53. ఏబది మూడవ అధ్యాయము
హంస సందేశము.
బృహదశ్వ ఉవాచ
ఆసీద్ రాజా నలో నామ వీరసేనసుతో బలీ ।
ఉపపన్నో గుణైరిష్టైః రూపవానశ్వకోవిదః ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు.
పూర్వం వీరసేనమహారాజ పుత్రుడైన నలమహారాజు ఉండేవాడు. అతడు సర్వసద్గుణ సంపన్నుడు. బలవంతుడు. మంచి అందగాడు. అంతేకాదు, అశ్వశాస్త్రకోవిదుడు కూడ. (1)
అతిష్ఠన్మనుజేంద్రాణాం మూర్ధ్ని దేవపతిర్యథా ।
ఉపర్యుపరి సర్వేషామ్ ఆదిత్య ఇవ తేజసా ॥ 2
బ్రహ్మణ్యో వేదవిచ్ఛూరః నిషధేషు మహీపతిః ।
అక్షప్రియః సత్యవాదీ మహానక్షౌహిణీపతిః ॥ 3
నిషధబూపాలుడైన నలమహారాజు అక్షౌహిణి సేన కలిగి ఆనాటి మహారాజులలో మహేంద్రునివలెను, సూర్యభగవానుని వలె తేజస్విగను, వేదవిదుడైన బ్రహ్మణ్యమూర్తిగను ఉండేవాడు. నలుడు పాచికలాటలో ప్రీతికలవాడు, సత్యవాది. (2,3)
ఈప్సితో వరనారీణామ్ ఉదారః సంయతేంద్రియః ।
రక్షితా ధన్వినాం శ్రేష్ఠః సాక్షాదివ మనుః స్వయమ్ ॥ 4
సుందర స్త్రీల మనస్సులను కరగించి మైమరపించే రూపం గలవాడు. నలుడు ఉదారుడు. ఇంద్రియాలను జయించినవాడు. ధనుర్దారులలో శ్రేష్ఠుడు. సాక్షాత్తు మనువువలె లోకరక్షకుడైన వాడే నలుడు. (4)
తథైవాసీద్ విదర్భేషు భీమో భీమపరాక్రమః ।
శూరః సర్వగుణైర్యుక్తః ప్రజాకామః స చాప్రజః ॥ 5
అదేకాలంలో విదర్భదేశాన్ని భీమమహారాజు పరిపాలీంచేవాడు. అతడు పరాక్రమశాలి, సర్వసద్గుణసంపన్నుడు. సంతానం కావాలచే కోరిక కలవాడు. అయినా వానికి సంతానం కలుగలేదు. (5)
స ప్రజార్థే పరం యత్నమ్ అకరోత్ సుసమాహితః ।
తమభ్యగచ్ఛద్ బ్రహ్మర్షిః దమనో నామ భారత ॥ 6
భీమమహారాజు సంతానంకోసం అనేకవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తరుణంలో బ్రహ్మర్షియైన దమనుడు తానే స్వయంగా భీమరాజు భవనానికి విచ్చేశాడు. (6)
తం స భీమః ప్రజాకామః తోషయామాస ధర్మవిత్ ।
మహిష్యా సహ రాజేంద్ర సత్కారేణ సువర్చసమ్ ॥ 7
సంతానార్థియైన భీమమహారాజు మహారాణితో కలిసి బ్రహ్మతేజస్సుతో ప్రకాశించే దమనమహర్షిని పూజించి, సత్కారాలతో సంతోషపరచాడు. (7)
తస్మై ప్రసన్నో దమనః సభార్యాయ వరం దదౌ ।
కన్యారత్నం కుమారాంశ్చ త్రీనుదారాన్ మహాయశాః ॥ 8
చక్రవర్తి స్వాగత సత్కారాలకు సంతసించిన దమనమహర్షి, భీమమహారాజు పట్ల ప్రసన్నుడై, వారికి ఒక పుత్రికారత్నంతో పాటు, కీర్తి ప్రతిష్ఠలు సముపార్జించే ఉదారస్వభావులైన ముగ్గురుపుత్రులూ కలిగేటట్లు వరాన్ని ప్రసాదించాడు. (8)
దమయంతీం దమం దాంతం దమనం చ సువర్చసమ్ ।
ఉపపన్నాన్ గుణైః సర్వైః భీమాన్ భీమపరాక్రమాన్ ॥ 9
భీమమహారాజు దంపతులకు, దమనమహర్షి వరప్రభావంతో ఒక కూతురు, ముగ్గురు కుమారులు కలిగారు. పుత్రికకు దమయంతి అని, కొడుకులకు వరుసగా దముడు, దాంతుడు, దమనుడు అనీ పేర్లు పెట్టాడు. వారు భీమపరాక్రములు. (9)
దమయంతీ తు రూపేణ తేజసా యశసా శ్రియా ।
సౌభాగ్యేన చ లోకేషు యశః ప్రాప సుమధ్యమా ॥ 10
దమయంతి రూపతేజో యశస్సౌభాగ్య సంపదలతో తులతూగుతూ, లోకంలో కీర్తి పొందింది. (10)
అథ తాం వయసి ప్రాప్తే దాసీనాం సమలంకృతామ్ ।
శతం శతం సఖీనాం చ పర్యుపాసచ్ఛచీమివ ॥ 11
యుక్తవయస్సు రాగానే దమయంతి సర్వాలంకార శోబితయై వందమంది దాసదాసీజనం చేత వందమంది సఖీజనం చేత సేవలు చేయించుకొంటూ, శచీదేవి వలె శోభిస్తోంది. (11)
తత్ర స్మ రాజతే భైమీ సర్వాభరణభూషితా ।
సఖీమధ్యేఽనవద్యాంగీ విద్యుత్సౌదామనీ యథా ॥ 12
సర్వాభరణ భూషితయైన దమయంతి సఖులమధ్య మెరుపుతీగవలె శోభిస్తోంది. (12)
అతీవ రూపసంపన్నా శ్రీరివాయతలోచనా ।
న దేవేషు న యక్షేషు తాదృగ్ రూపవతీ క్వచిత్ ॥ 13
దమయంతి మహాలక్ష్మీవలె విశాలనేత్రాలతో అసాధారణ రూపసంపద కల్గి ఉంది. అంతటి రూపవతి దేవతలలోనుఉ, యక్షులలోను లేదనే చెప్పాలి. (13)
మానుషేష్వపి చాన్యేషు దృష్టపూర్వాథవా శ్రుతా ।
చిత్తప్రసాదనీ బాలా దేవానామపి సుందరీ ॥ 14
మానవకాంతలలో ఇంతటి సౌందర్యవతిని ఇతః పూర్వం చూడలేదు, కనీసం వినలేదు కూడ! ఈమె సౌందర్యసంపద దేవతల మనసులను కూడ సంతోషపరచేది. (14)
నలశ్చ నరశార్దూలః లోకేశ్హ్వప్రతిమో భువి ।
కందర్ప ఇవ రూపేణ మూర్తిమానభవత్ స్వయమ్ ॥ 15
మానవశ్రేష్ఠుడైన నలమహారాజు కూడా తన లోకోత్తర సౌందర్యంతో సాక్షాత్తు మదనుడే శరీరాన్ని ధరించి వచ్చినట్లు ఉన్నాడు. (15)
తస్యాః సమీపే తు నలం ప్రశశంసుః కుతూహలాత్ ।
వైషధస్య సమీపే తు దమయంతీం పునః పునః ॥ 16
దమయంతి చెంత సఖులు, కుతూహలంతో నలుని ప్రశంసించేవారు. అదేవిధంగా నలుని చెంత దమయంతి సౌందర్యాతిశయాన్ని పదేపదే ప్రశంసించేవారు. (16)
తయోరదృష్టః కామోఽభూత్ శృణ్వతోః సతతం గుణాన్ ।
అన్యోన్యం ప్రతి కౌంతేయ స వ్యవర్ధత హృచ్ఛయః ॥ 17
ఒకరి గుణాలను మరొకరు వినటం వలన, వారివారి మనస్సులలో ఒకరియందు మరొకరికి ప్రేమ అంకురించింది. పరస్పరం పుట్టిన ఆ ప్రేమ క్రమక్రమంగా వృద్ధి పొందింది. (17)
అశక్నువన్ నలః కామం తదా ధారయితుం హృదా ।
అంతఃపురసమీపస్థే వన ఆస్తే రహోగతః ॥ 18
నలమహారాజు తనమనస్సులో పుట్టిన కోరికను భరింపలేక, తన అంతఃపురానికి సమీపంలో ఉన్న ఉద్యానవనంలో కొంతసమయం గడపటానికై ఒక్కడూ వెళ్లాడు. (18)
స దదర్శ తతో హంసాన్ జాతరూపపరిష్కృతాన్ ।
వనే విచరతాం తేషామ్ ఏకం జగ్రాహ పక్షిణమ్ ॥ 19
ఆ సమయంలో తన ఉద్యానవనంలో సంచరిస్తున్న బంగారు హంసలను చూశాడు. ముచ్చటపడ్డాడు. వాటిలో ఒక హంసను పట్టుకొన్నాడు. (19)
తతోఽంతరిక్షగో వాచం వ్యాజహార నలం తదా ।
హంతవ్యోఽస్మి న తే రాజన్ కరిష్యామి తవ ప్రియమ్ ॥ 20
ఆ హంస నలమహారాజుతో "రాజా! నన్ను చంపకు. నేను నీకు ప్రియం చేస్తాను" అని పలికింది. (20)
దమయంతీసకాశే త్వం కథయిష్యామి నైషధ ।
యథా త్వదన్యం పురుషం న సా మంస్యతి కర్హిచిత్ ॥ 21
నిషధరాజా! దమయంతికి నీగురించి వివరిస్తాను. దమయంతి నిన్ను తప్ప మరొక పురుషుని ఎవ్వరినీ కోరన్ట్లు నిగురించి చక్కగా దమయంతికి చెపుతాను. (21)
ఏవముక్తస్తతో హంసమ్ ఉత్ససర్జ మహీపతిః ।
తే తు హంసాః సముత్పత్య విదర్భానగమంస్తతః ॥ 22
ఇలా చెప్పగానే నలమహారాజు హంసను విడిచివేశాడు. ఆ హంస, మిగిలిన హంసలూ ఆకాశమార్గాన పయనించి విదర్భదేశానికి వెళ్ళాయి. (22)
విదర్భనగరీం గత్వా దమయంత్యాస్తదాంతికే ।
నిపేతుస్తే గరుత్మంతః సా దదర్శ చ తాన్ ఖగాన్ ॥ 23
ఆ హంసలు విదర్భదేశం చేరి, దమయంతి సమీపంలో వాయాయి. దమయంతి ఆ హంసలను చూసింది. (23)
సా తానద్భుతరూపాన్ వై దృష్ట్వా సఖిగణావృతా ।
హృష్టా గ్రహీతుం ఖగమాన్ త్వరమాణోపచక్రమే ॥ 24
చెలికత్తెలతో కూడియున్న దమయంతి, అద్భుత రూపాలు గల ఆ హంసల్ని చూసింది. చాలా సంతోషించింది. వెంటనే పట్టుకోవటానికి ప్రయత్నించింది. (24)
అథ హంసా విససృపుః సర్వతః ప్రముదావనే ।
ఏకైకశస్తదా కన్యాః తాన్ హంసాన్ సముపాద్రవన్ ॥ 25
అపుడు, ఆ హంసలన్నీ ప్రమదావనంలో విడివిడిగా పారిపోవటం ప్రారంభించాయి. దాంతో దమయంతి చెలికత్తెలు ఒక్కొక్కరు ఒక్కొక్క హంసను పట్టుకొనటానికి పరుగులెత్తారు. (25)
దమయంతీ తు యం హంసం సముపాధావదంతికే ।
స మానుషీం గిరం కృత్వా దమయంతీమథాబ్రవీత్ ॥ 26
దమయంతి కూడ ఒకహంసను పట్టుకోవటానికి పరుగెత్తింది. అపుడు దమయంతి నుద్దేశిమ్చి ఆ హంస మనుష్యవాక్కులతో ఈవిధంగా పలికింది. (26)
దమయంతి నలో నామ నిషధేషు మహీపతిః ।
అశ్వినోః సదృశో రూపే న సమాస్తస్య మానుషాః ॥ 27
దమయంతీ! నిషధదేశాధిపతి పేరు నలుడు. ఆ నలచక్రవర్తి అశ్వనీదేవతల వంటి చక్కని రూపం కలవాడు. అంత రూపసంపద మానవులలో మరెవ్వరికీ లేదు. (27)
కందర్ప ఇవ రూపేణ మూర్తిమానభవత్ స్వయమ్ ।
తస్య వై యది భార్యా త్వం భవేథా వరవర్ణిని ॥ 28
సఫలం తే భవేజ్జన్మ రూపం చేదం సుమధ్యమే ।
వయం హి దేవగంధర్వ మనుష్యోరగరాక్షసాన్ ॥ 29
దృష్టవంతో న చాస్మాభిః దృష్టపూర్వస్తథావిధః ।
త్వం చాపి రత్నం నారీణాం నరేషు చ నలో వరః ॥ 30
విశిష్టయా విశిష్టేన సంగమో గుణవాన్ భవేత్ ।
సుందరీ! దమయంతీ! మన్మథుడే స్వయంగా నలుని రూపంలో అవతరించాడు. ఆ నలమహారాజునకు నీవు భార్యవైతే నీ జన్మ, నీరూపసంపద, సఫలం అయినట్లే.
మేము దేవతలను, గంధర్వులను, మానవులను, నాగజాతివారిని, రాక్షసులను కూడా చూశాము. కాని, నలుని అంత అందగాడు ఇంతవరకు మాకు కనిపించలేదు.
నీవు స్త్రీలలో రత్నమైతే, అతడు పురుషులలో శ్రేష్ఠుడు (వరుడు).
విశిష్టగుణసంపన్నుల కలయిక మహోన్నతగుణ భుయిష్ఠమవుతుంది. (28-30)
ఏవముక్తా తు హంసేన దమయంతీ విశాంపతే ॥ 31
అబ్రవీత్ తత్ర తం హంసం త్వమప్యేనం నలే వద ।
తథేత్యుక్త్వాండజః కన్యాం విదర్భస్య విశాంపతే ।
పునరాగమ్య నిషధాన్ నలే సర్వం న్యవేదయత్ ॥ 32
నలుని గురించి హంస చెపిన్నవన్నీ విన్న దమయంతి, నలునితో కూడ ఈ విధంగానే చెప్ప"మని కోరింది. అదేవిధంగా చేస్తానని పలికి, హంస, నిషధకు తిరిగివచ్చి, నలునకు దమయంతికి సంబంధించిన సర్వవిషయాలు నివేదించింది. (32)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి హంసదమయంతీసంవాదే త్రిపంచాశత్తమోఽధ్యాయః ॥ 53 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున హంసదమయంతీ సంవాదమను ఏబదిమూడవ అధ్యాయము. (53)