63. అరువది మూడవ అధ్యాయము

దమయంతి పాతివ్రత్యప్రభావముతో వ్యాధుడు మరణించుట.

బృహదశ్వ ఉవాచ
అపక్రాంతే నలే రాజన్ దమయంతీ గతక్లమా ।
అబుధ్యత వరారోహా సంత్రస్తా విజనే వనే ॥ 1
అపశ్యమానా భర్తారం శోకదుఃఖసమన్వితా ।
ప్రాక్రోశదుచ్చైః సంత్రస్తా మహారాజేతి నైషధమ్ ॥ 2
బృహదశ్వుడిలా అన్నాడు -
నలుడు వెళ్ళిన తర్వాత బడలికతీరిన దమయంతి మేల్కొంది. జనరహితమైన అరణ్యంలో భర్త కనబడలేదు. భయపడింది. ఏడ్చింది. మహారాజా! అని పెద్దగా అరచింది. (1,2)
హా నాథ హా మహారాజ హా స్వామిన్ కిం జహాసి మామ్ ।
హా హతాస్మి వినష్టాస్మి భీతాస్మి విఅజనే వనే ॥ 3
హా! నాథా! హా! మహారాజా! హా స్వామీ! నన్ను విడిచివెళ్ళావా? చచ్చాను. అన్నీ పోయినట్లే. ఈ నిర్జనవనంలో ఎంతో భయం వేస్తోంది. (3)
నను నామ మహారాజ ధర్మజ్ఞః సత్యవాగసి ।
కథముక్త్వా తథా సత్యం సుప్తాముత్సృజ్య కాననే ॥ 4
నన్ను విడువ నని పలికావు. నిద్రించే నన్ను విడిచి వెళ్ళావు. ధర్మజ్ఞుడవు, సత్యవచనుడవు - ఎలా వెళ్లావు? (4)
కథముత్సృజ్య గంతాసి దక్షాం భార్యామనువ్రతామ్ ।
విశేషతోఽనపకృతే పరేణాపకృతే సతి ॥ 5
దక్షురాలై నిన్ను అనుసరించే భార్యను వదలి ఎలా వెళ్లగలిగావు? పైగా ఏ అపకారమూ చేయని నీభార్యకు పరులు అపకారం చేసే సమయంలో వెళ్ళిపోయావు. (5)
శక్యసే తా గిరః సమ్యక్ కర్తుం మయి నరేశ్వర ।
యాస్తేషాం లోకపాలానాం సన్నిధౌ కథితాః పురా ॥ 6
ఇంద్రాగ్ని యమవరుణులనే లోకపాలుర యెదుట నా విషయంలో నీవు పూర్వం చెప్పినమాటలను ఇప్పుడు ఆచరణలో పెట్టగలవా? (6)
వి॥ లోకపాలుర ఎదుట నలుడు "నాప్రాణాలు ఉన్నంతవరకు నామనసు నీయందే నీలుస్తుంది. ఇది సత్యం" అని ప్రతిజ్ఞ చేశాడు. (చూ॥ 57 అధ్యా-32 శ్లో)
నాకాలే విహితో మృత్యుః మర్త్యానాం పురుషర్షభ ।
తత్ర కాంతా త్వయోత్సృష్టా ముహూర్తమపి జీవతి ॥ 7
పురుషశ్రేష్ఠా! మానవులకు అకాలంలో మృత్యువు రాదు. అటువంటప్పుడు నీచే విడిచిపెట్టబడిన నీభార్య క్షణకాలమైనా జీవిస్తుందా? (7)
పర్యాప్తః పరిహాసోఽయమ్ ఏతావాన్ పురుషర్షభ ।
భీతాహమతిదుర్ధర్ష దర్శయాత్మానమీశ్వర ॥ 8
పురుషశ్రేష్ఠా! ఇంతవరకు చేసిన పరిహాసం చాలు! నేను చాలా భయపడుతున్నా! దర్శనభాగ్యాన్ని కల్గించు. (8)
దృశ్యసే దృశ్యసే రాజన్ ఎష దృష్టోఽసి నైషధ ।
ఆవార్య గుల్మైరాత్మానం కిం మాం న ప్రతిభాషసే ॥ 9
చూస్తున్నావు! చూస్తున్నావు! మహారాజా! ఇదిగో కనిపించావు. పొదలలో బాగా కప్పుకొని నాతో ఎందుకు మాట్లాడటం లేదు. (9)
నృశంసం బత రాజేంద్ర యన్మామేవం గతామిహ ।
విలపంతీం సమాగమ్య నాశ్వాసయసి పార్థివ ॥ 10
మహారాజా! అరణ్యంలో విలపిస్తూ ఈ స్థితిలోనున్న నన్ను కలసి ఎందుకు ఓదార్చవు! క్రూరుడవా? (10)
న శోచామ్యహమాత్మానం న చాన్యదపి కించన ।
కథం ను భావితాస్యేక ఇతి త్వాం నృప శోచిమి ॥ 11
నా గురించి నేనేమీ దుఃఖించటం లేదు. ఒక్కరూ మీరేవిధంగా ఉండగలరో అని మీగురించే విచారిస్తున్నాను. (11)
కథం ను రాజంస్తృషితః క్షుధితః శ్రమకర్షితః ।
సాయాహ్నే వృక్షమూలేషు మామపశ్యన్ భవిష్యసి ॥ 12
మహారాజా! ఆకలిదప్పికలతో, శ్రమతో అలసిన మీరు సాయం సమయాన చెట్లక్రింద నన్ను కానక ఎలా ఉంటారో కదా! (12)
తతః సా తీవ్రశోకార్తా ప్రదీప్తేవ చ మన్యునా ।
ఇతశ్చేతశ్చ రుదతీ పర్యధావత దుఃఖితా ॥ 13
పిమ్మట దమయంతి ఎంతగానో విచారించింది. కోపంతో హృదయాగ్ని రగిలింది. అటూ ఇటూ పరుగులిడుతూ ఏడ్చింది. (13)
ముహూరుత్పతతే బాలా ముహుః పతతి విహ్వలా ।
ముహురాలీయతే భీతా ముహుః క్రోశతి రోదితి ॥ 14
క్షణకాలం పైకి ఎగురుతోంది. మరుక్షణంలో క్రింద పడుతోంది. ఇంకో క్షణమ్లో భయపడుతోంది. ముడుచుకుపోతోంది. భయంతో వెక్కివెక్కి ఏడుస్తోంది. (14)
అతీవ శోకసంతప్తా ముహుర్నిఃశ్వస్య విహ్వలా ।
ఉవాచ భైమీ నిఃశ్వస్య రుదత్యథ పతివ్రతా ॥ 15
దమయంతి శోకసంతాపాలతో మాటిమాటికీ నిట్టూరుస్తూ ఏడ్చింది. కొంతసేపటికి పతివ్రతయైన దమయంతి ఓ నిట్టూర్పు విడిచి ఇలా అన్నది. (15)
యస్యాభిశాపాద్ దుఃఖార్తః దుఃఖం విందతి నైషధః ।
తస్య భూతస్య నో దుఃఖాద్ దుఃఖమప్యధికం భవేత్ ॥ 16
ఎవడు వేసిన నిష్కారణనింద వల్ల నలుడీవిధంగా దుఃఖార్తుడై బాధ ననుభవిస్తున్నాడో ఆతనికి మేం అనుభవించే దుఃఖం కంటే అధికదుఃఖం కలుగుగాక! (16)
అపాపచేతసం పాపః య ఏవం కృతవాన్ నలమ్ ।
తస్మాద్ దుఃఖతరం ప్రాప్య జీవత్వసుఖజీవికామ్ ॥ 17
ఏపాపం ఎరుగని నలునివిషయంలో ఇట్టి పాపకర్మ నాచరించినవాడు ఇంతకంటె అధికదుఃఖాన్ని పొంది కష్టాలతో జీవించుగాక! (17)
ఏవం తు విలపంతీ సా రాజ్ఞో భార్యా మహాత్మనః ।
అన్వేషమాణా భర్తారం వనే శ్వాపదసేవితే ॥ 18
ఉన్మత్తవద్ భీమసుతా విలపంతీ ఇతస్తతః ।
హా హా రాజన్నితి ముహుః ఇతశ్చేతశ్చ ధావతి ॥ 19
ఇలా దమయంతి విలపిస్తూ క్రూరమృగాలతో నిండిన అరణ్యంలో తన భర్తను వెదకుతూ పిచ్చిదానివలె ఏడుస్తూ అటు ఇటూ తిరుగుతోంది. హా మహారాజా! అని అంటూనే మాటిమాటికి అటూ ఇటూ పరుగులు తీస్తోంది. (18,19)
తాం క్రందమానామత్యర్థం కురరీమివ వాశతీమ్ ।
కరుణం బహు శోచంతీం విలపంతీం ముహుర్ముహుః ॥ 20
సహసాభ్యాగతాం బైమీమ్ అభ్యాశపరివర్తినీమ్ ।
జగ్రాహాజగరో గ్రాహః మహాకాయః క్షుధాన్వితః ॥ 21
దారితప్పిన ఆడమేకవలె దమయంతి ఆక్రందన చేస్తూ మాటిమాటికి విచారిస్తోంది.
అదే సమయంలో ఆకలితోనున్న ఒకకొండచిలువ అతిశీఘ్రంగా సమీపానికి చేరి త్వరగా దమయంతిని పట్టుకొంది. (20,21)
సా గ్రస్యమానా గ్రాహేణ శోకేన చ పరిప్లుతా ।
నాత్మానం శోచతి తథా యథా శోచతి నైషధమ్ ॥ 22
కొండచిలువ తన్నుపట్టినా శోకం పొంగిపొరలి వస్తున్నా నలుని గురించి దుఃఖిస్తున్న దమయంతి తన్ను గూర్చి దుఃఖించటం లేదు. (22)
హా నాథ మామిహ వనే గ్రస్యమానామనాథవత్ ।
గ్రాహేణానేన విజనే కిమర్థం నానుధావసి ॥ 23
నాథా! నిర్జనారణ్యంలో అనాథగానున్న నన్ను ఒకపెద్దపాము పట్టుకొని తినబోతోంది. ఈ దుఃస్థితిలో కూడ నీవు నా దగ్గరకు పరుగెత్తి రావు ఎందువల్ల? (23)
నాథా! భవిష్యసి పునః మామనుస్మృత్య నైషధ ।
కథం భవాన్ జగామాద్య మాముత్సృజ్య వనే ప్రభో ॥ 24
మహారాజా! నన్నీ నిర్జనారణ్యంలో విడచి వెళ్ళిన నీవు మళ్ళీ నన్ను గుర్తు తెచ్చుకొని ఎలా ఇక్కడకు వస్తావు?
పాపాన్ముక్తః పునర్లబ్ధ్వా బుద్ధిం చేతో ధనాని చ ।
శ్రాంతస్య తు క్షుధార్తస్య పరిగ్లానస్య నైషధ ।
కః శ్రమం రాజశార్దూల నాశయిష్యతి తేఽనఘ ॥ 25
రాజా! నీవు పాపరహితుడవు. పాపాల నుండి విముక్తుడవై పూర్వపుబుద్ధిని, అంతఃకరణను, ధనాన్ని తిరిగిపొంది, ఆకలిబాధతో అలసిపోయి బడలియున్న నిన్ను ఆదుకొని నీ శ్రమను ఎవరు పోగొట్టగలరో కదా! (25)
తతః కశ్చిన్మృగవ్యాధః విచరన్ గహనే వనే ।
ఆక్రందమానాం సంశ్రుత్య జవేనాభిససార హ ॥ 26
దమయంతి ఇలా అలోచిస్తూనే ఆ అరణ్యంలో పెద్దగా అరచింది. అది విన్న బోయవాడొకడు వెంటనే అచ్చటకు చేరాడు. (26)
తాం తు దృష్ట్వా తథా గ్రస్తామ్ ఉరగేణాయతేక్షణామ్ ।
త్వరమాణో మృగవ్యాధః సమభిక్రమ్య వేగతః ॥ 27
ముఖతః పాటయామాస శస్త్రేణ నిశితేన చ ।
నిర్విచేష్టం భుజంగం తం విశస్య మృగజీవనః ॥ 28
మోక్షయిత్వా స తాం వ్యాధః ప్రక్షాల్య సలిలేన హ ।
సమాశ్వాస్య కృతాహారామ్ అథ పప్రచ్ఛ భారత ॥ 29
కొండచిలువచే పట్టుబడిన దమయంతిని చూచాడు. వెంటనే ఆ వ్యాధుడు తన దగ్గరున్న పదునైన కత్తితో ఆ సర్పాన్ని ముఖం నుండి క్రింద వరకు చీల్చి పారేశాడు. సర్పం చేష్టలుడిగి చనిపోయింది. అపుడు ఆ వనచరుడు సర్పముఖం నుండి దమయంతిని వెలికితీసి, నీటితో కడిగి, ఆమెను ఊరడించి, ఆహారం పెట్టాడు. పిమ్మట వనచరుడిలా ప్రశ్నించాడు. (27-29)
కస్య త్వం మృగశావాక్షి కథం చాభ్యాగతా వనమ్ ।
కథం చేదం మహత్ కృచ్ర్ఛం ప్రాప్తవత్యసి భావిని ॥ 30
హరిణనయనా! నీవెవరవు? అడవికెందుకు వచ్చావు? ఇట్టికష్టాలపాలవటానికి కారణం ఏమిటి? (30)
దమయంతీ తథా తేన పృచ్ఛ్యమానా విశాంపతే ।
స్వమేతద్ యథావృత్తమ్ ఆచచక్షేఽస్య భారత ॥ 31
భారతా! వనచరుడిలా ప్రశ్నించిన వెంటనే ఆ దమయంతి జరిగినది జరిగినట్లు చెప్పింది. (31)
తామర్ధవస్త్రసంవీతాం పీనశ్రోణిపయోధరామ్ ।
సుకుమారానవద్యాంగీం పూర్ణచంద్రనిభాననామ్ ॥ 32
అరాలపక్ష్మనయనాం తథా మధురభాషిణీమ్ ।
లక్షయిత్వా మృగవ్యాధః కామస్య వశమీయివాన్ ॥ 33
దమయంతి సగం చీర చుట్టుకొంది. బలసిన పిరుదులు, స్తనాలు - తీర్చిదిద్దిన కనుబొమలు - వంపులు తిరిగిన కనురెప్పలతో కూడిన నేత్రాలు - పున్నమి చంద్రుని వంటి ముఖం - మధురంగా మాట్లాడుతోంది. ఇవి అన్నీ చూసి వ్యాధుడు కామపరవశుడయ్యాడు. (32,33)
తామేవం శ్లక్ష్ణయా వాచా లుబ్ధకో మృదుపూర్వయా ।
సాంత్వయామాస కామార్తః తదబుధ్యత భావినీ ॥ 34
మృదువైన మంచిమాటలతో ఆమెను ఓదార్పుస్తున్నాడు వ్యాధుడు. వెంటనే దమయంతి అతడు కామపరవశుడైనట్లు గ్రహించింది. (34)
దమయంత్యపి తం దుష్టమ్ ఉపలభ్య పతివ్రతా ।
తీవ్రరోషసమావిష్టా ప్రజజ్వాలేవ మన్యునా ॥ 35
సాధ్వియైన దమయంతి కోపంతో మండిపోతున్న అగ్నిజ్వాల వలె వనచరుని సమీపించింది. (35)
స తు పాపమతిః క్షుద్రః ప్రధర్షయితుమాతురః ।
దుర్ధర్షాం తర్కయామాస దీప్తామగ్నిశిఖామివ ॥ 36
చెడ్డ ఆలోచనలు గల ఆ వనచరుడు ఆమెను బలాత్కరించాలనే తలంపులో ఉన్నప్పటికిని ఆమెను ప్రజ్వలించే అగ్నిజ్వాలగా భావించాడు. (36)
దమయంతీ తు దుఃఖార్తా పతిరాజ్యవినాకృతా ।
అతీతవాక్పథే కాలే శశాపైనం రుషాన్వితా ॥ 37
రాజ్యమూ, మగడూ కూడా లేని దమయంతి దుఃఖంతో నిండి మాటలతో వీనిని నివారింపలేమని భావించి; కోపంతో ఆ వ్యాధుని శపించింది. (37)
యద్యహం నైషధాదన్యం మనసాపి న చింతయే ।
తథాయం పతతాం క్షుద్రః పరాసుర్మృగజీవనః ॥ 38
న్ను నిషధరాజైన నలుని తప్ప మరొకరిని మనసులో సైతం భావించనట్లయితే నీచుడైన ఈ వనచరుడు మరణించుగాక! (38)
ఉక్తమాత్రే తు వచనే తథా స మృగజీవనః ।
వ్యసుః పపాత మేదిన్యామ్ అగ్నిదగ్ధ ఇవ ద్రుమః ॥ 39
దమయంతి అలా పల్కిన వెంటనే ఆ వనచరుడు అగ్నిచే బూడిదైన చెట్టులా నేలపై కూలి మరణించాడు. (39)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి అజగరగ్రస్తదమయంతీమోచనే త్రిషష్టితమోఽధ్యాయః ॥ 63 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున అజగరగ్రస్తదమయంతీమోచనమను అరువది మూడవ అధ్యాయము. (63)