేస్తుంటే వారంతా హాహాకారాలు చేశారు. (11)
వనగుల్మాంశ్చ ధావంతః నిద్రాంధా బహవోఽభవన్ ।
కేచిద్ దంతైః కరైః కేచిత్ పద్భ్యాం హతా గజైః ॥ 12
నిద్రమత్తులో అడవిపొదలను దాటుతూ, పరుగెడుతున్న ఆ సార్థవాహులలో కొందరు అడవి ఏనుగుల కాళ్ళక్రిందపడి నలిగి మరణించారు. మరికొందరు ఆ ఏనుగులతొండాలకు చిక్కి చనిపోయారు. ఇంకొందరు ఆ ఏనుగుల దంతపు పోట్లకు మరణించారు. (12)
విహతోష్ట్రాశ్వబహులాః పదాతిజనసంకులాః ।
భయాదాధావమానాశ్చ పరప్సరహతాస్తదా ॥ 13
ఘోరాన్ నాదాన్ విముంచంతః నిపేతుర్ధరణీతలే ।
వృక్షేష్వారుహ్య సంరబ్ధాః పతితా విషమేఘ చ ॥ 14
ఆ అడవి ఏనుగుల విజృభణ వల్ల సార్థవాహులకు సంబంధించిన ఒంటెలు, గుర్రాలు, పదాతిజనాలు భయంతో పరుగులు తీస్తూ ఒకరినొకరు తగిలి మరణించారు. ప్రాణరక్షణకై చెట్లెక్కిన వారిలో కొందరు తొందరలో ఎగుడు దిగుడుగానున్న వృక్షాలమీద నుండి పడిపోయారు. (13,14)
ఏవం ప్రకారైర్బహుభిః దైవేనాక్రమ్య హస్తిభిః ।
రాజన్ వినిహతం సర్వం సమృద్ధం సార్థమండలమ్ ॥ 15
ధర్మరాజా! ఈ ప్రకారంగా ఆ అడవిఏనుగుల ఆక్రమణతో సర్వవస్తుసమృద్ధమైన ఆ వ్యాపారుల సమూహమంతా సర్వనాశనమయింది. (15)
ఆరావః సుమహాంశ్చాసీత్ త్రైలోక్యభయకారకః ।
ఏషోఽగ్నిరుత్థితః కష్టః త్రాయధ్వం ధ్వావతాధునా ॥ 16
రత్నరాశిర్విశీర్ణోఽయం గృహ్నీధ్వం కిం ప్రధావత ।
ఈ విధ్వంసకాండకు భయపడిన సార్థవాహులు ముల్లోకాలు భయపడేలా పెడబొబ్బలు పెట్టారు. చెల్లాచెదరైన రత్నరాసులకాంతి పైకెగసి మంటవలె కన్పించి రక్షించండి అని అరుస్తూ పరుగులు తీశారు. రత్నరాసులను వదలి పరుగులెత్తుతున్నారెందుకని కొందరు కేకలువేశారు. (16 1/2)
సామాన్యమేతద్ ద్రవిణం న మిథ్యావచనం మమ ॥ 17
అవన్నీ ధనరాశులు, రత్నరాశులే! నామాటలు అసత్యాలు కావు. అన్నాడొకడు. (17)
ఏవమేవాభిభాషంతో విద్రవంతి భయాత్ తదా ।
పునరేవాభిధాస్యామి చింతయధ్వం సుకాతరాః ॥ 18
మరొకడు "మళ్ళీ మాటాడుతూ. మీ గురించి ఆలోచించుకోండి" అని ఆక్రోశించాడు. ఈ విధంగా వారంతా భయపడి అరుచుకొంటూ పారిపోయారు. (18)
తస్మింస్తథా వర్తమానే దారుణే జనసంక్షయే ।
దమయంతీ చ బుబుధే భయసంత్రస్తమానసా ॥ 19
జరుగుచున్న దారుణమారణకాండకు భయభ్రాంతయైన దమయంతి లేచి విషయాన్నంతా తెలిసికొంది. (19)
అపశ్యద్ వైశసం తత్ర సర్వలోకభయంకరమ్ ।
అదృష్టపూర్వం తద్ దృష్ట్వా బాలా పద్మనిభేక్షణా ॥ 20
సంసక్తవదనాశ్వాసా ఉత్తస్థౌ భయవిహ్వలా ।
యే తు తత్ర వినిర్ముక్తాః సార్థాత్ కేచిదవిక్షతాః ॥ 21
తేఽబ్రువన్ సహితాః సర్వే కస్యేదం కర్మణః ఫలమ్ ।
నూనం న పూజితోఽస్మాభిః మణిభద్రో మహాయశాః ॥ 22
తథా యక్షాధిపః శ్రీమాన్ న వై వైశ్రవణః ప్రభుః ।
న పూజా విఘ్నకర్తౄణామ్ అథవా ప్రథమం కృతా ॥ 23
శకునానాం ఫలం వాథ విపరీతమిదం ధ్రువమ్ ।
గ్రహా న విపరీతాస్తు కిమన్యదిదమాగతమ్ ॥ 24
మున్నెన్నడు చూడని అతిలోకభయంకరమైన ఆ మారణకాండను చూచి భయవిహ్వలురాలై దమయంతి అక్కడి నుండి లేచింది. ఆ ప్రమాదంలోంచి బ్రతికి బయటపడ్డ వారిలో కొందరు ఈ విధంగా అన్నారు.
'ఈవిధంగా ఎందుకు జరిగింది? ఏ కర్మఫలమిది? యక్షాధిపుడైన మణిభద్రుని మనం పూజింపలేదు. అదేవిధంగా యక్షరాజైన కుబేరుని కూడ మనం పూజించలేదు. విఘ్నకారకులైన దేవతలను ముందుగా పూజించలేదు.
ఈ విపరీతాలన్నీ శకునాలఫలాలేనేమో! గ్రహాల విపరీత గమనమే లేకుంటే ఈవిధంగా జరుగదు. (20-24)
అపరే త్వబ్రువన్ దీనాః జ్ఞాతిద్రవ్యవినాకృతాః ।
యాసావద్య మహాసార్థే నారీ హ్యున్మత్తదర్శనా ॥ 25
ప్రవిష్టా వికృతాకారా కృత్వా రూపమమానుషమ్ ।
తయేయం విహితా పూర్వం మాయా పరమదారుణా ॥ 26
మరికొందరీ విధంగా భావిస్తున్నారు. ఉన్మాదిని వలె కనిపిస్తూ వికృతరూపమూ అమానుషరూపమూ గల ఈ స్త్రీ మనగుంపు వద్దకు చేరింది. ఈ జరిగిన దారుణమంతా ఆమె మాయయేనేమో! - అని. (25,26)
రాక్షసీ వా ధ్రువం యక్షీ పిశాచీ వా భయంకరీ ।
తస్యాః సర్వమిదం పాపం నాత్ర కాఱ్యా విచారణా ॥ 27
పశ్యామో యది తాం పాపాం సార్థఘ్నీం నైకదుఃఖదామ్ ।
లోష్టభిః పాంసుభిశ్చైవ తృణైః కాష్ఠైశ్చ ముష్టిభిః ॥ 28
అవశ్యమేవ హన్యామః సార్థస్య కిల కృత్యకామ్ ।
ఆమె నిజంగా రాక్షసియా! భయంకరమైన యక్షిణీపిశాచమా! జరిగిన ఈ పాపకృత్యమంతా ఆమె పనియే! ఇందులో ఆలోచించాల్సిందేమీ లేదు. సార్థవాహసర్వస్వాన్ని నాశనం చేసిన ఆమె కన్పిస్తే కర్రలతో, రాళ్ళతో, పిడికిళ్ళతో కొట్టి చంపుదాం - అని కొందరు అంటున్నారు. (27,28 1/2)
దమయంతీ తు తచ్ఛ్రుత్వా వాక్యం తేషాం సుదారుణమ్ ॥ 29
హ్రీతా భీతా చ సంవిగ్నా ప్రాద్రవద్ యత్ర కాననమ్ ।
ఆశంస మానా తత్పాపమ్ ఆత్మానం పర్యదేవయత్ ॥ 30
దమయంతి సార్థవాహబృందంలోని వారిమాటలను విని ఒకవైపు సిగ్గు, మరోవైపు భయాన్ని పొంది అడవి వైపు పరుగెత్తింది. జరిగిన దారుణ పాపకృత్యం తనపై పడనున్నట్లు భావించి విలపించింది. (29,30)
అహో మమోపరి విధేః సంరంభో దారుణో మహాన్ ।
నానుబధ్నాతి కుశలం కస్యేదం కర్మణః ఫలమ్ ॥ 31
ఆహా! చాలా ఆశ్చర్యంగా ఉంది. నాపై విధి దారుణంగా ఉంది. ఎక్కడా మంచి జరగటం లేదు. ఇది ఏకర్మఫలమో? (31)
న స్మరామ్యశుభం కించిత్ కృతం కస్యచిదణ్వపి ।
కర్మణా మనసా వాచా కస్యేదం కర్మణః ఫలమ్ ॥ 32
మనస్సుతోగాని, చేతతోగాని, వాక్కుతోగాని, ఎవరికీ ఏ కొద్దిపాటి చెడునైనా చేయాలని నేను తలచలేదు. ఇదంతా ఏ కర్మఫలమో అని దమయంతి భావించింది. (32)
నూనం జన్మాంతరకృతం పాపమాపతితం మహత్ ।
అపశ్చిమామిమాం కష్టామ్ ఆపదం ప్రాప్తవత్యహమ్ ॥ 33
గతజన్మలో చేసిన మహాపాపం వల్లనే చేయని నేరానికి ఈవిధమైన కూడదీసుకో లేని కష్టాన్ని పొందానని భావించింది. (33)
భర్తృరాజ్యాపహరణం స్వజనాచ్చ పరాజయః ।
భర్ర్తా సహ వియోగశ్చ తనయాభ్యాం చ విచ్యుతిః ॥ 34
స్వజనుల చేతిలోనే పరాజయంపొంది తనభర్త రాజ్యాన్ని కోల్పోవటం, భర్తృవియోగాన్ని అనుభవించటం, కన్నబిడ్డలతో వియోగం - ఇవన్నీ పాపఫలితాలే! (34)
నిర్నాథతా వనే వాసః బహువ్యాలనిషేవితే ।
అనేకసర్పాలకు నివాసమైన ఈ అరణ్యంలో దిక్కులేని దాననుగా ఉండటం కూడ పాపఫలితమే.
అథాపరేద్యుః సంప్రాప్తే హతశిష్టా జనాస్తదా ॥ 35
దేశాత్ తస్మాద్ వినిష్క్రమ్య శోచంతే వైశసం కృతమ్ ।
భ్రాతరం పితరం పుత్రం సఖాయం చ నరాధిప ॥ 36
ధర్మరాజా! మరణించగా మిగిలిన సార్థవాహులు, మరునాడు ఆ ప్రదేశాన్నుండి బయలుదేరి ఒకవైపు జరిగిన దారుణ మారణకాండను, మరొకవైపు పోగొట్టుకొన్న తమవారిని మిత్రులను గూర్చి విచారించారు. (35,36)
అశోచత్ తత్ర వైదర్భీ కిం ను మే దుష్కృతం కృతమ్ ।
యోఽపి మే నిర్జనేఽరణ్యే సంప్రాప్తోఽయం జనార్ణవః ॥ 37
స హతో హస్తియూథేన మందభాగ్యాన్మమైన తత్ ।
ప్రాప్తవ్యం సుచిరం దుఃఖం నూనమద్యాపి వై మయా ॥ 38
తానేమైనా పాపం చేశానా అని దమయంతి ఆలోచించింది. నిర్జనారణ్యంలో జనసమూహం ప్రాప్తించడం ఏమిటి? వారంతా గజయూథంతో చచిపోవడం ఏమిటి? నా దురదృష్టం వల్ల ఇదంతా జరిగిందా? ఎపుడో పొందవలసిన దుఃఖం ఇపుడు నాకారణంగా వచ్చి ఉంటుంది. (37,38)
నా ప్రాప్తకాలో మ్రియతే శ్రుతం వృద్ధానుశాసనమ్ ।
యా నాహమద్య మృదితా హస్తియూథేన దుఃఖితా ॥ 39
ఏ జివి కూడా, కాలం ప్రాప్తించనిదే మరణించదని పెద్దలు చెప్పగా విన్నాను. అందుకే ఏనుగుల గుంపుచే నేను చనిపోకుండా మిగిలాను. (39)
న హ్యదైవకృతం కించిత్ నరాణామిహ విద్యతే ।
న చ మే బాలభావేఽపి కించిత్ పాపకృతం కృతమ్ ॥ 40
కర్మణా మనసా వాచా యదిదం దుఃఖమాగతమ్ ।
లోకంలో మానవుల విషయంలో దైవకృతం కానిది ఏకొంచెం కూడ లేదు. పసితనంలో కూడ ఏ కొద్దిపాపమూ మనసా, వాచా, కర్మణా నేను చేసి యుండలేదే! నేనెందుకు ఇంతటి దుఃఖాన్ని పొందాను? (40 1/2)
మన్యే స్వయంవరకృతే లోకపాలాః సమాగతాః ॥ 41
ప్రత్యాఖ్యాతా మయా తత్ర నలస్యార్థాయ దేవతాః ।
నూనం తేషాం ప్రభావేణ వియోగం ప్రాప్తవ త్యహమ్ ॥ 42
ఏవమాదీని దుఃఖార్తా సా విలప్య వరాంగనా ।
ప్రలాపాని తదా తాని దమయంతీ పతివ్రతా ॥ 43
నా స్వయంవరానికి వచ్చిన లోకపాలురను నేను తిరస్కరించి నలుని చేసుకొన్నాను గదా! బహుశః దేవతల ప్రభావంచేతనే ఇలా జరిగిందా?
ఈవిధంగా తనమనస్సులో భావించుకొని, తనలో తానే మాట్లాడుకొంటూనే ఏడుస్తూ బాధపడింది దమయంతి. (41-43)
హతశేషైః సహ తదా బ్రాహ్మణైర్వేదపారగైః ।
అగచ్ఛద్ రాజశార్దూల చంద్రలేఖేన శారదీ ॥ 44
గచ్ఛంతీ సాచిరాద్ బాలా పురమాసాదయన్మహత్ ।
సాయాహ్నే చేదిరాజస్య సుబాహోః సత్యదర్శినః ॥ 45
ధర్మరాజా! మరణించగా మిగిలిన కొందరితోను, వేదపారగులైన బ్రాహ్మణులతోను కలసి శరత్కాలపు చంద్రలేఖవలె నడుస్తూనే సాయంసమయానికి సత్యదర్శియైన సుబాహుని యొక్క పురం చేరింది. (44,45)
అథ వస్త్రార్ధసంవీతా ప్రవివేశ పురోత్తమమ్ ।
తాం విహ్వ్హలాం కృశాం దీనాం ముక్తకేశీమమార్జితాం ॥ 46
సగం చీరనే ధరించిన దమయంతి వారితోబాటు ఆ పట్టణంలో ప్రవేశించింది. మనసు చెదరి కృశించి, విడివడిన జుట్టుతో, స్నానం లేకుండా అక్కడకు చేరింది. (46)
ఉన్మత్తామివ గచ్ఛంతీం దదృశుః పురవాసినః ।
ప్రవిశంతీ తు తాం దృష్ట్వా చేదిరాజపురీం తదా ॥ 47
అనుజగ్ముస్తత్ర బాలాః గ్రామిపుత్రాః కుతూహలాత్ ।
సా తైః పరివృతాగచ్ఛత్ సమీపం రాజవేశ్మనః ॥ 48
పిచ్చెక్కిన దానిలా పురంలోకి వెళుతున్న ఆమెను చేదిరాజపురవాసులు చూశారు. పల్లెటూరి పిల్లలు ఉత్సాహంతో ఆమెను చుట్టుముట్టారు. అలాగే ఆమె రాజగృహం వరకు వచ్చింది. (47,48)
తాం ప్రాసాదగతాపశ్యద్ రాజమాతా జనైర్వృతామ్ ।
ధాత్రీమువాచ గచ్ఛైనామ్ ఆనయేహ మమాంతికమ్ ॥ 49
జనంచే చుట్టబడిన దమయంతిని మేడపైనుండి రాజమాత చూసి పరిచారికతో ఇలా అన్నది - "వెళ్ళు, ఆమెను నా దగ్గరకు తీసికొనిరా! (49)
జనేన క్లిశ్యతే బాలా దుఃఖితా శరణార్థినీ ।
తాదృగ్ రూపం చ పశ్యామి విద్యోతయతి మే గృహమ్ ॥ 50
ఈమె శరణార్థిని. ప్రజలవలన ఇబ్బందిపడుతోంది. ఈమె రూపాన్ని చూస్తుంటే నా ఇల్లంతా వెలుగు నింపుతుందనిపిస్తోంది. (50)
ఉన్మత్తవేషా కల్యాణీ శ్రీరివాయతలోచనా ।
సా జనం వారయిత్వా తం ప్రాసాదతలముత్తమమ్ ॥ 51
ఆరోప్య విస్మితా రాజన్ దమయంతీమపృచ్ఛత ।
ఏవమప్యసుఖావిష్టా బిభర్షి పరమం వపుః ॥ 52
ఉన్మత్తవేషంతో ఉన్న ఆమె లక్ష్మి వలె విశాలమైన కనులు కలది. దాది మూగి ఉన్న జనులను వారించి దమయంతిని మేడపైకి తీసికొని పోయింది. రాజమాత ఆశ్చర్యంతో దమయంతి నిలా అడిగింది. (51,52)
భాసి విద్యుదివాభ్రేషు శంస మే కాసి కస్య వా ।
న హి తే మానుషం రూపం భూషణైరపి వర్జితమ్ ॥ 53
అసహాయా నరేభ్యశ్చ నోద్విజస్యమరప్రభే ।
'మబుల్లో మెరుపులా ప్రకాశిస్తున్నావు. ఎవ్వరిదానవో తెల్పు. అలంకారాలు లేకున్నా నీరూపం దివ్యంగా ఉంది. దివ్యతేజోవతీ! నిస్సహాయ స్థితిలో కూడా నీవెవ్వరికీ భయపడటం లేదు. (53 1/2)
తచ్ఛ్రుత్వా వచనం తస్యాః భైమీ వచనమబ్రవీత్ ॥ 54
రాజమాత మాటలను విని దమయంతి ఇలా పలికింది. (54)
మానుషీం మాం విజానీహి భర్తారం సమనువ్రతామ్ ।
సైరంధ్రీజాతిసంపన్నాం భుజిష్యాం కామవాసినీమ్ ॥ 55
భర్తనే అనుసరించుకొనియుండే మనుష్యస్త్రీగా నన్ను గ్రహించు. సైరంధ్రీజాతి సంపన్నను. స్వేచ్ఛగా నివసిస్తాను. (55)
ఫలమూలాశనామేకాం యత్ర సాయంప్రతిశ్రయామ్ ।
అసంఖ్యేయగుణో భర్తా మాం చ నిత్యమనువ్రతః ॥ 56
అసంఖ్యాక సుగుణాలు కలిగిన నాభర్త ఫలాలు, కందమూలాలు తినే నన్ను ఎల్లప్పుడు అనుసరించే ఉంటాడు. సాయంకాలానికి నేనూ గృహం చేరుతాను. (56)
భక్తాహమపి తం వీరం ఛాయేవానుగతా పథి ।
తస్య దైవాత్ ప్రసంగోఽభూత్ అతిమాత్రం సుదేవనే ॥ 57
నేను కూడ నాభర్తయంది భక్తికల్గి, ఆ వీరుని నీడవలె అనుసరిస్తాను. విధివశాన నాభర్త జూదమాడవలసి వచ్చింది. (57)
ద్యూతే స నిర్జితశ్చైవ వనమేక ఉపేయువాన్ ।
తమేకవసనం వీరమ్ ఉన్మత్తమివ విహ్వలమ్ ॥ 58
ఆశ్వాసయంతీ భర్తారమ్ అహమప్యగమం వనమ్ ।
సకదాచిద్ వనే వీరః కస్మింశ్చిత్ కారణాంతరే ॥ 59
ఆ జూదంలో నాభర్త ఓడిపోయాడు. కట్టుబట్టలతో వనవాసానికి ఒంటరిగా వెళ్లాడు. ఆ స్థితిలో మనస్సు చెడి ఉన్మాదివలెనున్న నాభర్తను ఊరడిస్తూ నేను కూడ అరణ్యానికి వచ్చాను. వీరుడైన నాభర్త ఒకనాడు ఏ కారణం వల్లనో వనమందు (58,59)
క్షుత్పరీతస్తు విమనాః తదప్యేకం వ్యసర్జయత్ ।
తమేకవసనా నగ్నమ్ ఉన్మత్తవదచేతసమ్ ॥ 60
అనువ్రజంతీ బహులా న స్వపామి నిశాస్తదా ।
తతో బహుతిథే కాలే సుప్తాముత్సృజ్య మాం క్వచిత్ ॥ 61
వాససోఽర్ధం పరిచ్ఛిద్య త్యక్తవాన్ మామనాగసమ్ ।
తం మార్గమాణా భర్తారం దహ్యమానా దివానిశమ్ ॥ 62
ఆకలితో వికలమనస్కుడైన నాభర్త శరీరం మీది బట్టను కూడా వదిలేశాడు. దిగంబరుడైన ఆ ఉన్మాదిని అనుసరించివెళ్తూ అనేకరాత్రులు నిద్రలేని దాననయ్యాను. ఆ విధంగా కొన్ని రోజులు గడచిన తర్వాత, నాచీరలో సగం చింపుకొని ఏ తప్పుచేయని నన్ను నిద్రిస్తోంటే వదిలేసి వెళ్ళాడు. ఆ విధంగా వెళ్ళిన భర్తను వెదుక్కుంటూ రాత్రింబవళ్ళు దుఃఖంతో దహించుకుపోతున్నాను. (60-62)
సాహం కమలగర్భాభమ్ అపశ్యంతీ హృది ప్రియమ్ ।
న విందామ్యమరప్రఖ్యం ప్రియం ప్రాణేశ్వరం ప్రభుమ్ ॥ 63
బ్రహ్మ వంటి నాప్రియుడు కనపడలేదు - అమరవంద్యుడైన నాప్రాణేశ్వరుని పొందలేకపోతున్నాను. (63)
తామశ్రుపరిపూర్ణాక్షీం విలపంతీం తథా బహు 7.
రాజమాతాబ్రవీదార్తా భైమీమార్తస్వరాం స్వయమ్ ॥ 64
వసస్వ మయి కల్యాణి ప్రీతిర్మే పరమా త్వయి ।
మృగయిష్యంతి తే భద్రే భర్తారం పురుషా మమ ॥ 65
నీరు నిండిన కనులతో విలపిస్తున్న దమయంతిని చూసి, రాజమాత జాలితో ఈవిధంగా అంది.
కళ్యాణీ! నీవిక్కడే ఉండు. నీవంటే నాకు ఎంతో ప్రీతి కలిగింది. నా మనుష్యులు నీభర్తను వెదుకుతారు. (64,65)
అపి వా స్వయమాగచ్ఛేత్ పరిధావన్నితస్తతః ।
ఇహైవ వసతీ భద్రే భర్తారముపలప్స్యసే ॥ 66
లేదా అతడే అటూ ఇటూ తిరుగుతూ, ఇచ్చటకు రావచ్చు. ఇక్కడనే ఉండి నీభర్తను నీవు పొందవచ్చు. (66)
రాజమాతుర్వచః శ్రుత్వా దమయంతీ వచోఽబ్రవీత్ ।
సమయేనోత్సహే వస్తుం త్వయి వీరప్రజాయిని ॥ 67
రాజమాత పల్కులను విన్న దమయంతి ఇలా అన్నది. 'వీరమాతా! ఒక ఒప్పందంతో నేను మీదగ్గర ఉంటాను. (67)
ఉచ్ఛిష్టం నైవ భుంజీయాం న కుర్యాం పాదధావనమ్ ।
న చాహం పురుషానన్యాన్ ప్రభాషేయం కథంచన ॥ 68
ఎంగిలి తినను. ఎవరికీ పాదసేవ చేయను. ఇతరపురుషులతో ఎన్నడూ మాట్లాడను. (68)
ప్రార్థయేద్ యది మాం కశ్చిద్ దండ్యస్తే స పుమాన్ భవేత్ ।
వధ్యశ్చ తేఽసకృన్మంద ఇతి మే వ్రతమాహితమ్ ॥ 69
ఏ పురుషుడైనా నన్ను కోరినట్లయితే వానిని మీరు కఠినంగా శిక్షించాలి. కొన్ని సంధర్భాల్లో అతడు వధ్యుడు కూడ కావాలి. ఇది నా వ్రతం. (69)
భర్తురణ్వేషణార్థం తు పశ్యేయం బ్రాహ్మణానహమ్ ।
యద్యేవమిహ వత్స్యామి త్వత్సకాశే న సంశయః ॥ 70
నాభర్తను వెదకడానికై బ్రాహ్మణులను నియమించాలి. ఇవి మీకు ఇష్టమైతే నేను మీ దగ్గర ఉండడానికి సందేహం లేదు. (70)
అతోఽన్యథా న మే వాసః వర్తతే హృదయే క్వచిత్ ।
తాం ప్రహృష్టేన మనసా రాజమాతేదమబ్రవీత్ ॥ 71
మరొకవిధంగా ఐతే నేనిచట ఉండను, వెంటనే రాజమాత ఎంతగానో సంతోషించి ఇలా పల్కింది. (71)
సర్వమేతత్ కరిష్యామి దిష్ట్యా తే వ్రతమీదృశమ్ ।
ఏవముక్త్వా తతో భైమీం రాజమాతా విశాంపతే ॥ 72
ఉవాచేదం దుహితరం సునందాం నామ భారత ।
సైరంధ్రీమభిజానీష్వ సునందే దేవరూపిణీమ్ ॥ 73
నీ వ్రతనియమాల ననుసరించి నీవు కోరినట్లుగా అన్నీ చేస్తాను' ఆ తర్వాత రాజమాత తన కుమార్తె సునందతో ఇలా అన్నది - సునందా! ఈమె సైరంధ్రి. దేవరూపిణి. (72,73)
వయసా తుల్యతాం ప్రాప్తా సఖీ తవ భవిత్వియమ్ ।
ఏతయా సహ మోదస్వ నిరుద్విగ్నమనాః సదా ॥ 74
ఈమె నీకు సమాన వయస్కురాలగు సఖి అవుతోంది. ఈమెతో కలసి నీవు ప్రశాంతచిత్తవై సంతోషంగా ఉండు. (74)
తతః పరమసంహృష్టా సునందా గృహమాగమత్ ।
దమయంతీముపాదాయ సఖీభిః పరివారితా ॥ 75
అప్పుడు సునంద తన సఖీసమేతంగా దమయంతిని తీసికొని పరమానందంతో తనగృహానికి వచ్చింది. (75)
సా తత్ర పూజ్యమానా వై దమయంతీ వ్యనందత ।
సర్వకామైః సువిహితైః నిరుద్వేగావసత్ తదా ॥ 76
దమయంతి సునందగృహంలో గౌరవభావంతో మెలగుతోంది. కోరినవన్నీ లభిస్తుంటే ప్రశాంతంగా కాలం గడుపుతోంది. (76)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి దమయంతీ చేదిరాజగృహవాసే పంచషష్టితమోఽధ్యాయః ॥ 65 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున దమయంతీ చేదిరాజగృహవాసమను అరువది యైదవ అధ్యాయము. (65)